వీరన్నపాలెం (పర్చూరు)
వీరన్నపాలెం (పర్చూరు) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°59′N 80°21′E / 15.983°N 80.350°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | పర్చూరు |
విస్తీర్ణం | 24.43 కి.మీ2 (9.43 చ. మై) |
జనాభా (2011)[1] | 5,382 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (570/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,635 |
• స్త్రీలు | 2,747 |
• లింగ నిష్పత్తి | 1,043 |
• నివాసాలు | 1,655 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08594 ) |
పిన్‌కోడ్ | 523169 |
2011 జనగణన కోడ్ | 590727 |
వీరన్నపాలెం బాపట్ల జిల్లా, పర్చూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పర్చూరు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చీరాల నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1655 ఇళ్లతో, 5382 జనాభాతో 2443 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2635, ఆడవారి సంఖ్య 2747. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1637 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 92. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590727.[2] పిన్ కోడ్: 523169.
సమీప గ్రామాలు
[మార్చు]నాగుల పాలెం 4 కి.మీ,ఉప్పుటూరు 3 కి.మీ., పోతుకట్ల 3 కి.మీ, కుంకలమర్రు 4 కి.మీ, బోడవాడ మందగుంట 6 కి.మీ, చెరుకూరు 12 కి.మీ.
జనగణన
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,656. గ్రామంలో నివాస గృహాలు 1,501 ఉన్నాయి..
చరిత్ర
[మార్చు]సుమారు సా.శ. 1600-1700 ప్రాంతంలో వీరయ్య అనే అతను ఇక్కడ మొదట నివాసం ఏర్పరచుకున్నాడని, ఆ తరువాత వచ్చిన వారు అతనిపై గౌరవభావంతో వీరన్న అని పిలిచేవారని, ఆ తదుపరి ఊరిని వీరన్నపాలెంగా పిలిచేవారని ప్రజల నానుడి [3].
తొలుత ఈ గ్రామం వెంకట గిరి సమస్థాన గ్రామమైన ఉప్పుటూరు గ్రామానికి శివారు గ్రామంగా ఉండి నేడు మేజరు పంచాయితిగా రూపుదిద్దుకుంది. గ్రామంలో వంశ పారంపర్య సాంప్రదాయం అయిన "వీరుల పూజ" చేసే ఆచారం ఉంది. గురజాల గోత్రీకులైన గోరంట్ల గృహనామము వారి 'యుద్ద వీరుల ఖడ్గాలు, వీర తాళ్ళు, దేవర' వారి కుటుంబ వీరాచార్యుల వద్ద ఉంది.[4]
వ్యవసాయ ప్రధానమైన ఈ గ్రామం బ్రతుకుదెరువుకోసం అనేక ప్రాంతాలనుండి వలస వచ్చిన వారికి ఉపాధి కల్పించింది. వంటరిగా వలస వచ్చిన మగవారు, రైతుల ఇంట్లో పాలగాళ్ళుగా సాలు జీతానికి వుండేవారు. దాదాపు 300 బ్యారన్లులో పొగాకు క్యూరింగ్ చేసినపుడు సుమారు 500 మందికి ఈ ఊరు ఉపాధిని కల్పించింది. ఒంగోలు జాతి పశువులతో గ్రామం కళకళలాడేది.
అన్ని గ్రామాల కంటే ముందుగా ఈ గ్రామంలో 1961లో విద్యుచ్చక్తి సౌకర్యం ఏర్పడింది. 1964లో ఇంటింటికి మంచినీటి పథకం అమలుజరగటంతో, అప్పటివరకు కావిళ్లతో నీరు తెచ్చుకొనే స్థితి తొలగిపోయింది.
ఐటిసి వారు ఈ ప్రాంతాన్ని సెలైన్ ప్రాంతంగా ప్రకటించటంతో, పొగాకు బ్యారన్లు మూగపోయాయి. ప్రత్యామన్యాయ పంటలుగా నేడు ప్రత్తి, శనగ పంటలు పడిస్తున్నారు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పర్చూరులోను, ఇంజనీరింగ్ కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ నాగులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చీరాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]విశాలమైన రెండు ఊర చెరువులు, నలు చెరగుల నీటి కుంటలు గ్రామ నీటి అవసరాలను తీర్చుతాయి. గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చెరువులు నీటిని శుద్ధి చేయుటకు నీటిశుద్ధి కేంద్రం ఉంది.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]వీరన్నపాలెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. 1948 సంవత్సరం వరకు గ్రామంలో మట్టిరోడ్లు వుండేవి. వర్షాకాలంలోసరైన రవాణా సదుపాయాలు లేవు.
1977 సంవత్సరంలో ఏపీయస్ఆర్టీసి బస్సు సౌకర్యం ఏర్పడింది. అంతకుముందే పర్చూరు నుండి బాపట్ల (34 కి.మీ) వరకు ప్రైవేటు బస్సు సౌకర్యంవుంది. పర్చూరు నుండి ఆటోరిక్షా లేక బస్సు (బాపట్ల వైపు వెళ్లే బస్సు) సౌకర్యము ఉంది.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]ప్రభుత్వరంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్, సహకార బ్యాంకు గ్రామంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]మండలకేంద్రమైన పర్చూరులో సినిమా హాలు, జిల్లా శాఖా గ్రంథాలయం ఉన్నాయి..
భూమి వినియోగం
[మార్చు]ఇక్కడ ఉన్న భూములు నల్ల రేగడి భూములు.
వీరన్నపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 327 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 2115 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1174 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 940 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]వీరన్నపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 244 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 696 హెక్టార్లు
ప్రధాన పంటలు
[మార్చు]ఇక్కడ మాగాణి, మెట్ట భూములుండుటచే వరి, పొగాకు, ప్రత్తి, సెనగ, మిరప పంటలు పండిస్తారు.
దేవాలయాలు
[మార్చు]- నాలుగు వీధుల కూడలిలో ప్రతిష్ఠ చేయబడిన "బొడ్డురాయి".
- శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం: దాదాపు 160 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయం శిథిలమైనందున, 2009 నవంబరులో ఈ ఆలయం తిరిగి నిర్మించ బడింది.
- శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
- శ్రీ శనీశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
- శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
- క్రైస్తవ మందిరాలు 9
- మసీదు 1
ప్రముఖులు
[మార్చు]- గోరంట్ల వీర రాఘవయ్య - స్వాతంత్ర్య సమరయోధులు. పోతుకట్ల గ్రామ మనుసుబుగా పనిచేసారు. 1922లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తన పదవికి రాజీనామా చేసి గ్రామంలో పన్నులు వసూలు చేయనందులకు పొలీస్ కేసులో నమోదు చేయబడ్డారు.[4]
- సి.వి.జి.చౌదరి - లండన్ వేంకటేశ్వర్లుగా ప్రసిద్ధి పొందిన గోరంట్ల చిన వెంకటేశ్వర్లు చౌదరి. ఇతని తండ్రి గోరంట్ల వీర రాఘవయ్య .1935 లో స్కాట్లాండ్ లో ఎడింబర్గ్ విశ్వవిద్యాలయం లోని రాయల్ (డిక్) పశు వైద్య కళాశాలలో పశు వైద్య శాస్త్రం చదివి ఉత్తర ప్రదేశ్ లోని మధుర పశువైద్య కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గోని మేజర్ గా పనిచేసాడు. బ్రిటిష్ ప్రభుత్వరాజ్య పురస్కారం M.B.E. అవార్డు గ్రహీత.
- మద్దుకూరి నారాయణ రావు - ఆంధ్రప్రదేశ్ శాసన సభలో1972 నుండి1983 వరకు సభ్యులు.
- గోరంట్ల వెంకటేశ్వర్లు (మనుసబు) - అత్యధికాలం 16 సంవత్సరాలు గ్రామ సర్పంచిగా పనిచేసారు.
- గోరంట్ల రామయ్య చౌదరి (మనుసబు) - బాపట్ల జిల్లా బోర్డ్ సభ్యులుగా పనిచేసారు
- రావూరి సత్యన్నారాయణ - మాజీ గ్రామ సర్పంచ్, వీరి పాలనలో వీరన్నపాలెం ఉత్తమ గ్రామ పంచాయితీగా ఏన్నికైంది.
- గోరంట్ల వీరయ్య చౌదరి - మాజీ పర్చూరు మండలాద్యక్షులు
- యార్లగడ్డ తులశమ్మ- మాజీ పర్చూరు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు
- బృందావనం రంగాచార్యులు - తెలుగు పండితులు. కవి. సుమారు 40 గ్రంథాలు, 80 వేల పద్యాలను రచించాడు. వీరి గుహుడు,శబరి పద్యకావ్యాలు విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలుగా వాడబడినవి.
- బండ్లమూడి సుబ్బారావు వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు నాయకుడు. శ్రీ కృష్ణదేవరాయలు అనే చరిత్ర గ్రంథరచయిత.
- కొడాలి శ్రీనివాస్ - సివిల్ ఇంజినీరింగ్ లో ఆచార్యునిగా వివిధ కళాశాలలో పని చేసారు. "వాస్తులో ఏముంది?", "వాస్తులో వాస్తవాలు", "వాస్తు విద్య" వంటి పరిశోధన గ్రంథాల రచయిత. వివిధ అంశాలలో వీరు రాసిన 200 పైగా వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. కొడాలి మల్లికార్జున రావు, లక్షీదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు.
- గొట్టుముక్కల వీరయ్యచౌదరి - పిల్లలకోసం 'ఆడుతూ పాడుతూ అక్షరాభ్యాసం' అనే పుస్తక రచయిత.
- మక్కెన శ్రీను M.Vsc,PhD - శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి నుండి పశువైద్యం లోమొట్టమొదటి డాక్టరేట్ సాధించిన వీరన్నపాలెం వాసి. పలు శాస్త్రీయ పత్రికలలో 250 పైగా పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. 2018 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఉత్తమ ఆచార్యులు గా సత్కరించారు. మూడు వృత్తిపరమైన గ్రంథాలను 10 తెలుగు భాషా సంబంధ గ్రంథాలను, అనేక కవితలను రచించారు
- యస్.వి.సుబ్బయ్య - హరిశ్చంద్ర పాత్రలో పేరుపొందిన రంగస్థల నటుడు
- యార్లగడ్ల బుచ్చయ్య చౌదరి - నంది బహుమతి పొందిన రంగస్థల నటుడు
- మొవ్వా కృష్ణమూర్తి - ఎండు గడ్డిని నానబెట్టి సన్నని పోచలుగా తీసి, వాటితో వస్తువులను తయారుచేస్తారు. వరి గడ్డితో ఈ విధంగా, 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 150 గ్రాముల బరువుగల, ఒక కండువాను, కేవలం ఒక నెల వ్యవధిలో తయారుచేసి పలువురి ప్రశంసలు పొందినారు.ఇతను వరిగడ్డితో నేసిన చీర, రవిక, చేతి సంచి వంటి వాటిని వివిధ ప్రదర్శనలలో ప్రదర్శించారు. ఐ.ఏ.ఆర్.ఐ. వారు వీరికి జాతీయ పురస్కారం అందజేసారు. గుంటూరు లోని లాం ఫారం వారు, ప్రకాశం జిల్లా కలెక్టరు, బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు వీరికి పురస్కారాలను అందజేసారు[4].
గ్రామ విశేషాలు
[మార్చు]విదేశీ వలస పక్షులు
[మార్చు]సైబీరియా దేశానికి చెందిన పక్షులు ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి మాసాలలో ఇక్కడికి వస్తుంటవి. అవి ఐదారు నెలలు ఇక్కడే ఉండి, గుడ్లు పెట్టి పొదగడం ద్వారా పిల్లలను వృద్ధిచేసి, జూన్, జూలై నెలలలో తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతుంటవి. గతంలో సైబీరియా పక్షులు అధికసంఖ్యలో వచ్చేవి. చెరువులో గుట్టలు, చెట్లు తక్కువగా ఉండటంతో, ఇటీవల గ్రామ మంచినీటి చెరువు కాపాడటానికి దాని మధ్యలో ఉన్న చెట్లను తొలిగించటం వల్ల వీటికి నివాసం లేక వాటి సంఖ్య బాగా తగ్గింది[4].
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ వీరన్నపాలెం అసోసియేషన్, హైద్రాబాదు వారు ప్రచురించిన పుస్తకం (తేదిలేదు)లోని పరిచయ వ్యాసం
- ↑ 4.0 4.1 4.2 4.3 కొడాలి, శ్రీనివాస్ (2018). వీరన్నపాలెం గ్రామ చరిత్ర. గుంటూరు:: కొమల చారిటిబుల్ ట్రస్ట్.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link)