కోడెల శివప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడెల శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గము సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-05-02) 1947 మే 2 (వయస్సు: 71  సంవత్సరాలు)
కండ్ల గుంట,నకిరికల్లు మండలం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసము హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
మతం హిందు

కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నుకోబడిన తొలి శాసనసభాపతి. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. తాతగారి ప్రోత్సాహంతో వైద్యవిద్యనభ్యసించాలనుకున్నాడు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివాడు.

వైద్యవృత్తి[మార్చు]

సత్తెనపల్లిలో రావుల వెంకట్రావు అనే వైద్యుడి దగ్గర కొంతకాలం అప్రెంటీస్ గా చేరి తరువాత తనే సొంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. ఆయన దగ్గరకు గ్రామీణులే అధికంగా వచ్చేవారు. వాళ్ళ అభిమానంతో పల్నాడు ప్రాంతంలో మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు అప్పట్లో గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కోడెల శివప్రసాదరావు ఆయన దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 1983లో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు కోడెల శివప్రసాదరావు. గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కోడెల 1987లో ఎన్టీఆర్ కేబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1995, 1999ల్లో బాబు హయాంలో భారీ నీటిపారుదల, పంచాయితీరాజ్, పౌర సరఫరాల శాఖ, ఆరోగ్యశాఖలను నిర్వహించారు కోడెల శివప్రసాదరావు. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశారు కోడెల. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి కోడెల గెలిచారు. [1]

కుటుంబం[మార్చు]

ఎంబీబీఎస్ చదువుతుండగానే ఆయనకు వివాహమైంది. ఆమె గృహిణి. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్దబ్బాయి క్యాన్సర్ సర్జన్. రెండో అబ్బాయి ఎముకల స్పెషలిస్టు. రెండో అబ్బాయి ప్రమాదవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

వనరులు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 20-06-2014
  1. http://telugu.expresstv.in/telugu/andhra-7166.html