తెలుగు సాహిత్యం - తిక్కన యుగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో 1225 నుండి 1320 వరకు తిక్కన యుగము అంటారు. నన్నయతో ఆరంభమైన తెలుగు సాహితీ వైభవాన్ని శివకవులు ఇనుమడింపజేశారు. తరువాత కాకతీయుల పాలనలో ఆంధ్రదేశమంతా ఒక సామ్రాజ్యంగా ఏర్పడడంతో తెలుగు సాహిత్యం సుస్థిరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగలిగింది. కవిత్రయంలో రెండవవాడైన తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధానకవిగా గుర్తింపు పొందాడు.

ఈ యుగంలో పురాణ ఖండాలు, వచన కావ్యాలు, ప్రాకృత నాటకాలు ప్రబంధీకరింపబడడం మొదలయ్యింది. శతక కవిత్వం వర్ధిల్లింది. శైవ కవిత్వంలో ఉన్న పరమతదూషణ, స్వమత మౌఢ్యత తగ్గాయి. ఎక్కుగా ప్రబొధాత్మక రచనలు వెలువడినాయి.

రాజకీయ, సామాజిక వేపధ్యం[మార్చు]

తీరాంధ్రంలో తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికిన వేంగి రాజ్యం సా.శ. 624లో ప్రారంభమై, 1075లో అంతరించింది. తెలంగాణ ప్రాంతం అంతవరకు బాదామి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు యుద్ధభూమిగా కల్లోలితమై ఉంది. తెలంగాణంలో ఆరంభమైన కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే[1]. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).

అంతకుముందు తీరాంధ్ర ప్రాంతాన్ని కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేవాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును కమ్మ నాయకులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారెంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.

కాకతీయులు శైవమతస్థులే కాని వీరశైవాన్ని అనుసరించలేదు. అనగా కాకతీయులు వైష్ణవులను బాధించలేదు. (అయితే వారికాలంలో జైనులపై జరిగిన అత్యాచారాలను వారు నిరోధించలేకపోయారని తెలుస్తుంది). అయితే సమాజంలో శైవులకు, వైష్ణవులకు మధ్య విభేదాలు పెచ్చరిల్లి ఉన్నాయి. పలనాటి యుద్ధానికి ఇది కూడా ఒక కారణం. తిక్కనకు ముందు కాలంలో శివకవులు సృజించిన వీరశైవ సాహిత్యం సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. శైవేతరులు బహుశా ఆ సాహిత్యాన్ని ఏవగించుకొని ఉండవచ్చును కూడాను కాని అందుకు ప్రతిసాహిత్యాన్ని సృజించినట్లు లేదు. ఈ నేపథ్యంలో "భిన్న మతముల యొక్కయు, భిన్న దైవతముల యొక్కయు అవధులను దాటి తాత్వికమైన పరమార్ధమును గ్రహించి, దానిని కాలానుగుణమైన గ్రంధసృష్టి ద్వారా ప్రజలకు బోధింపగల మహాకవి ఆవిర్భావము ఆవశ్యకమైయుండును. మృ వైషమ్యములను అణచివేయు శక్తి ఒక్క అద్వైతమునకే యుండును. ఆ పరమ ధర్మమును శాస్త్రముల ద్వారా బోధిస్తే జనబాహుళ్యానికి రుచింపకపోవచ్చును. ఇలాంటి పరిస్థితిలో ధర్మాన్ని బోధింపగలిగిన మహాకవి తిక్కన ధర్మాద్వైతములను బోధించి జాతిని ఉద్ధరింపగలిగిన మహాపురుషుడయ్యాడు. తెలుగులో ఏ కవికి రాని చారిత్రిక ప్రాముఖ్యత తిక్కనకు లభించింది." [2]

ఈ యుగంలో భాష లక్షణాలు[మార్చు]

శివకవుల కాలంలో ద్విపద రచనకు, దేశి కవితకు ప్రాముఖ్యత పెరిగింది. మతంతో సంబంధం లేకుండా సాహిత్యాన్ని సేవింపగలిగే పరిస్థితి కొరవడినందువలన శివకవులును, భవికవులును పరస్పరము గర్హించుకొనసాగారు. సంస్కృతాభిమానులకు, దేశి కవితాభిమానులకు వైషమ్యాలు పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలోనే "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదు తిక్కన సాధించగలిగాడు.[2]

ముఖ్య కవులు, రచనలు[మార్చు]

ఈ యుగంలో మొట్టమొదట వెలువడిన గ్రంథం గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము. ఈ కవి పాల్కురికి సోమనాధునికి ఇంచుమించు సమకాలికుడు. రంగనాధ రామాయణం చక్కని ద్విపద కావ్యం. ఆయన రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణంగా ఖ్యాతి పొందడమే కాక పూర్వపు సంప్రదాయ పాఠ్యప్రణాళికలో కవిత్రయ భారతం, పోతన భాగవతంతో పాటుగా కలిసివుండేది. బుద్ధారెడ్డి వ్రాస్తూ యుద్ధకాండ తర్వాత ఇతిహాసాన్ని వదిలిపెట్టడంతో మిగిలిన రచనను అతని దాయాది బుద్ధారెడ్డి కుమారులు కాచనాథుడు, విఠలనాథుడు పూర్తిచేశారు.[3] గోనబుద్ధారెడ్డి అనంతరం యగకవి తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి, అ తరువాత మహాభారతం 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. కొట్టరువు తిక్కన కార్యదక్షుడైన మంత్రి, ఖడ్గ నిపుణుడైన శూరుడు, కావ్య నిర్మాత అయిన కవి, ధర్మోపదేష్ట అయిన ఆచార్యుడు, తత్వజ్ఞాన సంపన్నుడైన ఆధ్యాత్మిక సాధకుడు. ఈ మహానుభావుడు ఆంధ్రజాతి పుణ్యవశమున అవతరించినాడని చెప్పవచ్చును అని పింగళి లక్ష్మీకాంతం వ్రాశాడు. తిక్కన 1205-1210 మధ్యకాలములో జన్మించి ఉండవచ్చును. 1288లో మరణించాడు.

తిక్కన సమకాలికుడైన కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు. కేతన వ్రాసిన ఆంధ్రభాషా భూషణం తెలుగులో మొట్టమొదటి లక్షణ గ్రంథం. గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచవిభుడు, విట్ఠలుడు అనే సోదరులు తమ తండ్రి రచనయైన రంగనాధరామాయణమునకు ఉత్తరకాండమును రచించి ఆ గ్రంథాన్ని పూర్తి చేశారు. మంచన అనే కవి కేయూరబాహుచరిత్రను రచించాడు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణాన్ని వ్రాశాడు. బద్దెన నీతిసార ముక్తావళి వ్రాశాడు. ఈ బద్దెనయే సుమతీ శతకం కూడా వ్రాసాడని అభిప్రాయం ఉంది కాని అది నిరూపితం కాలేదు. శివదేవయ్య, అప్పన మంత్రి, అధర్వణుడు ఈ కాలపు కవులే కావచ్చును.

ముఖ్య పోషకులు[మార్చు]

ఇతరాలు[మార్చు]

13వ శతాబ్దిలో జరిగిన ఆంధ్రోద్యమ నఫలమే తిక్కన గారి భారతము. ఆనాడు వారు నాటిన విత్తనమే తరువాత వృక్షమైనది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur
  2. 2.0 2.1 2.2 పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  3. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]