మాచర్ల
మాచర్ల | |
---|---|
Coordinates: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
స్థాపన | 2వ శతాబ్దం |
విలీనం చేయబడింది (పట్టణం) | 1983 |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | మాచర్ల పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 13.48 కి.మీ2 (5.20 చ. మై) |
Elevation | 136 మీ (446 అ.) |
జనాభా | |
• Total | 57,290 |
• జనసాంద్రత | 4,300/కి.మీ2 (11,000/చ. మై.) |
భాష | |
• ఆధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 522426 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 08642 |
మాచర్ల, పల్నాడు జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ పట్టణంలో హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయం ఉంది.పురాతన కాలంలో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు.[3] ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడికి దూరప్రాంతాాల నుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయం 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయం ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభం చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]సా.శ. 1182 లో పలనాటి యుద్ధంగా పేరొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు తీరాంధ్రలోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు, వాడుకలో మాచర్లగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల కథనం. తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచర్ల రాజధానిగా పాలింపజేశాడు.
భౌగోళికం
[మార్చు]ఇది సమీప నగరమైన గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు వాయవ్య దిశలో 80 కి.మీ దూరంలో వుంది.
పరిపాలన
[మార్చు]మేజర్ పంచాయతీ స్థాయినుండి పురపాలకసంఘంగా 1987లో రూపాంతరం చెందింది. పట్టణంలో 29 వార్డులున్నాయి. మాచర్ల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జాతీయ రహదారి 565 పై పట్టణం వుంది. గుంటూరు-మాచర్ల రైలు మార్గంలో ఈ పట్టణం వుంది.
విద్యారంగం
[మార్చు]మాచర్ల, చుట్టు పక్కల గల గ్రామాలకు చెప్పుకోదగ్గ విద్యాకేంద్రం. ప్రాథమికి విద్య నుండి ఇంజనీరింగ్ విద్య వరకూ చదువుకునే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన విద్యా సంస్థలు:
- శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల (డిగ్రీ కళాశాల)
- న్యూటన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ.
- శ్రీ త్యాగరాజ గాత్ర సంగీత శిక్షణాలయం
వ్యయసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]దేవళ్ళమ్మ చెరువు:- పట్టణంలోని 400 సంవత్సరాల(2020 నాటికి) చరిత్ర కలిగిన ఈ చెరువు, 58 ఎకరాలలో విస్తరించిఉంది. 1950 వరకు ఈ చెరువు కేవలం మంచినీటి చెరువుగానే ఉపయోగపడింది సాగర్ కుడి కాలువలు నిర్మాణం జరుగక ముందు, ఈ చెరువు పల్నాడులోనే ఒక పెద్ద త్రాగునీటి చెరువుగా గుర్తింపు పొందింది. సాగర్ కాలువ వచ్చిన తరువాత నిరాదరణకు గురై, ప్రస్తుతం ఆక్రమణల పాలై, క్రమేణా కుంచించుకు పోయింది.
ప్రధాన ఉత్పత్తులు
[మార్చు]ప్రత్తి, మిరప, వరి ప్రధాన వాణిజ్యపంటలు. నాణ్యమైన నాపరాయికి ఈ ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ధి. ఇక్కడి నుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- నాగార్జునసాగర్: ఇక్కడకు 25 కి.మీ. దూరంలో ఉంది.
- ఎత్తిపోతల జలపాతం: ఇక్కడకు 16 కి.మీ. దూరంలో, తాళ్ళపల్లె గ్రామం వద్ద ఉంది.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం
[మార్చు]చరిత్ర ప్రసిద్ధిచెందిన శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం ఉన్న ప్రదేశం. చంద్రవంక నది తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంంది.ఈ ఆలయంలోని కృష్ణుడు భగవానుని విగ్రహాన్ని పలనాటి నాయుడే ప్రతిష్ఠించాడు. గర్భగుడియొక్క స్తంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున వీరభద్రస్వామి, భద్రకాళీ విగ్రహాలు, శనీశ్వరుడు విగ్రహాలు ఉన్నాయి. వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
శ్రీ వీరభధ్రస్వామి ఆలయం
[మార్చు]ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కన ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద దాగి ఉంది.
శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం
[మార్చు]మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్నది.
ఓటిగుళ్ళు
[మార్చు]పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన పలనాటి చరిత్ర పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు.
ఇతర విశేషాలు
[మార్చు]- రామా టాకీసు వీధి: ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ, ఆసుపత్రులూ,మందులషాపులూ, సినిమాహలు వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది.
- కె.సి.పి.సిమెంటు ఫాక్టరీ:1958 లో స్థాపించబడి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా చేసింది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలోనే అత్యధికంగా సిమెంటు ఉత్పత్తిచేసే కర్మాగారాల్లో ఒకటిగావుంది.
- మాచర్లకు దగ్గరలో బ్రహ్మనాయుడు చెరువు ఉంది.
- శ్రీ వాసవీ వృద్ధాశ్రమం.
- స్వామి వివేకానంద అనాథ శరణాలయం.
ప్రముఖులు
[మార్చు]- బ్రహ్మనాయుడు, దిఅమరావతివాయిస్ దినపత్రిక ఎడిటర్.
మాచర్ల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యక్తి. Skbr కళాశాలలో ఆర్ట్స్ గ్రూపులో చదివి,జర్నలిజంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.న్యాయవిద్య పూర్తి చేశారు.9848343195
- షేక్ చిన లాలుసాహెబ్, ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
చిత్రమాలిక
[మార్చు]-
చెన్నకేశవస్వామి గుడి ముందటి దృశ్యం
-
చెన్నకేశవ స్వామి ఎత్తైన రథం
-
చెన్నకేశవ స్వామి ఎదురుగా ఉన్న ఎత్తైన ఏకశిలా బురుజు
-
మాచర్ల చెన్నకేశవ స్వామి గుడి
-
మాచెర్లలలోని పురాతన రామప్పగుడి
-
మాచర్ల చెన్నకేశవాలయం
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 46. Retrieved 18 January 2015.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
- ↑ The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39 [1]