Jump to content

వేమన

వికీపీడియా నుండి
యోగి వేమన
హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై వేమన విగ్రహం ( విగ్రహం శిలాఫలకం పై వ్యాఖ్య:"ఆటవెలదిని ఈటెగావిసిరిన దిట్ట/ ఛాందసభావాలకు తొలి అడ్డుకట్ట")
పుట్టిన తేదీ, స్థలంసా.శ1367(?)
కడప జిల్లాకి చెందిన వారు.
మరణంరెడ్డి శకం 1478 కటారు పల్లె గ్రామం
వృత్తికవి, సంఘసంస్కర్త

సంతకందస్త్రం:దాబి రాముడు

వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు.

జీవితం

[మార్చు]

వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్. గోపి పరిశోధనలు చేశారు.[1] [2]

వేమన పద్యాలలో అతని జీవితం

[మార్చు]

వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదహరిస్తారు.

నందన సంవత్సరమున
పొందుగ కార్తీకమందు బున్నమినాడీ
వింధ్యాద్రి సేతువులకును
నందున నొక వీరు డేరుపడెరా వేమా!

ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి
మూకచింతపల్లె మొదటి వీడు
అరశి చూడ బయలు అది ముక్తి శివుడయా
విశ్వదాభిరామ వినురవేమ!

బండారు తమ్మయ్య విశ్లేషణ ప్రకారం వేమన పూర్వులు మొదట మూగచింతపల్లి ఇల్లుగా కలవారు. వేమన కాలంనాటికి వారి ఊరు కొండవీడు. పశ్చిమ వీధిలో శివాలయం దగ్గర వారు ఉండేవారు. ఈ విశ్లేషణ హేతుబద్ధంగా వుందని వేమనపై పి.హెచ్.డి. చేసిన పరిశోధకుడు ఎన్ గోపి అంగీకరించాడు.[3]

కోమటి వేమన్నకథ

[మార్చు]

రెడ్డిరాజులకు మూలపురుషుడైన దొంతి అలియరెడ్డి అనుమకొండలో వుండి వ్యవసాయం చేసేవాడు. వేమన్న అనే కోమటి శ్రీశైలానికి వెళ్లి స్వామి దర్శనం తరువాత పాతాళగంగలో పచ్చబండని చూడసాగాడు. అర్చకుడు ప్రశ్నించడంతో ఆరు నెలలు స్వామిని సేవించుకుంటానన్నాడు. అర్చకుడు ఉత్తర దిక్కుకు పోవద్దన్నాడు. కాని వేమన్న అదే దిక్కుకు నువ్వులు చల్లుకుంటూ సాగాడు. రెండు రోజుల తరువాత పరుసవేది ద్రవం కనిపించితే దానిని కుండలలో సేకరించి అనుమకొండ చేరేసరికి రాత్రయ్యింది. అలియరెడ్డి తన గొడ్ల చావడిలో వుండమనగా పరుసవేది కుండలను నాగలి పనిముట్లు పక్కనపెట్టి భోజనానికి వెళ్లాడు. అంతలో అలియరెడ్డి వచ్చినపుడు నాగలి బంగారంగా మారి ప్రకాశించసాగింది. దీనితో పరుసవేది కుండలను దాచి, గొడ్లను బయటకుదోలి చావడికి నిప్పుపెట్టాడు. అప్పుడు వేమన్న వచ్చి విషాదంతో ఆ మంటలలో దూకి చనిపోయాడు. తరువాత అలియరెడ్డికి పుట్టిన బిడ్డలు బ్రతకలేదు. వేమన్న కలలో కనబడి తన పేరు బిడ్డలకు పెట్టమని కోరి అలా చేస్తే సంతతి పెరిగి రాజులవుతారని అనగా, చివరిగా మిగిలిన బిడ్డకు పిచ్చిపుల్లాయ్ కు బదులుగా పుల్లయ వేమారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. [4]

గొల్లడు, గోసాయి కథ

[మార్చు]

కొండవీటిని పరిపాలించిన అనపోత వేమారెడ్డి అంతకు ముందు పరిపాలించిన అలియరెడ్డి తమ్ముడు. ఆయన కాలంలో కొండవీడు కొండ మీదు గోసాయి వుండేవాడు. దగ్గరలో పశువులు మేపే గొల్లవాడొకడు ప్రతిరోజు పాలు సమర్పించి సేవించేవాడు. గోసాయి వారించినా అలాగే సేవకొనసాగించాడు. గోసాయి దగ్గరలో రెండు గజాల లోతు గొయ్యిని తవ్వమన్నాడు. ఆ గోతిలో ఎండుపుల్లలు వేసి మంటరాజేశాడు. గొల్లవాడికి మేలుచేస్తానని ఆ గోతి దగ్గరకు తీసుకెళ్లి గోతిలో తొయ్యబొయ్యాడు. గొల్లవాడు తప్పించుకొని గోసాయినే గోయిలో పడవేశాడు. మరుసటిరోజు వచ్చి చూడగా మనిషి ఎత్తున వున్న రెండు బంగారు బొమ్మలు కనబడ్డాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి అవసరానికి బొమ్మనుండి కొద్ది ముక్కలు తీసుకొని వాడుకొనేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి రాజుగారు ఆ బొమ్మలను స్వాధీనంచేసికొని ధనవంతుడయ్యాడు.[5]

రాజకుటుంబపు వేమన్న వేశ్యాలోలత్వం నుండి యోగిగా మారే కథ

[మార్చు]

కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారు పేరుగల అనువేమారెడ్డి చిన్న తమ్ముడు వేమన్న. వేమన్న వదిన నరసాంబారాణి. వేమన్న రాజకీయాలు పట్టించుకోక ఒక వేశ్యవలలో చిక్కుకుంటాడు. ఆ వేశ్య రాణి ఆభరణాలు ధరించి అద్దంలోచూసుకోవాలని కోరుతుంది. మాతృపేమ గల నరసాంబారాణి బులాకి తప్ప మిగతా అభరణాలు యిచ్చింది. వేశ్య బులాకీ కూడా కావాలని పట్టుబట్టింది. చీకట్లోకూడా దీపంలాగే వెలిగే బులాకీని, ఆభరణాలు అన్నీ వేసుకున్న తరువాత వేశ్య నగ్న దేహం చూడమనే షరతుతో ఇస్తుంది. అలా చూసిన వేమనకు మగువంటే విరక్తికలిగి రోతపుట్టి, కోటకు వెళ్లి పడుకుంటాడు. నరసాంబ వేమనకు జ్ఞానము కుదిరిందని లేపటానికి భటులను పంపుతుంది.[6]

వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవాడు. కోటలో బంగారపు పని జరిగే భవనంలో వేమన్న కూర్చొనేవాడు. అభిరామయ్య రోజు పనికి ఆలస్యంగా రావటం గ్రహించి, రహస్యంగా అభిరామయ్యను వెంబడించి, అభిరామయ్య దగ్గరలోని కొండగుహలో అంబికాశివయోగిని సేవించటం గమనించాడు. యోగి సంతోషించి మరుసటిరోజు మంత్రోపదేశం చేస్తానని అంటాడు. మరుగున ఉండి ఈ విషయం విన్న వేమన మరుసటి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, వేమన అభిరామయ్య శిష్యునిగా వెళతాడు. యోగి చెవిలో మంత్రోపదేశం చేసి, నాలుకపై బీజాక్షరాలు వ్రాస్తాడు. అభిరామయ్యను వంచించినందుకు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకుంటాడు. పరిహారంగా అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాల మకుటంలో చేరుస్తానని చెప్పాడు.[7] [8]

వేమన మోతుబరి రైతు బిడ్డ అనే కథ

[మార్చు]

వేమన పద్యాలను పరిశోధించి ఊహించిన కథ ఈ విధంగా సాగుతుంది. వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్ధము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలడు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు.

కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును.

అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల మరల ప్రస్తావించాడు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం వున్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు.

వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించాడు.

ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో మహాసమాధి చెందాడు. [9]

వేమన కులం

[మార్చు]

కులమత బేధాలను నిరసించిన వేమన కులం చరిత్ర తెలుసకొనటానికే అయినా, పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. వేమన బ్రాహ్మణుడు కాదు కాపు(రైతు) అని బ్రౌన్ తొలుత భావించినా తరువాత జంగం(శైవసంస్కర్తలు కులం) అని భావించాడు. వేమన రెడ్డి కులానికి, కాపు అనే కులానికి చెందినవాడు అని ఆయన పద్యాలను బట్టి కొందరు భావించినా కాపు, రెడ్డి అనే కులాలు దత్త మండలల్లో పర్యాయపదాలుగా వాడబతున్నవి, కృష్ణా, గోదావరి మండలాల్లో వేరుగా వున్నవి. కావున ఏ కులమని నిర్ధారించలేకపోయినా, పద్యాలలో కన్పించే వ్యావసాయిక పరిజ్ఞానంవలన రాజవంశీయుడు కాడని, రైతుకుటుంబానికి చెందిన వాడని నిర్ధారించవచ్చు.[10]

వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, కొండవీడు రెడ్డి రాజుల వంశానికి సంబంధం కలిగినవారు. కొండవీడు రెడ్డి చెప్పిన ప్రకారం ఇతను రెడ్డి వంశానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం గుంటూరు జిల్లా లోని కొండవీడు రెడ్డి రాజుల వంశంలో మూడో వాడు వేమారెడ్డి అంటారు. [11]

వేమన ప్రాంతం

[మార్చు]

వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు (పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటివి) రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలోనున్నందున, రాయలసీమ వాడని చెప్పవచ్చు. [12]

వేమన పద్యాల తీరు

[మార్చు]

వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు

పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదా:

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు కాడు
కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.

  • వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదను, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడిని మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.
  • విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని పండితులు ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు.

బ్రౌను ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.[13]

వేమన్న మానవతావాదం

[మార్చు]

మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయనవాడిన ఆయుధం హేతువు లేక తర్క శీలత్వం.[14]

మానవతా ధర్మం

చంపదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమ

సర్వమానవ సమానత్వం

ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి
పొత్తుగుడిపి పొలము కలయజేసి
తలను చెయ్యిబెట్టి తగనమ్మజెప్పరా
విశ్వదాభిరామ వినుర వేమ

కులవిచక్షణలోని డొల్లతనం గురించి

మాలవానినంటి మరి నీటమునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో
విశ్వదాభిరామ వినుర వేమ

నైతికత్వం గురించి

ఇంటియాలి విడిచి ఇల జారకాంతల
వెంటదిరుగువాడు వెర్రివాడు
పంటచేను విడిచి పరిగె ఏరినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

మూఢనమ్మకాల ఖండన

పిండములను జేసి పితరుల దలపోసి
కాకులకును పెట్టుగాడ్దెలార
పియ్యిదినెడుకాకి పితరుడెట్లాయరా
విశ్వదాభిరామ వినుర వేమ

సంఘసంస్కరణను ప్రబోధించే సర్వమానవ సమానత్వం,అశ్పృస్యత ఖండన, నైతికప్రభోధం, మూఢనమ్మకాల ఖండన, ఆర్ధిక భావాలను సూచించే పై పద్యాలను బట్టి వేమనను మానవతావాదిగా చెప్పవచ్చు.

స్తీల గురించి సాంప్రదాయవాది

[మార్చు]

ఆలి తొలుత వంచ కధముడైతా వెనుక
వెనుక వంతు ననుట వెర్రితనము
చెట్టు ముదరనిచ్చి చిదిమితే బోవునా
విశ్వదాభిరామ వినుర వేమ

తాత్పర్యం: "భార్యను తొలిగానే అదుపులోపెట్టుకోవాలి. తరువాత అదుపులోపెట్టుకోవచ్చులే అనుకొనుట వెర్రితనం. చెట్టుపెద్దదైన తరువాత సులభంగా పీకలేము"

పతిని విడువరాదు పదివేలకైనను
పెట్టి జెప్పరాదు పేదకైన
పతిని తిట్టరాదు సతి రూపవతియైన
విశ్వదాభిరామ వినుర వేమ

తాత్పర్యం: "భర్తను ఎప్పుడూ విడవకూడదు. పేదవాడికి దానంచేసి ఎవరికీ చెప్పకూడదు. అందమైన రూపంకల భార్య భర్తని తిట్టకూడదు"

కలిమినాడు మగని కామముగాజూచును
లేమిజిక్కునాడు, లేవకుండు
మగువ మగనినైన మడియంగ జూచును
విశ్వదాభిరామ వినుర వేమ

తాత్పర్యం: "సంపద వున్నప్పుడు భార్య భర్తను ప్రేమతో చూస్తుంది. పేదరికంలో మంచంపైనుండి లేవకుండా ఇటువంటి భర్త చనిపోయినా బాగుండుననుకుంటుంది"

పై పద్యాలవంటివి స్త్రీలను చులకనగా చూపించుతూ, సాంప్రదాయ పితృస్వామ్యాన్ని సమర్ధిస్తూ చెప్పటం వేమన ప్రగతిశీల వ్యక్తిత్వానికి మచ్చగా వున్నది.[15]

వేమన గురించి పరిశోధన

[మార్చు]

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్ 1806లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్ ఆంగ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ పవిత్రతని చర్చించేటప్పుడు బురదని తయారుచేసేది, శుభ్రపరచేది నీరు లాగా, తన సంకల్పమే పాపం చేయటానికి కారకము, సంకల్పము చేతనే పవిత్రంగా వుండగలం అనే వేమన చెప్పిన పద్య అర్ధాన్ని ఉటంకించాడు. 1816 లో భారతదేశం వచ్చిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించాడు. దాదాపు 18 ఏళ్లు వేమన సాహిత్యంపై ధ్యాస పెట్టాడు. [16] తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి రెడ్డి కృషి చేశాడు.

వేమనకు గుర్తింపు

[మార్చు]

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.[17] అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.[17] బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.

యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీఓ (నెంబర్‌ 164)ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 2023లో విడుదల చేసింది.[18]

వేమన గురించి అభిప్రాయాలు

[మార్చు]
కటారుపల్లిలో యోగి వేమన సమాధి వద్ద విగ్రహం

స్మరణలు

[మార్చు]
శిలా విగ్రహాలు
  • హైదరాబాదులో టాంకుబండ్ పై తెలుగుజాతి వెలుగుల విగ్రహాలలో వేమన విగ్రహం ప్రతిష్ఠించారు.
పోస్టు స్టాంపు
పోస్టు స్టాంపుపై వేమన
  • 1972 లో భారత తపాలాశాఖ స్టంపు విడుదల చేసింది (చిత్రం కుడివైపు)
పుస్తకాలు

వ్యాసంలో ఉదహరించినవే కాక, వేమన పద్యాలను వివిధ ప్రచురణ కర్తలు ముద్రించారు. విస్తృతంగా పరిశోధనల పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో కొన్ని

  • రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ (1929). వేమన.
  • వేమన యోగి - వర్ణ వ్యవస్థ: డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2002
  • వేమన యోగి - అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము :డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2000,
  • మన వేమన, ఆరుద్ర, 1985.[17]
  • వేమన జ్ఞానమార్గ: 1958 నాటికి అత్యధికంగా 3002 పద్యముల సంకలనం అక్షరమాల క్రమంలో కూర్పు, కూర్పు: ముత్యాల నారసింహ యోగి, ప్రకాశకులు: సి.వి.కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1958.
దృశ్యశ్రవణ మాధ్యమాలు
ఖతులు

మూలాలు

[మార్చు]
  1. ఎన్. 2000.
  2. త్రిపురనేని వెంకటేశ్వరరావు (1995). వేమన - పదహారేళ్ళ పరిశోధన. వేమన వికాసకేంద్రం.
  3. ఎన్ 2000, pp. 75–77, III బి. కొండవీటి పద్యం.
  4. ఎన్ 2000, pp. 57–58, వేమన కాలం ప్రాంతం.
  5. ఎన్ 2000, pp. 58.
  6. ఎన్ 2000, pp. 59.
  7. ఎన్ 2000, pp. 59–60.
  8. నేదునూరి గంగాధరం, ed. (1960). "వేమన జీవితం". వేమన పద్యరత్నములు. pp. 9–16.
  9. త్రిపురనేని వెంకటేశ్వరరావు (1992). విశ్వదాభిరాముడు వేమన. వేమన వికాసకేంద్రం.
  10. ఎన్ 2000, pp. 71–73, వేమన్న కులం.
  11. తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (1999)
  12. ఎన్ 2000, p. 100.
  13. ఎన్ 2000, pp. 231–235, మకుటార్ధం.
  14. ఎన్ 2000, pp. 167.
  15. ఎన్ 2000, pp. 180–182.
  16. ఎన్ 2000, pp. 64–66, II పాశ్చాత్యుల కాలనిర్ణయం.
  17. 17.0 17.1 17.2 ఆరుద్ర (1985). మన వేమన. p. 17. Retrieved 13 January 2015.
  18. "యోగి వేమనా.. నీకు వందనం     | Yogi Vemana Jayanti Celebrations Today - Sakshi". web.archive.org. 2024-01-19. Archived from the original on 2024-01-19. Retrieved 2024-01-19. {{cite web}}: no-break space character in |title= at position 25 (help)CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వేమన&oldid=4366875" నుండి వెలికితీశారు