Jump to content

తెలంగాణకు హరితహారం

వికీపీడియా నుండి
తెలంగాణకు హరితహారం
తెలంగాణకు హరితహారం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపన3 జూలై 2015 (2015-07-03)
బడ్జెట్₹ 10,822 కోట్లు
వెబ్ సైటుతెలంగాణకు హరితహారం అధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణకు హరితహారం ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు

తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే 46 కోట్ల మొక్కలు నాటబడ్డాయి.[1]

హరితహారంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2021 మే వరకు దాదాపు 217 కోట్ల మొక్కలను (అడవుల పునరుద్ధరణతో కలుపుకొని ) నాటడం జరిగింది. ఇందుకోసం రూ.5,230 కోట్లు ఖర్చు చేసింది.[2]

2019 – 2021 మ‌ధ్య అట‌వీ విస్తీర్ణంలో 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో దేశంలోనే అట‌వీ విస్తీర్ణంలో తెలంగాణ రెండో రాష్ట్రంగా నిలిచిందని 2022 డిసెంబరు 14న కేంద్ర పర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే అధికారికంగా రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించాడు.[3]

తెలంగాణ ప్రభుత్వం 2023, జూన్ నాటికి 10,822 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 273.33 కోట్ల మొక్కలు నాటింది.[4] 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించుకొని ఉన్నాయి.[5]

కార్యక్రమాలు

[మార్చు]

హైదరాబాదు నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించారు.ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు. కేవలం ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా నాటారు. 2016లో నాటిన 46 కోట్ల మొక్కల్లో నీడ నిచ్చే వేప, మర్రి, రావి లాంటివి 36.81 కోట్ల మొక్కలు... టేకు, మద్ది లాంటి లాభదాయక చెట్లు మరో 8.5 కోట్ల మొక్కలు...పండ్ల చెట్లు కోటి దాకా ఉన్నాయి. అంతేకాకుండా పూలచెట్లు, ఈత మొక్కలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటారు.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్విజయవాడ, హైదరాబాద్ - ముంబాయి, హైదరాబాద్వరంగల్, హైదరాబాద్బెంగుళూరు, హైదరాబాద్నాగపూర్ వంటి జాతీయ రహదారులకిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు.

లక్ష్యాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర భూభాగం 1,12,077 కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 కిలోమీటర్లమేర (24శాతం) ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరిగేలా చేయడం.తద్వారా వానలు వాపస్‌ వచ్చేలా చూడటం. అడవిలో, రోడ్లకిరువైపులా పండ్ల చెట్లను నాటటంద్వారా నివాసాలు, పంటపొలాలపై దాడిచేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం. వాతావరణంలో ప్రాణవాయువును పెంచటం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ఇతర పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ ప్రాంతంలో 100కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతం వెలుపల 120 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10కోట్ల మొక్కలు పెంచడం

  1. తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం
  2. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం
  3. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడo
  4. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం
  5. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం
  6. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం
  7. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం
  8. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
  9. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం[6]

హరిత హారం నినాదాలు

[మార్చు]

హరిత హారం లక్ష్యాలను విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వివిధ నినాధాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా ‘‘వానలు వాపస్ రావాలె’’ అనే నినాదంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు.

  • తెలంగాణ 'పచ్చ'ల పేరు.. హరిత హారం జోరు
  • వనాలు పెంచు-వానలు వచ్చు
  • చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
  • పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
  • వనాలు-మానవాళి వరాలు
  • పచ్చని వనములు-ఆర్థిక వనరులు
  • అడవులు-మనకు అండదండలు
  • అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
  • అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
  • అటవీ సంపద-అందరి సంపద
  • చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
  • అడవులు-వణ్యప్రాముల గృహములు
  • పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
  • సతతం-హరితం
  • మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
  • చెట్టుకింద చేరు-సేదను తీరు
  • అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
  • అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే
  • మొక్కను పట్టు-భూమిలో నాటు
  • దోసిలిలోకి తీసుకోమొక్కు -ఏదోస్థలమున నాటుము మొక్క

మొక్కల ఎంపిక

[మార్చు]

హరిత హారం కార్యక్రమంలో మొక్కుబడిగా ఏదో ఒక మొక్కలు నాటకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మొక్కలను నాటి వాటిని నిబద్ధతతో సంరక్షించి వాటి ప్రయోజనాలను సమాజానికి అందేలా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి.

  • పొలంగట్ల మీద: టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సుబాబుల్, పండ్ల మొక్కలు
  • ఇంటి పరిసరాల్లో: కరివేపాకు, మునగ, బొప్పాయి, జామ, ఉసిరి, దానిమ్మ, కానుగ, వేప, బాదం
  • పాఠశాలలు, కార్యాలయాలు: కానుగ, వేప, బాదం, రావి, జువ్వి, మర్రి, నేరేడు, ఉసిరి
  • రహదారుల పక్కన: ఎర్రతురాయి, పచ్చతురాయి, బాహీనియా, కానుగ, నేరేడు, దిరిశిన, సిస్సు
  • చెరువుగట్లు: ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరి, తెల్లమద్ది, నల్లతుమ్మ
  • బోడిగుట్టలు: ఉసిరి, సీతాఫలం, మర్రి, రావి, వేప

మొదటి విడత హరితహారం

[మార్చు]

హరిత హారం మొదటి విడతను 2015 జులై 3న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తొలి ఏడాది 15.96 కోట్ల మొక్కలు నాటారు.

రెండవ విడత హరితహారం

[మార్చు]

రెండో విడతను 2016 జులైన 8న నల్లగొండ జిల్లా, చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో ప్రారంభించబడింది. ఈ రెండో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఆ విడతలో 31.67 కోట్ల మొక్కలు నాటారు.

మూడవ విడత హరితహారం

[మార్చు]

మూడో విడతను 2017 జులై 12న కరీంనగర్‌లో ప్రారంభించారు. 34 కోట్లకుపైగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారాన్ని కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటి ప్రారంభిచటం జరిగింది.

నాల్గవ విడత హరితహారం

[మార్చు]

నాలుగో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో 2018, ఆగస్టు 1న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్కలు నాటి, ఏకకాలంలో లక్షా 116మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ విడతలో 32 కోట్ల మొక్కలు నాటారు. ఈ విడత కార్యక్రంలో భాగంగా 2018, ఆగస్టు25న రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ‘హరిత పాఠశాల’ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని 37 వేల పాఠశాలలు, 404 జూనియర్ కాలజీలు, 130 డిగ్రీ కాలేజీలు, 55 పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

అయిదవ విడత హరిత హారం

[మార్చు]

2019లో ఐదో విడతను కూడా గజ్వేల్‌లోనే ప్రారంభించగా 38 కోట్ల మొక్కలు నాటారు.

ఆరోవిడత హరితహారంలో మియావాకి పద్దతి అమలు

[మార్చు]

ఆరో విడత హరితహారం కార్యక్రమం 2020, జూన్ 25న మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి కెసీఆర్ అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించాడు. ఈ విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.[7][8]

రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరిత హారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఆరో దశలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ అధ్వర్యంలో 2.61 కోట్ల మొక్కలు నాటనున్నారు. హరితహారం కోసం రాష్ట్రంలోని 12,50 నర్సరీల్లో మొక్కలు సిద్దపరిచారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్‌ పద్ధతి మియావాకీ పద్దతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. ఆరవ దశ హరిత హారంలో ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. "స్వదేశీ చెట్ల ద్వారా దేశీయ అడవులను" పునర్నిర్మించే మియావాకి పద్ధతి 20 నుండి 30 సంవత్సరాలలో గొప్ప, దట్టమైన, సమర్థవంతమైన రక్షిత మార్గదర్శక అడవిని ఉత్పత్తి చేస్తుంది.

ఏడవ విడత హరితహారం

[మార్చు]

అన్ని రహదారి వనాలకు  ప్రాధాన్యతనిస్తూ 2021 జూలై 1 నుంచి జూలై 10 వ‌ర‌కు ఏడ‌వ విడ‌త హరిత‌హార కార్య‌క్ర‌మం కొనసాగింది. పెద్ద అంబర్‌పేట్ క‌లాన్ లోని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జూలై 1న ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏడ‌వ విడ‌త హ‌రిత‌హార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాడు. ఈసారి హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించడంతోపాటు 2021-22 సంవ‌త్స‌రంలో 19.91 కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ-దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.[9][10]

తొమ్మిదవ విడత హరిత‌హారం

[మార్చు]

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా తెలంగాణ హరితోత్సవంలో భాగంగా 2023, జూన్ 19న రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, తుమ్మ‌లూరులోని అర్బన్‌ ఫారెస్ట్‌ లో మొక్కను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 9వ విడత హరిత‌హారంను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ-దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, చేవెళ్ళ ఎంపీ జి.రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్‌, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తొమ్మిదో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.[11][12]

మొదటి స్థానం

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో 2015-16 నుండి 2020-21 సెప్టెంబరు నెల నాటికి 176.52 కోట్ల మొక్కలను నాటబడ్డాయి. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంటులో ప్రకటించాడు.[2] 2021 నవంబరు నాటికి 239కోట్లకుపైగా మొక్కలు నాటబడ్డాయి.[13]

డ్రోన్‌ సీడింగ్‌

[మార్చు]

హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ వినూత్న ప్రయోగంగా పర్యావరణ అటవీప్రాంతాల్లో డ్రోన్ తో విత్తనాలు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ సంస్థ తయారుచేసిన డ్రోన్‌తో సిరిసిల్ల సమీపంలోని వీర్నపల్లి గ్రామ శివారులో 2020, ఫిబ్రవరి 17న ఒకేరోజు 15 వేల విత్తన బంతులను చల్లి రికార్డు సృష్టించింది. రాష్ట్రమంతటా అడవుల పునరుద్ధరణకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.[2]

హరిత నిధి

[మార్చు]

హరితహారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడడానికి హరితనిధి పేరుతో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విరాళాలు సేకరిస్తారు. అటవీశాఖ ఈ హరితనిధికి నోడల్‌శాఖగా ఉండగా, అటవీశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ హరితనిధి ఏర్పాటుకు 2021, డిసెంబరు 16న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హరితనిధి కింద ప్రజాప్రతినిధులు రూ.500, రాష్ట్రంలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులంతా వారి జీతం నుంచి నెలానెలా గ్రీన్‌ఫండ్‌కు రూ.100 ఇచ్చేందుకు అంగీకరించారు.[13]

ఇతర వివరాలు

[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం ద్వారా ఈ పథకాన్ని మరింత పటిష్టంగా నిర్వహించనున్నారు.

మూలాలు

[మార్చు]
  1. గౌడ్స్ న్యూస్.కాం. "'తెలంగాణకు హరితహారం' మరో కొత్త రికార్డు సృష్టించబోతున్నది". goudsnewstv.com. Archived from the original on 30 March 2017. Retrieved 5 January 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. 2.0 2.1 2.2 "పచ్చదనం పెంచే అతి పెద్ద ప్రయత్నం 'తెలంగాణకు హరితహారం'". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-01. Archived from the original on 2021-06-02. Retrieved 2021-11-17.
  3. telugu, NT News (2022-12-15). "అట‌వీ విస్తీర్ణంలో తెలంగాణ‌కు రెండోస్థానం.. కేంద్రం వెల్ల‌డి". www.ntnews.com. Archived from the original on 2022-12-17. Retrieved 2022-12-17.
  4. telugu, NT News (2023-06-19). "CM KCR | తుమ్మలూరులో తొమ్మిదో విడత హరితహారం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  5. telugu, NT News (2023-06-19). "Haritha Haram | తెలంగాణ పుడమిపై కేసీఆర్‌ ఆకుపచ్చని సంతకం". www.ntnews.com. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  6. తెలంగాణ మాస పత్రిక. "తెలంగాణకు హరితహారం". magazine.telangana.gov.in. Archived from the original on 23 January 2017. Retrieved 6 January 2017.
  7. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 June 2020). "హరితహారం : అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్‌". ntnews. Archived from the original on 25 June 2020. Retrieved 25 June 2020.
  8. Telugu, TV9 (2020-06-17). "20 కోట్ల మొక్కలు లక్ష్యంగా.. తెలంగాణకు హరితహారం". TV9 Telugu. Archived from the original on 2021-11-17. Retrieved 2021-11-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "ఏడో విడత హరితహారం.. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-01. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
  10. "Palle, Pattana Pragathi launched". The Hindu. 2021-07-01. ISSN 0971-751X. Archived from the original on 2021-07-01. Retrieved 2023-06-20.
  11. Satyaprasad, Bandaru (2023-06-19). "Harithotsavam : తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనమేనన్న సీఎం కేసీఆర్, 9వ విడత హరితహారం ప్రారంభం". Hindustantimes Telugu. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  12. "CM KCR: తొమ్మిదో విడత హరితహారం.. తుమ్మలూరులో మొక్కలు నాటిన కేసీఆర్". Prabha News. 2023-06-19. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  13. 13.0 13.1 "తెలంగాణ హరితనిధి ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-16. Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-16.