అక్షయ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షయ్ కుమార్ (జననం 9 సెప్టెంబరు 1967), ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ కళాకారుడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన[1] ఆయన దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు.[2] రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందారు. 1990ల్లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించారు ఆయన. వక్త్ హమారా హై (1993), మోహ్రా (1994), ఎలాన్ (1994), సుహాగ్ (1994), సపూట్ (1996), జాన్వర్ (1999) వంటి సినిమాలతో ప్రసిద్ధమయ్యారు అక్షయ్.

ఆ తరువాత డ్రామా, రొమాంటిక్, హాస్యభరిత చిత్రాలలో కూడా నటించి, మెప్పించారు అక్షయ్. యే దిల్లగీ (1994), ధడ్కన్ (2000), అందాజ్ (2003), నమస్తే లండన్ (2007), వక్త్:ది రేస్ ఎగైనెస్ట్ టైమ్ (2005), హీరా ఫేరీ (2000), ముఝ్సే షాదీ కరోగీ (2004), గరం మసాలా (2005), భాగమ్ బాగ్ (2006), భూల్ భులయ్యా (2007), సింగ్ ఈజ్ కింగ్ (2008) వంటి అన్ని రకాల జోనర్లలోనూ సినిమాలు చేశారు. 2007లో 3 వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు అక్షయ్. 2009 నుంచి 2011 వరకు సరైన హిట్ లేదు ఆయనకు. ఆ తరువాత ఆయన నటించిన హౌస్ ఫుల్ 2 (2012), రౌడీ రాథోడ్ (2012) సినిమాలతో 1 బిలియన్ వసూళ్ళు సాధించారు ఆయన. ఓ మై గాడ్ (2012), స్పెషల్ 26 (2013), హాలిడే (2014), గబ్బర్ ఈస్ బ్యాక్ (2015), ఎయిర్ లిఫ్ట్ (2016) వంటి సినిమాలతో మంచి వసూళ్ళే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఫిబ్రవరి 2013న అప్పటివరకు విడుదలైన అక్షయ్ సినిమాల వసూళ్ళు మొత్తం కలిపి 20 బిలియన్ రూపాయలు అయ్యాయని మీడియా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన మొదటి బాలీవుడ్ నటుడు ఆయనే కావడం విశేషం.[3] భారత్ బాక్స్ ఆఫీస్ బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నటునిగా పేర్కొంది.[4][5]

నటనే కాక, అక్షయ్ కు స్టంట్ పర్ఫార్మెన్స్ లలో కూడా మంచి ప్రవేశం ఉంది. ఆయన చాలా సినిమాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్లను చేశారు. అక్షయ్ ను భారతీయ జాకీచాన్ అంటుంటారు అభిమానులు.[6][7] 2008లో ఫియర్ ఫాక్టర్-ఖత్రోం కే ఖిలాడీ అనే షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఆ తరువాతి సంవత్సరం హరి ఓం ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించారు ఆయన.[8] భారత చలనచిత్రాల్లో ఆయన కృషికి గుర్తింపుగా విండ్సర్ విశ్వవిద్యాలయం లాలో గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆ తరువాత సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. 2011లో ఆసియా పురస్కారాలు ఆయనను సత్కరించింది. 2012లో గ్రేజింగ్ గోట్ పిక్చర్స్ పేరుతో మరో నిర్మాణ సంస్థను ప్రారంభించారు అక్షయ్. 2014లో డేర్ 2 డాన్స్ అనే టివి షోను ప్రారంభించారు ఆయన. ప్రపంచ కబడ్డీ లీగ్ లో ఖల్సా వారియర్స్ టీంను  గెలుచుకున్నారు అక్షయ్. 2015లో ఫోర్బ్స్ ప్రపంచ అతిఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో 9వ స్థానంలో అక్షయ్ ను పేర్కొంది.[9][10][11][12][13]

తొలినాళ్ళ జీవితం, నేపథ్యం[మార్చు]

సెప్టెంబరు 9 1967న పంజాబ్ లోని అమృత్ సర్ లో పంజాబీ హిందూ కుటుంబంలో హరి ఓం భాటియా, అరుణా భాటియా దంపతులకు జన్మించారు.[14] ఆయన తండ్రి హరి ఓం సైన్యంలో అధికారి.[15] చిన్నప్పట్నుంచీ నృత్యంపై ఆసక్తి ఎక్కువ ఉన్న అక్షయ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చేవారు. ఆయన చిన్నతనం మొదట్లో ఢిల్లీ లోని చాందినీ చౌక్ లో గడిపారు. ఆ తరువాత   ముంబైలో పంజాబీలు ఎక్కువగా ఉండే కోలివాడా ప్రాంతంలో ఉండేవారు.[16] డాన్ బొసొకొ స్కూల్ లోనూ, గురు నానక ఖల్సా  కళాశాలలోనూ చదువుకున్నారు ఆయన. మొదటి సంవత్సరం చదివిన ఆయన మధ్యలోనే ఆపేసి బ్యాంకాక్ కు మార్షల్ విద్యలు నేర్చుకునేందుకు వెళ్ళిపోయారు.[17] అక్షయ్ కు చెల్లెలు అల్కా భాటియా కూడా  ఉన్నారు. పెద్దయ్యాకా ఏమవుతావని అడిగిన తండ్రికి తాను నటుణ్ణి  అవుతానని చెప్పారట చిన్నారి అక్షయ్.[18]

వ్యక్తిగత జీవితం[మార్చు]

భార్య ట్వింకిల్ ఖన్నా (ఎడమ), అత్తగారు  డింపుల్ కపాడియా (కుడి) లతో అక్షయ్.

ప్రముఖ బాలీవుడ్ నటులు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల  కుమార్తె, నటి ట్వింకిల్ ఖన్నా తో రెండుసార్లు నిశ్చితార్ధం అయిన  తరువాత, 17 జనవరి 2001న ఆమెను వివాహం చేసుకున్నారు  అక్షయ్. వారికి ఒక కుమారుడు ఆరవ్, కుమార్తె నేత్ర.[19][20] పిల్లలను చాలా ప్రేమగా చూసుకునే ఆక్షయ్, వారిని మీడియాకు దూరంగా ఉంచి పెంచుతున్నారు. వారు స్వచ్ఛమైన చిన్నతనాన్ని అనుభవించాలి కాబట్టే తన స్టార్ డం వారి స్వేచ్ఛకు భంగం కలగకూడదంటారు ఆయన.[21] 2009లో లాక్మీ ఫాషన్ వీక్ లో లెవిస్ బ్రాండ్ కు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆయన కాస్త అసభ్యంగా ప్రవర్తించారని ఒక కేసు కూడా నమోదు అయింది. ఈ విషయం అప్పట్లో చాలా విమర్శలకు దారి తీసింది.[22]

2008లో పీపుల్ పత్రిక అక్షయ్ ను సెక్సిఎస్ట్ మాన్ ఎలైవ్ గా పేర్కొంది.

References[మార్చు]