రాచర్ల కోట
రాచర్ల కోట | |
---|---|
రాచర్ల కోట | |
రకం | కోట |
ప్రదేశం | బొప్పాపురం, యల్లారెడ్డిపేట్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా |
సమీప నగరం | సిరిసిల్ల |
నిర్మించినది | 14వ శతాబ్దం |
రాచర్ల కోట తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, బొప్పాపురం గ్రామ సమీపంలో ఉన్న కోట. 70 ఎకరాల్లో విస్తరించిన ఈ కోట బొప్పాపురం, గొల్లపల్లి, తిమ్మాపూర్, గుండారం గ్రామాలకు పరగణగా ఉండేది.[1]
చరిత్ర
[మార్చు]40 ఊర్లతో ‘రాచర్ల పరగణా’గా పేరొందిన రాచర్ల కోట కాకతీయుల కాలంలో సామంత రాజ్యంగా ఉండేది. రెండో ప్రతాపరుద్రుడి సమకాలికుడని చెప్పబడుతున్న సింగమహారాజు అనే సామంతుడు ఈ రాచర్ల ప్రాంతాన్ని పాలించాడు. 14వ శతాబ్దంలో ఈ కోట నిర్మించబడింది.[2] కోటకు 3 కి.మీ. దూరంలోని సర్వాయిపల్లెలో నిర్మించిన బురుజు మీద సైన్యం ఉంటూ రాచర్ల కోటకు కాపలా కాసేవారు. రాచర్ల కోటపై దాడి చేసేందుకు గుంటూరు నుండి మాచర్ల రాజులు రావడంతో, ఆ విషయం తెలిసిన సింగమహారాజు కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెబుతుంటారు. అంతేకాకుండా ఒక యాదవ మహిళ పొరపాటున కోట రహస్యం చెప్పడం వల్ల గోల్కొండ నవాబు రాచర్ల కోటను కొల్లగొట్టాడని చరిత్రకారుల అభిప్రాయం.[1]
నిర్మాణం
[మార్చు]రాచర్ల కోటలో బురుజులు, నాలుగువైపులా ద్వారాలు, చుట్టూ అగడ్తలు (లోతైన కాలువలు) నిర్మించబడ్డాయి. మధ్యభాగంలో రాజుల భవనాలు, రాణుల మందిరాలు రాతిస్తంభాలు డంగు సున్నంతో నిర్మించబడ్డాయి. అక్కడక్కడ ఉన్న రాళ్ళ మీద పుష్పాలు, నృత్యకారిణుల బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. పడమర దారిని ‘ఏనుగుల దిడ్డి’ (రాజుగారి పట్టపుటేనుగు ఆ పక్కన ఉన్న జక్కుల చెరువుకు వెళ్ళి నీళ్ళు తాగేదారి) అని, దక్షిణం దారిని ‘గొల్లదాని దిడ్డి’ (ఒక యాదవ మహిళ కోటకు పాలు, పెరుగు తెచ్చేదారి) అని అంటారు. ఇప్పటికీ ఉత్తర ద్వారం గుర్తులున్నాయి కానీ, భూమిలో బాగా పూడుకుని పోయింది. కోటలోపల బావులు, హనుమాండ్ల విగ్రహాలు, జైనవిగ్రహాలు, రాతి గానుగలు, మండపాలు, నందులు, వినాయకుడు, ఏనుగు, నాగశిలలు, లింగాలు, స్తంభాలు, గుడులు, మసీదులు మొదలైనవి కూడా నిర్మించబడ్డాయి.[1]
దేవాలయం
[మార్చు]ఏనుగు దిడ్డిపై ఉన్న జక్కులమ్మ గుడిలో పురాతన శివలింగం ఉంది. బొప్పాపూర్‌కు చెందిన వైశ్యుల (అల్లాడి వారు) ఆడపడుచు జక్కులమ్మ కోమటిపల్లిలో నివాసం ఉండేది. ప్రతిరోజూ కోట వెనుకవైపునున్న చెరువు నుంచి నీళ్ళను తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేదట. అలా ఒకరోజు జక్కులమ్మ నీళ్ళు తెచ్చేందుకు చెరువులోకి వెళ్ళి అందులో మునిగి చనిపోయిందట. అప్పటినుండి ఆ శివుడి గుడిని, చెరువును జక్కులమ్మ పేరుతో పిలుస్తున్నారు. గ్రామంలో కొందరి ఇంటి పేరు కూడా జక్కులమ్మ అనే ఉంటుంది.[1]
ప్రస్తుత స్థితి
[మార్చు]కోట ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. కోటలోని భవనాలకు సంబంధించిన పునాదులు ఉన్నాయి. రాచర్ల కోటలోని కొన్ని రాతి కట్టడాలు, పురాతన విగ్రహాలు హైదరాబాదు మ్యూజియానికి తరలించబడ్డాయి. గతంలో జక్కులమ్మ చెరువు ప్రాంతంలో లభ్యమైన గణపతి విగ్రహాన్ని, కోటలోని దేవుడి విగ్రహాలను కోటలో ప్రతిష్టించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 telugu, NT News (2021-07-11). "రణ రంగస్థలం.. రాచర్ల కోట!". www.ntnews.com. Archived from the original on 2021-07-12. Retrieved 2023-07-12.
- ↑ Murali, Konda (2021-01-04). The Racharla Fort : Unveiling the history (in English) (1st ed.). Notion Press. p. 84. ISBN 978-1-63781-323-2. Archived from the original on 2023-07-12.
{{cite book}}
: CS1 maint: date and year (link) CS1 maint: unrecognized language (link) - ↑ dishadaily (2020-11-16). "నిర్లక్ష్యం నీడలో చారిత్రక కోట". www.dishadaily.com. Archived from the original on 2023-07-12. Retrieved 2023-07-12.