అవధానం (మానసిక ప్రవృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇటువంటి పేర్లతోతో ఉన్న ఇతర వ్యాసాలకోసం అవధానం అయోమయ నివృత్తి పేజీ చూడండి.

సూదిలో దారం ఎక్కించునపుడు దృష్టిని ఒకే విషయంపై కేంద్రీకరిస్తున్న బాలిక

ఏదైన ఒక విషయముపైన - అనగా ఒక వస్తువునందు గాని, ఒక భావమునందు గాని, మనస్సు లగ్నమై ఉండుటను అవధానము (Attention) అంటారు. ఇలా ఉన్నపుడు మనసుకు మిగిలిన విషయాలు బొత్తిగా గోచరింపటంలేదని అనుకొనగూడదు. కాని మనసు దేనిపైన లగ్నమై ఉందో ఆ విషయంతో పోలిస్తే మిగిలిన విషయాలు మనసుకు అంత స్పష్టంగా పట్టడంలేదు అని చెప్పవచ్చును.

అవధానం అంటే ఏమిటి?[మార్చు]

ఒక దీపం వద్ద కూర్చుని ఒక కాగితం చదివే వ్యక్తి మనసుకు ఆ కాగితంలో వ్రాసిన విషయం పైన ఉన్న 'అవధానం' చుట్టూరా ఉన్న పరిసరాలపై - అనగా దీపం, ఇల్లు, ఇంటిలో సరంజామా వంటి వానిపై - ఉండదు. అలాగే కాగితంలో అప్పుడు చదువుతున్న వాక్యం గురించి ఉన్న దృష్టి (లేదా ఆలోచన) అదే కాగితంలోని మిగిలిన విషయాలపై ఉండదు. అనగా మనసు తాను ప్రవేశించిన విషయములో అవధాన రూపకము అయిన సంపూర్ణ ప్రవేశము కలిగి ఉంది. అదే మనో ప్రవేశము దాని చుట్టుప్రక్కల ఉన్న ఇతర విషయాలలో సామీప్య భేదము ననుసరించి క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. మరీ దూరమైన (అప్రస్తుతమైన, అనాసక్తమైన) విషయాలలో సంపూర్ణముగా అవధానము అంతరిస్తుంది.

అవధానం ప్రయోజనము[మార్చు]

మన జీవితంలో అవధాన శక్తి ఎటువంటి సమయాలలో వ్యక్తమవుతుందో పరిశీలిస్తే, అది ఎలా వ్యక్తమవుతున్నదీ, ఎలా పనిచేస్తున్నదీ, దాని ప్రయోజనాలు ఏమిటీ అనే విషయాలను గ్రహించవచ్చును.

మనిషి జన్మించగానే మనుగడకు అవుసరమైన పనులు - గాలి పీల్చడం, పాలు త్రాగడం వంటివి - నిర్వర్తించడానికి కర్మేంద్రియాలు యాంత్రికమైన చలనాలు ప్రదర్శిస్తాయి. ఈ పనులకు మనసు సాయం అంతగా అవసరం ఉండదు. బిడ్డను చనులవద్దకు తీసుకు పోగానే పాలు త్రాగడం, ఈగ వాలితే కాలో చేయో జాడించడం వంటి పనులు మనస్సుతో అంత ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఇటువంటివాటిని స్వతఃప్రవర్తిత ఇంద్రియ చలనాలు (Automatic or Refelex Movements) అంటారు. అసంకల్పిత చర్య అనడంకూడా కద్దు. ఇటువంటి చలనాలు కొద్దిపాటి మాత్రమే గనుక వీటితోనే జీవితం గడపడం సాధ్యం కాదు.

ఎప్పుడైతే మనసు ప్రమేయం లేకుండా అవయవాలు జీవితానికి అవుసరమైన పనులు నిర్వర్తించలేవో అప్పుడు ఆయా పనుల నిర్వహణలో మనసు ప్రవేశం అవుసరమౌతుంది. ఒక సాలెవాడు మగ్గం నేయడం దాదాపు యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. కాని ఏదైనా పోగు చిక్కు పడినప్పుడు, లేదా కండె క్రింద పడినప్పుడు ఆ పరిస్థితిలో తగిన ప్రతిచర్య నిర్వహించడానికి మనసు ప్రవేశం అవుసరమౌతుంది. అంటే మనసు ఆ నేత వంకకు తిరిగి అవధాన కార్యము నిర్వహించవలసివస్తుంది. అవరోధం కలిగినపుడు అవధాన రూపంలో మనసు కల్పించుకోవాలి.

అంటే అవరోధ స్వభావం (Nature of Obstruction) తెలిసికోవడం అనేది అవధాన శక్తి యొక్క ఒక ముఖ్య ప్రయోజనం.

అవధానం - స్వభావం[మార్చు]

అవసరమైనంత మేరకు[మార్చు]

దీనిని బట్టి అవధానం యొక్క ఒక ముఖ్యమైన లక్షణాన్ని మనం గ్రహించవచ్చును. ఏదేనా విషయం నిశ్చలంగా (మార్పు లేకుండా) ఉన్నట్లైతే దాని పైన అవధానం నిలవడం కష్టం. ప్రపంచంలో అన్ని విషయాలతో ఒకేసారి అవధాన శక్తికి పనిలేదు. కనుక అన్ని విషయాల జోలికి పోకుండా ఏ క్షణంలో ఏ విషయం గ్రహించడం అవుసరమో అంతవరకు మనసు దానిపై నిలుస్తుంది. ఇలా అనవసరమైన విషయాలనుండి అవసరమైన (లేదా అత్యవసరమైన) విషయాలను వేరు చేసి, మనసు దానిపై కేంద్రీకరించడం అవధానం యొక్క ముఖ్య లక్షణం. ఇటువంటి అవధాన శక్తి పసితనములో స్వల్పంగా ఉండి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది.

త్వరగా గెంతడం[మార్చు]

అవధానం యొక్క మరొక ముఖ్య లక్షణం - అవధానము కొన్ని క్షణములు మాత్రమే ఒక విషయంలో నిలవగలుగుతుంది. దానిని గ్రహించిన వెంటనే అవధానం ఇంకొక విషయానికి పరుగెత్తుతుంది. అలా కాకుండా ఒకే విషయం మీద నిలచి ఉన్నదని అనిపించవచ్చును కాని సూక్ష్మంగా ఆలోచిస్తే అది నిజం కాదు. ఆ 'ఒక విషయం'లోని క్రొత్త క్రొత్త భాగాలను అవధానం అన్వేషిస్తుందని గ్రహించాలి. ఒక పుస్తకం పైన కేంద్రీకృతమైనట్లుగా కనిపించే మనసు నిజానికి ఒక పేజీ పైన, ఇంకా ఆ పేజీలో ఒక వాక్యం పైన, ఇంకా ఆ వాక్యంలో ఒక పదం పైన, ఇంకా ఆ పదంలోని ఒక అక్షరం పైన లేదా ఆ పదానికి గల ఒక భావం పైన - ఇలా ఒక విషయం నుండి మరొక విషయానికి పరుగెడుతూనే ఉంటుంది.

అవధాన భేదాలు[మార్చు]

సంకల్పానికీ (Intention), అవధానానికీ (Attention) ఉన్న సంబంధాన్ని బట్టి అవధానాన్ని మూడు విధాలుగా విశ్లేషించ వచ్చును.

సంకల్ప పూర్వక అవధానము[మార్చు]

ఏదో ఒక విషయంలో మనస్సు నిలపాలని కోరుకొని, ప్రయత్నపూర్వకంగా మనసును అందులో ప్రవేశపెడితే అది సంకల్ప పూర్వకావధానం. ఒక బడిపిల్లవాడు ఆటల వంకకు పరుగెత్తే మనసును చదువు వైపుకు మళ్ళించాలని ప్రయత్నించి, దానిని సాధిస్తే అతడు సంకల్ప పూర్వకావధానం చేశాడన్నమాట. ఒక శతావధాని పృచ్ఛకులు తనకు ఇచ్చిన సమస్యలను గుర్తుంచుకోవడానికి వాటిపై తన మనసు నిలిపినప్పుడు ఇలాంటి అవధాన కార్యక్రమమే జరుగుతున్నది.

సామాన్యంగా సంకల్పించిన విషయంపై మనసును నిలపాలని ప్రయత్నం చేసినా అది సమీప విషయాల పైకి గెంతుతుందని ఇంతకు ముందే చర్చించడమైనది. ఏకాగ్రత కొరవడినవారికి ఇలా 'గెంతే' సమస్య చాలా ఎక్కువ. కాని కొందరు తమకున్న సహజ ప్రతిభ వలన గానీ, లేదా అభ్యాసం వలన గానీ ఇలా గెంతడాన్ని నిరోధించగలుగుతారు. అంటే మరీ సమీపంలోని విషయాలకే దాని గంతులను పరిమితం చేస్తారు. ఒకోమారు అసలు మనసు మరలకుండా కొందరు చేయవచ్చును. బాహ్యప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయి సంపూర్ణంగా మత్స్య యంత్రం పై మనసు కేంద్రీకరించిన అర్జునుడు ఇందుకు ఉదాహరణ.

సామాన్యులు కూడా ఇలాంటి పరిస్థితిని ఒకోమారు అనుభవిస్తారు. ఒక విషయంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవారు దాదాపు పూర్తిగా పరిసరాలనూ, ఇతర విషయాలనూ గమనించక పోవడం తరచు జరుగుతూ ఉంటుంది.

సంకల్ప రహిత అవధానము[మార్చు]

ఇలా చేయాలని ఒక సంకల్పమూ, ప్రయత్నమూ లేకుండానే మనసు తనకిష్టమైన ఏదో ఒక విషయంపై లగ్నమయి ఉండడాన్ని సంకల్ప రహితావధానం అంటారు. అనాలోచితంగా ఇలా జరగడం చాలామందికి అనుభవం ఉంటుంది. చదువుకొనే వ్యక్తి మనసు ప్రక్క గదిలోని సంగీతంపై నిమగ్నమవ్వవచ్చును. ఒకరు గాఢమైన ఆలోచనలో నిమగ్నమైనా గాని తన పేరు వినబడగానే తటాలున మనసు అటువైపు తిరగడం దీనికి ఒక చక్కని ఉదాహరణ. అంటే అసలు కోరుకున్న విషయం పైన కాకుండా అనుకోని విషయంపై అవధాన శక్తి విస్తరిస్తున్నదన్నమాట.

ప్రతివానికి కొన్ని విషయాలకంటే మరి కొన్ని విషయాలపై ఎక్కువ అభిరుచి ఉండడం సర్వసాధారణం. అభిరుచి ఉన్న విషయాలపైనయితే అవధానశక్తిని సులభంగా ప్రవేశపెట్టవచ్చును. అలా కాకుంటే మనసు దానిపైన నిలవదు. బొమ్మలు గీయడంపై ఆసక్తి ఉన్నవానిని వైద్యం నేర్చుకోమన్నా, సాహిత్యాభిలాష దృఢంగా ఉన్నవానిని కార్లు రిపేరు చేయమన్నా వారి అవధానశక్తి ఆయా విషయాలపై ఉంచడానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది.

సంకల్ప వ్యతిరేక అవధానము[మార్చు]

పైన చెప్పిన అవధానానికీ, దీనికీ స్వల్పమైన భేదం ఉంది. అనుకొన్న విషయంపైన మనసు అసలు నిలవకపోవడం సంకల్ప వ్యతిరేక అవధానం. ఒక సారి సంగీతంవైపు మరలిన మనసును చదువుపైకి అసలు తిరిగి తీసుకురాలేక పోయినట్లయితే - దాని అర్థం మనసుకు చదువుమీద అసలు ఆసక్తి లేదన్నమాట. కనుక కోరుకొన్నది కానివాటిపైకి అవధానశక్తి ప్రాకుతున్నది. ఒకోమారు కావలసిన విషయం తప్ప మిగిలినవన్నీ గుర్తుకు రావడం చాలామందికి అనుభవమౌతుంది.

అవధాన రాహిత్యము[మార్చు]

అవధాన శూన్య పరిస్థితి సుషుప్తావస్థ లో ఉండవచ్చునేమో. కాని జాగ్రదావస్థలో మాత్రం అలా జరుగదు. ఇతరులు ఏదైనా విషయం చెబుతున్నపుడు చెవులు ఆ మాటలను వింటున్నాగాని ఆ విషయం అస్సలు మనసుకు అంటకపోవచ్చును. దీనిని అవధాన రాహిత్యం (పరాకు) అని వాడుకలో అంటుంటారు. కాని వాస్తవానికి మనసు ఆ సమయంలో వింటున్న సంగతులకంటే మరింత ఇష్టమైన వేరే విషయాలలో బద్ధమై ఉన్నదని గ్రహించాలి.

కాలనుగుణంగా అవధానం వ్యక్తమవడం[మార్చు]

ఈ మూడు విధాల అవధానాలు ఒక్కో దశలో ఒక్కోటి గాఢంగా ఉంటాయి. శిశువులో ప్రధానంగా సంకల్ప రహితావధానం గోచరమవుతుంది. శిశువునకు ఎలాంటి సంకల్పం లేకుండానే కళ్ళు, చెవుల వంటి వాని జ్ఞానేంద్రియాలు బయటి ప్రపంచంలో జరిగే విషయాలను వాని మనసులోకి చేరుస్తాయి. ఆ బిడ్డ ఇంద్రియాలు ఎటు లాగితే మనసు అటు మళ్ళుతుంది. అలాంటప్పుడు ఏదైనా పెద్ద ధ్వని కాని, మిరుమిట్లు గొలిపే కాంతి కాని సంభవిస్తే బిడ్డ మనసు అటు తిరుగుతుంది. ఇది సంకల్ప రహిత అవధానమని కొందరూ, సంకల్ప వ్యతిరేక అవధానమని కొందరూ విశ్లేషిస్తున్నారు. కాలక్రమంలో సంకల్పాలు, వాంఛలు ప్రబలిన కొద్దీ సంకల్ప పూర్వక అవధానం మనిషి జీవితంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

మూడు విధాల అవధానాల మధ్య సంబంధం[మార్చు]

సంకల్ప పూర్వక అవధానము, సంకల్ప రహిత అవధానము, సంకల్ప వ్యతిరేక అవధానము అనే మూడు అవధానాల స్వభావాలు గాని, ముఖ్య లక్షణాలు గాని, ప్రయోజనాలు గాని వేరు వేరు కాదు. ఈ మూడూ ఒక శక్తియగు మనస్సంబంధమైన అవధానము యొక్క రూపభేదములే. మూడూ మూడు స్వతంత్ర స్థితులు మాత్రం కాదు. కేవలం అవి అభివృద్ధి చెందే స్థితులను బట్టీ, అవి ప్రవర్తిల్లే విధానాలను బట్టీ ఇవి మూడు రకాల అవధానాలుగా పరిగణింపబడుతున్నాయి.

మన జీవనయాత్రలో క్షణక్షణం చెలరేగే వాంఛా ప్రతిబంధాలను, సంకల్పావరోధాలను, ప్రాణోపద్రవాలను, వాటి వాటి స్వభావాలను ఈ మూడు విధాలైన అవధానాలు మనకు తెలియజేస్తాయి. ఇందువలన మనం ఆయా సమస్యలబారి పడకుండా జీవితం కొనసాగించే అవకాశాలు మెరుగు పడతాయి. జీవితంలో అవసరమైన వాటిని అనవసరమైన వాటినుండి వేరు పరచి, మనసును కొన్ని విషయాలలో కేంద్రీకరించే ప్రయోజనం ఈ మూడు విధాల అవధానాలూ మనకు కలుగజేస్తున్నాయి.

ఒకేమాఱు ఎన్నివిషయాలలో అవధానం నిలుస్తుంది[మార్చు]

ఇక్కడ అవధానానికీ (Attention), పనికీ (Work) వ్యత్యాసాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి ఒకేమారు అనేక పనులు చేస్తూ ఉండవచ్చును. కుట్టుపనివాడు ఒకేమారు కాలితో మిషను త్రొక్కుతూ, చేతితో బట్టను తోస్తూ, మరొకరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ అభ్యాసవశాన అవయావలకు అబ్బిన నిపుణతలు. కాని మిషనులో దారం అయిపోయినా, లేక మిషనులో లోపం వచ్చినా వెంటనే తన మాటలు ఆపి వాటిని పరశీలిస్తాడు. అంటే వాని అవధానం అప్పుడు అటు మళ్ళుతున్నదన్నమాట.

ఇలా కర్మేంద్రియాలు అనేక పనులు ఒకమారు చేయగలిగినా, అవధాన శక్తి మాత్రం ఒక మారు ఒకే విషయంపై నిలుస్తుంది (మనసు లగ్నమవుతుంది). ఒక అష్టావధాని ఒకేసారి పద్యం అల్లడం, పూలు లెక్కబెట్టడం, గంటలు వినడం వంటి పనులు చేస్తున్నట్లు అనిపించినా నిజానికి ఒక విషయానికీ, మరో విషయానికీ మధ్యలో కొద్ది కాల భేదం ఉంటుంది. అయితే అష్టావధాని కొద్దిపాటి కాల వ్యవధిలో వేరొక పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడం వల్ల అతను అన్ని పనులూ ఒకేసారి చేస్తున్నాడనే భావం కలుగుతుంది.

అలా అవధానం ఒకే విషయంపై నిలవగలిగితే, ఆ ఒక విషయంలో వివిధ భాగాలు ఉండవచ్చునా లేక ఒక్కో భాగం వేరువేరు విషయాలుగా పరిగణించాలా అన్న ప్రశ్న వస్తుంది. దీనికి జవాబు - అ విషయంలో చాలా అంతర్భాగాలు ఉండవచ్చును. కాని మనసు మాత్రం ఒకో అంతర్భాగాన్ని ఒకోమారు మాత్రమే గ్రహిస్తుంది. తరువాత జరిగే ప్రక్రియ (నిర్ణయం లేదా పని) ఆ అన్ని భాగాలను కలిపివేయడం కావచ్చును.

అవధానం విభజన, సమ్మేళనం[మార్చు]

ఒక రైలు ఇంజనును చూనినపుడు మొదటగా అది ఒకే యంత్రము అనే భావం కలుగుతుంది. కాని ఆ ఇంజనులో అనేక యంత్రాలు కలగలిపి ఉన్నాయి. అలాగే ఒక పదాన్ని గ్రహించేటపుడు అందులోని వివిధ అక్షరాల అర్థాలను పట్టించుకోకుండా అన్ని అక్షరాలనూ కలిపి అర్థాన్ని గ్రహిస్తాము. ఒక వాక్యాన్ని గ్రహించేటపుడు అందులోని వివిధ పదాల అర్థాలను పట్టించుకోకుండా మొత్తం వాక్యం భావాన్ని గ్రహిస్తాము.

ఇక విషయాన్ని గూర్చి సామాన్యమైన జ్ఞానము మనకు ఏర్పడగానే వేరు వేరు భాగాలను గూర్చిన అవగాహన లభిస్తుంది. విడి విడి భాగాల గురించి వివరంగా తెలియకపోయినా అందులో కొన్ని భాగాలుంటాయనీ, అవన్నీ కలిపి ఒక వస్తువు (లేదా విషయం) అవుతుందనీ తప్పక గ్రహిస్తాము. కనుక మనము తెలిసికొనే ప్రతి విషయం బాగా సమన్వితమై ఉంది. ప్రతి అవధాన కార్యంలోనూ, అవధానానికి గురైన విషయాన్ని వేరువేరు భాగాలుగా విభజించే శక్తి (Discrimination or Analysis), ఈ భాగాలన్నీ ఒకదానిలోని విభాగాలని గ్రహించే శక్తి (Association or Synthesis) ప్రస్ఫుటమౌతున్నాయి.

అవధాన ఫలితాలు[మార్చు]

ఒక వస్తువును చూచీ చూడనట్లుగా ఉంటే కూడా - అది ఒక వస్తువనీ, అందులో కొన్ని అంతర్భాగాలున్నాయనీ, దాని స్వభావం ఇదనీ - దాన్ని గురించి చాలా స్వల్పమైన జ్ఞానం కలుగుతుంది. అవధాన శక్తికి అదే వస్తువు లక్ష్యమైతే ఆ వస్తువును గురించి మరింత నిశితమైన జ్ఞానం కలుగుతుంది. ఏ విషయంలో మనం గాఢంగా మనసు లగ్నం చేస్తామో ఆ విషయం చక్కగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంది.

అంటే గ్రహణ శక్తి (తెలిసికోవడం), ధారణా శక్తి (గుర్తుండడం) - రెండూ కూడా అవధానం ప్రయోజనాలు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ఇంకా చదువదగినవి[మార్చు]

  • Bryden, M.P., (1971) "Attentional strategies and short-term memory in dichotic listening." Cognitive Psychology, 2, 99-116.
  • Cherry, E.C., (1953) "Some experiments on the recognition of speech, with one and with two ears," Journal of the Acoustical Society of America, 25, 975-979.
  • Deutsch, J.A. & Deutsch, D., (1963) "Attention: some theoretical considerations," Psychological Review, 70, 80-90.
  • Eriksen, B.A. and Eriksen, C.W., (1974) "Effects of noise letters on the identification of a target letter in a non-search task," Perception & Psychophysics, 16, 143-149.
  • Kahneman, D. (1973). Attention and effort. Englewood Cliffs, NJ: Prentice-Hall.
  • Lebedev, M.A., Messinger, A., Kralik, J.D., Wise, S.P. (2004) Representation of attended versus remembered locations in prefrontal cortex. Archived 2007-11-17 at the Wayback Machine PLoS Biology, 2: 1919-1935.
  • Moray, N., (1959) "Attention in dichotic listening: affective cues and the influence of instructions," Quarterly Journal of Experimental Psychology, 27, 56-60.
  • Neisser, U. Cognitive Psychology, New York: Appleton, 1967.
  • Pashler, H. E. (Ed.) (1998). Attention, East Sussex, UK: Psychology Press ISBN 0-86377-813-5
  • Posner, M. I., Snyder, C.R.R., & Davidson, D.J. (1980). Attention and the detection of signals. Journal of Experimental Psychology: General, 109, 160-174.
  • Raz A. 2004. Anatomy of attentional networks. The Anatomical Record Part B: The New Anatomist;281 (1):21-36 PMID 15558781
  • Sperling, G. (1960) "The information in brief visual presentations," Psychological Monographs, 74 (Whole number 11).
  • van Swinderen, B. (2005) "The remote roots of consciousness in fruit-fly selective attention?" BioEssays, 27, 321-330.
  • Treisman, A.M. (1969) "Strategies and models of selective attention," Psychological Review, 76, 282-299.