Jump to content

దిగవల్లి తిమ్మరాజు పంతులు

వికీపీడియా నుండి
(దిగవల్లి తిమ్మరాజు పంతులు గారు నుండి దారిమార్పు చెందింది)
దిగవల్లి తిమ్మరాజు పంతులు
జననం1794
కొయ్యూరు, ఆంధ్ర ప్రదేశ్
మరణం1856 ఫిబ్రవరి 7
ఇతర పేర్లుదిగవల్లి తిమ్మరాజు
మతంహిందూమతం
తండ్రిదిగవల్లి రామలింగం
తల్లిసీతమ్మ

దిగవల్లి తిమ్మరాజు [1794- 1856] 1811 నుండి ఈస్టు ఇండియా కంపెనీ ప్రభుత్వోద్యోగి.

పరిచయం

[మార్చు]

దిగవల్లి తిమ్మరాజు 1811 నుండి ఈస్టు ఇండియా కంపెనీ ప్రభుత్వోద్యోగి. బాధ్యతగల పెద్ద పదవి (హుజూర్ శిరస్తదారు) గా ఉద్యోగం చెసియుండినందున తిమ్మరాజుగారి వ్యక్తిగత జీవితం ఆనాటి కంపెనీ ప్రభుత్వపు పరి పరిపాలనా ఘట్టములో రాజమండ్రి- కాకినాడ-పిఠాపురం ప్రాంతాలతో మిళిత మైయున్నది. వారు కలెక్టరుకు వ్రాసిన లేఖలు, కలెక్టరు వీరికి చ్చిన కొన్ని ఆదేశాలు, వారి కాలంలోనే ధవళేశ్వరంలో గోదావరి ఆనకట్ట కట్టినప్పడు తిమ్మరాజు నిర్వహించిన అధికార బాధ్యతలు, వారికి విధించబడ్డ అనర్హమైన జుల్మానా, జిల్లా లోని ముఖ్యఅవినీతి కేసులో వారు నిర్వహించిన విచారణ రాజమండ్రి జిల్లాకలెక్టరు చే కాకినాడలో వీరికి ఇవ్వబడిన ఇంటి స్ధళం పట్టా వివిరాలు, వారు 1851 లో పిఠాపురం ఎస్టేటు కొర్టు ఆఫ్ వార్డ్సు (Court of Wards) మేనేజరుగా పనిచేయటం మొదలగు విశేషాలు గోదావరి జిల్లా మాన్యువల్ అను ప్రముఖ రికార్డులో రికార్డు చేయబడటమేగాక ఇతర ఆంగ్లేయ దొరలు వ్రాసిన ప్రచురుణలలో గూడా విపులముగా చెప్పబడియున్నవి.[1] కాని పిఠాపురం ఎస్టేటు రికార్డులు మద్రాసు ఆర్కైవ్సు లోనే వున్నట్టుగా గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి స్వతంత్రపోరాటములో జైలు శిక్షను గూర్చి పరిశోధన చేయు సందర్భములో ప్రముఖ చరిత్రకారుడు బండి గోపాల రెడ్డి (బంగోరే) 1973 -75 మధ్య మద్రాసు ఆర్కైవ్సు కెళ్లినప్పుడు తెలిసింది. తిమ్మరాజు 1828 లోకాకినాడలోకట్టించిన భీమేశ్వరాలయం లోని సిలాశాసనం ఈనాటికి కూడా యుండెను. వారు 1830 లో వారి తమ్ముడు రాజన్నగారితో వారసత్వపు ఆస్తిపాస్తుల పంపణీ వప్పందాల దస్తావేజు, తదుపరి వారి స్వార్జిత ఆస్తుల తప్సీళ్ళతోనూ, వంశవృక్షముతోసహా వారు 1856 లో వ్రాసిన మరణ శాసనం ( Last Will and Testament ) మరియూ వారి కుమారులిద్దరు వ్రాసిన కొన్ని వ్యక్తిగత డైరీలు, ఖర్చుల జాబితాలు,దస్తావేజులు కాలగర్భములో పోయినన్నిపోగామిగిలినవి కొన్ని కుటుంబ దస్తావేజులు వారి మనుమడు, ప్రముఖ చరిత్రకారుడైన దిగవల్లి వేంకట శివరావు (1898-1992) దాకా రావటం, వారు చరిత్రకారునిగా అభిరుచి కలిగి అహర్నిశలు సాహిత్యపిపాసతో గొప్ప కృషి చేసి వారి చరిత్రపరిశోధనతో పాటు వంశ వృత్తాంతము కూడా సేకరించి చరిత్రలోకెక్కించటం జరిగింది.[2] “life and times of Digavalli Timmarazu Pantulu garu” మరియూ “Godavari District” అను రెండు గ్రంథములు ఇంగ్లీషులోను “దిగవల్లి తిమ్మరాజు పంతులు” “శివరావుగారి దివాన్గిరి” అను పుస్తకములు తెలుగులో రచించి న గ్రంథములు అముద్రితము గానున్నాయి. ఈ పుస్తాకాలలో శివరావుగారి కృషి ఫలితంగా అన్నిటి కన్నా ముఖ్యంగా, తిమ్మరాజుగారి కాలంలో వాడిన క్లిష్టమైన ఉరుదూకలిసిన తెలుగు మాటలు [ archaic and quaint vernacular words ] వాటి అర్ధములు మరియూ ఆకాలంనాటి కంపెనీ ప్రభుత్వ యంత్రాంగము. న్యాయపాలన కంపెనీ వారి రాజ్యాంగ పరిపాలనా విధానము జిల్లాలవిభజన మొదలగు వృత్తాంతము ఉంది. చూడు Wikipedia Telugu దిగవల్లి వేంకట శివరావు (1898 -1992). Godavri Distric Manuals లోనూ మరి తదిర ఆంగ్లమూలాధారముల లోనూ తిమ్మరాజుగారి పేరు spelling ఇంగ్లీషులో ‘ Digavalli Timmarazu ’ అని ఉంది. ఎంతో సమాచారం ఉన్నఈ వ్యాసము శివరావుగారి అముద్రిత గ్రంథములనాధారముగా చేసుకును క్లుప్తముగా సంకలనము చేయ బడుచున్నది.

వంశ చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]

తిమ్మరాజు నూజివీడు తాలూకాలోని కొయ్యూరు గ్రామ వాస్తవ్యులు. గ్రామం పేరుతో ఇంటిపేరుండుటవలన తిమ్మరాజు గారి వంశస్దులు నేటి కృష్ణా జిల్లా నూజివీడుకు 6 మైళ్లు దూరంలోని విస్సన్నపేటనుండి కొండపర్వకు పోయే దారిలోనున్న దిగవల్లి గ్రామానికి చెందినవారని తెలుస్తున్నది. దిగవల్లి గ్రామం నూజివీడు తాలూకాలో కొయ్యూరుకు 4 మైళ్ళు దూరంలోనే ఉంది. 1856 లోతిమ్మరాజు వ్రాసిన వీలునామాకు జతచేసి న వంశవృక్షములో మూల పురషుడు యర్రన్న గారనీ, తరానికి ముఫ్ఫై సంవత్సరాలు చొప్పు న తీసుకుని 180 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తే యర్రన్న గొల్కోండ సూల్తానులు ఆంధ్రదేశమును పరిపాలించుచున్నకాలంనాటి ( 1616 A.D ) వారనీ దిగవల్లి వేంకట శివరావు వారి వంశచరిత్రలో వ్రాశారు. తిమ్మరాజు గారి జన్మ తేది తెలియలేదు. కానీ వారు పరమదించిన తేది 07/02/1856 అగుటయు ఆనాటికి వారికి 62 ఏండ్లుడుచ్చొని చేసిన అంచనా ప్రకారం తిమ్మరాజు 1794 లో జన్మించి యుండాలని ఉహ. తండ్రి రామలింగం , తల్లి సీతమ్మ . వీరి పితామహులు వెంకయ్య . వీరికి బొమ్ములూరు, రమణక్క పేట లలో భూములు వుండేవి. రమణక్క పేట జమీందారి గ్రామం. 1771 నుండి నూజివీడు జమీందారుగా నుండిన నరసింహ అప్పారావు గారి చరిత్రచాల చిత్రమైనది. 1785 లోకంపెనీ ప్రభుత్వము వారు అప్పారావుగారిని త్రోసిరాజన్నారు. 1793 నుండి సూజివీడు ఎస్టేటు కంపెనీ ప్రభుత్వం వారి కోర్టు ఆఫ్ వార్డ్సు మేనేజరు స్సాధీనంలో నుండినది . 1802 లో నూజివీడు ఎస్టేటును నిడదవోలు, నూజివీడుగా రెండు ఎస్టేట్లు విభజించారు. అప్పుడు రామచంద్ర అప్పారావు నూజివీడుకు జమీందారైనారు. తిమ్మరాజుగారి వంశము వారు పూర్వం గోల్కొండ సుల్తానుల కాలంనుండి కరణాలు. 13/01/1856 నాడు వ్రాసిన మరణశాసనము (విలునామా) లో తిమ్మరాజు , తమ వంశంవారికి లావజ్మల్ అను రుసుమును వసూలు చేసు కొనుటకు మిరాసీ అనే హక్కు వున్నదని వ్రాశారు. లావజమల్ అంటే గ్రామఉద్యోగుల జీతబత్తెములపై స్వల్ప రుసుము మిరాసీ అంటే వంశపారపర్య హక్కు. అటువంటి మిరాసీ హక్కు కలిగి చుట్టుపట్ల గ్రామ సముదాయముల పై ఈ హక్కు వుండిన కరణాలను సంప్రతీ కరణం అంటారు ( Hereditary Mirasi of Lavzmal) . తిమ్మరాజు గారి తండ్రి రామలింగం 1849 లోజీవించియున్నట్లుగాను తరువాత కొద్ది రోజులకు పరమదించినట్లుగా కుటుంబ దస్తావేజులవలన తెలిసిది. తిమ్మరాజు గారి అన్న వెంకయ్య , తమ్ములు: రాజన్న, అప్పన్న. చెల్లెళ్ళు: అచ్చమ్మ, రాజమ్మ.

బాల్యం,విద్యాభ్యాసం,ఉద్యోగం

[మార్చు]

తిమ్మరాజు అక్షరాభ్యాసం అయినతరువాత కొంతకాలం దాకా కొయ్యూరులోనే వీధి బడిలో చదువుకున్నారు. అప్పట్లో మచిలీపట్టణం రాజమండ్రీ జిల్లాలలో ఇంగ్లీషు కంపెనీ దొరతనము జరుగుతున్నది కానీ పార్శీ ఇంకా రాజ భాషగా నుండినది. తిమ్మరాజు చిన్నప్పటి నుండి మంచి తెలివితేటలు, నిశతమైన మేధాశక్తి గలవాడగుటచే ఇంగ్లీషు చదుకుంటే జీవనాధరం దొరుకనని గ్రహించారు. స్వగ్రామములో వానలు సక్రమంగా లేక మెరక భూముల పంటలు దెబ్బతిని వారి తండ్రి రామలింగంగారి ఆర్థిక స్థితి బాగాలేక అప్పులపాలౌతున్న పరిస్ధితులలో వారు బాల్యంలోనే ( 1807 లోనే) కొయ్యూరు వదలి ఏలూరు వెళ్లి అక్కడ ఒక సాహెబుగారి నాశ్ర యించి పార్శీ నేర్చుకున్నారు. ఇంకొకరినెవరినో ఆశ్రయించి ఇంగ్లీషు నేర్చుకున్నారు. అలాగ మూడు సంవత్సరాలు ఏలూరులో కష్టపడి చదువుకుని, ఇంగ్లీషు నేర్చుకుని ఉద్యోగనిమిత్తం 1810 లో రాజమహేంద్రవరం వెళ్లి అక్కడ వారి తల్లి గారి తరఫున బంధువులైన ముదిగొండ గురవైయ్య గారింట్లోవుండిరి . ముదిగొండగురవయ్య అప్పటికే జిల్లా కోర్టులో శిరిస్తమదద్గార్ గా పనిచేస్తున్నారు. ఆ గురవయ్య గారి తోపాటు తిమ్మరాజు కూడా కోర్టుకు వెళ్లి వారు చేసే పని కొద్ది కొద్దిగా నేర్చుకొనుచు వారు శలవపైనున్నప్పుడు అనుమతిపై వారి స్థానములో పనిచేయుచుండెను. కానీ దురదృష్టవశాత్తు ఇంతలో గురవయ్య పరమదించారు. ఆ పరిస్థితులలో వారి మీద దయతలచిన పురప్రముఖులైన కామరాజుగడ్డ లింగయ్య తిమ్మరాజు గారిని జిల్లా జడ్జిగారికి సిఫారసు చేశారు. అప్పటి జిల్లాకోర్టు జడ్జి పీటర్ రైడ్ కాజులట్[ Mr. Peter Reid Cazulet ] దొరగారి అనుగ్రహముతో 25/03/1811 సోమవారం,ప్రజోత్పత్తి సంవత్సరాది న తిమ్మరాజు రాజమండ్రీలో జిల్లా కోర్టులో రికార్డు కీపర్ మదద్ అను చిన్న ఉద్యోగంలో చేరారు. 1820 అక్టోబరు వరకూ ఆ కోర్టులో శిరస్తామదద్గారీ గానూ, శిరస్తాహెడ్ మదద్గారీ గానూ, యాక్టింగ్ సదర్ అమీన్ గా కూడా పనిచేశారు . తిమ్మారాజు తమ విలునామాలో తాను మొ త్తం 40 సంవత్సరాలు కంపెనీ సర్కార్ ప్రభుత్వోద్యోగము చేసినట్టుగా వ్రాసుకున్నారు. కాని వివరాలు వ్రాయలేదు. 1820 లో రాంజమండ్రీ-కాకినాడ- మొగలితుర్రు కలిపి కొత్తగా రాజమండ్రీ జిల్లా ఏర్పడింది. అప్పటిదాకా ఆ మూడు డివిజన్లకూ ముగ్గురు వేరు వేరు కలెక్టుర్లు మచిలీపట్టణం జిల్లా కలెక్టరు క్రింద ఉండేవారు. 1820 లో కొత్తగా రాజమండ్రీ జిల్లా ఏర్పడగానే న్యాయ శాఖలో కంటే రివెన్యూ శాఖలో వుంటే త్వరగా పైకి రావచ్చని ఊహించి తిమ్మరాజు పనిచేసే జిల్లా కోర్టు జడ్జి వైబర్టు (Mr. Vibart ) దొరగారి శిఫారసు చేయగా ఆ క్రొత్తగా ఏర్పడ్డ రాజమండ్రీ జిల్లా కలెక్టర్ జి. యమ్ సి రాబర్టసన్ దొర ( Mr. G.M.C. Robertson) 1820 లో తిమ్మరాజు గారికి హుజూర్ కచేరీలో ఇంగ్లీషు రికార్టు కీపర్ గా పని యిచ్చారు. ఆ రోజులలో ఇంగ్లీషు కలెక్టరుని హుజూరు అనేవారు. హుజూరు కచేరీ అంటే కలేక్టరు కార్యాలయం. ఈ హుజూర్ కచేరీ కాకినాడలోనే వుండేది. హుజూర్ శిరస్తదార్ అంటే కలెక్టరుకు క్రింద కలెక్టరు నిర్ణలయాలకు కోసిగ్నటరీ గానుండేపెద్ద హోదాగల నేటివ్ అధికారి. త్వరలోనే తిమ్మరాజు తన మేధాశక్తి, పరిశ్రమ నీతి నిజాయితీ లతో కలెక్టరు గారి ప్రసన్నతకి పాత్రుడైనారు. తిమ్మరాజు చిన్నప్పటి నుండి కుశాగ్ర బుధ్ధి కలిగియుండి తన జీవనాధారం మెరుగు చేసుకుని తన తమ్ములను కూడాపైకి తీసుకు వచ్చారు. జూన్ 1822 లో రాబర్టసన్ కాకినాడలో తమ పేరకట్టుతూయున్న పేట లో( రాబర్టసన్ పేట) 60 గజాల వెడల్పు 128 గజాల పొడవు గల ( 8640) చదరపు గజాల నివేశ స్తళమును తిమ్మరాజు గారికి చ్చారు. 8/10/1824 తేదీన రాజమండ్రీ జిల్లా కలెక్టరు రాబర్టసన్ ఆనివేశ స్తళానికి పట్టాను విడుదల చేశారు తిమ్మరాజు విశాలహృదయుడై ఆ పట్టాలో తన తమ్ముడైన రాజన్న ను కూడా జతగా చేర్చి వ్రాయించు కున్నారు. స్టాంపుపైన వ్రాసి న పట్టాను కలెక్టరు విడుదల చేసినట్లుగా గోదావరి జిల్లా మాన్యువల్ లో రికార్డు చేయబడింది. ఈ స్తళంలో తిమ్మరాజు కొన్ని రోజులతరువాత ఒక పెద్ద రెండు మండువాల భవంతి కొట్లు కట్టించారు. తిమ్మరాజు అప్పటి జిల్లా కలెక్టరు ఆంటేసే దొరగారితో (Mr. Anstey) చెప్పి తన తమ్ముడైన రాజన్నగారికి పేష్కర్ అను చిన్న ఉద్యోగము వేయించారు. పేష్కర్ పదవి అమల్గార్ పదని కంటే తక్కువది.

తిమ్మరాజు గారి ఉద్యోగ కాలంలోని జిల్లా పరిపాలనా యంత్రాంగము

[మార్చు]

కంపెనీ ప్రభుత్వము వారు1794 లో ఛీఫ్ ఇన్ కౌన్సిల్ అను పదవి ని, రెసిడెంటు అను పదవినీ రద్దు చేశారు అప్పటికింకా వేరు వేరు జిల్లాలు లనేవి లేవు. డివిజన్ అనే వారు. ఒక జిల్లా అనే పెద్ద భూగోళ పరిధిని డివిజన్లుగా విభజించి, వాటి పరిపాలనకు డివజనల్ కలెక్టర్లను నియమించారు. రాజమండ్రీ, కాకినాడ మొగలి తుర్రు డివిజనలు మచిలీపట్నం జిల్లా కలెక్టరు క్రిందనుండేవి. 1820 కు ముందు రివెన్యూ శాఖకు సంబంధించిన శాసనాలు గాని గతి విధానాలు గాని నిబంధనలుగానీ లేవు. 1802 లో మద్రాసు ఫోర్టు సైంటు జార్జిలో నుండిన గవర్నర్ ఇన్ కౌన్సిల్ 36 నిబంధనలు తయారు చేసి అమలు చేశారు ఇవి బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డు కారన్ వాలిస్ బెంగాలులో చేసిన నిబంధనల మోస్తరులో నున్నవి. ఆతరువార నుండి ఇంకా చాలా చాలా నిబంధనలు, శాసనాలు, చట్టాలు అమలు చేశారు. 1801 లో మద్రాసులో సుప్రీమ్ కోర్టు స్థాపించారు 1816 లో జిల్లామేజిస్ట్రేటు అధికారములను, జిల్లా పోలీసు అధికారుములను జిల్లా కలెక్టరుకి వారి సిబ్బందైన శిరస్తాదారు, తాసిల్దారు క్రిందకి తీసుకుచ్చారు. సర్ ధామస్ మన్రో 1820 లో గవర్నర్ నుండి చాల గొప్ప సంస్కరణలు ప్రవేశ పెట్టారు. 29/07/1822 న సర్ ధామస్ మన్రో ఓడలో మద్రాసు నుండి ఉత్తర సర్కారుల పరియటనకుచ్చారు 29/08/1822 న ఆయన రాజమండ్రీ కివచ్చారు. అదేసమయములో వచ్చిన గోదావరి వరదల వల్ల 1/9/1822 నుండి 12/09/1822 వరకూ ఆయన రాజమండ్రీలో వుండిపోల్సి వచ్చింది ఆ సమయంలో వారు పెద్దాపురం, పిఠాపురం రాజాలతో సమావేశాలకి అనుమతిఇచ్చారు. 1822 లో అమలు చేసిన నిబంధన ప్రకారం నేటివ్ అధికారుల అవినీతి కేసుల విచారణలకు కలెక్టర్లకు అధికారమివ్వబడింది. 10/7/1827 న పత్తి కొండలో మన్రో కలరా వ్యాధి సోకి మరణించారు.ఆకాలంనాటి రాజకీయ సాంఘిక భూగోళ స్థితి గతులు విపులంగా వ్రాశారు శివరావు . అప్పటి ఉత్తర సర్కారు అంటే కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నం జిల్లాలు కలిపిన భౌగోళిక పరిధి. ఉత్తర సర్కారుకు కమీషనర్ ముఖ్య కార్యకారిక అధికారి. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్ల పైన ఫిరియాదుకు ఆ ఉత్తర సర్కారు కమీషనర్ కు అర్జీ చేసుకునేవారు. ఇంగ్లీషు కంపేనీ పరిపాలనకు ముందు 1753 లో గోల్కోండ సుల్తానులు ఆ ఉత్తర సర్కారుని ఫ్రెంచి కంపెనీ ప్రభుత్వం వారికిచ్చారు, తరువాత 1766 లో ఇంగ్లీషు కంపెనీ పరిపాలనలోకి వచ్చింది. దేశం మొత్తంలోని ఇంగ్లీషు కంపెనీ ముఖ్య పరిపాలక అధికారిని Chief in Council అనే వారు ఉత్తరసర్కారు పైన ఫిర్యాదులు మద్రాసులో నుండే ఈ Chief in Council పరిధిలో నుండేవి. జిల్లాకి పరిపాలనా అధికారి కలెక్టరు. కారన్ వాలీసు గవర్నర్ జనరల్ గా వున్నప్పుడు కంపెనీ వారి చట్టాల ప్రకారం నేటివ్ అధికారికి ఏ విధమైన పెద్ద పదవులు ఇవ్వారాదని నిబంధనలు చేశారు . జిల్లాకలెక్టరు క్రింద జిల్లాలో నేటివ్ అధికార్లలో కల్లా వున్నతాధికారి హోదా హుజూర్ శిరస్తదార్ 1826-1827 లో హౌస్ బరీ, బెయర్డమ్,ఆస్ట్రే రాజమండ్రీ కలెక్టర్లు 1826 లో సర్ ధామస్ మన్రోర్ గారి నిర్దేశానుసారము కలెక్టరు Bayard కాకినాడ, రాజమండ్రీ, నరసపూరులో ఒకొక్క టి చొప్పున మూడు ఇంగ్లీషు పాఠశాలలను స్ధాపించారు ఆ బడులు 10 సంవత్సరాలు పనిచేశాయి. 1829 – 30: Mr. Crawley, District collector. 27/9/1829: విరోధి సం భాద్రపద సూర్యగ్రహణం.11/12/1829: C.P Brown Asst Judge and joint Criminal Judge, Rajahmundry. 1830: వికృతి సంవత్సరము. 1830: English made official language in the place of పార్సీ. 1830- 1835 లో క్రాలే దొర రాజమండ్రీ జిల్లా కలెక్టరుగా నుండిరి (Mr. Crawley) 1832 -33 సంవత్సరములలో పెద్ద కఱవు. దీనిని టెక్కలి,గుంటూరు కఱవు అని కూడా అనేవారు. ఉత్తర సర్కారునుండి చెన్నపట్నం పోయే రోడ్డుపైన తిండిలేక చచ్చిపడియున్న శవాలతో నిండిపోయింది. దీనిని గూర్చి గోదావరి జల్లా మాన్యువల్ లో గోదావరి జల్లా కఱవుల వివరాలున్నవి. కాకినాడ కలెక్టరు క్రాలె దొర పట్నంలోని యూరోపియన్ లను సంపన్నలైన దేశీయులును ప్రోత్సాహించి famine relief fund గా పోగుచేసి రోజుకు 5 వేలమందికి అన్నదానము చేయించినట్లు గోదావరి జిల్లా మాన్యువల్ లో నున్నది. C.P Brown ఈ కఱవులలో గుంటూరు కలెక్టరుగా పనిచేసి ప్రభుత్వకార్యదర్శికి దీనిని గూర్చి వ్రాశరు 1836 Principal Sadar Amin’s office established these became subordinate judges later.1836-37 Grant ; Collector. Mr.T.E.J Boileson 3rd judge in Provincial Council at Masulipatnam. 1837 హేవళంబి 1837 ఏప్రిల్ G.D.Smith Collector. 1837 July 24 Indian Postal Act XVII of 37. Postal facilities extended to public 1837 Lord Macauley’s Indian Penal Code draft was prepared 1837 July James Thomas District Judge established a Native Reading Room in Rajahmundry “వృత్తాంతి దిన పత్రిక ఇతర పత్రికలు పుస్తకములు వుండేవి. ఉదయం 6 గంటలకే ప్రజలు అక్కడకి వచ్చి యుండేవారు. రోజుకు నూరు మంది. A circulating Library was established Letters from Lady (Mrs Thomas) published in England see బ్రౌను జాబులు. 1838-39 తుపాను, ఉప్పెన, విశాఖ పట్నంనుండి నరసాపురం దాకా సముద్రం పొంగి కోరంగి కాకినాడ రేవులు మునిగినవి. జిల్లా రెవెన్యూరూ 1728112. 1839-40 జిల్లాలో ఆర్థిక దుస్థితి ప్రజలు బాధ పడ్డారు రెవెన్యూ 174408. 16*03-1839 శనివారం వికారి సంవత్సరాది

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ నిర్మాణం

[మార్చు]

తిమ్మరాజు 18/10/1828 సర్వధారి సంవత్సరం ఆశ్వయుజ శుధ్ధ శనివారం కాకినాడలో శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయం మండపము కట్టించారు.[2] 15/03/1831: ఖర నామ సం చైత్ర శు జయవారం. సంవత్సరాది. ఈ తేదీన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయములోని శిలాశాసనము వల్ల శ్రీ తిమ్మరాజు ముఖ్యాలయ జగజ్జన్యాయలయ శిలామండపగోపురప్రాకారము నిర్మించినట్లు తెలుస్తున్నది. 31-10-1831 ఖర సం ఆశ్వయుజ బ.. సోమవారం సిలివెల జమిందారు రాజా చెలికాని జాలయ్య రావు శ్రీ భీమేశ్వరస్వామివారికి సలివెండ్ర గ్రామంలో 8 యకరముల భూమికి దాన పట్టా వ్రాసియిచ్చారు. 2-4-1832 నందన సంవత్సరాది, సోమవారం. 22*10-1832 రాజా చెలికాని జానయ్యరావు. కాకినాడ శ్రీ భీమేశ్వరస్వామువారి ఆలయానకి దాన పట్టాగా నిచ్చిన భూమిలో 5 గొట్టములు ఆలంయమునకు స్వాధీనపరచ.నట్టుగా నున్నకొండపల్లి కాగితము శివరావుగారి నాన్నగారి కాగితములలో కనపడింది. గుడిలో ఇప్పటికీ దిగవల్లివారి పేరున అర్చనలు జరుగు తున్నట్లు ఆ గుడి అర్చకులు చెప్పారు. ఆ గుడిలోని శిలా శాసనంలో ఇలావున్నది: Quote “శ్రీమదఖిల జగజ్జేగియ్యమాన శ్రీ త్రిపురసుందరీ సమేతులైన కాకినాడలో వేంచేసి యున్నశ్రీ భీమేశ్వరస్వామి వార్కి శాలివాహన శతాభ్దము (తెలుగు అంకెలు x x x x) నేటి వర్తమాన వ్యావహారిక చాంద్రమాన సర్వదారీ నామ ఆశ్వయుజ (తెలుగు అంకెలు xx ) స్ధిరవారమున (1828 అక్టోబరు 18) కౌండిన్య గోత్రోద్భువుండైన దిగవల్లి వెంకయ్య యొక్క పౌత్రుండును రామలింగముయొక్క పుత్రుండును అయ్ని తిమ్మరాజు కట్టించి యిచ్చిన శిలామయ మండపము. శ్రీమదఖిల జగజ్జేగీయమాన శ్రీత్రిపురసుందరీ సమేతులై కాకినాడ వేంచేసియున్న శ్రీ భీమేశ్వరస్వామి వారికి శాలివాహనశకాబ్ధము x x x x అగు నేటి వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ఖరనామ సంవత్సర చైత్ర శుధ్ధ జయ వారము ( 1831 మార్చి 15 ) దిగవల్లి కులాంబుధిసుధాకరుడ నాగవమ్మయాఖ్య ధర్మపత్నిసమేత వెంకయామాత్య పౌతృండును సీతామాఖ్య ధర్మపత్నీసమేత రామలింగ పుతృండు సకలబుధ్ధి విధేయుండునగు తిమ్మరాజునామధేయుండు శ్రీమబ్యాశ్వత స్థితి యోగ్యశాలములు శ్రీ ముఖ్యాలయజగజన్యాలయ శ్రీ కళ్యాణ మండప శ్రీగోపుర ప్రాకారాదులు నిర్మాణము చేయించి సమర్పిచెను శ్రీ సాంబశివార్పణమస్తు” unquote NOTE: సిలా శాసనంలోనివి తెలుగు అంకెలు మొదట మండపం కట్టించి నది శాలివాహన శక క్యాలండరు ప్రకారం 18/10/1750 దీనిని ఇంగ్లీ షు క్యాలండరుకి మార్చాలంటే 78 ఏళ్లు కలపాలి . ఇంగ్లీషు క్యాలండరు ప్రకారం తేదీ= 18/10/1828 అలాగే రెండవసారి మండపగోపురం కట్టంచి న తేది ఇంగ్లీషు తేది= 15/03/1831 అప్పటినుండి కాకినాడలో ఆవీధిని గుళ్ల వీధి ( Temple Stree ) అని పేరు వచ్చింది.

తిమ్మరాజు పనిచేసిన పదవులు, వహించిన బాధ్యతలు

[మార్చు]

తిమ్మ రాజు తమ విలునామాలో తను సదర్ అమీన్ గా కూడా పనిచేసినట్లు వ్రాశారు. సదర్ అమీన్ అంటే చిన్న చిన్న తగాదాలను విచారించే నేటివ్ న్యాయమూర్తి (District Munsiff). 1827 లో అమలుకాబడ్డ నిబంధన ప్రకారం సదర్ అమీన్ కిచ్చిన న్యాయ విచారణ అధికారం కేవలం నేటివ్సుకు వర్తించేటట్టుగానుంది. ఆంగ్లేయుల కేసుల విచారించే అధికారం లేదు. జిల్లా కొర్టునుంచి రివెన్యూ శాఖలోకి కలెక్టరు క్రంద పనిలోకి వచ్చినతరువాత హుజూర్ శిరస్తదార్ పదవికి చేరుకొనక ముందు తను చాల పదవులలో పనిచేసినట్లు వ్రాశారు. ఆకాలంలో రివెన్యూ శాఖలో పదవులు సాల్టు రైటర్, అమల్దార్, నయాబ్ శిరస్తదార్ మొదలగు నవి.ఇంగ్లీషురికార్డు కీపరుగా తిమ్మరాజు 1834 దాకా చెసినట్టుగా కనపడుతున్నది. ఆ కాలంలో పులివేందుల చంచయ్య అమలాపురంలో అమల్దారు గానుండిరి. 1835 లో ఎ.క్రాలే దొర రాజమండ్రీ జిల్లా కలెక్టరుగానుండగా కోటిపల్లి తాలూకా అమల్దారుగానుండిన జొన్నలగడ్డ కొండయ్య,అతని సోదరడైన మల్లపరాజు వలన జరిగిన ఆర్థికఅవినీతి (యంబెజిల్మెంటు) వ్యవహారం బయటపడగానే కలెక్టరు క్రాలే అప్పట్లో హుజూరు ఇంగ్లీషు రికార్డు కీపరుగానున్న దిగవల్లి తిమ్మరాజుగారిచే విచారణచేయించారని క్రాలే కలేక్టరు సైంటు జార్జి ఫోర్టులోనున్న రెవెన్యూ బోర్టుకు 26 జనేవరి 1835 నాడు కలెక్టర్సు సరక్యూట్, తణుకు నుండి లేఖ వ్రాసి ఆకేసుతాలూకు రికార్టు పంపించినట్లుగా మూలాధారాలు కనబడుతున్నవి.[3],[4] 1847 లో గోదావరి ఆనకట్టకి ప్రత్యేక ఛార్జిలో నున్న సబ్ కలెక్టరు కార్యాలయంలో తిమ్మరాజు శిరస్తదారుగా నున్నారు. గోదావరి ఆనకట్ట కట్టడానికి కావలసిన కూలీలు, సామగ్రీలు షెడ్యూలు ప్రకారం సరఫరా చేయించే బాధ్యత తాసిల్దార్లు మొదలగు నేటివ్ అధికార్ల పై మోపారు. అవి సకాలంకి సరఫరా చేయలేని అధికారిని శిక్షించటం జరిగేది. సబ్ కలెక్టరు తిమ్మరాజు గారి పై ఒకసందర్భంలో కట్టడానికుచ్చిన సామగ్రిలో ఏదో తేడా వచ్చిందని ఒక అణా జుల్మానా విధించగా తిమ్మరాజు ఉత్తర సర్కారు కమీషనర్ గారి అప్పీల్ చేశారు. అంతట ఉత్తర సర్కారు కమీషనర్ విచారణ జరిపించి తిమ్మరాజు నీతిపరుడైన అధికారని వ్రాసి జుల్మానాను రద్దు చేయించటం జరిగనట్లుగా రికార్డులో నున్నది. 1851 తిమ్మరాజు శిరస్త దారు గానున్నప్పుడు 27/11/1851 తారీఖున పిఠాపురం జమీందారు రావు సూర్యారావు మరణించగా. జమీందారు గారి కుమారుడు వెంకటనీలాద్రిరాయణం మైనరైనందున ఎస్టేటుకు కంపెనీ సర్కారు వారి ఆధీనం లోకి తీసుకొనుటకు ( వార్డు గా) పిఠాపురం సంస్థ ఆస్తి పాస్తుల స్వాధీన వ్యవహారంలో అప్పట్లో పిఠాపురంలో సిరస్తదారు గానున్న కంభం నరసింగ రావు బాధ్యతా రహితమై పిఠాపురం ఆస్తులనుకొన్ని మరుగు పరిచాడని కారణాలపై కలెక్టరు పెండరగాస్టు దొర నరసింగరావుని సస్పెండు చేసి తిమ్మరాజూ గారిని పిఠాపురానికి హెడ్ సిరస్తదారు(హూజూర్ సిరస్తదారు) గా పంపటమేగాక తిమ్మరాజు గారిని ఆ పిఠాపురం ఎస్టేటుకు కోర్టు ఆఫ్ వార్డ్సు మేనేజరుగా నెలకు 250 రూపాయల జీతముపై నియమించారు.[1] ఆవిధంగా కొన్నాళ్ళపాటు తిమ్మరాజు రెండు ఉద్యోగాలు నిర్వహించారు. రాజమండ్రీ జిల్లాకలెక్టరు ఉత్తర సర్కారు కమీషనర్ వారి అనుమతితో ఆ కేసులో1853 లో దిగవల్లి తిమ్మరాజు గారిని విచారణకు నియమించారు.[1] తిమ్మరాజు పిఠాపురం సంస్థానము నకు మేనేజరుగాచేయుచున్న రోజులలో ఆ సంస్థ కార్యాలయములోనే కందుకూరి వీరేశలింగం గారి తండ్రి కందుకూరి సుబ్బారాయుడు గుమాస్తాగా పనిచెయుచుండేవారని కందురకూరి వీరేశలింగం వారి స్వీయచరిత్ర (1911)మొదటి భాగంలో పేర్కొన్నారు.[5] 1852 నుండి 1855 దాకా తిమ్మరాజు హుజూర్ సిరస్తదారుగా పిఠాపురంలో చేశారు. 23-8-1831 ఖర సం శ్రావణ శు .. పౌర్ణమి చంద్రగ్రహణం. 1831 జూలై 21 చెన్నపట్నం సుప్రీంకోర్టు ఇంటర్ ప్రిటర్ ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రనుండి కలకత్తా, జగన్నాధపురం, శ్రీకాకుళం విజయనగరం సింహాచలం మార్గాన్న జూలై 20 తేదిన పిఠాపురం పెద్దాపురం వచ్చి 21 తేదీన రాజమహేంద్రవరం వచ్చారు. కొచ్చర్లకోట వెంకటరాయంగారి అతిధిగావుండిరి., ఆచంట, బందరు, నెల్లూరు మార్గాన చెన్నపట్నం వెళ్లారు. బందురులో C.P Brown జిల్లాజడ్జిని దర్శించారు. 1854 పిఠాపురం మైనర్ జమీందారు రావునీలాద్రి రామారావు గారికి యుక్తవయస్సువచ్చి కొద్ది రోజులలో జమీందార అవుతారనుకుంటూ వుండగా అకాల మరణం చెందారు. వారి సోదరుడు గంగాధర రామారావు వారసైనాడు. మైనారిటీ తీరే వరకూ Court of Wards క్రిందనే ఎస్టేట్ వుండాలి కావున తిమ్మరాజు యధాప్రకారం ఎస్టేట్ మేనేజరుగా పనిచేస్తూ ఉన్నారు.

కంభం నరసింగరావుగారి అవినీతి కేసు ప్రాముఖ్యత

[మార్చు]

ఆ కేసు ప్రాముఖ్యత ఏమిటంటే 1851 లో పిఠాపురం సిరస్తదారడైన కంభం నరసింగరావుగారి పై అప్పటికే అక్కసుకలిగియున్న రాజమండ్రీ జిల్లా కలెక్టరు పెండర్గాస్టు దొర వారిని సస్పెండు చేయటమేగాక క్రిమినల్ ఛార్జిపై జైలుకు పంపిచారు. ఎందుకంటే పిఠాపురం ఎస్టేటు జమీందారు రావుసూర్యారావు చనిపోవగా వారి వారసుడైన రావు నీలాద్రి రామారావు, వారి తమ్ముడు గంగాధర రామారావు మైనైర్లు అయినందు న పిఠాపురం ఎస్టేటును సర్కారువారు స్వాదీనముచేసుకునే కార్యకలాప్పాలలో వారి ఆస్తిపాస్తులు పూర్తిగా లెఖ్కలు చెప్పలేదనీ, అందులో 67000 రూపాయల వరకూ తక్కవుగా వున్న దన్న నేరారోపణతో చాలకాలం నుండి సిరస్తదారుగానుండి అంతమట్టుకూ మంచి పేరుగల కంభం నరసింగరావు గారిని సస్పెండు చేశారు. ఆ కేసులో పెండర్ గాస్టు దోరగారే మాజిస్ట్రేటు అవడం, వారే దోషారోపణదారులు, వారే నేరవిచారణాధికారి అవటం హశ్యాస్పదమని పి.బి స్మాలెట్ట్ దొర వారి పుస్తకంలో వ్రాశారు. నరసింగరావుగారి స్థానములో దిగవల్లి తిమ్మరాజుగారినీ ఇంకో అమల్డారుని కూడా నిచ్చి పంపిచటమేగాక తిమ్మరాజూగారిని పిఠాపురం ఎస్టేటుకు కోర్టు ఆఫ్ వార్ఢుగా కూడా నియమించారు. తదుపరి నరసింగరావు గారి కేసు జిల్లా సెషన్సు కోర్టులో విచారణ జరిగిన తరువాత నరసింగరావు నిర్దోషులని తీర్పిచ్చి జైలునుండి విడుదల చేశారు. ఆ తరువాత ఉత్తర సర్కారు కమీషనర్ గారి ఆదేశ ప్రకారం రాజమండ్రీ జిల్లా కలెక్టరు పెండర్ గాస్టు దొర తమ సంజాయిషీలో నరసింగ రావు గారి పై నేరా రోపణ పొర పాటే ననీనూ, అలా పొరబాటు జరగటానికి దిగవల్లి తిమ్మరాజు గారే బాధ్యులని పేర్కొన్నారు. తిమ్మరాజుగారిని పిఠాపురం పంపకముందునుంచీ కంభం నరసింగరావుగారి పైనే గాక పెండర్ గాస్టు దొరగారి హయాములో ఏ విధంగా పక్షపాతంతో నేటివ్ ఉద్యోగస్తులను శిక్షిస్తున్నదీ పి.బి. స్మాలేట్ట్ దొర అప్పట్లో గంజాంజిల్లా కలెక్టరే గాక గవర్నరుగారికి ఏజంటు గాను వున్న ఆ దొర "Madras and its Civil Administration" అను పుస్తకము 1858 లో ప్రచురించిన దాంట్లో వివరాలన్నీ యిచ్చారు.[1],[2]

నరసింగరావుగారిపై నిరాధార నేరారోపణకు తిమ్మరాజు గారేనా బాధ్యులు?

[మార్చు]

1851 లో నరసింగ రావు గారి వ్యవహారం రాక ముందు తిమ్మరాజు 1820 నుండి దాదాపుగా 7 కలెక్టర్ల క్రింద పనిచెసినా అప్పటిదాకా ఎటువంటి ఆక్షేపణలు లేకుండా వారికివ్వబడిన బాధ్యతలు సక్షమంగా నిర్వహించారు. 1835లో అమల్దార్ జొన్నలగడ్డ కొండయ్య అవినీతి వ్యవహారంలో క్రాలే దొర కలెక్టరు గానున్నప్పుడు తిమ్మరాజుగారిచేత నే విచారణచేయించి కొండయ్యను పదవినుండి తొలగించడం జరింగింది. అప్పుడు గూడా తిమ్మరాజు విచారణచేయటంలో అవినీతిగా చేశారని ఆ కొండయ్య మద్రాసులో నుండిన గవర్నరుగారికి ఫిర్యాదు అర్జీ పంపిచగా కలెక్టరు క్రాలే జానవరి 26 1835 న వ్రాసి పంపిన జవాబు లేఖలో తిమ్మరాజు గారి పై అటువంటి ఫిర్యాదు సరికాదని వ్రశారు.[3] దాని తరువాత 1847 లో ధవళేశ్వరం ఆనకట్ట వ్యవహారాలలో ఆనకట్ట పనికి సప్లై సామగ్రీలో ఎక్కు తక్కువలున్నాయని సిరస్తదారైన తిమ్మరాజు పర్యవేక్షణ జరపలేదనే నేరముపై ఆనకట్ట స్పెషల్ సబ్ కలెక్టరు దొర తిమ్మరాజు గారికి ఒక అణా జుల్మానా విధించారు. తిమ్మరాజు తన లోపమేమీలేదనీ, జుల్మానా విధించటం అన్యాయమని ఉత్తర సర్కారు కమీషనర్ గారికి అర్జీ పెట్టగా, కమీషనర్ విచారణ జరిపించి తిమ్మరాజు గారి లోపమేమీలేదని జుల్మానారద్దు చేయటమేగాక తిమ్మరాజు నీతిపరుడైన ఉద్యోగి అని తాకీదునిచ్చారు. ఆ తాకీదును బట్టే అప్పటి కలెక్టరు పెండరగాస్టు దొర తిమ్మరాజుగారికి బాధ్యతకలిగిన పనులు అప్పగించటమే గాక పదోన్నతి కూడా చేశారు. కానీ 1852-53 లో పిఠాపురం హెడ్ సిరస్తదార్ నరసింగరావుగారి వ్యవహారం లోజరిగిన పొరపాటునేరారోపణలో తన దోషమేమీ లేదని తన సంజాయిషీలో చెపుతూ చివరకు అంతా తిమ్మరాజుగారివలనే జరిగిందని ఆ పెండర్ గాస్టుదొరగారే తమచేతులు దులిపేసుకున్నారు. వారి కార్యకాలంలో రాజమండ్రీ జిల్లాలోనే కాక వారు గంజాం జిల్లాకి కలెక్టరుగా వెళ్లిన తరువాత అక్కడగూడా నేటివ్ పుద్యోగులను ఎలా శిక్షించినదీ అంతకుముందే గంజాంజిల్లా కలెక్టరుగా చేసిన స్మాలెట్ దొర వ్రాసిన పుస్తకములోవున్నది. 1858 ప్రచురణైన ఆ పుస్తకము "Madras and its civil administration" లోస్మాలెట్ దొర కంపెనీ సర్కారువారి హయాములో నేటివ్ ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు దొరగార్ల నౌకర్లకంటే( ఫూట్మన్) తక్కువగానుండేవనీ, ముఖ్యముగా తహసిల్దారులకు విపరీత బాధ్యతలు అప్పగించి వారిని స్వల్ప జీతాల పై నియమించి అతిస్వల్ప కారణాలకే సస్పెండు బరతరఫ్ఫులు చేయటం జరుగుతున్నదని చెప్తూ పెండర్ గాస్టు దొరగారి హయామును దీర్ఘముగా విమర్శించి ఆక్షేపించారు.[1]

తిమ్మరాజు గారి సంతానం కుటుంబ వ్యవహారాలు

[మార్చు]

తిమ్మరాజు గారి మొదటి ఇద్దరు భార్యలు వెంకమ్మ , అచ్చమ్మ సంతాన రహితం గానే మరణించినట్లు తెలుస్తున్నది. వివరాలు తెలియవు. మూడవ భార్య సీతమ్మ గారి వలన కలిగిన సంతానం ఇద్దరు కుమారుల మధ్య ఒకర్తే కుమార్తె . 1829 May 17: విరోధి నామ సంవత్సరము వైశాఖ ఆదివారం స్వాతీ నక్షత్ర చతుర్ధ చరణం శ్రీ తిమ్మరాజు గారికి ప్రథమ పుత్రుడు వెంకట శివరావు గారి జననం. కుమార్తె వెంకట మాణిక్యమ్మ గారి జననం 04/09/1839 తేదీ వికారి సంవత్సరం శ్రావణ బుధ వారం. తిమ్మరాజు తన జీవిత కాలం లోనే తన కుమార్తె వెంకట మాణిక్యమ్మ గారిని తన మేనల్లుడైన తల్లాప్రగడ వీర వెంకట నారాయణ గారికిచ్చి వివాహం చేశారు. 1836 దుర్ముఖి బహు ...శివరావుగారికి ఉపనయనం రెండవకుమారుడు వెంకటరత్నం గారి జననం 1850 లో(born 19/07/1850) తిమ్మరాజు చనిపోయేటప్పటికి తన పెద్ద కుమారుడైన వెంకట శివరావుగారికి 27 ఏండ్ల వయస్సు. వారు పిఠాపురం ఎస్టేటుకు దివానుగా చేశారు( died 28/03/1892). వీరే తన తమ్ముడైన వెంకటర్నం గారిని పెంచి పెద్ద చేసి తన జీవి తాంతము ఇంటి మంచి చెడ్డలు ఆస్తి పాస్తుల వ్యవహారం చూశారు. అందుకని వెంకటరత్నం తనకన్నా 21 ఏండ్ల పెద్దవారైన అన్న గారి పట్ల భయభక్తులతో వుండే వారు. వారు వీరికి వ్రాసిన లేఖలలో “honourable brother “ అని సంబోధించేవారు. 19-11-1834 జయ సంవత్సరం కార్తీక తిమ్మరాజుగారి తమ్ముడు రాజన్న, వారి భార్య అన్నగారైన తిమ్మరాజుగారింటినుండి వెళ్లి కాకినాడలో వేరింటి కాపురం పేట్టారు.

ప్రముఖులైన తిమ్మరాజుగారి ఆప్త బంధువులు

[మార్చు]

ఒకరు భ్రహ్మజ్ఞాని తల్లాప్రగడ సుబ్బారావు 1856- 1890 ఇంకొకరు అంతర్జాతీయ ప్రఖ్యత వైజ్ఞాని డాక్టరుయల్లాప్రగడ సుబ్బారావు ( 1898 – 1949) చూడు తల్లాప్రగడ సుబ్బారావు Wikipedia Telugu. తల్లాప్రగడ సుబ్పారావు తిమ్మరాజుగారి మనవడు (కుమార్తె వెంకట మాణిక్యమ్మ గారి కుమారుడు).. 1856 లో తిమ్మరాజు మరణించేటప్పటికి (died 07/02/1856) వారి పెద్ద కుమారుడు వెంకట శివరావుగారికి27 ఏండ్లు రెండవ కుమారుడు వెంకటరత్నం గారికి 6 ఏండ్లు మనుమడైన తల్లాప్రగడ సుబ్బారావు గారికి 8 నెలలు.. సుబ్బారావు బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన కారణంగా వీరి పెద మెనమామగారైన దిగవల్లి వెంకట శివరావు (తిమ్మరాజు గారి పెద్ద కుమూరుడు ) తన తమ్ముడు వెంకటరత్నంతో పాటు పెంచి పెద్ద చేశారు. చిన మేనమామ వెంకటరత్నం వీరి కన్నా 6 ఏండ్లు పెద్ద.తరువాత వెంకటరత్నంగారి పెద కూతురునిచ్చి వివాహం చేశారు. సుబ్బా రావు మహా మేధావులు 15 ఏటనే మొట్రిక్యలెషన్ ప్యాసైయ్యారు. 1872 లో ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. 1872 -74 యఫ్ ఎ, 1874- 76బి.ఎ, 1876-78 బి .ఎల్. 20 ఎండ్లప్రాయంలో బి.ఎ. ప్రథమ శ్రేణిలో పాసై, 22 ఎండ్ల ప్రాయంలోకల్లా బి.యల్ పాసై మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రారంభించారు. వారు సంస్కృతాంధ్ర ములో గొప్ప పాండిత్యం వేదాంతోపనిషత్తులు మధించి, నిఘూడమైన దైవజ్ఞానము యంత్ర తంత్రాలజ్ఞానం [occult] సంపాదించి బ్రహ్మజ్ఞానిగా ప్రసిధ్ధి పొందారు. సుబ్బారావుగారినిని ఇంగ్లీషులో స్వామీ సుబ్బారావుగారని సంబోధించేవారు. Theosophical Society అనే దైవజ్ఞాన సంస్ధ అమెరికాలోమాడమ్ హెచ్ పి బ్లవస్కీ మరియూ కర్నల్ హెచ్ యస్ ఆల్కాట్ చే 1875 లో స్థాపింపబడిన అంతర్జాతీయ సమధర్మ దైవజ్ఞాన సంస్ధ ముఖ్య కార్యాలయమును భారతదేశానికి 1882 లో మార్చ బడింది. అప్పుటికే మహా జ్ఞానిగా పరిగణించబడిన తల్లాప్రగడ సుబ్బారువుగారిని అదే సంవత్సరంలో అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఆ సంస్థ సంస్ధాపకరాలు మాడమ్ బ్లవస్కీ సుబ్బా రావుగారిని గొప్ప జ్ఞానిగా గుర్తించి తను రచించిన ఒక గ్రంథమునకు సుబ్బారావుగారిని సహగ్రంధకర్తగా “Assisted by T.Subbarow garu B.A., B.L ., F.T.S” అని ప్రచురించారు. సుబ్బారావు రచనలను “Esoteric writings of T.SubbaRao” అను పేరుతో మద్రాసు అడయారులోని Theosophical Society వారు ప్రచురించారు. దురష్టవశాత్తూ తల్లాప్రగడ సుబ్బారావు అల్పాయుష్షుడు తన 34 వ ఏటనే 1890 లో పరమందించారు (died on 24/06/1890) . వారిని గురించి దిగవల్లి శివరావు 1941, 1959, 1985 లలో వివరంగా మూడు వ్యాసాలు వ్రాశారు. రెండు తెలుగులోను ఒకటి ఇంగ్లీషులో The Theosophist అను ధియొసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియావారి పత్రికలో “ Swami T. Subba Row “ అను వ్యాసమును1985 లోను వ్రాశారు. తిమ్మ రాజు గారి బంధువుల్లో అతి ప్రముఖలైన వారిలో రెండవ వారు డాక్టరు యల్లాప్రగడ సుబ్బారావు . వీరు దిగవల్లి తిమ్మరాజు గారి రెండవ కోడలు వెంకట రత్నంగారి మొదటి భార్య వాడ్రేవు సీతమ్మ గారి చెల్లెలు కుమారుడు. వీరిని గురించి Wikipedia లో వ్యాసం ఇప్పటికే ఉంది. వీరు దిగవల్లి వేంకట శివరావుగారి సమకాలీకులు వారితో పాటు 1918-1922 కాలంలో మధ్య మద్రాసు విక్టోరియా హాస్టలులో నున్న సమకాలీకుల పేర్లు శివరావు తన డైరీలో వ్రాసు కున్నారు అందులో వైద్యవిద్యార్థులుగా వెలిదండ్ల హనుమంతరావు,యల్లా ప్రగడ సుబ్బారావు,రాయప్రోలు సీతా రామ శాస్త్రి, చాగంటి సూర్యనారాయణ,అమంచర్ల శేషాచలపతిరావు(ఎ.యస్ చలపతిరావు) మొదలగు వారు ఉన్నారు. యల్లాప్రగడ సుబ్బారావు గారికి కూడా వెలిదండ్ల హనుమంత రావుగారి లాగనే L.M & S అనే తక్కు వహోదా గల వైద్య పట్టా నే ఇచ్చినట్లుగా వ్రాశారు. సుబ్బారావు అమెరికా వెళ్లి అక్కడ మెడికల్ బయో కెమిస్ట్రీలో పి హెచ్ డి పట్టా పొంది లెడర్లే మందుల కంపెనీలో పెద్ద పదవి Research Director గా గొప్ప పరిశోధన చేసి మానవ శరీరంలో ఫోలియేట్సు అను విటమిన్ బి తయారవుతున్నదని అది గర్బములోనున్న శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పదార్దమనీ కనుకున్నారు. వారు అసాధారణ ప్రజ్ఞాశాలులు. దురదృష్టవశ్సాత్తూ వారు కూడాఅల్పాయుష్షగనే అకాల మరణం పొందారు. వారి విగ్రహమును లెడర్లే కంపెనీ ప్రాంగణములో స్థాపించటం జరిగింది.

మూలాధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 “Madras and its civil administration” by P.B.Smollett Esq Collector of Ganjam and Agent of Governor. Richardson Brothers, Corn Hill, London (1858) Chapter V Treatment of Native Servants pp128-160
  2. 2.0 2.1 2.2 " కధలు-గాధలు" దిగవల్లి వేంకట శివరావు పేజీలు 11-15 మూడవ కూర్పు (2010) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌసు
  3. 3.0 3.1 Godavri District Record Vol 4448/19-23 “Letter of Mr. A. Crawley, Collector of Rajahmundry District dated 23/01/1935 addressed to President and Members of Board of Revenue, Fort St.George”
  4. Godavari District Records, Volume 4660/703-9. Extracts from the proceedings of the Board of Revenue dated 26th September 1835
  5. "స్వీయచరిత్రము" 1వ భాగము,కందుకూరి వీరేశలింగం(1911)pages 11,13