ఫింగర్ స్పిన్
ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
ఫింగర్ స్పిన్ (ఆఫ్ స్పిన్ అని కూడా అంటారు) అనేది క్రికెట్ క్రీడలో ఒక రకమైన బౌలింగు పద్ధతి. ఇది బంతికి నిర్దుష్టమైన స్పిన్ దిశను అందించడానికి సంబంధించిన క్రికెట్ సాంకేతికతను, చేతి కదలికలనూ సూచిస్తుంది. ఇతర స్పిన్నింగ్ టెక్నిక్ అయిన మణికట్టు స్పిన్‌లో బంతిని వ్యతిరేక దిశలో స్పిన్ చేయడానికి ఉపయోగిస్తారు. మినహాయింపులు ఉన్నప్పటికీ, ఫింగర్ స్పిన్నర్లు సాధారణంగా మణికట్టు స్పిన్నర్ల కంటే తక్కువగా బంతిని టర్న్ చేస్తారు. అయితే, దీని సాంకేతికత సరళమైనది, నైపుణ్యం సాధించడం సులభం కనుక, ఫింగర్ స్పిన్నర్లు మరింత ఖచ్చితత్వం ప్రదర్శిస్తారు
ఫింగర్ స్పిన్ అనే పేరు నిజానికి తప్పుడు పేరు, ఎందుకంటే బంతిపై లక్షణ స్పిన్‌ను ఉత్పత్తి చేసే మెకానిజంలో ఫింగర్ యాక్షన్ ముఖ్యమైన భాగం కాదు. ఫింగర్ స్పిన్ డెలివరీలో చేతిని పూర్తిగా సూపినేటెడ్ పొజిషన్‌లో ఉంచి, బంతిని బయటి వైపున వేళ్లతో పట్టుకుని (కుడిచేతి వాటం బౌలర్‌కి కుడి వైపున) విడుదల చేస్తారు. చేతిని ఇలాగే ఉంచి బంతిని విడుదల చేస్తే, చేతివేళ్లు సహజంగా బంతికి పక్కన కత్తిరించి, సవ్యదిశలో స్పిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. గొప్ప ఇంగ్లీష్ ఫింగర్ స్పిన్నర్ డెరెక్ అండర్‌వుడ్ ఈ పద్ధతిలో ఫింగర్ స్పిన్ బౌలింగు చేయడంలో ప్రసిద్ధి చెందాడు.
ఫింగర్ స్పిన్నర్ రకాలు
[మార్చు]కుడి, ఎడమ చేతి బౌలర్లు ఒకే టెక్నిక్‌తో ఫింగర్ స్పిన్ (అద్దంలో చూసినట్లు విలోమంగా ఉంటుందంతే) బౌలింగు చేసినప్పటికీ, బంతి ఏ దిశలో బౌన్స్ అవుతుంది కాబట్టి విడివిడిగా చూస్తారు. అటువంటి బౌలర్లను ఇలా భిన్నంగా పరిగణిస్తారు:
- కుడిచేతి ఫింగర్ స్పిన్‌ను ఆఫ్ స్పిన్ అంటారు.
- ఎడమ చేతి ఫింగర్ స్పిన్‌ను ఎడమ చేతి ఆర్థడాక్స్ స్పిన్ అంటారు.
ఈ వ్యాసం లోని మిగతా భాగంలో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి కుడిచేతి ఫింగర్ స్పిన్నర్ బౌలింగు చేయడాన్ని పరిగణిస్తుంది.
అయితే, సంప్రదాయ ఫింగర్ స్పిన్నర్లు, సాంప్రదాయేతర ఫింగర్ స్పిన్నర్‌ల మధ్య వ్యత్యాసాన్ని తప్పనిసరిగా గమనించాలి. ప్రత్యేకించి బంతిపై భిన్నమైన పట్టు అవసరమయ్యే కొత్త ఆవిష్కరణలతో (దూస్రా, క్యారమ్ బంతులు వంటివి).
ఇటువంటి బౌలింగు శైలులను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు
- సాంప్రదాయిక ఫింగర్ స్పిన్‌లో బంతిని చూపుడు వేలు, మధ్య వేళ్లకు చెందిన పై మెటికలతో బంతి సీమ్‌కు అడ్డంగా గట్టిగా పట్టుకుంటారు. బొటనవేలు బంతిని ఆనుకోకుండా గానీ, సీమ్‌పై తేలికగా ఆనుకుని గానీ ఉంటుంది. ఈ సాంకేతికతను వాడిన ప్రముఖ బౌలర్లు గ్రేమ్ స్వాన్, నాథన్ లియోన్. ఈ రకమైన బౌలింగ్‌లో సాధారణంగా ఆర్మ్ బాల్, టాప్-స్పిన్నర్ అనే వైవిధ్యాలు ఉంటాయి.
- మధ్యవేలి స్పిన్‌లో మధ్య వేలు బంతిని నేరుగా పైభాగంలో పట్టుకుని ఉంటుంది. చూపుడు వేలు, ఉంగరపు వేళ్ళ కణుపులు బంతిని అడుగున పట్టుకుని ఉంటాయి. సయీద్ అజ్మల్, సక్లైన్ ముస్తాక్, సురేశ్ రైనా దీనిలో నిపుణులు. ఈ పద్ధతి బౌలింగులో ఆఫ్-బ్రేక్ అనేది మామూలుగా వేసే స్టాక్ బాల్. మధ్యవేళు, చూపుడు వేలు సీమ్‌పై నుండి బంతిని తిప్పుతాయి. దీని వైవిధ్యాలలో దూస్రా, తీస్రాలు ఉన్నాయి.
- క్యారమ్ స్పిన్ (క్యారమ్ బాల్). దీనిలో బంతిని మధ్య వేలు, బొటనవేలు మధ్య ఉంచి, మధ్య వేలును అరచేతికి సమాంతరంగా ఉంచుతారు. మామూలుగా వేసే పద్ధతిలో కాకుండా, క్యారమ్స్ ఆటలో రెడ్‌ను వేళ్ళతో కొట్టినట్లు, బంతిని చేతివేళ్లతో పిండి, వదులుతారు. సాధారణంగా ఈ డెలివరీ లెగ్ బ్రేక్ అవుతుంది. అయితే ఈ పట్టును ఉపయోగించి, ఆఫ్ బ్రేక్‌లు, టాప్-స్పిన్నర్లు, బ్యాక్ స్పిన్నర్లు కూడా వేయవచ్చు అని జాక్ ఐవర్సన్ ప్రదర్శించారు. [1] ఈ డెలివరీని వేసే బౌలర్లలో అజంతా మెండిస్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
ఇతర రకాల ఫింగర్-స్పిన్‌లు ఉన్నాయి, అయితే ఈ విభాగాన్ని ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపయోగించే ప్రధాన రకాలకు మార్గదర్శకంగా చూడాలి. ముత్తయ్య మురళీధరన్ బౌలింగు చేసిన స్పిన్ రకాన్ని కూడా ఈ జాబితాలో చేర్చే వారు ఉన్నారు. అతని స్టాక్ బౌల్ కుడిచేతి ఆఫ్-బ్రేక్ అయినప్పటికీ, అటువంటి బౌలింగు టెక్నిక్‌ని సాంప్రదాయేతర రిస్ట్‌స్పిన్‌గా వర్ణించవచ్చు. బంతిని తిప్పడంలో వేళ్ల కంటే చాలా ఎక్కువగా, మణికట్టు పనిచేస్తుంది.
పట్టు
[మార్చు]ఫింగర్ స్పిన్నర్ బంతిని చూపుడు వేలు, మధ్య వేళ్ల పై మెటికలతో సీమ్‌ను గట్టిగా పట్టుకుంటాడు. బొటనవేలు బంతి నుండి దూరంగా ఉంచుతారు.
ప్రక్రియ
[మార్చు]కుడిచేతి ఫింగర్ స్పిన్నర్ స్టాక్ బాల్‌లో సవ్యదిశ స్పిన్, టాప్ స్పిన్ రెండూ ఉంటాయి. ఎడమ చేతి వేలు స్పిన్నర్ స్టాక్ బాల్ బౌలర్ వైపు నుండీ చూస్తే అపసవ్య దిశలో తిరుగుతుంది. కొంతమంది ఫింగర్ స్పిన్నర్‌లకు చూపుడు, మధ్య వేళ్లు బాల్‌పై స్పిన్‌ను అందించడానికి చాలా పని చేస్తాయి. మరొక రకం ఫింగర్ స్పిన్నర్లు మణికట్టు చర్యపై ఎక్కువగా ఆధారపడతారు. ఏ విధంగానైనా, విడుదల సమయంలో మణికట్టు ఉన్న స్థానం బంతి ఎలా తిరుగుతుందో నిర్ణయిస్తుంది.
మణికట్టు స్థానం | డెలివరీ | ఉద్దేశించిన ఫలితం |
---|---|---|
అరచేయి బ్యాటరును చూస్తూంటుంది | సాంప్రదాయ ఆఫ్ స్పిన్నర్. సైడ్ స్పిన్నర్. | బ్యాట్స్‌మన్‌కు దూరంగా జారిపోతుంది. ఆఫ్ నుండి లెగ్ సైడ్‌కి టర్నవుతుంది. |
చేతి బయటి పక్క, లెగ్ స్లిప్‌ను చూస్తూంటుంది | స్టాక్ లేదా అటాకింగ్ బాల్ - పార్ట్ టాప్ స్పిన్, పార్ట్ సైడ్ స్పిన్ | కొంత టర్న్, కొంత డిప్ లేదా బౌన్స్, కొంత డ్రిఫ్ట్. |
చేతి బయటి పక్క బ్యాటరును చూస్తూంటుంది | టాప్ స్పిన్నర్ | డిప్ - ఎక్కువ లేదా తక్కువ లెంగ్తు వద్ద బౌన్స్ అవుతుంది |
చేతి వెనుక పక్క, బ్యాటరును చూస్తూంటుంది | దూస్రా | లెగ్ నుండి ఆఫ్ కు స్పిన్నింగ్ |
చేతి వెనుక పక్క, నేలను చూస్తూంటుంది | ఉండర్ కట్టర్ | డ్రిఫ్ట్ అవడం |
వైవిధ్యాలు
[మార్చు]ఫింగర్‌స్పిన్నర్లు ఉపయోగించే వైవిధ్యాల్లో పెద్ద శ్రేణి ఉంది. వాటిలో అత్యంత సాధారణమైన వాటికి సంక్షిప్త వివరణ ఇది.
- ఆర్మ్ బాల్ - బ్యాట్స్‌మెన్ వైపు చూస్తూ నిటారుగా ఉండే సీమ్‌తో వేసే డెలివరీ. ఇది చేతి దిశను అనుసరిస్తూ ఇన్‌స్వింగ్ అవుతుంది. సాధారణంగా చాలా బ్యాక్‌స్పిన్‌తో వేస్తారు.
- టాప్‌స్పిన్నర్ - నిటారుగా ఉండే సీమ్‌తో, బ్యాట్స్‌మెన్ వైపు తిరిగుతూ వేసే డెలివరీ. ఇది సాధారణంగా ఇతర డెలివరీల కంటే ఎక్కువగా డిప్, బౌన్స్ అవుతుంది.
- అండర్‌కట్టర్ - సీమ్ క్షితిజ సమాంతరంగా ఉండే డెలివరీ. బ్యాట్స్‌మెన్ వైపు స్కిడ్ అవుతుంది. ఇటీవలి కాలంలో చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు.
- దూస్రా - లెగ్ నుండి ఆఫ్‌కి టర్నయ్యే బంతి (లెగ్‌బ్రేక్). కానీ ఇది సాంప్రదాయిక ఆఫ్‌బ్రేక్‌కు సమానమైన పద్ధతిలోనే వేస్తారు. అంటే రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం.
- తీస్రా - బ్యాక్ స్పిన్నర్ అని కూడా అంటారు. ఈ డెలివరీ బ్యాట్స్‌మెన్ కోణం నుండి చూస్తే వెనుకకు తిరుగుతుంది, సీమ్ ఎడాపెడా తిరుగుతుంది (ఆర్మ్ బాల్‌కూ దీనికీ తేడా ఇదే).
- క్యారమ్ బాల్ - ఒక ఆశ్చర్యకరమైన వైవిధ్యం. మధ్య వేలితో క్యారమ్‌లోని రెడ్‌ని కొట్టినట్లు వేస్తారు. అది లెగ్ నుండి ఆఫ్‌కి టర్నౌతుంది (లెగ్‌బ్రేక్).
ఆఫ్-స్పిన్
[మార్చు]సాంప్రదాయకంగా, ఫింగర్ స్పిన్నర్లు సైడ్ స్పిన్‌కు ప్రాధాన్యతనిస్తూ బౌలింగు చేస్తారు. మెరుగైన బ్యాటింగ్ పిచ్‌ల రాకతో టాప్ స్పిన్‌తో కూడిన బౌలింగ్‌పై దృష్టి పడింది. టాప్ స్పిన్ వలన బంతికి లూప్ చేకూరుతుంది. దీనివలన డెలివరీ లెంగ్తును ముందుగానే అంచనా వేయడం బ్యాటరుకు కష్టతరమౌతుంది. బంతి బ్యాటరు కళ్ళ ఎత్తు కంటే పైగా ప్రయాణిస్తూ వస్తుంది. బాల్‌కు ఇచ్చిన టాప్‌స్పిన్ వలన బంతి ముందుగానే డిప్ అయి, పైకి లేస్తుంది.
డెలివరీ లోని సైడ్ స్పిన్ వలన బెర్నౌలీ సూత్రం కారణంగా బంతి డ్రిఫ్ట్ అవుతుంది. స్టాక్, సైడ్ స్పిన్ లేదా అండర్ కట్టర్ లలో బంతి బ్యాట్స్‌మన్ నుండి దూరంగా వెళ్లేలా చేస్తుంది. డ్రిఫ్ట్, లూప్మ్ స్పిన్‌ల కలయికతో ఫింగర్ స్పిన్నరుకు దాడి చేసే సామర్థ్యం కలుగుతుంది.
దూస్రా
[మార్చు]దూస్రా (హిందీ, ఉర్దూ మాట) అనేది క్రికెట్ క్రీడలో ఆఫ్-స్పిన్ బౌలరు వేసే ఒక రకం డెలివరీ. దీనికి పాకిస్థానీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ ప్రచారం కల్పించాడు. [2] ఈ పదానికి అర్థం రెండోది అని. [3] సక్లైన్ ముష్తాక్ దూస్రా లో మరొక రకాన్ని కూడా కనుగొన్నాడు. దాన్ని అతను 'తీస్రా' అని అన్నాడు. అంటే మూడోది అని.
శ్రీలంక ముత్తయ్య మురళీధరన్, దక్షిణాఫ్రికా ఆటగాడు జోహన్ బోథా, భారతదేశానికి చెందిన హర్భజన్ సింగ్, పాకిస్థానీలు షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్‌లతో సహా ఇతర బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో దూస్రాను గణనీయంగా ఉపయోగించారు.
ఈ డెలివరీకి ఆ పేరు మాజీ పాకిస్తానీ వికెట్ కీపర్, మోయిన్ ఖాన్ పెట్టాడు. అతను స్టంప్స్ వెనుక నుండి "దూస్రా" (రెండోది) వేయమని ముస్తాక్‌ను అడిగేవాడు. ఈ మ్యాచ్‌లలో ఒకదానిలో వ్యాఖ్యాత అయిన టోనీ గ్రెయిగ్, ఆ డెలివరీకి ఈ పదాన్ని జతచేసి, మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో సక్లైన్‌తో ధృవీకరించాడు. [4] ఆ విధంగా ఈ పదం క్రికెట్ సంస్కృతిలో భాగమైంది. దూస్రా ఇప్పుడు ఆఫ్-స్పిన్నర్ల ఆయుధాల్లో ముఖ్యమైనది.
అయితే, దూస్రాకు నిజమైన మార్గదర్శకుడు 1950లలో వెస్టిండీస్ తరపున ఆడిన సోనీ రామధిన్ అని కొందరు భావిస్తున్నారు. అతను ఆఫ్-బ్రేక్ బౌలర్ లాగా బంతిని పట్టుకున్నప్పటికీ, బంతిని రెండు వైపులా కదిలించేవాడు. [5]
బౌలర్ సాధారణ ఆఫ్ బ్రేక్‌లో ఉండే ఫింగర్ యాక్షన్‌తోనే ఈ డెలివరీ కూడా వేస్తాడు, అయితే చేతి వెనుక భాగం బ్యాట్స్‌మన్‌కి ఎదురుగా ఉండేలా మణికట్టును ఒక కోణంలో బిగిస్తాడు. ఇది బంతిని ఆఫ్ బ్రేక్‌కు వ్యతిరేక దిశలో స్పిన్ చేస్తూ, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి లెగ్ సైడ్ నుండి ఆఫ్ సైడ్‌కి స్పిన్ చేస్తుంది.
దూస్రా అనేది లెగ్ స్పిన్నర్రు వేసే గూగ్లీకి సమానమైనది.
క్యారమ్ బాల్
[మార్చు]క్యారమ్ బాల్‌లో, బంతిని స్పిన్ చేసేందుకు బొటనవేలుకు, వంగిన మధ్య వేలికి మధ్య బంతిని విదిలిస్తూ, విడుదల చేస్తారు. ఈ డెలివరీ కనీసం 1940ల నాటిదని తెలిసినప్పటికీ, 2000ల చివరలో శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్ దీన్ని ప్రధాన స్రవంతి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి ప్రవేశపెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ క్యారమ్ బాల్‌కు మరింత ప్రాచుర్యం తెచ్చాడు.
టాప్ స్పిన్నర్
[మార్చు]టాప్-స్పిన్నర్ అనేది రిస్ట్ స్పిన్ లేదా ఫింగర్ స్పిన్ బౌలింగు చేసే క్రికెటరు వేసే ఒక రకమైన డెలివరీ. ఇద్దరూ కూడా బంతిని డెలివరీకి ముందు వేళ్లతో మెలితిప్పడం ద్వారా టాప్ స్పిన్‌తో వేస్తారు. రెండు సందర్భాల్లోనూ, టాప్ స్పిన్నర్ అనేది స్టాక్ డెలివరీకీ, రాంగ్ వన్‌కీ మధ్యలో ఉండే డెలివరీ ఇది. మణికట్టు స్పిన్నర్ విషయంలోనైతే రాంగ్ వన్ అనేది గూగ్లీ అవుతుంది, ఫింగర్ స్పిన్నర్ విషయంలో అది దూస్రా.
టాప్ స్పిన్నింగ్ క్రికెట్ బాల్ టెన్నిస్ లేదా టేబుల్ టెన్నిస్‌లో టాప్ స్పిన్ షాట్‌ల మాదిరిగానే ప్రవర్తిస్తుంది. ఫార్వర్డ్ స్పిన్నింగులో ఉన్న బంతి పైభాగంలో గాలి ప్రయాణించడాన్ని అడ్డుకుంటుంది, అడుగున మాత్రం ప్రయాణానికి సహకరిస్తుంది. బంతి పైన, కింద భాగాల్లో గాలి పీడనంలో ఏర్పడే వ్యత్యాసం (దీన్నే మాగ్నస్ ప్రభావంగా అంటారు) అధోముఖ శక్తిగా పనిచేసి, బంతి మామూలు కంటే ముందే, మామూలు కంటే వేగంగా పడిపోతుంది.
క్రికెట్ పరంగా దీనర్థం ఏంటంటే, బంతి షార్ట్ లెంగ్తులో పడిపోతుంది, వేగంగా పడిపోతుంది, బ్యాటరు ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్ అవుతుంది. ఈ లక్షణాలున్న బంతిని క్రికెట్ పరంగా "లూపింగ్" లేదా "లూపీ" డెలివరీ అని అంటారు. అలాగే, మణికట్టు స్పిన్ లేదా ఫింగర్ స్పిన్ స్టాక్ డెలివరీతో పోలిస్తే ఈ బంతి నేరుగా ప్రయాణిస్తుంది. ఈ బంతి బ్యాటరును సులభంగా బోల్తా కొట్టిస్తుంది. పైగా బౌలింగు యాక్షను కూడా స్టాక్ డెలివరీనే పోలి ఉంటుంది.
డెలివరీలో, టాప్ స్పిన్నరు బంతిని సాధారణ సైడ్ స్పిన్నర్ లాగానే పట్టుకుంటారు. లెగ్‌స్పిన్నర్ వేసేప్పుడు చేతి వెనుక భాగం కవర్ ప్రాంతాన్ని చూస్తూంటుంది. విడుదల సమయంలో అరచేయి మిడ్ వికెట్ ప్రాంతాన్ని చూస్తూంటుంది. ఆఫ్‌స్పిన్నర్ విషయంలో ఈ దిశలు తారుమారవుతాయి. అప్పుడు బంతిని నేరుగా బ్యాట్స్‌మన్‌ను చూస్తూండే సీమ్‌తో గానీ, ఎడాపెడా కొట్టుకుంటూ వెళ్ళే సీమ్‌తో గానీ విడుదల చేస్తారు. స్పిన్నర్లు తరచుగా టాప్ స్పిన్, సైడ్ స్పిన్ రెండింటితోటీ బౌలింగు చేస్తూంటారు. రెండింటినీ దాదాపుగా సమాన మొత్తంలో ప్రదర్శించే బంతిని సాధారణంగా "ఓవర్‌స్పిన్నింగ్" లెగ్ బ్రేక్ లేదా ఆఫ్ బ్రేక్ అంటారు.
వ్యూహాత్మకంగా, బౌలర్లు టాప్ స్పిన్నర్‌లను వేసి బ్యాట్స్‌మన్‌ను ముందుకు రప్పించేందుకు డిప్, అదనపు బౌన్స్‌లను ఉపయోగించి వారిని మోసం చేస్తారు. ముఖ్యంగా, స్వీప్ లేదా డ్రైవ్ చేయాలని చూసే బ్యాటర్లను బౌన్స్ బోల్తాకొట్టిస్తుంది కాబట్టి వాళ్ళు త్వరగా చిక్కే అవకాశం ఉంది. ఫింగర్ స్పిన్నింగ్ రంగంలో ఇది అత్యుత్తమ స్పిన్నింగ్ వ్యూహాలలో ఒకటి.
అండర్ కట్టర్
[మార్చు]అండర్ కట్టర్ అనేది ఫింగర్ స్పిన్ బౌలర్ వేసే మరొక రకం డెలివరీ. బంతిని విడుదల చేసే సమయంలో అరచేయి ఆకాశాన్ని చూస్తూ ఉండేలా చేతిని వంచి, బంతిని వేస్తారు. బంతిని క్షితిజ సమాంతర సైడ్ స్పిన్‌తో విడుదల చేస్తారు. స్పిన్‌లో ఈ ప్రత్యేకమైన కోణం స్టాక్ డెలివరీలో వచ్చే డ్రిఫ్ట్ మాదిరిగానే ఇందులో కూడా, మాగ్నస్ ఫోర్స్ వలన బంతి పక్కలకు పోతుంది. అయితే బంతి టర్నవడానికి బదులుగా దాని మార్గంలోనే ముందుకు పోతుంది.
బ్యాక్ స్పిన్నర్, లేదా తీస్రా
[మార్చు]ఫింగర్ స్పిన్నర్లు బౌలింగు చేసే ఒక సాధారణ వైవిధ్యం బ్యాక్‌స్పిన్నర్. దీన్ని తీస్రా అంటారు. ఈ బాల్ సాధారణంగా ఆర్థడాక్స్ ఆఫ్-స్పిన్ డెలివరీ కంటే కొంచెం వేగంగా వేస్తారు. విడుదల సమయంలో చేతివేళ్లు బంతిని సైడ్‌కి బదులు వెనుకకు తిప్పుతాయి. బ్యాక్‌స్పిన్ వలన బంతి ఫ్లైటును అంచనా వేయడం కష్టతరమౌతుంది, బంతి తక్కువ ఎత్తులో ఉండేలా చేస్తుంది. ఈ డెలివరీ మణికట్టు స్పిన్నర్ వేసే స్లయిడర్‌తో బాగా సారూప్యంగా ఉంటుంది.
తీస్రా అనేది ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ వలన ఇటీవల ప్రచారం లోకి వచ్చిన డెలివరీ. అయితే నిశితంగా పరిశీలిస్తే, ఇది మామూలు బ్యాక్‌స్పిన్నరేనని తెలుస్తుంది. అనూచానంగా ఫింగర్ స్పిన్నర్లు వేస్తూ వస్తున్న చాలా సాధారణ డెలివరీ ఇది.[6]
ఈ డెలివరీకి సక్లైన్ ముస్తాక్ ఇండియన్ క్రికెట్ లీగ్‌లో పేరు మార్చాడు. ఆ సమయంలో సక్లైన్ లాహోర్ బాద్షాస్ తరపున ఆడాడు. తీస్రా లేదా జలేబీని ఎదుర్కొన్న మొదటి వ్యక్తి శ్రీలంకకు చెందిన రస్సెల్ ఆర్నాల్డ్. అంపైర్ అతనికి LBW ఔటిచ్చాడు. తీస్రాతో ఔటైన మొదటి వ్యక్తి కూడా అతనే. అతనౌ ఔటైన బంతి చరిత్రలో వేసిన నాలుగో తీస్రా బంతి.[7]
ఈ డెలివరీ లెగ్-స్పిన్నర్ వేసే స్లైడర్ లాగా పనిచేస్తుంది. డెలివరీ వేసేటపుడు ఆఫ్-స్పిన్నర్ బౌలింగు యాక్షను మామూలుగానే ఉంటుంది. కానీ డెలివరీ సమయంలో బౌలరు, చేతిని మెలితిప్పకుండా, బంతి వెనుక వేళ్ళతో తిప్పుతాడు. డెలివరీ బాగా టర్నవుతుందేమో అన్నట్లు కనిపిస్తుంది గానీ, అస్సలు టర్నవదు. బ్యాటరు కన్నుగప్పడానికి ఇది మంచి మార్గం. [8]
ఆర్మ్ బాల్
[మార్చు]ఆర్మ్ బాల్ అనేది క్రికెట్‌లో ఒక రకమైన డెలివరీ. ఇది ఆఫ్ స్పిన్ బౌలర్ లేదా స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలరు వేసే వైవిధ్యమైన డెలివరీ. ఇది ఆర్థడాక్స్ బ్యాక్‌స్పిన్నర్‌కు సంబంధించినది.
స్టాక్ డెలివరీ లాగా కాకుండా, బంతికి పక్కన వేళ్లను దొర్లించకుండా విడుదల చేస్తారు. దీనర్థం బంతికి బ్యాక్‌స్పిన్ ఉంటుంది గానీ, పిచ్‌పై పడి లేచాక పెద్దగా టర్నవకుండా, నేరుగా చేయి కదిలిన దిశలో ప్రయాణిస్తుంది. అందుకే దీనికి ఆర్మ్ బాల్ అనే పేరు వచ్చింది. అయితే, సీమ్‌ను నిటారుగా ఉంచడం ద్వారా, బౌలర్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నుండి దూరంగా పోయేలా ఔట్‌స్వింగ్‌ను పొందే ప్రయత్నం కూడా చేస్తాడు. తద్వారా బంతి మలుపు తిరుగుతుందని ఆశించే బ్యాట్స్‌మన్‌ను గందరగోళానికి గురిచేస్తాడు. ఆర్థడాక్స్ బ్యాక్‌స్పిన్నర్‌తో పోల్చితే, ఆర్మ్ బాల్ తక్కువ మోసపూరితంగా ఉంటుంది. పైగా నిలువుగా ఉండే సీమ్ కారణంగా దీన్ని గుర్తించడం కూడా సులభం. అయితే దీనికి అదనపు స్వింగ్ ఉండడం వలన ఆ లోపాన్ని అధిగమిస్తుంది.
బంతిని గణనీయంగా తిప్పుతున్న స్పిన్నరు, ఆర్మ్ బాల్‌ను ఆశ్చర్యకరమైన వైవిధ్యంగా ఉపయోగించడం ఉత్తమం. స్పిన్ అవుతుంది గదా అని చూసే పెద్దగా నైపుణ్యం లేని బ్యాట్స్‌మన్‌ను ఆశ్చర్యానికి గురిచేసి బౌల్డ్ లేదా ఎల్‌బీడబ్ల్యూ లేదా వికెట్ కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్‌లకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశం ఉంది. సనత్ జయసూర్య, రవీంద్ర జడేజా, సక్లైన్ ముస్తాక్, డేనియల్ వెట్టోరి, మహ్మద్ రఫీక్ ఆర్మ్ బాల్‌ను బాగా ఉపయోగించారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Iverson Gleeson method www.youtube.com. Retrieved 3 March 2011.
- ↑ Saqlain signs for Ireland: Cricinfo.com. Retrieved 26 April 2007.
- ↑ Doosra may be the difference – Cricket – Sport – theage.com.au
- ↑ Moin Khan coined the term Archived 7 జూన్ 2011 at the Wayback Machine
- ↑ Sonny Ramadhin introduced doosra Archived 18 జూలై 2011 at the Wayback Machine
- ↑ Brian Wilkins, "The Bowler's Art"
- ↑ Arnold adjudged Plumb to miraculous Teesra by Saqi
- ↑ The Jalebi expalained