Jump to content

సిక్కిం చరిత్ర

వికీపీడియా నుండి
గురు రింపోచే విగ్రహం

సిక్కిం చరిత్ర స్థానికంగా ఉండే లెప్చాలకు తొలికాలపు టిబెటు వలసదారుల పరిచయంతో ప్రారంభమవుతుంది.[1][2] చారిత్రికంగా, తూర్పు హిమాలయాలలో సిక్కిం ఒక సార్వభౌమ రాజ్యం. తరువాత భారతదేశపు రక్షిత ప్రాంతంగా ఉండి, ఆపై భారతదేశంలో విలీనమై, భారతదేశంలో ఒక రాష్ట్రంగా అధికారిక గుర్తింపు పొందింది. లెప్చాలు ఇక్కడీ ప్రధాన నివాసులు. 1641 వరకు వారు ఈ భూమిని పాలించారు. లెప్చాలను సాధారణంగా ఇక్కడి తొలి నివాసులుగా పరిగణిస్తారు

17వ శతాబ్దంలో చోగ్యాల్ ఆధ్వర్యంలో బౌద్ధ రాజ్యం పాలన తర్వాత, సిక్కింలో బ్రిటిషు పాలన వచ్చింది. ఆ తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో అధికారికంగా ఒక రాష్ట్రంగా చేరింది. సిక్కింలో టిబెట్, భూటాన్‌ల నుండి చొరబాట్లు జరిగిన నేపథ్యంలో అది ఒక స్వపరిపాలక రాజ్యంగా ఉద్భవించింది. ఈ సమయంలో రాజ్యం వివిధ స్థాయిలలో స్వాతంత్ర్యం పొందింది. 18వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిషు సామ్రాజ్యం టిబెట్‌తో వాణిజ్య మార్గాలను స్థాపించుకోవాలని భావించి, సిక్కింను తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకుంది. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చే వరకు ఇది కొనసాగింది. సిక్కిం 1975లో భారత్‌లో విలీనమయ్యే వరకు స్వతంత్ర దేశంగానే కొనసాగింది. సిక్కిం, భారతదేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలను మార్చవలసి వచ్చింది.

సిక్కిం రాజ్యం

[మార్చు]
సిక్కిం మ్యాప్ ( సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, 1981)

1641 నాటికి లెప్చాలు, లింబులు, మగార్లు వేర్వేరు గ్రామాలలో స్వతంత్రంగా పాలించేవారు.[3] లింబు, మగార్ తెగలు మారుమూల పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో నివసించారు.[4] 17వ శతాబ్దం ప్రారంభంలో టిబెట్ వలసదారులు (స్థానికంగా "భూటియాలు" అంటారు) టిబెట్‌లోని పసుపు టోపీ, ఎరుపు టోపీల అనుచరుల మధ్య ఘర్షణల కారణంగా సిక్కింలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. భూటియాలు ప్రకృతిని ఆరాధించే సిక్కిమీయులను బౌద్ధమతంలోకి మార్చడానికి ప్రయత్నించి, కొంతవరకు విజయం సాధించారు.[5] టిబెట్ లామాలు సిక్కింను బౌద్ధ రాజ్యంగా స్థాపించే ప్రయత్నంలో టిబెట్ మూలానికి చెందిన లోపాను రాజుగా ఎన్నుకున్నారు.[3]

1642 లో, ఉత్తర, పశ్చిమ, దక్షిణాల నుండి పశ్చిమ సిక్కిం లోకి ప్రవేశించిన ముగ్గురు గొప్ప లామాలు - లాట్‌సున్ చెన్‌పో, న్గా-డాగ్ లామా, కత్‌హోగ్ లామాలు - గురు తాషికి చెందిన ఐదవ తరం వారసుడైన ఫంట్‌సోగ్ నమ్‌గ్యాల్‌ను సిక్కింకు మొదటి డెంజోంగ్ గ్యాల్పో లేదా చోగ్యాల్ (రాజు) గా అభిషేకించారు.[6][7] నల్జోర్ చెజి అనే ఈ సంఘటన ఎనిమిది వందల సంవత్సరాల క్రితం గురు రింపోచే ఊహించినట్లుగా జరిగింది. దలైలామా కొత్త చోగ్యాల్‌కు పట్టాభిషేకం కానుకగా ఒక పట్టు కండువా, గురు రింపోచేకు చెందిన మిట్రేను, అతని ఇసుక చిత్రాన్ని పంపాడు.[6] అయితే, చోగ్యాల్ పాలనను లింబు, మగర్ నాయకులు తిరస్కరించారు. వారిని లొంగదీసుకోవడానికి టిబెట్ సైనికులను తీసుకురావాల్సి వచ్చింది.[3]

ముగ్గురు సద్గురువుల ఈ చారిత్రిక సమావేశాన్ని యుక్సోమ్ అని పిలుస్తారు. లెప్చా భాషలో దీనికి 'ముగ్గురు సన్యాసులు కలిసిన ప్రదేశం' అని అర్థం. లెప్చాలో లామాను "యుక్మున్" అని పిలుస్తారు. ముగ్గురికి "సోమ్" అనే పదం. చోగ్యాల్, ముగ్గురు లామాలతో కలిసి లెప్చా తెగలను బౌద్ధమతంలోకి మార్చాడు. చుంబీ లోయ, ప్రస్తుత డార్జిలింగ్ జిల్లా, నేటి తూర్పు నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలను కలుపుకున్నారు.

అతని పట్టాభిషేకం తర్వాత కొద్దికాలానికే కొత్త చోగ్యాల్ భూటియా లకు చెందిన 12 మందిని కలోన్ లేదా మంత్రులుగా నియమించాడు. అతని రాజ్యాన్ని 12 జాంగ్‌లు లేదా పరిపాలనా విభాగాలుగా విభజించాడు. వీటిలో ప్రతి దానికీ ఒక కోట ఉంది. ప్రతీ జొంగాకు ఒక లెప్చా వ్యక్తి నాయకత్వం వహించాడు. సిక్కిం భూములను కాజీలు, తికాదార్లకు బహుమతులుగా లీజుకు ఇచ్చారు. వారు అధిక కౌలుకు రైతులకు ఉప లీజుకు ఇచ్చారు. మండల్‌లు (పెద్దలు), కర్బరీలు (మండలాలకు సహాయకులు) కాజీలు, తికాదార్లు అద్దె వసూలు చేసేవారు. వివాదాల్లో మధ్యవర్తులుగా ఉండేవారు. సిక్కింలోని 104 రెవెన్యూ ఎస్టేట్లలో, 61 ఎస్టేట్లను స్థిర మొత్తాలకు కాజీలు, తికాదార్లకు లీజుకు ఇచ్చారు. ఐదింటిని మఠాలకు ఇవ్వగా, పదిహేనింటిని చోగ్యాల్ తన ప్రైవేట్ ఉపయోగం కోసం ఉంచుకున్నాడు.[8][9] లింబు అధిపతులు లేదా సుబ్బాస్‌కు కూడా రాజు ఆధ్వర్యంలో వారి జిల్లాలపై పూర్తి స్వయంప్రతిపత్తి ఇచ్చారు.[3]

ఆ విధంగా ఫంత్‌సోగ్ నామ్‌గ్యాల్ సిక్కిం రాజ్యానికి మొదటి రాజు అయ్యాడు, కిరాత్ ముఖ్యులందరూ అతన్ని అత్యున్నత పాలకుడిగా పరిగణించడానికి అంగీకరించారు. అయితే, మగార్లు మాత్రం భూటియాలతో కలిసిపోలేదు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు సిక్కింను విడిచిపెట్టారు. రాజు కిరాత్ ముఖ్యులందరినీ పిలిచి, భూటియాలు లేదా లోప్సాలు, త్సాంగ్‌లు లేదా లింబులు, మెంపాలు లేదా లెప్చాలు అందరూ లో-మెహ్న్-త్సాంగ్ అనే ఒకే కుటుంబంలో భాగమనీ, రాజు తండ్రిగా, లెప్చాలను తల్లిగా, లింబులు కుమారుల వంటివారుగా ప్రకటించాడు. వారు తమలో తాము పోరాడుకోవడాన్ని నిషేధించాడు.[3] లో-మెహన్-త్సోంగ్ త్సుమ్ చేసిన ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు ఎనిమిది మంది భూటియా గిరిజన నాయకులు, పన్నెండు మంది లింబు గిరిజన నాయకులు, ప్రస్తుత పశ్చిమ సిక్కింలో నలుగురు లెప్చా గిరిజన నాయకుల ఆధ్వర్యంలో జరిగాయి.

భూటాన్, నేపాల్ ల దండయాత్రలు

[మార్చు]

1670లో ఫుంట్‌సోగ్ నామ్‌గ్యాల్ తర్వాత అతని కుమారుడు టెన్సుంగ్ నమ్‌గ్యాల్ వచ్చాడు. ఈ చోగ్యాల్ పాలన శాంతియుతంగా ఉంది, రాజధాని యుక్సోమ్ నుండి రాబ్దేన్సేకి మారింది. 1700 లో రాజు రెండవ భార్య కుమారుడు చక్‌దోర్ నామ్‌గ్యాల్ అతని నుండి సింహాసనాన్ని స్వీకరించాడు. ఇది అతని సవతి అక్క పెండియోంగ్ముకు కోపం తెప్పించింది. ఆమె భూటానీస్ సహాయంతో అతనిని తొలగించింది. 1700 నుండి 1706 వరకు, చక్‌దోర్ నామ్‌గ్యాల్ మైనర్‌గా ఉండగా, దానిలోని చాలా భాగాలను భూటాన్ రాజు దేబ్ నాకు జిదార్ ఆక్రమించాడు. చక్‌దోర్ నామ్‌గ్యాల్ టిబెట్‌లో ప్రవాసానికి వెళ్లాడు. ఆ తరువాత టిబెటన్లు భూటాన్ సైన్యాన్ని పారదోలి, చక్దోర్ నామ్‌గ్యాల్‌ను తిరిగి సిక్కింలో స్థాపించారు.[10] చక్‌దోర్ తరువాత 1717 లో అతని కుమారుడు గ్యుర్మెద్ నామ్‌గ్యాల్ అధికారంలోకి వచ్చాడు. గ్యుర్మెద్ పాలనలో నేపాల్, సిక్కిం మధ్య అనేక పోరాటాలు జరిగాయి. 1733లో గ్యుర్మెద్ చట్టవిరుద్ధమైన సంతానం రెండవ ఫంట్‌సోగ్ నామ్‌గ్యాల్ తన తండ్రి తర్వాత అధికారానికి వచ్చాడు. భూటాన్, నేపాల్‌ల దాడుల నేపథ్యంలో అతని పాలన అల్లకల్లోలమైంది. వారు రాజధాని రాబ్దేంట్సేను స్వాధీనం చేసుకున్నారు.

1780 నుండి 1793 వరకు చోగ్యాల్‌గా ఉన్న టెన్జింగ్ నామ్‌గ్యాల్ బలహీనమైన పాలకుడు. అతని పాలనలో సిక్కింలో చాలా భాగాన్ని నేపాల్ స్వాధీనం చేసుకుంది. 1788లో, నేపాలీ గూర్ఖా సైన్యం సిక్కిమ్‌పై దాడి చేసి, లింబువానా, మాజీ రాజధాని రాబ్దేన్సేను ఆక్రమించింది. రెండోసారి సిక్కిం రాజు టిబెట్‌కు ప్రవాసం వెళ్లాడు. 1788లో, 8వ దలైలామా అతన్ని రెనా జోంగ్‌లోని చుంబి లోయలో ("రేరీ," నేటి యాడోంగ్ కౌంటీ కూడా) ఉంచి కాపాడాడు.[11] అతని కుమారుడు త్సుద్పుడ్ నామ్‌గ్యాల్, 1793 లో చైనా సహాయంతో సింహాసనాన్ని తిరిగి పొందాడు. రాజధాని రాబ్డెన్సే, నేపాల్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉందని భావించి, అతను రాజధానిని తుమ్లాంగ్‌కు మార్చాడు.

బ్రిటిషు సామ్రాజ్యంతో సంబంధాలు

[మార్చు]
తూర్పు సిక్కింలోని జ్ఞాతంగ్ వ్యాలీలో బ్రిటిషు కాలం నాటి యుద్ధ స్మారకం

పొరుగున ఉన్న భారతదేశంలో బ్రిటిషు వారు వచ్చాక, నేపాల్ లోని గూర్ఖా రాజ్యం తమకు ఉమ్మడి శత్రువైనందున సిక్కిం బ్రిటిషువారితో పొత్తు పెట్టుకుంది. కోపోద్రిక్తులైన నేపాలీలు సిక్కింపై ప్రతీకారంతో దాడి చేసి, టెరాయ్‌తో సహా చాలా ప్రాంతాన్ని ఆక్రమించారు. దాంతో ఈస్టిండియా కంపెనీ నేపాల్‌పై దాడి చేసింది. దీని ఫలితంగా 1814 లో ఆంగ్లో-నేపాలీస్ యుద్ధం మొదలైంది. బ్రిటిషు నేపాలీలు సంతకాలు చేసిన ఒప్పందాలు - సుగౌలీ ఒప్పందం, సిక్కిం, బ్రిటిషు ఇండియా - టిటాలియా ఒప్పందాల ఫలితంగా నేపాలీలు సిక్కిం నుండి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని 1817 లో వెనక్కి ఇచ్చేసారు.

అయితే, బ్రిటిషు వారు మొరాంగ్ ప్రాంతంపై పన్ను విధించడంతో సిక్కిం, భారతదేశం మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1825 లో ప్రారంభమైన అంతర్గత కల్లోలంతో, 1835 లో డార్జిలింగ్‌ను బ్రిటిషు వారు పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ పరిణామంతో సంతోషించని సిక్కిం దివాను, తప్పించుకున్న నేరస్థులను పట్టుకోవడంలో బ్రిటిషు వారికి సహాయాన్ని నిరాకరించి, తప్పించుకున్న బానిసలకు క్షమాభిక్ష అందించి బ్రిటిషు వారికి నిస్పృహ కలిగించాచాడు. నష్టానికి పరిహారంగా బ్రిటిషు ప్రభుత్వం సిక్కిం రాజాకి 1841 నుండి రూ 3,000 గా విధించి, ఆ తరువాత దాన్ని రూ.12,000 కు పెంచారు.[12]

1849లో, బ్రిటిషు వైద్యుడు ఆర్చిబాల్డ్ కాంప్‌బెల్, అప్పటి డార్జిలింగ్ సూపరింటెండెంటు, వృక్షశాస్త్రజ్ఞుడూ అయిన జోసెఫ్ హుకర్, బ్రిటిషు వారి అనుమతితో, సిక్కింలోని చోగ్యాల్‌ల అనుమతితో సిక్కిం పర్వతాలలోకి ప్రవేశించారు. కానీ చో లా మీదుగా టిబెట్‌లోకి కూడా ప్రవేశించారు. టిబెట్‌కు అనుకూలంగా ఉండే "పిచ్చి దివాన్" T. నామ్‌గే ప్రోద్బలంతో సిక్కిం ప్రభుత్వం వారిని నిర్బంధించింది. అది సిక్కింపై బ్రిటిషు దండయాత్రకు దారితీసింది.[13][12] తదుపరి రక్తపాతం నివారించబడినప్పటికీ, బ్రిటిషు వారు 1861లో డార్జిలింగ్ జిల్లా, తేరాయ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అదే సంవత్సరంలో కుదిరిన తుమ్లాంగ్ ఒప్పందంతో సిక్కిం బ్రిటిషు వారి రక్షక రాజ్యంగా మారింది.

"బ్రిటిషు సిక్కిం"తో పాటు, "స్వతంత్ర సిక్కిం" కూడా రాజధాని గ్యాంగ్‌టక్ చుట్టూ ఉన్న 2,500 చదరపు మైళ్లు (6,500 కి.మీ2) విస్తీర్ణంలో కొనసాగింది.[14]  మాజీ చోగ్యాల్ 1863 లో తన కుమారుడు సిడ్‌కియాంగ్ నామ్‌గ్యాల్‌కు అనుకూలంగా తప్పుకోవలసి వచ్చింది.

తదుపరి దశాబ్దాలలో చోగ్యాలు తమ సైన్యంతో పాటు సిక్కింను కూడా ఆధునీకరించడానికి ప్రయత్నించారు. ఈ విషయమై 1873 లో సైడ్‌కాంగ్ సవతి సోదరుడు, చోగ్యాల్ తుటోబ్ నామ్‌గ్యాల్ డార్జిలింగ్‌కు చేసిన అధికారిక పర్యటన అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది. అతను నిరాశతో తుమ్లాంగ్‌కు తిరిగి వచ్చాడు. 1886 లో టిబెట్‌తో వాణిజ్యంపై ఆసక్తి ఉన్న బ్రిటిషు వారు సిక్కింలో కొద్దికాలం పాటు దండయాత్రను ప్రారంభించారు. టిబెటన్లు సిక్కిం ఉత్తర సరిహద్దు లోని అనేక కోటలను ఆక్రమించారు, చోగ్యాల్, అతని భార్య కలకత్తా వద్ద చర్చలకు వచ్చినప్పుడు బ్రిటిషు వారు వారిని బంధించారు. 1888 లోటిబెటన్లు ఓడిపోయాక, ఉత్తర సిక్కిం బ్రిటిషు పాలనలోకి వచ్చింది. బ్రిటిషు వారు సిక్కింలో కొత్త భూస్వామ్యాలను స్థాపించారు. అయితే 1891 లో చోగ్యాల్‌ను విడుదల చేసి, మళ్లీ వెంటనే బంధించారు. ఈ భూములను కాజీలు, తికాదార్లు, లామాలకు ఇచ్చారు. 1894 లో రాజధానిని గ్యాంగ్‌టక్‌కు మార్చారు.

1895 లో చోగ్యాల్ విడుదలయ్యాడు. అయితే భారతదేశంలోని బ్రిటిషు గవర్నర్లు సిక్కింకు సార్వభౌమాధికారాన్ని తిరిగి ఇచ్చే పది క్లాజుల ఒప్పందాన్ని తిరస్కరించారు. సిక్కింలోని రాజకీయ అధికారి, జాన్ క్లాడ్ వైట్, ఎలాంటి సార్వభౌమాధికారాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. సిక్కిం న్యాయవ్యవస్థను కొనసాగించడానికి మాత్రమే చోగ్యాల్‌ను అనుమతించాడు.

1905 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ - కాబోయే కింగ్ జార్జ్ V - అధికారిక పర్యటనలో భాగంగా కలకత్తా చేరుకున్నపుడు అతను చోగ్యాల్‌ను కలుసుకున్నాడు. ఇద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది, సిక్కిం యువరాజు సిడ్‌కియాంగ్ తుల్కును ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి పంపించారు. సిడ్‌కియాంగ్ అధికారంలోకి వచ్చినప్పుడు, అతను సిక్కింకు కింగ్ జార్జ్ ప్రభుత్వం నుండి మరింత సార్వభౌమాధికారాన్ని ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. చోగ్యాల్‌గా 1914 లో ముగిసిన తన స్వల్ప పాలనలో విస్తృతమైన సంస్కరణలను ఆమోదించాడు. 1918 లో అన్ని దేశీయ వ్యవహారాలలో సిక్కిం స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించారు. తరువాతి దశాబ్దంలో, రాజ్యం సామాజిక రుగ్మతలను అంతం చేసే విధానాన్ని ప్రారంభించి, జూదం, బాల కార్మికులు, ఒప్పంద సేవలను నిషేధించింది.

స్వతంత్ర రాచరికం

[మార్చు]

సిక్కిం స్వతంత్రం పొందినప్పుడు బ్రిటన్ నుండి స్వాతంత్ర్యానికి సంబంధించిన హామీలు తెచ్చుకుంది. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఆ హామీలను భారత ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. సిక్కిం భారత యూనియన్‌లో చేరాలనే కోరికపై పోలింగు పెట్టగా అది ఓటు విఫలమైంది. భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సిక్కింకు ప్రత్యేక రక్షణ హోదా ఇచ్చేందుకు అంగీకరించాడు. సిక్కిం భారతదేశానికి సామంతుగా ఉండగా, భారతదేశం దాని బాహ్య రక్షణ, దౌత్యం, కమ్యూనికేషన్‌ను నియంత్రించింది. రాజ్యాంగ ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా 1953 లో స్టేట్ కౌన్సిల్‌ను స్థాపించారు. అది 1973 వరకు కొనసాగింది.

1949 లో సిక్కిం స్టేట్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు నాయకత్వం వహించింది. తాషి షెరింగ్ ముఖ్యమంత్రిగా సిక్కింలో మొదటి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడటానికి దారితీసింది. అయితే 29 రోజుల్లోనే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.

1950 వ దశకంలో, టిబెట్‌పై చైనా నియంత్రణకు వ్యతిరేకంగా టిబెట్ గెరిల్లాలకు మద్దతు ఇచ్చే రహస్య కార్యకలాపాల కోసం సిక్కింను అమెరికన్ CIA ఉపయోగించుకుంది.[15] 1959 లో దలైలామా నాటకీయంగా తప్పించుకున్నపుడు భారతదేశం, చైనా రెండింటికీ సిక్కిం విలువ అత్ర్థమైంది. చైనా ఆధీనంలో ఉన్న చుంబి లోయ భారతదేశ గుండెకు బాకు లాంటిది అని నెహ్రూ అన్నాడు. 1962 చైనా-భారత యుద్ధం సమయంలో, చైనా దండయాత్రను నిరోధించేందుకు భారత దళాలు సిక్కిం లోకి వచ్చాయి; భారత చైనా బలగాల మధ్య కొన్ని ఎదురుకాల్పులు జరిగాయి. యుద్ధం తర్వాత, భారతదేశం పురాతన కనుమను మూసివేసింది; 2006 లో దీన్ని తిరిగి తెరిచారు. 50, 60 లలో సిక్కిం రాష్ట్ర కాంగ్రెస్, సిక్కిం నేషనల్ పార్టీ, సిక్కిం స్వతంత్ర దళ్, సిక్కిం జనతా పార్టీ, సిక్కిం నేషనల్ కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల ఆవిర్భావం జరిగింది.[16]

పాత పాలకుడు తాషి నామ్‌గ్యాల్ 1963 లో క్యాన్సర్‌తో మరణించాడు. చివరి వంశపారంపర్య పాలకుడు, చోగ్యాల్ పాల్డెన్ తొండుప్ నామ్‌గ్యాల్, 1965 లో సింహాసనాన్ని అధిష్టించాడు. సిక్కిం స్వతంత్ర పరిరక్షణ హోదాను జాగ్రత్తగా కాపాడిన నెహ్రూ 1964 లో మరణించడంతో, చోగ్యాల్ సింహాసనాన్ని అధిష్టించకముందే కిరీటం కోసం కష్టాలు మొదలయ్యాయి. 1966 లో ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీకి స్వతంత్ర సిక్కిం లేదా దాని రాచరికాన్ని కొనసాగించేంత ఓపిక లేదు. ఒత్తిడికి తట్టుకోలేని చోగ్యాల్‌ తాగుడుకు బానిస కావడంతో, అతని భార్య, అమెరికన్ సోషలైట్ అయిన హోప్ కుక్, కొన్ని మాజీ సిక్కిమీస్ ఆస్తులను వెనక్కి ఇవ్వాలని అడగడంతో అది రాజకీయంగా ప్రమాదకరమైనదిగా భారతదేశం భావించింది.

1950 డిసెంబరులో "భారత - సిక్కిం శాంతి ఒప్పందం" కుదిరాక, సిక్కిం భారతదేశపు రక్షక భూభాగంగా మారింది. భారతదేశం 1973 ఏప్రిల్‌లో సిక్కింను తన ఆధీనంలోకి తీసుకుని రాచరికాన్ని కూలదోసింది. 1975 ఏప్రిల్ 9 న సిక్కిం పార్లమెంటు, రాజును పదవీచ్యుతుడ్ని చేసి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సిక్కిం భారతదేశంలో భాగమైందని ప్రకటించింది. మే 16 న సిక్కిం అధికారికంగా భారతదేశపు రాష్ట్రంగా అవతరించినట్లు భారత పార్లమెంటు ప్రకటించింది.[17] భారత రాష్ట్రమైన సిక్కింలో 6 జిల్లాలు ఉన్నాయి. జనాభా పరంగా గ్యాంగ్‌టక్ అతిపెద్ద జిల్లా కాగా, విస్తీర్ణం పరంగా మంగన్ అతిపెద్ద జిల్లా.

ఇటీవలి చరిత్ర

[మార్చు]

1979 అసెంబ్లీ ఎన్నికల్లో నర్ బహదూర్ భండారీ సిక్కిం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1984, 1989లో భండారి మళ్లీ విజయం సాధించారు. 1994 లో శాసనసభలో నాయకుడు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రి అయ్యాడు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో చామ్లింగ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సిక్కిం 1980 జనవరి 3 న భారత లోక్‌సభకు ఒక ప్రతినిధిని పంపింది. జనతా, కాంగ్రెస్ అభ్యర్థులను తీవ్రంగా తిరస్కరించిన ఓటర్లు స్థానిక లిస్టింగ్ పార్టీని ఆదరించారు.[18][19]

2000 లో సిక్కింలో జరిగిన ఒక సంఘటనతో చైనా-భారతీయ సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. సిక్కిం స్వతంత్ర దేశమంటూ చైనా చేస్తున్న దీర్ఘకాల వాదనను ఇది సవాలు చేసింది. ఓజియన్ ట్రిన్లీ డోర్జే టిబెట్ నుండి భారతదేశంలోని ధర్మశాలకు తప్పించుకోవడమే ఈ అసాధారణమైన సంఘటన. టిబెటన్ బౌద్ధమత శాఖ అయిన బ్లాక్ హాట్ కు అధిపతి అయిన 17వ కర్మపాగా గుర్తింపు పొందాలని కోరుకునే ఇద్దరు పోటీదారులలో ఓగ్యెన్ ట్రిన్లీ డోర్జే ఒకడు. సిక్కింలోని గాంగ్‌టక్‌లో ఉన్న రుమ్‌టెక్ మొనాస్టరీ పునరుద్ధరణ, నిర్వహణ కోసం 16వ కర్మపా సేకరించిన గణనీయమైన నిధుల నియంత్రణ కోసం ఈ ఇద్దరు పోటీదారులు భారతీయ న్యాయస్థాన వ్యవస్థలో పోరాడారు. ఓగ్యెన్ ట్రిన్లీ డోర్జేని నిజమైన కర్మపాగా గుర్తించిన చైనీయులు, అతని ప్రత్యర్థికి మఠం నిధులను కోర్టు మంజూరు చేయడంతో ఆ ఫలితం పట్ల అసంతృప్తి చెందారు. అయితే, చైనా ప్రభుత్వం దాని గురించి ఏమి చేయాలనే సందిగ్ధంలో పడింది. ఎందుకంటే దాని పట్ల భారతదేశానికి నిరసన తెలియజేయడమంటే సిక్కింపై భారతదేశ హైకోర్టు అధికార పరిధిని కలిగి ఉందని స్పష్టమైన ఆమోదం తెలిపినట్లే అవుతుంది.

2003 లో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవడంతో, సిక్కింపై భారత సార్వభౌమాధికారాన్ని చివరకు చైనా గుర్తించింది. రెండు ప్రభుత్వాలు కూడా 2005 లో నాథూ లా, జెలెప్ లా కనుమలను తెరవాలని ప్రతిపాదించాయి.

2011 సెప్టెంబరు 18 న సిక్కింలో భూకంపం సంభవించింది, రాష్ట్రం లోను, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, టిబెట్, చైనా లోనూ కనీసం 116 మంది మరణించారు.[20] ఒక్క సిక్కింలోనే 60 మందికి పైగా మరణించారు. గ్యాంగ్‌టక్ నగరం గణనీయమైన నష్టాన్ని చవిచూసింది.[21]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • సిక్కిం స్థానిక ప్రజలు
  • చోగ్యాల్

మూలాలు

[మార్చు]
  1. Jigme Wangchuk Bhutia. "Locating society, economy and polity in Pre monarchical Sikkim". Retrieved 24 December 2021.
  2. Subba, J. R. (2008). History, Culture and Customs of Sikkim. Gyan Publishing House. ISBN 9788121209649.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Chemjong 2014, chapter 5, Kirat Kings of Namgyal Dynasty.
  4. Skoda, Uwe (2014). Navigating Social Exclusion and Inclusion in Contemporary India and Beyond: Structures, Agents, Practices (Anthem South Asian Studies). Anthem Press. p. 137. ISBN 978-1783083404.
  5. "History of Sikkim". Government of Sikkim. Archived from the original on 14 December 2009.
  6. 6.0 6.1 Bareh 2001, p. 2.
  7. Datta, Rangan (6 March 2005). "Next weekend you can be at ... Yuksum". The Telegraph.
  8. Arora 2008, p. 4.
  9. George L. Harris; Jackson A Giddens; Thomas E. Lux; Frederica Muhlenberg; Farancis Chadwick Rintz; Harvey H. Smith (1964). Area handbook for Nepal (with Sikkim and Bhutan). Washington, D.C.: Foreign Areas Studies Division, The American University on behalf of the US Army. p. 368.
  10. . "III. A Brief History of Sikkim".
  11. Long Bo (龙波) (2007). "中国的"邻国"——锡金" [China's "Neighbours" – Sikkim]. Guidance for Junior High Students. Archived from the original on 7 July 2011.
  12. 12.0 12.1 Paget 1907, p. 41.
  13. Arora 2008, p. 8.
  14. Temple, Richard Carnac (1887). Journals Kept in Hyderabad, Kashmir, Sikkim, and Nepal. W.H. Allen. p. 152.
  15. Lhamu, Palden (2024-01-24). "From Kingdoms to Statehood: A Comprehensive History of Sikkim". Gangtokian.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-29.
  16. Andrew Duff, "A Himalayan Chess Game" History Today (2016) 66#1.
  17. Duff, "A Himalayan Chess Game".,
  18. Satya Narayan Mishra, "RST Parliamentary Election in Sikkim" South Asian Studies (University of Rajasthan). 1982, 17#1 pp 89-94.
  19. Urmila Phadnis, "Ethnic Dimensions of Sikkimese Politics: The 1979 Elections." Asian Survey 20.12 (1980): 1236-1252. online
  20. Gupta, Saibal (21 September 2011). "Himalayan Quake Toll Climbs to 116, 40 Stranded Foreign Tourists Rescued". DNA online.
  21. "Earthquake Toll Over 80; India 68; as Rescue Teams Reach Quake Epicentre". Gangtok: NDTV. 26 September 2011. Archived from the original on 25 September 2011.