Jump to content

కృతవర్మ

వికీపీడియా నుండి
(క్రితవర్మ నుండి దారిమార్పు చెందింది)

కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం, హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్మ ప్రసక్తి కనిపిస్తుంది.

కృతవర్మ యాదవకులంలోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శమంతకమణి వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృతవర్మ కౌరవుల పక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వత్థామకు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది. మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో సాత్యకి చేతిలో మరణించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కృతవర్మ&oldid=4010694" నుండి వెలికితీశారు