జల్లేపల్లి కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జల్లేపల్లి ఖిల్లా గజపతు సామంతరాజుపై శ్రీకృష్ణదేవరాయలు దండెత్తారు

జల్లేపల్లి ఎంతో చరిత్ర కలిగిన గ్రామం. ఇది ఖమ్మం పట్టణానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉంది. కాకతీయుల కాలంలో ఇక్కడ గుట్ట పై అద్భుత కట్టడాలు నిర్మించారు, దీనిని జల్లేపల్లి కోట అంటారు. కాకతీయులు నిర్మించిన దుర్గాలన్నీ శత్రుదుర్భేద్యంగా ఉండేవి. పట్టిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగివుండేది. మొదటి బేతరాజు సా.శ. 992న కాకతీయ రాజ్యమును స్థాపించెను. అది మొదలు సా.శ. 1322వ సంవత్సరము కాకతీయ రాజ్యం ఢిల్లి సుల్తానుల వశమయ్యే వరకు 330 సంవత్సరాలు పరిపాలన సాగింది. తదుపరి కాలంలో జల్లేపల్లి ఖిల్లా గజపతు సామంతరాజుపై శ్రీకృష్ణదేవరాయలు దండెత్తడం జరిగింది. అప్పటి గజపతుల సామంతరాజు చిత్తాప్ ఖాన్, షితాబ్‌ఖాన్‌ అనుబిరుదులు కల సీతాపతి రాజు ఆధీనంలో ఉన్న జల్లేపల్లి విజయనగర సామ్రాజ్యాదీసుని స్వాధీ నమైయింది. దీనిని గురించి దక్షిణ భారతదేశ చరిత్ర (1336-1765) తెలుగు అకాడమీ వారి ప్రచురణ) (2001ఎం.ఎ) లో ప్రస్తావన ఉంది. అలాగే ముక్కు తిమ్మనగా ప్రసిద్దులయిన నంది తిమ్మన పారిజాతాపహరణంలో ‘‘ఉదయాద్రి వేగ యాత్యుద్ధతి సాధించె వినుకొండ మాట మాత్రాన హరించె బెల్లముకొండయచ్చెల్ల జెఱచె దేవరకొండ యద్యృత్తి భంగము సేసె జల్లిపల్లి సమగ్ర శక్తిడులిచె గినుక మీరననంతగిరి క్రిందపడజేసె గంబంబు మెట్టు గ్రక్కున గదిల్చె"

శ్రీకృష్ణదేవరాయలు ఉదయాద్రి, వినుకొండ, కొండవీడు, బెల్లముకొండ, దేవరకొండ, జల్లేపల్లి, అనంతగిరి, కంబముమెట్టు, కటకము మొదలగునవి జయించాడు. 2010 శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక పంచశతాబ్ది ఉత్సవాలను ఖమ్మంజిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా నిర్వహించి జల్లేపల్లి గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

సా.శ. 1510 సంవత్సరము నాటి ప్రతాపరుద్ర గజపతి వెలిచెర్ల శాసనములో అతడు తెలంగాణా దుర్గములను గెల్చినట్లు తెలియజేసారు. ‘‘ సభాపతి దక్షిణ భూమినాలాన్ విజిత్యది శ్రాణన పారిజాతః అనన్య సాధారణ సాహస శ్రీర్జగ్రాహ పశ్చాత్యెలుంగాణ దుర్గాన్ః శ్రీకృష్ణ దేవరాయల తిరుపతి శాసనములో నతని దిగ్విజయములలో ‘‘ మరింన్ని కళింగ దేశ దిగ్విజర్థమై బెజవాడకు విచ్చేసి కొండపల్లి దుర్గంబు సాధించి ఆ దుర్గం మీదనున్న ప్రహారరాజు శిరశ్చంద్రమహా పాత్రుండు బోడజినమప పాత్రుండు .... మొదలయిన వారినించి జీవగ్రాహంగాను పట్టుకుని వారికి అభయదానం ఇచ్చి ‘అనంతగిరి, ఉండ్రగొండ, ఉర్లకొండ, అరువపల్లి, జల్లిపల్లి, కందికొండ, కప్పలువాయి, నల్లగొండ, కంభంమెట్టు, కనకగిరి, శంకరగిరి మొదలయిన తెలుంగాణ్య దుర్గాలు ఏకథాటిని కైకొని సింహాద్రి పొట్నూరికి విచ్చేసి... అని వుంటుంది అందులో వివరించిన తెలుంగాణ భూమినే తిలింగా, తెలింగ, తెలింగాణాయని వారి చరిత్రలలో రాసారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]