కొణతాల రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొణతాల రామకృష్ణ
కొణతాల రామకృష్ణ


పదవీ కాలము
1989-1991
1991-1996
ముందు పి.అప్పలనరసింహం
తరువాత చింతకాయల అయ్యన్న పాత్రుడు
నియోజకవర్గము అనకాపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-04) 4 జనవరి 1957 (వయస్సు 64)
అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానము 2 కుమార్తెలు
మతం హిందూ
మూలం [1]

కొణతాల రామకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యుడు, రాజకీయ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

కొణతాల రామకృష్ణ 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కొణతాల సుబ్రహ్మణ్యం. ఇతని విద్యాభ్యాసం అనకాపల్లిలోని "అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజి"లో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.కాం. పట్టా పొందాడు. ఇతడు వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా సేవలను అందించాడు. ఇతనికి 1982లో పద్మావతితో వివాహం జరిగింది. వీరికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు[1].

రాజకీయ రంగం[మార్చు]

ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో 1980వ దశకంలో చేరాడు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.అప్పలనరసింహంపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచి 9వ లోక్‌సభకు ఎన్నికైనాడు. తిరిగి 1991లో పదవ లోక్‌సభకు అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1990, 1992 సంవత్సరాలలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీతరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయాడు. తిరిగి 2004లో దాడి వీరభద్రరావుపై 17వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. తిరిగి 2009లో శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయాడు. ఇతడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించాడు. రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన రామకృష్ణ అతని మరణానంతరం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించాడు. ఇతని తమ్ముడు కొణతాల రఘునాథ్‌ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వై. ఎస్. విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించాడు. ఆ ఎన్నికల్లో విజయమ్మ 90 వేల ఓట్ల తేడాతోనూ, అనకాపల్లిలో రఘునాథ్‌ 22 వేల ఓట్ల తేడాతోనూ ఓడిపోయారు. ఇతడు సక్రమంగా పనిచేయకపోవడంతోనే రెండుచోట్లా పార్టీ ఓడిపోయిందని వైసీపీ అధిష్ఠానం భావించి ఇతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటినుంచి ఇతడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు[2].

మూలాలు[మార్చు]

  1. web master. "KONATHALA, SHRI RAMA KRISHNA". PARLIAMENT OF INDIA LOK SABHA. భారతదేశం. Retrieved 22 January 2021.
  2. Staff Reporter (15 March 2019). "YSRCPలోకి కొణతాల రామకృష్ణ?". సమయం (https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ex-minister-konathala-ramakrishna-to-join-ysrcp/articleshow/68418739.cms). Retrieved 22 January 2021.