ఆ నలుగురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆ నలుగురు
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్ర సిద్ధార్థ
నిర్మాణం సరిత పట్రా
కథ మదన్
చిత్రానువాదం మదన్, చంద్ర సిద్ధార్థ
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
సుత్తివేలు,
ఆమని,
కోట శ్రీనివాసరావు,
శుభలేఖ సుధాకర్,
రాజా
సంగీతం ఆర్ పి పట్నాయక్
సంభాషణలు మదన్
ఛాయాగ్రహణం టి. సురేంద్ర రెడ్డి
కూర్పు గిరీష్ లోకేశ్
నిర్మాణ సంస్థ ప్రేమ్ మూవీస్
విడుదల తేదీ డిసెంబరు 9,2004
భాష తెలుగు

ఆ నలుగురు అనేది 2004లో వచ్చిన ఓ తెలుగు సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది.

పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం (రాజేంద్ర ప్రసాద్), అనే పత్రికా సంపాదకుడి కథ ఇది. రఘురాం చనిపోయిన తరువాత అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమ కింకరులు (చలపతి రావు, రఘు బాబు) రావడంతో కథ ప్రారంభమవుతుంది. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్ధి చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు. ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లెలో చదువుకునే రోజుల్లో అక్కడికి సమీపంలోని బీ.కొత్తకోట గ్రామంలో జరిగిన ఓ సంఘటన చూశారు. ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన అంతిమయాత్రకు ఊరికి ఊరే కదలివచ్చింది, కారణమేంటంటే ఆయన జీవించినన్నాళ్ళూ చుట్టూ ఉన్నవాళ్ళు బావుండాలని కోరుకునేవారు. సాధ్యమైనంత సాయాన్ని పక్కవారికి చేసే అలవాటున్న వ్యక్తి కావడంతో ఊరు ఊరంతా ఆయన అంతిమయాత్రకు తరలివచ్చి కన్నీరు కార్చారు. ఈ సంఘటన మదన్ మనస్సును కదిలిచింది, ఈ సంఘటన ఆధారంగా తయారుచేసుకున్న కథని సీరియల్ స్క్రిప్ట్ గా అభివృద్ధి చేసుకున్నారు, స్క్రిప్ట్ పేరు అంతిమయాత్ర. సినిమా, సీరియల్ ప్రయత్నాలు చేస్తున్నరోజుల్లో ఈటీవీ కెమెరామేన్ మీర్ సహకారంతో ఈటీవీ వారికి ఈ కథని చెప్పారు. 26 ఎపిసోడ్లకు తయారుచేసిన స్క్రిప్ట్ లో మొదటి సీనులోనే కథానాయకుడి మరణం ఉండడం, చాలా ఎపిసోడ్లలో అంతిమయాత్ర సన్నివేశాలు చూపడం వంటివి ఉండడంతో సెంటిమెంటల్ గా భావించే వీక్షకులు ఈ సీరియల్ తిప్పికొడతారంటూ రిజెక్ట్ చేశారు.
తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి వద్ద మదన్ అసిస్టెంట్ కెమెరామేన్ గా పనిచేశారు. ఆ సమయంలో పరిచయమైన దర్శకుడు రాంప్రసాద్ కి ఈ స్క్రిప్ట్ చాలా నచ్చింది. అభిరుచి కలిగి, మంచి చిత్రాలు తీసిన నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మళ్ళీ నిర్మాణం ప్రారంభించి వెంకీ సినిమా తీయడంతో ఆయనను సంప్రదించారు. ఆయన కథ విన్నాకా, బాగా నచ్చేసింది. మదన్ ని ఊటీ పంపించి, అక్కడ రూం వేసి సీరియల్ స్క్రిప్టు తిరగరాయించి పూర్తిస్థాయి సినిమా కథగా మలిచే బాధ్యత అప్పగించారు. అది పూర్తయ్యాకా దర్శకత్వం కోసం తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత భాగ్యరాజాని పిలిపించి కథ చెప్పారు. ఆయనకు కథ బాగా నచ్చేసి, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చేస్తానని, అయితే తానే ప్రధానపాత్రలో నటిస్తానని ప్రతిపాదించారు. అది పూర్ణచంద్రరావుకు నచ్చకపోవడంతో ఆ ప్రయత్నమూ నిలిచిపోయింది. స్క్రిప్ట్ విని, కొన్ని మార్పులు చేసేందుకు మదన్ డి.వి.నరసరాజుని కలిశారు. తాకట్టు లేకుండా ఏదీ అప్పుగా ఇవ్వని కోట పాత్ర హీరోకి తాకట్టు లేకుండానే అప్పు ఇస్తాడు. అదెలా సాధ్యపడుతుందన్న సందేహం తీరకపోవడంతో, డి.వి.నరసరాజు "మోసం చేయడం కూడా చేతకాని పిచ్చివాడివి.. అందుకే తాకట్టు లేకుండా అప్పు ఇస్తున్నాను" అన్న డైలాగు రాశారు. ఆ సమస్య పరిష్కారమైపోయింది. ఇలా ఓ వైపు స్క్రిప్టు పదునుగా తయారవుతూండగా సరైన దర్శకుడు మాత్రం దొరకలేదు. ప్రకాష్ రాజ్ కి ఈ కథ చెప్పారు. ఆయన బావుంది అంటూనే సినిమా కన్నా నవల అయితే సరిగా సరిపోతుందేమో ఆలోచించమని సలహా ఇచ్చారు.
ఆ దశలోనే అప్పటికి రెండు సినిమాల తీసిన చంద్ర సిద్దార్థ కలిశారు. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమన్నారు. అయితే అంతిమయాత్ర కథ అప్పటికే చాలామంది తిప్పికొట్టడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన మదన్ చెప్పలేదు. ఓసారి చంద్రసిద్దార్థ్ లేని సమయంలో ఆయన అన్న కృష్ణమోహన్ తో మాట్లాడుతూండగా అంతిమయాత్ర కథ ప్రస్తావన వచ్చింది. కొద్దిగా విన్న కథని పూర్తిస్థాయిలో చెప్పించుకుని చివరకి ఆ సినిమానే చేయమని, వేరే కథల కోసం వెతకవద్దని తమ్ముడికి ఆయన గట్టి సలహా ఇచ్చారు. దాంతో పూర్ణచంద్రరావు వద్ద ఉన్న స్క్రిప్ట్ చంద్రసిద్ధార్థ్ తీసేసుకున్నారు. చంద్రసిద్ధార్థ్ సోదరుడు రాజేంద్రప్రసాద్ ప్రేమ్ కుమార్ పట్రా నిర్మించిన మేఘం సినిమాకి కెమెరామేన్ గా పనిచేశారు. ఆయన తదుపరి సినిమా కోసం ఏదైనా సూచన చేయమంటే ఈ ప్రాజెక్టును సూచించగా, ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు. మొదట్లో స్క్రిప్టుకు పేరు "అంతిమ యాత్ర"గా పెట్టినా, దాన్ని మరేదైనా పేరుకు మారుద్దామనుకున్నారు. సినిమా తీద్దామనుకున్న నాటి నుంచీ చంద్రసిద్ధార్థ్ కీ, మదన్ కీ విడివిడిగా మనస్పులో ఆ నలుగురు అన్న పేరు నలుగుతూంది, ఇద్దరూ ఏ పేరు పెడదామని అనుకున్నాకా అదే పేరు చెప్పడంతో అదే ఖాయమైపోయింది.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

సినిమాలో కథానాయకుడు రఘురాం పాత్ర వయసుమళ్ళిన పత్రికాసంపాదకుని పాత్ర. భావోద్వేగాలు బాగా పండించాల్సిన పాత్ర కావడంతో మొదట సినిమా తీద్దామనుకున్న అట్లూరి పూర్ణచంద్రరావు దర్శక నటులు విసు, దాసరి నారాయణరావు, నటుడు మోహన్‌ బాబులలో ఎవరో ఒకరితో ఆ పాత్ర చేయించాలని భావించారు. వీరెవరితోనూ కుదరకుంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత కె.భాగ్యరాజాకు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశం తాను కథానాయక పాత్ర పోషిస్తానని పట్టుపట్టినందు వల్లనే చేజారింది.

తర్వాత సినిమాని చేపట్టిన దర్వకుడు చంద్రసిద్ధార్థ్, మదన్ కథానాయకుని పాత్రకు రాజేంద్ర ప్రసాద్ని జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా సంప్రదించారు. రాజేంద్రప్రసాద్ ఇంటి బెడ్రూంలో మదన్ దర్శకుడికి, రాజేంద్రప్రసాద్ కీ కథ వినిపించారు. కథ పూర్తికాగానే ఒకరు బాత్రూంలోకి, మరొకరు బాల్కనీలోకి వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలిపోయిన కథారచయిత మదన్ ఇక ఈ అవకాశమూ చేజారిపోయినట్టే అని నిరుత్సాహపడే దశలో రాజేంద్రప్రసాద్ కళ్ళుతుడుచుకుని వచ్చి ఈ సినిమా వెనువెంటనే ప్రారంభించాలని తన నిర్ణయం చెప్పేశారు. తర్వాత రాజేంద్రప్రసాద్ తన పాత్ర ప్రవర్తించే తీరు, సంభాషణలు చెప్పే విధానం, కళ్ళజోడు, పంచెకట్టు, విగ్గు ఇలా అన్నీ ఎలావుండాలో ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు.

రాజేంద్రప్రసాద్ పక్కన కథానాయిక పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. లక్ష్మి, గౌతమి, భానుప్రియ, రోజా మొదలైన గతతరం కథానాయికలకు కథ వినిపించారు. అందరూ కథ చాలాబావుందని మెచ్చుకున్నవారే కానీ ఎవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. రాజేంద్రప్రసాద్ తనతో మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనిని గుర్తుచేసుకుని, ఆమెను సంప్రదించమని సలహాఇచ్చారు. కథ విని సినిమాకు ఆమని ఓకే చెప్పారు.[1]

చిత్రీకరణ

[మార్చు]

సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాదు పరిసరాల్లోనే జరిగింది. రామకృష్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, రాక్ క్యాజిల్ తదితర ప్రాంతాల్లో జరిగింది. 38 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తైంది. సినిమా దాదాపుగా కోటి పాతిక లక్షల రూపాయల బడ్జెట్లో అయింది.[1] ఆర్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర వ్యవహరించారు. సురేందర్ రెడ్డి చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేశారు.[2]

నిర్మాణానంతర కార్యక్రమాలు

[మార్చు]

సినిమా కూర్పు గిరీష్ లోకేష్ చేశారు.[2] సినిమాలో కథానాయకుని అంతిమయాత్ర ఘట్టాలు కూర్పు జరుగుతూండగా, దర్శకుడు చంద్రసిద్ధార్థ్ తండ్రి మరణించినట్టు తెలిసింది. ఆ కూర్పు కార్యక్రమాలు నిలిపివేసి ఆయన వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి ప్రారంభించి మిగతా కూర్పు పూర్తచేశారు.[1]

విడుదల, స్పందన

[మార్చు]

డిసెంబరు 9, 2004న సినిమా విడుదలైంది. విడుదలైన రోజున ఈ సినిమా థియేటర్లకు దాదాపు ఖాళీగా ఉన్నాయి. రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. విడుదల చేసినప్పుడు 27 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ స్పందనతో వాటిలో 16 ప్రింట్లు వెనక్కి వచ్చేశాయి. మిగిలిన 11 ప్రింట్లు కూడా వెనక్కి తిరిగివచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ దశలో రెండు వారాలు గడిచాకా సినిమా మౌత్ టాక్ తో సినిమా పుంజుకుంది. హఠాత్తుగా మొత్తం రోజంతా అన్ని షోలూ హౌస్ ఫుల్ అయ్యాయి. ఆ నలుగురు బృందమే కాక మిగతా సినిమా వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని, విమర్శకుల నుంచి ప్రశంసలను పొందింది. అవార్డులను కూడా సాధించింది.[1]

రీమేక్స్

[మార్చు]

ఆ నలుగురు సినిమా కన్నడ, మరాఠీ భాషల్లో పునర్నిర్మితమైంది. కన్నడంలో సిరివంత పేరుతో ప్రముఖ నటుడు విష్ణువర్థన్ ప్రధానపాత్రలో నటించగా ఎస్.నారాయణ్ దర్శకత్వంలో నిర్మించారు. తెలుగు వెర్షన్ ని మించిన భారీ విజయాన్ని ఆ సినిమా పొందింది.[3] విమర్శకుల ప్రశంసలు, పలు రంగాల ప్రముఖుల అభిమానం పొందింది.[4] ఆ నలుగురు సినిమాను ప్రముఖ నటుడు శాయాజీ షిండే మరాఠీలో మాఝి మనస్ పేరిట పునర్నిర్మించారు. సినిమా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చడంతో ఆయన ఈ సినిమాను పునర్నిర్మించారు. అయితే మరాఠీలో సినిమా పరాజయం పాలైంది. శాయాజీ షిండే ఈ సినిమాని హిందీలో తను ప్రధాన పాత్రలో హిందీలో పునర్నిర్మించాలని ఆశించారు. ఒకవేళ అందుకు కుదరకుంటే కనీసం తన మరాఠీ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావించారు. హిందీలో పునర్నిర్మించడానికి, లేదా కనీసం డబ్బింగ్ చేయడానికి హక్కుల కోసం మదన్ ను పలుమార్లు సంప్రదించారు. కానీ అందుకు మదన్ అంగీకరించలేదు. అయితే ఆయన ఎప్పటికైనా సినిమాను హిందీలో తీయాలని, అందుకు కుదరకుంటే తాను తీసిన మరాఠీ చిత్రాన్నే మరింత ప్రచారంతో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సినిమా మరాఠీ ప్రజల్లో వీలైనంతమందికి చేరాలని ఆయన కోరిక.[5] ఇక తమిళ హక్కులను మొదట సినిమా నిర్మిద్దామనకున్న అట్లూరి పూర్ణచంద్రరావు తన వద్దే ఉంచుకున్నారు. ఆయన తమిళంలో రజనీకాంత్ తోనూ, హిందీలో అమితాబ్ బచ్చన్ తోనూ ఈ సినిమాను నిర్మించాలని ఆశించారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు.[1]

అవార్డులు

[మార్చు]
  • 2004 - ఉత్తమ చిత్రం - నంది అవార్డు
  • రాజేంద్ర ప్రసాద్ (రఘురామయ్య)- ఉత్తమ నటుడు - నంది అవార్డు
  • కోట శ్రీనివాసరావు (కోటయ్య) - ఉత్తమ క్యారెక్టర్ నటుడు

పాటలు

[మార్చు]
  • ఇంకో రోజొచ్చిందండి - బాలు, బాలాజీ - రచన: చైతన్య ప్రసాద్
  • ఒక్కడై రావడం - బాలు - రచన: చైతన్య ప్రసాద్
  • గుండెపై తన్నుతూ - బాలు, ఆర్.పి.పట్నాయక్, ఉష - రచన: చైతన్య ప్రసాద్
  • నలుగురూ మెచ్చిన - బాలు - రచన: చైతన్య ప్రసాద్
  • గుడ్ మార్నింగ్ - వాద్యగానం
  • విష్ యు హేపీ మ్యారీడ్ లైఫ్ - వాద్యగానం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 పులగం, చిన్నారాయణ. "నలుగురూ మెచ్చిన ఆ నలుగురు". సాక్షి. Retrieved 10 August 2015. సినిమా వెనుక స్టోరీ - 2
  2. 2.0 2.1 ఆ నలుగురు సినిమా టైటిల్స్
  3. రిపోర్టర్. "Kannada film 'Sirivantha' continues to reign". హైబీమ్ రీసెర్చ్. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 12 August 2015.
  4. రిపోర్టర్. "ఫార్మర్ పిఎం పాట్ సిరివంత". ఇండియా గ్లిట్జ్. Archived from the original on 1 నవంబరు 2013. Retrieved 12 August 2015.
  5. విలేకరి. "ఇంటర్వ్యూ విత్ శాయాజీషిండే". ఐడిల్ బ్రెయిన్. Retrieved 12 August 2015.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆ_నలుగురు&oldid=4212705" నుండి వెలికితీశారు