వాడుకరి:Muralikrishna m

వికీపీడియా నుండి
(వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

2022 డిసెంబరు 10న ఇరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన 'తెవికీ' కి శుభాకాంక్షలతో..

భావితరాలకు వెలుగు - తెలుగు వికీపీడియా[మార్చు]

ఒక పదం అర్ధం బోధపడాలన్నా, ఓ పల్లె విశేషం తెలుసుకోవాలన్నా, మరో వ్యక్తి గొప్పదనం అవగతమవ్వాలన్నా మనకు అందుబాటులో ఉన్నది తెలుగు వికీపీడియా (తెవికీ).

ఆన్‌లైన్‌ విజ్ఞాన సర్వస్వంగా పేరొందిన  వికీపీడియా ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. ఈ సదుపాయం కల్పించిన వికీమీడియా సంస్థ లాభాపేక్ష రహిత వికీపీడియా ఫౌండేషన్‌కు అనుబంధంగా పనిచేస్తుంది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ లచే పురుడుపోసుకుంది. ప్రస్తుతం 328 పైచిలుకు ప్రపంచభాషల్లో సేవలందిస్తున్న వికీపీడియా 2003 డిసెంబరు 10న తేనెలొలుకు తేట తెలుగులో వికీపీడియా ఆవిర్భవించింది. అంటే ఇప్పుడు పందొమ్మిదేళ్లు పూర్తిచేసుకుని ఇరవయ్యో వసంతంలోకి తెవికీ అడుగుపెడుతోంది. వికీపీడియా అనేది అంతర్జాల ఆధారిత విషయభాండాగారం. ప్రపంచ భాషల్లో విజ్ఞానాన్ని పంచుతున్న స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వం. ఇప్పటికే ఎందరో ఔత్సాహికులు స్వచ్ఛందంగా రూపొందించిన 80000 వరకు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. దేశవిదేశాల్లో స్థిరపడిన వివిధ రంగాల తెలుగువారు ఉత్సాహంగా తమ విలువైన సమయాన్ని దీనికై కేటాయిస్తారు. వివిధ అంశాలపై ఆకట్టుకునేలా వ్యాసాలు రాస్తారు. వికీపీడియాలో ఏ వ్యాసమైనా తగిన విశ్వసనీయ ఆధారాలు జతచేసి ఉంటాయి. నిరాధారమైన సమాచారానికి ఇందులో చోటులేదు. అందుకే ఇక్కడున్న సమాచారాన్ని సాధికారికమైనదిగా అందరూ భావిస్తారు. ఈ విజ్ఞాన సర్వస్వాన్ని ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే తమకు తెలిసిన సమాచారాన్ని ఇక్కడి వ్యాసాలకు జోడించవచ్చు. అవసరమైతే మార్పులు, చేర్పులు కూడా చేయవచ్చు. ప్రతినెలా 15 లక్షల మంది తెలుగువారు దాదాపు 65 లక్షలకు పైచిలుకు పేజీలు వీక్షిస్తారని ఒక అంచనా. అలాగే సుమారు వెయ్యిమంది ఔత్సాహికులు ప్రతిఏటా లక్షన్నరకు పైగా వ్యాసాలను ఎడిట్ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంతటి విలువైన సమాచారం మరేఇతర వెబ్ పేజీల్లోనూ ఒకేచోట లభ్యంకాదు. ఇంతటి విలువైన విజ్ఞాన సర్వస్వాన్ని మరింత మెరుగులు దిద్దుతూ ప్రపంచంలో తెలుగువారెక్కడున్నా వారందరికీ చేరువచేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఔత్సాహికులు, నిపుణులు, జర్నలిస్టులు, భాషాభిమానులకు తెలుగు వికీని ఎలా ఉపయోగించుకోవాలి? సమాచారం సేకరణ, ఉన్న సమాచారంలో లోపాలు సరిదిద్దడం వంటి అంశాలపై తరచూ కార్యశాలలు, వ్యక్తిగత స్థాయి శిక్షణలు నిర్వహిస్తూనే ఉంటారు. కాలానుగుణంగా వికీపీడియాలో అనేక మార్పులతో పాటు, సాంకేతికాభివృద్ధి కారణంగా ఆధునిక స్మార్ట్ ఫోన్లకు సైతం తెలుగు వికీపీడియా అందుబాటులో ఉంది.

ఎవరైనా సవరించే అవకాశమున్న వికీపీడియాను తరచూ వివాదాలు చుట్టుముట్టుతూనే ఉంటాయి. అయితే వికీపీడియా నిర్వాహకుల బృందం ఆ తప్పులను త్వరగా సరిదిద్దుతుంది. వికీని నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తారుమారు చేయడం ద్వారా వ్యాసాలను సవరించినట్లయితే తక్షణమే నవీకరిస్తారు. వికీపీడియా విధానాల గురించి సవివరంగా తెలిసిన వారిని నిర్వాహకులుగా వికీపీడియా సమాజం ఎన్నుకుంటుంది.

విక్షనరి, వికికోట్, వికీబుక్స్, వికిసోర్స్, వికీమీడియాకామన్స్, వికీడేటా.. లాంటి మరెన్నో సేవలు వికీపీడియా ద్వారా అందుబాటులో ఉన్నాయి.