చిలుకూరు బాలాజీ దేవాలయం
చిలుకూరు బాలాజీ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | రంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | చిలుకూరు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | బాలాజీ |
ప్రధాన దేవత: | రాజ్యలక్ష్మి |
ఉత్సవ దైవం: | వెంకటేశ్వరుడు |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 1067 |
చిలుకూరు బాలాజీ దేవాలయం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.
మందిరం ప్రాముఖ్యత
[మార్చు]ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు
స్థల గాధ
[మార్చు]ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆభక్తుడికు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీవు దానికి చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా, పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని,రెండు తెలుగు రాష్ర్టాల,ఇతర రాష్ర్టాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.
1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.
ప్రయాణ సదుపాయాలు
[మార్చు]హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు ఉన్నాయి. అవేకాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి. మెహిదీపట్నం నుండి 288D బస్సు ఎక్కవలెను. ప్రయాణ సమయం గంట.
దేవాలయం ప్రత్యేకతలు
[మార్చు]ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి, ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉంది. దీనిని ప్రభుత్వం వారు ‘యాదగిరి గుట్ట’ దేవాలయానికి అనుసంధానం చేయాలనుకొన్నారు. అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధర్మకర్తలు దానిని వ్యతిరేకించారు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిెంచారు.ఈ ఆలయంలో ‘హుండి’ లేదు. గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారుల, ఊరి ప్రముఖుల ద్వారా జరుపబడుతుంది. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి.కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకుంది.
ప్రదక్షిణలు
[మార్చు]ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు.
ఇతర విశేషాలు
[మార్చు]- దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని దేవాలయం అర్చకులు పదే పదే చెబుతుంటారు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరుపున ప్రచురిస్తున్నారు.
- ఈ ఆలయ పరిధిలో ఆ ఆలయ నిర్వాహకులు రంగరాజన్ ఓ గోశాలను నిర్వహిస్తున్నారు. దానిలో ఆ గోశాలలో పుట్టినవి కొన్ని అయితే భక్తులు కానుకగా ఇచ్చినవి కొన్ని. 2019లో ఉరుములు పిడుగులు తో కూడిన అకాల వర్షంలో అర్ధరాత్రివేళ ఓ పాడి ఆవు పైన పడిన పిడుగు ఓ పేద రైతు కుటుంబాన్ని రోడ్డున పడవేసింది. అది చూసిన రంగరాజన్ ప్రకృతి వైపరీత్యాలలో మూగజీవాలను కోల్పోయిన రైతన్నలను గుర్తించి వారికి పశువులను ఇచ్చి చేయూతనిస్తున్నారు. [1]
చిలుకూరు క్షేత్ర చరిత్ర గ్రంథం
[మార్చు]తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన ఈ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు పరిశోధన చేసి "చిలుకూరు క్షేత్ర చరిత్ర" అనే గ్రంథం రాశాడు.
సా.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చి 2005న అప్పటి శాసన సభ స్పీకర్ కె.ఆర్. సురేశ్ రెడ్డి విడుదల చేశారు.
ఈ "చిలుకూరు క్షేత్ర చరిత్ర" గ్రంథాన్ని తరువాత చర్యలో భాగంగా ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, నవోదయ బుక్ హౌజ్, ప్రజాశక్తి బుక్ హౌజ్ లు సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.అప్పట్లో కేవలం రెండు రోజుల్లో 10 వేల కాపీలు అమ్ముడుపోయి ఈ గ్రంథం చరిత్ర సృష్టించింది.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "పేద రైతులకు పశువులిస్తారు". ఈనాడు - ఆదివారం. 7 April 2024.
వెలుపలి లింకులు
[మార్చు]- దేవస్థానం వెబ్సైటు Archived 2013-06-21 at the Wayback Machine