బర్బరీకుడు
ఈ వ్యాసంలోని సమాచారం సరైనదేనని రూఢీ చేసుకునేందుకు మరిన్ని మూలాలు కావాలి . (April 2016) |
బర్బరీకుడు | |
---|---|
ఇతర పేర్లు | కటుశ్వాం, ఆకాశ భైరవ, యాలంబర, Maurvinandan, Sheesh Ka Daani |
బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.
అతని తల్లి పేరు మౌర్వి(అహిలావతి). బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.
బాల్యం కురుక్షేత్రం సంగ్రామం
[మార్చు]ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి, పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.
‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.
‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.
‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.
కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.
‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.
ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే...
శ్రీ కృష్ణుడు బర్బరీక సంవాదం
[మార్చు]‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. శ్రీ కృష్ణుడు మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి శ్రీ కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.
బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీ కృష్ణుడు. అంతేకాదు... కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతడ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు శ్రీ కృష్ణుడు. మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీ కృష్ణుడు యొక్క కాలి చుట్టూ తిరగడం వల్ల, ఆయన కాలు మిగతా శరీరంకంటే బలహీనపడిపోయింది. అందుకని,శ్రీ కృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది.
శ్యాం బాబాగా
[మార్చు]దక్షిణ భారతాన ఖాటు శ్యాంను ఆరాధించేవారి సంఖ్యే కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన, ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్*లోనూ ఖాటు శ్యాం బాబాను ఆరాధించేవారి సంఖ్య అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం.
ఘటోత్కచుని కుమారుడైన బర్బరీకుడు మహాబలశాలి. అతను కనుక కురుక్షేత్రంలో పాల్గొంటే యుద్ధం తారుమారైపోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకంగా బర్బరీకుని తలను తనకు కానుకగా అడుగుతాడు. అలా బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా అందించిన తల రాజస్థాన్ లోని ఖాటు అనే గ్రామంలో పడిందట. అ శిరస్సుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం ఖాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా!
జైపూర్ లో జరిగిన ఒక వింత సంఘటన
[మార్చు]రాజస్తాన్ : జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్ సింగ్ చౌహాన్ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీ,వినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్ సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు.
ఎన్నెన్నో పేర్లు
[మార్చు]శ్యాం కుండ్, శ్యాంబగీచా ఖాటు శ్యాం శిరస్సు కనిపించిన చోటుని శ్యాంకుండ్*గా పిలుచుకుంటారు జనం. ఈ కొలనులో కనుక స్నానం చేస్తే సర్వ పాపాలూ, సకల రోగాలూ నశిస్తాయన్నది భక్తుల నమ్మకం. ఆ పక్కనే ఉన్న శ్యాం బగీచా అనే అందమైన పూల తోట నుంచే ఆలయంలోని ఇలవేల్పుని అలంకరించేందుకు కావల్సిన పుష్పాలను సేకరిస్తారు. ఇక ఖాటు శ్యాం ఆలయానికి దగ్గర్లోనే గౌరీశంకర ఆలయం పేరుతో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా అత్యంత పురాతనమైనదే. మహిమ కల్గినదే! ఔరంగజేబు సైనికులు ఒకనాడు ఈ శివాలయంలోని లింగాన్ని ధ్వంసం చేయబోగా, శివలింగం నుంచి రక్తధార వెలువడిందట. దాంతో భయపడిన సైనికులు తోక ముడిచారని అంటారు.
మూలాలు
[మార్చు]* ఈ పాత్ర కేవలం కల్పిత కధ మాత్రమేగాని వ్యాస మహాభారతం మరియూ ఆంధ్ర మహాభారతంలలో ఎక్కడ కూడా లేదు
- మహారథి బర్బరీకుడు - శ్యామప్రభువు, ఋషిపీఠం భారతీయ మాస పత్రిక, 2007-08.
- Articles with hatnote templates targeting a nonexistent page
- Articles needing additional references from April 2016
- February 2016 from Use dmy dates
- February 2016 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- Articles containing Hindi-language text
- మహాభారతం
- మహాభారతంలోని పాత్రలు
- పురాణ పాత్రలు
- హిందీ భాషా పాఠాన్ని కలిగి ఉన్న వ్యాసాలు