కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం | |
---|---|
తెలంగాణ లో స్థానం | |
భౌగోళికాంశాలు : | 17°55′13″N 78°58′24″E / 17.9202°N 78.9732°E |
పేరు | |
ప్రధాన పేరు : | మల్లన్న స్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | సిద్దిపేట జిల్లా |
ప్రదేశం: | చేర్యాల మండలం, కొమురవెల్లి గ్రామం. |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | మల్లన్న(మల్లికార్జున) స్వామి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయ, చాళుక్య; హిందూ |
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం (కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.
ఆలయ విశేషాలు[మార్చు]
కొమురవెల్లి మల్లన్న స్వామీని బండ సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షము ఉంది. ఈ ఆలయానికి 15 కి.మీ దూరంలో పోచమ్మ దేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు.
జాతర[మార్చు]
ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం (అన్నం) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఢమరుకం (జగ్గు) వాయిస్తూ, జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి, చేతిలో ముగ్గుపలక, ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు.జాతర చివరలో కామదహనం (హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు, విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ (బలిజ) పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి.వాటిని విశాలంగా నేర్పి, కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు.
మల్లికార్డునస్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం వున్నది. శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్ధాపకులు, ప్రచారకులు. ఈ ఆలయానికి 20కి.మీ. ల దూరంలో గ్రామ దేవత కొండ పోచమ్మ ఆలయం వుంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి, ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండ పోచమ్మ ఆలయానికి చేరుకుని, ఈ తల్లిని కొలిచి, మంగళవారంనాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా, అమ్మవారు తనని నమ్మినవారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి. దేవస్ధానంవారు భక్తుల సౌకర్యార్ధం వివిధ సేవలకోసం ఆన్ లైన్ లో రిజర్వు చేసుకునే సౌకర్యం కల్పించారు. మార్గము: వరంగల్ కి 110 కి.మీ., సిధ్ధిపేటకి 22 కి.మీ, హైదరాబాదునుంచి 90 కి.మీ. ల దూరంలో వున్నది కొమరవెల్లిలోని ఈ ఆలయం. కొమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా, చేర్యాల మండలంలో వున్నది. సికిందరాబాదు, వరంగల్, హనుమకొండ, సిధ్ధిపేట, వేములవాడనుంచి బస్ సౌకర్యం వున్నది. హైదరాబాదు నుంచి కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారిలో, హైదరాబాదునుంచి షుమారు 90 కి.మీ. లు వెళ్ళాక కుడి వైపు కమాను కనబడుతుంది. దాన్లోంచి 4 కి.మీ. లు వెళ్తే కొమరవెల్లిలో కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జునుని చేరుకోవచ్చు.
చరిత్ర[మార్చు]
పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరువచ్చి, కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమ శివుడు ఇక్కడి తన భక్తులను కాపాడటానికి వీరశైవమతారాధకులైన మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాతకూడా తన భక్తుల రక్షణార్ధం ఇక్కడే కొలువుతీరాడు. భక్తులచేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జునస్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతి రూపమైన లింగ రూపంలోకాక, గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజకులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చెయ్యబడ్డది. కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యి, రాను రాను అధికం కావంటంతో దేవాలయంలో వున్న మండపములు విస్తరించబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి.[1]
కేసీఆర్ సందర్శన[మార్చు]
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయం పూర్తిచేసి మల్లన్న పాదాలను కడుగుతానని గతంలో ప్రకటించిన విధంగా 2022, ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించి, సాయంత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న కేసీఆర్ గోదావరి జలాలతో మల్లన్న స్వామికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి. హరీశ్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, సి.హెచ్. మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2]
కోటి రూపాలయ కిరీటం[మార్చు]
2022 డిసెంబరు 19న జరిగిన మల్లన్న కల్యాణ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య ఆర్థిక శాఖామంత్రి టి. హరీశ్ రావు పాల్గొని కోటి రూపాయల బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకుని సంప్రదాయబద్దంగా మేళ, తాళలతో వచ్చి సమర్పించాడు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సి.హెచ్ మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3]
మూలాలు[మార్చు]
- ↑ "పి.యస్.యమ్. లక్ష్మి (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)".
- ↑ telugu, NT News (2022-02-23). "గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్నకు సీఎం కేసీఆర్ అభిషేకం". Namasthe Telangana. Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.
- ↑ telugu, NT News (2022-12-18). "కొమురవెల్లి మల్లన్నకు రూ. కోటి విలువైన బంగారు కిరీటం". www.ntnews.com. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
ఇతర లింకులు[మార్చు]
- Newsmarg (2017-04-27), Secret Behind Komuravelli Mallanna Temple | కొమరెల్లి మల్లన్న గుడి లో ఉన్న అసలు రహస్యం! | Newsmarg, retrieved 2018-05-01