లలితాదిత్య ముక్తాపీడుడు
లలితాదిత్య ముక్తాపీడుడు | |
---|---|
కాశ్మీర్ రాజు | |
పరిపాలన | సా.శ. 724–760 |
పూర్వాధికారి | దుర్లభక (ప్రతాపాదిత్యుడు II) |
ఉత్తరాధికారి | కువలయపీడుడు |
Spouse | కమలాదేవి, చక్రమర్దిక |
వంశము | కువలయపీడుడు, వజ్రాదిత్యుడు II |
రాజవంశం | కార్కోటక వంశం |
తండ్రి | దుర్లభక (ప్రతాపాదిత్యుడు II) |
మతం | హిందూ, బౌద్ధం |
భారత ఉపఖండంలోని కాశ్మీరును పరిపాలించిన కార్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడు లలితాదిత్య ముక్తాపీడుడు. ఇతను సా.శ. 724–760 మధ్యకాలంలో కాశ్మీర్ రాజ్యపాలన చేసాడు. కాశ్మీర్ చరిత్రలో లలితాదిత్యుని పాలనాకాలం స్వర్ణయుగంగా పేరుపొందింది. సా.శ. 12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ కవి కల్హణుడు తన విఖ్యాత చారిత్రిక గ్రంథం ‘రాజ తరంగిణి’లో లలితాదిత్యుని జైత్రయాత్రలను, అతని పరిపాలనా విశేషాలను హృద్యంగా వర్ణించాడు. అతని ప్రకారం లలితాదిత్యుని దిగ్విజయయాత్ర తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన గుజరాత్ వరకు, దక్షిణాన దక్కన్ నుంచి ఉత్తరాన ఆక్సాస్ (Oxus) నదీ లోయ, మధ్య ఆసియా ఎడారుల వరకు కొనసాగిందని తెలుస్తున్నది.[1] లలితాదిత్యుడు కనోజ్ రాజైన యశోవర్మను ఓడించాడు. తుఖారీలపై (బాక్ట్రియా రాజ్యంపై) చారిత్రిక విజయాన్ని సాధించాడు. టిబెట్‌ను జయించి చైనా లోనికి దారి తీస్తున్న 5 మార్గాలను మూసి వేసాడు.[2] ఓడిన రాజుల నుంచి తరలించిన సంపదలతో కాశ్మీర్‌లో అమోఘమైన వాస్తు నిర్మాణాలను, ప్రజోపయోగ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాడు. అతను నిర్మించిన ఆలయాలలో అనంతనాగ్ సమీపంలోని మార్తాండ దేవాలయం అత్యంత ప్రధానమైంది. తన రాజ్యంలో హిందూ, బౌద్ధమతాలను సమాదరించాడు.
ఆధార గ్రంధాలు
[మార్చు]సా.శ. 12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీరీ కవి కల్హణుడు రాసిన చారిత్రిక గ్రంథం "రాజతరంగిణి" లలితాదిత్యుని గురించిన ప్రధాన ఆధారంగా ఉంది. చైనా చక్రవర్తుల యొక్క తాంగ్ (Tang) వంశ చరిత్రను తెలిపే చిన్ తాంగ్ షు (Xin Tang shu) అనే గ్రంథంలో లలితాదిత్యుని గురించిన ప్రస్తావన కొద్దిగా ఉంది. ఈ చైనీయ గ్రంథంలో లలితాదిత్యుడు ము-తొ-పి లేదా ముదౌబి (ముక్తాపీడకు అపభ్రంశ రూపం) గా ప్రస్తావించబడ్డాడు.[3][4] సా.శ. 11 వ శతాబ్దానికి చెందిన పర్షియన్ చరిత్రకారుడు అల్బెరూని పండితునిచే 'ముత్తై' (Muttai) గా అభివర్ణించబడిన కాశ్మీరీ రాజు లలితాదిత్యుడు కావచ్చు. (ముక్తాపీడునకు అపభ్రంశ రూపం ముత్తై కావచ్చు) [3]
కల్హణుడు లలితాదిత్యుని పాలన 36 సంవత్సరాల, 7 నెలల, 11 రోజుల వరకు కొనసాగిందని, పరిపాలనా కాలం సా.శ. 700 - 736 ల మధ్య వుండి వుండవచ్చని అభిప్రాయపడ్డాడు. [5][3] కాని ఇది వాస్తవం కాదు. లలితాదిత్యుని కంటే ముందు పాలించిన ఒక రాజు సా.శ. 720 ప్రాంతంలో చైనా లోని తాంగ్ వంశ పాలకుల రాజధాని అయిన చాంగాన్‌కు ఒక దౌత్యాన్ని పంపినట్లు తాంగ్ వంశ రికార్డులు తెలుపుతున్నాయి.[6] ఈ దౌత్యాన్ని పంపిన రాజు తియాన్ము (Tianmu) గా చైనీయ రికార్డులలో ఉంది. ఈ రాజు బహుశా తారాపీడుడు కావచ్చు. మరికొందరు ఈ రాజును చంద్రపీడుడుగా గుర్తించారు.[7] ఆధునిక చరిత్రకారులు లలితాదిత్యుని పరిపాలనా కాలం క్రీ. శ. 724 నుంచి 760 మధ్య ఉండవచ్చని తెలిపారు.[8]
జీవిత విశేషాలు
[మార్చు]లలితాదిత్యుని తండ్రి ప్రతాపాదిత్యుడు-II ఒక కాశ్మీర్ రాజు. తల్లి నరేంద్రప్రభ హర్యానా లోని రోహతక్ ప్రాంతానికి చెందినది.[9] కార్కోటక వంశానికి చెందిన రెండవ ప్రతాపాదిత్యునకు దుర్లభకుడు అనే పేరు కూడా ఉంది. ప్రతాపాదిత్యుని పాలనలో కాశ్మీర్ ఒక శక్తి వంతమైన రాజ్యంగా వుండేది. నేటి పాకిస్తాన్ లోని తక్షశిల (రావల్పిండి), ఉరస (హజార), సింహపుర (అటోక్ ప్రాంతం) ప్రాంతాలు, భారతదేశంలోని రాజోరి, పూంచ్ ప్రాంతాలు అతని రాజ్యపాలన క్రింద ఉండేవి.[1] కల్హణుని రాజ తరంగిణి ప్రకారం ప్రతాపదిత్యుని ముగ్గురు కుమారులలో లలితాదిత్యుడు కనిష్ఠడు. తల్లి నరేంద్రప్రభకు ఇదివరకే కాశ్మీర్‌లో స్థిరపడిన ఒక వర్తకునితో వివాహం జరిగింది. లలితాదిత్యునికి ఇద్దరు అన్నలు ఉన్నారు. పెద్దన్న చంద్రపిద (వజ్రాదిత్యుడు), చిన్నన్న తారాపిద (ఉదయాదిత్యుడు) వీరిరువురూ కాశ్మీర్ రాజ్యాన్ని పాలించిన అనంతరం లలితాదిత్యుడు కాశ్మీర్ రాజయ్యాడు.[10] తన జీవిత కాలంలో తండ్రి, ఇద్దరు అన్నల (చంద్రపిద, తారాపిద) పరిపాలనను స్వయంగా వీక్షించగలిగాడు. ఇది దేశ పరిపాలనా అధ్యయనంలో లలితాదిత్యునికి ఎంతగానో ఉపకరించింది.[9]
లలితాదిత్యునికి ఇద్దరు భార్యలు. రాణి కమలాదేవి, రాణి చక్రమర్దిక. లలితాదిత్యుని అనంతరం కమలాదేవి కుమారుడు కువలయపీడుడు, అతని అనంతరం రాణి చక్రమర్దిక పుత్రుడైన వజ్రాదిత్యుడు రాజులు అయ్యారు. [11]
జైత్రయాత్రలు
[మార్చు]కల్హణుడు తెలిపిన వివరాల ప్రకారం లలితాదిత్య ముక్తాపీడుడు తన జీవితంలో అత్యధికభాగం సైనిక దండయాత్రలు జరపడంలోనే గడిపాడు. అవిశ్రాంతమైన జైత్రయాత్రను కొనసాగించడం ద్వారా రాజ్యాన్ని విస్తారమైన సామ్రాజ్యంగా మార్చివేశాడు. ఇతని సామ్రాజ్యం ఉత్తరాన బెంగాల్ నుంచి పశ్చిమాన గుజరాత్ వరకు, దక్షిణాన దక్కన్ నుంచి ఉత్తరాన మధ్య ఆసియా ఎడారుల వరకు వ్యాపించింది. యుద్ధాలలో చిరస్మరణీయమైన అనేక విజయాలను సాధించాడు. కల్హణుని రాజతరంగిణి గ్రంథమే ఇతని దిగ్విజయ యాత్రలకు ప్రధాన, ఏకైక ఆధారంగా ఉంది.
కనోజ్ రాజు యశోవర్మపై చారిత్రిక విజయం
[మార్చు]కనోజ్ రాజధానిగా గంగా-యమునా అంతర్వేదిని, మధ్యభారత్‌ను పాలిస్తున్న యశోవర్మ పై సాధించిన విజయం లలితాదిత్యుని జైత్రయాత్రలలో ప్రముఖమైనది.[1] లలితాదిత్యుని విజయాలలో దీనిని చారిత్రక వాస్తవంగా పలువురు చరిత్రకారులు అంగీకరించారు. మధ్య భారత్‌లో శక్తివంతుడైన యశోవర్మను ఓడించిన అనంతరం యమునా-కాళిక నదుల మధ్యన వున్న సువిశాలమైన అంతర్వేది ప్రాంతం లలితాదిత్యుని అదిపత్యంలోనికి వచ్చింది. ఈ విజయానంతరం యశోవర్మ ఆస్థానంలోని వాక్పతి, భవభూతి వంటి సుప్రసిద్ధ కవులు లలితాదిత్యుని శ్లాఘించారు. కనోజ్ రాజ్యానికి చెందిన అత్రిగుప్తుడు అనే విద్వాంసుడు (ప్రసిద్ధ కాశ్మీరీ కవి అభినవగుప్తుని పూర్వికుడు) లలితాదిత్యునిచే కాశ్మీర రాజ్యానికి తీసుకొనిరాబడ్డాడు. బహుశా ఇది లలితాదిత్యుడు యశోవర్మపై సాధించిన విజయంతో ముడిపడి ఉండవచ్చు. అనంతరకాలంలో లలితాదిత్యుడు టిబెట్‌పై సైనిక దండయాత్ర జరిపినపుడు యశోవర్మ అతనికి సాయపడినట్లు చైనా ఆధారాలు తెలియచేస్తున్నాయి.
కళింగ, గౌడ రాజ్యాలు
[మార్చు]కన్యాకుబ్జంపై తన ఆధిపత్యం స్థిరపరుచుకొన్న తరువాత లలితాదిత్యుని జైత్రయాత్ర తూర్పు సముద్రం వైపుగా పురోగమించింది. కళింగ, గౌడ రాజ్యాలను జయించాడు. గౌడ దేశంపై విజయంతో లలితాదిత్యుని సైన్యంలో గజాదళం ప్రవేశించిందని కల్హణుడు రాజతరంగిణిలో పేర్కొన్నాడు.[12]
దక్షిణాపధ రాజ్యం
[మార్చు]తూర్పు సముద్ర తీరం చేరిన పిదప లలితాదిత్యుని దండయాత్ర దక్షిణదిశగా కొనసాగింది. నాడు దక్షిణాపథ రాజ్యాన్ని కర్ణాటక రాణి రట్ట (Ratta) పాలిస్తుండేది. ఆమె వింధ్య పర్వతాల మీదగా అడ్డంకులను అధిగమిస్తూ రహదార్లను నిర్మించింది. వింధ్యవాసిని (దుర్గాదేవి) గా ప్రసిద్ధి కెక్కిన ఆమె లలితాదిత్యుని శక్తికి తలదాల్చవలసి వచ్చింది. అనంతరం లలితాదిత్యుని సైన్యం మరింత దక్షిణంగా కావేరి నదీ జలాల వరకూ చొచ్చుకొనిపోయింది. కాశ్మీరీ సైనికులు అలసట నుంచి తేరుకొన్నారని, నారీకేళీరసాలను గ్రోలుతూ, కావేరీ నదీ జలాల నుండి వీచే చల్లని పవనాలకు సేద తీరారని కల్హణుడు పేర్కొన్నాడు.[13]
పశ్చిమ సముద్ర తీర రాజ్యాలు - అవంతీ రాజ్యం
[మార్చు]అనంతరం లలితాదిత్యుడు సముద్రాన్ని దాటి సప్త కొంకణాలను చేరుకొన్నాడు.[14] ముఖ్యంగా పశ్చిమ సముద్ర తీరంలో వున్న ద్వారకా నగరం లలితాదిత్యుని సైనికులకు దివ్యనగర దర్శన తలంపును కలిగించింది.[14] తరువాత లలితాదిత్యుని గజదళం వింధ్య పర్వత శ్రేణులను దాటుకుంటూ అవంతీ రాజ్యం వైపుకు కొనసాగింది. అవంతీ రాజధాని ఉజ్జయినీ లోని మహాకాళీ కిరీటంపై చంద్రకాంతి ప్రసరించడంతో అతని ఏనుగుల దంతాలు విభజించబడ్డాయని కల్హణుడు అక్కడి ఆలయ సంప్రదాయాన్ని కలగలిపి వర్ణిస్తాడు.[14]
కాంభోజ రాజ్యం - బాక్ట్రియా రాజ్యం
[మార్చు]అనంతరం లలితాదిత్యుని జైత్రయాత్ర ఉత్తరాపథం వైపుకు అప్రతిహాతంగా కొనసాగింది. మార్గమధ్యంలో పెక్కు చిన్న రాజ్యాలను జయిస్తూ కాంభోజ రాజ్యాన్ని చేరుకొన్నాడు.[14] నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కాంభోజ రాజ్యం వుండేది. ఇది ఉత్తమ జాతి అశ్వాలకు ప్రసిద్ధి చెందింది. లలితాదిత్యుని సేనలు కాంభోజ రాజ్యాన్ని జయించి అక్కడి ఉత్తమ జాతి అశ్వాలను కొల్లగొట్టాయి. లలితాదిత్యుని సైన్యాలు సమీపించగానే బాక్ట్రియా రాజ్యంలోని తుఖారీలు తమ తమ అశ్వాలను వెనకనే వదిలేసి ఆఫ్ఘన్ పర్వత శ్రేణులవైపుకు పారిపోయారు.[14]
బాక్ట్రియా రాజ్యంలోని తుఖారీలపై లలితాదిత్యుని విజయం భారత దేశ చరిత్రలోనే అపరూపమైనది.[1] కాశ్మీరీ ప్రజలకు అది సహజమైన గర్వకారణమైనది. దీనికి సంబంధించిన ఆధారాలు అల్బెరూని అనే అరబ్బు యాత్రికుని రచనలలో కనిపిస్తుంది. సదూర ఉత్తర ప్రాంతంలోని తుఖారీలపై లలితాదిత్యుని విజయానికి చిహ్నంగా చైత్ర శుద్ధ విదియ రోజున కాశ్మీర్ ప్రజలు ఒక మహోత్సవాన్ని జరుపుకొంటారని అల్బెరూని పేర్కొన్నాడు.[1]
అక్సాస్ (Oxus) నదీలోయ ప్రాంతాలు
[మార్చు]తరువాత లలితాదిత్యుని సైన్యం మధ్య ఆసియా లోని ఆక్సస్ (Oxus) నదీ లోయను చేరుకొన్నాయి. బాదాక్ష తదితర ఎగువ ఆక్సస్ లోయలో జీవించే బాదాక్షులపైన లలితాదిత్యుడు సాధించిన విజయాలు మరింత ప్రముఖమైనవి.[1] ఈ విజయంతో లలితాదిత్యుని ప్రాభవం మధ్య ఆసియా ఎడారుల వరకూ విస్తరించింది.
టిబెట్ రాజ్యం
[మార్చు]చైనా చరిత్ర ప్రకారం లలితాదిత్యుడు టిబెట్ రాజ్యాన్ని అనేక పర్యాయాలు ఓడించాడు. టిబెట్టు వారిని ఓడించడంలో అతనికి సాయపడిన మధ్య భారత రాజు యశోవర్మే నని నిర్ధారించబడింది.[1] యశోవర్మ సాయంతో లలితాదిత్యుడు టిబెట్‌ను ఓడించి, చైనా లోనికి దారి తీస్తున్న అయిదు మార్గాలను మూసివేశాడు.[1]
కల్హణుని రచనలో చారిత్రకత
[మార్చు]లలితాదిత్యుని జైత్రయాత్రలో సాధించబడినవిగా చెప్పబడుతున్న విస్తృత విజయాలకు కల్హణుని చారిత్రిక గ్రంథం "రాజతరంగిణి" ఒక్కటే ప్రధాన, ఏకైక ఆధారంగా ఉంది. మరేతరమైన సమకాలిక ఆధారాలు ఈ జైత్రయాత్రను పేర్కొనకపోవడం వల్ల లలితాదిత్యుని జైత్రయాత్రలోని వాస్తవికతను తేల్చడానికి రాజతరంగిణిలో పేర్కొనబడిన అతని దిగ్విజయయాత్ర వర్ణనలను పలువురు చరిత్రకారులు విశ్లేషించారు. ఆనాటి దేశకాల పరిస్థితులతోను, లభించిన విదేశీ ఆధారాలతోను పోల్చి విశ్లేషించిన వారిలో M.ఆరల్ స్టెయిన్ (M. Aurel Stain), హెర్మన్ గోట్స్ (Herman Goetz), ఆండ్రూ వింక్ (Andre Wink), రొనాల్ద్ డేవిడ్‌సన్ (Ronald M Davidson), తాన్‌సేన్ సేన్ (Tansen Sen) మొదలైనవారు ముఖ్యులు.
పురావస్తు పరిశోధకుడైన M.ఆరల్ స్టెయిన్ (1900) మొదటిసారిగా రాజతరంగిణిని ఇంగ్లిష్ భాషలోనికి అనువదించాడు. లలితాదిత్యుని చేతిలో కనోజ్ రాజు యశోవర్మ ఓడిపోవడం ఒక చారిత్రిక వాస్తవంగా పేర్కొన్నాడు. అయితే అతని అనంతర విజయాల వర్ణనలో కల్హణుడు ఏ విధమైన చారిత్రక వివరాలు పేర్కొనలేని కారణంగా, తదనంతర విజయాలను పుక్కిటి పురాణంగా పేర్కొంటూ వాటిని తిరస్కరించాడు.[15] అతని ప్రకారం ఆనాటి కాశ్మీర రాజ్యానికి, అటువంటి జైత్రయాత్రను చేపట్టడానికి కావలిసిన ఆర్థిక, మానవ వనరులు కాని, విస్తృతమైన దిగ్విజయాలను అందివ్వగలిగే సైనిక సంపత్తుగాని లేవు.[16]
తరువాత కళా చరిత్రకారుడు హెర్మన్ గోట్స్ (1969) కల్హణుని ఉటంకాలకు మద్దతుగా తగిన చారిత్రిక పునర్నిర్మాణాన్ని రూపొందించాడు. అతని ప్రకారం ఆనాటికి, ఆ ప్రాంతంలోని సమకాలిక రాజ్యాలు అప్పటికే విదేశీ దండయాత్రలతో సతమతమవుతూ, నిరంతర యుద్ధాలతో బలహీనపడటం జరిగింది. లలితాదిత్యుని విస్తృత విజయాలకు అలా బలహీనపడిన రాజ్యాలు ఒక కారణమైనాయి.[17] అంతేగాక పొరుగున వున్న చైనా సైనిక శక్తిని, ఆయుధ సంపత్తిని దృష్టిలో వుంచుకొన్న లలితాదిత్యుడు తన కాశ్మీర రాజ్యానికి సైతం ఒక శక్తివంతమైన సైన్యాన్ని సృష్టించుకోగలిగాడు అని గోట్స్ అభిప్రాయపడ్డారు.[18] దీనికి అదనంగా గోట్స్ కల్హణుడు పేర్కొన్న అనేక మందిని చారిత్రిక వ్యక్తులుగా గుర్తించాడు. లలితాదిత్యుని అనంతరం అనేక తరాలకు చెందిన కల్హణుడు వంటి రచయితలు అలనాటి సమకాలిక చారిత్రిక వ్యక్తులను సృష్టించలేరని పేర్కొన్నాడు.[18] ఆండ్రూ వింక్ (2002) వంటి పరిశోధకులు సైతం గోట్స్ విశ్లేషణకు మద్దతు పలికారు.[15]
అయితే లలితాదిత్యునికి ఆపాదించబడిన విస్తృత విజయాలపై వింక్ వెలిబుచ్చిన సానుకూలతను రొనాల్ద్ డేవిడ్‌సన్ (2012) వంటి వారు తిరస్కరిస్తూ గోట్స్ విశ్లేషణను విమర్శించారు. ఇతను తన వాదనకు మద్దతుగా కల్హణుడు రాజతరంగిణిలో పేర్కొన్న "నీలమతపురాణం" ప్రశక్తిని ఉదాహరణగా తీసుకొన్నాడు. రాజతరంగిణిలోని పేర్కొన్న వివరాలకు కల్హణుడు ఆధారాలను తెలియచేస్తూ, తాను "నీలమతపురాణం" నుంచి, హేలరాజు, పద్మమహిరుడు, చవిళ్ళకారుడు వంటి వారి రచనలనుంచి విషయ సేకరణ జరిపినట్లు కల్హణుడు తన రాజతరంగిణిలో విస్పష్టంగా చెప్పాడు. లలితాదిత్యుని దిగ్విజయాలను వర్ణించేటప్పుడు కల్హణుడు తీసుకొన్న ఈ రచనా మూలాలు సందేహాస్పదమైనవి అని, వాటి ద్వారా ఆయా రాజ్యాలపై సాధించినట్లు చెప్పబడిన విజయాలు కల్పించి ఉండవచ్చని అభిప్రాయబడ్డాడు.[19] కనోజ్ ఆస్థాన కవి వాక్పతి 'గౌడవాహో'లో తన ప్రభువు యశోవర్మను కీర్తిస్తూ ఆతను తూర్పు రాజ్యాలను, దక్షిణ రాజ్యాలను మాత్రమే కాక పర్షియా రాజును కూడా జయించినట్లు పేర్కొన్నాడు. అందువలనే డేవిడ్‌సన్ 'గౌడవాహో', 'రాజతరంగిణి' రెండింటిని కవిత్వ ప్రగల్భాలుగా కొట్టిపారేశాడు. లలితాదిత్యుని విజయాలను ఘనంగా వర్ణించిన కల్హణుని రాతలను కాశ్మీర ప్రగల్భాలుగా అభివర్ణించాడు. అయితే వాక్పతి ఉటంకలతో పోలిస్తే కల్హణుని ఉటంకలే వాస్తవానికి కాస్త దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చాడు. డేవిడ్‌సన్ ప్రకారం లలితాదిత్యుడు సా.శ. 733 లో జైత్రయాత్రను ప్రారంభించి, తూర్పున మగధ వరకు పురోగమించి ఆ తరువాత సా.శ. 747 లో కాశ్మీరుకు తిరిగి వచ్చాడు.[20]
అదే విధంగా తాన్‌సేన్ సేన్ (2004) వంటి పరిశోధకులు పురాతన నాణేలను ఆధారంగా చేసుకొని, రాజతరంగిణి కాకుండా మిగిలిన సమకాలిక రికార్డులను పరిశీలించిన పిమ్మట రాజతరంగిణిలో పేర్కొనబడిన హిందూకుష్-పామీర్ పీఠభూమి ప్రాంతాలపై లలితాదిత్యుని విజయాలను తిరస్కరించారు. అతని ప్రకారం టాంగ్ (Tang) వంశానికి చెందిన చైనా చక్రవర్తులు టిబెట్‌పై జరిపిన సైనిక దండయాత్రానికి మద్దతుగా లలితాదిత్యుడు సైనిక, రవాణా తోడ్పాటును మాత్రమే అందించాడు. అయితే ఈ దండయాత్ర విజయానంతరం కాశ్మీర్ పురాణగాథలు లలితాదిత్యుని గొప్ప విజేతగా అభివర్ణించాయి.[21]
లలితాదిత్యుని తరువాత, నాలుగు శతాబ్దాల తర్వాత కల్హణుని కాలానికి లలితాదిత్యుడు సాధించిన విజయాలు అతిశయోక్తులతో ఊహాకల్పనలతో రంగులద్దబడి ఉంటాయని చరిత్ర పరిశోధకులు మనోహర్ మిశ్రా (1977) పేర్కొన్నారు. లలితాదిత్యునికి అద్భుతమైన శక్తులు (miraculous powers) కలవని ఆపాదించబడటమే దీనికి కారణం.[22] సుసాన్ ఎల్ హంటింగ్టన్ (Susan L. Huntington) (1997) ప్రకారం లలితాదిత్యుని దండయాత్రలను " నిజమైన విజయాలు సాధించిన దాడులనడం కన్నా భారీ దోపిడీకి తెగబడిన దాడులనడం సబబని అభిప్రాయబడ్డాడు.[23]
వాస్తు కట్టడాలు
[మార్చు]తన జైత్రయాత్రలో ఓడిన రాజ్యాలనుంది తరలించిన సంపదలతో లలితాదిత్యుడు కాశ్మీరులో కొత్త పట్టణాలను, వైభవోపితమైన వాస్తు కట్టడాలను నిర్మించాడు.
నగర నిర్మాణాలు
[మార్చు]పరిహాసపురం పట్టణం
[మార్చు]లలితాదిత్యుడు నిర్మించిన పట్టణాలలో అతి ముఖ్యమైనది. ఇతను జీలం (వితస్థ), సిందు నదీ సంగమ ప్రాంతంలో పరిహాసపురం అనే పట్టణాన్ని నిర్మించి దానిని తన రెండవ రాజధానిగా చేసుకొన్నాడు. ఇది నేటి పరాస్‌పూర్ (Paraspur) పట్టణంగా గుర్తించబడింది.[24] ఈ పట్టణం కాశ్మీర్ లోయలో ఒక విశాలమైన పీఠభూమిపైన, కాశ్మీరు లోయ దాని చుట్టుపట్ల గల పర్వతాల సుందర రూపం కనపడేవిధంగా నిర్మించబడింది.[2] ఈ పట్టణ విశేషాలను కల్హణుడు రాజ తరంగిణిలో పేర్కొంటూ ఈ నగరంలోనే లలితాదిత్యుని రాజ నివాస భవనం ఉండేదని, కాశ్మీర్‌లో అప్పటివరకు నిర్మించని అతి పెద్ద ఆకాశహర్మ్యాలను లలితాదిత్యుడు నిర్మించాడని వర్ణించాడు.[2] ఒకవైపు శ్రీనగర్ (ప్రవరపురం) రాజధానిగా కొనసాగుతుండగానే, రాజ నివాసంతో కూడిన పరిహాసపురం పట్టణం కొంతకాలం పాటు రెండవ రాజధానిగా కొనసాగింది.
ఇతర పట్టణాలు
[మార్చు]పరిహాసపురంతో పాటు లలితాదిత్యుడు నిర్మించబడిన ఇతర పట్టణాలు.
- సునిశ్చిత్రపురం [25]
- దర్పీతపురం [25]
- ఫలపురం (పురావస్తు శాస్త్రవేత్త M. ఆరల్ స్టెయిన్ దీనిని పరిహాసపురానికి సమీపంలో గల ఫలాపూర్ (Phalapur) గా గుర్తించాడు.) [25]
- పర్ణోత్స (పురావస్తు శాస్త్రవేత్త M. ఆరల్ స్టెయిన్ ఈ పట్టణాన్ని నేటి పూంచ్ (Poonch) పట్టణంగా గుర్తించాడు.) [25]
- లోకపుణ్య నగరం (ఇది నేటి లారిక్‌పూర్ (Larikpur) సమీపంలోని లోకభావన జలతీర్థం వద్ద గల ప్రాంతంగా గుర్తించబడింది.) [26]
అదేవిధంగా లలితాదిత్యుని రాణి చక్రమర్దిక తన పేరుమీదుగా 7000 ఇళ్ళతో కూడిన చక్రపురం నిర్మించింది.[27] లలితాదిత్యుడు రాజ్యానికి దూరంగా వున్న సమయంలో అతని వాస్తుశిల్పి లలితపురం అనే పట్టణం నిర్మించాడని, ఈ చర్య లలితాదిత్యునికి ఆగ్రహం కలిగించినదని కల్హణుడు పేర్కొన్నాడు. ఇది నేటి లాత్‌పూర్ (Latpor) లేదా లేతిపూర (Lethipora) ప్రాంతంగా భావించబడుతుంది.[25]
రాజు లలితాదిత్యుని అసహనం, మధుమైకంలో తీసుకొన్న ఒకానొక అనుచిత నిర్ణయం గురించి కల్హణుడు వివరంగా తెలిపాడు. కాశ్మీరుకు ప్రవరపురం (నేటి శ్రీనగర్‌లో ఒక భాగం) అనే నగరం మొదటినుంచి రాజధానిగా వుండేది. దీనిని లలితాదిత్యుని మునుపు పాలించిన ప్రవరసేనుడు అనే రాజు తన పేరు మీదుగా నిర్మించాడు. అయితే ఆ నగరం, తను నూతనంగా నిర్మించిన పరిహాసపురం కన్నా సుందరంగా వుండటం తట్టుకోలేని లలితాదిత్యుడు మధుమైకంలో పాత నగరం అయిన ప్రవరపురాన్ని ధ్వంసం చేయమని ఆదేశించాడు. మద్యం మత్తులో జారీ చేసినప్పటికి, రాజాజ్ఞ కాబట్టి మంత్రులు కాదనలేక సమీప గ్రామంలోని గడ్డివాములను తగలబెట్టి రాజుగారి క్షణికోద్రేకాన్ని సంతృప్తిపరిచారు.[28] నిద్ర లేచిన రాజు గత రాత్రి తాను జారీ చేసిన ఉత్తర్వు గుర్తుకువచ్చి విషాదంతో పశ్చాతాప పడ్డాడు.[29] అది చూసిన మంత్రులు పాత నగరాన్ని రక్షించడానికి తాము చేసిన పనిని రాజుకు వివరించగానే, లలితాదిత్యుని హృదయం తేలికపడి తన మంత్రుల బుద్ధికుశలతను అభినందించాడు.[28] తాను మద్యం ప్రభావంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎప్పుడూ అమలు చేయవద్దని ఆదేశించాడు.[30]
మతపరమైన నిర్మాణాలు
[మార్చు]లలితాదిత్యుడు పరమత సహనశీలి. ఇతని కాలంలో కాశ్మీర్‌లో అన్ని విశ్వాసాలకు రాజాదరణ లభించింది. తాను వైదికమతానురక్తుడైనప్పటికి బౌద్ధమతాన్ని కూడా సమానంగా గౌరవించాడు. ఆతను నిర్మించిన ఆలయాలలో వైష్ణవ, శైవ, ఆదిత్యునికి అంకితమైనవి మాత్రమే కాక బౌద్ధమత సంబందితమైన పలు విహారాలు, ఆరామాలు కూడా ఉన్నాయి. లలితాదిత్యుడు కాశ్మీర్‌లో ప్రతీ స్థలంలోను, పట్టణంలోను, పల్లెలోనూ, నదీ తీరాల వెంబడి అనేక ఆలయాలను నిర్మించాడని కల్హణుడు పేర్కొన్నాడు.[25] ఈ గుడులలో అతనితో పాటు అతని రాణులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు సైతం వందలాది విగ్రహాలను ప్రతిష్ఠించారు.[31] లలితాదిత్యుడు బంగారం, వెండితో చేయబడ్డ అనేక దేవతామూర్తుల విగ్రహాలను ఈ ఆలయాలలో ప్రతిష్ఠించాడు.[31]
వైష్ణవ ఆలయాలు
[మార్చు]- విష్ణువు ప్రతిరూపాలైన కేశవుడు, నృహరి (నరసింహుడు), ముక్తస్వామి మొదలగువారికి అంకితమిస్తూ లలితాదిత్యుడు అనేక వైష్ణవ ఆలయాలను నిర్మించాడు.
- దర్పీతపురంలో కేశవాలయం నిర్మించాడు.[25]
- స్త్రీరాజ్యంలో నృహరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం పైన, క్రింద భాగాలలో అయస్కాంతాలు ఏర్పాటు చేయడంవల్ల నృహరి విగ్రహం గాలిలో వేలాడుతున్నట్లు వుండేది.[25]
- హుష్కపురం (నేటి ఉష్కుర్) లో ముక్తస్వామి ఆలయం నిర్మించాడు.[32]
- పరిహసపురం (నేటి పరిహాస్‌పూర్ లేదా పరాస్‌పూర్ (Paraspur) ప్రాంతం) లో అనేక విష్ణు ప్రతిరూపాలను నిర్మించాడు.[33]
- 84,000 పలాల వెండితో పరిహాస-కేశవ వెండి విగ్రహం నిర్మించాడు. ప్రాచీనకాలంలో ఒక పలం (Pala) అనేది 4 తులాలకు సమానంగా వుండేది.
- 84,000 తులాల బంగారంతో ముక్త-కేశవ స్వర్ణ విగ్రహం నిర్మించాడు.
- మహా వరాహ సువర్ణ ప్రతిమను, గోవర్ధన ధార వెండి ప్రతిమను నిర్మించాడు.
- 54 హస్త ప్రమాణాల (Hands) పొడవైన ఒక స్తంభాన్ని నిర్మించి, దాని అగ్రంపై విష్ణువు వాహనమైన 'గరుడ' ప్రతిమను ఏర్పాటుచేశాడు.[34]
లలితాదిత్యుని పాలనాకాలంలో ఇతరులు కూడా వైష్ణవ ఆలయాలు నిర్మించారు.
- లాలితాదిత్యుని భార్య అయిన రాణి కమలావతి తన పేరు మీదుగా కమలహట్ట అనే విపణిని నిర్మించి అందులో కమల-కేశవ అనే వెండి ప్రతిమను ప్రతిష్ఠించింది. [31]
- లాట రాజ్యపాలకుడైన కయ్య తన పేరు మీదుగా ప్రఖ్యాత కయ్యస్వామి ఆలయాన్ని నిర్మించాడు.[31]
బౌద్ధమత నిర్మాణాలు
[మార్చు]- హుష్కపురంలో (నేటి ఉష్కుర్) ఒక పెద్ద విహారాన్ని, బౌద్ధ స్థూపాన్ని నిర్మించాడు. ఔకాంగ్ (Ou-Kong) అనే చైనీయ యాత్రికుడు ఆనాటి కాశ్మీరీ బౌద్ధమఠంల గురించి వివరిస్తూ తెలిపిన చిట్టాలో "ముగు-టి" (Moung-ti) అనే విహార ప్రస్తావన కనిపిస్తుంది. ఆరల్ స్టెయిన్ ఈ విహారాన్ని ఉష్కుర్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించడమేకాక, "ముక్త" అనే పదమే చైనీయ భాషలో "ముగు-టి"గా వ్రాయబడిందని తెలియచేసాడు.[32]
- చతుఃశాలతో కూడిన ఒక సువిశాలమైన రాజవిహారాన్ని, చైత్యాన్ని, జిన (బుద్ధుడు) ప్రతిమను నిర్మించాడు.[34]
- 84,000 ప్రష్టల (Prasthas) రాగిని వినియోగించి ఒక బృహత్తరమైన బుద్ధ విగ్రహాన్ని నిర్మించాడు.[33] ప్రాచీన కాలంలో ఒక ప్రష్ట ప్రమాణం 64 తులాలకు సమానంగా వుండేది. పరిహాసపురంలో నిర్మించిన ఈ బుద్ధుని రాగి విగ్రహం గురించి పేర్కొంటూ కల్హణుడు అది “ఆకాశమంత ఎత్తుకు చేరుకొంది” అని అభివర్ణించాడు.
లలితాదిత్యుని పాలనాకాలంలో ఇతరులు కూడా బౌద్ధ విహారాలు నిర్మించారు.
- లాట రాజ్యపాలకుడైన కయ్య ప్రఖ్యాత కయ్య విహారాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఇది సర్వజ్ఞమిత్ర అనే ప్రసిద్ధ బౌద్ధ బిక్షువుకు ఆవాస కేంద్రంగా ఉంది.[31]
- తుఖారిస్తాన్‌కు చెందిన లలితాదిత్యుని మంత్రి 'చణకుడు'తన పేరు మీదుగా చణకున విహారం నిర్మించాడు. దీనిలో దీర్ఘ స్థూపం, జినుడి (బుద్ధుడు) సువర్ణ ప్రతిమలు ఉండేవి.[31] ఇతనే శ్రీనగర్‌లో చైత్యాలయంతో కూడిన ఒక విహారాన్ని కూడా నిర్మించాడు.[27] చణకుని అల్లుడు, వైద్యుడు అయిన ఈశనచంద్రుడు తక్షక దీవనలు పొందడం ద్వారా సంపాదించిన ఐశ్వర్యంతో ఒక విహారాన్ని నిర్మించాడు.[27]
శివాలయాలు
[మార్చు]- కల్హణుడు పేర్కొన్నదాని ప్రకారం లలితాదిత్యుడు తన జైత్రయాత్రలను ప్రారంభించబోయేముందు భూతేశుని (శివాలయం) వద్ద నుండి ఒక కోటిని స్వీకరించి దిగ్విజయానంతరం కాశ్మీర్‌కు చేరుకొన్నపిదప యుద్ధాలకు ప్రాయశ్చిత్తంగా 11 కోట్లను సమర్పించుకొన్నాడు. ఆతను జేష్టరుద్ర శిలా ఆలయాన్ని నిర్మించి భూరి విరాళంతో శివునకు అంకితమిచ్చాడు. భూతేశాలయాన్ని ఆధునిక వంగత్ (Wangath) ఆలయ ప్రాంగణసముదాయనికి చెందినదిగా గుర్తించారు.[32]
- అతని మంత్రులలో ఒకడైన మిత్రశర్మ అనేవాడు మిత్రేశ్వర శివలింగం నిర్మించాడు.[31] మరోచోట బప్పట అనే గురువు బప్పటేశ్వర లింగాన్ని నిర్మించాడు.[27] ఇతరులనేక మంది ఈ ఒరవడిలోనే రక్షతేశ లింగాలు నిర్మించారు.[27]
ఆదిత్యాలయాలు
[మార్చు]కల్హణుని ప్రకారం లలితాదిత్యుడు లలితపురంలో ఒక ఆదిత్యాలయం (సూర్యాలయం) నిర్మింఛి దానికి కన్యాకుబ్జానికి చెందిన కొన్ని గ్రామాలను భూరి విరాళంగా ఇచ్చాడు.[25] వీటన్నింటికి మించి లలితాదిత్య్డుడు నిర్మించిన ఆలయాలన్నింటిలోను మార్తాండ దేవాలయం (మార్తాండ సూర్య దేవాలయం) అత్యంత ముఖ్యమైనది.[35] ఈ ఆలయ నిర్మాణం విశాల ప్రాంగణానికి, సాంకేతిక నిర్మాణ ప్రతిభకు, అద్భుత శిల్పకళకు, అలంకార శిల్పాలకు ప్రసిద్ధి పొందింది. చారిత్రికంగా అంతకు ముందు కాలంలోనే పూర్తి అయిన ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు పునరుద్ధరించి, ఆలయానికి అదనంగా 84 వరుస స్తంభాలతో కూడిన ప్రాంగణాన్ని నిర్మించి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది.
-
1870 లలో తీసిన ఫోటో: మార్తాండ ఆలయ శిథిలాలు
-
1870-73 లో J. Duguid చే పునరుద్ధరించబడిన మార్తాండ సూర్య దేవాలయ నమూనా చిత్రం
-
ప్రధాన కేంద్ర ఆలయ శిథిలాలు (వేసవికాలంలో)
-
ప్రధాన కేంద్ర ఆలయ శిథిలాలు (శీతాకాలంలో)
ప్రజోపయోగ నిర్మాణాలు
[మార్చు]లలితాదిత్యుడు ఖ్యాతి గాంచిన అనేక ప్రజోపయోగ నిర్మాణాలను జరిపించాడు. కాశ్మీర్‌లో వరద ముంపు నుంచి లోతట్టు ప్రాంతాలను కాపాడేందుకు అడ్డుకట్టలు నిర్మించాడు. మెట్టప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించేందుకు "కరేవ" లను (కాలువల వంటివి) నిర్మించడంతోపాటు అనేక సేద్యపు నీటి కాలవలను కూడా త్రవ్వించాడు. "చక్రధర" అనే ప్రాంతంలో నీరు పారింపచేయడానికి జలయంత్రాలను నిర్మించినట్లు కల్హణుడు పేర్కొన్నాడు. అనేక వరుసల జల చక్రాలను కలిగివున్న జలయంత్రాల ద్వారా వితస్థ నదీ జలాలను అనేక గ్రామాలకు ప్రవహింపచేసాడు. ఈ చక్రధర ప్రాంతమే నేటి సక్ధర్ ఉదర్ (Tsakdar Udar) పీఠభూమి సమీపంలోని 'బిజ్‌బెహరా' గా గుర్తించబడింది.[36]
మరణం-వారసత్వం
[మార్చు]లలితాదిత్యుడు ఉత్తరభాగంలో జరిపిన ఒకానొక సైనిక దండయాత్రలో మరణించాడు.[28] అయితే గొప్ప విజేత అయిన లలితాదిత్యుని మరణం ఒక అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది. అతని మరణంపై భిన్న కథనాలున్నాయి. ఒక కథనం ప్రకారం ఉత్తర ప్రాంతంలోని అర్యాంక (Aryanka) దేశంలో అతిశీతల హిమం (Snow) కారణంగా ఆతను మరణించి ఉండవచ్చని పేర్కొంటుంది. మరొక కథనం ఉత్తర దండయాత్ర సమయంలో దుర్భేధ్యమైన పర్వతదారులలో ఆతను తన సైన్యం నుంచి విడిపోయిన కారణంగా ఆత్మహాత్య చేసుకొని ఉండవచ్చని పేర్కొంటుంది. మరొక కథనం ప్రకారం అతను తన సైన్య సమేతంగా ఉత్తరభాగంలో అమరుల లోకానికి తరలిపోయాడని తెలుపుతుంది. ఇవన్నీ కూడా ఉత్తరభాగ దండయాత్రలలో భాగంగానే అతని మరణం సంభవించి ఉంటుందనే సూచిస్తున్నాయి.
లలితాదిత్యుని అనంతరం పెద్ద కుమారుడు కువలయపీడుడు రాజయ్యాడు. అయితే రాజ్యాధికారం కోసం తన తమ్ముడు చేసే పోరుకు విసిగి కువలయ పీడుడు ఒక సంవత్సరంలోనే రాజ్యత్యాగం చేసి సన్యాసిగా మారిపోయాడు. తర్వాత రాజైన వజ్రాదిత్యుడు కూడా తన అవలక్షణాలతో అనతికాలంలోనే మరణించాడు. తదనంతరం అతని కొడుకు పృధ్వీపీడుడు రాజయ్యాడు. ఇతనిని తొలగించి అతని సవతి సోదరుడు సంగ్రామపీడుడు రాజయ్యాడు. సంగ్రామపీడుని అనంతరం అతని కొడుకు జయాపీడుడు (వినయాదిత్యుడు) రాజయ్యాడు. జయాపీడుడు తన 30 సంవత్సరాల పాలనలో తన ముత్తాత వలె ఎడతెగని యుద్ధాలలో మునిగితేలి కార్కోటక వంశంలో రెండవ శక్తివంతమైన రాజుగా పెరుతెచ్చుకొన్నాడు.
లలితాదిత్యుని పాలన - ఒక అంచనా
[మార్చు]లలితాదిత్యుడు కాశ్మీర్‌ను పాలించిన కార్కోటక వంశానికి చెందిన రాజులలో అత్యంత శక్తివంతమైన రాజు. తన 36 ఏళ్ల సుదీర్ఘ రాజ్యపాలనకాలంలో అత్యధిక భాగాన్ని యుద్ధాలలోనే గడిపాడు. సదూర ప్రాంతాలలో దశాబ్దాల తరబడి కొనసాగిన జైత్రయాత్రల వల్ల రాజ్యంలో పరిపాలనా భారం సహజంగానే మంత్రులపై పడింది. విధేయత, బుద్ధికుశలత కలిగిన మంత్రులు వుండటం లలితాదిత్యుని అదృష్టమే అని చెప్పాలి.[37] ఇతని యుద్ధంలో కనోజ్ పాలకుడైన ప్రతీహార రాజు యశోవర్మను ఓడించడం అనేది ఒక్కటే చారిత్రిక ఘటనగా స్పుటంగా గుర్తించబడింది. మిగిలిన విజయాలలో చారిత్రిక అంశాలు కొరవడుతున్నాయి. అంతేగాక ఇతని సుదీర్ఘమైన యుద్ధాలలో సత్ఫలితాలు ఇచ్చిన విజయాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి. అందుకే సుసాన్ ఎల్ హంటింగ్టన్ వంటి చరిత్రకారులు లలితాదిత్యుని దండయాత్రలను "నిజమైన విజయాలు సాధించిన దాడులనడం కన్నా భారీ దోపిడీకి తెగబడిన దాడులనడం సబబని అభిప్రాయబడటం జరిగింది.[23]
ఏది ఏమైనప్పటికీ మధ్యయుగపు రాజుల మాదిరిగానే లలితాదిత్యుడు కూడా తన జైత్ర యాత్రలలో ఓడిన రాజ్యాలనుంచి అపార సంపదలను తన రాజ్యానికి తరలించాడు. ఆ విధంగా తరలించిన సంపదలను తన రాజ్యం (కాశ్మీర్) లో వెచ్చించి అధ్బుతమైన నిర్మాణాలను చేపట్టాడు. కాశ్మీరుకు గొప్ప వైభవం చేకూర్చాడు. ఇతని కాలంలోనే కాశ్మీర్లో అంతకుముందేన్నడూ లేని అతిపెద్ద హర్మ్యాలు నిర్మించబడ్డాయి. కొత్తగా అనేక పట్టణాల నిర్మాణం జరిగింది. వైభవోపితమైన ఆలయ కట్టడాల నిర్మాణం ప్రారంభమైంది. కాశ్మీరీ వాస్తుశిల్పకలకు మచ్చుతునక లాంటి మార్తాండ సూర్య దేవాలయం ఇతను నిర్మించినదే. అయితే వీటికంటే ఆతను చేపట్టిన ప్రజోపయోగ నిర్మాణాలు ముఖ్యంగా వరద నివారణా చర్యలు, నీటిపారుదల (Irrigation) సౌకర్యాల కల్పనలు వంటివి అతని పాలనకు మరింత వన్నెను, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
లలితాదిత్యుడు పరమత సహనశీలి. తాను వైదికమతానురక్తుడైనప్పటికీ అన్ని మతాలను, సంప్రదాయాలను సమాదరింఛి ప్రజలకు ఆదర్శనీయుడైనాడు. వైష్ణవ, శైవ, ఆదిత్య ఆలయాలతోపాటు బౌద్ధ విహారాలు, ఆరామాలు కూడా నిర్మించాడు.
లలితాదిత్యుడు గొప్ప ప్రజ్ఞావంతుడైన రాజు. కళలను, పాండిత్యాన్ని ప్రోత్సాహించాడు. ప్రజ్ఞను, నిపుణతలను ఎక్కడవున్నా గొప్పగా ఆదరించేవాడు. తన రాజ్యంలోనే గాక, తను ఓడించిన రాజ్యాలలోని విద్వత్కవులను, పేరుమోసిన కళాకారులను సైతం ఆకర్షించి వారిని తన ఆస్థానానికి ఆహ్వానించేవాడు. సదూర ప్రాంతాలలోని అనేకమంది కవులు, కళాకారులు, శిల్పులు, పరిపాలనావేత్తలు ఇతని ఆస్థానాన్ని ఆశ్రయించేవారు.[37] దీనిని ఉద్దేశించే కల్హణుడు "వివిధ దేశాలకు చెందిన అనేకమంది మేధావులను పుష్పాల పుప్పొడిని గాలి ఏవిధంగా సేకరిస్తుందో అదేవిధంగా లలితాదిత్యుడు అనేక దేశాల నుంచి నిపుణులను ఆకర్షించేవాడు" అని కల్హణుడు పేర్కొన్నాడు.[37] [38][39] ఈ నిపుణులందరూ అధ్బుతమైన నిర్మాణాల రూపుకల్పనలోను కాశ్మీర్ సౌందర్యం, సంపద, పాండిత్యాలను సుసంపన్నం చేయడంలో ఒకరికొకరు పోటీపడేవారు.[37] ఉదాహరణకు తుఖారిస్తాన్ నుంచి చణకుడు అనే మేధావిని లలితాదిత్యుడు తన వద్దకు రప్పించుకొన్నాడు. ఆతను మంత్రిగా తన సేవలను రాజుకు అందిస్తూనే అనేక బౌద్ధ కట్టడాలు నిర్మించాడు.
అయితే ప్రతిభావంతుడైన లలితాదిత్యుని కాలంలో పరిపాలన సజావుగానే కొనసాగినప్పటికీ నిరంతర యుద్ధాలవల్ల, కళాపోషణ వల్ల క్రమేణా రాజ్యంలో ఆర్థికపరిస్థితి కుంటుపడటం ప్రారంభమైంది. ఇది అతని మునిమనుమడు జయాపీడుడు (వినయాదిత్యుడు) కాలంలో పరాకాష్ఠకు చేరింది. కీర్తికాంక్షాతత్పరులు, యుద్ధపిపాసకులైన తాతమనులిద్దరూ తమ నిరంతర యుద్ధాలతో, కళాపోషణలతో, దాన ధర్మాలతో ఖజానా ఖాళీ చేసారు.[40] పాలనా వ్యవస్థ బలహీనపడింది. తత్ఫలితంగా చెలరేగిన అరాచక పరిస్థితులలో వినయాదిత్యుని చంపి ఉత్పల వంశీయులు కాశ్మీర్ రాజ్యపాలన చేపట్టారు.[40]
లలితాదిత్యుని ఘన విజయాలలో కొన్ని అతిశయోక్తులున్నప్పటికీ, చారిత్రిక అంశాలు కొంతమేరకు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, కాశ్మీర్ ప్రజలు మాత్రం అతను సాధించిన విజయాలను అతిశయోక్తులతో ఊహాకల్పనలతో కీర్తించారు. తదనంతర కాలంలో కాశ్మీర్ పురాణగాథలు లలితాదిత్యుని అత్భుతమైన శక్తులు (miraculous powers) గల మహిమాన్వితుడిగా, గొప్ప విజేతగా అభివర్ణించాయి.[22] కాశ్మీర్ చరిత్రలో ఒక మహావిజేతగా అతనిని గుర్తించిన విదేశీయులు అతనిని "కాశ్మీరీ అలేగ్జాండర్"గా పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇతనికాలంలో కాశ్మీరు గొప్ప వైభవాన్ని, కనీవినీ ఎరుగని అమోఘమైన నిర్మాణ కార్యకలాపాలను వీక్షించింది.[1] తత్ఫలితంగా కాశ్మీర్లో లలితాదిత్య ముక్తాపీడుని పాలనా కాలం స్వర్ణయుగంగా పేరుపొందింది.[9]
గ్రంథసూచిక
[మార్చు]- Dayawanti Srivastava. Great Men and Women of India (Telugu) (Feb, 2006 ed.). New Delhi: Director, Publication Division, Ministry of Information & Broadcasting, India.
- André Wink (2002). Al-Hind, the Making of the Indo-Islamic World: Early Medieval India and the Expansion of Islam 7th-11th Centuries. BRILL. ISBN 0-391-04173-8.
- Cynthia Packert Atherton (1997). The Sculpture of Early Medieval Rajasthan. BRILL. ISBN 90-04-10789-4.
- Hermann Goetz (1969). Studies in the History and Art of Kashmir and the Indian Himalaya. Wiesbaden: Otto Harrassowitz. OCLC 586049160.
- M. A. Stein (1900). Kalhaṇa's Rājataraṅgiṇī: A chronicle of the kings of Kaśmīr. Vol. 1. Archibald Constable. ISBN 978-81-208-0370-1.
- M. A. Stein (1900). Kalhaṇa's Rājataraṅgiṇī: A chronicle of the kings of Kaśmīr. Vol. 2. Archibald Constable. ISBN 978-81-208-0370-1.
- Manabendu Banerjee (2004). Historicity in Sanskrit Historical Kāvyas. Sanskrit Pustak Bhandar. OCLC 607757485.
- Navjivan Rastogi (1987). Introduction to the Tantrāloka. Motilal Banarsidass. OCLC 470679057.
- Ronald M. Davidson (2012). Indian Esoteric Buddhism: A Social History of the Tantric Movement. Columbia University Press. ISBN 9780231501026.
- Shyam Manohar Mishra (1977). Yaśovarman of Kanauj. Abhinav. OCLC 5782454.
- Tansen Sen (2004). Kaśmīr, Tang China, and Muktāpīḍa Lalitāditya's Ascendancy over the Southern Hindukush Region. Vol. 38. pp. 141–162.
{{cite book}}
:|journal=
ignored (help) - Sonia Jasrotia, Department of Buddhist Studies, University of Jammu. "New Discovered Buddhist Heritage of Baramulla District (Kashmir)". SAARC Cultural Center Sri Lanka. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 7 July 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - Kak Ram Chanfra (1933). "Ancient Monuments of Kashmir" (PDF). Indian Art and Letters (reprint 2002 ed.). London: Royal India Society. Archived from the original (PDF) on 28 August 2015.
వెలుపలి లింకులు
[మార్చు]- Lalitaditya Muktapida: an omnipotent Indian [1] by Upinder Fotadar
- Lalitaditya Muktapida Kashmir's Alexander [2] Kashmir First, 16, May, 2007
- Lalitaditya: The Forgotten Alexander Of India [3] 7 january, 2017
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 Dayawanti Srivastava 2006, p. 15.
- ↑ 2.0 2.1 2.2 Dayawanti Srivastava 2006, p. 16.
- ↑ 3.0 3.1 3.2 MA Stein 1 1900, p. 131.
- ↑ Tansen Sen 2004, p. 144.
- ↑ MA Stein 1 1900, p. 155.
- ↑ Hermann Goetz 1969, p. 15.
- ↑ Tansen Sen 2004, p. 144-145.
- ↑ Tansen Sen 2004, p. 141.
- ↑ 9.0 9.1 9.2 Dayawanti Srivastava 2006, p. 14.
- ↑ MA Stein 1 1900, p. 88.
- ↑ MA Stein 2 1900, p. 269.
- ↑ MA Stein 1 1900, p. 134.
- ↑ MA Stein 1 1900, p. 135.
- ↑ 14.0 14.1 14.2 14.3 14.4 MA Stein 1 1900, p. 136.
- ↑ 15.0 15.1 André Wink 2002, p. 244.
- ↑ Hermann Goetz 1969, p. 9.
- ↑ Hermann Goetz 1969, p. 10.
- ↑ 18.0 18.1 Hermann Goetz 1969, p. 12.
- ↑ Ronald M. Davidson 2012, p. 355.
- ↑ Ronald M. Davidson 2012, p. 46.
- ↑ Tansen Sen 2004, p. 141-152.
- ↑ 22.0 22.1 Shyam Manohar Mishra 1977, p. 95.
- ↑ 23.0 23.1 Cynthia Packert Atherton 1997, p. 80.
- ↑ Kak Ram Chanfra 1993.
- ↑ 25.0 25.1 25.2 25.3 25.4 25.5 25.6 25.7 25.8 MA Stein 1 1900, p. 139.
- ↑ MA Stein 1 1900, p. 141-142.
- ↑ 27.0 27.1 27.2 27.3 27.4 MA Stein 1 1900, p. 144.
- ↑ 28.0 28.1 28.2 Dayawanti Srivastava 2006, p. 18.
- ↑ MA Stein 1 1900, p. 151.
- ↑ MA Stein 1 1900, p. 152.
- ↑ 31.0 31.1 31.2 31.3 31.4 31.5 31.6 MA Stein 1 1900, p. 143.
- ↑ 32.0 32.1 32.2 MA Stein 1 1900, p. 140.
- ↑ 33.0 33.1 MA Stein 1 1900, pp. 142–143.
- ↑ 34.0 34.1 MA Stein 1 1900, p. 142.
- ↑ MA Stein 1 1900, p. 141.
- ↑ MA Stein 1 1900, p. 140-141.
- ↑ 37.0 37.1 37.2 37.3 Dayawanti Srivastava 2006, p. 17.
- ↑ MA Stein 1 1900, p. 146.
- ↑ Tansen Sen 2004, p. 151.
- ↑ 40.0 40.1 Y. Vaikuntam. Ancient History of India (Telugu) (1999 ed.). Hyderabad: Telugu Akademi. p. 132.