Jump to content

పావలా శ్యామల

వికీపీడియా నుండి
పావలా శ్యామల
జననం
నేతి శ్యామల

1951
మరణం2026 జూలై 28(2026-07-28) (వయసు: 74)
వృత్తినటి

పావలా శ్యామల (1951 - 2026 జులై 28 ) రంగస్థల నటిగా, చలన చిత్ర నటిగా ప్రసిద్ధురాలు. గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించిన ఈమె చిన్నతనం నుంచి నాటకాలు వేసేది. పదమూడేళ్ళకే వివాహం అయ్యింది. దురదృష్టవశాత్తూ వివాహం అయిన రెండు మూడేళ్ళకే భర్త ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు పిల్లల పోషణార్థం నటననే తన వృత్తిగా చేసుకున్నది. ఈమె నటించిన మొదటి చిత్రం జంధ్యాల దర్శకత్వంలో, బాలకృష్ణ కథానాయకుడిగా 1985లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్. స్వర్ణకమలం, ఖడ్గం, ఆంధ్రావాలా, వర్షం మొదలైన చిత్రాలలో ఈమె చెప్పుకోదగిన పాత్రలు పోషించారు. నాటకాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో నటించింది. చివరి దశలో అవకాశాలు తగ్గిపోవడం, అనారోగ్యానికి గురవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కె.సి.ఆర్, పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ లాంటి కొంతమంది ప్రముఖులు ఆమెకు సాయం చేశారు. ఈమె 2026 జూలై 28న 74 సంవత్సరాల వయసులో, హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె 1951 లో గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించారు. ఈమె అసలు పేరు నేతి శ్యామల.[1]. గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో నటన ద్వారా ఈమె పేరు పావలా శ్యామలగా స్థిరపడిపోయింది. ఈమె హైస్కూలు చదువు అమరావతిలోనే జరిగింది. శ్యామల తండ్రి వ్యాపారం చేస్తుండేవారు. దాంతో ఆయన సమీప పట్టణాలైన గుంటూరు, విజయవాడ, ఏలూరు తరచూ వెళ్తుండేవారు. వ్యాపారం నిమిత్తం ఆయా పట్టణాల్లో ఉండేవారు. దాంతో శ్యామల కూడా చిన్నతనంలోనే ఎన్నో ­ఊళ్ళు చూడగలిగారు. అంతేకాదు అప్పట్లో సాంస్కృతిక కళారంగాల్లో మహిళలు ప్రాతినిథ్యం పెరుగుతోన్న రోజులు కాబట్టి ఆమె కూడా అటువైపు దృష్టి సారించారు. ఈమె బాల్యం అంతా అమరావతిలోనే గడచింది. ఈమెలోని సృజనాత్మకత కూడా అక్కడే అరంగేట్రం చేయసాగింది. దాంతో ఈమె లఘునాటికలు రాయగలిగేవారు. తనలా నాటకాల పట్ల అభిరుచి ఉన్న వారిని చేరదీసి వారిచేత ఆ నాటకాలు ప్రదర్శింపచేసేవారు. ఈమె సృజనాత్మకతని గుర్తించిన లయన్స్‌క్లబ్‌ ఈమెకు అవకాశాలిచ్చింది. వాటిని ఉపయోగించుకొని ఆమె నాటకాలు ప్రదర్శించే వారు. నాటకాల్లో అభిరుచి పెంచుకొన్న శ్యామల జీవితం చిన్నతనంలోనే నాటకీయంగా మలుపుతిరిగింది. పదమూడేళ్ళకే ఆమెకి వివాహం జరిగింది. ఆ తర్వాత రెండు మూడేళ్ళకే ఈమె భర్త ఘోరప్రమాదంలో కన్నుమూశారు. అప్పటికే ఈమెకు ఇద్దరు పిల్లలు. కుటుంబపోషణ కోసం ఈమె నాటకాన్ని వృత్తిగా స్వీకరించారు. 44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, టి.వి. సీరియళ్లలో నటించిన ఈమె తర్వాతి కాలంలో ఆర్థిక ఇబ్బందులకు లోనైంది. ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలలో నటించడానికి అవకాశాలు సన్నగిల్లాయి. ఈమె దుస్థితిని తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు,[2] సినీ నటుడు పవన్ కళ్యాణ్[3], నిర్మాత బండ్ల గణేష్ [4] మొదలైనవారు ఈమెను ఆర్థికంగా ఆదుకున్నారు.

నాటకరంగం

[మార్చు]

నేతి శ్యామల తొలినాటకం దొంగాటకం. విశాఖపట్నానికి చెందిన కె. వెంకటేశ్వరరావు దర్శకత్వంలో పదిహేడేళ్ళ శ్యామల తన పాత్రలో జీవించారు. ఆ నాటకం ఈమెకు ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. అది మొదలు ఈమె నాటకాలపైనే సహజంగానే ఆధారపడ్డారు. ఈమె రెండో నాటకం పేరు పావలా. ఆ నాటకంలో శ్యామల తన పాత్రపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈమె నుంచి పాత్రను, పాత్రనుంచి ఈమెను విడదీసి చూడడం సాధ్యంకాక నాటకాభిమానులు ఈమెను పావలా శ్యామల అన్నారు. ఆ నాటకం రాష్ట్రంలోనే కాక రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ప్రదర్శితమై ఆబాల గోపాలం ప్రశంసలందుకొంది. అందరినోట పావలా శ్యామలగా పిలుపునందుకొన్నారు. ఆ పేరు శాశ్వతం చేసుకొన్నారు. ఈమె హావభావాలు ఎంతో విలక్షణంగా నిండుగా పాత్రోచితంగా ఉన్నట్లు విమర్శకులు సైతం అంగీకరించారు. ఈమె సంభాషణలు పలుకుతుంటే హాలంతా చప్పట్లు మోగడం పరిపాటి. రచయిత సన్నివేశాన్ని ఎలా ­కల్పించినా ఈమె పాత్రోచితంగా మార్పులుచేసి వాటికి సందర్భ శుద్ధిని కలిగించేవారు. ముందునుంచీ నాటకరంగంలో ఉండడం, పైగా తనలోనూ రచనా నైపుణ్యం ఉండడమే అందుకు కారణం.

ఈమె నటించిన నాటకాలలో కొన్ని ముఖ్య నాటకాలు:

  1. దొంగాటకం
  2. పావలా
  3. కొడుకు పుట్టాల
  4. ఒక దీపం వెలిగింది
  5. మంచుబొమ్మలు
  6. భయం
  7. నిర్మానుష్యం
  8. రసరాజ్యం మొదలైనవి.

సినిమా రంగం

[మార్చు]

ఈమె నటించిన సినిమాలలో కొన్ని:

పురస్కారాలు

[మార్చు]

ఈమె ఏ రంగస్థలనటి అందుకోనన్ని అవార్డులు, బహుమతులు అందుకొన్నారు. వాటిలో కొన్ని:

  • అలహాబాదులో జరిగిన అఖిల భారత నాటకపోటీల్లో ఉత్తమ క్యారెర్టర్‌ నటిగా అవార్డు
  • రాజమండ్రి లలిత కళాపరిషత్తు వారి ‘‘మహానటి కన్నాంబ అవార్డు’’
  • గుంటూరు లలిత కళా పరిషత్తులో ‘‘కళాజ్యోత్స్న’’,
  • కాకతీయ కళాపరిషత్తు నుంచి ‘‘విశిష్టవ్యక్తి’'
  • 2013లో హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[6]
  • ఉత్తమ నటి (కన్నాంబ అవార్డు) - గైడెడ్ ఇంప్రవైజైషన్ ప్రక్రియ - లలిత కళానికేతన్ (రాజమండ్రి)

మరణం

[మార్చు]

పావలా శ్యామల 74 ఏళ్ల వయస్సులో 2026 జులై 28న గుండెపోటు రావడంతో హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.[7][8]

మూలాలు

[మార్చు]
  1. Archived 2016-01-17 at the Wayback Machine నాటికని ఇంటిపేరు చేసుకొన్న సహజనటి పావలా శ్యామల - చీకోలు సుందరయ్య
  2. "పావలా శ్యామల తలరాతను మార్చిన కెసిఆర్". Archived from the original on 2016-01-18. Retrieved 2016-01-19.
  3. పావలా శ్యామలకు...పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
  4. "పావలా శ్యామల మాటలకు కదిలొస్తున్న మానవతా వాదులు". Archived from the original on 2016-01-18. Retrieved 2016-01-19.
  5. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 April 2020. Retrieved 17 April 2020.
  7. "Pavala Shyamala: సినీనటి పావలా శ్యామల కన్నుమూత". EENADU. Retrieved 2026-07-28.
  8. ABN (2026-07-28). "ప్రముఖ నటి.. పావలా శ్యామల కన్నుమూత | senior actress Pavala Syamala passed away srk". Chitrajyothy Telugu News. Retrieved 2026-07-28.

బయటిలింకులు

[మార్చు]