Jump to content

తోలుబొమ్మలాట

వికీపీడియా నుండి
తోలుబొమ్మలు
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో చెక్క బొమ్మలాట కళాకారుల ప్రదర్శన
ఏషియన్-ఇండియా స్మారక సమ్మిట్ 2018 సందర్భంగా 2018 జనవరి 23న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ రామాయణ మహోత్సవంలో భాగంగా 12 మంది సభ్యులతో కూడిన మయన్మార్ రాయల్ పొంటావ్ రామాయణ బృందం ప్రదర్శించిన రామాయణ నృత్యరూపకంలోని పప్పెట్స్

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.

ఒక సామూహిక సంగీత, నాట్య ప్రదర్శన కళారూపమైన తోలుబొమ్మలాట చారిత్రక పరిణామాలు గమనిస్తే ఒకప్పుడు విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొంది ఉంటుందని చెప్పవచ్చు. నృత్య దశలో నుండి మానవుడు నాటక దశలోనికి ఎదిగే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని గుర్తించవచ్చు.

తోలుబొమ్మలు - ఆవిర్భావం

[మార్చు]

తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు. ఈ విధంగా తోలుబొమ్మలాట పుట్టిందని, ఈ ఆట పండితుల చేత మెరుగులు దిద్దుకున్నదని, చెప్పడానికి అమరకోశం లోని శ్లోకాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు.

ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. పాశ్చాత్యదేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తున్నది. పర్షియా, టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీ కి, అక్కడినుండి ఫ్రాన్స్ లోని వెర్సయిల్స్, పారిస్, నగరాలకు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు.

చైనీస్ షాడో థియేటర్ బొమ్మలు

భారతీయులలో ఏ యే ప్రదేశాలలో నిది కలదో తెలియదుకాని తెనుగువారిలోను, కర్ణాటకులలోను ఇది చాలా ప్రాచీనమునుండి వచ్చినట్టి యాట. సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల పెద్ద దివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు, తలలకు దారములు కట్టి మధ్య నొక దబ్బతో అ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు. రామయణకథకు గోన బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పాడుదురందురు. బొమ్మలను సూత్రములతో నాడించువా రగుటచేత అట్టి ప్రదర్శకుని "సూత్రధారుడు" అని యందురు. సంస్కృత నాటకములలో నాటకమును ప్రారంభించునప్పుడు 'సూత్రధారుడు' ప్రవేశించి ప్రదర్శింపనున్న నాటకమును గురించి కొన్ని మాటలు చెప్పిపోవును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుదివరకు సూత్రదారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే సూత్రధార పదము సరిపోవును. అట్లగుచో తోలుబొమ్మలను చూచి నాటకాలవారు సూత్రధార పదమును నాటక నాట్యవిధానమును సవరించుకొనిరా లేక నాటకాలను జూచి బొమ్మలాటగాండ్రు నేర్చుకొనిరా అనునది చర్చనీయాంశమగును.[1]

తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు.

భారతదేశంలో బొమ్మలాటలు

[మార్చు]
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో తోలు బొమ్మలాట కళాకారుల ప్రదర్శన

బొమ్మలాటలు భారతదేశంలో, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, [[తమిళ], పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి.[2] ఉత్తరదేశంలో కట్‌పుతలీ అనే కొయ్య బొమ్మలాటలూ,దక్షిణదేశంలో కీలుగుఱ్ఱపు బొమ్మలాటలూ, బొమ్మలాట్టం అనబడే కొయ్య బొమ్మలాటలూ ప్రచారంలో ఉన్నాయి. ఆంధ్ర దేశంలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలావరకు మరాఠా ప్రాఁతంనుండి వలస వచ్చినవారు. వీరిని కన్నడదేశంలో కిషథషిఖ్యాత జాతివారనీ, తమిళదేశంలో కిల్లెఖ్యాత వారని, ఆంధ్రప్రదేశ్లో బొమ్మలాటవారని, తోలుబొమ్మలాటవారనీ వ్యవహరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా వందల సంవత్సరాలనుండే తోలుబొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయని నాచన సోమన తదితర కవుల రచనలనుండి గ్రహించవచ్చును.

2డి యానిమేషన్ దిశగా మొదటి అడుగు బొమ్మాలటదే. చాయచిత్రం, నీడల్తో ఆకృతులు వంటివి బొమ్మలాటకు దారితీశాయి. భారతీయ జానపద ప్రదర్శన కళల్లో అతి ప్రాచీనమైన దృశ్య రూపకానికి చెందినది తోలుబొమ్మలాట. క్రీ.పూ 3 వ శతాబ్దం నాటికే తెలుగు దేశంలో తోలుబొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.

చరిత్రకారుల ప్రకారం తోలుబొమ్మలు నాగరికత అంత పురాతనమైనవి. క్రీ.పూ 2500 సం॥నకు వెనక్కి వెళ్తే, పురాతన నాగరికత అయిన హరప్పా, మొహంజోదారో కొన్ని వేల కిలోమీటర్ల వరకూ వ్యాపించినది, ఒక రకమైన పురావస్తు శాస్త్ర relics వెడదీయగల తల భాగమును ఒక తీగతో అతకగల చేయగల ఒక టెర్రకోట ఎద్దును కలిగి ఉంది. ఇది ఒక పరిమితమైన యానిమేషన్ ను సాధిస్తున్నది. పైకి క్రిందకు జారగల ఒక టెర్రకోట కోతి బొమ్మ కూడా దొరికినది, ఇది ఒక వాహన కదలికను సూచిస్తుంది.

క్రీ.పూ ౬వ శతాబ్దమునకే భారతదేశమునంది తోలుబొమ్మల ప్రదర్శనశాల (Shadow theater) గలదు. అప్పటినుండే భారతదేశము లోని వివిధ పల్లె ప్రాంతములనందు వినోదమును అందించింది. [3]

మహాభారతంలో తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. చీరమరుగున బొమ్మలనాడించు వారు అన్న పాల్కురికి సోమన చెప్పిన పద్యంలో తోలుబొమ్మలనే ప్రస్తావించారు. భగవద్గీతలో సత్త్వ, తమో, రజో గుణాలు మూడు దారాలని, అవి పరమాత్మునిచేత మానవ జీవన గమనంలో లాగబడుతుంటాయని చెప్పబడింది. మానవుడు బొమ్మ అయితే అతనికున్న సూత్రాలు ఈ మూడు గుణాలు. ఆడించేవాడు భగవంథుదు అన్న అర్థంలో ఉన్న ఈ భాగం నిజానికి తోలుబొమ్మలాటలకు సంబంధించిన ప్రస్తావన.

క్రీ.పూ 3 వ శతాబ్ధానికి చెందిన అశోకుని శిలా శాసనాల్లో జంబూ ద్వీపానికి బొమ్మలాట ప్రదర్శన రంగంగా ఆపాదించారు. పతంజలి మహాభష్యంలో తన కాలమ్నాటి వినోద సాధనాలను వివరిస్తూ మూడు ప్రధానమైన వహికలను వివరిస్తూ వాటిలో బొమ్మలాట ఒక ప్రధనమైన వాహిక అని వివరించారు.

తేరి గాథ అను బౌద్ధ గ్రంథంలో బొమ్మలాటకు సంబంధించిన ప్రస్తావన ఉంది. వాత్సాయనుని కామసూత్రాల్లో బొమ్మలలోని రకాలు, బొమ్మలాటల్లోని తేడాలు చర్చింపబడినాయి. కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదర్శన అవసరమని వాత్సాయనుని వివరణ. ప్రాచీన భారతదేశంలో బొమ్మలాట ఒక పవిత్రమైన కళగా భావించబడింది. ఇది ప్రాచీన కాలపు సినిమాగా భావించబడింది. జానపదుని కళత్మక సృష్టికి ఇది నిదర్శనం. వినొద సాధనంగానే కాకుండా ప్రభోదాత్మక సాధనంగా కూడా ఈ కళారూపాన్ని జానపదుడు మలచుకున్నాడు. తరువాతి కాలంలో వెలువడిన నాతకానికి బొమ్మలాట నాంది పలికింది. నాటకమే తరువాతి సినిమాకు మూలం. కాబట్టి పరోక్షంగా తొలుబొమ్మలాట సినిమాకు మూలమైంది.

కదలికలోని ఆనదం కనుక్కున్న మనిషి ఆలోచనలోనుండి పుట్టిందే బొమ్మలాట. స్థిరత్వం నుండి చలనం వైపుకు పయనించడంలో భాగంగా ప్రాచీన మానవుడు బొమ్మలాటను సృష్టించుకున్నాడు. కథ చెప్పడం మొదలైన తరువాత ఆ కథలోని పాత్రలు తెరమీద కనిపిస్తే, నటిస్తే చూడాలన్న జనపదుడి తపనలో నుండి బొమ్మలాట పుట్టింది. బొమ్మలతో ఆడుకోవడం అతి ప్రాచీన కళ. కొయ్యబొమ్మలాటలు, కట్టెబొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మలాటలు, బుట్టబొమ్మలాటలు, తోలుబొమ్మలాటలు అని బొమ్మలాటలు అనేకము ఉన్నాయి.

తోలుబొమ్మల తయారీ

[మార్చు]

తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక, లేడి లేదా దుప్పి, మేక ఈ 4 రకాల జంతువుల తోళ్ళను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోను, గ్రీసుదేశంలో ఒంటె చర్మంతోను తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చితోళ్ళను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండమీద లేదా చదునైన చాపమీద పరచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పల్చటి చర్మపుపొరను పదునైన కత్తి సహాయంతో తీసివేసి మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహాయంతో చతురస్రాకారపు చెక్కకు బిగించి ఆరవేస్తారు. ఈవిధంగా చేయడం వల్ల మిగిలిన కొద్దిపాటి నలకలు ఉంటే అవిపోతాయి. ఇన్ని దశల్లో శుభ్రపరచిన తోలు పలచనిపొరగా, పారదర్శకంగా తయారై దీపపుకాంతి ప్రసరించే విధంగా అవుతుంది.

జింక చర్మాలను దేవతలు, పౌరాణిక కథానాయకులలాంటి ముఖ్యమయిన పాత్రల బొమ్మలను తయారు చెయ్యడంలో ఉపయోగిస్తారు. లేడి చర్మం బాగా మన్నిక గలది గనుక దీనిని భీముడు, రావణుడు లాంటి యోధుల బొమ్మలను తయరు చెయ్యడానికి ఉపయోగిస్తారు. హాస్యపాత్రల వంటి మిగిలిన బొమ్మల కోసం సులభంగా దొరికే గొర్రె చర్మాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక్కొక్క బొమ్మ తయారు చెయ్యడానికి ఒక చర్మం సరిపోతుంది. కానీ రావణుడు వంటి కొన్ని బొమ్మలు తయారు చెయ్యడానికి ఎక్కువ చర్మం అవసరమవుతుంది. రావణుడి బొమ్మను తయారు చెయ్యడానికి కనీసం నాలుగు చర్మాలు అవసరమౌతాయి. శరీరం కోసం ఒక చర్మం, కాళ్ళ కోసం ఒక చర్మం, రెండు జతల చేతుల (ఒక్కొక్కటి ఐదు చేతులు) కోసం రెండు చర్మాలు. ఎంపికచేసుకున్న బొమ్మలకు రేఖాచిత్రాల ఆధరంగా ప్రకృతిసిద్దమైన కరక్కాయ, చింత గింజలపొడి, అన్నభేది మొదలైన రంగులచే తోలుబొమ్మలకు ఇరువైపుల రంగులు వేస్తారు. ప్రస్తుతం ఆధునికులు పారదర్శకమైన రంగులను ఉపయోగిస్త్తున్నారు.

రంగులతో సిద్దమైన తోలుబొమ్మలు తల, మొండెము కలసి ఒక భాగంగాను, చేయిని మూడు భాగాలుగాను, కాలును రెండు భాగాలుగాను తీర్చిదిద్ది అన్నింటిని ఒక దగ్గరకు చేర్చి సూత్రం (దారం) ద్వారా కలుపుతారు. అదేవిధంగా ఈ బొమ్మలను ఆడించడానికి వీలుగా బొమ్మకు నిలువుగా ఒక ఈత బద్దను పైనుండి క్రింద వరకు అమర్చి రెండుకాళ్ళ మధ్యభాగంలో పిడికెడు బద్దను వదులుతారు. ఈవిధంగా వదిలిన బద్దను పట్టుకుని ఆడిస్తారు.

తోలుబొమ్మలు తమకు తామే తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీకి జింక, దుప్పి, మేక, మేకపోతు, గొర్రె మొదలైన జంతువుల చర్మాలను వాడతారు. దేవతా విగ్రహాలను జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. కానీ ఇప్పుడు ఇవి దొరకనందున మేక చర్మాలను వాడుతున్నారు. మేకలు ఎక్కువగా ఉన్నవారు మేకలను దానంగా ఇస్తారు. స్వచ్ఛమైన మేక తోలును తెచ్చి కొంచెం వేడిగా కాగిన నీళ్ళలో సబ్బు కలిపి ఈ తోళ్ళను నీళ్ళలో ముంచుటారు. నాలుగైదు సార్లు ముంచిన తరువాత ఆ తోలును చదునైన బండ మీద బోర్లా పరచి చేతితో వెండ్రుకలు తీస్తారు. తరువాత నీటి తొట్టి వద్దకు గానీ, బోరింగు దగ్గరకు గాని తీసుకు వెళ్ళి తోలుకు రెండువైపులా సబ్బు పెట్టి కత్తితో నుజ్జంతా తీసివేస్తారు. దీనిని బక్కి పొర అంటారు. ఈ చర్మాని ఎండలో ఆరబెడతారు. మన్సంపొర, వెండ్రుకలు తీసివేసిన ఈ తోలు పారదర్శకంగా ఉంటుంది.

2018 ఆగస్టు 31న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జానపద జాతర (2018) ముగింపు వేడుకలో తోలుబొమ్మ జానపద కళారూప ప్రదర్శన

ఈ పారదర్శకత కలిగిన తోలుపై పెన్సిలుతో కావలసిన బొమ్మ గీసుకొని కత్తెరతోగానీ, గోరుగిల్లుడుతో గాని కత్తిరిస్తారు. తరువాత బొమ్మకు నగిషి పనులు చేస్తారు. హారాలు, పూలహారం, కిరీటం, వజ్ర వైడూర్యాది ఆభరణాలు సొగసుగా చేస్తారు. ఈ ఆకారాల్లోని బెజ్జాలు దీపపు కాంతికి ఆభరణాలుగా మెరుస్తాయి. తరువాత రంగులు వేస్తారు. తలకు, మీసాలకు నల్లరంగు, శరీరానికి ఎర్రరంగు వేస్తారు. తెలుపు రంగు వేయాల్సిన చోత రంగు వేయకుండా వదిలిపెడతారు. రంగులు వేసేవారిని రంగరాజులు అంటారు. ఇంటిలోని వారంతా రంగులు వేయడంలో ఆరితేరి ఉంటారు. ఈ పరిశోధకుడు వెళ్ళినపుదు 13 సంవత్సరాల అమ్మాయి బొమ్మల తయారీలో నిమగ్నమై ఉంది.

కాళ్ళు చేతులు వంటివి ప్రత్యేకంగా తయారుచేసి దారాలతో కీలు కడతారు. అభినయనంలో కదలికకు గాను ఈ కాళ్ళు చేతులు ప్రత్యేకంగా కడతారు. రెండు కాళ్ళ మధ్య పట్టుకోవడానికి అనువుగా పుల్లను చీల్చి రెండువైపులా రెండు చీలికలు వచ్చేట్లు కడతారు. కాళ్ళ మధ్య భాగంలో పుల్లను పట్టుకొని బొమ్మనాడిస్తారు. బొమ్మలు రెండు రకాలు. ఏకపటం, సూత్రం బొమ్మ. రెండు తోళ్ళు ఉన్నది ఏకపటం ( శరీరానికి ఒక తోలు, కాళ్ళు చేతులు కలిపి ఒక తోలు). సూత్రం బొమ్మకు మూడు తోళ్ళుంటాయి. బొమ్మల తయారీ తరువాత వాటిని పెద్ద వెదురు పెట్టెలో భద్రపరుస్తారు. ప్రదర్శన కోసం బొమ్మలే కాకుండా ఇంతిలో అందాన్నిచ్చే అనేకమైన అలంకరణ సామగ్రిని కూడా తయారు చేసి అమ్మడం వృత్తిగా మారింది. తొలుబొమ్మల తయారీలో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిమ్మలకుంట కళాకారులు ఈ పరిశోధకునికి వివరించారు. ఒకప్పుడు ఆదరణ ఉన్న ఈ కళ ఇప్పుడు ఆదరణ కోలుపోవడం వలన మేక చర్మాలు దానం చేసేవారు కరువయ్యారని, ఇప్పుడు మేకచర్మాలను తాము కొంటున్నామని, కొన్న తరువాత వాటిని తీసుకుని వచ్చేటప్పుడు రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీరు వివరించారు.

తోలుబొమ్మల ప్రదర్శన

[మార్చు]
తోలుబొమ్మల ప్రదర్శన

రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెర భూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డుతగలకుండా ఉంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు.

ఆటలు, పాటలు, మాటలు, మోతలు

[మార్చు]

ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. మైకులు వంటి సాధనాలు లేకుండా విశాలమైన మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వారి గొంతు స్థాయిని ఊహించుకొనవచ్చును.

వీరికి హార్మోనియం శృతిగా ఉంటుంది. తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతే కాదు, వాళ్ల కాళ్ళక్రింద బల్లచెక్కలుంటాయి. ఆయా ఘట్టాలననుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాలలో ఈ చెక్కలు టకటకా త్రొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. నగారా మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. ఉరుములు ఉరిమినట్టూ, పిడుగులు పడ్డట్టూ డబ్బాలు మ్రోగిస్తారు.

ఏ వ్యక్తి బొమ్మలను ఆడిస్తాడో ఆ వ్యక్తి తానే పాడుతూ, పాటకు అనుగుణంగా బొమ్మను ఆడిస్తాడు. రెండు బొమ్మలను ఆడించే సమయంలో బొమ్మలమధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మలను చేతితో కొట్టిస్తాడు. అదే సమయానికి క్రింది బల్లచెక్క టకామని నొక్కుతాడు. ఈ సమయంలో మిగిలిన వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళూ, డబ్బాలూ, ఈలలూ, కేకలతో బీభత్సం సృష్టిస్తారు.

తోలుబొమ్మలాటలో పాత్రలు

[మార్చు]

తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపుతాయి. తోలుబొమ్మలాటలో ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఈ హస్యపాత్రలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రలను సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి, పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగడతారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిళ్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతం లకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి. లంకాదహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు.

సూత్రధారుడు

[మార్చు]

నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు. అతను చాలా విషయాలలో ప్రజ్ఞాశాలి కూడా అయిఉంటాడు. మిగిలినవారందరూ అతనిని అనుసరిస్తూ ఉంటారు. సూత్రధారుడు కథను చాలా వివరంగానూ, చాకచక్యంగానూ చెబుతుంటాడు. అవసరమైనంత వరకు అర్థాలను విడమరచి వివరిస్తాడు. పాత్రల ఔచిత్యానుసారం గొంతు మారుస్తుంటాడు. ప్రేక్షకుల ఆదరణను, విసుగును గమనిస్తూ సమయాను కూలంగా మార్పులు చేస్తాడు, ఇతర పాత్రలను ప్రవేశపెడతాడు.

జుట్టుపోలిగాడు, బంగారక్క

[మార్చు]

ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి. మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు సరసమాడుతుంది.

అల్లాటప్పగాడు, కేతిగాడు

[మార్చు]

పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునే దానికి (లోబరుచుకునే) దానికి ప్రయత్నిస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు హఠాత్తుగా కేతిగాడు ఊడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు. ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.

తోలుబొమ్మలాటలకు ఉథృతంగా ఆదరణ లభిస్తున్న రోజుల్లో ఈ ప్రదర్శన జరుగుతున్నదంటే ఆ గ్రామంలో పండిత పామరులు కులమత భేదభావాలు మరచి తిలకించేవారు. తమకిష్టమైన పురాణ పురుషుల కథలను తెలుసు కునేందుకు ఈ తోలుబొమ్మలు తప్ప, మరోసాధనం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంకా చరిత్రను పరిశీలించి చూస్తే నాగరికత వికసిస్తున్న తొలి రోజుల్లో మానవుడు తన మనుగడ కోసమే ఎక్కువ కాలాన్ని వెచ్చించిన తొలినాళ్ళలో ఈ జానపద కళారూపం అవిర్భవించడంతో అతనికి మనోరంజనం కలగడమేకాక, తాను విన్న పురాణ కథల్లోని పాత్రలు కళ్ళముందు సాక్షాత్కరించడంతో భక్తి పారవశ్యంతో ఆనందానుభూతులకు లోనయ్యేవాడు. అంతేకాక పాత్రల స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకుని, తన జీవన సరళిలో నీతినియమాల పాటింపుతో కొంత నాగరికతను పెంపొందించుకునేవాడు. ఒకరకంగా తాము కొలిచే దేవుడికి ఒక సమగ్రమైన రూపాన్ని తోలుబొమ్మలాటతోనే గుర్తించగలిగి, ఆరాధించడం మొదలు పెట్టాడని చెప్పవచ్చు.

వార్తాపత్రికలు, రేడియో వంటి సమాచార వ్యవస్థలేని తొలిరోజుల్లో తోలుబొమ్మలాట సమాచార మాథ్యమంగా పనిచేసిందని చెప్పవచ్చు. గ్రామ సంచారంగా సాగే ఈ కళాప్రక్రియ ఒక గ్రామంలోని సమాచారాన్ని మరో గ్రామానికి చేరవేయడం, ఆరోగ్యవిషయాలు, నీతి నియమాలు, రాజకీయ మార్పులు, దొంగవ్యాపారుల గుట్టు మొదలైన ఆనాటి స్థితిగతులను బొమ్మలతో దృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది. ఆంధ్రదేశంలోని హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరుకుపల్లి, మదిరి, బసవయ్యపాలెం, గుండాలమ్మ పల్లె, వాడపల్లి, నెల్లూరు, వంటి అతికొద్ది ప్రాంతాల్లో తోలుబొమ్మల బృందాలు చివరి దశలో జీవిస్తున్నాయి.

తోలుబొమ్మలు - చలనచిత్రాలు

[మార్చు]

సమాచారాన్ని అందించడంలో తోలుబొమ్మలాటలు చలనచిత్రాలతో పోల్చబడతాయి. తోలుబొమ్మలాటలు చలనచిత్రాలకు శతాబ్దాల ముందు దేశీయ పరిజ్ఞానంతో తయారుచేయబడ్డాయి. నలుగురైదుగురు మనుషులు కలిసి పాటలు, శబ్దాలు, సంగీతం సహాయంతో కొన్ని వందల పౌరాణిక పాత్రలను సజీవంగా చెయ్యగలిగిన ప్రక్రియ తోలుబొమ్మలాట. సినిమాలాగానే తోలుబొమ్మలాట కూడా వెలుగు నీడల ప్రదర్శన. పాత్రల దుస్తులు, ఆభరణాలు చేసే విధంలోని ప్రత్యేకత ఏమంటే వాటి రంధ్రాలలోంచి వెలుతురు బయటకు వచ్చి, తెరపైన వింత జిలుగులు, భ్రమలు సాధ్యమయ్యేవి.

మనుగడ

[మార్చు]

సుసంపన్నమైన హిందూ ఇతిహాసాలను తెరమీదకి తెచ్చిన ఒక గొప్ప ప్రక్రియ తోలుబొమ్మలాట.తర్వాత కాలంలో కనిపెట్టబడిన చలనచిత్రాలు, దూరదర్శని ఆధునిక పరిజ్ఞానం సహాయంతో అవే ఇతిహాసాలను మరింత మెరుగైన రీతిలో ప్రదర్శిస్తున్నాయి. అయినప్పటికీ తోలుబొమ్మలాట అనే ఈ అద్భుతమైన ప్రదర్శన కళ దక్షిణ ఆసియా ప్రాంతపు ప్రదర్శన కళల చరిత్రను అర్ధం చేసుకోవడంలో కీలకమైన పాత్ర పొషిస్తోందని తోలుబొమ్మలపై పరిశోధన చేసిన ఆచార్యుడు బ్రూస్ టేపర్ తన పరిశోధనా వ్యాసంలో వ్యాఖ్యానించాడు.

ఇంతటి ఉన్నత ప్రమాణాలతో నిండిన తోలుబొమ్మలాట వంశపారం పర్యంగా వస్తున్న ఒక కళాసంస్కృతి. వేల సంవత్సరాలుగా మౌఖికంగా వస్తూ జానపదుల గుండెల్లో గూడుకట్టుకున్న ఉత్కృష్టమైన కళాప్రక్రియ. రామాయణ, మహాభారత, భాగవత కథ లను అలవోకగా చెప్పే తోలుబొమ్మల కళాకారుల మాతృభాష మరాఠీ అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కళారూపం ఆంధ్రదేశంలో ఒక ప్రముఖ కళా రూపంగా అభివృద్ధిచెంది, తెలుగు సంస్కృతిలో మిళితమై, మన జాతీయ సంపదకే వన్నె తెచ్చింది. ఇంతటి ఉన్నతమైన ఈ కళాప్రక్రియ నేడు అతి కొద్ది బృందాలతో జీవిస్తోంది. తోలుబొమ్మల దీపపుకాంతులు చరమాంకంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ కళకు సంబంధించిన రచనలు, చరిత్ర, తోలుబొమ్మల తయారీ, బొమ్మలను ఆడించే పద్ధతులు, ఇందులో ఇమిడివున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం 'లిపి ' ద్వారా లేకపోవడం దురదృష్టకరం. పాశ్చాత్య దేశాలలో ఉన్న బొమ్మలాట ప్రక్రియకు సంబంధించిన విజ్ఞానం లభ్యమవడం కారణంగా మిగిలిన రాష్ట్రాలలో ఔత్సాహికులు, బృందాలు బొమ్మలాటల మనుగడకు, వ్యాప్తికి విశేష కృషి చేస్తుండగా, తోలుబొమ్మల కృషికి మనం మార్గం వేయలేకపోతున్నాము.

తోలుబొమ్మల కళారూపం అంతరించి పోవడానికి గల కారణం పరిశీలిస్తే 19, 20వ శతాబ్దాలలో నాటకాల ప్రభావం ఉధృతంగా ఉండడం, పద్యనాటకాల ప్రాధాన్యత పెరగడం, నాటకాలలో శాస్త్రీయతకు, సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్నతస్థానం లభించడం, అంతకంటే ముఖ్యంగా లూమియర్ బ్రదర్స్ సాంకేతిక సృష్టిలో ఆవిష్కరించిన సినిమాలు ప్రజలను సమ్మోహితులను చేయడం, తెరపై ప్రేక్షకులకు కావలసినవి అందించడం, అదేవిధంగా ఇంట్లోనే జనరంజకం అన్న నేపథ్యంలో విస్తృతంగా ఛానల్స్ వచ్చి ప్రపంచ తీరుతెన్నులను మార్చడం వంటి ఎన్నో కారణాలు తోలుబొమ్మలు లాంటి కళారూపాల మనుగడకు సవాలుగా నిలిచాయి. ఇలాంటి విషమపరిస్థితుల్లో, ఇవీ మన ఆనవాళ్ళు అని చెప్పడానికి మన కళారూపాలను బ్రతికించు కోవలసిన అవసరం ఏర్పడింది. తోలుబొమ్మలాట వంటి కళారూపానికి మరిన్ని మెళకువల్ని జోడీంచి, దీనిని ఆధునిక మానవుడికి చేరువగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మప్రచారం, రాజకీయ రంగం, పిల్లలవిద్య, మానసిక వికలాంగుల విద్య, వైద్య పరిజ్ఞాన ప్రచారం వంటి రంగాలలో ఈ కళారూపాన్ని చక్కగా వినియోగించు కోవచ్చు. ఈ కళా రూపాల మనుగడకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కాకుండా విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశోధకులు తమవంతు కృషిని అందజేస్తే మన భావితరాలవారికి 'ఇవీ మన ఆనవాళ్ళు' అని సగర్వంగా అందించవచ్చు.

వానలకోసం తోలుబొమ్మలాటలు

[మార్చు]

విరాట పర్వములో దుర్యోధనుడు కురువృద్ధులతో విరాట రాజు గోవులను ఉత్తరం వైపు తరలించే ఉత్తర గోగ్రహణం కథను తోలుబొమ్మల ఆటగా ఆడిస్తే వర్షాలు కురుస్తాయని బహుధా ఒక నమ్మకం ఉంది. అనావృష్టి కాలంలో ఈ ఆటను ఆడించడం ఒక ఆనవాయితీగా ఉండేది.

కొందరు కళాకారులు

[మార్చు]
  • ఆచార్య ఎమ్.వి.రమణమూర్తి: కాకినాడ వాస్తవ్యుడు. శిథిలమైన తోలుబొమ్మలాటను ఆధునిక రీతిలో పునరుద్ధరించడానికి కృషి చేశాడు. అనేక ప్రదర్శనలిచ్చాడు. కథలోనూ, కథనంలోనూ, హంగులలోనూ నూతన విధానాలను ప్రవేశపెట్టాడు.
  • నిమ్మల గోవిందు: సుమారు 500 యేండ్లక్రితం మహారాష్ట్ర ప్రాంతం నుండి వలసవచ్చి, అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో స్థిరపడిన కుటుంబానికి చెందినవాడు. కుటుంబనియంత్రణ గురించి బొమ్మలాట ద్వారా ప్రచారం చేశాడు.
  • కుమార రాజారావు: నెల్లూరు జిల్లా ధర్మారావు చెరుకుపల్లి నివాసి. దేశ విదేశాలలో పలు ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందాడు.
  • అనపర్తి చిన్నకృష్ణ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీప గ్రామమైన మాధవపట్నం బొమ్మలాట కళాకారులకు ప్రసిద్ధి. అక్కడివాడైన చిన్నకృష్ణ శ్రీసీతారామ నిలయ చర్మచిత్రకళా ప్రదర్శన కమిటీ అధ్యక్షుడు.
  • తోట పవన్ కుమార్: సామర్లకోట మండలం మాధవ పట్నానికి చెందినవాడు. శ్రీ నటరాజ నిలయ చర్మచిత్రకళా ప్రదర్శన కమిటీ అధ్యక్షుడు. దేశమంతా ప్రదర్శనలు నిర్వహించాడు.
  • తోట రంగారావు: మాధవపట్నం. పద్మనిలయ చర్మచిత్రకళా సంస్థ.
  • తోట వెంకటరావు: తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపాలెం వాడు. నూట ఇరవై బొమ్మలతో పదిమంది కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చాడు.
  • తోట బాలకృష్ణ: కాకినాడ సమీపంలోని చౌదిగ. శ్రీ పద్మనిలయ చర్మచిత్రకళా సంస్థ. పదిహేను నిమిషాలనుండి ఏడు గంటలవరకు ఏకబిగిన ప్రదర్శననివ్వగలవాడు.
  • తోట ధనేశ్వరరావు: సామర్లకోట మండలం మాధవపట్నం వాడు. శ్రీ హనుమాన్ చర్మచిత్రకళా సంస్థ దర్శకుడు.
  • ఎ.త్రినాధ్: కాకినాడ సమీపంలోని చౌదిగ నివాసి. వాణీనిలయ చర్మచిత్రకళా ప్రదర్శన కమిటీ అధ్యక్షుడు.
  • తోట నాగభూషణం: తూర్పుగోదావరి జిల్లా జెల్లావారిపేటకు చెందినవాడు. ప్రదర్శనలివ్వడమే కాకుండా బొమ్మలు చేయడంలో సిద్ధహస్తుడు.
  • తోట సింహాచలం: తూర్పుగోదావరి జిల్లా జెల్లావారిపేటకు చెందినవాడు. శ్రీ అన్నపూర్ణ నిలయ చర్మచిత్రకళా సంస్థ. రామాయణంలో పది భాగాలనూ, భారతంలోని పది భాగాలనూ ప్రదర్శించగలవాడు.
  • తోట మావుళ్ళు: జన్మస్థలం మారేడుపాక. స్థిరపడింది మాధవపట్నం. శ్రీ తిరుపతి శ్రీనివాస చర్మచిత్రకళా సంస్థ ప్రారంభించాడు.
  • కె.వి. రమేష్: కళాకారుడు

ఇవీ చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. ఆంధ్రుల సాంఘిక చరిత్రరచయిత [./సురవరం_ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి] సంవత్సరం 1950 ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా దరాబాదు. పుట. 54.
  2. *మిక్కిలినేని, రాధాకృష్ణమూర్తి (1992). "Wikisource link to బొమ్మలూ, తోలుబొమ్మలూ" (in te). Wikisource link to తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 
  3. www. puppetindia. com నుండి

బయటి లింకులు

[మార్చు]