ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ ఎన్నికలు కాబోయే రెండు తెలుగు రాష్ట్రాల పురపాలక ఎన్నికలకు సంబంధించినవి. వీటికి 2014 మార్చి 3 న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది.[1]
స్థానిక ఎన్నికలకు గడువు పూర్తయినా నిర్వహిచంకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానాలు తప్పుపట్టడంతో శాసన సభ, లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌గా మారి సార్వత్రక, శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని వివిధ రాజకీయ పక్షాలు వేసిన పిటిషన్‌లను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాలను సార్వత్రక ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే దాకా వెలువరించరాదని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశం ప్రకారం మున్సిపల్ ఎన్నికల్ని మార్చి 30న, సుప్రీంకోర్టు జారీ చేసిన హుకుం మేరకు స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్‌పీటీసి) ఎన్నికల్ని ఏప్రిల్ 6, 11 తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పధిలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు తే.12.5.2014 న జరిగింది. కాబోయే రెండు తెలుగు రాష్ట్రాల పురపాలక ఎన్నికల ఫలితాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. రాష్ట్రంలోని పది నగరపాలక సంస్థలు, 145 మున్సిపాలిటీల్లో వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు మే 5, 2013 న వెలవడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో చివరి స్థానిక ఎన్నికలు పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణంలో జరగడంతో ఫలితాలు కూడా విభిన్నంగానే ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు, సీమాంధ్ర ప్రజలు టీడీపీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారు. సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర్‌సీపీ రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. అందరూ ఊహిస్తున్నట్లుగానే సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్క మున్సిపాలిటీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. కాగా తెలంగాణలో టీడీపీ పది స్థానాలను సాధించి రెండో స్థానంలో నిలిచింది.
రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో జనాదరణ తుడిచిపెట్టుకుపోగా, మొదట్లో తెలంగాణలో టీఆర్ఎస్ కంటే అధికంగా ఉన్న మాట వాస్తవం. తెలంగాణ విషయంలో రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచేందుకు టీడీపీ తీసుకున్న వైఖరి కారణంగా ఆ పార్టీకి ప్రజాదరణ బాగా తగ్గింది. స్థానిక ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ వాతావరణంలో పార్టీల బలాబలాల్లో తేడాలో వచ్చాయి. కాంగ్రె స్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనతో తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ కంటే మెరుగుపడింది.