దేవులపల్లి రామానుజరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవులపల్లి రామానుజరావు
జననం(1917-08-25)1917 ఆగస్టు 25
విద్యబి. ఎ, ఎల్. ఎల్. బి
విద్యాసంస్థనిజాం కళాశాల (బి. ఎ), నాగపూర్ విశ్వవిద్యాలయం (ఎల్. ఎల్. బి)
వృత్తిపాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు,
తల్లిదండ్రులు
  • వేంకట చలపతి రావు (తండ్రి)
  • ఆండాళమ్మ (తల్లి)
బంధువులుదేవులపల్లి ప్రభాకరరావు

దేవులపల్లి రామానుజరావు ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.[1]

ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, వక్త, పరిశోధకుడు. తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

రామనుజరావు గారు ఆగష్టు 25, 1917[2] లో వరంగల్లు పట్టణ సమీపాన ఉన్న దేశాయి పేట గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే వంగపాడుకు దత్తతగా వచ్చాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటివద్దనే పూర్తి చేశాడు. హైస్కూలు విద్య కోసం తొమ్మిదో తరగతిలో హనుమకొండ పాఠశాలలో చేరాడు. అప్పట్లో తెలుగులో విద్యాబోధన లేదు. కేవలం ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మాత్రమే బోధన సాగేది. రామానుజ రావు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నాడు. 1939 లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాల నుండి బి. ఎ. పట్టభద్రులైనారు. తరువాత 1942-44 మధ్య కాలంలో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాధించేరు. అక్కడే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం ఏర్పడింది. రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. తెలుగు రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావు ఇతడికి సోదరుడు.

సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.

డాక్టర్ రామానుజరావు గారి దేశాభిమానం వారిలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’ వారి పద్యరూప దేశాభిమానానికి హృద్యమైన ఉదాహరణం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నట్లు వారు ఓరుగల్లు మీద వ్రాసిన ఖండకావ్యం తెలుగు సాహిత్యంలోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు. డాక్టర్ రామానుజరావు గారు ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు. పద్యాల్లో ఎంత ఆవేశాన్నీ, ఆర్ద్రతనూ ప్రదర్శించారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మ్యాన్నీ ప్రకటించారు.[3]

సాహితీ సేవలు

[మార్చు]

మే 23, 1943 న ఏర్పడ్డ ఆంధ్ర సారస్వత పరిషత్తుతో ఆయనకు మొదటి నుంచి అనుబంధం ఉంది. 1944లో దానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై తర్వాత 1947లో కార్యదర్శి అయ్యాడు. 1952లో తొలిసారి అధ్యక్షుడై మధ్యలో కొంత విరామం తప్ప చనిపోయేదాకా అధ్యక్షుడిగా వ్యవరించాడు. ఆయన సారథ్యంలో సారస్వత పరిషత్తు స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసింది. 1953 లో అలంపురంలో ఆయన నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలకు హైదరాబాదు నుంచి ప్రత్యేకమైన రైలు నడిపారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ సమావేశాలను ప్రారంభించడమే కాక రెండు రోజులపాటు హాజరయ్యారు.

నిజాం హయాంలో తెలుగులో విద్యాబోధన జరిగేది కాదు. అటువంటి సమయంలో ఈయన సారస్వత పరిషత్తు ద్వారా తెలుగులో ప్రవేశ, విశారద లాంటి పరీక్షలు నిర్వహించేవారు. తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు ఉపాధ్యాయుల కొరతను తీర్చగలిగారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ప్రాథమిక పాఠశాలల్లోనూ, విశారద పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా నియమించేవారు.

గౌరవ పదవులు

[మార్చు]
  • 1945-46 లో వరంగల్ జిల్లా యువ జన కాంగ్రెస్ అధ్యక్షకుడిగా ఉన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారి ఆహ్వానం మేరకు " గోల్కొండ " పత్రిక ఉప సంపాదకులుగా పనిచేశారు. ఇరవై రెండేళ్ళు - గోల్కొండ పత్రికలో సంపాదికీయం వ్రాసినారు.
  • 1960-62 లో సాహిత్య ప్రతినిధిగా రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు;
  • 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉన్నారు. మూడు పర్యయాలు కార్య నిర్వహణా (ఆక్టింగ్) కులపతిగా వ్యవహరించారు. హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కార్యనివాహక సంఘ సభ్యుడిగా ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కొంత కాలం పనిచేశారు. రెండు, మూడేళ్ళ పాటు హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నిర్వహణా సంఘ సభ్యుడిగా పనిచేశారు.
  • 1990 లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

రచనలు

[మార్చు]
  • సారస్వత నవనీతం
  • తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనము
  • తెలంగాణాలో జాతీయోధ్యమాలు
  • నా రేడియో ప్రసంగాలు
  • ఉపన్యాస తోరణము
  • వేగుచుక్కలు
  • తెనుగు సాహితీ
  • తెలుగు దేశము
  • యాబై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 నుండి 1979 వరకు)
  • తలపుల దుమారము
  • పంచవర్ష ప్రణాళికలు
  • బంకించంద్ర చఠర్జీ జీవితము
  • హైద్రాబాదులో స్వాతంత్యోధ్యమం
  • మన దేశం - తెలుగు సీమ
  • జవాహర్లాల్ నెహ్రూ
  • గౌతమ బుద్ధుడు
  • కావ్యమాల

సంపాదకీయం వహించిన రచనలు

[మార్చు]
  • శోభ సాహిత్య మాస పత్రిక
  • గోల్కొండ దిన పత్రిక (1948-1964)
  • గురజాడ శతవార్షికోత్సవ సంచిక (1962-64)
  • రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక
  • తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక (1981)

మూలాలు

[మార్చు]
  1. "దేవులపల్లి రామానుజరావు గురించి సిలికానాంధ్ర లో". Archived from the original on 2016-03-15. Retrieved 2013-09-07.
  2. ఆర్వీ, రామారావు (October 2018). "తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 2018-08-01. Retrieved 2018-12-13.
  3. ప్రముఖ సాహితీవేత్త డా॥ జి.వి.సుబ్రహ్మణ్యం వ్యక్తపరిచిన భావాలు[permanent dead link]

యితర లింకులు

[మార్చు]