రెండుజెళ్ళ సీత

వికీపీడియా నుండి
(రెండుజెళ్ళసీత నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రెండు జెళ్ళ సీత
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం నరేష్,
పూర్ణిమ,
ప్రదీప్,
రాజేష్,
మహలక్ష్మి,
దేవి,
ఫుష్పలత,
అల్లు రామలింగయ్య,
శ్రీలక్ష్మి,
శుభలేఖ సుధాకర్ ,
సుత్తివేలు,
సుత్తి వీరభద్రరావు,
రాళ్లపల్లి,
సాక్షి రంగారావు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ శ్రీ భ్రమరాంభిక ఫిల్మిస్
విడుదల తేదీ మే, 1983
భాష తెలుగు

రెండు జెళ్ళ సీత జంధ్యాల దర్శకత్వంలో నరేష్[1], ప్రదీప్, రాజేష్, శుభాకర్ కథానాయకులుగా, మహాలక్ష్మి కథానాయికగా టైటిల్ పాత్రలో నటించగా 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బరువైన కథాంశాన్ని, హాస్యభరితమైన అంశాలకు జతచేసి జంధ్యాల రూపొందించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన రెండు జెళ్ళ సీత అనే పాత్రను జంధ్యాల టైటిల్ గానూ, హీరోయిన్ కి ముద్దుపేరుగానూ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు.

ఇతివృత్తం

[మార్చు]

గోపి (విజయ నరేష్), కృష్ణ (ప్రదీప్), మోహన్ (రాజేష్), మూర్తి (శుభాకర్) నలుగురూ ఒకే కాలేజీలో, ఒకే రూములో, ఒకే మాటగా ఉండే స్నేహితులు. వీళ్ళ ఇళ్ళ ప్రాంగణంలోనే కొత్తగా సీత (మహాలక్ష్మి) అనే అందమైన అమ్మాయి తన కుటుంబంతో అద్దెకు దిగుతుంది. అక్కడి వరకూ ఒకే మాటగా సాగిన నలుగురి మధ్యా పోటీ మొదలవుతుంది. ఇది ముదిరి ఒకే రౌడీ చేతికి డబ్బిచ్చి నలుగురూ దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. దాంతో రాజీపడి సీత దగ్గరకి వెళ్ళి తమలో ఎవరిని ప్రేమిస్తున్నావని అడుగుతారు. దాంతో సీత వీళ్ళకి తన గతాన్ని చెప్తుంది.
మధు, సీత ప్రేమించుకుంటారు. మధు (కమలాకర్) తండ్రి గండభేరుండం (అల్లు రామలింగయ్య) వీళ్ళ పెళ్ళికి రూ.2 లక్షల కట్నం అడుగుతాడు. స్కూలు మాస్టారైన సూర్యనారాయణ (సాక్షి రంగారావు) అన్నిటికీ ఒప్పుకుంటాడు. పెళ్ళికి అంతా సిద్ధమైనప్పుడు లేనిపోని సాక్ష్యాలు కల్పించి, సీత మీద నిందమోపి ఆమె పెళ్ళిని రద్దుచేయిస్తాడు గండభేరుండం. ఆమె గతం విని కరిగిపోయిన నలుగురు స్నేహితులూ ఆమె పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకుంటారు. విజయనగరం వెళ్ళి గండభేరుండం కూతురు కాత్యాయని (దేవి), కామేశ్వరరావు (శుభలేఖ సుధాకర్) అనే కుర్రాడితో ప్రేమలో పడేలా చేస్తారు. మధు, సీతలను విడదీయడానికి ఫోటోలో తలలు మార్చి దొంగ సాక్ష్యాలను గండభేరుండం సృష్టించినట్టే కాత్యాయనిపైనా వీళ్ళు నలుగురూ నిందమోపుతారు. దాంతో గండభేరుండం తాను చేసిన తప్పుఒప్పుకుంటాడు. నలుగురు కుర్రాళ్ళూ మధు, సీతలను కలుపుతారు.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

శంకరాభరణం విడుదలయ్యాకా ఆ సినిమాకి రచయితగా పనిచేసిన జంధ్యాలతో మేకప్ మేన్ గా సినీ జీవితం ప్రారంభించి, నిర్మాతగా మారిన జయకృష్ణతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆపైన వాళ్ళిద్దరూ తరచుగా కలుసుకునేవారు, జంధ్యాల దర్శకుడు అయ్యాకా ఆయన సెట్స్ కు జయకృష్ణ తరచుగా వెళ్తూండేవారు. ఆ క్రమంలో జంధ్యాల ఆయనకి తాను తీయదలుచుకున్న రెండు జెళ్ళ సీత సినిమా కథాంశాన్ని చెప్పారు. పంపిణీదారులైన కేశవవరావు సినిమా నిర్మాణంపై ఆసక్తిని తనకు సన్నిహితులైన జయకృష్ణకు చెప్పి తోడుగా ఉండమనీ, సినిమా తీద్దామని చెప్పారు. దాంతో జంధ్యాల చెప్పిన కథాంశాన్ని వారికి చెప్పారు. నిర్మాతకి కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభమైంది.[2]

నటీనటుల ఎంపిక

[మార్చు]
నటుడు పాత్ర
నరేష్ ... గోపి
రాజేష్ ... మోహన్
ప్రదీప్ ... కృష్ణ
శుభాకర్ ... మూర్తి
మహాలక్ష్మి ... సీత
అల్లు రామలింగయ్య ... గండభేరుండం
కమలాకర్ ... మధు
శుభలేఖ సుధాకర్ ... కామేశ్వరరావు
సాక్షి రంగారావు ... సూర్యనారాయణ
సుత్తివేలు ... సుబ్బారావు
శ్రీలక్ష్మి ... అనసూయ
సుత్తి వీరభద్రరావు ... రిటైర్డ్ మేజర్ మంగపతి
పొట్టి ప్రసాద్ ... ఎ.ఎ.రావు
దేవి ... కాత్యాయని
పుష్పలత ... సీత తల్లి
రాళ్ళపల్లి ... అప్పలకొండ
కృష్ణచైతన్య ... రసశ్రీ
మాస్టర్ చక్రవర్తి ... డుంబు
టెలిఫోన్ సత్యనారాయణ ... సేఠ్ జీ

సినిమాలో నలుగురు హీరోలుగా నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్ నటించారు. అప్పటికే మూణ్ణాలుగు సినిమాలు చేసిన ప్రదీప్ కి ఇదే చివరి సినిమా. ఆపైన ఆయన చదువుపై శ్రద్ధపెట్టి, తర్వాత సీరియళ్ళలో నటించారు. మరో కథానాయకుడుగా అప్పటికే జంధ్యాల నెలవంక సినిమాలో హీరోగా పనిచేసినవారు, ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ నటించారు. పుష్పలత (రాము సినిమా ఫేం) కూతురు మహాలక్ష్మిని ఈ సినిమాలో కథానాయికగా ఎంపికచేశారు. అయితే కథానాయిక పాత్రకు నిర్వహించిన ఆడిషన్సుకు వచ్చి వెనుదిరిగిన వారిలో విజయశాంతి, భానుప్రియ, శోభన కూడా ఉన్నారు. హాస్యనటిగా సుప్రసిద్ధి పొందిన శ్రీలక్ష్మి ఈ సినిమాలో తొలిగా జంధ్యాల చిత్రానికి పనిచేశారు. అప్పటికే కొన్ని హీరోయిన్ పాత్రల్లో నటించిన శ్రీలక్ష్మికి ఈ సినిమాలో ఓ అతిథిపాత్రను ఆఫర్ చేశారు. ఈ సినిమాలోనే హీరోగా పనిచేస్తున్న ఆమె తమ్ముడు రాజేష్ హీరోయిన్ గా కనిపించిన సమయంలో ఇలాంటి అతిథిపాత్రలు వేయడం సరికాదని ఆమెని వారించారు. అయితే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే విధానంలో ఈ సినిమాకి అంగీకరించారు. అయితే క్రమంగా ఆ చిన్నపాత్రని పూర్తిస్థాయి హాస్యపాత్రగా జంధ్యాల మలిచారు. ఈ సినిమాతో హాస్యనటిగా ఆమె కెరీర్ గాడిలో పడింది.
సుత్తి వీరభద్రరావు రిటైర్డ్ మేజర్ అయిన మంగపతి పాత్ర చేశారు. మంగపతి జారుడు బండ మీద నుంచి జారడం, సీ-సా ఆడడం వంటివి చేసి నవ్విస్తాడు. నేను రెండుసార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాను తెలుసా అంటూ పాత్ర ముగించేప్పుడు కూడా నవ్విస్తారు. నాలుగు స్తంభాలాట సినిమాలో చేసిన సుత్తి పాత్రను గుర్తుకుతెస్తూ పాత్ర ప్రారంభించడమే సుత్తి కొడుతూ కనిపిస్తుంది. అల్లు రామలింగయ్య గండభేరుండం అనే పాత్రను పోషించారు. ఆయనకు ఉత్తర భారతదేశమన్నా, హిందీ భాష అన్నా చాలా ఇష్టం. వచ్చీరాని హిందీ మాట్లాడి హాస్యం సృష్టిస్తుంది ఆ పాత్ర.[2]

చిత్రీకరణ

[మార్చు]

సినిమా చిత్రీకరణ ప్రధానంగా విశాఖపట్టణం, అరకులోయ, విజయనగరం మొదలైన ప్రదేశాల్లో జరిగింది. విశాఖపట్టణంలోని కనకమహాలక్ష్మి ఆలయంలో సినిమా షూటింగ్ 1982 అక్టోబరు 4న ప్రారంభమైంది. సినిమా నిర్మాణానికి రూ.13 లక్షల 75 వేలు ఖర్చు కాగా 45 రోజుల పాటు నిర్మాణం జరిగింది. విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్ ఎదురుగా ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని అదే బిల్డింగ్ కథానాయకుల నివాసంగానూ, తర్వాత కథానాయిక సీత కుటుంబం అద్దెకు దిగే పోర్షన్ ఉన్న భవంతిగానూ చిత్రీకరించారు.[2]

సంగీతం

[మార్చు]

సినిమాకు రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో ఐదుపాటలు వేటూరి, "పురుషులలో పుణ్యపురుషులు వేరు" అన్న పాటను ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాశారు. "కొబ్బరి నీళ్ళ జలకాలాడి" పాట హాస్యంపరంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో "మాగాయే మహాపచ్చడి - పెరుగేస్తే మహత్తరి - అది వేస్తే అడ్డవిస్తరి - మానిన్యా మహాసుందరి" అంటూ రాసిన ఊరగాయపద్యాన్ని వేటూరి "శ్రీకాకుళే మహాక్షేత్రే, గుండేరే మహానదీ.." అంటూ సాగే శ్లోకం వరుసలో రాశానని చెప్పారు.[2]

థీమ్స్, ప్రభావాలు

[మార్చు]

ముళ్ళపూడి వెంకటరమణ రాసిన బుడుగు పుస్తకంలో ఆయన బుడుగు పాత్రతో రెండు జెళ్ళ సీత అన్న పదాన్ని కాయిన్ చేశారు. అందంగా, కాస్త అమాయకంగా కనిపించే అమ్మాయిల్ని అబ్బాయిలు రెండు జెళ్ళ సీత అన్న పేరుతో పిలిచేవారు. దాంతో ఈ సినిమాకు రెండు జెళ్ళ సీత అన్న పేరుపెట్టారు. విశాఖపట్టణంలోని ఓ ఆటోడ్రైవర్ బాపు రమణల పేర్లు ఆటో వెనుక రాసుకున్నారు. అది యూనిట్లోని వారు చూసి, జంధ్యాలకు చెప్పడంతో ఆ ఆటోని రప్పించి హీరోయిన్ సీత సినిమాలో మొట్టమొదట ఆ ఆటోలోంచే దిగినట్టు చిత్రీకరించారు. బాపు-రమణల రెండు జెళ్ళ సీతేనని అన్నట్టు కవితాత్మకత ఈ షాట్ ద్వారా వ్యక్తపరిచారు.
సినిమాలో కథాంశం వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ అల్లుకున్నది. సినిమా క్లైమాక్సులో పురుషులలో పుణ్యపురుషులు వేరు అంటూ ఓ పాటను కూడా వరకట్నానికి వ్యతిరేకంగా చిత్రీకరించారు. "కృష్ణ, గోదావరుల్లో ప్రవహించేది నీరు కాదు.. కన్నీరు. కట్నం ఇచ్చుకోలేని కన్నెపిల్లల కన్నీరు" అంటూ జంధ్యాల రాసిన డైలాగ్ వరకట్నం ఎంతటి సాంఘిక దురాచారమో తెలుపుతుంది.[2]

పాటల జాబితా

[మార్చు]

1.పురుషులలో పుణ్య పురుషులు వేరు , రచన: ఇంద్రగంటి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం

2.కొబ్బరి నీళ్ల జలకాలాడి కోనసీమ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

3 .మందారంలో ఘుమ ఘుమలై మకరందంలో, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండీతారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

4.రెండు జెళ్ళ సీత తీపి గుండెకోత , రచన: వేటూరి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

5.లేడి వేట ఇది లేడీ వేట వేడి వేడిగా , రచన: వేటూరి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ప్రకాశరావు, కృష్ణమూర్తి.

6.సరి సరి పద పదని నీసరి ఎవరు , రచన: వేటూరి, గానం.ఎస్.జానకి బృందం.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 పులగం, చిన్నారాయణ (April 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.

. 3.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.