కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | 2021 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
విద్యార్థులు | 150 |
స్థానం | కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ, భారతదేశం |
కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ, గిరిజన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది.[1] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోతైన అటవీ ప్రాంతం, అధిక సంఖ్యలో గిరిజన జనాభా ఉంది. ఈ ప్రభుత్వ వైద్య కళాశాల కొత్తగూడెం బస్టాండ్ నుండి 7 కి.మీ., కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి 6 కి.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త కలెక్టరేట్ నుండి 1 కి.మీ. దూరంలో ఉంది.
తొలి అడ్మిషన్
[మార్చు]2022 నవంబరు 15వ తేదినుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నందున అక్టోబరు 27 నుండి మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన శ్రేయా నాయర్ జాతీయ కోటాలో కాలేజీలో తొలి అడ్మిషన్ పొందగా, అడ్మిషన్ పత్రాన్ని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అందజేశాడు. ఈ కళాశాల పరిధిలో 150 సీట్లుండగా జాతీయ కోటాలో 15 శాతం, రాష్ట్రం కోటాలో 85 శాతం సీట్లు భర్తీకానున్నాయి.[3]
ఆసుపత్రి
[మార్చు]350 పడకలతో ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు అనుబంధంగా ఈ వైద్య కళాశాల ఏర్పాటు చేయబడింది. 2002 సంవత్సరానికి ముందు కొత్తగూడెం పట్టణ జనాభాకు తగినట్టుగా ఉన్న 50 పడకల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి 2002లో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయబడింది. 2016లో 250 పడకలతో జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయబడి, 24/7 ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కోవిడ్ 19 సమయంలో ఈ ఆసుపత్రిలో జరిగిన చికిత్స విధానాన్ని గమనించిన, ప్రభుత్వం ఈ విభాగాన్ని తృతీయ సంరక్షణ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించి, 2021లో 2 కిమీ దూరంలో ఉన్న 2 వేర్వేరు బ్లాకులతో సహా 350 పడకల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌గా మార్చింది. దాదాపు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత బ్లాక్‌ను ఆధునీకరించి మరిన్ని వార్డులు, ల్యాబ్, బ్లడ్ బ్యాంక్‌తో 2 అంతస్తుల భవనంగా అప్‌గ్రేడ్ చేసింది.[4]
కోర్సులు - శాఖలు
[మార్చు]- అనాటమీ
- ఫార్మాకాలజీ
- ఫిజియోలాజీ
- బయోకెమిస్ట్రీ
- పాథాలజీ
- మైక్రోబయోలాజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- జెనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్
- ఓటో-రైనో-లారిగోలజీ
- ఆప్తాల్మోలజీ
- జనరల్ మెడిసిన్
- టిబి & ఆర్‌డి
- డివిఎల్
- సైకియాట్రీ
- పీడియాట్రిక్స్
- ఓబిజీ
- అనస్థీషియాలజీ
- కమ్యూనిటీ మెడిసిన్
- రేడియోడియాగ్నోసిస్
- ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
- టీబీసీడీ
- సీటీ సర్జరీ
- న్యూరో సర్జరీ
- న్యూరాలజీ
- ప్లాస్టిక్ సర్జరీ
- యూరాలజీ
- గాస్ట్రోఎంట్రాలజీ
- ఎండోక్రైనాలజీ
- నెఫ్రాలజీ
- కార్డియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- ఈఎన్‌టీ
- ఆప్తల్
- అనస్తీషియా
- డెంటల్
సిబ్బంది
[మార్చు]వీటిలో 15 ప్రిన్సిపల్, 15 వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్, 105 ప్రొఫెసర్, 180 అసిస్టెంట్ ప్రొఫెసర్, 300 లెక్చరర్, 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 15 ఆఫీస్ సూపరింటెండెంట్, 30 సీనియర్ అసిస్టెంట్, 15 లైబ్రేరియన్, 30 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.[5] వీటితోపాటు ఈ వైద్య కళాశాలో విధులు నిర్వహించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ల్యాబ్ అటెండెంట్, రికార్డింగ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ వంటి 33 పోస్టులు కేటాయించబడ్డాయి.
తరగతుల ప్రారంభం
[మార్చు]2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[6]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Satyanarayana, P. V. (2022-08-27). "Medical college dream to be a reality soon". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-27. Retrieved 2022-11-01.
- ↑ "కొత్తగూడెం వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్.. నెరవేరిన చిరకాల స్వప్నం". T News Telugu. 2022-08-27. Archived from the original on 2022-09-08. Retrieved 2022-11-01.
- ↑ telugu, NT News (2022-10-28). "» కొత్తగూడెం వైద్య కళాశాలలో తొలి అడ్మిషన్". www.ntnews.com. Archived from the original on 2022-10-28. Retrieved 2022-11-01.
- ↑ "Government Medical College - Bhadradri Kothagudem (About Us)". Government Medical College - Bhadradri Kothagudem (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-01.
- ↑ "7 కొత్త వైద్య కళాశాలల్లో 7,007 పోస్టులు". Sakshi. 2021-06-25. Archived from the original on 2021-06-25. Retrieved 2022-11-07.
- ↑ telugu, NT News (2022-11-15). "మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.