విన్నకోట రామన్న పంతులు
విన్నకోట రామన్న పంతులు | |
---|---|
జననం | విన్నకోట రామన్న పంతులు 1920 ఏప్రిల్ 13 |
మరణం | 1982 డిసెంబరు 19 | (వయసు 62)
వృత్తి | నటుడు, దర్శకుడు, న్యాయవాది |
పిల్లలు | విన్నకోట విజయరాం |
తల్లిదండ్రులు |
|
విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1920, ఏప్రిల్ 13న విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ హైస్కూలు, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కాలేజి, విజయనగరంలోని మహారాణి కాలేజి, పూనాలోని లా కాలేజీలలో గడిచింది. ఇతడు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత, వృత్తిరీత్యా న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తూనే మరోప్రక్క నటుడిగా నాటకాల్లో పాత్రలు ధరిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డాడు. ఇతడు నటనకు, ఆహార్యానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటి మీద నటశిక్షణ, రూపశిల్పం, నాటక ప్రయోగం, రంగస్థల శాస్త్రం, వాచికాభినయం, మేకప్, మూకాభినయం, రససిద్ధాంతం, అంగికాభినయం,లైటింగ్, రంగస్థల నిర్మాణం, సాత్వికాభినయం మొదలైన పుస్తకాలు కూడా రచించాడు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రేక్షక సంఘం నటరాజ కళామండలిని స్థాపించాడు. నాట్య సంఘం కార్యదర్శిగా, రాఘవకళా కేంద్రం కార్యదర్శిగా సేవలను అందించాడు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ మొదలైన వారికి నటనలో శిక్షణను ఇచ్చాడు. తెలుగు రంగస్థల, సినిమా నటుడు విన్నకోట విజయరాం ఇతని కుమారుడు. టెలివిజన్ నటుడు, సినిమా నటుడు ప్రదీప్ ఇతని మనుమడు[1].
నాటకరంగం
[మార్చు]ఇతడు 1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవాడు. ఇందులో అగ్నిహోత్రావధాన్లు పాత్రను రామన్నపంతులు గొప్పగా పోషించేవాడు. రాఘవ కళాకేంద్రం ప్రదర్శించిన విశ్వం పెళ్ళి, ఇనుప తెరలు మొదలైన నాటకాల్లో రామన్నపంతులు విలక్షణమైన పాత్రలను ధరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తరువాత డి.వి.నరసరాజు రచించిన "నాటకం" అనే నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి తన కీర్తిని పెంచుకున్నాడు. ఈ నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో రచన, ప్రదర్శనలకు బహుమతులు లభించాయి. ఇవే కాకుండా వరవిక్రయం, పెద్దమనుషులు, ఈనాడు, ఆసామి, శ్రీరంగనీతులు మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించాడు. రామన్నపంతులు ఉత్తమ దర్శకుడిగా అనేక నాటకాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో ఎన్.జి.వో., నాటకం, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు ముఖ్యమైనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి మరణించేవరకూ అనేక నాటకాలలో పాత్రపోషణ చేసేవాడు. సీతాపతి సంసారం ధారావాహిక నాటకంలో సీతాపతి పాత్ర ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది.
సినిమా రంగం
[మార్చు]ఇతడు తెలుగు సినీరంగంలో ప్రవేశించి బి.యన్.రెడ్డి గారి బంగారు పాప (1954) చిత్రంలో మొదటిసారిగా జమిందారు పాత్రను పోషించాడు. తర్వాత వినోదా సంస్థ నిర్మించిన కన్యాశుల్కం (1955) చిత్రంలో కూడా అగ్నిహోత్రావధాన్లు పాత్రను పోషించి తన నటనకు ప్రశంసలందుకున్నాడు. బాపూరమణలు ఇతడిని పిలిచి తమ తొలిచిత్రం సాక్షి (1967) లో తడిగుడ్డతో గొంతులు కోసే ప్రతినాయకుడు మునసబు పాత్రను ధరింపజేశారు.
ప్రముఖ హాస్యరస చక్రవర్తి జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా ఇతని నాటకాల కంపెనీలో నటించాడు.[2] జంధ్యాల సినీ దర్శకునిగా మారిన పిదప తన తొలిచిత్రం ముద్ద మందారం (1981) లో కథకు కీలకమైన పాత్రను పంతులు చేత వేయించాడు.
చిత్రసమాహారం
[మార్చు]- బంగారు పాప (1954) - జమీందారు
- కన్యాశుల్కం (1955) - అగ్నిహోత్రావధాన్లు
- దొంగరాముడు (1955)
- వరుడు కావాలి (1957)
- బాటసారి (1961) - జమీందారు
- శ్రీకృష్ణ కుచేల (1961)
- చదువుకున్న అమ్మాయిలు (1963)
- రామదాసు (1964)
- ఇల్లాలు (1965)
- శ్రీమతి (1966)
- సాక్షి (1967) - మునసబు
- బంగారు పిచిక (1968) - సన్యాసిరాజు
- స్నేహం (1977)
- ముద్ద మందారం (1981)
- మల్లెపందిరి (1982)
- ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
మరణం
[మార్చు]ఇతడు 1982, డిసెంబర్ 19న మరణించాడు[1].
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 పెనుగొండ లక్ష్మీనారాయణ, వల్లూరి శివప్రసాద్, గంగోత్రి సాయి (2011). రూపిక నాటకరంగ విశేష సంచిక (1 ed.). తాడేపల్లి: అరవింద ఆర్ట్స్. p. 130. Retrieved 8 November 2018.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link] - ↑ "End of a comedy era by M.L.Narasimham in The Hindu, June 29, 2001". Archived from the original on 2007-11-11. Retrieved 2011-08-26.
- విన్నకోట రామన్న పంతులు, నటరత్నాలు, ద్వితీయ ముద్రణ, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, సీతారత్నం గ్రంథమాల, విజయవాడ, 2002, పేజీలు: 660-61.
- రామన్నపంతులు, కారెక్టర్ ఆర్టిస్టులు, యస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీలు: 60-1.