Jump to content

బభ్రువాహనుడు

వికీపీడియా నుండి
నాగులతో పోరాడుతున్నబభృవాహనుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

బభృవాహనుడు అర్జునుడు, మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు.

అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి మణిపూర్‌ రాష్ట్రమే ఆనాటి మణిపుర రాజ్యమని ఓ నమ్మకం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవాహనునికి ఒక్కతే కుమార్తె. ఆమే చిత్రాంగద! అర్జునుడు, చిత్రాంగద తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. పెద్దల అనుమతితో వివాహమూ చేసుకున్నారు. కానీ ఆ వివాహానికి ఓ షరతుని పెట్టాడు చిత్రవాహనుడు. తనకు మగసంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడే మణిపురానికి రాజు కావాలన్నదే చిత్రవాహనుడి అభిలాష. అందుకోసం అర్జునుడు తన భార్యాపిల్లలను తన వద్దనే వదిలి వెళ్లాలన్నదే చిత్రవాహనుడి షరతు. ప్రేమవశాన ఉన్న అర్జునుడు ఆ షరతుకి ఒప్పుకోక తప్పలేదు. కొన్నాళ్లకు వారికి ఒక సంతానం కలిగింది. షరతు ప్రకారం అర్జునుడు వారివురినీ వదిలి తనదారిన తాను హస్తినకు ప్రయాణమయ్యాడు. . బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు. అతనికి కిమ్వేక అనే భార్య ఉంది, ఆమె నుండి ఆరుష అనే కుమారుడు, కుమార్తె కృతిక ఉన్నారు.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునికి ఎదురేగి పాదాభివందనము చేసాడు. అర్జునునికి తన కుమారుడు వీరుని వలే ఎదిరించకుండా లొంగిపోవుట నచ్చక "వీరపుత్రులు యుద్ధమునకు వెనుకాడరు" అని పల్కాడు. బభృవాహనుడు తన తండ్రి మాటలకు కుంగిపోయి తన రాజధానికి చేరాడు. ఆ విషయము తెలుసుకొన్న అర్జునుని భార్య అయిన కౌరవ్యుడు కుమార్తె ఉలూచి బభృవాహనుడు వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషపెట్టమని చెప్పింది. అంతట సకల సైన్యముతో బభృవాహనుడు అర్జునునిపై దండెత్తాడు. ఆ యుద్ధములో అర్జునుని బాణమునకు బభృవాహనుడు మూర్చపోయినాడు. కాని బభృవాహనుడు మూర్చపోక ముందు ప్రయోగించిన బాణము అర్జునుని రొమ్ములో గ్రుచ్చుకుని అర్జునుని ప్రాణం తీసింది. ఈ విషయము తెలిసి చిత్రాంగద, ఉలూచి రణరంగమునకు వచ్చారు. అంతలో బభృవాహనుడు మూర్చనుంచి తేరుకుని లేచి తండ్రి మరణించాడని తెలుసుకుని హతాశుడై ఉలూచిని దుర్భాషలాడి, ప్రాయోపవేశము చేసి ప్రాణాలు విడుచుటకు సిద్దమయ్యాడు. అప్పుడు ఉలూచి బభృవాహనునికి సంజీవనిమణిని ఇచ్చి అర్జునుని గుండెలపై ఉంచమని చెప్పింది. అర్జునుడు తిరిగి బ్రతికాడు. ఉలూచి వారికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు భీష్ముని (ఎనిమిదవ వసువు అవతారం) చంపుట వల్ల వసువులు ఇచ్చిన శాపం గురించి వివరించింది.


చూడండి

[మార్చు]