అక్షాంశ రేఖాంశాలు: 14°04′04″N 79°19′02″E / 14.0678791°N 79.3171115°E / 14.0678791; 79.3171115

మంగళంపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగళంపల్లి
—  గ్రామ పంచాయితీ  —
మంగళంపల్లి is located in Andhra Pradesh
మంగళంపల్లి
మంగళంపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°04′04″N 79°19′02″E / 14.0678791°N 79.3171115°E / 14.0678791; 79.3171115
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కడప జిల్లా
మండలం ఓబులవారిపల్లె
ప్రభుత్వం గ్రామ పంచాయితీ
 - Type గ్రామ పంచాయితీ
 - సర్పంచి కాకర్ల శివయ్య నాయుడు
ఎత్తు 170 m (558 ft)
కాలాంశం భారత ప్రామాణిక కాలమానం (UTC+5:30)
పిన్ కోడ్ 516108
ఎస్.టి.డి కోడ్ 08566

మంగళంపల్లె అనే గ్రామం ఓబులవారిపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది గ్రామ పంచాయితీ. ఈ ఊరికి ఉత్తరంగా బోటిమీదిపల్లె, తూర్పున మారవారిపల్లె, బొమ్మవరం చెరువు , దక్షిణాన పోలివాండ్లపల్లె, కడియాలపల్లె అనే నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఊరు రెండు ప్రధాన వీధులతో ఉంది. వీటిని ఎగువ వీధి, దిగువ వీధి అంటారు.ఈ ఊరిలో హరిజనవాడ, ఎస్.టి కాలనీ ఉన్నాయి. ఈ ఊరికి 6 కి.మీ. దూరంలోని బొమ్మవరం రెవెన్యూ గ్రామం పరిధిలోకి వస్తుంది. వైద్యం, బ్యాంకింగ్ సదుపాయాలు లేవు. పాడి పంటలు పండించినప్పటికి నిత్యవసరాలు, వైద్య అవసరాల కోసం సమీప పట్టణ, నగరాలు అయిన రైల్వే కోడూరు, తిరుపతికి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ఈ ఊరి పిన్ కోడ్ 516108.[1]

సంస్కృతి

[మార్చు]

అధికులు హిందూ మతాన్ని పాటిస్తారు. ఊరిలో పురాతన రామాలయం , శివాలయం ఉన్నాయి. ఈ శివాలయం బొమ్మవరంలోని శివాలయంతో పాటుగా అతి పురాతనమైనదని కాకతీయుల మునుపు కాలంకి చెందినదని అంచనా. మూడు నాలుగు తరాల మునుపు (అంటే 1950కి మునుపు) ఇక్కడ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగేవి. శిధిలావస్థకు చేరిన శివాలయాన్ని మళ్ళీ గ్రామస్తులందరూ సొంత నిధులతో చందాలు వేసుకుని పునర్నిర్మించారు. వినాయక చవితికి ఊరి యువత గ్రామ ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు ఏటా నిర్వహిస్తున్నారు. శ్రీరాముల జయంత్యుత్సవాలు, శివుడికి మెరమణ ఏటా జరుగుతుంది. సంక్రాంతి, దీపావళి, దసరా, శివరాత్రి, శ్రీరామనవమి బాగా జరుపుకుంటారు. ఏటా భక్తులు అయ్యప్ప మాలలు కూడా వేసుకుంటారు.

మంగళంపల్లెలోని రాముల వారి ఆలయం

ఎల్లమ్మ గ్రామ దేవత. ఊరిలో పురాతన ఎల్లమ్మ వేపమాను ఉంది.

గ్రామ పంచాయితీ

[మార్చు]

ఊరి మధ్యలో ఉన్న పాత పంచాయితీ భవనం, ప్రాథమిక పాఠశాల భవనం నిరుపయోగంగా మారడంతో ఊరికి ఉత్తరాన ప్రభుత్వ సహకారంతో కొత్త పంచాయితీ భవనం నిర్మించారు.

వాతావరణం

[మార్చు]

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు మార్చి నుండి మొదలై బాగా ఎక్కువగా ఉంటాయి. 44-45°c కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. బాగా ఉక్క కూడా ఉంటుంది. వర్షాలు తక్కువే. జూన్ నెల మధ్య నుండి గాలులు వీయడంతో వాతావరణంలో కొంచెం వేడి, ఉక్కపోత తగ్గుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని ఎవరింట్లో వారు ఇంకుడు గుంతల్లో లేదా వీధులలోకో వదులుతున్నారు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను పశు వ్యర్థాలతో కలిపి ఎవరి నేలలో వారు వేసుకుంటారు. తర్వాత పొలాలకి వేస్తారు.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల, వ్యవసాయ అవసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. కడియాలపల్లి లోని విద్యుత్ సబ్ స్టేషన్ నుండి సరఫరా జరుగుతుంది.

సమాచార, వినోద సౌకర్యాలు

[మార్చు]

ఎక్కువమంది డిష్ టివి, రేడియో వంటి ఉపగ్రహ లేదా శాటిలైట్ కనెక్షన్లు వాడుకుంటున్నారు. జియో 4జి, ఐడియా 4జి, ఎయిర్టెల్ , బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది ఫీచర్ ఫోన్ ఇంకా స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారు. వార్తా పత్రికల సౌకర్యం లేదు. బోటిమీదిపల్లెలోని సబ్ పోస్టాఫీసు నుండి ఈ ఊరికి కూడా సేవలు అందుతున్నాయి.

తాగునీరు సౌకర్యం

[మార్చు]

మంగళంపల్లెలో అందరికీ ఇంటింటికీ ఊరి బోరు నీరు సౌకర్యం ఉంది. కాని నీటి ఎద్దడి వచ్చినప్పుడు ఆ బోరు కూడా ఎండిపోతుంది. కానీ స్వచ్చమైన మినరల్ వాటర్ లేదా శుద్ది చేసిన తాగునీటి పంపిణీ మాత్రం లేదు. వీలున్న వారు సొంత వాహనాల్లో పొరుగు ఊర్లకు పోయి తెచ్చుకుంటున్నారు. లేని వారు ఆ నీటినే వాడుకుంటున్నారు.

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఊరికి పశ్చిమాన గోవిందమ్మ కుంట ఉంది. వరదలు వచ్చినప్పుడు దీనికి నీరు వచ్చి బొమ్మవరం చెరువుకు నీరు ప్రవహిస్తుంది. ఈ చెరువు వర్షాధారిత చెరువు. ఊర్లోని బోరు బావులన్నీ ఈ చెరువు నిండినప్పుడు బాగా పనిచేస్తాయి. లేకపోతే నెమ్మదిగా ఎండి పోతాయి. చెరువు కింద పొలాలలో చెరువు నిండినప్పుడు వరి పండిస్తారు. బోరు బావులలో వర్షాలు లేనప్పుడు బోర్లు ఎండిపోవడం వల్ల తాగునీటికి , వ్యవసాయానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు అందరూ ప్రభుత్వ సహకారంతో బిందు సేద్యం చేస్తున్నారు.

పాడిపంటలు, వృత్తులు, ఆర్థికం

[మార్చు]

ఊరిలో అధికులు కుల వృత్తులపై ఇందులో అధికంగా వ్యవసాయంపై ఆధారితులు, బొప్పాయి, అరటి లాంటి ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తారు. బొప్పాయి, అరటి, మామిడి, వేరు శనగ, వరి, చెరకు పండిస్తారు. ప్రస్తుతం అధికంగా బొప్పాయి, అరటి, మామిడి మాత్రమే సాగు చేస్తున్నారు. ఇంకొందరు జీవనాధారం కోసం కువైట్, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలలోనూ ఉన్నారు. యువత ఎక్కువగా విదేశాలలోనూ, పొరుగు రాష్ట్రాలలోను ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, తిరుపతి, చెన్నై లాంటి నగరాల్లోనూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. నిరుద్యోగులు, అల్ప ఆదాయం కలిగిన వారూ ఉన్నారు. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ప్రైవేట్ ట్రాక్టర్లున్నాయి. కొందరు ఎద్దు మడకలు దుక్కి దున్నడానికి వాడుతారు.

2015లో చివరగా బాగా వర్షాలు పడ్డాయి. తర్వాత పడలేదు. దీనితో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. బోరు బావులు వేయగలిగే వారు వేసుకున్నారు. బోరు బావులు వేయలేని వారు ప్రస్తుతం నీటి ఎద్దడితో 2018/2019 నుండి వ్యవసాయం మానేసి వర్షాల కోసం చూస్తున్నారు.

విద్య

[మార్చు]

ఊరిలో మండల పరిషద్ ప్రాథమిక పాఠశాల ఉండేది. ఇప్పుడు మూతపడింది. ఇప్పుడు విద్యార్థులు యల్లాయపల్లె లోని చిన్మయ హరిహర విద్యాలయ లోను, ముక్కవారిపల్లె పాఠశాలలోనూ, చిట్వేలి దగ్గర ఉన్న ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్నారు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్య కొరకు రైల్వే కోడూరు లోని ప్రైవేట్ కళాశాలల్లో చేరుతారు.

ప్రజా రవాణా

[మార్చు]

ఊరిని తారు రోడ్డు మార్గం ఇతర ఊర్లతో కలుపుతూ ఉంది. ఊరిలో సిమెంట్ రోడ్డు ఉంది. జాతీయ రహదారి 716 మీద ఉన్న మంగంపేట బైపాస్(చెన్నకేశవ స్వామి వారి దేవస్థానము) లేదా నీరుమ్పల్లె,కొర్లకుంట నుండి ఏదైనా వాహనంలో ఐదు నుండి పది నిమిషాల్లో చేరుకోవచ్చు. రైల్వే కోడూరు, చిట్వేలి నుండి ఈ గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఉదయం, సాయంత్రం ఒకటి రెండు సర్వీసులు మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి NH716 4-5 కిమీ దూరం లోనూ, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రైల్వే కోడూరు, చిట్వేలిల నుండి 15 కిమీ దూరం ఉంటుంది.

ఆటలు, ఆట స్థలాలు

[మార్చు]

ఊరి యువత క్రికెట్ ఎక్కువగా ఆడుతారు. ప్రత్యేకంగా ఆట స్థలము లేదు. ఊరి చెరువులోనో, లేదా ఖాళీ జాగా ఎక్కడ ఉంటే అక్కడ వీలు కుదిరినప్పుడు, కలుసుకున్నప్పుడు ఆడుతారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]