హ్యాంగోవర్
హ్యాంగోవర్ | |
---|---|
ఇతర పేర్లు | వెయ్సెల్జ్య |
ఎద్వడ్ ముంక్ గీసిన ద డెయ్ ఆఫ్టర్ (The Day After, అర్థం: తరువాతి రోజు), 1894–95 నాటి చిత్రం | |
ప్రత్యేకత | మానసిక వైద్యశాస్త్రం, విషవిజ్ఞాన శాస్త్రం |
లక్షణాలు | ఉదరకోశ సమస్యలూ, తలనొప్పీ, వాంతులూ |
కారణాలు | మద్యపానం |
ప్రమాద కారకములు | జన్యు ఉత్పరివర్తనాలు |
నివారణ | మిత మద్యపానం |
హ్యాంగోవర్[గమనిక 1] లేదా హేంగోవర్ లేదా హెంగ్‌అవర్[గమనిక 2] లేదా హెఙ్‌అవర్[గమనిక 2] అంటే మద్యం సేవించిన కొంత సమయం తరువాత వచ్చే ఇబ్బందికర శారీరక, మానసిక లక్షణాలు. దీనికే ఆంగ్లంలో వాడే ఇంకో పదము వెయ్సెల్జ్య(Veisalgia). హ్యాంగోవర్ లక్షణాలు కొన్ని గంటల నుండి ఒక రోజు దాకా కూడా ఉండవచ్చు. వీటిలో ముఖ్యమైనవి తలనొప్పీ, మగతా, ఏకాగ్రత తగ్గడం, నోరు పొడిబారడం, కళ్ళు తిరగడం, అలసటా, జీర్ణకోశ ఇబ్బందులూ (ఉదా: వాంతులూ, విరేచనాలు), ఆకలి లేకపోవటం, మానసిక నిస్పృహా, చెమటలు పట్టడం, వికారం, ఆందోళనా, కంగారూ.[1]
హ్యాంగోవర్ కారణాలేమిటనేది ఇంకా పూర్తిగా తెలియలేదు.[2] కానీ రక్తంలో ఎసిటాల్డిహైడ్ (Acetaldehyde) పేరుకోవడం, రోగనిరోధక వ్యవస్థ పనితీరూ,[2] గ్లూకోజ్ (Glucose) జీవక్రియల్లో మార్పులూ, నిర్జలీకరణా, మెటబాలిక్ అసిడోసిస్ (Metabolic acidosis, అర్థం: అస్తవ్యస్తమైన జీవక్రియల వలన వచ్చు ఆమ్లరక్తత[గమనిక 3]), ప్రోస్టాగ్లాండిన్ (Prostaglandin)[గమనిక 4] సంశ్లేషణ అస్తవ్యస్తమవడం, గుండెపై అదనపు భారం పడడం, రక్తనాళాల వ్యాకోచం, నిద్రలేమీ, పోషకాహార లోపం వంటి అనేక అంశాలు దీనికి తోడ్పడుతుండవచ్చు. మద్యపానీయాలలో ఉండే సంకలితాలూ లేదా ఉప ఉత్పత్తులైన కన్జినర్లు (Congeners)[గమనిక 5] వంటి పదార్థాలు కూడా హ్యాంగోవర్ రావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.[1] మద్యం మత్తు దిగిపోవడం మొదలయ్యాక దీని లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎక్కువగా రాత్రి బాగా తాగితే తర్వాతి ఉదయం జరుగుతుంది. [3]
దీన్ని తగ్గించడానికీ, నివారించడానికీ చాలా చిట్కాలు సూచించబడ్డాయి కానీ, ఏవీ కూడా పనిచేస్తాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. [4][5] హ్యాంగోవర్ రాకూడదంటే తాగకపోవడం లేదా మితంగా తాగడమే సరైన దారులు.[4]శారీరక సమస్యలే కాక పనికి గైర్హాజరు అవడం, పనిలో నాణ్యత లోపించడం, పేలవమైన ఉత్పాదకతా, చదువుల్లో వెనుకబడడం దీని వలన కలిగే ఇతర నష్టాలు. జాగ్రత్తగా చేయవలసిన రోజువారీ పనులు (ఉదా: బండి నడపడం, యంత్రాలను వాడడం) కూడా హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు సరిగ్గా చెయ్యలేరు.[6]
లక్షణాలు
[మార్చు]ఈ సమస్య యొక్క ముఖ్య లక్షణాలు తందర (నిద్రమబ్బు), తలనొప్పీ, ఏకాగ్రత కుదరకపోవడం, నోరు ఎండిపోవడం, తల తిరుగుడూ, ఉదరకోశ ఇబ్బందులూ, నీరసం, చెమటలూ, వికారం, కంగారూ, ఆందోళనా, తెలియని వ్యాకులతా. వీటిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు తందరా, ఏకాగ్రతా లోపం.[7] ఇవి కొన్ని గంటల నుండి ఒక రోజు పైనే ఉండవచ్చు.[8] నిద్రలేమీ, ఉదరకోశ సమస్యలు వంటి కొన్ని లక్షణాలు మద్యం మత్తు వల్ల కానీ, విత్‌డ్రావల్ (Withdrawal[గమనిక 6]) వల్ల కానీ వస్తుండవచ్చు.[9] రక్తంలో మద్యము స్థాయులు పడడం మొదలైనప్పుడు వచ్చే ఈ లక్షణాలు, ఒంట్లోని మద్యమంతా పూర్తిగా బయటకు పోయేపాటికి (మూత్రవిసర్జన ద్వారా) తారాస్థాయికి చేరుకుంటాయి.[6][7]
కారణాలు
[మార్చు]ఈ సమస్య వెనకున్న ప్రక్రియలేంటన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు.[2] ప్రస్తుతం ఈ సమస్య వెనకుండే అవకాశమున్నట్లుగా కనిపిస్తున్న కొన్ని పెథఫిజియొలజికల్ మార్పులు (pathophysiology, అర్థం: రోగధర్మ శాస్త్రం) పెరిగిన ఎసిటల్డిహైడ్ స్థాయులూ, సైటొకైన్ పాథ్వేలో (Cytokine Pathway) మార్పులూ, గ్లూకోజు అందుబాటు తగ్గడం. వీటితో పాటు నిర్జలీకరణా, మెటబలిక్ ఎసిడొసిస్, ప్రోస్టాగ్లాండిన్ సంశ్లేషణ అస్తవ్యస్తమవడం, గుండెపై అదనపు భారం పడడం, రక్తనాళాల వ్యాకోచం, నిద్రలేమీ, పోషకాహార లోపం సమస్యను తీవ్రతరం చేస్తాయి.[1] మద్యం తయారీలో ఉప ఉత్పత్తులైన కన్జీనర్స్ కూడా ఈ సమస్య కలగజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుండవచ్చు. ఉదాహరణకు కన్జీనర్‌లలో ఒకటైన మిథనొల్ (Methanol) అపచయ క్రియలో భాగంగా శరీరానికి విషతుల్యమైన ఫొర్మల్డిహైడ్ (Formaldehyde), ఫొర్మిక్ ఆమ్లాలుగా (Formic Acid) మారుతుంది.[1]
పెథొఫిజియొలజి
[మార్చు]మద్యపానం తరువాత పానీయంలోని ఎథనొల్ (Ethanol) రక్తంలో చేరాక, మొదట ఎల్కహొల్ డీహైడ్రొజనెయ్స్ (Alcohol Dehydrogenase) ఎంౙైము సమక్షంలో ఎసిటల్డిహైడ్‌గా మారి, ఆ తరువాత ఆమ్లజనీకరించబడి అసీటిక్ ఎసిడ్‌గా (Acetic acid) మారుతుంది. ఈ క్రమంలో రెడొక్స్ (Redox) చర్యలో భాగంగా "నికటినమైడ్ ఎడినీన్ డైన్యూక్లియటైడ్" (Nicotinamide Adenine Dinucleotide (NAD+)) మిశ్రణము దానీ క్షయీకరణ రూపమైన "NADH"గా మారుతుంది. ఇలా "NAD+/NADH" సమతుల్యత దెబ్బతినడంతో సాధారణ శరీర ప్రక్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. వీటిలో కొన్ని ట్రైగ్లిజరైడ్ (Triglyceride, కొవ్వులలో ఒక రకం) స్థాయులు పెరగడం, అమైనో ఆమ్లాల అపచయం, క్రెబ్స్ సైకౢ (Krebs cycle, గ్లూకోజు అపచయ క్రియలో జరిగే ఒక ప్రక్రియ) ఆగిపోవడం, లెక్టిక్ ఎసిడొసిస్ (Lactic Acidosis, రక్తంలో లెక్టిక్ ఆమ్లం స్థాయులు పెరగడం వలన వచ్చే ఆమ్ల రక్తత[గమనిక 3]), కీటో ఎసిడొసిస్ (Ketoacidosis, రక్తంలో కీటోను బొడీల[గమనిక 7] స్థాయులు పెరగడం వల్ల వచ్చే ఆమ్లరక్తత[గమనిక 3]), హైపర్ యురిసీమ్యా (Hyperuricemia, రక్తంలో యురిక్ ఎసిడ్ స్థాయులు పెరగడం), కోర్టిసల్ (Cortisol), ఎన్డ్రజన్‌ల (Androgen)జీవక్రియా, ఫైబ్రొజెనసిస్ (Fibrogenesis) పెరగటాలు. గ్లూకోజు, ఇన్సులిన్‌ల (Insulin) జీవక్రియలు కూడా ప్రభావితమవుతాయి.[3] ఐతే ఈ మధ్యన జరిగిన శాస్త్రీయ అధ్యయనాల్లో హ్యాంగోవర్ తీవ్రతకూ, రక్తం, మూత్ర నమూనాల్లోని వివిధ హోర్మోన్‌లూ (Hormone), విద్యుద్విశ్లేష్య పదార్థాలూ, ఫ్రీ ఫెటీ ఆమ్లాలూ,[గమనిక 8] ట్రైగ్లిజరైడ్‌లూ, లెక్టెయ్ట్, కీటోన్ బొడీలూ, కొర్టిసల్, గ్లూకోజుల స్థాయులకూ మధ్య ఎలాంటి చెప్పుకోదగ్గ సంబంధమున్నట్లు తెలియరాలేదు.[3]
మద్యం CYP2E1 ఎంౙైము ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ ఎంౙైము ఎథొనల్‌ను హానికరమైన రసాయనాలుగా మారుస్తుంది. ముఖ్యంగా బిన్జ్ డ్రింకింగ్‌లో (binge drinking, అర్థం: ఒక్కపెట్టున ఎక్కువ మోతాదులో మద్యం తాగేయడం) ఈ ఎంౙైము ప్రభావం ఎక్కువయ్యి ఒక్సిడెయ్టివ్ స్ట్రెస్ (oxidative stress, అర్థం: ఆక్సిడెన్టులు కలుగజేసే ఒత్తిడి[గమనిక 9]) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కణాలకు ప్రాణాంతకం.[10]
ఎసిటల్డిహైడ్
[మార్చు]ఎథొనల్ అపచయక్రియలో వచ్చే మొదటి పదార్థమైన ఎసిటల్డిహైడ్, ఎథొనల్‌తో పోల్చితే 10–30 రెట్లు ఎక్కువ విషపూరితమైనది.[11] మద్యం తాగిన తరువాత చాలా గంటల పాటు దీని స్థాయులు ఉచ్చస్థితిలో ఉండగలవు.[12] ఆపైన, కొన్ని రకాల జన్యునిర్మాణాలు శరీరం పైన ఎసిటల్డిహైడ్ దుష్ప్రభావాన్ని మరింత పెంచుతాయి. ఉదాహరణకు కొందరిలో ఎల్కహొల్ డీహైడ్రొజనెయ్స్ జన్యువులో ఉన్న ఉత్పరివర్తన వలన ఎథొనొల్ రెట్టించిన వేగంతో ఎసిటల్డిహైడ్‌గా మారుతుంది. ఇది ఎక్కువగా తూర్పు ఆసియా వారిలో జరుగుతుంటుంది. దీనితో పాటు తూర్పు ఆసియా వాసుల్లో దాదాపు సగం మందిలో ఎసిటల్డిహైడ్ అసీటిక్ ఎసిడ్‌గా మారే ప్రక్రియ, ఇతర జాతుల్లో కంటే మందకోడిగా సాగుతుంది. దీని వలన ఒకే మోతాదులో మద్యం తాగినా, వీరిలో మిగతా వారితో పోల్చితే ఎసిటల్డిహైడ్ ఎక్కువగా, త్వరగా పేరుకుంటుంది.[13] పర్యవసనంగా వీరు "ఎల్కహొల్ ఫ్లష్ రియెక్షన్" (Alcohol flush reaction, అర్థం: మద్యపానముకు ప్రతిచర్యగా కందిపోవడం) అనే ప్రక్రియకు గురవుతారు. ఈ విధమైన జన్యునిర్మాణం కలవారిలో హ్యాంగోవర్‌లు ఇతరులతో పోల్చితే త్వరగా, మరింత తీవ్రంగా రావడంతో పాటు ఈ ఎల్కహొల్ ఫ్లష్ రియెక్షన్ అనేది బాధితుడికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కనుక, వీరు తాగుబోతులయ్యే అవకాశం తక్కువ.[14][15]
ఆపైన ఎసిటల్డిహైడ్ "గ్లూటథైయొన్ పరొక్సిడెయ్స్" (Glutathione Peroxidase) అనే ఎన్టి-ఒక్సిడన్ట్ ఎంౙైముపై (antioxidant enzyme) ప్రభావం చూపించడం ద్వారా ఒక్సిడెయ్టివ్ స్ట్రెస్‌ను కలగజేస్తుంది.[10] ఇక అపచయ క్రియ రెండో దశలో పుట్టుకొచ్చే అసీటిక్ ఆమ్లంతో (ఎసిటెయ్ట్ (Acetate) అయనం) కూడా సమస్యలు ఉన్నాయి. ఒక పరిశోధనలో ఎలుకల్లోకి సొడ్యం ఎసిటెయ్ట్ (Sodium Acetate) ఎక్కించినప్పుడు, వాటిలో నొసిసెప్టివ్ బిహెయ్వ్యర్ (Nociceptive behaviour, అర్థం: నొప్పిని సూచించే ప్రవర్తన)—తలనొప్పి వలన— వ్యక్తమవడం జరిగింది. ఇది పరిశోధనలో కనిపించడమే కాకుండా దీనికొక శాస్త్రీయ వివరణ కూడా ఉంది. రక్తంలో ఎసిటెయ్ట్ స్థాయులు ఎక్కువైనప్పుడు, మెదడులో అడెనసీన్ (adenosine) అనే పదార్థం పేరుకుంటుంది. అడెనసీన్ ప్రభావాన్ని నిర్వీర్యం చేసే కఫీన్ (Caffeine) ఇచ్చినప్పుడు, ఎలుకల్లో తలనొప్పి రాలేదు.[16][17]
కన్జీనర్స్
[మార్చు]మద్యంలో మత్తుకు కావలసిన ఎథొనల్, దాన్ని తాగగలగడానికి కావలసిన నీళ్ళే కాక, చాలా పానీయాలలో కన్జీనర్లు అనే అదనపు పదార్థాలు ఉంటాయి. ఇవి పానీయపు రుచిని పెంచడానికి కలపబడినవి కావచ్చు, లేదా మద్యం తయారీలోనో (పులియబెట్టు క్రమంలో), వైన్‌ను ఐతే మత్తును పెంచేందుకు గానూ భద్రపరిచే క్రమంలోనో తయారైన ఉప ఉత్పత్తులు కావచ్చు. వట్టి ఎథొనలే హ్యాంగోవర్‌ను కలిగించగలదు కానీ, ఈ కన్జీనర్లు దాని తీవ్రతను పెంచుతాయి. కన్జీనర్లలో ముఖ్యమైనవి ఐన ఎయ్మీన్‌లూ (Amine), ఎమైడులూ (Amide), ఎసిటోనులూ (Acetone), ఎసిటల్డిహైడులూ, పొలిఫీనలులూ (Acetaldehyde), మెథనొల్ (Methanol), హిస్టమీనులూ (Histamine), ఫ్యూజల్ ఒయిల్ (Fusel oil), ఎస్టర్లూ (Ester), ఫర్‌ఫ్యురలులూ (Furfural), టెనినులలో (Tannin), కొన్ని మినహాయింపులున్ననూ, చాలా వరకు విషపూరితమైనవే.[9] ఐతే ఎలుకల్లో చేసిన ఒక పరిశోధనలో ఫ్యూజల్ ఒయిల్ హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తున్నట్లుండగా,[18] విస్కీలో ఉండే బ్యూటనొల్ (Butanol), ఇంకా కొన్ని పదార్థాలు పొట్ట గోడలను మద్యం ప్రభావం నుండి కాపాడుతుండవచ్చు అని తెలిసింది.[19] ఇక వివిధ పానీయాలలో కన్జీనర్ల మోతాదులు వేర్వేరుగా ఉంటాయి. మామూలుగా ముదురు రంగు పానీయాలలో కన్జీనర్ల శాతం ఎక్కువుండగా, తేట పానీయాలలో తక్కువ ఉంటుంది. ఉదాహరణకు తేట పానీయమైన వొడ్కలో (Vodka) దాదాపుగా ఏ కన్జీనరూ లేకపోగా, ముదురు రంగు బోర్బను విస్కీలో (Bourbon Whiskey), వొడ్క కంటే 37 రెట్లు ఎక్కువ కన్జీనర్లు ఉంటాయి.[9]
మద్యపానీయం రకానికీ, హ్యాంగోవర్ తీవ్రతకూ మధ్యనున్న సంబంధంపై చాలా అధ్యయనాలు జరిగాయి. కన్జీనర్ల మోతాదు ఎక్కువగానున్న ముదురు రంగు పానీయాలు తీవ్రమైన హ్యాంగోవర్లను కలిగిస్తాయని నాలుగు అధ్యయనాల్లో తేలింది.[20][21][22][23] ఒక అధ్యయనములో ఐతే హ్యాంగోవర్ల తీవ్రతే కాక, అవి వచ్చే అవకాశం కూడా పెరుగుతున్నట్లు కనిపించింది.[20] 2006లో చేసిన ఒక అధ్యయనంలో 14 గ్లాసుల బీరుకు (Beer) హ్యాంగోవర్ రాగా, వైను (Wine) వంటి ఇతరాలతో 7–8 గ్లాసులకే వచ్చినట్లు తెలిసింది.[22] ఇక్కడ గ్లాసు అంటే డచ్ పబ్‌లలో కలిపే గ్లాసుడు మద్యంగా తీసుకున్నారు. ఈ పబ్‌లలో పానీయం ఏదైనా ఒక గ్లాసుడులో మద్యం శాతం ఒకే మోతాదులో ఉండేలా కలుపుతారు. వివిధ పానీయాలు హ్యాంగోవర్ కలిగించగలిగే సామర్థ్యాన్ని ఒక అధ్యయనం ఇలా గుర్తించింది (తక్కువ నుండి ఎక్కువకు): బట్టీపట్టిన ఎథొనల్, పళ్ళరసం కలిపిన మద్యం, బీరు, వొడ్క, జిన్ (Gin), వైట్ వైన్, విస్కీ, రమ్ (Rum), రెడ్ వైన్, బ్రాందీ (Brandy).[21][22]
హ్యాంగోవర్ కారకాలైన కన్జీనర్లలో ముఖ్యమైనది మిథనొల్. మద్యం తయారీలో భాగంగా పులియబెట్టేటప్పుడు ఇది కొద్ది మొత్తాల్లో సహజంగా తయారవుతుంది. స్వేదనక్రియలో లోపాల వలన కొన్నిసార్లు ఇది ఎక్కువగా సాంద్రీకరించుకుపోవచ్చు. మిథనొల్ అపచయ క్రియ వలన శరీరంలో ఫొర్మల్డిహైడ్, ఫొర్మిక్ ఎసిడ్ అనే రెండు చాలా విషపూరితమైన పదార్థాలు తయారవుతాయి. ఇవి హ్యాంగోవర్ తీవ్రతను ప్రభావితం చేస్తుండవచ్చు. ఎథొనల్ శరీరంలో ఉన్నప్పుడు, మిథనొల్ అపచయము మందగిస్తుంది. హ్యాంగోవర్‌లో ఉండగా మరికాస్త మద్యం తాగితే ఉపశమనం కలుగుతుందనే నమ్మకానికి ఇదే వివరణ అయ్యుండొచ్చు.[9][24] కనుక మద్యం తాగుతున్నప్పుడు మిథనొల్ అపచయం దాదాపుగా ఆగిపోయి, మిథనొల్ రక్తంలో పేరుకుపోతుంది. మళ్ళీ ఎథొనల్ విసర్జన పూర్తయ్యాకే, మిథనొల్ అపచయము మొదలవుతుంది. పరిశోధనల్లో హ్యాంగోవర్ లక్షణాలకూ, రక్తంలో మిథనొల్ స్థాయులకూ మధ్య సంబంధం కనిపించడం వెనుక వివరణ ఇదే అయ్యుండవచ్చు.[3]
వైటమిన్లూ, విద్యుద్విశ్లేష్య పదార్థాల లోపం
[మార్చు]ఎల్కహొల్ అపచయ క్రియలో భాగంగా శరీరంలోని వైటమిన్లూ (Vitamin),[25] విద్యుద్విశ్లేష్య పదార్థాలూ[26] వాడబడతాయి. అలాగే ఎల్కహొల్ మూత్రకారకం కనుక, మూత్రంలో విద్యుద్విశ్లేష్య పదార్థాల విసర్జన పెంచుతుంది. రాత్రి తాగిన తరువాత శరీరంలో బి, సి వైటమిన్లూ, పటెష్యం (Potassium), మెగ్నీష్యం (Magnesium), జింకు (Zinc) మినరల్‌ల లోపాలు హ్యంగోవర్ లక్షణాలకు ఒక కారణం అయ్యి ఉండవచ్చు.[ఆధారం చూపాలి]
నిర్జలీకరణ
[మార్చు]ఎథొనల్ మూత్రకారకం కనుక, శరీరాన్ని నిర్జలీకరిస్తుంది. దీని వలన దాహం, నోరెండిపోవడం, తల తిరుగుడూ, విద్యుద్విశ్లేష్య పదార్థాల సమతుల్యత దెబ్బతినడంం వంటి పర్యవసనాలు ఎదురవుతాయి. పరిశోధనల ప్రకారం హ్యాంగోవర్ లక్షణాలను కలగజేయడంలో విద్యుద్విశ్లేష్య పదార్థాల స్థాయుల్లో మార్పుల పాత్ర చాలా తక్కువనీ, ఆ కొన్ని లక్షణాలు కూడా నిర్జలీకరణ వలన వచ్చేవేననీ తెలుస్తోంది. మంచినీళ్ళు ఎక్కువగా తాగితే (మద్యపానం తరువాత) ఈ పర్యవసనాలు రాకుండా ఆపవచ్చు కానీ, పునర్జలీకరణ వలన ఇతర హ్యాంగోవర్ లక్షణాలపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదు.[3]
రక్తంలో చక్కెర స్థాయుల తగ్గుదల
[మార్చు]హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడీ రక్తంలో చక్కెర స్థాయులు మామూలు మోతాదుల కంటే తక్కువ (<70mg/dl) ఉంటున్నట్లు పరిశోధనల్లో కనబడింది. ఐతే చక్కెర స్థాయులకీ, హ్యాంగోవర్ తీవ్రతకీ మధ్య సంబంధమేమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.[3]
రోగనిరోధక వ్యవస్థ
[మార్చు]ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల ప్రకారం, మనకు తెలిసిన శారీరక మార్పులన్నిటిలోకీ, హ్యాంగోవర్ తీవ్రతతో అత్యంత బలమైన సంబంధం రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులతో కనబడింది.[3] ముఖ్యంగా వికారం, తలనొప్పీ, అలసట లక్షణాలు కలగటానికి ఈ మార్పులే ముఖ్య కారణమయ్యుండొచ్చు. రోగనిరోధక వ్యవస్థ మార్పుల్లోకెల్లా ముఖ్యమైనది సైటోకైను (Cytokine[గమనిక 10]) జీవక్రియలో వచ్చే మార్పులు. మద్యపాన సేవనం తరువాత రక్తంలో వివిధ సైటోకైనుల స్థాయులు విపరీతంగా పెరుగుతున్నట్లు తేలింది. వాటిలో ముఖ్యమైనవి ఇన్టర్‌లూకిన్ 12 (IL-12), ఇన్టర్‌ఫియరొన్ గెమ (IFNγ), ఇన్టర్‌లూకిన్ 10 (IL-10).[27] హ్యాంగోవర్‌ను తగ్గించడంలో టోల్‌ఫెనమిక్ ఎసిడ్ (Tolfenamic acid),[28] భారతీయ నాగజెముడుల[29] పాత్రపై చేసిన కొన్ని పరిశోధనల్లో కూడా, ఈ సమస్యలో రోగనిరోధక వ్యవస్థ పాత్ర ఉన్నట్లు కనబడుతోంది. ఈ అధ్యయనాలను బట్టి చూస్తే సైక్లోక్సిజనేస్‌ను (Cycloxygenase) నిర్వీర్యం చేసే ఎస్ప్రిన్ (Aspirin), ఐబ్యూప్రోఫెన్ (Ibuprofen) మందులు హ్యాంగోవర్ తీవ్రతను తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.[3]
శరీరతత్వం
[మార్చు]జన్యునిర్మాణం, వయసు, లింగం, ఆరోగ్య స్థితీ, మత్తులో ఉండగా చేసిన నర్తనా లేదా ఇతర శారీరక శ్రమా, తాగాక పోయిన నిద్ర నిడివీ ఇంకా నాణ్యతా, ఇలా చాలా అంశాలు హ్యాంగోవర్ తీవ్రతను ప్రభావితం చేస్తాయి.[3] వాటిలో ముఖ్యమైనవాటి గురించి వివరణ:
- జన్యువులు: కొందరిలో జన్యు నిర్మాణం వలన ఎసిటల్డిహైడ్ ఎక్కువగా పేరుకుంటుంది. వీరు హ్యాంగోవర్‌కు గరయ్యే అవకాశమెక్కువని పరిశోధనల ద్వారా తెలుస్తోంది.[30] బాగా తాగేవారిలో 25% మంది తమకి ఏనాడూ హ్యాంగోవర్ రాలేదు అని చెప్పడం కూడా, హ్యాంగోవర్‌ల తీవ్రతలో జన్యు వ్యత్యాసాల పాత్ర ప్రాధాన్యతకు అద్దం పడుతోంది.[6]
- వయసు: కొందరిలో వయసు అయ్యే కొద్దీ హ్యాంగోవర్‌ల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మద్య అపచయ క్రియకు అవసరమైన ఎల్కహొల్ డీహైడ్రోజనెయ్స్ ఎంౙైము నిల్వలు తగ్గడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హ్యంగోవర్ లక్షణాల తీవ్రత వయసు అయ్యే కొద్దీ పెరుగుతుందా అనే విషయం ఇంకా తెలియదు కానీ, తాగే మోతాదులు వయసుతో పాటు మారతాయనీ, వయసు అయ్యే కొద్దీ హ్యాంగోవర్‌కు దారితీసే విధంగా తప్పతాగటం తగ్గిస్తుంటారనీ పరిశోధనల్లో తేలింది.[6]
- లింగం: ఒకే మోతాదులో తాగిననూ స్త్రీలలో పురుషులకంటే తీవ్రమైన హ్యాంగోవర్ కనిపిస్తుంటుంది. దీనికి కారణం శరీరం మద్యాన్ని విసర్జించే వేగంలో ఉండే తేడాలు. మద్యం యొక్క అపచయం, విసర్జనా స్త్రీలలో నెమ్మదిగా జరగడం వలన, ఒకే మోతాదులో తాగిననూ, స్త్రీల రక్తంలో మద్యం శాతం ఎక్కువగా ఉంటుంది. ఐతే రక్తంలో మద్యం స్థాయులు ఒకేలా ఉన్నప్పుడు స్త్రీలూ, పురుషుల మధ్య హ్యాంగోవర్ తీవ్రతలో తేడాలేమీ ఉండవు.[30]
- ధూమపానం: సిగరెట్ తాగినప్పుడు రక్తంలో కొంత ఎసిటల్డిహైడ్ కలుస్తుంది. మద్యపానంతో పాటు ఒకేసారి ధూమపానం కూడా చేస్తే ఎసిటల్డిహైడ్ పేరుకొని హ్యాంగోవర్ తీవ్రతను పెంచొచ్చు.[10]
చికిత్స
[మార్చు]హ్యాంగోవర్ ఒక చికిత్స చేయవలసిన సమస్య అనే దృష్టితో జరిగిన పరిశోధనలు చాలా తక్కువ.[31] వైద్యారోగ్య నిపుణులు మద్యపాన వ్యసనాన్ని ఒక చికిత్స చేయవలసిన వ్యాధిగా చూస్తారు కనుక, హ్యాంగోవర్ అనేది మద్యపానాన్ని పరిమితం చేయడానికి పనికొచ్చే ఒక సహజ పరిణామంగా వీరు భావిస్తారు.[32]
జరిగిన పరిమిత పరిశోధనలలో హ్యాంగోవర్ నివారణ కానీ, తీవ్రతను తగ్గించడం కానీ ఏమేరకు సాధ్యపడుతుందన్నది ఇంకా తెలియరాలేదు. అది పక్కన పెడితే హ్యాంగోవర్‌ను రకరకాల చిట్కా వైద్యాల నుండి కూరగాయ వైద్యాల వరకు ఎన్నో రకాల నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 2005లో వీటన్నిటినీ సమీక్షిస్తూ బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో (British Medical Journal) వచ్చిన ఒక పరిశోధనా వ్యాసం హ్యాంగోవర్‌ను నివారించడానికి గానీ తగ్గించడానికి గానీ ఏ చిట్కా అయినా పనికొస్తుందనడానికి బలమైన ఆధారాలు లేవనీ, హ్యాంగోవర్ రాకుండా ఉండాలంటే ఉన్న అత్యంత ప్రభావవంతమైన మార్గం మద్యపానానికి దూరంగా ఉండడమేననీ తేల్చింది.[4] ఈ చిట్కా వైద్యాల్లో కొన్ని వాంతులనో, తలనొప్పినో తగ్గిస్తే తగ్గించవచ్చు కానీ, మగతా, అలసట లాంటి ఇతర లక్షణాలను తగ్గించలేవు.[33]
పనిచేసే అవకాశమున్న కొన్ని చికిత్సలు
[మార్చు]హ్యాంగోవర్‌కు చికిత్స అనేదేదీ లేదని కొన్ని పరిశోధనల అభిప్రాయం.[4][33] ఐతే నిరూపితం కానప్పటికీ, కొన్ని పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు చూపిన చికిత్సలు ఇవి:
- పునర్జలీకరణ: మద్యపానం తరువాతో లేదా హ్యాంగోవర్‌లో ఉండగానో బాగా నీళ్ళు తాగితే నిర్జలీకరణ వలన వచ్చే గొంతు పొడిబారడం, దాహం, తలనొప్పీ, తల తిరుగుడూ కొంచెం తగ్గే అవకాశముంది.[3][20]
- ఎస్ప్రిన్, వంటి నొన్ స్టెరొయ్డల్ ఎన్టి ఇన్‌ఫ్లమటరి డ్రగ్స్ (Non Steroidal anti inflammatory drugs (NSAIDS), అర్థం: స్టెరొయ్డ్లు కాక వాపును ఆపే ఇతర మందులు) హ్యాంగోవర్‌తో వచ్చే తలనొప్పిని తగ్గించడానికి పనికొస్తాయనే ప్రతిపాదన ఉంది. ఐతే అందుకు తగ్గ ఆధారాలేమీ దొరక్కపోగా, మద్యంతో పాటు ఈ మందులు తీసుకుంటే ఉదరకోశ గోడలూ, కాలేయం దెబ్బతినే అవకాశం పెరుగుతుందనే అనుమానం కూడా ఉంది.[33]
- 1983లో 30 మందిపై జరిగిన ఒక పరిశోధనలో ప్రోస్టాగ్లాండిన్ సంశ్లేషణ నిరోధకము ఐన టోల్‌ఫెనమిక్ ఎసిడ్ అనే పదార్థం తలనొప్పీ, వికారం, వాంతులూ తగ్గించగా, అలసటపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయినట్టు తెలిసింది.[33]
- పిరిటినొల్: 1973లో జరిగిన ఒక అధ్యయనంలో ఎక్కువ మోతాదుల్లో (రోజూ తీసుకోవాల్సిన దానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ) వైటమిన్ బి6కు కృత్రిమ సమధర్మి అయిన పిరిటినొల్ (Pyritinol) తీసుకుంటే హ్యాంగోవర్ తగ్గొచ్చని తెలిసింది.[20] ఐతే ఆ మోతాదులో కాలేయం, క్లోమం దెబ్బతినే అవకాశముంది.[34][35]
- మధుశిలీంధ్రము నుండి తయారు చేసిన పదార్థాలు: మధుశీలీంధ్రాల నుండి తీసిన కొన్ని పదార్థాలు చికాకునీ, ఇబ్బందినీ, అసహనాన్నీ తగ్గించినట్లు కనబడింది కానీ, రక్త నమూనాల్లో మద్యం, ఎసిటల్డిహైడ్‌ల శాతాన్ని గానీ, ఇతర ఇబ్బందులని గానీ తగ్గించినట్లు అనిపించలేదు.[33]
ఆధారాల్లేని చికిత్సలు
[మార్చు]హ్యాంగోవర్‌కు మందు కనిపెట్టాలనే తాపత్రయం ఈనాటిది కాదు. నాటి రోమను సామ్రాజ్యంలో పెద్ద మనిషి అయిన ప్లిని, ద ఎల్డర్ [గమనిక 11] హ్యాంగోవర్ తగ్గడానికి పచ్చి గుడ్లగూబ గుడ్లూ, కనేరీ పిట్ట వేపుడూ తినేవాడు.[36] 1878లోని పెరిస్ వరల్డ్ ఎక్స్‌పొజిషన్‌లో (Paris World Exposition) "ప్రేరీ ఒయిస్టర్" (Prairie Oyster) అనే పానీయం ఒకటి హ్యాంగోవర్‌కు విరుగుడుగా పేరుగాంచించింది. 1938లో రిట్జ్-కర్ల్‌టన్ (Ritz-Carlton)హోటలు వాళ్ళు కోకా కోలానీ (Coca-Cola), పాలనీ కలిపి, దాన్ని హ్యాంగోవర్ మందుగా ప్రచారం చేసేవారు.[37] (అసలు కోకా-కోలానే హ్యాంగోవర్‌కు మందు అవటానికా కనుక్కోబడిందని ఒక ఉవాచ కూడా ఉంది).[38][39] తాగుబోతు అయిన ప్రముఖ రచయిత అర్నిస్ట్ హెమింగ్‌వెయ్ బీరూ, రామ్ములక్కాయ రసం వాడేవాడు. ఇంకా బ్లడి మేరీ (Bloody Mary), బ్లాక్ వెల్వెట్ (Black Velvet)(షెంపెయ్నూ/షఁపఞూ, స్టౌటూ (Stout) సమపాళ్ళలో కలిపిన మిశ్రమం) వంటి మద్య మిశ్రమాలు కూడా వాడబడ్డాయి.[40] ఒక అమెరికా జానపద విజ్ఞాన శాస్త్రవేత్త చేసిన సర్వేలో అమెరికాలో వేపుళ్ళూ, రామ్ములక్కాయ రసం, సంభోగం— ఈ మూడిటినీ ఎక్కువ మంది హ్యాంగోవర్ నుండి ఉపశమనం కలిగించేవాటిగా నమ్ముతున్నారని తేలింది.[41]
ఇతర నిరాధార చికిత్సలు:
- హెయ్ర్ ఒఫ్ ద డొగ్ (Hair of the dog): హ్యాంగోవర్ అనేది ఎల్కహొల్ విథ్‌డ్రోవల్ వలన వస్తుందనే తప్పుడు సిద్ధాంతం దీనికి ఆధారం.[32] కనుక హ్యాంగోవర్‌కు చికిత్సగా హ్యాంగోవర్‌లో ఉండగా ఇంకాస్త మద్యం తాగాలనే నమ్మకమే హెయ్ర్ ఒఫ్ ద డొగ్. భారతదేశంలో దీన్ని హ్యాంగోవర్ పెగ్ (Hangover Peg) అని కూడా అంటారు. కొందరు ఈ చిట్కా తమకు పనిచేస్తోందని చెబుతుంటారు. కానీ ఈ పద్ధతిలో ఉపశమనం పొందే వారికి తాగుడు వ్యసనంగా మారే అవకాశం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.[24][30] ఈ పద్ధతిని చాలా మంది అవలబించడమే కాక,[41] మద్యం తయారీ సంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నాయి కానీ,[42] దీని వల్ల హ్యాంగోవర్ కొంతసేపు వాయిదా పడుతుందే తప్ప, తగ్గదనేది వైద్యారోగ్య నిపుణుల అభిప్రాయం.[43] దీనికి ఎక్కువగా వాడే పానీయాలు "కోర్ప్స్ రివైవర్" (Corpse Reviver), "ఫెర్‌నెట్ బ్రంక" (Fernet Branca),[44] "బ్లడీ మేరీ".[45]
- ఆర్టిచోక్ (Artichoke) (హాటిచోకు[గమనిక 12]): ఇది హ్యాంగోవర్ చికిత్సకు ఏవిధంగానూ ఉపయోగపడదని పరిశోధనల్లో తెలుస్తోంది.[33]
- సౌన (ఆవిరి స్నానం): ఆవిరి స్నానం చేసినప్పుడు ఒళ్ళు వేడెక్కుతుంది. మద్యం ప్రభావం ఒంటిపై ఉండగా, ఇలా శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండె లయ తప్పే ప్రమాదముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.[47]
- ప్రాణవాయువు: వైద్య అవసరాలకు వాడదగ్గ ప్రాణవాయువు నిల్వలు అందుబాటులో ఉండే వైద్యారోగ్య సిబ్బందీ, వైమానిక దళాల్లో విమానచోదకులు వంటి వారు కొందరు ప్రాణవాయువు పీల్చితే ఉపశమనం కలిగినట్లు తెలిపారు. ప్రాణవాయువు శారీరక జీవక్రియ వేగాన్ని పెంచడం వలన, హ్యాంగోవర్‌ను కలిగించే విషపూరిత పదార్థాల విసర్జన కూడా పెరుగుతుండడం దీని వెనుక ఉన్న వివరణ అయ్యుండొచ్చని అనుకున్నారు.[48] ఐతే హ్యాంగోవర్ వలన కలిగే లక్షణాలపై విమానాల్లోని ప్రాణవాయువు ప్రభావం చూపదని ఒక పుస్తకంలో పేర్కొనబడింది.[49]
- ఫ్రక్టోజూ (Fructose), గ్లూకోజు: ఈ చక్కెరలు రెండూ మద్యం వలన జీవక్రియల్లో వచ్చే మార్పులకు అడ్డుకట్ట వేస్తాయి కానీ హ్యాంగోవర్ తీవ్రతపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు.[33]
- వైటమిన్ బి6: బి6 మాత్రల వంటివి ఎల్కహొల్ చయాపచయ క్రియను కానీ, రక్తంలో ఎల్కహొల్ స్థాయులను కానీ, గ్లూకోజు స్థాయులను కానీ, తాగిన వారి శరీర కదలికలను కానీ ప్రభావితం చేసినట్లు కనిపించలేదు.[33]
- కెఫీన్: కెఫీన్ వాడకానికీ, హ్యాంగోవర్ తీవ్రతకూ మధ్య ఎలాంటి చెప్పుకోదగ్గ సంబంధమున్నట్లు కనిపించలేదు.[50]
గణాంకాలు
[మార్చు]హ్యాంగోవర్ ఎక్కువగా కనిపించే సమస్యే. దాని గణాంకాలు ఇలా ఉన్నాయి.
- భారతదేశంలో హ్యాంగోవర్ గణాంకాల గురించి సమాచారం లేదు.
- 1987లో అమెరికాలోని న్యూ ఇంగ్లన్డ్‌లో ఉన్న ఒక విశ్వవిద్యాలయం విద్యార్థులపై చేసిన అధ్యయనంలో అధ్యయనం జరగడానికి మునుపటి వారంలో 25% మంది విద్యార్థులు హ్యాంగోవర్‌కు గురైనట్లు తెలిసింది.[20][51]
- యు.ఎస్‌లోని కార్మికుల్లో 9.23% (1.16 కోట్ల మంది) హ్యాంగోవర్‌తో పనులు చేస్తారని అంచనా.[52]
- 23% మంది తాగుబోతులు, తప్పతాగినప్పుడు కూడా తమకి ఎలాంటి హ్యాంగోవర్ కలగలేదని పేర్కొన్నారు.[9]
సామాజిక, సాంస్కృతిక విశేషాలు
[మార్చు]హ్యాంగోవర్ అనే ఆంగ్ల పదానికి అర్థం పట్టుకుని వేళ్ళాడేది అని. మద్యం మత్తూ, ఉత్తేజం దిగిపోయాక కూడా ఈ మద్యం తాలుకు ప్రభావము ఉంటుందనే ఉద్దేశముతో ఈ పదాన్ని వాడారు.
తెలుగులో హ్యాంగోవర్‌కు సమానమైన పదమేదీ ఉన్నట్లు కానరాదు. నిఘంటువులలో "బాధించు, కష్టతరంచేయు, దుష్ప్రభావం" అనే మూడు పదాలు సమానార్థకాలుగా పేర్కొపబడ్డాయి.[53][54] వీటిలో దుష్ప్రభావం అనేది మద్యపాన సంబంధిత హ్యాంగోవర్‌ను సూచించేందుకు చేర్చిన పదం అయ్యుండొచ్చు.
హ్యాంగోవర్ అనే పదాన్ని రూపకంగా వాడడం ఉంది. ఏదైనా జరిగిపోయిన సంఘటన ఇంకా జరుగుతున్నట్లు ప్రవర్తిస్తుంటే దాన్ని హ్యాంగోవర్ అనడం కనిపిస్తుంది. చలనచిత్ర పరిశ్రమలో దీని వాడకం ఇంకా ఎక్కువ. ఉదాహరణకు ఎన్‌డిటివిలో వచ్చిన ఈ వ్యాసం. ఒక విజయవంతమైన చిత్రం తీసినప్పుడు, మళ్ళీ దాదాపు అదే కథా కథనాలతో ఇంకో చిత్రం తీయడం విజయం తాలూకు హ్యాంగోవర్‌గా పేర్కొనబడుతుంది. ఆ విజయవంతమైన చిత్రానికి దాదాపుగా నకలులా ఉండడముతో ఈ హ్యాంగోవర్ చిత్రాలు పరాజయం పాలు అయ్యే అవకాశం ఎక్కువ.
ఫ్రెన్చ్‌లో హ్యాంగోవర్‌ను సూచించేందుకు "మె లొ షవు" (mal aux cheveux) అనే ఒక పాతకాలపు నానుడి ఉంది. దీని అర్థం జుట్టు నొప్పి అని. జుట్టు కూడా నొప్పెడుతోందని చెప్పడం దీని ఉద్దేశం.[55] కొన్ని భాషల్లో హ్యాంగోవర్ సమానార్థకాల వ్యుత్పత్తి మద్యానికి వాడే పదాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు చిలీ స్పెనిష్ భాషలో హ్యాంగోవర్‌ను "కఞ" (caña) అంటారు.[56] ఇది ఇతర స్పెనిష్ మాట్లాడే చోట్ల "ఒక గ్లాసుడు బీరు" అనే అర్థంతో వాడే పదం.[57] ఐరిష్ భాషలో హ్యాంగోవర్‌ను "బ్రౌన్ బాటిల్ ఫ్లు" (Brown bottle flu) అంటారు. ఇది కూడా బీరుకు వాడే సీసా రంగు నుండి వచ్చిన పదం.[58]
హ్యాంగోవర్‌ల వలన సమాజానికి చెప్పుకోదగ్గ స్థాయి ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి. సుమారు 50 లక్షల జనాభా గల ఫిన్‌లన్డ్ దేశంలో హ్యాంగోవర్ వలన సంవత్సరానికి 10 లక్షల పనిదినాలు పోతున్నాయి. యు.ఎస్.ఎలో హ్యాంగోవర్‌ల వలన ఒక ఉద్యోగికి 2000 డాలర్లు (లక్షన్నర రూపాయల పైన[గమనిక 13]) చొప్పున నష్టం కలుగుతోందని అంచనా.[20] హ్యాంగోవర్ వలన పనికి గైర్హాజరు కావడం, ఉత్పాదకత తగ్గడం, పనిలో వెనుకబడడం, చదువుల్లో వెనకబడడం వంటి పరిణామాలు తలెత్తుతాయి. ప్రమాదం సంభవించే అవకాశమున్న యంత్రాలు వాడడం, బండి తోలడం వంటి రోజువారీ పనుల నైపుణ్యం మీద కూడా హ్యాంగోవర్ ప్రభావముంటుంది.[6]
2017లో లన్డన్‌లోని "డైస్" అనే సంస్థ తమ ఉద్యోగులకు హ్యాంగోవర్‌తో బాధపడుతున్నప్పుడు సెలవు పెట్టే వెసులుబాటు ఇచ్చింది.[59]
2019 నాటికి దక్షిణ కొరియాలో హ్యాంగోవర్ నయం చేసే ఉత్పత్తిగా ప్రచారం చేసుకున్న ఒక ఉత్పత్తి 2500 కోట్ల దక్షిణ కొరియా వొన్ల పరిశ్రమగా (సుమారు 20కోట్ల పైచిలుకు యు.ఎస్ డాలర్లు; అంటే 17 వేల కోట్ల రూపాయలు పైచిలుకు[గమనిక 13]) మారింది. ఈ పదార్థం పానీయంగా, గోళీలుగా, ఇంకా వేరే రకాలుగా కూడా దొరుకుతుంది.[60]
పరిశోధనలు
[మార్చు]హ్యాంగోవర్‌పై జరిగిన పరిశోధనలు తక్కువ.[61] వీటిని పెంచే లక్ష్యంతో 2010లో ఎల్కహొల్ హ్యాంగోవర్ రిసెర్చ్ గ్రూప్ (Alcohol hangover research group (AHRG), అర్థం: మద్య సంబంధిత హ్యాంగోవర్ పరిశోధనా బృందం) ఏర్పాటయ్యింది. కొన్నాళ్ళకొకసారి ఈ బృందం సమావేశమయ్యి, హ్యాంగోవర్‌పై చర్చించుకుంటుంది. ఇప్పటివరకు 12[dated info] సమావేశాలు జరగగా, మొదటి సమవేశం జూన్ 2010లో "రిసెర్చ్ సొసైటీ ఒన్ ఎల్కహొలిజం" (Research Society on Alcoholism[గమనిక 14] , అర్థం: మద్యపాన వ్యసనంపై పరిశోధనా సంఘం) 33వ వార్షిక శాస్త్రీయ సమావేశంలో భాగంగా యు.ఎస్‌లో జరిగితే,[61] ఇటీవలి సమావేశం అర్జెంటీనాలో 2022 ఆగస్టులో[dated info] జరిగింది.[63] తదుపరి సమావేశం 2023 ఏప్రిల్‌లో జర్మనీలో[dated info] జరగనుంది.[63]
కెబెక్‌లో బాధ్యతాయుత మద్యపానంపై అవగాహన పెంచడం లక్ష్యంగా గల స్వచ్ఛంద సంస్థ ఐన ఎడ్యుకెల్కొల్ (Éduc'alcool, అర్థం: మద్యపాన అవగాహన) ప్రచురించిన నివేదికలో హ్యాంగోవర్ వలన బాధితుని నైపుణ్యాలు 24 గంటల పాటు కుంటుపడతాయని పేర్కొంది.[64]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- ↑ తెలుగువారి సాధారణ ఉచ్చారణా, తెలుగులో ఎక్కువగా వ్రాసే రూపం.
- ↑ 2.0 2.1 శిష్ట ఆంగ్ల ఉచ్చారణ
- ↑ 3.0 3.1 3.2 ఆమ్లరక్తత అంటే రక్తంలో ఆమ్లత్వము పెరగడం
- ↑ కణాల మధ్య సంప్రదింపులకు ఉపకరించే రసాయనాలలో ఒకటి
- ↑ మద్యం తయారీలో భాగంగా మద్యంతో పాటు పుట్టుకొచ్చే ఇతర ఉత్పత్తులు
- ↑ మద్యానికి అలవాటుపడిపోయిన వాళ్ళకి, రక్తంలో మద్యం స్థాయులు తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు
- ↑ ఒంటికి తగినంత గ్లూకోజు అందకుంటే, తయారయ్యే పదార్థాలు
- ↑ ఒక రకం కొవ్వులు
- ↑ శరీరంలో ఆక్సిడెన్టులూ, ఎన్టి-ఆక్సిడెన్టులూ సమపాళ్ళలో ఉంటాయి. వాటి మధ్య సమతుల్యత దెబ్బతిని, ఆక్సిడెన్టులు ఎక్కువైతే, ఆ ఆక్సిడెన్టుల వలన శరీరంపై పడే ఒత్తిడి
- ↑ రోగ నిరోధక కణాల పనితీరుని నియంత్రించే రసాయనాలు
- ↑ పెద్ద ప్లిని అనే అర్థంలో వాడే పేరు. చిన్న ప్లిని అతని మేనల్లుడు
- ↑ తెలుగులో కొందరు పలికే విధానం[46]
- ↑ 13.0 13.1 1 డాలరు సుమారు 82 రూపాయలు ఐతే
- ↑ 2023 నుండి రిసెర్చ్ సొసైటీ ఒన్ ఎల్కహొల్‌గా (Research Society on Alcohol, అర్థం: మద్యంపై పరిశోధనా సంఘం) పేరు మార్చబడింది[62]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Stephens R, Ling J, Heffernan TM, Heather N, Jones K (23 January 2008). "A review of the literature on the cognitive effects of alcohol hangover". Alcohol and Alcoholism. 43 (2): 163–70. doi:10.1093/alcalc/agm160. PMID 18238851.
- ↑ 2.0 2.1 2.2 Prat G, Adan A, Sánchez-Turet M (June 2009). "Alcohol hangover: a critical review of explanatory factors". Human Psychopharmacology. 24 (4): 259–67. doi:10.1002/hup.1023. PMID 19347842. S2CID 30318948.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 Penning R, van Nuland M, Fliervoet LA, Olivier B, Verster JC (June 2010). "The pathology of alcohol hangover". Current Drug Abuse Reviews. 3 (2): 68–75. doi:10.2174/1874473711003020068. PMID 20712596.
- ↑ 4.0 4.1 4.2 4.3 Pittler MH, Verster JC, Ernst E (December 2005). "Interventions for preventing or treating alcohol hangover: systematic review of randomised controlled trials". BMJ. 331 (7531): 1515–8. doi:10.1136/bmj.331.7531.1515. PMC 1322250. PMID 16373736.
- ↑ "A get-sober pill?". Science News (Paper magazine). 202 (9): 4. 19 November 2022.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 Verster JC, Stephens R, Penning R, Rohsenow D, McGeary J, Levy D, McKinney A, Finnigan F, Piasecki TM, Adan A, Batty GD, Fliervoet LA, Heffernan T, Howland J, Kim DJ, Kruisselbrink LD, Ling J, McGregor N, Murphy RJ, van Nuland M, Oudelaar M, Parkes A, Prat G, Reed N, Slutske WS, Smith G, Young M, Alcohol Hangover Research Group (June 2010). "The alcohol hangover research group consensus statement on best practice in alcohol hangover research". Current Drug Abuse Reviews. 3 (2): 116–26. doi:10.2174/1874473711003020116. PMC 3827719. PMID 20712593.
- ↑ 7.0 7.1 Penning R, McKinney A, Verster JC (May–Jun 2012). "Alcohol hangover symptoms and their contribution to the overall hangover severity". Alcohol and Alcoholism. 47 (3): 248–52. doi:10.1093/alcalc/ags029. PMID 22434663.
- ↑ Verster JC (23 January 2008). "The alcohol hangover--a puzzling phenomenon". Alcohol and Alcoholism. 43 (2): 124–6. doi:10.1093/alcalc/agm163. PMID 18182417.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 Rohsenow DJ, Howland J (June 2010). "The role of beverage congeners in hangover and other residual effects of alcohol intoxication: a review". Current Drug Abuse Reviews. 3 (2): 76–9. doi:10.2174/1874473711003020076. PMID 20712591.
- ↑ 10.0 10.1 10.2 Min JA, Lee K, Ki DJ (June 2010). "The application of minerals in managing alcohol hangover: a preliminary review". Current Drug Abuse Reviews. 3 (2): 110–5. doi:10.2174/1874473711003020110. PMID 20712595.
- ↑ Sprince H, Parker CM, Smith GG, Gonzales LJ (April 1974). "Protection against acetaldehyde toxicity in the rat by L-cysteine, thiamin and L-2-methylthiazolidine-4-carboxylic acid". Agents and Actions. 4 (2): 125–30. doi:10.1007/BF01966822. PMID 4842541. S2CID 5924137.
- ↑ Korsten MA, Matsuzaki S, Feinman L, Lieber CS (February 1975). "High blood acetaldehyde levels after ethanol administration. Difference between alcoholic and nonalcoholic subjects". The New England Journal of Medicine. 292 (8): 386–9. doi:10.1056/NEJM197502202920802. PMID 1110723.
- ↑ Xiao Q, Weiner H, Crabb DW (November 1996). "The mutation in the mitochondrial aldehyde dehydrogenase (ALDH2) gene responsible for alcohol-induced flushing increases turnover of the enzyme tetramers in a dominant fashion". The Journal of Clinical Investigation. 98 (9): 2027–32. doi:10.1172/JCI119007. PMC 507646. PMID 8903321.
- ↑ Earleywine M (1999). Mind-Altering Drugs: The Science of Subjective Experience. OUP USA. p. 163. ISBN 978-0-19-516531-9.
- ↑ Wall TL, Peterson CM, Peterson KP, Johnson ML, Thomasson HR, Cole M, Ehlers CL (September 1997). "Alcohol metabolism in Asian-American men with genetic polymorphisms of aldehyde dehydrogenase". Annals of Internal Medicine. 127 (5): 376–9. doi:10.7326/0003-4819-127-5-199709010-00007. PMID 9273829. S2CID 6104647.
- ↑ Maxwell CR, Spangenberg RJ, Hoek JB, Silberstein SD, Oshinsky ML (December 2010). Skoulakis EM (ed.). "Acetate causes alcohol hangover headache in rats". PLOS ONE. 5 (12): e15963. Bibcode:2010PLoSO...515963M. doi:10.1371/journal.pone.0015963. PMC 3013144. PMID 21209842.
- ↑ Holmes B (15 January 2011). "Is coffee the real cure for a hangover?". New Scientist. p. 17.
- ↑ Hori H, Fujii W, Hatanaka Y, Suwa Y (August 2003). "Effects of fusel oil on animal hangover models". Alcoholism: Clinical and Experimental Research. 27 (8 Suppl): 37S–41S. doi:10.1097/01.ALC.0000078828.49740.48. PMID 12960505.
- ↑ Goso Y, Ueno M, Hotta K, Ishihara K (March 2007). "Protective effects of the whisky congeners on ethanol-induced gastric mucosal damage". Alcoholism: Clinical and Experimental Research. 31 (3): 390–4. doi:10.1111/j.1530-0277.2006.00319.x. PMID 17295722.
- ↑ 20.0 20.1 20.2 20.3 20.4 20.5 Wiese JG, Shlipak MG, Browner WS (June 2000). "The alcohol hangover". Annals of Internal Medicine. 132 (11): 897–902. doi:10.7326/0003-4819-132-11-200006060-00008. PMID 10836917.
- ↑ 21.0 21.1 Pawan GL (May 1973). "Alcoholic drinks and hangover effects". The Proceedings of the Nutrition Society. 32 (1): 15A. PMID 4760771.
- ↑ 22.0 22.1 22.2 Verster JC (2006). "Congeners and alcohol hangover: differences in severity among Dutch college students after consuming beer, wine or liquor". Alcoholism: Clinical and Experimental Research. 30 (Suppl. 6): 53A. doi:10.1111/j.1530-0277.2006.00150.x.
- ↑ Rohsenow, Damaris; Howland, Jonathan; Arnedt, Todd; Armeida, Alissa; Greece, Jacey; Minsky, Sara; Kempler, Carrie; Sales, Suzanne (2 March 2010). "Intoxication With Bourbon Versus Vodka: Effects on Hangover, Sleep, and Next-Day Neurocognitive Performance in Young Adults". Alcohol: Clinical and Experimental Research. 34 (3): 509–518. doi:10.1111/j.1530-0277.2009.01116.x. PMC 3674844. PMID 20028364.
- ↑ 24.0 24.1 Verster JC (January 2009). "The "hair of the dog": a useful hangover remedy or a predictor of future problem drinking?". Current Drug Abuse Reviews. 2 (1): 1–4. doi:10.2174/1874473710902010001. PMID 19630732.
- ↑ Lieber, Charles (2003). "Relationships between nutrition, alcohol use, and liver disease". Alcohol Research and Health. 27 (3): 220–231. PMC 6668875. PMID 15535450. Archived from the original on 2022-03-10. Retrieved 2023-01-03.
- ↑ Kaysen, George; Noth, Robert H. (January 1984). "The Effects of Alcohol on Blood Pressure and Electrolytes". Medical Clinics of North America. 68 (1): 221–246. doi:10.1016/S0025-7125(16)31251-2. PMID 6361414.
- ↑ Kim DJ, Kim W, Yoon SJ, Choi BM, Kim JS, Go HJ, Kim YK, Jeong J (November 2003). "Effects of alcohol hangover on cytokine production in healthy subjects". Alcohol. 31 (3): 167–70. doi:10.1016/j.alcohol.2003.09.003. PMID 14693266.
- ↑ Kaivola S, Parantainen J, Osterman T, Timonen H (March 1983). "Hangover headache and prostaglandins: prophylactic treatment with tolfenamic acid". Cephalalgia. 3 (1): 31–6. doi:10.1046/j.1468-2982.1983.0301031.x. PMID 6342813. S2CID 9523170.
- ↑ Wiese J, McPherson S, Odden MC, Shlipak MG (June 2004). "Effect of Opuntia ficus indica on symptoms of the alcohol hangover". Archives of Internal Medicine. 164 (12): 1334–40. doi:10.1001/archinte.164.12.1334. PMID 15226168.
- ↑ 30.0 30.1 30.2 Piasecki TM, Robertson BM, Epler AJ (June 2010). "Hangover and risk for alcohol use disorders: existing evidence and potential mechanisms". Current Drug Abuse Reviews. 3 (2): 92–102. doi:10.2174/1874473711003020092. PMC 4264051. PMID 20712598.
- ↑ Verster JC (2008). "The alcohol hangover--a puzzling phenomenon". Alcohol and Alcoholism. 43 (2): 124–6. doi:10.1093/alcalc/agm163. PMID 18182417.
- ↑ 32.0 32.1 Glater JD (7 December 2004). "Raw Eggs? Hair of the Dog? New Options for the Besotted". The New York Times.
- ↑ 33.0 33.1 33.2 33.3 33.4 33.5 33.6 33.7 Verster JC, Penning R (June 2010). "Treatment and prevention of alcohol hangover". Current Drug Abuse Reviews. 3 (2): 103–9. doi:10.2174/1874473711003020103. PMID 20712594.
- ↑ Maria V, Albuquerque A, Loureiro A, Sousa A, Victorino R (March 2004). "Severe cholestatic hepatitis induced by pyritinol". BMJ. 328 (7439): 572–4. doi:10.1136/bmj.328.7439.572. PMC 381054. PMID 15001508.
- ↑ Straumann A, Bauer M, Pichler WJ, Pirovino M (August 1998). "Acute pancreatitis due to pyritinol: an immune-mediated phenomenon". Gastroenterology. 115 (2): 452–4. doi:10.1016/S0016-5085(98)70212-4. PMID 9679051.
- ↑ Dubow, Charles (1 January 2004). "Hangover Cures". Forbes. Archived from the original on 17 January 2003.
- ↑ Felten E (27 December 2008). "Recipe to Cure a New Year's Eve Hangover - WSJ.com". Online.wsj.com. Retrieved 10 January 2023.
- ↑ Ellis I. "March 29 - Today in Science History". Todayinsci.com. Retrieved 10 January 2023.
- ↑ "// Welcome To". Colamyths.com. Archived from the original on 25 జనవరి 2021. Retrieved 26 March 2010.
- ↑ "Hair of the Dog: Is there such a thing as a hangover "cure"?". About.com. Archived from the original on 2017-02-10. Retrieved 2023-01-05.
- ↑ 41.0 41.1 Paulsen FM (April–June 1961). "A Hair of the Dog and Some Other Hangover Cures from Popular Tradition". The Journal of American Folklore. 74 (292): 152–168. doi:10.2307/537784. JSTOR 537784.
- ↑ English C (29 December 2006). "For hangovers, bartenders prefer the 'hair of the dog' - SFGate". Articles.sfgate.com. Retrieved 10 January 2023.
- ↑ "Hangover Myths Slideshow: Hangover Cures, Herbal Remedies, Hair of the Dog, and Other Common Myths". Webmd.com. 14 November 2008. Retrieved 10 January 2023.
- ↑ Curtis W (5 March 2010). "The Bitter Beginning - Magazine". The Atlantic. Retrieved 10 January 2023.
- ↑ "Anti-Hangover Tips". The Webtender. Retrieved 10 January 2023.
- ↑ బ్రౌను, సి.పి (1852). "Artichoke". ఆంధ్రభారతి. Retrieved 6 January 2023.
- ↑ Ylikahri R, Heikkonen E, Soukas A (1988). "The sauna and alcohol". Annals of Clinical Research. 20 (4): 287–91. PMID 3218903.
- ↑ Walker T, Fitzgerald M (17 April 2007). "A drinker's guide to hangovers". The Independent. London. Archived from the original on 11 December 2008.
- ↑ Reihheart R (2007). Basic Flight Physiology. McGraw-Hill Professional. p. 179. ISBN 978-0-7735-0801-9.
- ↑ Penning R, de Haan L, Verster JC (2011). "Caffeinated Drinks, Alcohol Consumption, and Hangover Severity". The Open Neuropsychopharmacology Journal. 4: 36–39. doi:10.2174/1876523801104010036.
- ↑ Meilman, P W; Stone, J E; Gaylor, M S; Turco, J H (1 September 1990). "Alcohol consumption by college undergraduates: current use and 10-year trends". Journal of Studies on Alcohol. 51 (5): 389–395. doi:10.15288/jsa.1990.51.389. ISSN 0096-882X. PMID 2232790.
- ↑ Ling J, Stephens R, Heffernan TM (June 2010). "Cognitive and psychomotor performance during alcohol hangover". Current Drug Abuse Reviews. 3 (2): 80–7. doi:10.2174/1874473711003020080. PMID 20712592.
- ↑ రామారావు, చేకూరి; et al., eds. (2004). పత్రికా పదకోశం. ఒరుగు భాస్కర్, బూదరాజు రాధాకృష్ణ. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ.
- ↑ "hangover". ఆంధ్రభారతి. Retrieved 6 January 2023.
- ↑ "11 old-timey words for 'hangover' we need to bring back". The Daily Edge. Journal Media. January 2015.
- ↑ "Chilean Slang - a dictionary".
- ↑ "Caña". SpanishDict.
- ↑ Spears, Richard (2000). NTC's Dictionary of American Slang and Colloquial Expressions. Lincolnwood, Illinois: NTC Publishing Group. p. 53. ISBN 9780844204628.
- ↑ Connor, Liz (24 August 2017). "This London company is offering 'hangover' sick days to its staff". Evening Standard. Lifestyle. Retrieved 10 January 2023.
- ↑ "What do Koreans eat to cure hangovers? What's 1-cha, 2-cha Koreans count when drinking?". Hyphe-Nated. 10 May 2021. Archived from the original on 15 October 2021. Retrieved 10 January 2023.
- ↑ 61.0 61.1 Verster, Joris; et al. (2 November 2020). "The Alcohol Hangover Research Group: Ten Years of Progress in Research on the Causes, Consequences, and Treatment of the Alcohol Hangover". Journal of Clinical Medicine (Editorial). 9 (11). Multidisciplinary Digital Publishing Institute (published 16 November 2020): 3670. doi:10.3390/jcm9113670. PMC 7696633. PMID 33207574.
- ↑ "Overview". Research Society on Alcohol. About RSA. Retrieved 9 January 2023.
- ↑ 63.0 63.1 Yan Wang, Joris Wester, Vatsalya Vatsalya (2022). "conference report". The International Society for Biomedical Research on Alcoholism BULLETIN (PDF) (Bulletin). Vol. 4. p. 12. Archived from the original (PDF) on 9 జనవరి 2023. Retrieved 9 January 2023.
- ↑ Éduc'alcool, "Alcohol and Health: Alcohol Hangover" Archived 25 జూలై 2018 at the Wayback Machine, July 2012.
వెలుపలి లంకెలు
[మార్చు]Classification | |
---|---|
External resources |
Find more about హ్యాంగోవర్ at Wikipedia's sister projects | |
Media from Commons |
- ఆంగ్ల విక్షనరీలో Hangover
- ఆంగ్ల విక్షనరీలో Veisalgia
- Hangovers Factsheet NIAAA, March 2019, retrieved 17 May 2019.
- "Alcohol Hangover: Mechanisms and Mediators" Archived 2022-01-05 at the Wayback Machine [PDF] by Robert Swift, M.D., Ph.D. and Dena Davidson, Ph.D., NIAAA Alcohol Health and Research World, 14 January 2002, retrieved 22 November 2004.
- "The party's over: Advice on treating hangovers" Archived 2011-09-17 at Archive.today by Dr. Thomas Stuttaford, The Times, 13 December 2004 retrieved 24 August 2005. A colorful article on hangovers, their cause and treatment along with reference to famous Soho residents, such as Jeffrey Bernard, Dylan Thomas, and Francis Bacon.
- Articles containing English-language text
- Pages with unresolved properties
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description matches Wikidata
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from January 2023
- Articles containing Spanish-language text
- కాలదోషం పట్టిన వాక్యాలు గల వ్యాసాలు
- Webarchive template archiveis links
- Wikipedia articles with GND identifiers
- మద్యపానంతో ఆరోగ్య సమస్యలు