టంగుటూరి సూర్యకుమారి
టంగుటూరి సూర్యకుమారి | |
---|---|
జననం | టంగుటూరి సూర్యకుమారి నవంబర్ 13, 1925 రాజమండ్రి |
మరణం | 2005 ఏప్రిల్ 25 లండను | (వయసు 79)
నివాస ప్రాంతం | లండను |
ప్రసిద్ధి | తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. |
భార్య / భర్త | హెరాల్డ్ ఎల్విన్ |
తండ్రి | టంగుటూరి శ్రీరాములు |
తల్లి | రాజేశ్వరి |
టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 - ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె 1925 నవంబర్ 13 నాడు రాజమండ్రిలో జన్మించింది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937లో మద్రాసు వచ్చి, సినీరంగ ప్రవేశము చేసింది. 1952లో ఆమె తొలి మద్రాసు అందాలసుందరి (మిస్ మద్రాసు) అయినది.[1] మూడో ఏటనుంచే పాటలుపాడేది. పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే ఆమె రైతుబిడ్డ సినిమాలో నటించింది. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా ఉండడంచేత, అప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ప్రార్థన గీతాలు పాడుతూండడం చేత సినిమావారి పిలుపు వచ్చింది. సాంప్రదాయ నియమ, నిష్టలుగల కుటుంబమవడంచేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఊగిసలాట అనంతరం సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది.
లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి.
గాయనిగా
[మార్చు]నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేది. ఆంధ్రలోని చాలా ఊళ్ళలో లలిత సంగీత కచ్చేరీలు చేసింది. పేరు ప్రతిస్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్ళపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువుమీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.[2]
సూర్యకుమారి కంఠ, రంగూ, రూపం ఆకర్షణీయంగా ఉన్నా, మామూలు అమ్మాయిలకంటే కొంచెం పొడవుగా ఉండటం చేత, సినిమా రంగంలో సమస్య అయ్యింది. ఆనాటి సగటు హీరోలు ఈమె కంటే ఓ చూపువాసి పొట్టిగా ఉండటంచేత కాస్త ఇబ్బంది. అదీ కాక ఈమె బ్రాహ్మణ కుటుంబం, అందులోనూ పేరుపొందిన రాజకీయ కుటుంబం నుంచి రావటమే కాదు, ప్రేమ సన్నివేశాలు హీరోయిన్ మీద హీరో చెయ్యి వెయ్యడం, ఇత్యాదివి ఒప్పుకొనేవారు కాదు. అందువల్ల గొప్ప చాతుర్యం ఉండి కూడా సూర్యకుమారి సినిమాల్లో సుస్థిరత పొందలేక పోయింది.
తెలుగు, తమిళము, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మా తెనుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు'స్వప్నజగతిలో ఛాయావీణ' మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు గారి 'ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ', 'రావోయి చిన్నవాడా' మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకుంది.
ఇతర దేశాలలో వ్యాపించిన ఖ్యాతి
[మార్చు]1960 దశకంలో ఈమె లండను వెళ్ళి అక్కడ 'ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' సంస్థను స్థాపించింది. ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించం ముఖ్య ఆశయం. 1968లో ఈమె కృషిని బ్రిటిషు రాణి గుర్తించింది. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమె. ఈమె నార్వే, స్వీడన్, హాలెండ్, స్పెయిన్, కెనడా, అమెరికామొదలైన పలు దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి, వందలాది కళాకారులను తయారుచేశారు. అమెరికాలో బ్రాడ్వే థియేటరులో విశ్వకవి రవీంద్రుని 'కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్' నాటకంలో రాణి పాత్ర ధరించి, బ్రాడ్వే అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి. ఈ నాటకాన్ని న్యూయార్కులో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, అటు తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించింది. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండను యూనివర్సిటీ విద్యాసంస్థలలోను, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్యకళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించింది. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఈమె.
అవార్డులు
[మార్చు]1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది. 1984లో ఈమెకు శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం లభించింది.
అస్తమయం
[మార్చు]లండను లోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్తో వివాహమైంది. 1973లో లండనులో స్థిరపడిన ఈమె ఏప్రిల్ 25, 2005 న లండనులో మరణించింది.
సినిమాల జాబితా
[మార్చు]
|
|
|
మూలాలు
[మార్చు]- ↑ GUDIPOODI, SRIHARI (2008-07-04). "Twinkle toes and a magical voice". The Hindu. Archived from the original on 2012-11-10. Retrieved 2014-02-01.
- ↑ చందూర్, మాలతి. "స్వాతి". పాతకెరటాలు (డిసెంబరు 2008).
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)
బయటి లింకులు
[మార్చు]- టంగుటూరి సూర్యకుమారి పాడిన మాతెలుగు తల్లికి పాట వీడియో (యూట్యూబ్) రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోషియేషన్ పునర్మిలనం బిర్మింగహామ్, 1985 కార్యక్రమంలో, అప్లోడ్ చేసినవారు అప్పారావు నాగభైరు, 2008
- Harpe, Bill (2005-05-18). "Surya Kumari-Indian film star and apostle of her country's dance and song (గార్డియన్ లో సూర్యకుమారి మరణించినపుడు సంక్షిప్తచరిత్ర)". The Guardian. Retrieved 2014-02-01.
- చీకోలు, సుందరయ్య. "తెలుగు తల్లి ముద్దుల తనయ! టంగుటూరి సూర్యకుమారి". ఈనాడు. Archived from the original on 2014-03-02. Retrieved 2014-02-01.