కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 10 మే 2023న శాసనసభ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 2018లో జరగగా దాని పదవీకాలం 24 మే 2023న ముగిసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2023 మార్చి 29న సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించాడు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న పోలింగ్ జరగగా, మే 13న ఫలితాలు వెల్లడించారు.[1]
కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా, 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి 9లక్షల 17వేల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు.
కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 2,165 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 224 స్థానాల్లో, కాంగ్రెస్ 223 స్థానాల్లో, జేడీఎస్ నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది, బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు, సీపీఐ నుంచి నలుగురు, స్వతంత్రులు 918 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 73.19% శాతం పోలింగ్ నమోదైంది.[2]
కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. హంగ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంఖ్యాబలం లేకపోవడంతో 37 సీట్లు గెలిచిన జేడీఎస్ 80 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అనంతర పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ నుండి కుమార స్వామి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు. అయితే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 2019లో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‍కు 70, జేడీఎస్‍కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించిన బీజేపీ అధిష్టానం, బస్వరాజు బొమ్మైను ముఖ్యమంత్రిగా చేసింది.
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అన్యాయకరమైన, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రతీ గ్రామ పంచాయతీలో..భారత్ జోడో సోషల్ హార్మనీ కమిటీని ఏర్పాటు చేస్తామంది.
2006 నుంచి సర్వీసుల్లో చేరిన పెన్షన్ అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు OPSని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
PWD, RDPR, నీటి పారుదల, UD, విద్యుత్ రంగంలో అవినీతిని అంతం చేసేందుకు.. ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించింది.
నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5 వేల ప్రత్యేక అలవెన్స్ ఇస్తామని తెలిపింది.
భజరంగ్ దళ్, PFI తదితర సంస్థలు.. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆందోళనలు చేస్తే.. అలాంటి సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. అవసరమైతే ఆ సంస్థల్ని పూర్తిగా బ్యాన్ చేసేందుకు చట్టపరంగా ముందుకెళ్తామని హామీ ఇచ్చింది.
మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తామన్న కాంగ్రెస్..రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంచుతామని తెలిపింది.
'గృహజ్యోతి' పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
'గృహలక్షి పథకం' కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం
'అన్న భాగ్య' పథకం కింద బీపీఎల్ హౌస్‌హోల్డ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం సరఫరా
'యువ నిధి' పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1.500 చొప్పున నెలసరి భృతి
'ఉచిత ప్రయాణం' పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం[20]
కర్ణాటక లోని మొత్తం 224 నియోజకవర్గాలకు గానూ 136 స్థానాల్లో కాంగ్రెస్[21], బీజేపీ 65 స్థానాల్లో, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.[22] కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓటింగ్ పాడగా 2018 ఎన్నికల్లో కంటే 5 శాతం ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ సాధించింది. బీజేపీకి 36 శాతం ఓటింగ్ వచ్చింది. 31 స్థానల్లో డిపాజిట్లు కోల్పోయింది. కర్నాటకలో 1990 తర్వాత ఒకే పార్టీకి 135కు పైగా సీట్లు సాధించడం ఇదే తొలిసారి. 2018 ఎన్నికలతో పోల్చితే బీజేపీ 40 సీట్లు కోల్పోయింది. 139 స్థానాల్లో జేడీఎస్ డిపాజిట్లు కోల్పోయింది.