అమలాపురం దసరా ఉత్సవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురం దసరా ఉత్సవాలు
అమలాపురం దసరా ఉత్సవాలు
అమలాపురం శ్రీదేవి అమ్మవారు
యితర పేర్లుదేవి ఉత్సవాలు,దసరా ఉత్సవాలు
జరుపుకొనేవారుహిందువులు
ఉత్సవాలు9 రోజులు
ఆవృత్తిసంవత్సరం

అమలాపురం దసరా ఉత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జరిగే విజయదశమి ఉత్సవాలు ప్రసిద్ధిచెందినవి.ఈ నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో కలిపి పదిరోజులు వరుసగా జరుపుకుంటారు. ఎక్కువగా దసరా పండుగ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వస్తుంది. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. తొమ్మిదిరోజులు వివిధ అవతారాల్లో మహిషాసుర సేనలను నాశనం చేసిన పరాశక్తి తొమ్మిదోరోజున మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ విజయానికి సూచనగా ఆ తరువాతిరోజు విజయదశమిగా పండుగ జరుపుకుంటారు. అమలాపురంలోని అమ్మవారి పేరు శ్రీదేవి. ఇక్కడ విజయదశమి సందర్భంగా నిర్వహించే తాలింఖానా, వాహన ఊరేగింపు ప్రత్యేకం.2022 నాటికి ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 187 ఏళ్ళు అయ్యాయి.[1][2]

చరిత్ర[మార్చు]

ఈ ఉత్సవాలు 1835లో కొంకాపల్లిలో ప్రారంభమయ్యాయి.అప్పటి పాలకులు బ్రిటిష్ వారు ఈ ఉత్సవాలకి అనుమతి ఇచ్చేవారు. ఇప్పటికీ ఈ ఉత్సవాలకు ఫోటోలు బ్రిటిష్ వారి దగ్గర ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు. ప్రపంచంలో ప్రాచీన కళలు ఒకటైన తాలింఖానాకు నేటికీ ఇక్కడ ప్రదర్శిస్తారు.1856లో తాలింఖానా ప్రదర్శనను మొదటిసారిగా అమలాపురంలోని ఒక వీధి కొంకాపల్లిలో 1835లో ప్రారంభమైంది. తర్వాత కాలంలో తిలక్ స్ఫూర్తితో స్వాతంత్ర్య సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు 1856లో ఈ విద్యకు అంకురార్పణ చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా 1856లో మహిపాలవీధిలో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెడీతాలింఖానా ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి.[3][4][5]

తాలింఖానా కళ[మార్చు]

ప్రపంచంలో ప్రాచీన కళలు ఒకటైన తాలింఖానాను ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు.కర్రలు, కత్తులు, బల్లాల వంటి ఆయుధాలతో సాగించే ఈ సాహస విన్యాసాలు పూర్వపు రాచరిక వ్యవస్థలోని యుద్ధరంగాన్ని, వీరుల పోరాట పటిమను తలపిస్తాయి. వీరత్వానికి, ఐకమత్యానికి, క్రమశిక్షణకు సూచనగా నిలుస్తాయి. ఈ వీరవిద్యకు సంబంధించిన ఆయుధాలను కూడా ప్రదర్శకులు ఏడాదంతా ఓచోట దాచి పెట్టి, దసరా ఉత్సవాలకు ముందు వాటికి జమ్మి కొట్టి భేతాళస్వామి పూజలు చేసి చెడీ తాలింఖానా ప్రదర్శనలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయంగా వస్తోంది.ఈ ఉత్సవాల్లో జరిగే చెడీ తాలింఖానాలో వయసు బేధం లేకుండా 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు తమ విద్యను ప్రదర్శిస్తుంటారు. రాచరిక కాలపు యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచీ పెద్ద ఎత్తున జనం వస్తారు. దసరాకు ప్రత్యేకంగా తమ కుటుంబాలతో సహా స్థానికులు తరలి వస్తుంటారు. వీధుల్లో ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా యువకులు వృద్ధులు ప్రదర్శించే చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. ముఖ్యంగా కళ్ళకు గంతలు కట్టుకుని ఓ వ్యక్తి కత్తి చేతబట్టి మనిషి శరీరం, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాల చేస్తూ ఉంటారు. అగ్గిబరాటాలు, కర్రసాములు, పట్టాకత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాల చూపరులకు ఉత్కంఠత కలిగిస్తాయి.[6][7]

వీధివీధికో చరిత్ర[మార్చు]

  • కొంకాపల్లి వీధి: కొంకాపల్లి వీధిలో 1835లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.అప్పటి నుంచీ గత 186 ఏళ్లుగా కొంకాపల్లి వీధి దసరా ఉత్సవాలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. ఈ వీధి వాహనం ఐరావతం, హంస. ఈ వాహనంతోనే దసరా ఉత్సవాలు, ఊరేగింపు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు చేస్తారు. కొంకాపల్లి ఉత్సవాలకు అప్పటి బ్రిటిషు ప్రభుత్వం తామ్రపత్రం బహూకరించారు.
  • శ్రీరామపురం: ఈ వీధిలో దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు 1945లో మొదలయ్యాయి. ఈ వీధి వాహనం శేషపాన్పు, వినాయక, హంస.
  • మహిపాల వీధి: తాలింఖానా ఈ వీధిలోనే ప్రారంభించారు.తర్వాతే పట్టణంలోని ఏడు వీధులకు విస్తరించింది. 1856లో అప్పటి చెడీ తాలింఖానా ఆది గురువు అబ్బిరెడ్డి రాందాసు ఉండేవారు. ఈ సాహస విద్యను అమలాపురానికి పరిచయం చేసి, దసరా ఉత్సవాలకు వినూత్న వన్నె తీసుకు వచ్చారు. ఈ వీధి వాహనం రాజహంస.
  • రవణం వీధి: ఈ వీధిలో దసరా ఉత్సవాలు 1947లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం మహిసాసుర మర్దిని. 74 ఏళ్లుగా రవణంవీధి యువజన సంఘం ఈ ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శన నిర్వహిస్తోంది.
  • నల్లా వీధి: ఈ వీధిలో చెడీ తాలింఖానా, దసరా ఉత్సవాలు 1966లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం విజయదుర్గా అమ్మవారు.
  • గండు వీధి:1911లో ఈ వీధిలో దసరా ఉత్సవాలు, ప్రారంభించారు.నేటి వరకు 111 సంవత్సరాలుగా ఇక్కడ చెడీ తాలింఖానా ప్రదర్శనల కొనసాగుతోంది.ఈ వీధి వాహనం శేషశయన
  • రవణం మల్లయ్యవీధి: ఈ వీధి దసరా ఉత్సవాలు,చెడీ తాలింఖానా 1915లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం గరుడ విష్ణు.

దసరా ఉత్సవాల్లో ఊరేగింపు[మార్చు]

విజయదశమి రోజున దాదాపు 21 వాహనాలు ప్రధాన వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.దసరా ఉత్సవాల్లో పట్టణంలోని ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. రాత్రివేళ బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాలు, శక్తివేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్‌మార్‌ బ్యాండ్‌లు, విద్యుత్‌దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి. కొంకాపల్లి ఏనుగు అంబారీ, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మ వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలను వీధుల్లో రాత్రి ఏడు గంటల నుంచి ఊరేగిస్తారు. ప్రధాన వీధుల్లో ఊరేగాక వాహనాలన్నీ ముమ్మిడివరం గేటు వద్దకు చేరుకుంటాయి. మరుసటి రోజు ఉదయం వరకు వేడుక సాగుతుంది.జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి,తెలంగాణ నుంచి కూడా ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురం తరలివస్తారు.[8]

మగధీర సినిమాలో తాలింఖానా[మార్చు]

దర్శకుడు రాజమౌళి ఈ చెడీ తాలింఖానా గురించి తెలుసుకుని మగధీర సినిమాలో వారి ప్రదర్శనలను అక్కడ స్థానిక యువకులను మగధీర సీసినిమాలో ఉపయోగించుకున్నారు. అంతేకాదు కొంతమంది యువకులు బాలీవుడ్ లోని చరిత్ర నేపథ్య సినిమాల్లో కూడా నటించారు.[9]

మూలాలు[మార్చు]

  1. "రాష్ట్రంలో వైభవంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రులు". ETV Bharat News. Retrieved 2021-10-11.
  2. "వైభవంగా శరన్నవరాత్రులు.. మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం". ETV Bharat News. Retrieved 2021-10-11.
  3. "Devi temples decked up for Dasara festival". The Hindu. Special Correspondent. 2014-09-25. Retrieved 2021-10-11.{{cite news}}: CS1 maint: others (link)
  4. "అంబరాన్నంటిన సంబరాలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11.
  5. "Navaratri 2021: దశాబ్దాల చరిత్ర అమలాపురంలోని దసరా ఉత్సవాలు.. ఇప్పటికీ సినిమావాళ్ళకి ప్రాచీన యుద్ధవిద్యలుకావాలంటే వీరివైపే చూపు". TV9 Telugu. 2021-10-07. Retrieved 2021-10-11.
  6. "కోనసీమలో అద్భుత విన్యాసాలతో చెడీ తాలింఖానా ఉత్సవాలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11.
  7. "Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు." Sakshi. 2021-10-10. Retrieved 2021-10-11.
  8. "దసరా ఊరేగింపులకు అనుమతి లేదు". m.eenadu.net. Retrieved 2021-10-11.
  9. "మగధీర సినిమాలో తాలింఖానా". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11.

బాహ్య లింకులు[మార్చు]