ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

వికీపీడియా నుండి
(ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు

ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాలంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది. 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

నేపథ్యం

[మార్చు]

మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలుండేవి (విజయనగరం, ప్రకాశం జిల్లాలు ఆ తరువాత ఏర్పడ్డాయి). ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థలోనూ తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగానూ గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.

అంకురార్పణ

[మార్చు]

ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మేలో నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో మొట్టమొదటి సారిగా తెరపైకి వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. అన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా వేసారు.

నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. 800 మంది డెలిగేట్లు, 2000 మంది సందర్శకులూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షత వహించాడు.[1] ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది.[2] ప్రత్యేకాంధ్ర గురించి ప్రజల్లో అవగాహన కలిగించే ప్రచారం చేపట్టాలని ప్రతిపాదన రాగా, రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు దాని పట్ల అంత సుముఖత చూపలేదు. గంటి వెంకటరామయ్య, న్యాపతి సుబ్బారావు పంతులు, మోచర్ల రామచంద్రరావు, గుత్తి కేశవ పిళ్ళెలు ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో ప్రముఖులు. ఈ ప్రచార అంశాన్ని ఒక స్థాయీ సంఘానికి అప్పగించాలని కొండా వెంకటప్పయ్య చేసిన సవరణతో అది ఆమోదం పొందింది.[3] తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు.[3]కాకినాడలో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు.

కాంగ్రెసుకు చేరిన ఉద్యమం

[మార్చు]

1914లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో మొదటి సారిగా ప్రత్యేకాంధ్ర ప్రస్తావన వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు విభాగం ఉంటే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించి, దాని గురించి తమ వాదనను వినిపించి, దానిపై అభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. ఈ సభతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఆంధ్ర మహాసభ నుండి, కాంగ్రెసు పార్టీ సభలోకి చేరింది. అయితే ఈ ప్రతిపాదన కాంగ్రెసు పరిశీలనకు వచ్చినా, దానిపై నిర్ణయం తీసుకోడానికి మరో నాలుగేళ్ళు పట్టింది. కాంగ్రెసు పెద్దల వ్యతిరేకతను అధిగమించి, 1918 జనవరి 22 న ఆంధ్రకు ప్రత్యేకంగా కాంగ్రెసు విభాగాన్ని ఏర్పాటు చేయించడంలో ఆంధ్ర నాయకులు కృతకృత్యులయ్యారు.

చట్ట సభల్లో చర్చ

[మార్చు]

1918లో ప్రత్యేకాంధ్రోద్యమం మరో మెట్టెక్కింది. ఫిబ్రవరి 6 న మద్రాసు కౌన్సిల్లో భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర స్థాపన గురించి బయ్యా నరసింహేశ్వర శర్మ ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. ఆ ప్రతిపాదన ఇది:

The redistribution of provincial areas on a language basis wherever... and to the extent possible, especially where the people speaking a distinct language and sufficiently large in number desire such a change

బ్రిటిషు వారికి భాష ప్రాతిపదికపై ప్రజలు ఏకమవడం రుచించక, ఆ ప్రతిపాదన వీగిపోయింది.[4]

ఆంధ్రుల్లో అనైక్యత

[మార్చు]

అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభివృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను 1924లో రాయలసీమ నాయకులు లేవదీసారు.

1937 లో మదనపల్లెలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ప్రత్యేకాంధ్ర నిర్మాణంపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ పాపన్న గుప్త ప్రసంగించాడు. తన ప్రసంగంలో అతడు మా సహకారం లేకుండా మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారో చూస్తాం అని అన్నాడు. మద్రాసు మంత్రివర్గంలో రాయలసీమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వనంత వరకు, తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించనంత వరకు, రాజధాని ఎక్కడో నిర్ణయించనంతవరకూ, విశ్వవిద్యాలయం రాయలసీమకూ ఉపయోగపడేలా చెయ్యనంతవరకు ప్రత్యేక రాష్ట్ర ఆలోచన చెయ్యడం అవివేకం అని అతడు ప్రసంగించాడు. పాపన్న ప్రసంగాన్ని ఇంజేటి శ్రీకంఠేశ్వరరావు సమర్ధించాడు. పట్టాభి అతడి ఆరోపణలు నిజమేనని అంగీకరిస్తూ, అందుకు క్షమించమని కోరాడు. తమపై కోపంతో అరవలతో చేయి కలపడం సమంజసం కాదని చెప్పాడు. రాయలసీమకు అవసరమైన అన్ని సంరక్షణలను పేర్కొంటూ ఒక తీర్మానాన్ని చేసుకోవాలని, దాన్ని రాష్ట్ర సాధన ప్రణాళికలో భాగం చేసుకుందామనీ చెప్పాడు. అప్పుడు పాపన్న తదితరులు అందుకు ఆమోదించడంతో తీర్మానం అమోదం పొందింది.[5]

రాయలసీమ నాయకుల అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ, 1937 నవంబరు 16 న చారిత్రాత్మకమైన శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది.[6] కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకాంధ్ర ఏర్పడితే, రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు.

1939లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్‌ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.

స్వాతంత్ర్యం తరువాత

[మార్చు]

1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినపుడు, తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆశించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు, ఉప ప్రధాని వల్లభ్‌భాయి పటేల్‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.

1948 జూన్ 17 న, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఎస్‌.కె.ధార్‌ నేతృత్వంలో భాషాప్రయుక్త రాష్ట్రాల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర మహాసభ తమ విజ్ఞప్తిని కమిషనుకు అందజేసింది. ఇక్కడ ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య గల విభేదాలు మళ్ళీ బహిర్గతమయ్యాయి. నీలం సంజీవరెడ్డి నాయకత్వం లోని రాయలసీమ నాయకులు సమర్పించిన విజ్ఞాపనలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వెయ్యాలని కోరుతూ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని కోరింది. 1948 డిసెంబరు 10 న ఈ కమిషను సమర్పించిన తన నివేదికలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది.[7] ఈ నివేదికతో ఆందోళన చెందిన ఆంధ్రులను బుజ్జగించడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు, నెహ్రూ, పటేల్‌, భోగరాజు పట్టాభి సీతారామయ్య లతో ఒక అనధికార సంఘాన్ని ఏర్పాటు చేసింది. జె.వి.పి కమిటీగా పేరొందిన ఈ సంఘం 1949 ఏప్రిల్ 1 న సమర్పించిన నివేదిక‌లో కాంగ్రెసు వర్కింగు కమిటీకి కింది సూచనలు చేసింది.[8]

  • భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళు వాయిదా వెయ్యాలి.
  • కాని ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చెయ్యాలి – అయితే ఒక నిబంధన మీద..
  • నిబంధన: మద్రాసును ఆంధ్రులు వదులుకోవాలి

మద్రాసును వదులుకొనేందుకు ఇష్టపడని ఆంధ్రుల్లో ఈ నివేదిక అలజడి సృష్టించింది. ఈ పరిస్థితుల మధ్య అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి, కుమారస్వామి రాజా నాయకత్వంలో ఒక విభజన సంఘం ఏర్పాటయింది. ఆంధ్రుల తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, నీలం సంజీవరెడ్డి ఈ సంఘంలో సభ్యులు. ఈ సంఘం ఒక నిర్దుష్ట ఒప్పందానికి రాలేకపోయింది. ప్రకాశం మిగిలిన సభ్యులతో విభేదించి, అసమ్మతి లేవనెత్తాడు. ఆయన అసమ్మతిని అవకాశంగా తీసుకొని కేంద్రప్రభుత్వం మొత్తం వ్యవహారాన్నే అటకెక్కించింది.

దీనితో అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది, స్వామి సీతారాం (గొల్లపూడి సీతారామశాస్త్రి) ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు.[9] దీంతో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబర్ 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు.[10] ఈ దీక్ష, ప్రజల్లో తమ నాయకుల పట్ల, కేంద్రప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచడం మినహా మరేమీ సాధించలేక పోయింది.

తమిళ నాయకుల స్పందన

[మార్చు]

తమిళ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు. 1937 లో మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ బహిరంగంగానే వ్యతిరేకించాడు, అతడి ప్రభుత్వం లోని మంత్రి టి.ఎస్.ఎస్.రాజన్ రాజమండ్రిలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. సత్యమూర్తి మాత్రం ఉద్యమాన్ని సమర్ధించాడు. తమిళుల వ్యతిరేకతను గమనించిన పట్టాభి, తమిళ మంత్రులు మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేదానికంటే ముందే బ్రిటిషు వాళ్ళు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేట్టున్నారు. అని వ్యాఖ్యానించాడు.[6] చివరికి అదే జరిగింది.

కృష్ణా-పెన్నా ప్రాజెక్టు వివాదం

[మార్చు]

1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెసును ఓడించి, ఆంధ్రులు వారిపై గల తమ అసంతృప్తి వెలిబుచ్చారు. మద్రాసు శాసనసభలో ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న 140 స్థానాలలో కాంగ్రెసు 43 మాత్రమే పొందగా, కమ్యూనిస్టులు పోటీ చేసిన 60 స్థాల్లోను 40 ని గెలుచుకున్నారు. మొత్తం శాసనసభలో కాంగ్రెసు బలం 152 కాగా, కాంగ్రెసేతర సభ్యులు 164 మంది. వీరంతా ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంటుగా ఏర్పడి టంగుటూరి ప్రకాశాన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే అప్పటి గవర్నరు, రాజాజీని శాసన మండలికి నామినేట్‌ చేసి, మంత్రివర్గ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాడు.

రాజాజీ ముఖ్యమంత్రి అయ్యాక, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు కట్టి, కృష్ణా నీళ్ళను తమిళ ప్రాంతాలకు మళ్ళించే ఆలోచన చేసాడు. ఆ ప్రాజెక్టు కడితే తమ నోట మన్నే అని గ్రహించిన ఆంధ్రులు ఆందోళన చేసారు. సమస్య పరిశీలనకై కేంద్రప్రభుత్వం ఎ.ఎన్‌ ఖోస్లా నాయకత్వంలో ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ప్రాజెక్టును ప్రతిపాదిత స్థలంలో కట్టకూడదనీ, నందికొండ (ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రదేశం) వద్ద కట్టాలనీ ఈ కమిటీ సూచించింది. రాజాజీ ప్రభుత్వం తమపై సవతి ప్రేమ చూపిస్తున్నదనే ఆంధ్రుల భావన మరింత బలపడింది. మద్రాసు రాష్ట్రం నుండి వేరు పడాలనే ఆంధ్రుల భావన మరింత బలపడసాగింది.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం

[మార్చు]
తొలి ముఖ్యమంత్రి, టంగుటూరి ప్రకాశం

ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. అఖిల భారత గాంధీ స్మారక నిధి ఆంధ్ర శాఖకు కార్యదర్శిగా ఉన్న శ్రీరాములు, తన పదవికి 16 వ తేదీన రాజీనామా చేసి దీక్షకు ఉపక్రమించాడు.మద్రాసు లోని బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆయన దీక్షను మొదలుపెట్టాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 డిసెంబర్ 15 న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు.[11] ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది.[12][13] ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 డిసెంబర్ 19న ప్రకటించాడు.[14] 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.

శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలను కలుపుకుని 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకాను ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.

1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Apr 28, TNN /; 2013; Ist, 04:20 (28 April 2013). "Andhra Mahasabhalu on May 26 | Hyderabad News – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05. {{cite news}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Reporter, Staff (2019-11-02). "Bapatla hosted first Andhra Conference in 1913". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.
  3. 3.0 3.1 "andhra movement.pdf". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2021-01-05.
  4. "భాషాప్రయుక్త రాష్ట్ర విభజనము". ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in). p. 3. Archived from the original on 2021-01-04. Retrieved 2021-01-04.
  5. "ఆంధ్ర రాష్ట్రమునకు రాయలసీమ ఆంధ్రుల ఆమోదము". ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in). p. 7. Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.
  6. 6.0 6.1 టి, వసుంధర. "యాటిట్యూడ్స్ ఆఫ్ రాయలసీమ అండ్ సర్కార్ లీడర్స్" (PDF). శోధ్ గంగ. p. 163,164,167.
  7. "భాషాప్రయుక్త రాష్ట్ర నిఒర్మాణం ఎన్నటికీ జరుగరాదు". ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.
  8. "చెన్నపట్నంపై తమ హక్కులను వదులుకుంటే సాధ్యమైనంత త్వరలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం". ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-04. Retrieved 2021-01-04.
  9. "స్వామి సీతారాం నిరశన దీక్ష ప్రారంభం". ఆంధ్రపత్రిక. p. 2. Archived from the original on 2021-01-04. Retrieved 2021-01-04.
  10. "వినోబాభావే విజ్ఞప్తిపై స్వామీజీ ప్రాయోపవేశ విరమణ". ఆంధ్ర పత్రిక (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-04. Retrieved 2021-01-04.
  11. "ఆంధ్రరాష్ట్ర సాధనకు శ్రీరాములు గారి ప్రాణార్పణ". ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.
  12. "మొదటి పేజీలో పలు వార్తలు". ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.
  13. "ఆంధ్రలో తిరిగి శాంతి నెలకొన్నట్లు మొదటి పేజీలో వార్త". ఆంధ్రప్రభ (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.
  14. "ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి నిర్ణయం". ఆంధ్రప్రభ (www.pressacademyarchives.ap.nic.in). Archived from the original on 2021-01-05. Retrieved 2021-01-05.