ఎనుముల రేవంత్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎనుముల రేవంత్ రెడ్డి
ఎనుముల రేవంత్ రెడ్డి


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
26 జూన్ 2021 - ప్రస్తుతం
ముందు సి.హెచ్. మల్లారెడ్డి
నియోజకవర్గం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ

మల్కాజిగిరి ఎంపీ
పదవీ కాలం
2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1969-11-08) 1969 నవంబరు 8 (వయసు 53)
కొండారెడ్డిపల్లి గ్రామం వంగూరు మండలం నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ , తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి గీత[1]
సంతానం నైమిష[1]
వృత్తి రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు

ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు.[2]

తొలినాళ్ళు[మార్చు]

రేవంత్ రెడ్డి 1969, నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా , వంగూరు మండలం , కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు.చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నా ఆర్ట్స్ లో స్నాతకులు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇతనికి వివాహమైంది.హైదరాబాదులో వీరి కుటుంబం స్థిరపడింది.

రాజకీయ జీవితం[మార్చు]

రేవంత్‌రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి, ఆయన 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానికసంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. రేవంత్ రెడ్డి లో తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించాడు. ఆయన 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నాడు. ఆయన 2017 అక్టోబర్‌లో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌రెడ్డి 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. ఆయన 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.[3] రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.[4]రేవంత్ రెడ్డి 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5][6]

వార్తలు - వివాదాలు[మార్చు]

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటాడు. వాటిలో కొన్ని

నియోజకవర్గ ప్రజల ఆగ్రహం[మార్చు]

తమ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రసంగాలకు, చర్చలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజాసమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. రోడ్లు లేక నీళ్లు లేక ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నామని ఇప్పటికైనా శాసన సభ్యులు రేవంత్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.మా శాసన సభ్యులు రేవంత్‌ రెడ్డి కనిపించడం లేదు...టీవీ కార్యక్రమాల్లో తప్ప నియోజకవర్గంలో కనిపించడం లేదని కొడంగల్‌ ప్రజలు వాపోతున్నారు. కోస్గి మండలం ముంగిమళ్ల గ్రామంలో గత రెండేళ్ల క్రితం 30లక్షల రూపాయల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశాడని, శాసన సభ్యులు పట్టించుకోకపోవడం వల్లనే తమకు అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.భారీ వర్షాలు వస్తే తమ తమ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతాయని ముంగిమళ్ల గ్రామస్థులు వాపోతున్నారు. సరైన రోడ్లు లేక గ్రామాల మధ్యన వంతెనలు లేక ఒక ప్రాంతాన్నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే చాలా కష్టంగా వుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. శాసన సభ్యులు రేవంత్‌రెడ్డి ఎక్కడుంటాడో ఎప్పుడొస్తాడో తమకు తెలియదని ఓట్లప్పుడు వచ్చి ఇప్పటిదాకా తమ గ్రామాన్ని సందర్శించలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు.ముందు మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించి ఆ తర్వాతనే రాష్ట్ర సమస్యలపై గళం విప్పాలంటూ కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు తమ శాసన సభ్యులు రేవంత్‌రెడ్డిని కోరుతున్నారు.

మోడీ, బాబు, ప్రధాని, ఉప ప్రధాని[మార్చు]

2013 జూన్ 12 న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల్లో ఒకరిని ప్రధాని, మరొకరిని ఉప ప్రధానిని చేద్దామంటూ టీడీపీ శాసన సభ్యులు ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ బాధ్యతను నెత్తిన వేసుకోవాలంటూ ఇటీవలే బీజేపీలో చేరిన శాసన సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డిని కోరారు. ఇంతకూ ఈ ప్రతిపాదన ఎలా వచ్చిందంటే.. శాసనసభ ఇన్నర్ లాబీల్లోని బీజేపీ కార్యాలయంలో ఉన్న ఆ పార్టీ శాసన సభ్యులుతో మంగళవారం రేవంత్ కొద్దిసేపు మాట్లాడారు. నాగానికి సత్తా, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే సిద్దిపేటలో సభ నిర్వహించాలని, దానికి మోడీని పిలిపించి.. తెలంగాణకు అనుకూలమని ప్రకటించాలని రెచ్చగొట్టారు. నాగం స్పందిస్తూ.. తాము తప్పక సిద్దిపేటలో సభ నిర్వహించి తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తామన్నారు. ఇదే సమయంలో యునెటైడ్ ఫ్రంట్ హయాంలో బాబు ప్రధాని అయితే బాగుంటుందని చాలామంది కోరుకున్నారంటూ తాను మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఎదురైన ఓ ఘటనను వివరించారు. రేవంత్ జోక్యం చేసుకుంటూ.. ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని ప్రధాని, మరొకరిని ఉపప్రధానిని చేద్దాం, మీరే మధ్యవర్తిత్వం వహించండని చెప్పారు. దీనిపై నాగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత.. బీజేపీ, టీడీపీలు వచ్చే ఎన్నికల్లో కలిసేది లేదని ఆయన చెప్పారు.[7]

తప్పుడు అర్హత పత్రంతో సాగునీటి కాంట్రాక్టు దక్కింపు[మార్చు]

మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, హన్వాడ, కోయిలకొండ మండలాల్లో తాగునీటి పథకం కాంట్రాక్టులో తప్పుడు అర్హతపత్రం సమర్పించిన కాంట్రాక్టర్‌కు ఇతను మద్దతునిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వీటిని ఆయన ఖండించాడు.[8]

తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుంది[మార్చు]

2014 జనవరి 24 న జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందని అన్నారు. ఇందిరాగాంధీ సమైక్యవాది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి అన్నారు. . గోల్డ్ మెడలిస్ట్ లయిన తమ ప్రాంత విద్యార్థులు నక్సలిజం వైపు మళ్లటానికి సమైక్య రాష్ట్రమే కారణమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉన్నందునే కేసీఆర్ వెనక ప్రజలు అండగా నిలిచారన్నారు. 371 డి ఆర్టికల్ రాష్ట్ర విభజనకు అడ్డుకాదన్నారు.

దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఉన్నత పదవులన్నీ సీమాంధ్ర ప్రాంతానికే ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రుల పదవుల విషయంలోనూ తెలంగాణవారికి అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రధాన పదవులన్నీ సీమాంధ్ర ప్రాంతానికే ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదట ఖమ్మంలోనే మొదలయిందన్నారు. తాము ఎన్నడూ జై ఆంధ్రా ఉద్యమాన్ని తప్పు పట్టలేదన్నారు.

తెలంగాణ ప్రజల కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని రేవంత్ రెడ్డి అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అభినవ అంబేడ్కర్ అని అభివర్ణించారు. ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు కాదని... సమస్యలు ఉన్న ప్రాంతమంతా తనదే అనేవారన్నారు. 2008లోనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని... తెలంగాణ ఇవ్వమంటే... సీమాంధ్రకు అన్యాయం చేయాలని చెప్పలేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అన్ని పార్టీలు టీడీపీనీ లక్ష్యంగా చేసుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.[9][10][11]

ఇక టీఆర్ఎస్ అవసరం లేదు[మార్చు]

తెలంగాణలో ఇక టీఆర్ఎస్ అవసరం లేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నాడు. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేయమని కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. పాలమూరు వలసల గురించి ప్యాకేజీ ఎందుకు అడగలేదని నిలదీశాడు.

బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే కేసీఆర్ ఎప్పుడైనా అడ్డుపడ్డారా అని నిలదీశాడు. తెలంగాణ ప్రజలు స్మరించుకోవాల్సింది జయశంకర్ గాని, కేసీఆర్ ను కాదన్నాడు. సోనియాకు కలిసేందుకు తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు తీసుకెళ్లలేదని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. సోనియా, రాహుల్, దిగ్విజయ్ సింగ్ లతో కేసీఆర్ ఏం చర్చించారో వెల్లడించాలని డిమాండ్ చేశాడు.[12]

బీహార్‌ వలస దొరబాబులు కేసీఆర్‌, కేటీఆర్‌[మార్చు]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌పై తెలుగుదేశం శాసన సభ్యులు రేవంత్‌రెడ్డి 2014 సెప్టెంబరు 5, శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్‌ వలస దొరబాబులు కేసీఆర్‌, కేటీఆర్‌ అని రేవంత్‌ వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో చదివిన కేటీఆర్‌కు తెలంగాణ స్థానికత రాదని ఆయన అన్నారు. తెలుగుదేశంలో పదవులు అనుభవించిన టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావువి దిగజారుడు రాజకీయాలని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ వల్లే పార్లమెంట్‌లో టి.బిల్లు పాసైందని, సకలజనుల సమ్మెలో కీలక పాత్ర వహించిన మెదక్ జిల్లావాసి దేవీప్రసాద్‌కు టికెట్ ఎందుకివ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.[13]

హైదరాబాదు మెట్రో రైలు ఉనికికే ప్రమాదం[మార్చు]

2014 సెప్టెంబరు 17 న విలేఖరరుల సమావేశంలో తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుపై తెరాస ప్రభుత్వానికి స్పష్టత లేదని తెదేపా నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెరాస నేతల దురాశ వల్ల మెట్రో రైలు ఉనికికే ప్రమాదం వచ్చిందని అన్నారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పునకు సీఎం కేసీఆర్ పూనుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో రైలుకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారని.. మెట్రోకు కేటాయించిన గచ్చిబౌలిలోని స్థలాన్ని లాగేసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు[14].

రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు తాఖీదులు[మార్చు]

టీడీపీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డికి మై హోం కన్‌స్ట్రక్షన్స్ రామేశ్వరరావు లీగల్ నోటీసులు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం కలిగిందంటూ రూ.90 కోట్లుకు లీగల్ నోటీసులు ఇచ్చాడు. మరోవైపు రేవంత్ రెడ్డి లీగల్ నోటీసులపై స్పందిస్తూ తన ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు.[15]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Illali Muchatlu With Geetha(Revanth Reddy Wife) 17th Nov 2011 Abn Andhrajyothy". youtube.com. Nov 17, 2011. Retrieved February 15, 2013.
  2. News18 Telugu (23 May 2019). "రేవంత్ రెడ్డా మజాకా...ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచారు." News18 Telugu. Retrieved 25 May 2021.
  3. Sakshi (27 June 2021). "TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి?". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  4. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  5. Andrajhyothi (7 July 2021). "టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  6. Sakshi (27 June 2021). "అంచెలంచెలుగా ఎదిగి.. అధ్యక్షుడిగా." Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
  7. "ఆర్కైవ్ నకలు". TimesOfIndia. February 5, 2014. Archived from the original on 2014-02-15. Retrieved February 15, 2014.
  8. "ఆ వార్తలో నిజం లేదు: రేవంత్‌రెడ్డి". Sakshi. October 23, 2013. Retrieved February 15, 2014.
  9. http://www.apvedika.com/Naxals-will-increase-if-Telangana-not-formed--Revanth-Reddy-vin-128615.html[permanent dead link]
  10. http://www.telugism.com/video/naxalism-will-increase-if-t-will-not-be-separated-revanth-reddy-tv9
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2014-02-15.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-28. Retrieved 2014-02-24.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-06. Retrieved 2014-09-05.
  14. http://www.teluguone.com/news/content/hyderabad-metro-train-l-and-t-letter-to-telangana-government-tdp-leader-revanth-reddy-39-38422.html#.VBkzVBbNwXg
  15. http://www.thehindu.com/news/cities/Hyderabad/legal-notice-served-on-telugu-desam-mla-for-rs-90-cr/article6481386.ece

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.