Jump to content

మనసంతా నువ్వే

వికీపీడియా నుండి
మనసంతా నువ్వే
దర్శకత్వంవి. ఎన్. ఆదిత్య
రచనపరుచూరి బ్రదర్స్ (కథ, స్క్రీన్ ప్లే, మాటలు), వి. ఎన్. ఆదిత్య (కథ), ఎం. ఎస్. రాజు (కథ), వీరు పోట్ల (కథ), సిరివెన్నెల సీతారామశాస్త్రి (పాటలు)
నిర్మాతఎం.ఎస్.రాజు
తారాగణంఉదయ్‍కిరణ్, రీమా సేన్, తనికెళ్ళ భరణి, సునీల్, తనూరాయ్, సుహాని కలిత
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి
సంగీతంఆర్.పి.పట్నాయక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 19, 2001 (2001-10-19)
దేశంభారత దేశం
భాషతెలుగు

మనసంతా నువ్వే ఎం.ఎస్.రాజు నిర్మాతగా, వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన 2001 నాటి ప్రేమకథా చిత్రం. సినిమాలో ఉదయకిరణ్, రీమా సేన్, తనికెళ్ళ భరణి, సునీల్, తనూరాయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు.

అరకులో నివాసం ఉండే అను అనే అమ్మాయి ఒక ధనవంతుడైన ప్రభుత్వాధికారి కూతురు. వాళ్ళ ఇంటి పక్కనే చిన్న పూరి గుడిసెలో చంటి అనే అబ్బాయి ఉంటాడు. వీళ్ళిద్దరికీ స్నేహం కుదురుతుంది. కానీ ఈ స్నేహం అను తండ్రికి నచ్చదు. ఒక రోజు అను తండ్రికి ఆ ఊరినుంచి బదిలీ కావడంతో స్నేహితులిద్దరూ భారంగా విడిపోవలసి వస్తుంది. అను వెళ్ళిపోతూ ఆమె జ్ఞాపకంగా మెడలో వేసుకునే ఒక గడియారాన్ని అతనికి కానుకగా ఇస్తుంది. చంటి ఆమె పరిచయానికి గుర్తుగా దాన్ని అపురూపంగా దాచుకుంటాడు. కొద్దొ రోజులకే అతనికి ఉన్న ఏకైక తోడు తల్లి మరణిస్తుంది. బ్రతకడం కోసం రైల్లో టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు. ఒకసారి రైల్లో పరిచయమైన మోహన్ రావు దంపతులు అతన్ని చేరదీసి అతనికి వేణు అని కొత్త పేరు పెట్టి తమ కొడుకులాగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ కూతురునే తన స్వంత చెల్లెల్లా భావిస్తుంటాడు వేణు.

విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన అను చంటి కోసం వెతుకుతూ ఉంటుంది. తాము అరకులో చిన్నతనంలో కలుసుకున్న దేవాలయం దగ్గరకు వెళుతుంది. కానీ అక్కడ తను కనిపించడు. తన అనుభవాలన్నీ కలిపి రేణు అనే మారు పేరుతో స్వాతి పత్రికలో మనసంతా నువ్వే అనే పేరుతో నవల రాస్తూ ఉంటుంది. వేణు చెల్లెలు ఆ నవలకు, రచయిత్రికి వీరాభిమాని అయిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన రేణు చిన్ననాటి చంటినే వేణు అని తెలుసుకుని అతనికి చెప్పకుండానే ప్రేమిస్తుంటుంది. చివరికి ఇద్దరూ ఒకటి కాబోయేంతలో అను తండ్రి అడ్డుపడతాడు. అందరినీ ఒప్పించి ఈ జంట ఎలా కలిసిందనేని మిగతా కథ.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

2001లో నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మించి సంక్రాంతికి విడుదల చేసిన భారీచిత్రం దేవీపుత్రుడు పరాజయం పాలయ్యింది. ఎం.ఎస్.రాజు తదుపరి చిత్రం భారీ చిత్రం కాక ఒక లవ్ స్టోరీ అయితే బావుంటుందనీ, దానికి కొత్త దర్శకుణ్ణి పెట్టుకోవాలని అనుకున్నారు. ఆయనకు సన్నిహితుడైన సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాలరెడ్డితో ఈ విషయం చర్చించగా ఆయన వి.ఎన్.ఆదిత్య పేరును సూచించారు. అప్పటికి ఆదిత్య సింగీతం శ్రీనివాసరావు, జయంత్ సి పరాన్జీల వద్ద సహాయ దర్శకునిగా పనిచేశారు. దాంతో రాజు అతన్ని కలవాలని ఫోన్ చేశారు, అయితే అంతటి నిర్మాత తననెందుకు కలవమంటారన్న సంకోచంతో కలవకున్నా రాజు మళ్ళీ ఫోన్ చేయడంతో కలిశారు. ఆదిత్య, రాజు తరచుగా కలుస్తూ ఎలాంటి ప్రేమకథ చేద్దామన్న విషయంలో కొంత స్పష్టత తెచ్చుకున్నారు.

కొన్నాళ్లకు ఎం.ఎస్.రాజు రెండు కథలు చెప్పి ఏది నచ్చితే దాన్నే తీద్దామన్నారు. మొదటిది తానే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రేమించుకుందాం రా సినిమా తరహాలో ఉందని, మళ్ళీ దాన్నే తీయడం తనకు ఇష్టంలేదని చెప్పేశారు ఆదిత్య. రెండో కథ ఐడియా నచ్చి ఆ స్క్రిప్ట్ పై వర్క్ ప్రారంభించారు. సినిమాలో అరుదైన వాచ్ హీరోకి హీరోయిన్ బహుమతిగా ఇవ్వడం, తన ప్రేమకథనే హీరోయిన్ కథగా రాయడం వంటివి అన్ మోల్ ఘడీ అన్న హిందీ చిత్రం స్ఫూర్తిగా అభివృద్ధి చేశారు. నటుడు, రచయిత, దర్శకుడు భాగ్యరాజా తీసిన డార్లింగ్ డార్లింగ్ తరహాలో చిన్నతనం నుంచే ప్రేమకథను అభివృద్ధి చేయాలన్నది ఆదిత్య ఆలోచన. దానికి అనుగుణంగానే హీరో హీరోయిన్ల బాల్యకథను ప్రముఖంగా స్క్రిప్ట్ లో పెట్టారు. సముద్రం ఒడ్డున, వర్షంలో హీరో ఏడుస్తూ తానేమీ ఏడవట్లేదని తన స్నేహితుణ్ణి నమ్మించబోతే "ఒరేయ్, వర్షం కూడా అప్పుడప్పుడూ మేలు చేస్తుందిరా! మన కన్నీళ్ళని ఎదుటివాళ్ళకి కనపడకుండా చేస్తుంది" అంటూ క్లైమాక్స్ ముందు సన్నివేశాల్లోని డైలాగ్ రాశారు ఆదిత్య. అది విన్న వెంటనే మొత్తం సినిమాని ఎం.ఎస్.రాజు అంగీకరించి, ఆదిత్యకు అడ్వాన్స్ ఇచ్చేశారు. తర్వాతి రోజునే పత్రికలకు వి.ఎన్.ఆదిత్యతో ఓ ప్రేమకథ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాకు మనసంతా నువ్వే అన్న పేరు నిర్మాత ఎం.ఎస్.రాజు సూచించారు.

సీన్ల విభజన దాకా స్క్రిప్ట్ పూర్తయ్యాకా దాన్ని రచయితలు పరుచూరి బ్రదర్స్కి ఇచ్చారు. అయితే పరుచూరి బ్రదర్స్ అప్పటివరకూ చేసిన సీన్ల విభజన సరిగా లేదన్నారు. చిన్నతనం ఎపిసోడ్ చాలా పొడుగు కావడం, రెండో అర్ధభాగం సరిగా లేకపోవడం వంటి సమస్యలను వెల్లడించారు. దాంతో మళ్ళీ కథాచర్చలు అరకులోయ ప్రాంతంలో పునఃప్రారంభించారు. పరుచూరి బ్రదర్స్, వి.ఎన్.ఆదిత్య, ఎం.ఎస్.రాజు, వీరు పోట్ల కథాచర్చల్లో పాల్గొన్నారు. సీనిక్ ఆర్డర్ మార్చడం, కథలో కొన్ని చేర్పులు చేయడం వంటివి పూర్తిచేసి చివరకు స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశారు.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

సినిమాలో కథానాయకుని పాత్రకు మహేష్ బాబు అయితే బావుంటాడని నిర్మాత ఎం.ఎస్.రాజు భావించారు. అప్పటికి మహేష్ హీరోగా రాజకుమారుడు, మురారి సినిమాలు విజయం సాధించగా, యువరాజు, వంశీ సినిమాలు కూడా చేసి ఉన్నారు. అయితే అప్పటికే పేరుతెచ్చుకున్న నటవారసుడు కాకుండా మరెవరైనా కొత్త హీరోతో చేస్తేనే కరెక్ట్ అని దర్శకుడు వి.ఎన్.ఆదిత్య నమ్మారు. దాంతో ఇప్పటికిప్పుడు కొత్త నటుడు ఎక్కడ దొరుకుతాడని ఎం.ఎస్.రాజు అభ్యంతరం వ్యక్తంచేయడంతో తన దృష్టిలో ఉన్న ఉదయ్‍కిరణ్ పేరును ఆదిత్య సూచించారు. ఆయన సూచన మేరకు ఉదయ్ కిరణ్ తొలి సినిమా అయిన చిత్రం సినిమా చూసిన ఎం.ఎస్.రాజు ఆయననే సినిమాలో హీరోగా అంగీకరించారు.[1] సినిమాలో ప్రముఖ సినీగీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన నిజజీవిత పాత్ర పోషించారు.[2]

చిత్రీకరణ

[మార్చు]

సినిమా నేపథ్యంగా వైజాగ్ ని స్వీకరించినా చిత్రీకరణ వైజాగ్ తో పాటుగా హైదరాబాద్ ఔట్ డోర్లో కూడా చేశారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ చర్మాస్ షోరూం వంటి వాటిల్లో కొన్ని భాగాలను చిత్రీకరించారు.[1]

నిర్మాణానంతర కార్యక్రమాలు

[మార్చు]

సినిమా ఎడిటింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. కె.వి.కృష్ణారెడ్డి సినిమాకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఎడిటింగ్ పూర్తయ్యాకా రష్ చూసిన రచయితలు, నిర్మాత, దర్శకులకు సినిమాలో ఏదో తేడా కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో అత్యంత కీలకమైన భావోద్వేగం దెబ్బతినడంతో సినిమా సమస్యలో పడింది. ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎస్. గోపాలరెడ్డి, నిర్మాత ఎం.ఎస్.రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లైమాక్స్ విషయంలో తర్జనభర్జన పడ్డారు. గోపాలకృష్ణ నేరుగా క్లైమాక్స్ దెబ్బతిందని, సినిమా కష్టమని జడ్జ్ చేశారు. ఇవన్నీ విన్న ఎడిటర్ కె.వి.కృష్ణారెడ్డి తాను ముందుగా గమనించిపెట్టుకున్న ఆలోచన అమలుచేసి, వాళ్ళని మళ్ళీ క్లైమాక్స్ చూడమన్నారు. దాని ప్రకారం ఇంటర్వెల్ ముందు ఎక్కడో వచ్చే "నీ స్నేహం ఇకరాదు అని" అన్న భావోద్వేగభరితమైన పాటను తీసుకువచ్చి క్లైమాక్స్ లో హీరోని ట్రీట్ చేసిన డాక్టర్ ఆశలు వదులుకుని వెళ్ళిపోయాకా హీరో రెప్పలు వాల్చే సన్నివేశంలో చేర్చారు. దాంతో సినిమా క్లైమాక్స్ కి మంచి లోతు వచ్చిచేరింది. ఈసారి చూసిన గోపాలకృష్ణ అద్భుతంగా ఉందని, తప్పకుండా విజయవంతమవుతుందని తేల్చారు.[1]

విడుదల, స్పందన

[మార్చు]

సినిమా అక్టోబర్ 19, 2001న విడుదలైంది. సినిమా ఘనవిజయం సాధించింది. అప్పటికి చిత్రం, నువ్వు నేను సినిమాల ద్వారా వరుస విజయాలు సాధించిన కథానాయకుడు ఉదయ్‍కిరణ్కి ఇది హ్యాట్రిక్ విజయంగా నిలిచింది.[1]

పాటలు

[మార్చు]

సినిమాకు సంగీత దర్శకునిగా ఆర్.పి.పట్నాయక్ వ్యవహరించగా, పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. సినిమాలో అత్యంత కీలకమైన యాంటిక్ వాచ్ శబ్దం కోసం చాలారకాలుగా ఆలోచించి మరీ ఆ సంగీతాన్ని చేశారు ఆర్పీ. సినిమాలో చిన్నతనంలో ఉన్న హీరోహీరోయిన్లు పాడుకునే పాట, తిరిగి వస్తూంటుంది. ఆ సందర్భం కోసం 1998 నాటి మలయాళ చిత్రం ప్రణయ వర్ణంగళ్‌లోని కన్నాడి కూడుం కూట్టి పాట అయితే బావుంటుందన్న అభిప్రాయంతో పాట ట్యూన్, ఆర్కెస్ట్రైషన్ యధాతథంగా వినియోగించి తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే పాట చేశారు.[1] సినిమాలోని పలు పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ట్యూన్ బట్టి పలు వెర్షన్లు రాసిచ్చారు. దానిలో నిర్మాత, దర్శకుడు తనకు బావున్నవి, అవసరమైనంత వరకూ సినిమాకు ఉపయోగించుకున్నారు.[3]

తూనీగ తూనీగ, గానం ఉష, సంజీవని

చెప్పవే ప్రేమ , గానం.ఆర్.పి.పట్నాయక్, ఉష

కిట కిట తలుపులు, గానం.కె.ఎస్.చిత్ర

నీ స్నేహం , గానం: ఆర్.పి.పట్నాయక్ , ఉష

దిన్ దిన్ దినాక , గానం.మహాలక్ష్మి అయ్యర్

మనసంతా నువ్వే , గానం.ఎస్ పి చరణ్ , సుజాత

ఆకాశాన , గానం.కె.కె, సుజాత

ఎవరిని ఎప్పుడు , గానం.కె కె .

థీమ్స్, ప్రభావాలు

[మార్చు]

సినిమాలో కథానాయకుడి స్నేహితుడు సునీల్ పాత్రని అప్పుచేసి పప్పుకూడు సినిమాలో రేలంగి పాత్రను అనుసరించి చేర్చారు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో రేలంగి పాత్రపై దర్శకుడికి మొదటి నుంచీ ఉన్న ఇష్టం అలా చేయించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 పులగం, చిన్నారాయణ. "నీ స్నేహం ఇకరాను అని..." సాక్షి. Retrieved 9 August 2015.
  2. "manasantha nuvve: 20 వసంతాల మనసంతా నువ్వే.. ఈ విశేషాలు తెలుసా? - manasantha nuvve completes 20 years". www.eenadu.net. Retrieved 2021-10-19.
  3. సూరంపూడి, పవన్ సంతోష్. ""సిరా"వెన్నెల సీతారామశాస్త్రి". తెలుగు సినిమా పిచ్చోళ్ళు. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 10 August 2015.