గొట్టిముక్కల పద్మారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొట్టిముక్కల పద్మారావు
గొట్టిముక్కల పద్మారావు


వ్యక్తిగత వివరాలు

జననం 1954, నవంబరు 8
కూకట్‌పల్లి, మేడ్చల్ జిల్లా, తెలంగాణ
జీవిత భాగస్వామి విజయలక్ష్మీ
సంతానం ముగ్గురు కుమార్తెలు (సుజనారావు, సుష్మారావు, సుచరితారావు)
వృత్తి తెలంగాణ ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, సినీ నిర్మాత, సామాజికవేత్త.

గొట్టిముక్కల పద్మారావు, తెలంగాణ ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, సినీ నిర్మాత, సామాజికవేత్త. పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థ ద్వారా సుమన్ తో కంచు కవచం, రాజేంద్రప్రసాద్తో జోకర్, ఏప్రిల్ 1 విడుదల[1] వంటి సినిమాలను నిర్మించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

గొట్టిముక్కల పద్మారావు 1954, నవంబరు 8న కూకట్‌పల్లిలో జన్మించారు. తండ్రిపేరు గొట్టిముక్కల రామారావు, తల్లిపేరు రాజ్యలక్ష్మీ. పద్మారావు బిఏ వరకు చదివారు.

కుటుంబం

[మార్చు]

గొట్టిముక్కల పద్మారావుకు విజయలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (సుజనారావు, సుష్మారావు, సుచరితారావు). పెద్ద కుమార్తె సుజనా రావు గమనం సినిమాకు దర్శకత్వం వహించారు.[2]

రాజకీయం

[మార్చు]

1996లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. ఆ సమయంలో జన్మభూమి కాలనీ పేరిట పేదలకు ఇళ్ళు కట్టించడంతోపాటు, పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ గా పనిచేసి, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. 2014లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. 2015లో హైదరాబాదు నగర మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కీలకపాత్ర పోషించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టికెట్ అశించిన పద్మారావు, సీటు రాకపోవడంతో 2018 నవంబరు 18న టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు.[3][4]

2019 ఏప్రిల్ 1న జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.[5] మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపుకు కృషిచేశారు. 2022 నవంబరు 2న రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో భాగంగా బోయినపల్లి నుండి మియాపూర్ వరకు జరిగిన యాత్రలో పాల్గొన్నారు.[6]

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో 1970లలో గొట్టిముక్కల పద్మారావు పాల్గొని, జైలుకు కూడా వెళ్ళారు. మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొని కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన కుమార్తె సుజనారావుతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని తెలియజెప్పేలా లఘుచిత్రాలను రూపొందించారు.

సినిమారంగం

[మార్చు]

చిన్నప్పట్టి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తొలి సినిమాగా 1985లో రాజశేఖరరెడ్డి దర్శకత్వంతో సుమన్ హీరోగా కంచు కవచం సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో తనికెళ్ళ భరణిని రచయితగా, నటుడిగా పరిచయం చేశారు, ఆ సినిమాలో పద్మారావు పోలీస్ పాత్రలో కూడా నటించారు. 1986లో సి ఎస్ రావు దర్శకత్వం వహించిన శ్రీ వేమన చరిత్ర సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా 1991లో ఏప్రిల్ 1 విడుదల, 1993లో జోకర్[7] వంటి సినిమాలను నిర్మించారు. 2006లో నీ నవ్వే చాలు సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు.

మూలాలు

[మార్చు]
  1. Shekar, Raja (2020-02-04). "ఆ దర్శకుడికి అదే పెద్ద మైనస్ అంటున్న నిర్మాత…". TeluguStop.com. Retrieved 2023-04-01.
  2. "Gamanam director Sujana Rao confirms her next, to reunite with VS Gnanashekar again". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
  3. "కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి గొట్టిముక్కల రాజీనామా". Samayam Telugu. Retrieved 2023-04-01.
  4. Mayabrahma, Roja (2018-11-25). "Kukatpally TRS in charge Gottimukkala Padmarao quits party". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
  5. Velugu, V6 (2019-04-01). "రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేతలు". V6 Velugu. Retrieved 2023-04-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "నగర కాంగ్రెస్‌లో సరికొత్త జోష్‌". EENADU. Retrieved 2023-04-01.
  7. "ఇళయ రాజా, దర్శకుడు వంశీ కలయికలో మొత్తం ఎన్ని సినిమాలొచ్చాయో తెలుసా..!". Filmy Focus (in ఇంగ్లీష్). 2023-01-07. Retrieved 2023-04-01.