Jump to content

వ్యవసాయ పరికరాలు

వికీపీడియా నుండి
(కుఠారము నుండి దారిమార్పు చెందింది)

వీటిలో మొదటిగా చెప్పుకో దగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసినది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసినది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ చాల వరకు తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయ డానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడా వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు.ఇవి ఎక్కువుగా వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్టు

పార.
ఎద్దుల బండి. దామలచెరువు పొలాల్లో తీసిన చిత్రం
కత్తి, కొడవలి, గొడ్డలి.

కొడవలి

[మార్చు]

వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయ డానికి ఉపయోగిస్తారు. అలాగే పశువుకు గడ్డి కోయడానికి ఉవయోగిస్తారు. ఇది చిన్న కత్తి లాగె వుండి వంపు వైపు సన్నని రంపపు వళ్లు లాంటి పళ్లు కలిగి వుంటుంది. దానిని కక్కు అంటారు. కాలానుగుణంగా ఆ కక్కు అరిగి పోతుంటే మాటి మాటికి దానికి కక్కు వేస్తారు. కొంత కాలం తర్వాత అది చిన్నదై పోతుంది. ఆ చిన్నదైన కొడవలిని లిక్కి అంటారు. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అది... ఉంటే లిక్కి పోతె కొడవలి కొడవలి కత్తికన్నా చాల తేలికైన సాధనము. కొన్ని ప్రాంతాలలో కత్తిని కూడా కొడవలి అని అంటారు. ఉదాహరణకు.... "వేట కొడవలి.

కత్తి

[మార్చు]

కత్తులు చాల రకాలు. చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్ట డానికి, చెరుకు కొట్టడానికి, వాడుతారు. పెద్ద కత్తి: దీన్ని పెద్ద కొమ్మలు కొట్ట డానికి ఉపయోగిస్తారు. వేట కత్తి: దీన్ని వేటను నరక డానికి, లావు పాటి కొమ్మలను నరకడానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ.

చిలుకు దోటి

కొంకి

[మార్చు]

ఇది చిన్నకత్తికన్న తేలికగా వుండి దానికన్నా ఎక్కువ వంపు కలిగి వుండి, దానికి పిడి బదులు అక్కడ ఒక గొట్టం లాగ వుంటుంది. అందులో పొడవాటి వెదురు కర్రను దూర్చి వుంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ. ఇది తెలికైన ఆయుదము.

గొడ్డలి

[మార్చు]

గొడ్డలి ఇది ఒకరకమైన ఆయుధం. గొడ్డలి పరశురాముని ఆయుధం. దీనికి ప్రకృతి పదం కుఠారం. గొడ్డలిలో చాల రకాలు ఉన్నాయి. చిన్నగొడ్డలి, పెద్ద గొడ్డలి రెండు రకాలు. చిన్న దాన్ని చిన్న పనులకు, పెద్ద దాన్ని పెద్ద పెద్ద మానులను నరకడానికి ఉపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా వుండదు. గొడ్డలి సంబంధించిన సామెత ఒకటి ఉంది.గోటితో పోయేదానికి గొడ్డలెందుకు

దంతిపార

[మార్చు]

దంతిపారను దంతి అని కూడా అంటారు.దంతిలో మరొక రకం ముళ్ళదంతి.పొడి పొడిగా ఉన్న మట్టిని చదరంగా చేయడానికి చదరపు దంతి ఉపయోగపడుతుంది.కాయలను విత్తనాలను ఎండ బెట్టినప్పుడు, ఆరబోసినప్పుడు సాలుగా చేయడానికి ముళ్ళదంతిని ఉపయోగిస్తారు.కాయలను విత్తనాలను ఎండ బోయడానికి ముందు పలుచగా చేయడానికి ఎండిన తరువాత కుప్పగా చేయడానికి చలగపారకు ఉండేటు వంటి ప్ల్ల్లేటు ఉన్న దంతిని ఉపయోగిస్తారు.దంతి చలగపార మాదిరిగా ఉన్నప్పటికి దీనికి ప్లేటు వెడల్పును కర్ర లేక రాడ్ పొడవుగాను ఉంటుంది.

దోకురుపార

[మార్చు]

దోకురుపారను పొలాలలో కలుపు తీయడాని ఉపయోగిస్తారు. ఇది మూర లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ పొడవు ఉంటుంది. దీనిని ఎక్కువగా ఆడవారు పొలాలలో కూర్చుని నడుస్తూ మొక్కల చుట్టూ ఉన్న కలుపును తొలగించడానికి భూమిని త్రవ్వేందుకు ఉపయోగిస్తారు.ఇది కర్ర లేదా రాడ్ బిగించ బడి చేతితో బలంగా పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది.దీని కింది భాగం త్రిభుజాకారంలో వంట పనికి ఉపయోగించే అట్లకాడ వలె ఉంటుంది.

పలుగు లేదా గడ్డపార

[మార్చు]

పలుగుపార, గడ్డపార మాదిరిగా ఉన్నప్పటికి గడ్డపార కంటే బరువు తక్కువగాను, పొడవు తక్కువగాను, తక్కువ మందం కలిగి ఉంటుంది.ఇది చిన్న చిన్న గుంతలు త్రవ్వడానికి ఉపయోగపడుతుంది.ఇది బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు, ఆడవారు కూడ దీనిని సులభంగా ఉపయోగిస్తారు.గడ్డపారతో పోల్చినపుడు ఇది తక్కువ వెలకు లభిస్తుంది.దీనిని దాచడానికి తక్కువ స్థలం సరి పోతుంది.పల్లెల్లో దాదాపు అందరి ఇళ్లల్లో ఉండే వ్యవసాయ పనిముట్టు.దీనిని పెరటి మొక్కలు నాటడానికి పొలాలలో తక్కువ లోతులో కొన్ని మొక్కలు నాటవలసినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

తొలిక

[మార్చు]

మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి, మొదలగు వాటికి వాడు తారు.

గుద్దలి

[మార్చు]

దీనితో భూమిలో వున్న చెట్లను వేళ్లతో సహా పెకలించ డానికి వాడే గొడ్డలి లాంటి పరికరము.

చిలుకు దోటి

[మార్చు]
చిలుకు దోటి

చిలుకు దోటి తో చెట్టు పైనున్న చింత కాయలు, మునగ కాయలు మొదలగు వాటిని కోసి కింద పడ వేయ డానికి ఉపయోగిస్తారు. పైనున్న కొమ్మకు తగిలించి వూపి దానిలోని కాయలను రాల్చడానికుపయోగిస్తారు.త్తైన చెట్లపైనుండే కాయలను కోయడాడికుపయోగ పడే ఒక పరికరము. దీనితో చెట్టుపైనున్న మునగకాయలు, చింతకాయలు, సీమ చింత కాయలు, మామిడికాయలు మొదలగు కాయలను చెట్టు ఎక్కకుండానే క్రిందనుండి కోయవచ్చును. కొంకి లాగ దీనికి పదను వుండదు

చిక్కం దోటి

[మార్చు]
చిక్కం దోటి

ఇది చిలుకు దోటి లాంటిదే. కాని దీనికి చివరన ఒకచిన్న చక్రం లాంటిది వుండి దానికి చిన్న వల వుంటుంది. దీన్ని చెట్లపై నున్న మామిడి కాయలను కోయ డానికి వాడతారు. మామిడి కాయలను చిలుకు దోటితో కోస్తే అవి కింద పడి దెబ్బలు తగిలి పాడవుతాయి. ఈ చిక్కంతో కోస్తే కాయలు ఆ చిక్కంలో (వలలో) తగులుకొని కింద పడవు. మెల్లిగా క్రిందికి దించి కాయలను తీసు కుంటారు.

పార

మట్టిని తట్టల కెత్త డానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాల అవసరం. కాల క్రమంలో పార అరిగిపోయి చిన్నదైతె దాన్ని గొనంపార అంటారు.

తొలికి దీనిని మెట్ట పైర్లలో కలుపు తీయడానికి, వేరుశనగ కాయలను త్రవ్వి తీయడానికి ఉపయోగించే చిన్న పరికరము.
గడ్డ పార/ గునపం

మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించ డానికి దీని వుపయోగం చాల వున్నది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండి వీటికి కావలసిన పరికరాలు అవి పని చేసె విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించ బడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలె పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు అయిదారు అడుగుల ఎత్తైన కర్రల వేదిక.

వడిసెల

అరచేతి వెడల్పు తో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల రెండు చివరలన రెండు పొడవాటి దారాలు వుంటాయి. మధ్యలో ఒక రాయిని పెట్టి రెండు దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిర గిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్ళి పడుతుంది.పొలాల్లో పక్షులను తోల డానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్ట డానికి లేదు. పూర్వం వడిసెలను యుద్దాలలో కూడ వాడినట్లు ఆదారాలున్నాయి. నైజాం సర్కారు పై ప్రజాపోరులో పాడిన పాట: బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ... ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడ ......................, ............ వడిసేల రాయి పెట్టి వడి వడిగా కొట్టి తేను నీ మిల్ట్రి పారి పోయె రో నైజాము సర్కరోడా ............................,

గోరు గిల్లు

ఆకు తోటలో తమలపాకులు కోయడానికి బొటన వేలుకి వేసుకునే ఇనుప రేకు గోరు. దీని వలన వేళ్లకు నొప్పి లేకుండా వుంటుంది.

కొడము

ఇది కొబ్బరి లేదా వెదురు పుల్లలతో అల్లిన చేపలు పట్టే.... పరికరం.

గాలము

ఇది కూడా చేపలు పట్టడానికుపయోగించే చిన్న ఇనుప కొక్కెం.

సూది ఇది బట్టలను కుట్టుకునే సాదారణ పరికరం.

దబ్బణం

ఇది సూది లాంటి పెద్ద పరికరం. దీతో పెద్ద గోతాలలో ధాన్యం వేసి నపుడు దాని మూతిని కుట్టడానికి వుపయోగిస్తారు.

జాటి

ఎద్దుల బండి తోలె టప్పుడు జాటీతో ఎద్దులను అదిలిస్తుంటాడు. ఇది సన్నని వెదురు కర్రకు తోలుతొ అల్లిన దారం కలిగి, కొసలో జానెడు పొడవున్న మూడు తోలు పోగులు వుంటాయి. ఇది ఆతి చిన్న కొరడా లాంటిది. దీని దెబ్బ చాల చురుక్కు మంటుంది.

ముల్లు గర్ర

ఇది సన్నని వెదురు కర్ర. దాని చివరన కొసగా చెక్కి వుంటుంది. దీన్ని దుక్కి దున్నేటప్పుడు ఎద్దులను అదిలించ డానికి వాడుతారు.

కాడిమాను

కాడిమాను ఇది కొయ్యతో చేసినది. దీన్ని ఎద్దుల మెడపై వేసి బండికి.... నాగలి వంటి పనిముట్లుకు కట్టి ఎద్దులతో పని చేయించడానికుపయోగిస్తారు. ఎద్దులతో ఏ పని చేయించాలనా ఎద్దుల మెడపై కాడి మాను పెట్టాల్సిందె. కాడి మాను పైకి లేపగానె ఎద్దులు తలలు వంచి దాని కిందికి దూరి కాడిమానును తమ మెడలపై వుంచుకుంటాయి.

పలికి మాను

ఇది నాలుగడుగులు పొడవున్న కర్ర దుంగ. దానికి సుమారు పది రంద్రాలు చేసి దానికి ఒక జానెడు పొడవున్న కర్ర ముక్కలను బిగించి వుంటారు. దీన్ని వెలి దుక్కి దున్నిన తర్వాత ఆ సాళ్లలో ఏదేని విత్తనాలు వేసిన ఆ సాళ్లను పూడ్చడానికి వాడతారు.

నిచ్చెన
నిచ్చెన

పందిలి పైనున్న గడ్డిని, తీయడానికి, చిన్న చెట్లను ఎక్కడానికి దీనిని ఉపయోగిస్తారు.

కాడి ఎద్దులు

కాడి ఎద్దులు అంటే రెండు ఎద్దులు. కుడి పక్కది, ఎలపట.. ఎడం పక్కది దాపట అని అంటారు.. ఎద్దులు ఎప్పుడు దుక్కి దున్ను తున్న, బండి లాగుతున్న, లేదా రోడ్డు మీద నడుస్తున్న. పనిలో వున్నప్పుడు ఇంటి వద్ద కొట్టంలో కట్టేసి వుంచినా అవి ఆ వరుసలో మాత్రమే వుంటాయి. కుడిది ఎడం పైపుకు గాని అటుది ఇటు గాని వుండవు. చ్చో అంటే ఎలపటది, టుర్ ర్ ర్ అంటే దాపటది తిరుగు తాయి. వంపు తిరగ టానికి ఈ మాటలను వాడతారు. దుక్కి దున్నేటప్పుడు ఒక సాలు అయిన తర్వాత దాని పక్కనే ఇంకో సాలు దున్నాలి. అలా దున్నాలంటే సాలు చివరన ఎద్దులను తిప్పి సరిగా ఆ సాలు వెంబడే ఇంకో సాలు దున్నాలి. ఇది కొంత ఆలస్యం అవుతుంది. అందు చేత సాలు చివరన ఎద్దులను ఇంకొంత దూరం సుమారు పది అడుగులు పక్కకు పోనిచ్చి అక్కడ ఇదివరకు దున్నిన సాలుకు సమాంతరంగా ఇంకో సాలు దున్నుతారు. దాన్ని కొండ్ర అంటారు. ఆ కొండ్ర చివరన ఎద్దులను మలిపి ఇదివరకు దున్నిన సాలు వెంబడి సాలు వేస్తారు. ఆ కొండ్ర పూర్తి కాగానె ఇంకో కొండ్ర వేస్తారు. రోజలు మారాయ్ అనె పాత సినిమాలో వ్వవసాయానికి సంబంధించిన పదాలు ఒక పాటలో కొన్ని ఉన్నాయి. అది....... ఏరు వాక సాగారో ... రన్నో ..... చిన్నన్న........ నీ కష్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న.. ఎలపట దాపట ఎడ్ల కట్టుకొని, ఇల్లాలిని నీ వెంట బెట్టుకొని, ,,,,,,,, సాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో....... ఏరువాక సాగారోరన్నో చిన్నన్న.....

ఎద్దుల బండి
పొలంలో ఎద్దుల బండి

రైతులకు ఇది అతి ముఖ్యమైన సాధనము. పొలములోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటి వద్దనున్న దిబ్బలోని ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముఖ్యమైన సాధనం. దీనిని వడ్రంగి తయారు చేస్తాడు. రెండెడ్లతో నడిచే ఈ బండి కాలాను గుణంగా మార్పులు చెందుతూ టైరు చక్రాలతో నడిచే విధంగా రూపు దిద్దుకొన్నది. ఇందులో కొన్ని రకాలున్నాయి. అవి గూడు బండి, సవారి బండి. వీటిని సంతలకు సరకులను రవాణ చేయడానికి, మనుషులను రవాణాకు వాడె వారు. ఒంటెద్దు బళ్లు కూడా వుండేవి. గూడు బళ్లు, సవారి బళ్లకు ఏ నాడో కాలం చెల్లి పోయింది. మామూలు ఎద్దుల బండ్లు మాత్రం అరుదుగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి, వీటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. ఇవి ఎద్దులు చేసె అన్ని పనులు చేస్తున్నాయి. పైగా అతి వేగంగా పని జరుగుతున్నది.

చిక్కం

ఇప్పుడైతే పొలానికి కూడా అన్నం టిపన్ క్యారియర్లలో తీసుకెళ్లు తున్నారు కాని గతంలో సంగటి ముద్దను అడవులకు/ పశువులును /గొర్రెలను/ మేకలను కాయడాని వెళ్లేటప్పుడు చిక్కంలో తీసుకెళ్లే వారు. ఇది సన్నని దారలతో అల్లిన చిన్న వల. గొర్రెల కాపరులు, మేకల కాపరులు మొదలకు వారు అడవికి వెళ్లే టప్పుడు సంగటి ముద్దను వేసుకొని అందులో చింతకాయ ఊరి బిండిని వేసుకొని మధ్యాహ్నాం తినడానికి ఆ చిక్కాన్ని సంకకు తగిలించుకొని తీసుకెళ్లే వారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ చిక్కం నిండా వులింజి పండ్లు, బూడిగ పండ్లు, రేగి పండ్లు, కలింకాయలు వంటి అడవి పండ్లను తీసుకొని వచ్చెవారు. గొర్రె పిల్లలు వాటి తల్లుల కొరకు, ఊరి పిల్లలు వారు తెచ్చే పండ్లకొరకు ఊరి బయటే ఎదురు చూసే వారు.

గీస కత్తి

సాధారణంగా ప్రతి మొగ వారి వద్ద మొల తాడుకు కట్టిన చిన్న వస్తువులు కలిగిని ఒక గుత్తి వుండేది. అందులో గీస కత్తి: ఇది చాల చిన్నని కత్తి: గుబిలి గంటె ..... ఇది చెవులో గుమిలి తీయ డానికి వుప యోగ పడేది: మల్లె ముల్లు: ... దీంతో కాలిలో గుచ్చు కున్న ముల్లును తీయ డానికి ఉపయోగించే వారు. వీటిని అత్యవసర పరికారలుగా చెప్ప వచ్చు. ప్రస్తుతం ఇటు వంటివి ఎవరి వద్దా లేవు. కాని దానికి పోలిన ఇంకా ఎక్కువ చిన్న పరికారాలున్న గుత్తి పట్టణాలలో విరివిగా దొరుకుతున్నాయి. అందులో గోర్లు తీయ డానికుపయోగించేది మొదలగు నవి ఉన్నాయి.

ధనియాలు చీల్చే యంత్రం

మొక్కలు సరిగా రావడానికి ధనియాల విత్తనాలను విత్తే ముందు రెండుగా చీల్చ వలసి ఉంటుంది. నోటిని తాజాగా (మౌత్ ఫ్రెష్నర్ గా) వుంచడానికి ఉపయోగించడానికి కూడా ప్రాసెసింగ్ అవసరమౌతుంది. సాంప్రదాయ పద్ధతిలో ధనియాలను చేత్తోనే చీలుస్తారు. అయితే ఈ పద్ధతి చాలా సమయం, శ్రమతో కూడుకున్నదే కాకుండా విత్తనాలు పాడై పంట కోత అనంతరం నష్టాలకు దారి తీస్తుంది. కాబట్టి యాంత్రిక పద్ధతి తప్పనిసరి. ఇందు కొరకు సి.ఐ.పి.హెచ్.ఇ.టి. (CIPHET) ధనియాలు చీల్చే యంత్రాన్ని రూపొందించింది. ఈ యంత్రం 1 హెచ్.పి.మోటరు సహాయంతో నడచి గంటకు 60-80 కిలోల ధనియాలను చీలుస్తుంది. ఈ యంత్రంలో 6.5 సెం.మీ. వ్యాసం, 10 సెం.మీ. పొడవు కలిగిన రెండు రోలర్లు ఉంటాయి. ఇవి రెండూ వేర్వేరు వేగాలతో తిరుగుతూ ఉండడం వలన ధనియపు గింజలు రెండుగా చీలతాయి. ఈ యంత్రంలో ఒక గేర్ వంటి కొలమానం కూడా అమర్చబడింది. ఈ యంత్రం గింజలలోని తేమ 14.2% ఉన్నప్పుడు ధనియాలను చీలుస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]