తిరుమల రామచంద్ర
తిరుమల రామచంద్ర | |
---|---|
జననం | తిరుమల రామచంద్ర 1913, జూన్ 17 అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె |
మరణం | 1997 అక్టోబరు 12 హైదరాబాద్ | (వయసు 84)
వృత్తి | ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తా "భారతి" మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ |
ప్రసిద్ధి | ప్రసిద్ధిచెందిన తెలుగు కవి, సంపాదకులు |
తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లెలో జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు.[1] వీరు సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాకా కారణాంతరాల వల్ల తిరుపతిలోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.
ఉద్యమరంగం
[మార్చు]స్వాతంత్ర్య సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు.
విస్తృత లోకానుభవం
[మార్చు]ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. ఆ ఉద్యోగాన్ని ఆత్మాగౌరవానికి భంగం కలిగిన కారణంగా విడిచిపెట్టిన రామచంద్ర ఆ సమయంలోనే ఉత్తర భారతదేశంలో విస్తృతమైన పర్యటన చేశారు. ఉమ్మడి పంజాబులో భాగమైన లాహోర్ పట్టణంలో కొందరు మహాపండితులను, పంజాబు పల్లెల్లో భారతీయ గ్రామీణ జీవితం, మొహెంజదారో, హరప్పా ప్రాంతాల్లో ప్రాచీన నాగరికతా చిహ్నాలను దర్శించారు.
పత్రికా రంగం
[మార్చు]వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటున్న తిరుమల రామచంద్ర విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశాడు. అనంతరం ఢిల్లీ వచ్చి డెయిలీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డాడు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశాడు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేసి తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలాడు.
సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యాడు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక,ఆంధ్రభూమి,హిందుస్తాన్ సమాచార్ లలో వివిధ హోదాలలో పనిచేశాడు. భారతి మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు. నార్ల వెంకటేశ్వరరావుతో విభేదించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు.
పరిశోధన అనే ద్వైమాసపత్రికకు సంపాదకత్వం వహించి 1953-1956 మధ్యకాలంలో ప్రచురించాడు.
రచన రంగం
[మార్చు]- పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. "హైదరాబాద్ నోట్ బుక్" వంటి 15 శీర్షికలు నిర్వహించారు."సత్యాగ్రహ విజయం" నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు.
- తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకితమైనారు. తెలుగు నాట, భారతావనిలో ప్రసిద్ధులైన కవిపండితులు, కళాకారులు, భాషావేత్తలు, తత్వ్త చింతకులు అయిన ప్రతిభాశాలురు అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి.
- రాహుల్ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకున్నారు. బహుభాషా కోవిదుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్థించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూపలేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినది కాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.
- 'మన లిపి - పుట్టు పూర్వోత్తరాలు' భాషా చరిత్రకే తలమానికం.ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదనిఆంధ్ర విశారద తాపీ ధర్మారావు అన్నారు[1].
వ్యక్తిత్వం
[మార్చు]చిన్నతనంలోనే భారతదేశపు సాంస్కృతిక వైశాల్యాన్ని దర్శించిన రామచంద్ర ఆ కారణంగా తన దృక్పథంలో ఏర్పడ్డ సమ్యక్ దృష్టి, సంస్కృతి పట్ల ప్రేమను జీవితాంతం నిలబెట్టుకున్నారు. నార్ల వెంకటేశ్వరరావుతో విభేదాలు, "భారతి" పత్రికలో ఒక వ్యాసం గురించిన వివాదాలు వంటి సందర్భాల్లో రాజీనామాలు చేసి తన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు. ప్రతి ఉత్తరంలోనూ ఇట్లు భాషాసేవకుడు తిరుమల రామచంద్ర అంటూ సంతకం చేసే రామచంద్ర భాషాసేవలోనే జీవితాన్ని గడిపారు.
పుస్తకాలు
[మార్చు]ఆయనకు ఎనలేని కీర్తి ఆర్జించి పెట్టిన పుస్తకాలు "మన లిపి-పుట్టుపూర్వోత్తరాలు", "నుడి నానుడి", "సాహితీ సుగతుని స్వగతం", "గాధా సప్తసతిలో తెలుగు పదాలు", "తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర" ఇందులో సాహితీ సుగతుని స్వగతం" గ్రంధానికి 1970 లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం , "గాధా సప్తసతిలో తెలుగు పదాలు"కు 1986 లో సాహిత్య అకాడమీ నుండి అవార్డు, లభించాయి.రెండువేల ఏళ్ళనాటి భారతీయుల సాంఘిక జీవనాన్ని కమనీయంగా వ్యాఖ్యానించడమే కాక, గాథా సప్తసతిలో ఏయే సందర్భాలలో ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు.కాళిదాసుపై గాథా సప్తసతి ప్రభావం ఉందని తేల్చి చెప్పారు.
కొన్ని రచనలు
[మార్చు]- సాహితీ సుగతుని స్వగతం : రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రికకు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట. ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు.
- ఆంధ్రచ్చందో విశేషములు : "ఎసగు , ఒసగు" అన్న పదాల చర్చకు సంబంధించి శ్రీ వజ్ఘల చిన సీతారామశాస్త్రి గారి వాదనను ఆక్షేపిస్తూ వ్రాసినది. ఈ వ్యాసం చదివిన పండితుడొకాయన ప్రభాకర శాస్త్రి గారి వద్ద ప్రస్తావిస్తూ, భారతిలో ఎవరో గొప్ప వ్యాసం రాసేరని అన్నాట్ట. శాస్త్రి గారు పక్కనున్న రామచంద్ర గారిని చూపించేరట. ఆ పండితుడు విస్తుపోయి, "ఎవరో శాలువా పండితుడనుకున్నాను. ఈ కుర్ర వాడా?" అని మెచ్చుకున్నారుట. ఈ ప్రస్తావన "హంపి నుండి..."లో ఉంది.
- నువ్వులు కొట్టిన ఇడి నూటిడి : నన్నెచోడుడి కుమారసంభవం పరిష్కరిస్తూ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చోట, "నూటిడి" అన్న భక్ష్య విశేషాన్ని, "నూబిడి (నువ్వు + పిడి -> పిడికిలి మేర నువ్వులు)"గా పేర్కొంటే, రామచంద్ర గారు, "నూటిడి" పదాన్ని అన్నమయ్య కీర్తనలోనూ, శ్రీనాథుని హరవిలాసం లోనూ వాడినట్టు ఋజువు చేశారు. ఇదో అత్యద్భుతమైన వ్యాసం.
- బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం : ధూమపానం పైని వివరణ. ఇంకా ఇందులో ఆఫ్రికా కాల్పనిక సాహిత్యం, అనువాద సమస్యలు వంటి అద్భుతమైన వ్యాసాలున్నాయి. సాహితీ ప్రేమికులు మరువకూడని అద్భుతమైన పుస్తకం ఇది. విశాలాంధ్ర ప్రచురణ.
- మనలిపి - పుట్టుపూర్వోత్తరాలు : లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం వెలువడలేదు అంటే అతిశయోక్తి కాదు. రామచంద్ర గారు ప్రాకృతం పరిష్కరింపబడి, సంస్కృతంగా మారిందని, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని ఎన్నో ఋజువులు (ఆచార్య హేమచంద్రుడు, గాథా సప్తశతి వగైరా) చూపించారు. ఈ రచనలో పాళీ నుండి సాగిన లిపి ప్రస్థానం ప్రస్తుత తెలుగు లిపి పరిణామం వరకు ఎంతో అద్భుతంగా వివరించబడింది. ఈ రచన వ్యవహార భాషలో సాగటం. ఇదీ విశాలాంధ్ర ప్రచురణే.
- మనవి మాటలు : ఇదో చక్కని వ్యాస సంకలనం. ఇందులో కేరళ వారి "ఓణం" గురించీ, మాఘుని జ్యోటిశ్శాస్త్ర పాండిత్యం మీద, వినాయక చవితి మీద చక్కటి వ్యాసాలు.
- అహం భో అభివాదయే : రామచంద్ర గారు ఆంధ్ర ప్రభలో పనిచేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. అప్పటి ప్రముఖుల మీద రాసిన వ్యాస సంకలనం ఇది. విశ్వకవి రవీంద్రుడు, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, దాలిపర్తి పిచ్చహరి, విస్సా అప్పారావు గారు, చిలుకూరి నారాయణరావు గారు.. ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.
- ప్రాకృత వాఙ్ఞ్మయంలో రామకథ : పైన ఇందాక చెప్పినట్టుగా, ప్రాకృతం అన్నది జనపదాల్లో వాడుకలో ఉన్న భాష కాగా, సంస్కృతం సంస్కరింపబడి, సమాజంలో ఉన్నత వర్గాల ఆదరణకు నోచుకున్న భాష. పల్లె సీమల్లో ఉన్న జీవన రామణీయత, వారి గాథలు మొట్టమొదట సంకలనం చేసిన సహృదయుడు హాలుడు. ఆ గాథలు గాథా సప్తశతిగా పొందుపరుచబడ్డాయి. ఈ పుస్తకంలో కొన్నివ్యాసాలు : వజ్జాలగ్గంలో తెలుగు పదాలు, ప్రాకృత ప్రకృతి (ఇది చాలా అద్భుతమైన వ్యాసం), వివిధ ప్రాకృత కవులు, బౌద్ధ రచనలు మొదలైనవి. ఇది ఓ అందమైన పుస్తకం.
- నుడి-నానుడి : మహీధర నళినీమోహన్ గారి ఓ చిట్టి రచన, పిడుగుదేవర కథ. ఇందులో పిడుగు గురించి చాలా విషయాలు చెప్పారాయన. అందులో ఓ చోట తెలుగు పదాలు ఎలా మొదలయ్యాయి అని ఆసక్తి ఉన్న వారికి నుడి - నానుడి పుస్తకం సూచించారు. ఇదో శీర్షిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలో. ఈ పాకెట్ సైజు పుస్తకంలో అనేక తెలుగు పదాలకు మూలాలు వెతికారాయన. ఇది కేవలం వ్యాసం రాస్తున్నట్టుగా, మధ్యమధ్యలో పిట్టకథలు చెబుతూ, కావ్యాల్లో ఉదాహరణలు పేర్కొంటూ, అందంగా సాగుతుంది. తెలుగు భాషా ప్రియులకు ఇదో ఆవకాయ. ఇందులో పేర్కొన్న కొన్ని పదాలు : గోంగూర, మిరపకాయ, నాచకమ్మ, చారు, సేపు వగైరా వగైరా...
- లలిత విస్తరం : ఇది బుద్ధ మహానుభావుని జీవితం. బౌద్ధపురాణం. దీన్ని, ఈయన, బులుసు వెంకట రమణయ్య గారు తెనిగించారు.
- హంపీ నుంచి హరప్పా దాక: కేంద్ర సాహిత్య అకాడమీ (2002) పురస్కారం పొందిన పుస్తకం . తిరుమల రామచంద్ర రచనా వ్యాసంగంలో ప్రముఖమైన స్వీయచరిత్ర . దీని తొలి ముద్రణ ఆయన పరమపదించిన రెండునెలలతరువాత ప్రచురించబడింది. దీనికి ముందు మాట రాసిన అక్కిరాజు రమాపతిరావు ఈ పుస్తకం నవలకన్నా వేగంగా, ఆకర్షకంగా, ఉత్తేజభరితంగా చదివిస్తుంది అని పేర్కొన్నాడు. దీనిలో బొమ్మలు జి.వి.అమరేశ్వరరావు ఆకర్షణీయంగా వున్నాయన్నాడు. కరుణం, శుచిరుజ్జ్వలమైన శృంగారం, సుకుమార హాస్యం, పరమ మనస్విత ఈ గ్రంథం నిండా పాఠకులు పూలతోటలో విహరించేంత సంతోషాన్ని కలిగిస్తాయని పేర్కొన్నాడు.[2]
- చెప్పుడు మాటలు నాటికల సంపుటిని కన్నడంలో శ్రీరంగ ఎన్.కస్తూరి రాశారు. ఆ పుస్తకాన్ని తిరుమల రామచంద్ర తెలుగులోకి అనువాదం చేశారు.
ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, బృహదారణ్యకం, మరపురాని మనీషులు, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు - పర్వాలు, హాల గాథలు, వీరగాథలు, దక్షిణాంధ్రవీరులు, కాటమరాజు కథ, శశాంకవతి, ధర్మదీక్ష మొదలైన పుస్తకాలు వ్రాశాడు. సంస్కృతంలో సత్యాగ్రహవిజయం, సుమతీశతకం వ్రాశాడు. అనువాదకుడిగా కన్నడనవలలు శాంతల, మరల సేద్యానికి తమిళం నుండి రాజాజీ కథలు, ఆంగ్లం నుండి భక్తి వేదాంతస్వామి కమింగ్ బ్యాక్, హిందీనుండి సుశీలా నయ్యర్ వ్రాసిన గాంధీజీ కారాగారగాథ, సంస్కృతం నుండి క్షేమేంద్రుని బృహత్కథామంజరి, ప్రాకృతం నుండి లీలావతి కావ్యం తెలుగులోనికి అనువదించాడు.
బిరుదులు
[మార్చు]- పత్రకార శిరోమణి
- కళాసరస్వతి
- మహామహోపాధ్యాయ
పురస్కారాలు
[మార్చు]- 1991లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిల్లాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[3]
- 1993లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 వెలమల, సిమ్మన్న (2017-10-12). "మరపురాని మహాపండితుడు". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2020-08-05. Retrieved 2020-08-05.
- ↑ తిరుమల, రామచంద్ర (2010-08-01). హంపి నుంచి హరప్పాదాక (4 ed.). అభో విజోకందాళం ప్రచురణ. p. vii-xiv.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
ఇతర లింకులు
[మార్చు]- అక్కిరాజు, రమాపతిరావు (2012-10-21). "హంపీ నుంచి హరప్పా దాకా బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర". సూర్య. Retrieved 2014-02-02.[permanent dead link]
- రాయలసీమ రచయితల చరిత్ర నాలుగవ సంపుటి - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల
- All articles with dead external links
- తెలుగు రచయితలు
- తెలుగు పాత్రికేయులు
- తెలుగు కవులు
- సంపాదకులు
- 1913 జననాలు
- అనంతపురం జిల్లా రచయితలు
- ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- అనంతపురం జిల్లా భాషావేత్తలు
- అనంతపురం జిల్లా పాత్రికేయులు
- పత్రికలలో శీర్షికలు నిర్వహించినవారు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు
- పులుపుల వెంకటశివయ్య అవార్డు గ్రహీత