ధర్మపురి (కరీంనగర్)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ధర్మపురి
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో ధర్మపురి మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో ధర్మపురి మండలం యొక్క స్థానము
ధర్మపురి is located in Telangana
ధర్మపురి
తెలంగాణ పటములో ధర్మపురి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°56′51″N 79°05′38″E / 18.9475°N 79.094°E / 18.9475; 79.094
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము ధర్మపురి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,230
 - పురుషులు 36,124
 - స్త్రీలు 37,106
అక్షరాస్యత (2001)
 - మొత్తం 40.75%
 - పురుషులు 53.40%
 - స్త్రీలు 28.53%
పిన్ కోడ్ 505425

ధర్మపురి, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505425.

యోగనృసింహ క్షేత్రం[మార్చు]

ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. ఈ క్షేత్రములో శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమం, శ్రీ ఉగ్రలక్ష్మీ నృసింహుని ఆలయం తో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వేణు గోపాల స్వామి వార్ల ఆలయములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్ర[మార్చు]

పది, పదకొండవ శతాబ్దాలలో ధర్మపురమని పేరు కలిగిని ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది. శాతవాహనులు, బాదామి చాశుఖ్యులు కళ్యాణి చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితి లో వున్నట్లు తెలుస్తున్నది. నైజామ్ కాలంలో కూడ ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో వుండేది. క్రీ.శ. 1309 లో అల్లాయుద్దిన్‌ఖిల్జి ధర్మపురి ఆలయాల పై దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది.

యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ఇక్కడే శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్టించినట్టు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడ వున్నది. ఈ ధర్మ పురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడ వున్నాయి. గోదావరి తీరంలో వున్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మ పురి ఆతి పురాతనమైనది ఆధ్యాత్మిక వేత్తల భావన. అనేక ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

కోటిలింగాల[మార్చు]

ధర్మపురికి 15 కి.మీ దూరంలో వున్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి అంతకన్నా ముందరి రాజుల నాటి (సామగోపుని గోభద్రుడు) నాణేలు, అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నపుడు బయటపడిన యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక, మొదలైనవి బయట పడ్డాయి.

స్థల పురాణము[మార్చు]

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.

అదనపు సమాచారం[మార్చు]

  • ఆతి పురాతనమైన ధర్మపురి క్షేత్రం కరీంనగర్ కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో వున్నది. ఇది చాల పురాతనమయిన ఆలయం. దీని మూలాలు వివిద పురాణాలలో కూడ కనబడతాయి. ఇంకా అనేక శిలా శాసనాలలో కూడ దీని ప్రస్థావన ఉన్నది.
  • గోదావరి, భద్ర నదుల సంగమస్థలమయిన ధర్మపురి అయిదు నరసింహాలయాలున్న ఏకైక గ్రామం. అందులో మూడు నరసింహాలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలలో నారసింహుని రూపము, తత్వము ఎలా చెప్పబడ్డాయో అవి ధర్మపురిలో ఎలా మనకి గోచరమవుతున్నాయో నరసయ్యగారు వివరించారు. 32 రకాల నారసింహ రూపాలు స్థలపురాణాలలో వర్ణించబడినాయట. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. అలాగే నవవిధమైన నారసింహ తత్వాలున్నాయి. ధర్మపురిలో యోగనారసింహుడు, ఉగ్రనారసింహుడు, ప్రహ్లాదనారసింహుడు, లక్ష్మీనారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి.
  • ఇక్కడి ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమమునందు ఎక్కడా కనబడని బ్రహ్మ దేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము. ఇక్కడికివచ్చిన యాత్రికులకు యముని దర్శనము వలన నరక బాధ ఉండదని క్షేత్రపురాణము తెలుపుతున్నది.
  • ముఖ్యముగా ఇక్కడ పుణ్య గోదావరి నది సమీపములో నుండుటచేత యాత్రికులకు సకల పాపనివారణ కావడమేకాక ఎంతో ఆహ్లాదకరమైన పిక్ నిక్ సెంటర్ వలే గోదావరి ఒడ్డున సమయము గడుపుతారు. ఈ ప్రాంత గోదావరి ప్రమాదకరమైనది కాక స్వచ్చమైన నీటిప్రవాహము గలది.
  • ధర్మపురిలోని రామేశ్వరాలయం భువనేశ్వర్ లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి వున్నదన్న విషయం, హంపిలోని షద్భుజ నారసింహ విగ్రహానికి మాతృక ధర్మపురిలోని మసీదు నారసింహాలయంలోని విగ్రహమేనన్న విషయం, ఇంకా ధర్మపురిలోని ఆలయ నిర్మాణాలకి, హంపిలోని నిర్మాణాలకి మధ్యన పోలికలు వున్నాయి.

ఇతర విశేషాలు[మార్చు]

భూషణ వికాశ శతకం[మార్చు]

1800 ప్రాంతంలో కాయస్థం శేషప్ప కవి ఇక్కడ ప్రధాన దైవం పేరున భూషణ వికాస శతకం రచించారు. ఇది నరసింహ శతకంగా ప్రశిద్ది చెందింది. ఇది భూషణ వికాస! శ్రీ ధర్మపురి నివాసా ! దుష్ట సంహారా! నరసింహా! దురిత దుర అని మకుటంగా రచించబడ్డాయి. దాదాపు వీది బడులన్నిటిలో ఈ శతకం పాఠ్యాంశంగా ఉండేదట.

గంపలవాడ[మార్చు]

గంపలవాడ ధర్మపురిలోని ఒక వాడ, ఈ వాడ దేవాలయ సమూహానికి దగ్గరగా ఉండును. గంపలవాడకు ఈ పేరెలా వచ్చిందంటే 1970వ దశకంలో తెనుగు వారు (పళ్ళు అమ్మేవారు) ఇక్కడ ఎక్కువగా నివసించేవారు, వీరు గంపలలో పండ్లను తీసుకెళ్ళేవారు, గంప అనగా వెదురుతో చేసిన బుట్ట. మరియు కుమ్మరి వాళ్ళు కూడ మట్టి పాత్రలను ఇదే విధంగా తీసుకెళ్ళేవారు. అందుకనే గంపలవాడ అనే పేరు వచ్చింది. గంపలవాడను అంతకముందు మఠంగడ్డ అనేవారు. ఎందుకంటే పూర్వము ఋషులు, మునులు, ఈగడ్డ పైననే తపస్సు, పూజలు, చేసారని ప్రతీతి. ఇప్పటికి అదే కోవలో శ్రీశ్రీశ్రీ సచ్ఛిదానంద సరస్వతి స్వామివారు మఠంగడ్డ పరిసర ప్రాంతంలోనే శ్రీ మఠం స్తాపించారు, గంపలవాడలో ముఖ్యంగా చీర్ల వంశీయులు రజక వంశీయులు నివసిస్తున్నారు.

శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర[మార్చు]

డా. సంగనభట్ల నరసయ్య వ్రాసిన శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర అనే పుస్తకములో ఈ క్షేత్రానికి సంబంధించిన అనేక విషయాలున్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు, బయటి లింకులు[మార్చు]