Jump to content

పి.సాంబశివరావు

వికీపీడియా నుండి
(పర్వతనేని సాంబశివరావు నుండి దారిమార్పు చెందింది)
పర్వతనేని సాంబశివరావు
పి.సాంబశివరావు
జననంపర్వతనేని సాంబశివరావు
1935 సెప్టెంబరు 20
ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా
ఇతర పేర్లుపి.సాంబశివరావు
విశ్వవిద్యాలయాలుసి.ఆర్.రెడ్డి కళాశాల
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత
మతంహిందూ

పర్వతనేని సాంబశివరావు సినిమా దర్శకుడు. ఆయన సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ చిత్రాలు కూడా ఉన్నాయి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1935 సెప్టెంబరు 20ఏలూరులో జన్మించారు. బి.ఎస్.సి. వరకూ ఏలూరులోనే చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఆయన నాన్నగారు చనిపోయారు. తరువాత ఆయన చదువు కొనసాగలేదు. ఆయన అన్నయ్య "నవశక్తి" గంగాధరరావుగారు అప్పటికే చిత్రపరిశ్రమలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఆయన దగ్గరకు వెళ్లడంతో విక్రమ్ లాబరేటరీలో ఆఫ్రెంటీస్ గా చేర్పించారు. ఏడాది అక్కడ పనిచేసిన తర్వాత 1959లో సారథీ సూడియోస్ వారి ల్యాబ్ లో చేరారు. అయితే ఎందువల్లనో గానీ ఆయనకు తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. మానేద్దామనుకున్న తరుణంలో ఆయన అన్నయ్య "మా ఇంటి మహాలక్ష్మి" చిత్ర నిర్మాణం ప్రారంభించారు. హైదరాబాదులో పూర్తి స్థాయిలో రూపుదిదుకున్న తొలి చిత్రం అదే. ఆయన సొంత సినిమా కావడ చేత ఆయన ఉద్యోగం వరిలేసి ఆ చిత్రనిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు రామినీడు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరడంతో పాటు ప్రాడక్షన్ పనులు కూడా పర్యవేక్షించే వారాయన. ఆ సినిమా పూర్తయిన తర్వాత తాపీ చాణక్య గారి దగ్గర "జల్సారాయుడు" చిత్రానికి, సి.ఎస్.రా వుగారి దగ్గర "పెళ్లికాని పిల్లలు" చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. సి.ఎస్.రావుగారి దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు.

ఆత్రేయ గారి వద్ద శిష్యరికం

[మార్చు]

ఆయన కొంతకాలం ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర పనిచేశారు. సుబ్బారావు గారి చిత్రాలకు ఆత్రేయ గారు రచయిత. రాసే అలవాటు ఆత్రేయగారికి లేనందువల్ల ఆయన డిక్లేట్ చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలి. అందుకే ఆదుర్తి సుబ్బారావుగారు సాంబశివరావు గారిని ఆయన దగ్గరకి రాసుకొనే నిమిత్తం పంపించే వారు. అలా ఓ ఏడాది పాటు ఆత్రేయగారి శిష్యరికం చేశారు. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా ఎడిటర్, డైరెక్టర్ అక్కినేని సంజీవి గారి దగ్గరకు వెళ్లి ఎడిటింగ్ నేర్చుకునేవారు.

బెంగాలీ లోకి "పాండవ వనవాసం"

[మార్చు]

ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి వంటి ఉద్దండుల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న 'పాండవ వనవాసం" చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సాంబశివరావుగారి అన్నయ్య బెంగాలీ లో డబ్ చేసారు. బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి చిత్రం అది. దీని డబ్బింగ్ బాద్యతలను సాంబశివరావుగారే నిర్వహించారు. దీనికోసం ఆయన కలకత్తా వెళ్ళి రెండు నెలలు ఉండి డబ్ చేసారు. "పాండబేర్ బనవాస్" పేరుతో విడుదలైన ఆ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది.

దర్శకునిగా

[మార్చు]

దర్శకునిగా ఆయనకు తొలి అవకాశాన్ని ఆయన తండ్రిగారు యిచ్చారు. హైదరాబాద్ మూవీస్ పేరిట ఒక సంస్థను నెలకొల్పి ఆయనతో సినిమా చేయడానికి సన్నాహాలు ప్రారంభించారాయన. అయితే ముందే ఒక షరతు పెట్టారాయన. కథ ఏమిటో దాన్ని ఎలా తీయాలో వివరంగా రాసివ్వమని, అది నచ్చితేనే సినిమా తీయుటకు అంగీకరిస్తానని తన తండ్రి చెప్పారు. అపుడు సాంబశివరావుగారు చెప్పిన "అర్థరాత్రి" సినిమా కథ నచ్చి సినిమా నిర్మించారు. దర్శకుడిగా అదే ఆయన తొలి సినిమా. జగ్గయ్య గారు హీరో, గ్రూప్ డాన్సర్ అయిన భారతికి హీరోయిన్‌గా ఇదే తొలి చిత్రం. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి గారు కూడా తాన "బంగారు పంజరం" సినిమాలో ఈయన మార్గాన్ని అనుసరించారు. అర్థరాత్రి సినిమా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. తరువాత అంత గుర్తింపు తెచ్చిన సినిమాలు రాలేదు.

ఏలూరులో ఉంటున్న నిర్మాత, దర్శకుడైన విజయబాపినీడు గారు ఆయన స్నేహితుడు. సాంబశివరావు గారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమూలు చూసి ఆయన “రంభ ఊర్వశి మేనక(1976) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కొద్ది కాలం విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆయనకు మళ్లీ వరుసగా అవకాశాలు ఆయనకు వచ్చాయి. "రంభ ఊర్వశి మేనక" చిత్రం షూటింగ్ జరుగుతుండగానే నవతా కృష్ణంరాజు గారు ఓ సినిమా చేయమని అడిగారు. ఆయన కూడా ఏలూరులో ఆయన స్నేహితుడు. ఇదే 'ఇంటింటి రామాయణం'. ఆ సినిమా పెద్ద హిట్ అయి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

హిందీ సినిమా ప్రస్థానం

[మార్చు]

ఆయన ప్రముఖ నిర్మాత, సత్యచిత్ర అధినేత అయిన సత్యనారాయణ గారి కుమార రాజా, కొత్తపేట రౌడీ, ఉద్దండుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఉద్దండుడు చిత్రం ప్లాప్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ఇంటింటి రామాయణం యొక్క ఘనవిజయాన్ని చూసిన నాగిరెడ్డి గారు గుండమ్మ కథ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయమని కోరారు. గుండమ్మ కథ హిందీలో "స్వయంవర్" పేరుతో ప్రారంభమైనది. ఆ చిత్రానికి ఎన్.టి.ఆర్ పాత్రను సంజీవ్ కుమార్, ఎ.ఎన్.ఆర్ పాత్రను శశికపూర్, సావిత్రి పాత్రను విద్యాసిన్హా, సూర్యకాంతం పాత్రను నాదీరా పోషించారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
  1. అర్ధరాత్రి (1968)
  2. భలే మోసగాడు (1972)
  3. వంశోధ్ధారకుడు (1972)
  4. నిండు కుటుంబం (1973)
  5. ఉత్తమ ఇల్లాలు (1974)
  6. అమ్మాయిలూ జాగ్రత్త (1975)
  7. రంభ ఊర్వశి మేనక (1977)
  8. మనస్సాక్షి (1977)
  9. కలియుగ స్త్రీ (1978)
  10. కుమారరాజా (1978)
  11. ఇంటింటి రామాయణం (1979)
  12. అల్లరి బావ (1980)
  13. కొత్తపేట రౌడీ (1980)
  14. ప్రణయ గీతం (1981)
  15. ఈనాడు (1982)
  16. ఎంత ఘాటు ప్రేమయో (1982)
  17. ప్రేమ నక్షత్రం (1982)
  18. పెళ్ళి చూపులు (1983)
  19. ఉద్దండుడు (1984)
  20. మృగతృష్ణ (1992)

నిర్మించిన సినిమాలు

[మార్చు]
  1. ఇదికాదు ముగింపు (1983)

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయనకు ఇద్దరు పిల్లలు. 1990 నుండి సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన "సత్యం" సినిమాను బెంగాలీ లోనికి రీమేక్ చేసారాయన. అలాగే అనేక టెలీఫిల్మ్‌ లను కూడా రూపొందిస్తున్నారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]