తూమాటి దోణప్ప
తూమాటి దోణప్ప | |
---|---|
జననం | దోణతిమ్మారాయ చౌదరి జూలై 1, 1926 |
మరణం | సెప్టెంబర్ 6, 1996 |
వృత్తి | రచయిత, ఉపకులపతి |
జీవిత భాగస్వామి | గోవిందమ్మ |
తల్లిదండ్రులు |
|
ఆచార్య తూమాటి దోణప్ప (జూలై 1, 1926 - సెప్టెంబర్ 6, 1996) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]దోణప్ప అనంతపురం జిల్లా రాకెట్లలో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1926, జూలై 1వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు దోణతిమ్మారాయ చౌదరి. తాతగారైన తూమాటి భీమప్ప వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. వజ్రకరూరులోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46 సం. ల మధ్య కాలంలో ఉరవకొండలోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు మొదలైనవారు ఇతని గురువులు.1949-52సం.ల మధ్య ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కాకర్ల వెంకటరామ నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి అనకాపల్లి కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. గుడివాడ కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని గంటి జోగి సోమయాజివద్ద పరిశోధక విద్యార్థిగా చేరి "తెలుగులో వైకృతపదాలు" అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించాడు.
ఉద్యోగం
[మార్చు]1957లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు.1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు.1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు.1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు.1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.
నాటకాలు
[మార్చు]తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో 'చిత్ర' పాత్రధారిగా, 'సుభద్రా పరిణయం'లో సుభద్ర పాత్రను, 'మోహినీరుక్మాంగద'లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు.సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
రచనలు
[మార్చు]ఇతని సాహిత్య రచనా వ్యాసంగం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో చదివేరోజుల్లోనే ఆరంభమయింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు చిత్రగుప్తలో ఇతని చంద్రుడు-కలువ అనే మొట్టమొదటి కథ అచ్చయింది. హైస్కూలులో చదివే సమయంలోనే ఇతడు వినోదిని, రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ప్రకటించాడు. దత్తమండల కళాశాలలో చదివేరోజులలో ఇతడు పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో ప్రథమబహుమానాలు పొందాడు. "బైబిలు-ఖురాను-భగవద్గీత" అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షీసుందరాంబా స్మారక బహుమానాన్ని పొందాడు. 1949 మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రభ దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.వాల్తేరులో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని 'ఆదర్శశిఖరాలు' మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక జయశ్రీ పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.
ప్రకటించిన గ్రంథాలు
[మార్చు]- ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము
- భాషాచారిత్రక వ్యాసావళి
- తెలుగులో కొత్తవెలుగులు
- జానపద కళాసంపద
- తెలుగు హరికథాసర్వస్వము
- తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు
- దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట
- మన కళాప్రపూర్ణుల కవితారేఖలు
- ఆకాశవాణి భాషితాలు
- తెలుగు వ్యాకరణ వ్యాసాలు
- ఆంధ్రుల అసలు కథ
- బాలల శబ్ద రత్నాకరం
- తెలుగు మాండలిక శబ్దకోశం
పురస్కారాలు
[మార్చు]- 1965,1966లో వరుసగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి రఘుపతి వేంకటరత్నం నాయుడు స్వర్ణపతకాలు.
- తెలుగు హరికథాసర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి డి.లిట్.
- 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- రాయలసీమ రచయితల చరిత్ర నాలుగవ సంపుటి - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- మూడు అరవైల దోణప్ప (వ్యాసం) - నాగళ్ల గురుప్రసాదరావు - తూమాటి దోణప్ప షష్టిపూర్తి సంచికఅభినందన[permanent dead link] పుటలు - xiii నుండి xxix.
ఉపయుక్త గ్రంథ సూచి
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using home town
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1926 జననాలు
- 1996 మరణాలు
- తెలుగు రచయితలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- అనంతపురం జిల్లా భాషావేత్తలు
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు
- అనంతపురం జిల్లా రచయితలు
- అనంతపురం జిల్లా విద్యావేత్తలు