తుని
తుని | |||
---|---|---|---|
Nickname: Mango City | |||
Coordinates: 17°21′N 82°33′E / 17.35°N 82.55°E | |||
Country | India | ||
రాష్ట్రం | Andhra Pradesh | ||
Region | Coastal Andhra | ||
జిల్లా | Kakinada | ||
Government | |||
• MLA | Dadisetti Raja(YSRCP) | ||
విస్తీర్ణం | |||
• Total | 63.5 కి.మీ2 (24.5 చ. మై) | ||
Elevation | 140 మీ (460 అ.) | ||
జనాభా (2021)[2] | |||
• Total | 2,54,448 | ||
• జనసాంద్రత | 4,000/కి.మీ2 (10,000/చ. మై.) | ||
భాషలు | |||
• అధికార | Telugu | ||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | ||
పిన్ కోడ్ | 533401, 533402, 533403, 533405, 533406 | ||
Telephone code | 91–08854 | ||
Vehicle Registration | AP05 (Former) AP39 (from 30 January 2019)[3] |
తుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లాకు చెందిన నగరం, ఇది కాకినాడ జిల్లాలో కాకినాడ తర్వాత రెండో పెద్ద నగరం. ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 15వ నగరం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఇక్కడే చదువుకున్నారు. తుని చుట్టు ప్రక్కల ఉన్న 200+ గ్రామాలకు వాణిజ్య, వ్యాపార కేంద్రంగా ఉంది. తుని మార్కెట్ నుండి సుమారు 250 రకాల మామిడికాయలు దేశంలో ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతాయి. తుని తమలపాకులకు పెట్టింది పేరు. ఇవి దేశంలో ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతాయి. తుని రైల్వే స్టేషన్ సుమారు 200+ గ్రామాలకు ప్రధాన రైల్వే స్టేషనుగా ఉంది. దశాబ్దాల కాలం నుండి విశాఖపట్నం నుంచి తునికి లోకల్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటే, ఇక్కడ ఎంత రద్దీ ఉంటుందో అర్థమవుతుంది.
చరిత్ర
[మార్చు]తునిని పాలించిన రాజులు వత్సవాయి వంశానికి చెందిన క్షత్రియులు. ప్రసిద్ధ కవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కాశీ యాత్ర చేసుకుని తిరిగి వస్తూ 1890 ప్రాంతాలలో తునిలోని సత్రంలో ఆగినట్లు చెప్పుకున్నారు. ఈ సత్రము పెద్ద బజారు నుండి రైలు స్టేషనుకు వెళ్ళే దారిలో, జి. ఎన్. టి. రోడ్డు, మెయిన్ రోడ్డు కలుసుకున్న మొగలో ఉండేది.
ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో తుని నగరం ప్రస్తావన ఉంది. ఇది పెద్దబస్తీగా పేర్కొన్నాడు. రాజమహేంద్రవరానికి కుంఫిణీ వారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తం లేకపోవుచున్నదని, దాని మీద ప్రయాణించానని తెలిపాడు.
నీటి వనరులు
[మార్చు]తునిలో బాడవ తోటలో రాజు గారి కోటకి ఆనుకుని ఉన్న పాత కాలపు జలకాలాడే కొలను, పోలీసు నూతికి ఎదురుగా ఉన్న చిన్న కోనేరు, ఊరు బైట, కొత్తపేట నుండి సూరవరం వెళ్ళే దారిలో ఉన్న లక్షిందేవి చెరువు వుండేవి. కాలగమనంలో పట్టణీకరణ కారణంగా అవి ఉనికిని కోల్పోయ, జనావాస ప్రాంతాలుగా మారాయి.
నగరానికి సంబంధించిన ఒక నానుడి
[మార్చు]పూర్వకాలంలో ఒక నాడు జ్యేష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీదేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.
ఇతర విశేషాలు
[మార్చు]రైలు ప్రయాణం తొలికాలంలో, భోజనాలకి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు.
భౌగోళికం
[మార్చు]తుని అక్షాంశ, రేఖాంశాలు: 17°21′N 82°33′E / 17.35°N 82.55°E.[4] సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 14 మీటరులు (45 అడుగులు). తాండవ నదికి కుడిపక్కన తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ నుండి ఉత్తర దిశలో 64 కి.మీ. దూరంలో ఉంది. ఈ పట్టణం విశాఖపట్నంకి, రాజమండ్రికి నడిమధ్యలో ఉంది.
జనగణన గణాంకాలు
[మార్చు]2021 జనగణన ప్రకారం, తుని జనాభా 2,54,448
పరిపాలన
[మార్చు]తుని పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ పట్టణం జాతీయ రహదారి-16 మీద, హౌరా-చెన్నై రైలు మార్గం మీద ఉంది.
రహదారులు
[మార్చు]తుని రాష్ట్ర, భారతదేశం యొక్క మిగిలిన ప్రాంతాలతో రాష్ట్ర, జాతీయ రహదారుల నెట్వర్క్తో బాగా అనుసంధానించబడి ఉంది. ఎన్ హెచ్ 16 నగరం గుండా వెళుతుంది. బంగారు చతుర్భుజి రహదారి నెట్వర్క్లో భాగమైన జాతీయ రహదారి 16, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తుని బస్ స్టేషన్ నుండి బస్సు సర్వీసులను నడుపుతుంది. తుని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. రాజమండ్రి విమానాశ్రయం తునికి పశ్చిమ నైరుతి దిశగా 95 కిలోమీటర్ల (59 మైళ్ళు) దూరంలో ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం తునికి ఈశాన్యంగా దాదాపు అదే దూరంలో ఉంది. తుని రైల్వే స్టేషను
రైల్వేలు
[మార్చు]తుని రైల్వే స్టేషనును ఎ కేటగిరీ స్టేషనుగా వర్గీకరించారు. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఇది దక్షిణ కోస్తా రైల్వే జోన్ (గతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్) లోని విజయవాడ రైల్వే డివిజను క్రింద నిర్వహించబడుతుంది. [2]
విద్యా సౌకర్యాలు
[మార్చు]- రాజా ప్రభుత్వ పాఠశాల
- రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల
- గవర్నమెంట్ మహిళా కళాశాల
- శ్రీ ప్రకాష్ విద్యానికేతన్
- సిద్ధార్థ జూనియర్ కాలేజ్
- గవర్నమెంట్ డిగ్రీ కళాశాల
- శ్రీ ప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల
- ఆదిత్య డిగ్రీ కళాశాల
- భాష్యం స్కూల్
- ఆదిత్య జూనియర్ కళాశాల
- నారాయణ జూనియర్ కళాశాల
- గవ్నమెంట్ మహిళా జూనియర్ కళాశాల
- శ్రీ ప్రకాష్ పాలిటెక్నిక్ కళాశాల
- శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
ప్రధాన ఉత్పత్తులు
[మార్చు]మామిడి పళ్ళు, బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- తలుపులమ్మ లోవ: తునికి 5 కి.మీ. దూరంలో, లోవకొత్తూరు దగ్గర ఉన్నది చాల సుందరమయిన పర్యాటక ప్రాంతం. తలుపులమ్మ తల్లి ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మలుపులు ఎత్తు పల్లాలు రాళ్ళు రప్పల మధ్య నడక దారిలో చాలా దూరం ప్రయాణము చేయగా వచ్చే లోయ ఇది. ఈ లోయలో ఒక ఝరీపాతం ఉంది. ఆ రోజులలో ఈ ఝరీపాతం లోని నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లా తియ్యగా ఉండేవి. ఈ సెలయేరుకి ఇటు అటు ఎన్నో రకాల జాతుల మొక్కలు ఉన్నాయి.
- కుమ్మరలోవ: బౌద్ధ క్షేత్ర అవశేషాలున్నాయి.
- తునికి 18 కి.మీ. దూరంలో, తుని నుండి రాజమండ్రి వెళ్ళే మార్గంలో ఉన్న అన్నవరం బహుళ ప్రజాదరణలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండ మీద సత్యనారాయణస్వామి ఆలయం ఉంది.
ఇతర విశేషాలు
[మార్చు]- ఆదివారపు సంత
తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి చింతపండు, అడ్డాకులు, కుంకుడు కాయలు, శీకాయ, కొండచీపుళ్ళు మొదలైన వాటితో పాటు చెరకు బెల్లం, ఖద్దరు, తమలపాకులు, మామిడి పళ్ళు వస్తాయి. ఇలా వచ్చిన సరుకులు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి. ఈ సంత సత్రవుకు ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది.
- తునిలో మామిడి పండ్లు
తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు.
- ఏనుగు కొండ
బోడి మెట్ట వెనకాతల కొంచెం ఎత్తయిన కొండ ఒకటి ఉంది. అదే ఏనుగు కొండ. ఈ కొండని సగం పైకి ఎక్కితే చాలు ఏడు మైళ్ళ దూరంలో, పెంటకోట దగ్గర ఉన్న సముద్రం నీలంపాటి చారలా కనిపింస్తుంది. పెంటకోటలో సముద్రపుటొడ్డున ఒక విరిగిపోయిన లైట్‌హౌస్ ఉండేది. ఒకానొకప్పుడు పెంటకోటకి పడవల రాక పోకలు ఎక్కువగా జరుగుతుండేవి.తరువాతి రోజులలో మెల్లమెల్లగా వ్యాపారము క్షీణించిపోయింది.
- తుని కిళ్లీ
భోజనం తర్వాత కిళ్ళీకి కూడా తుని ప్రసిద్ధమే. తుని దగ్గర లకారసామి కొండ దిగువన రాంభద్రపురం పక్కన సత్యవరం అనే పల్లెటూరు ఉంది. ఆ ఊరు మట్టిలో ఉన్న అద్భుతం వలననో ఏమిటో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి మహాద్బుతంగా ఉంటుందంటారు. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉంటే తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోతాయి.
- ఊక మేడ
తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అంటారు.
- రీడింగు రూం
తుని పట్టణంలో స్టేషనుకి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూంకి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటి గాఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఈ గది పక్కగా చిన్న కొట్టులో ఒక రేడియో బయట అరుగు మీద ఉన్న లౌడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. రీడింగ్ రూము బయట అరుగు మీద చదరంగం ఆడేవారు.
నీలిమందు కర్మాగారం
[మార్చు]లక్షిందేవి చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒక్కొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని అంచనా ఒక అంచనా. ఈ కుండీలు ఒక నీలిమందు కర్మాగారపు అవశేషాలు. నీలి మొక్క (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేస్తారు. ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన దేశంలో ఉండేదో తెలియదు కాని, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. కనుక ఈ కుండీలు సా.శ. 1800 ప్రాంతాలలో ఎప్పుడో కట్టి ఉంటారు. కాని 1880 లో జర్మనీలో ఏడాల్ఫ్ బేయర్ అనే ఆసామీ నీలిమందుని కృత్రిమంగా – అంటే నీలిమొక్కల ప్రమేయం లేకుండా – చెయ్యటం కనిపెట్టేడు. అది సంధాన రసాయనానికి స్వర్ణయుగం అయితే, నీలిమందు పండించి పొట్ట పోసుకునే పేద రైతులకి గడ్డు యుగం అయింది. ఏడాల్ఫ్ బేయర్ వలన భారతదేశంలో నీలి మొక్కల గిరాకీ అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత లక్షిందేవి చెరువు దగ్గర కర్మాగారం ఖాళీ అయిపోయింది. తర్వాత వాడుక లేక శిథిలమై కూలిపోయింది. నీలి మొక్కలు తుని నుండి తలుపులమ్మ లోవకి వెళ్ళే దారి పొడుక్కీ పుంత పక్కని పెరిగేవి. ఈ తలుపులమ్మ లోవలో దొరికినన్ని మొక్కల (బొటానికల్) నమూనాలు ఆంధ్రదేశంలో మరెక్కడా దొరకవని అనేవారు. అందుకనే విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, కాకినాడ పి. ఆర్. కళాశాల నుండి బోటని విద్యార్థులు తరచు ‘ఫీల్డ్ ట్రిప్పు’ కని ఇక్కడకి వచ్చేవారు.
ప్రముఖులు
[మార్చు]- అల్లూరి సీతారామరాజు :1911 ప్రాంతాలలో, తునిలో తన మామయ్య గారి ఇంట ఉండి తుని రాజా బహదూర్ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుకొన్నాడు. ఈయన తుని ప్రక్కన వున్న సీతమ్మ వారి కొండ మీద తపస్సు చేసాడు. 1929 లో సీతారామరాజు దండు అడ్డతీగెల, రంపచోడవరం, చింతపల్లి, అన్నవరం, తుని పోలీసు స్టేషనుల పై దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది.
- కోలంక వెంకటరాజు: సుప్రసిద్ధ ఘట వాయిద్యకారుడు. తుని ప్రక్కనే గల పాయకరావుపేట లో పుట్టాడు. అతను ఘట వాయిద్యం కనిపెట్టేడని అంటారు.
- అవసరాల రామకృష్ణారావు
- వేమూరి వేంకటేశ్వరరావు
- గంజివరపు శ్రీనివాస్
ఇవీ చూడండి
[మార్చు]వనరులు, మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 28 January 2016.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 9 July 2014.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ "Falling Rain Genomics, Inc - Tuni". Archived from the original on 2008-12-06. Retrieved 2008-05-24.
వెలుపలి లింకులు
[మార్చు]- వేమూరి వేంకటేశ్వరరావు, "మాఊరంటే నాకిష్టం: తునిలో శాఖాచంక్రమణం", సుజనరంజని అంతర్జాల పత్రిక, సిలికాన్ ఆంధ్రా, 2005 ఫిబ్రవరి