ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్
Temporal range: Pliocene
శిలాజాలు
శిలాజాలు
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: క్షీరదాలు
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Australopithecus
Species:
A. anamensis
Binomial name
Australopithecus anamensis
M.G. Leakey et al., 1995
Synonyms
  • ప్రేయాంత్రోపస్ అనామెన్సిస్

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ అనేది హోమినిని తెగకు చెందిన జాతి. ఇది సుమారు 42, 38 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య నివసించింది [1] ఇది ఆస్ట్రలోపిథెకస్ జాతుల్లో కెల్లా అత్యంత పురాతనమైనది. [2] కెన్యా, [3] [4] ఇథియోపియాల్లో [5] 20 మందికి పైగా వ్యక్తులకు చెందిన దాదాపు వంద శిలాజాలు దొరికాయి. ఈ వంశంలోనే ఎ. అఫారెన్సిస్ కూడా ఉద్భవించిందని సాధారణంగా అంగీకరించే విషయం. [6] అయితే, ఎ. అనామెన్సిస్, ఎ. అఫారెన్సిస్ లు ఒకే కాలంలో జీవించినట్లు తెలుస్తోంది. ఆధునిక మానవులకు దారితీసిన వంశం ఈ రెంటిలో దేన్నుండి ఉద్భవించిందనే అంశం ఇంకా తేలలేదు. [7] శిలాజ ఆధారాల ప్రకారం, తుర్కానా బేసిన్లోని మొట్టమొదటి హోమినిన్ జాతి ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ అని నిర్ధారణ అయింది. [8] కానీ దాని అంత్య కాలంలో అఫారెన్సిస్‌తో సహ ఉనికిలో ఉండి ఉండవచ్చు. దీని ఏకైక కపాలం శిలాజపు ఎగువ భాగాన్ని విశ్లేషించినపుడు ఎ. అనామెన్సిస్ కపాల సామర్థ్యం, ఎ. అఫారెన్సిస్ కంటే తక్కువని (365-370 సెం.మీ.3 అని అంచనా) తెలిసింది. ఎ. అనామెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్‌కు చెందిన అత్యంత పురాతన జాతి. కానీ, శిలాజాలు ఎక్కువగా దొరకనందున, శాస్త్రవేత్తలు అతి తక్కువగా అధ్యయనం చేసిన జాతి కూడా ఇదే. ఎ. అనామెన్సిస్ తొలి శిలాజాలను ఉత్తర కెన్యాలోని కనపోయ్, అల్లియా బేలలో కనుగొన్నారు. ఇవి సుమారు 38 - 42 లక్షల సంవత్సరాల క్రితం నాటివి [9] అది ప్లియో-ప్లీస్టోసీన్ యుగంలో నివసించిన తొట్టతొలి ఆస్ట్రలోపిథెకస్ జాతి. [10]

కనుగోలు

[మార్చు]
జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ఎ. అనామెన్సిస్ ఎముక

1965 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనా బృందం పశ్చిమ తుర్కానా సరస్సులోని కనపోయ్ ప్రాంతంలో ప్లియోసిన్ కాలపు పొరలో భుజాస్థి (చేతి ఎముక) భాగాన్ని కనుగొంది. ఇదే, ఆ జాతి యొక్క మొట్టమొదటి శిలాజ నమూనా. ఎముకపై బ్రయాన్ ప్యాటర్సన్, విలియం డబ్ల్యూ. హోవెల్స్ రచించిన తొలి వివరణ 1967 లో సైన్స్ పత్రికలో ప్రచురించబడింది; వారి విశ్లేషణలో దీన్ని 25 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఒక ఆస్ట్రలోపిథెకస్ నమూనాగా సూచించారు. [11] తరువాత, ఆ ప్రదేశంలో లభించిన జంతు శిలాజాల వయస్సు ఆధారంగా పాటర్సన్, అతని సహచరులు ఈ స్పెసిమెన్ వయస్సును 40 – 45 లక్షల సంవత్సరాల క్రితానికి సవరించారు. [12] [13]

1994 లో, లండన్లో జన్మించిన కెన్యా పాలియోఆంత్రోపాలజిస్ట్ మీవ్ లీకీ, పురావస్తు శాస్త్రవేత్త అలాన్ వాకర్‌లు అల్లియా బే స్థలంలో తవ్వకాలు జరిపి, ఈ హోమినిడ్ కు చెందిన అనేక శకలాలను కనుగొన్నారు. వీటిలో పూర్తి దిగువ దవడ ఎముక ఒకటి. ఇది సాధారణ చింపాంజీ (పాన్ ట్రోగ్లోడైట్స్) ని పోలి ఉంది. కాని దీని దంతాలకు మానవుని దంతాలతో ఎక్కువ సారూప్యత ఉంది. అందుబాటులో ఉన్న పరిమిత పోస్ట్‌క్రానియల్ సాక్ష్యాల ఆధారంగా, ఎ. అనామెన్సిస్ పై అవయవాల్లో (చేతులు) ఆదిమ లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ, అది అలవాటుగా రెండు కాళ్ళపై నడిచేదని అనిపిస్తోంది. [14]

1995 లో, మీవ్ లీకీ, ఆమె సహచరులు, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్కు ఈ కొత్త జీవికీ మధ్య తేడాలను గమనించి, దీన్ని ఎ. అనామెన్సిస్ అనే ఒక కొత్త జాతికి కేటాయించారు. తుర్కానా పదం అనామ్ (సరస్సు) నుండి ఈ పేరును తిసుకున్నారు. [3] ఈ జాతి చాలా ఇతర జాతుల కంటే భిన్నంగా ఉందని లీకీ నిర్ణయించింది.

తవ్వకం బృందానికి పళ్ళు, పాదాలు, కాళ్ళు వగైరాలు కనిపించనప్పటికీ, ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ తరచుగా చెట్లు ఎక్కుతూండేదని మీవ్ లీకీ అభిప్రాయపడింది. చెట్టు ఎక్కడం అనేది 25 లక్షల సంవత్సరాల క్రితం మొదటి హోమో జాతి కనిపించే వరకు, చెట్లు ఎక్కడం అనేది తొలి హోమినిన్లన్నిటికీ అలవాటైన ప్రవర్తన. ఎ. అనామెన్సిస్‌లో, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ కు ఉన్న అనేక లక్షణాలు ఉన్నాయి. అసలది ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ కు ప్రత్యక్ష పూర్వజుడై ఉండవచ్చు కూడా. ఎ. అనామెన్సిస్ యొక్క శిలాజ రికార్డులు 42 - 39 లక్షల సంవత్సరాల క్రితాల మధ్యవని డేటింగులో తేలింది. [15] 2000 లలో చేసిన స్ట్రాటిగ్రాఫిక్ సీక్వెన్సుల డేటింగులో ఈ శీలాజాలు లభించిన భూపొరలు 41–42 లక్షల సంవత్సరాల క్రితం నాటివని తేలింది. [5] ఈ స్పెసిమెన్లు లభించిన అగ్నిపర్వత బూడిద యొక్క రెండు పొరలు 41.7, 41.2 లక్షల సంవత్సరాల క్రితం నాటివని తేలింది. యాదృచ్చికంగా ఎ. అఫారెన్సిస్ శిలాజ రికార్డులో కనిపించింది కూడా ఈ కాలం లోనే. [4]

మొత్తం ఇరవై ఒక్క శిలాజాలలో ఎగువ, దిగువ దవడలు, కపాలపు శకలాలు, కాలి ఎముక (టిబియా) యొక్క ఎగువ, దిగువ భాగాలు ఉన్నాయి. పైన పేర్కొన్న, ముప్పై సంవత్సరాల క్రితం కనపోయి వద్ద అదే స్థలంలో దొరికిన భుజాస్థి ముక్కను కూడా ఇప్పుడు ఈ జాతికే కేటాయించారు.

2006 లో, ఈశాన్య ఇథియోపియాలో ఓ కొత్త ఎ. అనామెన్సిస్ శిలాజాన్ని కనుగొన్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎ. అనామెన్సిస్ పరిధి విస్తరించింది. ప్రత్యేకించి, ఆసా ఇస్సీ అనే స్థలంలో 30 ఎ. అనామెన్సిస్ శిలాజాలు దొరికాయి. [16] అటవీ భూమికి చెందిన ఈ శిలాజాల్లో, అప్పటి వరకూ లభించనంతటి అతిపెద్ద కోర పళ్ళు, అత్యంత పురాతన ఆస్ట్రలోపిథెకస్ తొడ ఎముక కూడా ఉన్నాయి. [5] ఇవి దొరికినది మధ్య అవాష్ అనే ప్రదేశంలో. ఇక్కడే ఆ తరువాతి కాలపు ఆస్ట్రలోపితిసస్ శిలాజాలు కూడా అనేకం దొరికాయి. ఇక్కడికి కేవలం ఆరు మైళ్ళ దూరం లోనే, ఆర్డిపిథెకస్ ప్రజాతి లోని అత్యంత ఆధునిక జాతి, ఆర్డిపిథెకస్ రామిడస్ లభించింది. ఆర్డిపిథెకస్ మరింత ప్రాచీనమైన హోమినిడ్. ఇది పరిణామ వృక్షంపై ఆస్ట్రలోపిథెకస్‌కు క్రింద ఉన్న దశగా పరిగణిస్తున్నారు. ఎ. అనామెన్సిస్ శిలాజం 42 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని, ఆర్. రామిడస్ 44 లక్షల సంవత్సరాల క్రితం నాటిదనీ డేటింగులో నిర్ధారించారు. ఈ రెండు జాతుల మధ్య 2,00,000 సంవత్సరాలు మాత్రమే ఎడం ఉంది. దీనితో పరిణామ కాలక్రమంలో ఆస్ట్రలోపిథెకస్ కంటే ముందరి హోమినిడ్ ఖాళీ మరొకదాన్ని పూరించినట్లైంది. [17]

ఇథియోపియాలోని అఫర్ ప్రాంతంలో, 36 నుండి 38 లక్షల సంవత్సరాల క్రితం నాటికి చెందిన సుమారు 90 శిలాజాలను కనుగొన్నట్లు 2010 లో యోహన్నెస్ హైల్-సెలాస్ తదితరులు పత్రికలో ప్రచురించిన వ్యాసాల్లో వివరించారు. ఇవి ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ ల మధ్యనున్న కాలానికి చెందినవి. ఈ శిలాజాల్లో ఈ రెండింటి లక్షణాలూ ఉన్నాయి. ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ లు రెండూ పరిణామం చెందుతున్న ఒకే జాతికి చెందినవనే (అనాజెనెసిస్ ద్వారా ఉద్భవించిన క్రోనోస్పీసీస్ [2]) ఆలోచనకు (ఉదాహరణకు 2006 లో కింబెల్ తది. ప్రతిపాదించినట్లుగా [6]) ఈ శిలాజాలు సమర్ధించాయి .కానీ 2019 ఆగష్టులో, అదే హైలే-సెలాస్ బృందం లోని శాస్త్రవేత్తలు మొదటిసారిగా దాదాపుగా చెక్కుచెదరకుండా ఉన్న పుర్రెను ఇథియోపియాలో కనుగొన్నట్లు ప్రకటించారు. ఇది ఎ. అనామెన్సిస్ కు చెందినది, 38 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆవిష్కరణను బట్టి, అంతకు ముందు కనుగొన్న 39 లక్షల సంవత్సరాల నాటి నుదుటి ఎముక శిలాజం ఎ. అఫారెన్సిస్ కు చెందినదనే సూచన ఏర్పడింది. అంటే ఈ రెండు జాతులు ఎక కాలంలో జీవించాయని, అవి క్రోనోస్పీసీస్ కావని కూడా తెలిసింది. (అయితే, ఎ. అఫారెన్సిస్, ఎ. అనామెన్సిస్ నుండి ఉత్పన్నం కాలేదని చెప్పినట్లు కాదని, ఎ. అనామెన్సిస్ జనాభాలోని కొంత భాగం నుండి ఉత్పన్నమైందనీ పేర్కొంది.) [7] [18] ఈ పుర్రెను అఫార్‌కు చెందిన పశువుల కాపరి అలీ బెరీనో 2016 లో కనుగొన్నాడు. [19] ఇతర శాస్త్రవేత్తలు (ఉదా అలెంసెగెడ్, కింబెల్, వార్డ్, వైట్) ఒక్క నుదుటి ఎముక శిలాజంపై ఆధారపడి (ఈ ఎముక ఎ. అఫారెన్సిస్‌దే అని ఖచ్చితంగా భావించలేదని వారు హెచ్చరించారు), అనాజెనిసిస్ జరిగిందనే అవకాశాన్ని అప్పుడే తోసిపుచ్చలేమని అన్నారు.

అలీ బెరినో 2016 లో ఇథియోపియాలో కనుగొన్న పుర్రె హోమినిన్ల పరిణామ వంశాన్ని పూరించడంలో ముఖ్యమైనది. ఈ పుర్రెలో పూర్వీకుల నుండి పొందిన లక్షణాలతో పాటు, కొన్ని ఉత్పన్నమైన లక్షణాలూ ఉన్నాయి. దీని కపాల సామర్థ్యం ఎ. అఫారెన్సిస్ కంటే చాలా చిన్నది, ముఖం బాగా ముందుకు పొడుచుకుని వచ్చి ఉంది. ఈ రెండు లక్షణాలను బట్టి ఈ కపాలం ఎ. అఫారెన్సిస్ కంటే పురాతనమైనదని నిర్ధారించారు. MRD కపాలం అని పిలిచే ఈ కపాలంలోని అరిగిపోయిన పోస్ట్-కానైన్ పళ్ళను బట్టి ఇది "బాగా ఎదిగే వయస్సులో" ఉన్న పురుషుడిదని నిర్ణయించారు. దంతాల్లో మెసియోడిస్టల్ ఎలాంగేషను ఉంది; ఇది ఎ. అఫారెన్సిస్ లో లేదు. అయితే, ఇతర ఆస్ట్రలోపిత్‌ల మాదిరిగానే, దీని ముఖం లోని పై భాగం సన్నగా, నుదురు లేకుండా, ముఖం మధ్య భాగం వెడల్పు గానూ, వెడల్పాటి జైగోమాటిక్ ఎముకల తోనూ ఉంది. ఈ కొత్త శిలాజాన్ని కనుక్కోవడానికి ముందు, ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ లు ఒకే వంశంలో ఒకదాని వెంటనే ఒకటి ఉద్భవించాయని భావించేవారు. అయితే, MRD కనుగొనడంతో, ఎ. అఫారెన్సిస్ అనాజెనెసిస్ (ఒక జీవి మరొక జీవిగా పరిణామం చెందడం, ఈ పరిణామ క్రమంలో ఏ సమయంలో చూసినా ఒకే జీవి ఉంటుంది. రెండు రకాల జీవులు ఉండవు.) ద్వారా ఉత్పన్నం కాలేదని, ఈ రెండు హోమినిన్ జాతులు కనీసం 1,00,000 సంవత్సరాల పాటు పక్కపక్కనే జీవించాయనీ సూచనలొచ్చాయి.

పర్యావరణం

[మార్చు]

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్‌ను కెన్యాలో, తూర్పు తుర్కానాలోని అల్లియా బే వద్ద కనుగొన్నారు. స్థిరమైన ఐసోటోప్ డేటా విశ్లేషణలను బట్టి, అవి తుర్కానా సరస్సు చుట్టుపక్కల బాగా గుబురుగా ఉన్న అడవులలో నివసించేవని భావిస్తున్నారు. అల్లియా బే వద్ద బాగా దట్టమైన అడవులు, ప్రాచీన ఓమో నది వెంట ఉండేవి. బేసిన్ మార్జిన్లు లేదా ఎత్తైన ప్రదేశాలలో సవాన్నాలు ఉండేవని భావిస్తున్నారు. అదేవిధంగా అల్లియా బే వద్ద, పర్యావరణం చాలా తడిగా ఉండేదని సూచన లున్నాయి. అంత కచ్చితంగా తెలియనప్పటికీ, అల్లియా బే వద్ద గింజలు లేదా విత్తనాలు కాసే చెట్లు ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం. [20]

ఆహారం

[మార్చు]

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ నములు దంతాల సూక్ష్మ అరుగుదలపై చేసిన అధ్యయనాల్లో వాటిపై పొడవాటి గీతలు ఉన్నట్లు గమనించారు. గొరిల్లాల దంతాలపై కూడా ఇలాంటి అరుగుదలే ఉంటుంది; ఆధునిక గొరిల్లా తినే లాంటి ఆహారమే ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ కూడా తినేదని ఇది సూచిస్తోంది. [21] ఈ అరుగుదల అన్ని ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ దంతాల శిలాజాలపై ఒకే రకంగా ఉంది -అవి లభించిన స్థానం, సమయంతో సంబంధం లేకుండా. దీన్ని బట్టి, అవి జీవించిన పర్యావరణం ఎలాంటిదైనా వాటి ఆహారం మాత్రం దాదాపు ఒకే విధంగా ఉండేదని ఇది సూచిస్తోంది.

తుర్కానా బేసిన్ లో హోమినిన్ జాతులలోని మొట్టమొదటి ఆహార ఐసోటోప్ ఆధారం ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ లోనే దొరికింది. వారి ఆహారం ప్రధానంగా సి3 వనరులను కలిగి ఉందని ఈ సాక్ష్యం సూచిస్తోంది. అయితే తక్కువ మొత్తంలో సి4 జనిత వనరులు కూడా ఉండి ఉండవచ్చు. తరువాతి 19.9 - 16.7 లక్షల సంవత్సరాల కాల వ్యవధిలో, కనీసం రెండు విలక్షణమైన హోమినిన్ టాక్సాలు C4 వనరులను ఎక్కువగా తిన్నాయని గమనించారు. ఆ సమయంలో ఆహారంలో ఈ మార్పు ఎందుకు జరిగిందో తెలియదు. [8]

ఎ. అనామెన్సిస్ కు మందపాటి, పొడవైన, సన్నటి దవడలు ఉన్నాయి. వాటి దంతాలు సమాంతరంగా అమర్చబడి ఉన్నాయి. అంగిలిని, దంతాల వరుసలను, దంతాల అమరికనూ గమనిస్తే, ఎ. అనామెన్సిస్ ఉభయాహారులని తెలుస్తుంది. వాటి ఆహారంలో చింపాంజీల మాదిరిగానే పండ్లు ఎక్కువగా ఉండేవి. [22] ఈ లక్షణాలు అర్ రామిడస్ నుండి వచ్చాయి. రామిడస్, ఎ. అనామెన్సిస్‌కు ముందు ఉన్నట్లు భావిస్తున్నారు. పండ్లు తినడం ఆపి, ఇది గట్టి ఆహారాన్ని తిన్నట్లుగా సూచనలున్నాయి. దంతాలపైని పింగాణీ మందంగా ఉండడాన్ని బట్టి, మరింత తీవ్రమైన దంతాల కొనలను బట్టీ దీన్ని గుర్తించారు.

ఇతర హోమినిన్ జాతులకు సంబంధం

[మార్చు]

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఆర్డిపిథెకస్ రామిడస్‌కు ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌కూ మధ్య నున్న జాతి. దీనిలో మానవులు, ఇతర వాలిడుల లక్షణాలు రెండూ ఉన్నాయి. [23] ఎ. అనామెన్సిస్ మణికట్టు నిర్మాణాన్ని పరిశీలించినపుడు ఇది పిడికిళ్ళపై నడిచేదని తెలిసింది. ఇది ఇతర ఆఫ్రికన్ వాలిడుల కున్న లక్షణమే. ఎ. అనామెన్సిస్ చేతికి బలమైన వేళ్ళ ఎముకలు, మెటాకార్పాల్స్ ఉన్నాయి. వేళ్ళ మధ్య-ఎముకలు పొడవుగా ఉన్నాయి. ఈ లక్షణాలను బట్టి, ఎ. అనామెన్సిస్ చెట్లపై నివసించేదని తెలుస్తుంది. ఎక్కువగా రెండు కాళ్లపైనే నడిచేదని కూడా తెలుస్తున్నప్పటికీ, అది హోమో నడకలా ఉండేది కాదు.

ఆస్ట్రలోపిథెకస్ లన్నీ ద్విపాదులే. చిన్న మెదడు, పెద్ద దంతాలు కలిగి ఉన్నవే. [24] ఎ. అనామెన్సిస్ ఎముక నిర్మాణం, అడవులలో నివసించే లక్షణాలూ ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌ లాగే ఉండడం వలన, దీన్ని ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌గా భావించడం జరుగుతూంటుంది. ఈ సారూప్యతలలో మందపాటి దంతాల పింగాణీ కూడా ఉంది. ఈ లక్షణం ఆస్ట్రలోపిథెకస్ లన్నిటికీ ఉన్నదే. మయోసీన్ కాలపు హోమినాయిడ్లలో చాలావరకూ ఈ లక్షణం ఉంది. [23] ఎ. అనామెన్సిస్‌లో పంటి పరిమాణంలోని వైవిధ్యం, శరీర పరిమాణంలోకూడా గణనీయమైన వైవిధ్యం ఉందని సూచిస్తోంది. ఆహారానికి సంబంధించి, ఎ. అనామెన్సిస్ లో దానికి ముందున్న ఆర్డిపిథెకస్ రామిడస్‌తో సారూప్యత లున్నాయి. కొన్ని ఎ. అనామెన్సిస్ లలో కోరపళ్ళు మలి ఆస్ట్రలోపిథెకస్ జాతుల కంటే పెద్దవిగా ఉన్నాయి. దండ లోను కాలి ఎముకల్లోనూ ఎ. అనామెన్సిస్, ఎ. అఫారెన్సిస్ లకు సారూప్యత లున్నాయి.. ఆ రెండిట్లోనూ మానవ లక్షణాలు, సరిపోలే పరిమాణాలూ ఉన్నాయి. ఎ. అనామెన్సిస్ దేహపరిమాణం ఎ. అఫారెన్సిస్ కంటే పెద్దదని కనుగొన్నారు. ఇథియోపియా లోని హాదర్ స్థలంలో లభించిన అఫారెన్సిస్ శిలాజాల మణికట్టు లోని ఎముకలు, వ్యాసార్థంలో అఫారెన్సిస్ తో సరిపోలి ఉన్నాయి. ఆధునిక మానవులతో పోలిస్తే ఎ. అనామెన్సిస్ చేతులు పొడవుగా ఉన్నాయని అదనపు పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. RFI Afrique par Simon Rozé Publié le 28-08-2019 Modifié le 29-08-2019 à 11:00, http://www.rfi.fr/afrique/20190828-ethiopie-decouverte-plus-vieux-fossile-australopitheque
  2. 2.0 2.1 Haile-Selassie, Y (27 October 2010). "Phylogeny of early Australopithecus: new fossil evidence from the Woranso-Mille (central Afar, Ethiopia)". Philosophical Transactions of the Royal Society B: Biological Sciences. 365 (1556): 3323–3331. doi:10.1098/rstb.2010.0064. PMC 2981958. PMID 20855306.
  3. 3.0 3.1 Leakey, Meave G.; Feibel, Craig S.; MacDougall, Ian; Walker, Alan (17 August 1995). "New four-million-year-old hominid species from Kanapoi and Allia Bay, Kenya". Nature. 376 (6541): 565–571. Bibcode:1995Natur.376..565L. doi:10.1038/376565a0. PMID 7637803.
  4. 4.0 4.1 Leakey, Meave G.; Feibel, Craig S.; MacDougall, Ian; Ward, Carol; Walker, Alan (7 May 1998). "New specimens and confirmation of an early age for Australopithecus anamensis". Nature. 393 (6680): 62–66. Bibcode:1998Natur.393...62L. doi:10.1038/29972. PMID 9590689.
  5. 5.0 5.1 5.2 White, Tim D.; WoldeGabriel, Giday; Asfaw, Berhane; Ambrose, Stan; Beyene, Yonas; Bernor, Raymond L.; Boisserie, Jean-Renaud; Currie, Brian; Gilbert, Henry (13 April 2006). "Asa Issie, Aramis and the origin of Australopithecus". Nature. 440 (7086): 883–9. Bibcode:2006Natur.440..883W. doi:10.1038/nature04629. PMID 16612373.
  6. 6.0 6.1 Kimbel, William H.; Lockwood, Charles A.; Ward, Carol V.; Leakey, Meave G.; Rake, Yoel; Johanson, Donald C. (2006). "Was Australopithecus anamensis ancestral to A. afarensis? A case of anagenesis in the hominin fossil record". Journal of Human Evolution. 51 (2): 134–152. doi:10.1016/j.jhevol.2006.02.003. PMID 16630646.
  7. 7.0 7.1 Haile-Selassie, Yohannes; Melillo, Stephanie M.; Vazzana, Antonino; Benazzi, Stefano; Ryan, Timothy M. (2019). "A 3.8-million-year-old hominin cranium from Woranso-Mille, Ethiopia". Nature. 573 (7773): 214–219. doi:10.1038/s41586-019-1513-8. PMID 31462770.
  8. 8.0 8.1 Cerling, Thure E.; Manthi, Fredrick Kyalo; Mbua, Emma N.; Leakey, Louise N.; Leakey, Meave G.; Leakey, Richard E.; Brown, Francis H.; Grine, Frederick E.; Hart, John A. (June 25, 2013). "Stable isotope-based diet reconstructions of Turkana Basin hominins". Proceedings of the National Academy of Sciences of the United States of America. 110 (26): 10501–10506. Bibcode:2013PNAS..11010501C. doi:10.1073/pnas.1222568110. PMC 3696807. PMID 23733966.
  9. Ward, Carol; Leakey, Meave; Walker, Alan (1999). "The new hominid species Australopithecus anamensis". Evolutionary Anthropology: Issues, News, and Reviews (in ఇంగ్లీష్). 7 (6): 197–205. doi:10.1002/(SICI)1520-6505(1999)7:63.0.CO;2-T (inactive 2019-12-06). ISSN 1520-6505.{{cite journal}}: CS1 maint: DOI inactive as of డిసెంబరు 2019 (link)
  10. Lewis, Barry; et al. (2013). Understanding Humans: Introduction to Physical Anthropology and Archaeology (11th ed.). Belmont, CA: Wadsworth Publishing.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  11. Patterson, B.; Howells, W. W. (1967). "Hominid Humeral Fragment from Early Pleistocene of Northwestern Kenya". Science. 156 (3771): 64–66. Bibcode:1967Sci...156...64P. doi:10.1126/science.156.3771.64. PMID 6020039.
  12. Patterson, B; Behrensmeyer, AK; Sill, WD (1970). "Geology and Fauna of a New Pliocene Locality in North-western Kenya". Nature. 226 (5249): 918–921. Bibcode:1970Natur.226..918P. doi:10.1038/226918a0. PMID 16057594.
  13. Ward, C; Leaky, M; Walker, A (1999). "The new hominid species Australopithecus anamensis". Evolutionary Anthropology. 7 (6): 197–205. doi:10.1002/(sici)1520-6505(1999)7:6<197::aid-evan4>3.0.co;2-t.
  14. C.V., Warda (2001). "Morphology of Australopithecus anamensis from Kanapoi and Allia Bay, Kenya". Journal of Human Evolution. 41 (4): 255–368. doi:10.1006/jhev.2001.0507. PMID 11599925.
  15. McHenry, Henry M (2009). "Human Evolution". In Michael Ruse; Joseph Travis (eds.). Evolution: The First Four Billion Years. pp. 256–280. ISBN 978-0-674-03175-3. (see pp.263-265)
  16. Ward, Carol; Manthi, Frederick (September 2008). "New Fossils of Australopithecus Anamensis from Kanapoi, Kenya and Evolution Within the A. Anamensis-Afarensis Lineage". Journal of Vertebrate Paleontology. 28 (Sup 003): 157A. doi:10.1080/02724634.2008.10010459.
  17. Dvorsky, George (28 August 2019). "Incredible Fossil Discovery Finally Puts a Face on an Elusive Early Hominin". Gizmodo. Retrieved 28 August 2019.
  18. Greshko, Michael, 'Unprecedented' skull reveals face of human ancestor, National Geographic, August 28, 2019
  19. Schoeninger, Margaret; Reeser, Holly; Hallin, Kris (September 2003). "Paleoenvironment of Australopithecus anamensis at Allia Bay, East Turkana, Kenya: evidence from mammalian herbivore enamel stable isotopes". Journal of Anthropological Archaeology. 22 (3): 200–207. doi:10.1016/s0278-4165(03)00034-5.
  20. Ungar, Peter S.; Scott, Robert S.; Grine, Frederick E.; Teaford, Mark F. (20 September 2010). "Molar microwear textures and the diets of Australopithecus anamensis and Australopithecus afarensis". Philosophical Transactions of the Royal Society B: Biological Sciences. 365 (1556): 3345–3354. doi:10.1098/rstb.2010.0033. PMC 2981952. PMID 20855308.
  21. Ward, Carol; Leakey, Meave; Walker, Alan (1999). "The new hominid species Australopithecus anamensis". Evolutionary Anthropology: Issues, News, and Reviews (in ఇంగ్లీష్). 7 (6): 197–205. doi:10.1002/(SICI)1520-6505(1999)7:63.0.CO;2-T (inactive 2019-12-06). ISSN 1520-6505.{{cite journal}}: CS1 maint: DOI inactive as of డిసెంబరు 2019 (link)
  22. 23.0 23.1 Ward, Carol; Leakey, Meave; Walker, Alan (1999). "The new hominid species Australopithecus anamensis". Evolutionary Anthropology: Issues, News, and Reviews (in ఇంగ్లీష్). 7 (6): 197–205. doi:10.1002/(SICI)1520-6505(1999)7:63.0.CO;2-T (inactive 2019-12-06). ISSN 1520-6505.{{cite journal}}: CS1 maint: DOI inactive as of డిసెంబరు 2019 (link)
  23. Lewis, Barry; et al. (2013). Understanding Humans: Introduction to Physical Anthropology and Archaeology (11th ed.). Belmont, CA: Wadsworth Publishing.{{cite book}}: CS1 maint: location missing publisher (link)

బయటి లింకులు

[మార్చు]