Jump to content

అనుశాసనిక పర్వము పంచమాశ్వాసము

వికీపీడియా నుండి


పంచమాశ్వాసం

[మార్చు]

వర్ణాశ్రమ ధర్మాలు

[మార్చు]

పార్వతీదేవి మహాశివుని వర్ణాశ్రమధర్మముల గురించి వివరించమని అడుగగా శివుడు " పార్వతీ ! పూర్వము బ్రహ్మదేవుడు లోక హితము కొరకు నాలుగు వర్ణాలను సృష్టించాడు. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. అందుకని ఆ జాతులలో తర, తమ భేదాలు కలిగాయి. వారు చేసే పనులలో కూడా తారతమ్యాలు కలిగాయి.

విప్రులు

[మార్చు]

విప్రులు లోకముకు ఆధారము. వారిని పరాభవిస్తే లోకానికి చేటు కలుగుతుంది. వారిని సన్మానించి వారికి దానధర్మాలు చేస్తే లోకానికి మేలు కలుగుతుంది. బ్రాహ్మణుడు పేదవాడైనా, ధనవంతుడైనా, విద్యావంతుడైనా, విద్యలేని వాడైనా అతడిని నిందించ రాదు, బాధించరాదు. వారిని బాధించిన వారికి ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా సుఖసంతోషాలు కలువు. బ్రాహ్మణుడిని దూషించడం దైవాన్ని దూషించడంతో సమానము. బ్రాహ్మణుడి సొత్తును అన్యాయంగా దోచుకోవడం దేవుడి సొత్తును అన్యాయంగా దోచుకోవడంతో సమానము.

విప్రుల ధర్మాలు

[మార్చు]

ఇక విప్రుల ధర్మాలు ఏవంటే వేదాధ్యయనము, యజ్ఞములు చేయడం, ఇతరులతో యజ్ఞములు చేయించడం, దానములు చెయ్యడం, తాను నేర్చిన విద్యలు ఇతరులకు బోధించడం, ఇతరుల నుండి దానములను స్వీకరించడం, మనసులో కాని వాక్కులో కాని కోపం లేకుండా ప్రశాంతంగా ఉండడం, తపస్సు చేయడం, ఎల్లప్పుడు సత్యమునే పలకడం, శుచిగా ఉండడం ఇవి విప్రుల ధర్మము. ఆపద సమయాలలో తప్ప విప్రులు వాణిజ్యాలు చేపట్టరాదు. బ్రాహ్మణుడు ప్రతిరోజు అగ్ని కార్యము చెయ్యాలి. శూద్రులు ఇచ్చిన ఆహారము భుజించరాదు. పరకాంతలవంక కన్నెత్తి చూడరాదు. తన నిజ భార్యతోనే తృప్తిపడాలి. రోజుకు రెండు పూటలు మాత్రమే భోజనముచెయ్యాలి. హింసాప్రవృత్తి పనికిరాదు. ఇంటిని పరిసరములను శుభ్రముగా ఉంచుకోవాలి. అతిథులకు అన్నంపెట్టాలి. తపస్సు చేసుకోవాలి. ఇలాంటి ధర్మకార్యముల కొరకు ధర్మమును పరిరక్షించుట కొరకు మాత్రమే బ్రాహ్మణులను సృష్టించాడు.

క్షత్రియధర్మాలు

[మార్చు]

క్షత్రియులకు బ్రాహ్మణులను రక్షించడంప్రథమధర్మము. వారితోపాటు భూమిమీద ఉన్న సకలప్రాణులను రక్షించాలి. క్షత్రియుల వలన ఈ భూమి వర్ధిల్లుతుంది. క్షత్రియుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. క్షత్రియులు వేదాధ్యయనం చెయ్యాలి, యజ్ఞము చెయ్యాలి, దానధర్మము చెయ్యాలి. సాధువులను రక్షించి పోషించాలి. దుష్టులను శిక్షించాలి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ధైర్యంగా ఉండాలి. ఇంకా క్షత్రియులు అస్త్ర శత్ర విద్యలో నైపుణ్యం సాధించాలి. ప్రజలకు వచ్చిన అదాయంలో ప్రజాపాలన నిమిత్తము ఆరవ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలి. తనవద్ద పనిచేసేవారిని దయతో చూడాలి. ప్రజలు తమ తగవులు తీర్చే సమయంలో నిష్పక్షపాతంగా ఉండాలి. ఇవి రాజుకు విధించిన ధర్మాలు.

వైశ్యధర్మాలు

[మార్చు]

ఇక వైశ్యధర్మాలు వివరిస్తాను. వైశ్యులు ఎల్లప్పుడూ లోకానికి మేలుచెయ్యాలి. అందరికీ ఉపకారము చెయ్యాలి, అధికంగా శ్రమించాలి, వ్యాపారము పశుపోషణ చెయ్యాలి. వైశ్యులు కూడా వేదాధ్యయనము, యజ్ఞములు చెయ్యడం, దానములు చెయ్యడం వైశ్యులకు విధించబడిన ధర్మాలు. ఉపనయన కర్మవలన వైశ్యులు ద్విజులు ఔతారు కనుక అతిథులను సత్కరించడం వైశ్యులకు పరమధర్మము. వైశ్యులు నువ్వులు, గంధము, రసము కూడిన పదార్ధములతో వైశ్యులు వ్యాపారము చెయ్యరాదు. ఇక శూద్రులు మిగిలిన మూడు జాతులను సేవించి సేవచెయ్యడం సౌమ్యంగా విధేయులుగా ఉండడం వారికి విధించబడిన ధర్మము.

ఆశ్రమవాస ధర్మాలు

[మార్చు]

పార్వతీ ! ఆశ్రమధర్మాలు వివరిస్తాను. మొదటి ఆశ్రమము బ్రహ్మచర్యము. ఈ ఆశ్రమంలో పరమనిష్ఠతో ఉండాలి. గురువును ఆశ్రయించి విద్యను నేర్చుకోవాలి. వేదాధ్యయనం చెయ్యాలి. ప్రతి రోజు అగ్ని కార్యము చెయ్యాలి. గురువుగారి కొరకు తన కొరకు భిక్షను స్వీకరించాలి. తరువాత గృహస్థాశ్రమధర్మము. ఇది మిగిలిన ఆశ్రమధర్మాలకు పునాది. గృహస్థాశ్రమంలో శుచిశుభ్రత పాటించడం, భార్యను సంతోషపెట్టడం, పంచయజ్ఞములు చెయ్యడం, పంచయజ్ఞములు అనగా దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనుష్యయజ్ఞము వీటిని నిష్ఠతోచెయ్యడం, వేదాధ్యయనమునందు ఆసక్తి కలిగి ఉండడం, దానధర్మాలు చెయ్యడం, హోమములు చెయ్యడం బ్రాహ్మణుడికి విధించబడిన ధర్మము. తరువాత వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో బ్రహ్మచర్యము పాటించడం, శాకాహారభోజనం, నారచీరలు ధరించడం, కోరికలు లేక ఉండడం వానప్రస్థాశ్రమ ధర్మాలు. తరువాతది సన్యాసాశ్రమం. సన్యాసికి కోపము రాకూడదు. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. తనకంటూ ఏమీ ఉంచుకొన కూడదు. ఓర్పుతో ఉండాలి. అడవులలో ఉన్న మునులతో కూడి సత్సంగంలో పాల్గొనాలి. ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలి. సత్యవ్రతము, అహింసావ్రతము ఆచరించాలి. భిక్షాటనతో జీవించాలి. నేలమీద పడుకోవాలి. సాటి మానవుల ఎడల, ప్రాణుల ఎడ కరుణతో మెలగాలి. ఎల్లప్పుడూ ఆత్మవిచారము, తత్వచింతనా చెయ్యాలి. ఇవి సన్యాసి ఆచరించవలసిన ధర్మాలు " అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.

మునులు తపస్సు

[మార్చు]

" పరమశివా ! చాలామంది మునులు ఋషులు తపస్సు చేస్తారు కదా ! దాని గురించి చెప్పండి " అని అడిగింది పార్వతి. పరమశివుడు " పార్వతి ! చాలామంది ఏవోవో కోరికలు తీరాలని తపస్సు చేస్తూ ఉంటారు. కాని తపస్సు అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు చేసే ఒక ధర్మము. తపస్సు చేసే ముందు ఇంద్రియ నిగ్రహము పాటించాలి. ఉదయము సాయంత్రం యోగాభ్యాసం చెయ్యాలి. అలా కాకుండా ఏవేవో కోరికలతో తపస్సు చేస్తే కొంతకాలం స్వర్గసుఖములు అనుభవించి ఆ తపఃఫలం తరిగి పోగానే తిరిగి భూమిమీద జన్మిస్తారు. అంతే కాని తిరిగిరానిలోకాలకు వెళ్ళలేరు. ఇంకా కొంతమంది ఆ హారం తీసుకోకుండా కఠోరనియమాలతో పంచాగ్నుల మధ్య నిలబడి ఘోరంగా తపస్సుచేస్తారు. అలాంటి వారు కూడా కేవలం అప్సరకాంతలతో చేరి భోగములు అనుభవించి తృప్తిపడతారు. ఆ తపః ఫలం పూర్తికాగానే తిరిగి మానవులుగా జన్మిస్తారు. అలా కాక ఎలాంటి కోరికలు లేకుండా తపస్సు చేసే వారు ముందుగా అహింసావ్రతము ఆచరిస్తారు. మనసా వాచా కర్మణా ఎవరికీ అపకారం హానిచెయ్యరు. సాటి ప్రాణుల ఎడల దయ, కరుణ కలిగి ఉంటారు. అందరి జీవులలో ఉండే ఆత్మ ఒక్కటే అని భావిస్తారు. అలాంటి వారు కూడా మరణానంతరం తమ భార్యాబిడ్డలతో స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి ఆ పుణ్యఫలం కరిగి పోగానే తిరిగి భూలోకంలో జన్మిస్తారు. ఈ రీతిగా తపస్సు చేసే వారందరూ స్వర్గసుఖాలతోనే తృప్తిపడుతుంటారు " అని పరమశివుడు పార్వతీ దేవికి వివరించాడు.

వనవాసం

[మార్చు]

" నాథా ! వనవాస విశేషములు దాని ఫలితాలు వివరించండి " అని పార్వతీదేవి అడిగింది. పరమశివుడు " పార్వతీ ! ఉపవాసవ్రతము అనగా ఆహారము తీసుకోకుండా ఉండడం, నేల మీద పడుకోవడం, మౌనంగా ఉండడం, యోగాసనములు చెయ్యడం, నియమిత వేళలలో పరిత ఆహారం తీసుకోవడం అనే నియమాలు పాటించాలి. అలా చేస్తే వారు చంద్రలోకము, వాయులోకము, యక్షలోకము, గంధర్వ లోకము, నాగ లోకము మొదలైన లోకములకు వెడతారు. అక్కడ కొంతకాలము నివసిస్తారు. ఈ వ్రతాలన్నీ వానప్రస్థములో చేసిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి " అని శివుడు చెప్పాడు.

భిక్షాటన

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! విరాగులు ఇల్లిల్లు తిరిగి భిక్షను స్వీకరించి ఉదరపోషణ చేసుకుంటారు కదా ! వారి గురించి తెలియ జెయ్యండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! అలాంటి వారు ఎక్కువగా ఉపవాసము చేస్తారు, ఉన్నచోట ఉండరు, ఊరూర తిరుగుతుంటారు, పుణ్యతీర్ధములు సేవిస్తూ ఉంటారు, పుణ్యనదులలో స్నానము చేస్తుంటారు, తలంతా జడలుగట్టి భిక్షాటనతో జీవిస్తారు. నెలలో ఎక్కువ రోజులు ఉపవాసముతో గడుపుతారు కనుక శరీరంకృశించి ఉంటుంది. తృణధాన్యమును వండుకుని తింటారు. మరణించిన తరువాత వారుకూడా స్వర్గసుఖాలు అనుభవిస్తారు " అని పరమేశ్వరుడు చెప్పాడు.

వైఖాసననులు

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! వైఖానసులగురించి వివరించండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ వైఖానసులు నియమనిష్ఠలు కలిగిన వారు. వారు తృణధాన్యములను సేకరించి దానిని దంచి పచనముచేసి ఆహారంగా తింటారు. పండ్లుకొరికి తింటారు. మరికొందరు పక్షుల మాదిరి దొరికిన గింజలను దొరికినట్లు తింటారు. కొందరు ఆకులను తింటారు. మరి కొందరు నీటినిమాత్రమే త్రాగి బ్రతుకుతారు. మరి కొందరు గాలిమాత్రమే భోజనంచేసి బ్రతుకుతారు. మరి కొందరు సుష్టుగా భోజనంచేస్తారు. వీరందరూ ఇంద్రుడికి ఇష్టమైన వారు. వారు చాలాకాలము స్వర్గసుఖాలు అనుభవిస్తారు. ఇవన్నీ వానప్రస్థాశ్రమంలో ఆచరించ వలసిన ధర్మాలు. ఇవి అన్నీ తపస్సు కిందకు వస్తాయి. వీళ్ళుగాక అంగుష్ఠ మాతృలు ఉన్నారు. వారు వానఖిల్యులు. వారు సూర్య కిరణములను ఆహారంగా స్వీకరిస్తారు. ఈ లోకములన్నీ వారి వలననే నిలిచి ఉన్నాయి. ఇతరత్రా సాధించ లేని కార్యములు తపస్సు వలన సాధించబడతాయి. తపస్సు గొప్పది.

ధర్మము

[మార్చు]

పార్వతీ ! నీకు ధర్మముల గురించి వివరిస్తాను. ధర్మములలోకెల్లా గృహస్థధర్మము గొప్పది. అది అందరికీ యోగ్యమైనది. కాని మిక్కిలి సూక్ష్మమైనది. గృహస్థధర్మములో అతి పనికిరాదు. ఏదైనా సమతుల్యంగా ఉండాలి. ఏ కాలంలో చేయవలసిన పనులు ఆయా కాలాలలో చెయ్యాలి. మనస్సు నిశ్చలంగా ఉంచుకోవాలి. ధర్మబద్ధంగానే ధనమును సంపాదించాలి. ధర్మబద్ధంగానే కామోపభోగాలు అనుభవించాలి. అదే గృహస్థధర్మము. ఇక నివృత్తిధర్మము గురించి వివరిస్తాను. నివృత్తిధర్మము మోక్షముకు మార్గము. ఇంద్రియనిగ్రహము, భూతదయ, సత్యమునే పలుకడం, కోరికలను విడిచిపెట్టడం, మనస్సు నిలకడగా ఉంచుకోవడం ఇవి నివృత్తిమార్గాలు. ఇంకా ఆకలిదప్పులతో వచ్చిన అతిథికి అతనికి దాహముకు నీళ్ళు ఇచ్చి ఆకలితీరేలా భోజనం పెట్టడం ధర్మాల్లోకెల్లా పరమధర్మము. ఈ అతిథి సత్కారము ఒక్క గృహస్థ ఆశ్రమంలోనే వీలుకలుగుతుంది. మిగిలిన ఆశ్రమాలలో అతిథి సత్కారాలకు వీలులేదు. అందుకని అన్ని ధర్మములలోకెల్లా గృహస్థుధర్మము గొప్పది " అని చెప్పాడు.

గృహస్థు చేయవలసిన పనులు

[మార్చు]

పార్వతీదేవి " నాథా !గృహస్థు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏవి ? " అని అడిగింది. శివుడు " దేవీ ! గృహస్థాశ్రమంలో సతికి పతిసేవ ముఖ్యము. పతిభక్తి ముఖ్యధర్మము " అని చెప్పాడు శివుడు. పార్వతి " నాథా ! మానవునికి తల్లితండ్రులు చనిపోతే, లేక భార్యకు భర్త చనిపోతే వారు చేయవలసిన పనులు ఏవి ? " అని అడిగింది. శివుడు " పార్వతీ ! తల్లితండ్రులు చనిపోయిన గృహస్థు ఏమరకుండా అతిథి సత్కారం, పితృతర్పణములు, దేవతారాధనా చెయ్యాలి. భర్తను కోల్పోయిన భార్యలు బ్రహ్మచర్యము పాటించాలి. గృహస్థు అష్టమి, చతుర్ధశి, పున్నమి, అమావాస్య రోజులలో బ్రహచర్యము పాటించాలి. తన ఇంటిలోని ధాన్యమును ఎలుకలు, పక్షులు భుజించిన అందుకు బాధపడక వాటి ఆకలితీరిందని అనుకోవాలి. ఇంక యతీశ్వరులు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఆలోచనలు కట్టిపెట్టి నిస్సంగంగా ఉండాలి. అలా చేసిన వాడు ముక్తిపొందగలడు " అని పరమశివుడు చెప్పాడు.

రాజు యొక్క గొప్పతనం

[మార్చు]

పార్వతి " మహేశ్వరా ! రాజులకు కూడా సామాన్య మానవుల వలె శరీరము, వాటి అవసరాలు, ఆకలిదప్పులు, స్నానము భోజనము మొదలగు పనులు జరుతాయి కదా ! కాని రాజు ఎందులో అధికుడు ? అందరూ అతడికి నమస్కారాలు ఎందుకు పెట్టాలి ? రాజు యొక్క ఆగ్రహానికి అనుగ్రహానికి లోబడి ఎందుకు ఉండాలి ? రాజులు సర్వాధికారులుగా ఎందుకు శోభిల్లుతూ ఉంటారు ? " అని అడిగింది. శివుడు " పార్వతీ రాచరికము అనేది పూర్వజన్మలో చేసిన అధికమైన తపస్సు ఫలితంగా లభిస్తుంది. ఆ కారణం చేత రాజు అందరి చేత గౌరవాభిమానాలు పొందుతాడు. అతడు తప్పుచేసిన వారిని శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి అధికారము కలిగి ఉంటాడు. కాని రాజు నీతిమంతుడై ఉండాలి. అతడి నీతి అతడిని కాపాడుతూ ఉంటుంది. రాజు నీతిమంతుడైతే ప్రజలు కూడా నీతిమంతులు ఔతారు. రాజు ఇంద్రియములను జయించిన శత్రువులను కూడా జయిస్తారు. రాజు యోగ్యులైన వారిని నీతి మంతులను తన వద్ద మంత్రులుగా నియమించాలి. తనవద్ద పని చేసే సైనికులను దయతో చూడాలి. అప్పుడే సైన్యము అతడికి విధేయులై ఉంటారు. రాజు ఎల్లప్పుడూ హితులైన వారినే తనవద్ద మంత్రులుగా దగ్గర చేర్చుకోవాలి. రాజు అనుసరించే నీతినిజాయితీ అతడికి ధనమును సంపాదించి పెడుతుంది. అతడికోటను రక్షిస్తుంది. అతడి ప్రజలనురక్షిస్తుంది. రాజు అనవసర ఖర్చులు పెట్టకూడదు. అవసరమైన ఖర్చులు పెట్టడానికి వెనుకాడ కూడదు. రాజు తన స్వీయరక్షణలో ఏమర పాటు చూపకూడదు. రాజు ఎప్పుడూ పుణ్యకార్యములు చేస్తుండాలి. పాపకార్యముల జోలికి పోరాదు. న్యాయవిచారణ చేసి శిక్షలు విధించే సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రాజు ఒకరిమీద ప్రేమ ఒకరి మీదకోపము ప్రదర్శించరాదు. తన గురించి తనపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వేగుల వారి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా పాలన కొనసాగించాలి. రాజు ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. రాజైన వాడు ప్రియంగా పలకాలి. పరుషంగా మాట్లాడ కూడదు. విద్యాధికుడు అయి ఉండాలి. మిత్రుల ఎడల శత్రువుల ఎడల ఉపాయంగా వ్యవహరించాలి. సేవకుల అందు ఉపాయముతో వ్యవహరించాలి. రాజు ఎవరితో అనవసరంగా కయ్యము పెట్టుకో కూడదు. కాని అవసర సమయంలో తన పరాక్రమం ప్రదర్శించాలి. రాజు యజ్ఞములు, యాగములు చేసి దానధర్మములు చేయాలి. ఇంక రాజు అన్యాయం చేస్తే నరకానికి పోతాడు. రాజు చేసిన పాపములు ఎన్నటికీ అతడిని వదలక జన్మజన్మాంతరం వెన్నాడుతూ ఉంటాయి. పైన చెప్పిన ధర్మములను పాటించిన రాజు పుణ్య లోకాలకుపోతాడు " అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు.

పరమ ధర్మము

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! ధర్మములలో పరమ ధర్మము ఏది ? " అని అడిగింది. పరమశివుడు " అహింస అన్ని ధర్మములలో ఉత్తమ ధర్మము " అన్నాడు శివుడు. పార్వతీదేవి " నాథా ! హింస చెయ్యకుండా మానవులు జీవించడం అసాధ్యము కదా ! మరి అహింసను ఎలా ఆచరించగలరు వివరించండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! నీ వన్నది నిజమే. నేలమీద పాకేచీమలు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, దోమలు, నల్లులు, క్రిమి కీటకాదులను చంపకుండా మనిషి బ్రతకలేడు. కాని ఆహారము కొరకు జీవహింస చేయడం పాపము. ఫలములు, కాయలు, ఆకులు తిని బ్రతకవచ్చు కదా ! పాలుత్రాగి బ్రతుక వచ్చు కదా ! ఇంద్రియనిగ్రహముతో జీవించిన వారు మహాత్ములు ఔతారు. కనుక అహింసను పాటించుట కష్టము కాదు.

అహింస

[మార్చు]

అహింస అనేది వేరు విధముగా చెప్ప వచ్చు. చావు పుట్టుకలు ప్రాణులధర్మము. దానిని ఎవరూ తప్పించ లేరు. ఒకడు పెట్టిన దీపములో శలభములు పడి మర్సణించిన ఆ పాపము దీపము పెట్టిన వాడికి అంటదు. రైతు పొలము దున్నే సమయంలో నాగటిచాలులో పడి అనేక జీవులు చచ్చిపోతుంటాయి. ఆ పాపము దున్నేవాడికి అంటదు కదా ! మానవులు తమతమ దైనందిన పనులు చేసుకుంటుంటే ఆయువు తీరిన ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి. ఆ పాపపములు ఆయా మానవులకు అంటదు. ఆ ప్రాణులను తామే చంపామని అనుకోవడం మూర్ఖత్వమే ఔతుంది. పుణ్యకార్యములకు కాని పాపకార్యములకు కాని బుద్ధిముఖ్యము. ఏ పని అయినా బుద్ధి పూర్వకంగా చేస్తేనే ఆ ఫలము పనిచేసిన వాడికి సంక్రమిస్తుంది. ఈ సందర్భంలో నీకు ఒక విషయం చెప్తాను. తమకుచావు మూడిన గోవులు రంతిదేవుడు వద్దకు వెళ్ళి రంతి దేవుడు చేసే యజ్ఞములో ఆహుతి అయ్యాయి. ఆ గోవులను చంపిన రక్తము చర్మణ్వతి అనే నదిగా ప్రవహిస్తుంది. ఆ నదిలో స్నానము చేసిన వారు పాపములు నశించి పుణ్యాత్ములు ఔతారు. ఆ యజ్ఞములో చనిపోయిన గోవులన్నీ ఉత్తమలోకాలకు పోయాయి కనుక ఆ గోవులను చంపిన పాపము రంతిదేవుడికి అంట లేదు.

క్షత్రియులు హింస

[మార్చు]

యుద్ధములో ఇరుపక్షాలు ఒకరిని ఒకరు నరుక్కుంటారు. కాని యుద్ధములో చచ్చిన వాళ్ళు స్వర్గానికిపోతారు. కనుక వాటిని హింస అని చెప్పడానికి వీలు కాదు. రాజుకు వేటకు పోవడం జంతువులను వేటాడడం రాజధర్మము. క్రూరమృగములను పంట పొలమును నాశనం చేస్తాయి. మానవులను చంపి వారికి హానిచేస్తాయి. రాజు వేటలో ఆ క్రూరమృగములను చంపినందువలన అతడికి పాపము అంటదు. రాజుచేతిలో చచ్చిన మృగములకు పుణ్య లోకములు ప్రాప్తిస్తాయి. రాజు దండించతగిన వారిని విడిచిపెట్టినా దండించ తగని వారినిదండించినా, తప్పుచేయని వాడికి శిక్షవిధించినా, బ్రాహ్మణులను హింసించినా రాజు హింస చేసినట్లే. నహుషుడు బ్రాహ్మణులను హింసించి శాపోహహతుడైనాదు. అలాగే ఇంద్రుడు గౌతముడికి అపకారము చేసి శాపం పొందాడు. కనుక రాజైనవాడు బ్రాహ్మణులకు అపకారం చెయ్యకుండా రాజ్యపాలన చెయ్యాలి. అప్పుడే అతడికి సకల శుభములు కలుగుతాయి. పార్వతీ ! యజ్ఞములలో, యాగములలో జంతువులను ఊపస్తంభముకు కడతారు. వాటిని శాస్త్ర సమ్మతంగా వధిస్తారు. అలా వధించబడిన మృగములకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. యజ్ఞము చేసిన వాడికి పూణ్యము వస్తుంది. కనుక యజ్ఞ యాగములలో జంతువులను వధించుట హింస కాదు " అని అన్నాడు శంకరుడు.

లోక జీవనం

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! లోకములో జనుల జీవనవిధానం గురించి తెలపండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ఈ మానవ లోకము కర్మభూమి. స్వర్గము సుఖములకు ఆలవాలము. భూమి మీద జంతువులు పుట్టడం దుఃఖములకు మూలము. మానవులకు జీవనం గడపడానికి ధనము కావాలి. ధర్మంగా జీవించాలన్నా కోరికలు తీర్చుకోవాలి అనుకున్నా ధనము కావాలి కదా ! విద్య, వర్తకము, సేవావృత్తి, కర్షకవృత్తి ధన సంపాదనకు మూలములు. విద్య కలవాడు నిందపడకుండా బతకాలి. కర్షకుడు నేలయొక్క తత్వము తెలుసుకుని సేద్యము చేయాలి. వర్తకుడు వస్తువుల ధరల హెచ్చుతగ్గులు తెలుసుకుని వ్యాపారము చేయాలి. వచ్చిన లాభములో కొంత మాత్రమే వాడుకుని మిగిలినది పెట్టుబడికి చేర్చి వ్యాపారము చేయాలి. అప్పుడే లాభాలు ఆర్జించగలడు. పశువుల యొక్క పోకడలు తెలుసుకోవాలి. ఆ ప్రకారము పశువులను కాచే సేవకుడు ధనము, కీర్తి పొందుతాడు. పరుల ధనము పరుల భార్యలను కోరకుండా ఉండడం దైవమును పూజించడం, పితృదేవతలను ఆరాధించడం, ఇతరులపట్ల కరుణ కలిగి ఉండడం, అతిథులను ఆదరించడం ప్రతి మానవుడు ఆచరించవలసిన ధర్మములు " అని చెప్పాడు మహేశ్వరుడు.

కర్మ పరిపక్వత

[మార్చు]

పార్వతి " నాథా ! మానవులు నాలుగు వర్ణములుగా విభజింపబడ్డారు కదా. వారికి కర్మలు విధించారు కదా ! ఆ కర్మలు ఎలా పరిపక్వము ఔతాయి. వివరించండి ? " అని అడిగాడు. పార్వతి " మానవులను వర్ణములుగా విభజించిన తరువాత వారి వారికి తగిన కర్మలు విభజించబడ్డాయి. ఆ కర్మలు శ్రద్ధతోచేయు మానవులు స్వర్గంలో సుఖాను అనుభవించి తిరిగి అదే కులములో పుట్టి సుఖములను అనుభవిస్తారు. అలా కాకుండా తమ వృత్తి ధర్మాలను వదిలి ఇతర ధర్మాలు ఆచరించిన మానవులు మరణం తరువాత ఆయాకులములలో తిరిగి జన్మిస్తారు. మానవులు ఎంత పుణ్యము చేస్తే వారు అంతకంటే ఉత్తమకులములో జన్మిస్తారు. తరువాత తిరిగిరాని లోకాలు పొందుతారు. దేవతాంశలలో జన్మించిన వారు ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. గర్వంతోమదించరు. తన శౌర్యంతో పాపులను గెలుస్తారు. తమ బంధుమిత్రులతో సఖ్యతతో మెలగుతారు. దీనులను కరుణతో చూస్తారు. వారిని రక్షిస్తారు. దైవాంశతో పుట్టిన వారికి కోపం రాదు. సౌమ్యంగా ఉంటారు " అని మహేశ్వరుడు చెప్పాడు.

సంపదలు దరిద్రము

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! మానవ లోకములో కొంతమంది సుఖసంతోషాలతో సిరిసంపదలతో తులతూగుతుంటారు. సుఖాలను అనుభవిస్తుంటారు. కాని కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది పార్వతి. పరమశివుడు " గతజన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా పిడికెడు భిక్షము వెయ్యకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దారిద్ర్యంచుట్టుకుంటుంది. తినడానికి తిండి కట్టడానికి బట్టలేక బాధపడతాడు. అలా కాక పేదవారికి అన్నపానములు ఇచ్చిన వాడికి తన బంధువులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్నవాడికి మరుజన్మలో సిరిసంపదలు కలుగుతాయి. సుఖంగా జీవిస్తారు. కనుక సుఖదుఃఖములు వారి వారి పూర్వజన్మ కర్మపరిపక్వత వలన కలుగుతుంది. అంతేకాని బ్రహ్మదేవుడికి ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషము ఉండదు. దేవుడు ఎవరిని పేదవాడుగా పుట్టించడు. ఎవరైనా ఈ జన్మలో పేదవాడుగా జన్మించి కష్టములు అనుభవిస్తున్నాడంటే అది అతడు పూర్వజన్మలో చేసిన పాపములఫలము అని తెలుసుకోవాలి. పార్వతీ ! కొంత మందికి సంపదలు ఉంటాయి కాని వారు కడుపునిండా తినరు, అనుభవించరు అలా సంపదఉన్నా దరిద్రము అనుభవిస్తుంటారు. ఎందుకో తెలుసా ! వీరు పూర్వ జన్మలో ఎవరికీ పిడికెడు అన్నము పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు పోరగా బలవంతంగా పరులకు ఉపకారం చేసి ఉంటారు. అలాంటి వారు సిరిసంపదలు ఉన్నా అనుభవించలేరు. కొంతమంది తమకు ఏమీ లేకపోయినా బంధుమిత్రుల సహాయంతో తిండికి గుడ్డకు లోటులేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు పూర్వజన్మలో తమకు శక్తి లేకపోయినా ఇతరులకు దానధర్మములు చేయవలెనని మనసులో గాఢంగా కాంక్షిస్తుంటాడు. అందువలన ఈ జన్మలో కూటికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తుంటారు. ఈ జన్మలో కొంతమంది అయాచితంగా ధనము లభిస్తుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు అన్నదానము, ధనరూప దానము, వస్త్రదానము చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమతో ధనము సంపాదించే వారు పూర్వ జన్మలో ఎవరిని తిప్పించుకోకుండా పేదవారు అడగగానే దాన ధర్మములు చేసినవారు. కొంతమందికి ఎంత శ్రమపడ్డా ధనముచేకూరదు. అలాంటి వారు పూర్వజన్మలో లోభులై తమను యాచించిన వారిని రేపురా మాపురా అని తప్పించుకుని చివరకు మొండిచెయ్యి చూపి ఉంటారు. కొంత మందికి ముసలితనంలో అలాంటి వారు యవ్వనంలో ఉన్నప్పుడు దానధర్మములు చెయ్యకుండా ముసలితనంలో దానధర్మములు చేసినవారు. కొంతమంది తమకు మిక్కుటంగా ధనము కలిగినప్పటికీ వారికి ఉన్న రోగముల చేత తిండికూడా తినలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో మంచిస్థితిలో ఉన్నప్పుడు దానము చేయకుండా వ్యాధిపీడితుడైన తరువాత దానధర్మములు చేసి ఉంటారు. ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. ఈ జన్మలో కురూపులుగా ఉన్నవారు పూర్వజన్మలో అందగాళ్ళై కురూపులను ఎగతాళి చేసి బాధించిన వారై ఉంటారు. పూర్వజన్మలో ఏకపత్నీవ్రతుడై ఉన్న వాడికి ఈ జన్మలో సౌందర్యవతీ, సౌశీల్యవతీ, గుణవతీ అయిన భార్య లభిస్తుంది. అలా కాక భార్యను కష్ట పెట్టినవాడికి ఈ జన్మలో భార్యాసుఖం దూరమౌతుంది. ఈ జన్మలో విద్యా, విజ్ఞానము, జ్ఞానము కలిగి ఉండికూడా పేదరికంతో బాధపడే వాడు క్రితం జన్మలో దానధర్మములు చేయాలి అని తెలిసి కూడా దానధర్మములు చేయని వాడే. ఈ జన్మలో తెలివితేటలు లేకపోయినా కూడా అధికంగా ధనము సంపాదించిన వాడు. కిందటి జన్మలో తెలివి తక్కువ వాడైనా పేదసాదలకు దానధర్మములు చేసిన వాడై ఉంటాడు. ఈ జన్మలో విద్యావంతుడు మేధావి అయిన వాడు పూర్వజన్మలో గురువులను సేవించి విద్యావంతుడై తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించిన వాడై ఉంటాడు. కొంత మందికి విద్య నేర్చుకోవాలని అనుకున్నా విద్య రాదు. అటువంటి వాడు పూర్వజన్మలో విద్యావంతులై గర్వించి సాటి విద్యావంతులను అవమానించి ఉంటారు. ఈ జన్మలో ఏరకమైన బాధలు లేకుండా రోగాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవిస్తున్న వారు పూర్వ జన్మలో సత్యము పలుకుచూ ఇతరుల మీదదయ చూపుతూ దానధర్మములు చేసినవారు. ఈ జన్మలో మాటవినని భార్య, మూర్ఖులైన కుమారులు, ఒంటి రోగముతో నిండా బాధపడే వారు కిందటి జన్మలో కోపంతోనూ, దురాశతోనూ, నాస్థికత్వముతో విర్రవీగిన వారు. ఈ జన్మలో పుట్టుగుడ్డి వాడు లేక మధ్యలో చూపుపోయిన వాడు పూర్వజన్మలో అందగాడై ఉండి ఇతరుల భార్యల వంక చెడుభావనతో చూసిన వాడు. ఈ జన్మలో చెవిపోటుతో బాధపడే వాడు పోయిన జన్మలో మంచి వారిని పరుషమైన మాటలతో బాధపెట్టినవాడై ఉంటాడు. ఉదరవ్యాధులతో బాధపడేవాడు పోయినజన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడే వాడు పోయిన జన్మలో కన్యలను, పర కాంతలను శీలము కాజేసిన వాడు. ఈ జన్మలో క్షయరోగముతో బాధపడుతున్న వాడు పోయిన జన్మలో పరుల ఆహారమును అపహరించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుష్టురోగముతో బాధపడే వాడు పూర్వ జన్మలో పరులను దారుణంగా హింసించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుంటివాడుగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల కాళ్ళుచేతులు విరిచిన వారై ఉంటారు. ఈ జన్మలో చర్మరోగంతో బాధపడే వారు పోయిన జన్మలో మంచి వారిని హింసించిన వారు. ఈ జన్మలో పాదములకు రోగములు వచ్చిన వారు పోయినజన్మలో పాదములు కడగకుండా దేవుని వద్దకు వెళ్ళిన వారే. ఇంకా పేద వారిని, అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నినవారే. ఈ జన్మలో కడుపులో రోగములతోను, జ్వరముతోనూ, శరీరం అంతా రోగములతో బాధపడేవారు పోయినజన్మలో జంతువులను చంపినవారు గురువులను బాధపెట్టినవారు. ఈ జన్మలో గూనివాడు, మరగుజ్జువాడు పోయిన జన్మలో ధాన్యంలో తాలుగింజలు కలిపి అమ్మినవాడు, తప్పుడు కొలతలతో ప్రజలను బాధపెట్టినవాడు. ఈ జన్మలో వెర్రివాడు పిచ్చివాడు పోయిన జన్మలో అమాయకులను మోసగించి ధనం సంపాదించినవారు. ఈ జన్మలో సంతానము లేనివారు పోయిన జన్మలో తల్లితండ్రులకు శ్రాద్ధం పెట్టనివారు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపుంసకులు పోయినజన్మలో ఎద్దులకు వృషణాలు కొట్టినవారు. ఈ జన్మలో వైధవ్యము పొందిన వనిత పోయిన జన్మలో భర్తనుమోసగించి ధనము సంపాదించినది, తనభర్తను వదిలి మరియొకరి భర్తనుకోరింది. ఈ జన్మలో గొప్పవంశంలో పుట్టి కూడా చేయకూడని పనులు అందరూ ఏవగించుకునే పనులు చేసిన వారు పూర్వజన్మలో అహంకారంతో, గర్వంతో, మదంతో ఇతరులను అవమానించిన వారు. ఈ జన్మలో సేవకులుగా సేవకావృత్తి చేస్తూ యజమానులు పెట్టే బాధలను భరిస్తున్న వారు పూర్వజన్మలో అమాయకులను నిరపరాధులను కొడుతూ తిడుతూ హింసించినవారే. ఈ జన్మలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేవారు. పూర్వజన్మలో నిరపరాధిని శిక్షించినవాడే. ఈ జన్మలో ఒక్కసారిగా బంధుమిత్రులను పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో నిర్దాక్షిణ్యంగా ఎందరినో చంపినవాడు. ఈ జన్మలో తనకున్న ధనమును పోగొట్టుకున్న వాడు పూర్వజన్మలో తనదగ్గర దాచిన ఇతరుల ధనమును వారిని మోసము చేసి అపహరించిన వాడు. పార్వతీ నేను పైన చెప్పిన పాపములు చేసిన వారందరూ ముందు నరకము అనుభవించి తరువాత మానవులుగా పుట్టి ఆ కర్మ ఫలము అనుభవిస్తున్న వారే. క్రితము జన్మలో తక్కువ పాపములు చేసిన వాడు మానవుడుగా జన్మిస్తాడు. ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో అనుభవానికి రావు " అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.

రాజదండన

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! మనుషులు తాము చేసిన పాపకర్మలకు ఫలితము మరుజన్మలో అనుభవిస్తారు కదా ! కాని మానవులు వారు చేసిన పాపకర్మలకు రాజుల చేతిలో, న్యాధికారుల చేతిలలో శిక్షలు అనుభవిస్తున్నప్పుడు వారి పాపకర్మలు ఈ జన్మలోనే ఫలితము అనుభవించినట్లు ఔతుంది కదా ! ఇది తమరు చెప్పిన దానికి పరస్పరవిరుద్ధము కాదా ! " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! రాజులు న్యాయాధికారులు తప్పు చేసిన వారికి నిష్పక్షపాతంగా శిక్షలు వేస్తారు. ఆ శిక్షలు చూసి మిగిలిన వారు నేరములు చేయకుండా నియత్రింఅడానికి అలా చేస్తారు. ఆ శిక్షలు అనుభవించడం అన్నది పూర్వజన్మ పాపఫలితమే. ఈ జన్మలో చేసిన పాపపుణ్యములు మరుజన్మలో అనుభవించక తప్పదు " అన్నాడు శివుడు. పార్వతీ దేవి " దేవా ! రాజ దండన వలన పాపకర్మల ఫలితము తొలగిపోతుందా పోదా ! " అనీడిగింది. శివుడు " రాజదండనకు గురి అయిన వాడు యమదండన తప్పించుకుంటాడు. కాని అపరాధిని విడిచిపెట్టినా నిరపరాధిని శిక్షించినా రాజుకు, అధికారికా నరకము తప్పదు. కనుక ఎటువంటి వారైనా తాము చేసిన కర్మల ఫలము అనుభవించక తప్పదు " అన్నాడు శివుడు.

కర్మ ప్రేరణ

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! మానవుడు చేసే కర్మలు తన సంకల్పంతో చేస్తాడా ! లేక గ్రహస్థితి అనూల ప్రతికూలములను అనుసరించి చెస్తాడా ! వివరించండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! మానవుడు గ్రహ సంచారము కారణంగా శుభములు అశుభములు అయిన కర్మలు చేస్తూ ఉంటాడు. తన కర్మలన్నింటికీ తానే అధికారి. గ్రహాలు ఏవీ మానవులను ప్రేరేపించి కర్మలను చేయించవు. తాను చేసే కర్మలకు తానే కర్త కనుక ఆ కర్మల ఫలితము తాను అనుభవించక తప్పదు " అని పరమేశ్వరుడు చెప్పాడు.

మరణం

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు " దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు " అని పరమేశ్వరుడు చెప్పాడు. పార్వతీ దేవి " నాథా ! బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది పార్వతి. పరమేశ్వరుడు " దేవీ ! ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది " అని చెప్పాడు ఈశ్వరుడు. పార్వతీదేవి " నాథా ! మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ? ఎందువలన తగ్గుతుంది ? " అని అడిగింది పార్వతి. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయకలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తికలిగి ఉండాలి. వీటన్నింటిని మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది. అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటివలన ఆయువు క్షీణిస్తుంది. పార్వతీ " తపస్సుచేతనూ, బ్రహ్మచర్యముచేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములీ తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది " అని పరమేశ్వరుడు చెప్పాడు.

జీవాత్మ స్త్రీ పురుషులు

[మార్చు]

పార్వతీదేవి " నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది " తెలియజెయ్యండి. పరమశివుడు " పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతములు వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. అసత్యం పలకడం, ఇతరులపట్ల దయ లేకుండా ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది. అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్థిని దండించి విద్యాబోధ చేసాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది. జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది. మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే " అన్నాడు శివుడు.

పూర్వ జన్మ స్మృతి

[మార్చు]

" పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. ఒక్కోసారి మరణించిన మానవుడు తిరిగి బ్రతకడం జరుగుతుంది. ఒక్కోసారి యమభటులు పొరపాటున ఒకరికి బదులు ఒకరిని తీసుకు పోతుంటారు. యముడు ఆ పొరపాటును సరిదిద్ది తిరిగి భూలోకానికి పంపిస్తాడు. ఇలాంటివి అక్కడక్కడా జరుగుతుంటాయి " అని చెప్పాడు శివుడు. పార్వతీదేవి " మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? " అని అడిగింది. " పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి " అని చెప్పాడు మహేశ్వరుడు.

కర్మకు బాధ్యులు

[మార్చు]

పార్వతీదేవి ! మానవులు కర్మలు చేస్తుంటారు కదా ! ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా ! లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీలేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు. మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసేపనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు. ఒక పనిచెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది. నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది. అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు. కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పకకావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు.

జీవుడు గర్భప్రవేశము

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! మరణానంతరము జీవుడు మరొక దేహములో ప్రవేశిస్తాడని అన్నారు కదా ! జీవుడు మరొక గర్భములో ఎలా ప్రవేశిస్తాడు ? " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! స్త్రీపురుషుల కలయిక వలన స్త్రీ గర్భము ధరించినప్పుడు పిండము ఉత్పత్తి ఔతుంది. ఆ పిండములో జీవుడు ఉండి శిశువుగా పునర్జన్మ పొందుతాడు. జీవుడు స్త్రీ గర్భములో రూపుదిద్దు కోవడానికి దైవసహాయము తప్పని సరి. పార్వతీ ! నీకొక రహస్యము చెప్తాను. పూర్వము మానవులందరికీ పూర్వజన్మ స్మృతి ఉండేది. అందువలన మానవులందరూ తమనుతాము సంస్కరించుకుని పుణ్యకార్యములు చేసి స్వర్గలోక సుఖములు పొందుతూ ఉండే వారు. అందరూ స్వర్గములో ప్రవేశించడంతో స్వర్గములో తొక్కిసలాట అధికమైనది. వీరందరికీ స్వర్గసుఖములు కలింగించడం దేవతలకు శ్రమ కలిగించింది. దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమకష్టము చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు యోచించి మానవులకు ఉన్న పూర్వజన్మ స్మృతి తీసివేసి దాని స్థానంలో మానవులకు కోరికలు, కామము, మదము, మాత్సర్యము, మోహము, లోభము మొదలైన దుర్గుణములు కల్పించాడు. దాని ఫలితంగా మానవులకు కోరికలు ఎక్కువై ఆ కోరికలు తీరడానికి చెడ్డపనులు చేయడానికి సంకల్పించారు. ఆ కోరికలు తీరకపోతే కోపము వచ్చేది. ఆ కోపము కారణంగా మానవులు మరణానంతరం స్వర్గానికి వెళ్ళలేక పోయారు. కాని నరకానికి మానవుల రాక ఎక్కువైనది. నరకంలో తాకిడి తగ్గించడానికి బ్రహ్మదేవుడు ఒక ఉపాయము ఆలోచించి స్వర్గానికి నరకానికి సమానంగా మానవులు వెళ్ళే ఏర్పాటు చేసారు. మానవులకు స్వర్గము, నరకము వాటి స్థితిగతులు కేవలం శాస్త్రపరిజ్ఞానము వలననే తెలిసే ఏర్పాటు చేసాడు. కనుక స్వర్గ నరకాల పరిజ్ఞానము మానవులు వారికి వారుగా తెలుసుకునే శక్తినికోల్పోయారు " అని పరమేశ్వరుడు చెప్పాడు.

పునర్జన్మ

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! భూలోకంలో పునర్జన్మ ఉందని కొందరు లేదని కొందరు వాదులాడుకుయంటారు. ఈ సందేహము ఎంతకీ మానవులను వదలడం లేదు కనుక దాని గురించి వివరించండి " అని అడిగింది. పరమేశ్వరుడు నవ్వి " ఈ సందేహం మానవులకే కాదు దేవతలకు కూడా ఉంది. ఈ విషయంలో ఎవరికీ కచ్చితమైన అభిప్రాయంలేదు. పునర్జన్మ ఉన్నది కాని ఈ విషయము వేదపరిజ్ఞానము కలవారికే బోధపడుతుంది " అని అన్నాడు ఈశ్వరుడు. పార్వతి " నాథా ! మానవులు చనిపోగానే వారికి ఉన్న ఆకారము పోతుంది. అంటే స్థూల శరీరము పోతుంది. శరీరమే లేనప్పుడు యమభటులు ఈ మానవుడిని ఎలా యమలోకానికి తీసుకు వెళ్ళగలరు ? " అని అడిగింది. శివుడు " పార్వతీ ! ఆయువు తీరగానే మానవుడు ఈ శరీరాన్ని విడిచి పెడతాడు. అప్పుడు యమభటులు ఆ ప్రాణాన్ని ఒక సూక్ష్మశరీరంలో ప్రవేశపెడతారు. తరువాత మంచివారు, ధర్మాత్ములు, పుణ్యకార్యములు చేసిన వారు అయిన మానవులను చక్కటి రాజ మార్గములో తీకసుకు వెళ్ళి యమధర్మరాజు ముందు నిలబెడతాడు. యముడు వారు చేసిన పుణ్యకార్యములను విచారించి పుణ్యలోకములకు పంపుతాడు. కొంచం తక్కువగా పుణ్యం చేసుకున్న వారిని తిరిగి మానవ లోకంలో పుట్టమని పంపుతాడు. పాపం చేసిన వారిని నరకానికి పంపుతాడు " అని పలికాడు.

నరకము

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! నరకమనగా ఏమి ? అది ఎలా ఉంటుంది " అని అడిగింది. శివుడు " దేవీ ! ఈ భూమికి కిందుగా రౌరము, హారౌరము, కంటకావనము, అగ్ని కుండము, పంచాష్టకము అనే అయిదు నరకాలు ఉన్నాయి. మానవులు చేసిన పాపమును అనుసరించి ఆయా నరకాలకు వెళ్ళి శిక్షలు అనుభవిస్తుంటారు. అక్కడ కాల్చడము, నరకడం, కట్టడము, కొట్టడము, కుక్కల చేత కరిపించడం, క్రిముల చేత పీడించడం, గ్రద్దల చేత పొడిపించడం మొదలైన నరక బాధలు పెడతారు. ఆ ప్రకారము పాపములు చేసిన వారు నరక బాధలు అనుభవించి పునీతులు ఔతారు. తరువాత భూలోకములో పురుగులుగా, తరువాత పక్షులుగా, తరువాత జంతువులుగా, తరువాత మానవులుగా జన్మిస్తారు " అని పలికాడు.

పాపములు

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! మీరు పాపములు అని చెప్పారు కదా ! అసలు పాపమంటే ఏమిటి ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు మూడు విధములైన పాపములు చేస్తాడు. అవి మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతో చేస్తాడు. ఇతరులకు ధనం ఉందే అని ఏడుస్తూ వాటిని అపహరించాలని అనుకోవడము, తన ఎదుటగా చెడ్డ పనులు, చెయ్య కూడని పనులు జరుగుతుంటే చూసి ఆనందించడమూ అడ్డు చెప్పక పోవడం, ధర్మకార్యములు, దైవ కార్యములు చేసే వాడికి అడ్డు దగలడం, చెయ్యనీయకుండా ఆపడం ఇవన్నీ మనసుతో చేసే పాపములు. అబద్దాలు చెప్పడం, ఇతరులను తిట్టడం, కఠోరంగా మాట్లాడడం ఇవి వాక్కుతో చేసే పాపములు. ఇతరులను కొట్టడం, చంపడం, అక్రమంగా బంధించడం, అడ్డమైన తిండులు తినడం, మద్యం త్రాగడం. పరాయి స్త్రీలను చెరపట్టుట, అనుభవించడం ఇవి శరీరంతో చేసే పాపములు. ఈ పాపాలన్నింటికీ మద్యపానం మహా పాపము. దీని వలన ఎన్నో అనర్ధాలు కలుగుతాయి. ఇలా మానవులు పాపకూపంలోకి పోతుంటారు " అన్నాడు.

పుణ్యములు

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! పాపములగురించి చెప్పారు మరి పుణ్యకార్యముల అంటే ఏమిటి ? అవి ఎలాఉంటాయి ? " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! పుణ్యలు కూడా మూడు రకాలు. ఔపరమికము, నిరుపకరణము, సోపకరణము అని మూడు విధములు.

ఔపకరణము

[మార్చు]

ఔపరిమికము అంటే పాపములు చెయ్యకుండా ఉండడం. పాపకార్యములను విడిచిపెట్టుట. వాటి జోలికిపోకుండా ఉండడం. ఈ పని చెయ్యడానికి ధనము అవసరము లేదు. మనసులో అనుకుంటే చాలు. అన్నీ సుఖాలే కలుగుతాయి. చెడ్డపనులు చెయ్యకుండా ఉండడం మన చేతిలోపని. అదీ చెయ్యక పోతే నరకానికి పోక తప్పదు. చెడ్డ పనులను చెయ్యడం మానిన తరువాత వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి అర్ధము చేసుకొని ఆచరించాలి. ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. దీనివలన ఈ లోకములో సుఖములు అనుభవించవచ్చు పరలోకములో స్వర్గసుఖములను అనుభవించ వచ్చు.

నిరుపకరణము

[మార్చు]

నిరుపకరణము అంటే శౌచము అంటే శుభ్రముగా ఉండడం. అంటే కేవలం శుభ్రంగా ఉంటే చాలదు. మనసు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. అబద్దాలు చెప్పకూడదు. శాంతంగా ఉండాలి. ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. మంచి ప్రవర్తనతో మెలగాలి. శక్తిమేరకు ఉపవాసాలు చేయాలి. శక్తి కొద్ది వ్రతములు ఆచరించాలి. బ్రహ్మచర్యము పాటించాలి. దీనిని నిరుపకరణము అంటారు. మొదట చెప్పిన శౌచము బాహ్యము, అభ్యంతరము అని రెండు రకములు. బాహ్యశుచి అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తినే ఆహారము పరిశుభ్రంగా ఉండాలి. కంటితో చూసింది, చెవులతో విన్నది బయటకు చెప్పాలి. చెప్పింది చేయాలి. అంటే ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. అభ్యంతరం అంటే మనసును ఎలాంటి వికారాలకు లోను కాకుండా నిర్మలంగా ఉంచుకోవాలి.

స్నానములు

[మార్చు]

దేవీ ! పుణ్య నదులలో స్నానము చేస్తే దేహం పవిత్రమౌతుంది. సముద్రములలో కలిసే నదులను తీర్ధములు అంటారు. తీర్ధములలో స్నానము చేసిన పుణ్యము వస్తుంది. ఈ నదులలో కూడా మునీశ్వరులు తమతమ పాదములు మోపిన ప్రదేశములు పరమ పవిత్రమైనవి. అలాగే నదులు సముద్రములలో కలిసే సంగమ ప్రదేశములు పరమపవిత్రములైనవి. ఈ పుణ్య తీర్ధములలో స్నానము చేసే ముందు కాలకృత్యములు తీర్చుకోవాలి. శుభ్రంగా స్నానం చెయ్యాలి. ఎల్లప్పుడూ దూరంగా ఉండి శ్రమతో కూడిన తీర్ధయాత్ర మంచిది. దగ్గరలో ఉన్న తీర్ధములలో స్నానం ఫలితం ఇవ్వదు.

సోపకరణము

[మార్చు]

పార్వతీ పుణ్యములలో మూడవది సోపకరణము. ధనము, ధాన్యము సమృద్ధిగా ఉండి దానధర్మములు, పితృకార్యములు, దేవకార్యములు చేయు గృహస్థులు చేయు పుణ్య కార్యములను సోపకరణము అంటారు. గృహస్థులు తాము న్యాయంగా సంపాదించినధనము, ధాన్యమును వేదములు చదువుకున్న బ్రాహ్మణులకు పుణ్యతీర్ధములందు దానము చెయ్యడం వలన పుణ్యమువస్తుంది. ఈ దానములు కూడా మూడురకములు. తన శక్తికి మించి దానధర్మములు చెయ్యడం ఉత్తమము, తన శక్తికి తగినట్లు దానధర్మములు చెయ్యడం మధ్యమము. తనకు శక్తి ఉండి కూడా దానికి తగినట్లు దానధర్మము చెయ్యక పోవడం అధమం. దానములు దేవ కార్యములలో పితృకార్యములలో చెయ్యతగినవి. తనకు ఇష్టమైన వస్తువులను బ్రాహ్మణులకు ఇవ్వడంవలన పుణ్యం వస్తుంది. కొంత మంది దానము చేసిన తరువాత అయ్యో ఇంత దానముచేసానే అని చింతించే వారు ఉంటారు. అలాగే దానము చేసిన తరువాత తాను చేసిన దానమును పొగుడుకునే వారు, పొగిడించుకునే వాళ్ళు, ప్రచారము చేసే వాళ్ళు ఉంటారు. వారికి ఆదానము చేసిన ఫలము దక్కదు. గుప్తదానము శ్రేష్ఠమైనది " అని పరమశివుడు చెప్పాడు.

దానము ఇవ్వతగిన వస్తువులు

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! దానము ఇవ్వతగిన వస్తువుల గురించి తెలపండి " అని అడిగింది. శివుడు పరమశివుడు " పార్వతీ ! అన్నము నీరు అన్నీ జీవులకు ప్రాణాధారము. కనుక దానము చెయ్యతగిన వస్తువులలో నీరు ముఖ్యమైనవది. అతిథులకు అన్నము నీరు ఇచ్చి తృప్తిపరిస్తే వారికి స్వర్గలోకసుఖములు ప్రాప్తిస్తాయి. బంగారము అగ్నితో సమానము. కనుక బంగారము దానం చెయ్యడం అగ్నిని దానము చెయ్యడంతో సమానము. తరువాత స్థానము గోదానము చెయ్యడము. గోవును బ్రాహ్మణులకు దానము చేసిన ఆ గోవు శరీరము మీద ఎన్ని రోమములు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాడు. కపిలగోవు దానము ఇంకా పవిత్రమైనది. కపిలగోవును దానము ఇచ్చిన 21 తరాల పితరులు స్వర్గానికి వెడతారు. తరువాతది భూదానము. భూదానము చేసిన వారు ఆ భూమి ఉన్నంత కాలము స్వర్గసుఖములు అనుభవిస్తారు. భూమిలో సకల సంపదలు ఉంటాయి కనుక భూమిని దానం చేసిన సకల సంపదలను దానము చేసినట్లే . తరువాత దానము కన్యాదానము. కన్యాదానము చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు. దేవతలు హర్షిస్తారు. కన్యాదానము చేసిన వాడికి తేజస్సు, యశస్సు కలుగుతాయి. తరువాతి దానము విద్యాదానము. విద్యాదానము అర్హులకు మాత్రమే చేయాలి. అపాత్రా దానము చేయరాదు. విద్యాదానము చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకము ప్రాప్తిస్తుంది. కొంత మందికి విద్య రాదు. అటువంటి వారు విద్యాదానము చెయ్య లేరు. అటువంటి వారు బాగా విద్యవచ్చిన గురువులకు దక్షిణ ఇచ్చి వారి చేత విద్య చెప్పించిన ఎడల వారే స్వయంగా విద్యచెప్పించిన ఫలితం దక్కుతుంది. పార్వతీ నువ్వులు దానము చేస్తే అగ్ని ష్ఠోమ ఫలము, వస్త్రములను దానంగా ఇచ్చిన అన్ని పీడల నుండి విముక్తి, దాసదాసీ జనములను దానంగా ఇస్తే ఆత్మ సంతృప్తి, నదులను, జలప్రవాహాలను దాటిస్తే దుఖములన్నీ తొలగి పోతాయి. ప్రయాణము చేయు బాటసారులకు రహదారుల పక్కన సత్రములు కట్టి ఆశ్రయము కల్పించిన సకల శుభములు కలుగుతాయి. ఇవీ దానముకు కలుగు ఫలములు " అని మహేశ్వరుడు చెప్పాడు.

యజ్ఞములు వాటి ఫలములు

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! యజ్ఞములు వాటి ఫలములు చెప్పండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! యజ్ఞములు రెండు విధములు. ఒకటి వైదికయజ్ఞము. రెండవది లౌకికయజ్ఞము. వైదికయజ్ఞము అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు న్యాయంగా ధనము సంపాదించి ఆ ధనముతో దేవతలను తృప్తి పరచడానికి ఋత్విక్కులతో చేయించే యజ్ఞములు వైదికయజ్ఞము అంటారు. దేవతలకు ఉత్సవములు, బ్రహ్మోత్సవములు, గీత, వాద్య, నృత్య ప్రదర్శనలు ధూపదీప నైవేద్యములు, ఊరేగింపులు, రథోత్సవములు మొదలైనవి లౌకిక యజ్ఞములు అని అంటారు. ఈ రెండూ దేవతలకు ప్రీతి పాత్రములే. దాన ధర్మములు చెయ్యడం, మంచి వ్రతాలు ఆచరించడం, ఇవన్నీ కూడా యజ్ఞములకు సాటిరావు. యజ్ఞము చేసిన వాడు లోకోత్తరుడు. అతడికి ఇవ్వడము అతడి నుండి తీసుకొనడము అధికమైన పుణ్యము కలుగజేస్తుంది. కాని వైదికయజ్ఞములు శ్రద్ధాభక్తితో చెయ్యాలి. కాని మనస్సు ఎక్కడో పెట్టి చెయ్యరాదు. అలా చేసిన యజ్ఞము చేసిన ఫలము దక్కదు.

పితృ యజ్ఞములు

[మార్చు]

పార్వతీదేవి " నాధా ! మీరు దేవ యజ్ఞము గురించి చెప్పారు. పితృ యజ్ఞము గురించి కూడా తెలపండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! గయ, కురుక్షేత్య్రము, గంగ మొదలైన పుణ్యక్షేత్రములు అధికంగా ఫలితము ఇస్తాయి. మాఘమాసము, భాద్రపదమాస బహుళపక్షము, అమావాస్య, ద్వాదశి, నవమి తిథులు ఆ తిధులలో అపహార్ణ సమయము, పితృకార్యములకు శ్రేష్ఠము. అపహార్ణ కాలము, దౌహిత్రుడు, నువ్వులు, పితృ కార్యములకు శ్రేష్ఠము. పితృకార్యములకు కోపము పనికి రాదు. అతి శుభ్రంగా ఉండాలి. మనసు నిర్మలంగా ఉండాలి. పితృకార్యములలో నెయ్యి, పెసల పప్పుతో చేసిన పాయసము, పిండి వంటలు ప్రధానమైన వంటకములు. పితృకార్యములకు శుక్లపక్షము, అనగా అమావాస్య తరువాత వచ్చు పాడ్యమితిథి పౌర్ణమి వరకు ఉండే తిథులు, ఉదయకాలము, మధ్యాహ్నానికి ముందు చెయ్యాలి. సరితిథులు, పుట్టిన రోజులు పితృకర్మలకు పనికి రావు. ఇంక పితృ కర్మలకు పిలువబడిన వారు వేదము చదివిన వారు అయి ఉండాలి. రోగిష్టివాడు, వికలాంగుడుకారాదు. సరిగోత్రికుడు, భార్యచనిపోయిన వాడు, ఇతర కులముల వారు పనిక రారు. పితృ కార్యములలో నియమించిన వారిని గంధము, పుష్పములు, ధూపము, దీపములతో అర్చించాలి.

పిండప్రధానం

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! మానవులు చనిపోగానే మరలాజన్మ ఎత్తాలి కదా ! మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండప్రదానాలు చెయ్యాలి. వివరంగా తెలియ జెయ్యండి " ఆ ప్రశ్న పార్వతీదేవి అడగగానే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. పరమశివుడు ఏమి సమాధానం ఇస్తాడో అని ఆతురతగా ఎదురు చూసారు. పరమశివుడు " పార్వతీ ! నువ్వు అడిగిన ప్రశ్న చాలా సందేహాలతో కూడుకున్నది పరమరహస్యము కూడా. పితరులు కూడా దేవతల వంటివారే ! దేవతలు ఉత్తరదిక్కున ఉంటారు. దేవతాపూజకు హవ్యము అనీ పితృకార్యములకు కవ్యము పేర్లు. పితృకార్యములు చేస్తే దేవతలు సంతోషించి ఆ కర్తకు ఆయుస్షు, ధనము, కీర్తి ప్రసాదిస్తారు. పితృగణములు దేవతలకు, అసురులకు, గరుడులకు, యక్షులకు మొదలగు వారికి కూడా పూజనీయులు. పార్వతీ శ్రద్ధగా విను కుంచెడు ధాన్యము కలవాడు ఆ కుంచడు ధాన్యమును దానంగా ఇచ్చినా కోటి రూపాయలు ధనం ఉన్న వాడు ఆ కోటి రూపాయలు దానంగా ఇచ్చినా రెండూ సమానమే. కనుక దానములు తన శక్తికి తగ్గట్టు చేయాలి. అప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానము చేసినా మనసులో తిట్టు కోకుండా ప్రేమతో మనసారా ఇస్తే ఆ దానము సత్ఫలితాన్ని ఇస్తుంది " అని చెప్పాడు ఈశ్వరుడు.

ధర్మములు

[మార్చు]

పార్వతీదేవి " నాథా ! ధర్మము నానా విధములుగా ఉంటుంది కదా ! ఆ ధర్మము యొక్క విశేషముల గురించి తెలియజెయ్యండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! పార్వతీ శృతులలో చెప్పిన ధర్మముల గురించి వివరిస్తాను. ధర్మములలో జాతిధర్మములని, కులధర్మములనీ, గుణధర్మములనీ, శరీరములను బట్టి కాలము బట్టి మారే ఆపద్ధర్మము అని ధర్మములు అయిదు విధములు.

పుణ్యము లోకములు

[మార్చు]

పార్వతీదేవి " నాధా ! పుణ్యలోకములో భోగములు ఎలా ఉంటాయో వివరించండి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! ఆ లోకములో పుష్పములు ఆయా ఋతువులను పూస్తూ ఉంటాయి. కల్పతరువుల నుండి శరీరానికి లేపనము సువాసనలు వెదజల్లు తుంటాయి. అక్కడ అమృతమే ఆహారము. అక్కడ దుస్తులు మలినము లేనివి. ఆభరణములు నిరుపమానంగా మెరుస్తూ ఉంటాయి. అక్కడ అందరూ పరస్పర స్నేహభావంతో మెలగుతుంటారు. అక్కడ ఉన్న వారి మనసులో మార్దవము, సుగుణములు విరాజిల్లుతుంటాయి. అక్కడ సుఖము తప్ప దుఃఖము లేదు. అక్కడ కోపము మొదలైన దుర్గుణాలకు తావు లేదు. అక్కడ ఉన్న వారు రోగములు, ముసలితనము అనేది తెలియకుండా నిరంతరము ఆనందములో తేలియాడు తుంటారు " అని మహేశ్వరుడు చెప్పాడు.

సుగతి దుర్గతి

[మార్చు]

పార్వతీదేవి " నాధా ! చనిపోయిన తరువాత వీరు సుగతికి పోవాలి. వీరు దుర్గతికి పోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! తనతోటి వారికి కీడుతలపెట్టని వారు, ఎల్లప్పుడు సదా ధర్మంగా బ్రతికేవారు, సజ్జనులను, గురువులను పూజించేవారు, ఎల్లప్పుడూ సత్యమునే మట్లాడేవారు, దీనులను ఆదరించు వారు, అతిధులను పూజించు వారు, ఇతరులపట్ల దయ జాలి కలిగిన వారు, వీరంతా స్వర్గమునకు పోవడానికి అర్హులు అని తెలుసుకొన వలెను " అని చెప్పాడు.

ఉత్తమ ధర్మము

[మార్చు]

పార్వతీదేవి " స్వామీ ! ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా ! అందులో ఉత్తమధర్మము ఏది ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పర్వతరాజపుత్రీ ! పురుషార్ధములు నాలుగు. ధర్మము, అర్ధము, కామము, మోక్షము. అందులో మొదటి మూడు అయిన ధర్మ, అర్ధ, కామముల వలన కలిగే సుఖములు అశాశ్వతములు. అవి ఎన్నటి కైనా నశిస్తాయి. కాని ఆఖరిది అయిన మోక్షము శాశ్వతమైనది, సుఖప్రథమైనది. అది ఎన్నటికీ నశించదు. కనుక మొదటి మూడు పురుషార్ధముల కంటే మోక్షము అత్యుత్తమమైనది. మోక్షము ఎలా పొందాలో నీకు చెప్తాను. మానవుడు గృహస్తాశ్రమము స్వీకరించిన తరువాత ఋణములు అన్నీ తీర్చుకుంటాడు. అంటే దేవ ఋణము, పితృఋణము, ఋషిఋణము, మనుష్యఋణము తీర్చుకుంటాడు. తరువాత వానప్రస్థముకు వెళతాడు. అక్కడ అడవులలో నివసిస్తాడు. ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనస్సుతో మునుల నుండి సాంఖ్యమును అభ్యసిస్తాడు. సాంఖ్యమనగా 25 తత్వముల జ్ఞానము తెలుసు కొనడమే. తరువాత యోగాభ్యాసము చేస్తాడు. సాంఖ్యము యోగము రెండూ ఒక్కటే. తరువాత సుఖదుఃఖములు, రాగద్వేషములు మొదలగు ద్వందములను జయిస్తాడు. తరువాత శౌచము, బ్రహ్మచర్యము, శాంతజీవనము, మితాహారము తీసుకోవడము పాటిస్తాడు. మనస్సును అంతర్ముఖంచేస్తాడు. మధ్య మధ్య వచ్చే అవాంతరములను తొలగించుకుంటూ మోక్షమార్గాన పయనిస్తాడు. ఇదీ మోక్షమార్గము. ఇది నిరంతర అభ్యాసము వలన మాత్రమే కలుగుతుంది. ఈ మోక్షమార్గము మానవుడిని జననమరణచక్రము నుండి విముక్తుడిని చేస్తుంది. మానవుడు సంసారములో విముఖత చెందనంత వరకూ మోక్షమార్గములో పయనించ లేడు. ఈ ప్రాపంచిక విషయముల మీద మనసు విరక్తి కలిగినప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు. పార్వతీ ! మనసులో ఉన్న చింతలన్నీ వదిలి పెడితే కాని అందరి అందు సమత్వము, సమభావన కలిగితే కాని తృష్ణ, ఆశ, లోభత్వము విడిచి పెడితే కాని పైన చెప్పిన విరక్తి కలుగదు. వాటి స్వభావము వివరిస్తాను. ధనము ఉన్నా పోయినా, దగ్గర బంధువులు చని పోయినా దాని గురించి విచారించడం మానుకోవాలి. పోయిన ధనము గురించి, చనిపోయిన బంధువుల గురించి దుఃఖించడం వలన దుఃఖము పెరుగు తుందే కాని తరగదు. కనుక దుఃఖించడం అనవసరము. ఎందుకంటే సుఖము, దుఃఖము ఒకదాని వెంట వస్తూ పోతుంటాయి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి కూడా సుఖము దుఃఖము ఒకటి వెంట ఒకటి వచ్చాయి. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ నాశనం కావడం కాని తధ్యము. ఈ సత్యము తెలిస్తే దుఃఖము కలుగదు. కనుక నాశనం అయ్యే వాటి గురించి చింతించడం అవివేకము. ఇతరుల నుండి ధనమును వస్తువును స్వీకరించే వాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను తాను బంధించుకుంటాడు. పార్వతీ ! మానవుడికి ధనము సంపాదించడం, సంపాదించిన ధనం కాపాడడడం, ఆ ధనమును ఖర్చు చెయ్యడం, ఆ ధనము పోతే దాని కొరకు దుఃఖించడం ప్రధాన వ్యాపకాలు. కనుక ధనము అన్ని దుఃఖములకు మూలకారణము. ధనము లేకపోతే దుఃఖము ఉండదు.

ధనము తరువాత ఆశ మానవుడిని నాశనం చేస్తుంది. ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు. ఆశను వదిలితే కలిగే సుఖము దేనికీ సమానము కాదు. ఆశ అనేది మనిషితోపాటు పుడుతుంది. మనిషి చచ్చేదాకా అతడిలో ఉన్న ఆశచావదు. కనుక ఆశ ప్రాణాలను తీయకలిగిన ప్రాణాంతక వ్యాధి. కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూ ఉంటాయి. కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు. అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా ! అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి. కోరికలను ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖంకలుగుతుంది. మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియములను వాటి ఇష్టము వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖముకలిగిస్తాయి. అలాకాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖము కలుగుతుంది. మరణం తరువాత సద్గతులు కలుగుతాయి. ఎప్పుడూ ధనము సంపాదించడం లోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలే వాడిని మృత్యువు ఒక్క సారిగా మీదపడి అడవిలో పెద్దపులి మేకమీద పడి కబళించినట్లు కబళిస్తుంది. మానవుడు సంపాదించిన ధనము, అతడు చేసిన ధర్మములు, యజ్ఞములు, యాగములు, అతడిని మృత్యువు నుండి కాపాడ లేవు. పుట్టిన వాడు చావక తప్పదు. కేవలం మోక్షసాధనతోనే ఈ జనమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు. మానవుడి జీవితంలో ఒక్కొక్కరోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచేకొద్దీ అతడి ఆయువు క్షీణిస్తుంది. అతడు మృతృయువుకు దగ్గర ఔతుంటాడు. కనుక రేపటి పని ఈ రోజు, తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి. కాలయాపన, అలసత్వము, సోమరితనము పనికి రాదు. కాలముకు వశుడైన మానవుడికి ఏమరిపాటు సహజము. కాలం గడిచే కొద్దీ ఆయుష్షు తరిగి పోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుతుంది. ఆ విరక్తిమార్గము ముక్తికిసోపానము. పార్వతీ ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేక పోతే అతడు మనస్సును జయించగలడు. దాని వలన ముక్తి లభించి జరామరణచక్రము నుండి విముక్తి పొందగలడు.

సాంఖ్యము

[మార్చు]

పార్వతీ ! ఇప్పుడు నీకు సాంఖ్యము గురించి చెప్తాను. ఈ సాంఖ్యయోగము సంసారము అనే జబ్బుకు మంచి మందు. సాంఖ్య యోగులు జ్ఞాన సముపార్జనతో ముక్తి చెందుతారు. కాని ఈ శరీరముతో తపస్సు చేయడ, శరీరాన్ని సుష్కించచేయడం వృధా ప్రయాశ. కేవలం జ్ఞానము వలనే మోక్షం పొందగలము. ఈ ప్రకృతికి అవ్యక్తము అనే పేరు కూడా ఉంది. ఈ ప్రకృతిలో నుండి మహత్తత్వము, అహంకారము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, వాటి గుణములు, ఆవిర్భవించాయి. ఇవి అన్నీ కలిపి 24. 25వ తత్వము ఆత్మ. ఈ ఆత్మ సత్వ, రజొ తమో గుణముతో ప్రభావితం ఔతుంది. వీటి ఆధారంతో ప్రకృతిలో సృష్టి జరుగుతుంది. అవ్యక్తమైన ప్రకృతి ఏక అణువు. అనగా అణువు ఒక్కటే అవిచ్ఛిన్నము. కంటికి కనపడదు. ఇదే సృష్టికి ప్రధానము.

త్రిగుణములు

[మార్చు]

సౌఖ్యము, తృప్తి, ప్రకాశము సత్వగుణ లక్షణములు. సుఖదుఃఖాలు, రాగద్వేషములు, మొదలగు ద్వందములు రజోగుణ లక్షణములు. అజ్ఞానము, భయము, అంతా తనకు తెలుసు అనే భ్రాంతి, విపరీతమైన జ్ఞానము కలిగి ఉండడం, ఏ పనీ చెయ్యకపోవడం, అలసత్వము ఇవి తమోగుణ లక్షణములు. సత్వగుణము ప్రధానంగా కలవాడికి, ధైర్యము, విజ్ఞానము, శ్రద్ధ, దేని మీద మోహము లేకపోవడము, ఇతరుల పట్ల దయ, ఎప్పుడూ సంతోషంగా ఉండడం అనేవి ప్రధాన గుణములు. ఈ గుణములు లేకపోతే సత్వగుణము కూడా నశించి పోతుంది. కోపము, లోభము, కామము, ద్రోహచింతన, దుఃఖము ఇవి రజోగుణ గుణములు. ఈ గుణములు విడిచిపెడితే రజోగుణము నశించిపోతుందు. ఎల్లప్పుడూ ప్రతిదానికి సంశయించడము, విషాదము, జడత్వము ఇవి తమోగుణ లక్షణములు. ఈ గుణములు తగ్గించుకుంటే తమోగుణము నశించి పోతుంది. ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఒక్కటి ఎక్కువైతే మిగిలినవి తగ్గుముఖం పడతాయి. రెండు ఎక్కువగా ఉంటే మిగిలినది తగ్గుముఖం పడుతుంది. సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. సదా సంతోషంగా ఉంటాడు. రజోగుణము ఎక్కువగా ఉన్న మనుషి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. సదా దుఃఖిస్తుంటాడు. తమోగుణము అధికంగా ఉంటే కామము, కోరికలు, సకలము అన్నీ తనకు కావాలని అనుకొని అవి దక్కక పోతే జితేంద్రియుడు ఔతాడు. ఈ గుణముల ప్రభావంతో చేసేపనుల వలననే మానవులకు దేవలోకప్రాప్తి మనుష్యలోకములో పుట్టడం లేక జంతువులలో పశుపక్ష్యాదులలో పుట్టడం జరుగుతూ ఉంటుంది. మహాతత్వమును బుద్ధి అనికూడా అంటాము. ఈ బుద్ధి వివేకముకు, జ్ఞాననముకు గుర్తు. ఈ బుద్ధి వివేకముకు జ్ఞానముకు గుర్తు. అహంకారము సృష్టికి మూలము. అహంకారము వదిలితే ముక్తి దానంతట అదే వస్తుంది. ఇక మనస్సు ఇది ఇంద్రియముల ద్వారా ప్రకృతిలో సంచరిస్తుంటుంది. ఇంద్రియలోతత్వమునకు, ఇంద్రియనిగ్రహముకు ఈ మనసే కారణము. ఈ శరీరము పంచభూతముల గుణములైన శబ్ద, స్పర్శ, రస, గంధ రూపములు ఈ శరీరము ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ దేహము ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరైనది. జీవాత్మ ఈ శరీరంలో అవ్యక్తంగా ప్రకాశిస్తున్నాడు. కాని మానవులు తామే ఆత్మ అనే అజ్ఞానంలో ఉంటాడు. అన్నీతామే చేస్తున్నామని, తమవలనే అన్నీ జరుగుతున్నాయని భ్రమపడుతుంటారు. తాను వేరు మనసు వేరు అనుకుని మనసును ప్రకృతి నుండి పరమాత్మ వైపు మళ్ళించిన మానవుడు ముక్తి పొందుతాడు. దేహాభిమానము పూర్తిగా నశిస్తేగాని ఇది సాధ్యము కాదు. ఈ తత్వమే 25వ తత్వము ప్రకృతిని వదిలి పెట్టి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విజ్ఞానము పరమ శాంతిప్రథము. అన్నింటికీ అధిష్టానం అయినది 26వ తత్వము. దానికి ఈ శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు అంటవు. ఇది నిత్యము, శాశ్వతము, అవ్యయము. అన్నింటిలోను ఉంటుంది. సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అతి సూక్ష్మమైనది. అత్యంత విశాలమైనది, ఇంద్రియములకు గోచరము కాదు. ఇదే 26వ తత్వము. ఆ తత్వమును పరమాత్మ అని పిలుస్తారు. ఇదే మోక్షపదము. సమదృష్టి కలిగిన వారు మోక్షముకు అర్హులు. పార్వతీ నీకు చెప్పిన ఈ సాంఖ్యము కపిల మహర్షి సేవించిన ధర్మము.

యోగము

[మార్చు]

పార్వతీ ! ఇక యోగమార్గము గురించి వివరిస్తాను. ఈ దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధీ, ఆత్మ ఇవన్నీ ఒకటే కాని వేరు కాదు అనుకోవడమే యోగము. ప్రతిరోజూ అగ్నిహోత్రము చెయ్యడం, అధికంగా మాట్లాడకుండా ఉండడం, సత్వగుణము కలిగి ఉండడడం, అర్హులైన వారికి దానంచెయ్యడం, వేదాభ్యాసంచెయ్యడం, ఎల్లప్పుడూ శుచిగా ఉండడం, సత్యముపలకడం, వీటిని అనుసరించడం వలన మానవుడిలోని పాపాలునశిస్తాయి . శుచిగాశుభ్రంగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనముమీద కూర్చోవాలి. నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి. ఇంద్రియములను మనస్సును ఏకం చెయ్యాలి. మనస్సును ఆత్మలో లీనముచెయ్యాలి. ప్రాణ, ఆపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి. మానవుడు మనసును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు. ప్రాణవాయువు ఆపానవాయువుతో కూడి ఊర్ధ్వ ముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము, పరధ్యానము, అత్యాశ, ఇతరులపట్ల ఆదరం లేకపోవడం, రోగములు, స్వప్నములు, లోభత్వము, భయము, కామము, క్రోధము, సుఖములు అనుభవించాలన్న కోరిక, చంచలత్వము మొదలైన దుష్టగుణములు అత్యంత విరోధములు. పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు. ఈ యోగాభ్యాసమును నిష్ఠతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు. యోగి ఎక్కువగా నిద్ర పోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండ కూడదు. ఎక్కువగా తిన కూడదు. అలాగని అసలు తినకుండా ఉండ కూడదు. మితభోజనం, మితనిద్ర యోగికి యోగసిద్ధి కలిగిస్తుంది. యోగధర్మము ఇదే " అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు..

పరమాత్మలో లీనం

[మార్చు]

పార్వతీదేవి " మీ దయ వలన సాంఖ్యము, యోగము గురించి తెలుసుకున్నాను. భక్తులు పర్మమాత్మలో లీనం కావడానికి ఎటువంటి పరిచర్యలు చేయాలి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవతలకు కాని మానవులకు కాని పరమాత్మ గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే సాంఖ్యము, యోగము రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మను నేనే. నేను సనాతుడను, అవ్యయుడిని, సత్యమే నాస్వరూపము. నా దయలేనిది ఎవరూ నన్ను దర్శించలేరు. నన్ను చేరుకోవడానికి మంత్రము, జపము, నిరంతర పరమాత్మచింతన, స్తోత్రములు, నమస్కారములు ఇవన్నీ నిష్టతో చేసిన పరమాత్మను చేరుకోవచ్చును. పూర్వము నేను నాలుగు ఆశ్రమముల గురించి పాశుపత్రవ్రతము గురించి నలుగురు విప్రులకు బోధించాను. వారు దానిని తమ శిష్యులకు బోధించారు. అలా లోకమంతా వ్యాపించింది. సకల శుభములు కలగడడానికి, శుచిగా ఉండడానికి, నా స్వరూపమైన లింగార్చనకు నేను విభూతిని రూపొందించాను. యోగులు ఆ విభూతిని, శరీరము అంతా అలముకొని, కపాలము చేత బూని, తలగొరిగించుకుని, భిక్షాటన చేస్తూ, మనోనిగ్రహంతో మెలగుతూ, నా మీదనే మనసు నిలిపి, ఇతరకోరికల మీదకు మనసు పోనీయక పరమానందకరమైన అనుభూతిని అనుభవిస్తారు. కేవలం ఈ ప్రకారం సంగమును విడిచిన యోగులు నా సాయుజ్యమును పొందగలరు. నిరాకారంగా నిస్సంగంగా నన్ను పూజించుట కొరకు నేను మూడు లోకములలో ఏ ఆకారము లేని శివలింగాలను స్థాపించాను. ఆ లింగములను నా స్వరూపంగా పూజిస్తే నేను వారికి ప్రసన్నుడను ఔతాను. ఆ లింగములను ఎవరికి ఎలా తోచినట్లు అలా పూజ చేయవచ్చు. వారివారి శక్తిని అనుసరించి పూజించవచ్చు. పాలతో, నేతితో, నీటితో ఆ లింగములను అభిషేకించ వచ్చు. నాకు మారుగా ఆ లింగములను గంధము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము శక్తికి తగిన విధంగా ఆరాధించ వచ్చు. ఆ లింగములను పూజించిన నన్ను పూజించినట్లే.

స్త్రీ ధర్మము

[మార్చు]

పరమశివుడు " పార్వతీ ! నా గురించి నేను చెప్తాను కదా ! మరి స్త్రీధర్మము గురించి నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పవా " అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి " అయ్యో ! నేను మీకు చెప్పగలదాననా ! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు. కాని నన్ను కోరారు కనుక నేను చెప్పకుండా ఉండడం భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కాని నేను ముందు నన్ను ఎన్నడూ విడువకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను " అని చెప్పి గంగా, యమునా, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తమస మొదలైన నదులను మనసులో తలచుకుంది. వారు స్త్రీ స్వరూపములతో పార్వతి ముందు నిలిచారు. వారికి పరమేశ్వరుడు తనను స్త్రీ ధర్మము గురించి అడిగాడని తనకు ఎలా చెప్పాలో తెలియక మిమ్ము పిలిచానని తెలిపింది. వారు " పార్వతీ ! నీ కంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు. నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు అమృతధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము " అన్నారు. అప్పుడు " పార్వతీదేవి " మహేశ్వరుడి మీద చూపు నిలిపి " ఓ దేవా ! నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరకీ స్త్రీ ధర్మము గురించి చెబుతున్నాను. స్త్రీ వివాహత్పూర్వము కన్య అని పిలువబడుతుంది. తల్లి తండ్రులు కాని, పినతండ్రి కాని, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. స్త్రీ వివాహానంతరం భర్తకు ఆమె మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి. ఇటువంటి పతివ్రత ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా సుఖములు అనుభవిస్తుంది.

బ్రాహ్మణుడి భార్యలు

[మార్చు]

పార్వతీదేవి స్త్రీ ధర్మములగురించి ఇంకా చెప్తూ " ఈ సందర్భంలో ఒకకథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పక పోయినా దేవతాపూజలు, పితృతర్పణలు, అతిథిపూజలు, చేస్తూ ఉండేది. రెండవభార్య భర్తను అనుసరిస్తూ ప్రతిపనీ ఆయన అనుమతితో చేస్తుడేది. ఆ భర్త, ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు. భర్త రెండవభార్య భర్తను అనుసరిస్తూ స్వర్గానికి పోయారు. భర్త అనుమతి తీసుకోకుండా దేవతాకార్యములు చేసిన రెండవభార్యను యముడు స్వర్గలోకముకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో " నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందు వలన నీకు స్వర్గలోకార్హత లేదు. కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను " అని శాసించాడు. ఆమె విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆమె మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు " ఓ వనితా ! భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయడం తగదు. మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి " అన్నాడు. పార్వతీదేవి ఇంకా స్త్రీధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది. భర్తకు ఇష్టం అయిన వంట వండిపెట్టాలి. ఆయన కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్తమాటకు ఎదురు చెప్పకూడదు. అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చెయ్యవలసిన కార్యములను మరచిపోతే ఆయనకు గుర్తు చెయ్యాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి. భర్త తన వద్ద ఏదైనావస్తువు దాచిన దానిని భద్రంగాదాచి అతడు అడిగినప్పుడు అందచెయ్యాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడినా, అందగాడైనా, కురూపి అయినా, తెలివి కలవాడైనా, ఆరోగ్యవంతుడైనా, అనారోగ్యంతో బాధపడుతున్నా, భర్తను భార్య గౌరవించాలి. ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కుర్చోకూడదు. పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టడం, యాచకులకు అన్నదానం చెయ్యడం, దేవతలకు పితృదేవతలకు పూజచెయ్యడం. ఆ పనులన్నీ భర్త క్షేమంకోరి భార్య చెయ్యడం భార్య కర్తవ్యం. పరమేశ్వరా ! స్త్రీలందరూ ధర్మపరులు కారుకదా ! అధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పరపుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసురవంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడ ఉండదు. ఎప్పుడూ సుఖవాంఛల మీద కోరిక కలిగి ఉంటారు. క్రూరమైన పనులు చెయ్యడంలో ఆసక్తి కలిగి ఉంటాడు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఆమెకు కోపము ఎక్కువ. భర్తయందు, పిల్లల అందు ప్రేమ ఉండదు. ఇంటి పనులు చెయ్యదు. నిర్లక్ష్యము ఎక్కువ. ఎప్పుడూ అబద్ధాలు చాడీలు చెప్తుంటుంది. ఎప్పుడూ నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరివలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమతప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా, భర్తచనిపోయిన తరువాత ఆయనతో సహగమనము చేసిన భార్య, భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. ఇందులో ఒక ధర్మసూక్ష్మము ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చెయ్యకూడదు. అది అధర్మము " అని పార్వతీదేవి పరమేశ్వరుడికి స్త్రీల ధర్మము గురించి వివరించింది " అని నారదుడు శ్రీకృష్ణుడికి వివరించాడు.

పరమ పదము

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మీరు చెప్పిన శివపార్వతీ సంవాదము విన్నాను. నా జన్మధన్యం అయింది. పితామహా మరొక సందేహము. పరమపదము అంటారు కదా ! అది ఎలా సిద్ధిస్తుంది తెలపండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నిరంతర నారాయణధ్యానము. నిరంతరము నారాయణుడిని పూజించడం, స్థుతించడం, నారాయణుడి కథలు వినడం, మానవులకు మేలు చేస్తుంది. విజ్ఞులను సేవించడం వలన పరమపదము పొందడానికి అర్హత కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒకకథ చెప్తాను. పూర్వము ఒక రాక్షసుడు ఒక విద్వాంశుడిని రాజభటులు శిక్షించడం చూసిన ఒక వేశ్య " రాజభటులారా ! ఈయన మావాడు తెలిసిన వాడు. ఇతడిని ఎందుకు దండిస్తున్నాడు " అని చెప్పి విద్వాంసుడిని వారి బారినుండి విడిపించింది. మరుజన్మలో ఆ వేశ్య బ్రాహ్మణ వనితగా జన్మించింది. కనుక విద్వాంశులను గౌరవించడం వలన మనకు ఉత్తమజన్మ లభిస్తుంది " అని భీష్ముడు చెప్పాడు.

మానవుడు శాంతి

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మానవులు, దరిద్రము, వ్యాధులు, దుఃఖము వీటితో బాధపడుతూంటారు కదా ! ఆ సమయంలో వారికి శాంతిచేకూర్చే మార్గము ఏది ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీవు చెప్పిన దుఃఖములతో బాధలుపడుతున్న వారు భక్తితో, శ్రద్ధతో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, వినాయకుడిని, కుమార స్వామిని, అగ్నిదేవుని, వాయుదేవుడిని, సూర్యచంద్రులను, దేవేంద్రులను, వరుణ భగవానుడిని, యమధర్మరాజును, కుబేరుడిని, కామధేనువును, సప్తసముద్రాలను, గంగయమున మొదలైన మహానదులను, మరుత్తులను, అశ్వినీదేవతలను, వసువులను, రుద్రులను, దేవతలను, పితృదేవతలను, వాలఖిల్యాది సిద్ధులను, వేదవ్యాస, వాల్మికీ, నారద, అగస్త్య, గౌతమ, కశ్యప, అత్రి, కణ్వ మొదలైన మహామునులను, రంభ ఊర్వశి మొదలైన అప్సరసలను, ధర్మము, తపస్సు, సత్యము, మొదలైన వాటిని రాత్రింపగళ్ళను, నక్షత్రములను, గ్రహములను, అశ్వినీ మొదలైన నక్షత్రాల సముదాయాలను, మాసములు, రుతువులు, సంవత్సరములు, వైనతేయులు, సర్పరాజములను, కాశీ, గయ మొదలైన పుణ్యక్షేత్రములను, నైమిశారణ్య, దండకారణ్యము మొదలైన అరణ్యములను, మేరుపర్వతము, హిమవత్పర్వతము, కైలాస పర్వతము మొదలైన పర్వతన్ములను, నాలుగు దిశల ఉన్న భూమిని, ఆకాశమును, రావి మొదలైన వృక్షరాజములను బ్రాహ్మణులను, చక్రవర్తులను, తనను పాలించేరాజును మనసారా ధ్యానించాలి. నమస్కరించాలి. మీరందరూ నన్ను రక్షించండి. నాకు ఆయురారోగ్య ఐశ్వర్యములను అభివృద్ధిని, పరమానందమును ప్రసాదించండి అని మనసారా కోరుకోవాలి. తరువాత నారాయణ మంత్రము శ్రద్ధగా పఠించాలి.

నారాయణ జపం

[మార్చు]

ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమః సర్వలోక గురువే, నమః సర్వలోక పితామహాయ, నమః సర్వలోక ప్రధానాయ, నమః సర్వలోకేశ్వరాయ, నమః సర్వలోక విశిష్టాయ, నమః సర్వలోక సుఖప్రదాయ, నమః సర్వలోక భర్తాయ, నమః సర్వలోక కర్తాయ, నమః సర్వలోక హర్తే, నమః సర్వలోకనిధయే, నమః సర్వలోకనధనాయ, నమః సర్వలోకోద్భవకరాయ, నమః విష్ణవే, నమః ప్రభవిష్ణవే అని పఠించాలి. ఈ మంత్రం పథించిన వారికి సమస్త భయములు, కష్టాలు, పాపములు నశించి శుభములు కలుగుతాయి అని భీష్ముడు ధర్మరాజుకు మహావిష్ణు మంత్రమును ఉపదేశించాడు " అని వైశంపాయనుడు చెప్పాడు.

మహనీయ దైవము

[మార్చు]

ధర్మరాజు భీముడిని " పితామహా ! సమస్త లోకములలో మహనీయదైవము ఎవరు? ఏ దేవుని నామాలను మానవులు పారాయణచేయాలి? ఎవరిని సేవించిన మానవులు పాపముల నుండి విముక్తిపొంది సకలశుభములు పొందగలరు. ఏ జపము ఉత్తమమైన జపము? ఏ జపము చేసిన మానవులు జననమరణ చక్రము నుండి విముక్తి పొందగలరు? దయతో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అఖిల జగములకు ప్రభువు అనంతుడు. అతడిని పురుషోత్తముడు అని అంటారు. ఆ పురుషోత్తముడిని మానవులు వేయినామములతో స్తుతిస్తారు. ఎవరైతే ఆ దేవదేవుని వేయి నామాలతో దృఢమైన భక్తితో ఎనలేని విశ్వాసంతో అర్చిస్తారో వారిని ఆదేవదేవుడు ఆద్యంతములు లేనివాడు, సకలలోకములతో కీర్తించబడువాడు, సర్వలోకపూజితుడు, సర్వలోకుల కోరికలను తీర్చువాడు, సర్వలోకనాయకుడు, సకల జగములకు పూజనీయుడు, సర్వజగములను సృష్టించినవాడు, సర్వలోకనాధుడు వారి పాపములను పోగొట్టి సకల శుభములను కలుగజేస్తాడు. ఆ పురుషోత్తమ స్తుతి ధర్మములలోకెల్లా ఉత్తమధర్మము. ఆ పురుషోత్తముడిని పూజించడము నాకు అత్యంతప్రియము. ఆ పురుషోత్తముడు పరమపదము, అతడే పరబ్రహ్మము, మంగళప్రదుడు, సకల మంగళములు కలుగ చేయువాడు, సకల భూతకోటికి మూలపురుషుడు, పరమపవిత్రుడు, పరమ తేజస్వరూపుడు యుగాంతంలో సమస్తలోకములు అతడిలో లీనం ఔతాయి. తిరిగి యుగారంభంలో అతడి నుండే సకలలోకములు సకలజీవులు ఉద్భవిస్తాయి. అతడే మహావిష్ణువు. అతడిని వేయి నామములతో పూజించిన వారికి సకల భయములు, పాపములు తొలగి శుభములు కలుగ కలవు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ తరువాత భీష్ముడు ధర్మరాజుకు విష్ణుసహస్రనామ ఉపదేశం చేసి " ధర్మనందనా ! ఈ విష్ణుసహస్ర నామార్చన చేసిన మానవులు పొందని శుభములు ముల్లోకలలో ఏదిలేదు. ఈ నామార్చన చేసిన విప్రుడు వేదవేదాంత విద్యలను, క్షత్రియుడు సకల విజయాలను, వైశ్యుడు సమస్త సంపదలను, శూద్రుడు సక శుఖములను పొందుతారు. ఈ నామార్చన చేసిన మానవుడు ధర్మార్ధ కామ మోక్షములలో ఏది కోరిన దానిని పొందగలడు. ఈ సహస్రనామములను భక్తితో పఠించిన వారికి వంశాభివృద్ధి, సొంపు, ఐశర్యము, కీర్తి, పెంపు కలిగి వర్ధిల్లగలడు. ఈ సహస్రనామార్చన జనులలో భయమును పోగొట్టి వీర్యము, తేజస్సు, కంతి, బలము, రూపము కలుగుతాయి. ఈ నామార్చన సకల రోగములను పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యములను కలిగిస్తుంది. శ్రద్ధగా ప్రతిరోజు సహస్రనామములతో విష్ణువును అర్చించే వారికి జననమరణ రోగ రాహిత్యమైన పరమపద ప్రాప్తి కలుగుతుంది. విష్ణు భక్తులకు దుర్మార్గము, మదము, మాత్సర్యము, లుబ్ధత్వము వంటి దుర్గణములు దరిచేరవు. ఆ పురుషోత్తముడిని భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సముద్రములు, నదీనదములు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఉరగములు, పన్నగములు సకల చరాచరములు ఆ విష్ణువును అనుసరిస్తుంటాయి. మానవునిలోని బుద్ధి, దృతి, మనసు, తేజము అన్నీ విష్ణుమయమే. వేదవేదాంగములు సకలశాస్త్రములలో ఉన్న ధర్మములన్నీ విష్ణుస్వరూపమే. సాంఖ్యము, యోగము, తంత్రము, శిల్పము, సమస్త కర్మలు, వేదములు, శాస్త్రములు అన్నీ విష్ణురూపమే. ఈ లోకములలో మహత్భూతము విష్ణువే. సమస్త భూతములకు ఆత్మ విష్ణువే. విష్ణువు సర్వవ్యాపి. సకల శుభములను కలిగించి పరమపదమును కలిగించే ఈ సహస్రనామార్చన చేసిన మానవుడు ధన్యుడు. కనుక ధర్మనందనా నీవు కూడా విష్ణుసహస్ర నామార్చన చేసి ఐశ్వర్యములను పొంది బంధు మిత్రులతో సుఖములు అనుభవించు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

పూజార్హులు

[మార్చు]

భీష్ముడు ఉపదేశించిన విష్ణుసహస్రనామ మహిమ విన్న తరువాత ధర్మరాజు మహదానందం పొందాడు. అయినా ధర్మరాజుకు సందేహాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అందుకే ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! పూజించడానికి, నమస్కరించడానికి అర్హులు ఎవరు. ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి. ఎవరికి హాని కలిగిస్తే మానవులకు హాని, అశుభములు కలుగుతాయి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ లోకములో పూజించడానికి అర్హులు బ్రాహ్మణులే. బ్రాహ్మణులకు హాని కలిగించినట్లయితే సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా తిప్పలు తప్పవు. బ్రాహ్మణులు సంతోషించిన సకల శుభములు కలుగుట తధ్యము. బ్రాహ్మణులు ఈ లోకముకు ఆధారము. బ్రాహ్మణులు ధర్మముకు వారధిలాంటి వారు. సకలశాస్త్రములు వేదవేదాంగములు ప్రవచించడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే. విప్రులకు తపస్సు, సత్యవాక్కు ధనముతో సమానము. బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనము పెట్టిన వాడి పాపములు పటాపంచలు ఔతాయి. దేవతలకు కూడా దేవతలు బ్రాహ్మణులు బ్రాహ్మణులే. బ్రాహ్మణుడు బాలుడైనా పూజనీయుడే. ఇక వృద్ధ బ్రాహ్మణుని విషయము చెప్పనలవి కాదు " అని భీష్ముడు చెప్పాడు.

బ్రాహ్మణుల మహిమ

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మణులను గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా ! బ్రాహ్మణులను పూజించిన వారికి కలుగు శుభములు ఎవి ? వారిని ఇంతగా పూ జించడానికి బ్రాహ్మణులలో ఉన్న విశిష్ట గుణములు ఏవి ? " అని అడిగాడు. " ధర్మనందనా ! నీ సందేహానికి సమాధానంగా పవనార్జున సంవాదం వినిపిస్తాను. కార్తవీర్యార్జునుడు వేయచేతులు కలిగిన మహావీరుడు. అతడు తనకు కలిగిన బలగర్వము వలన " ఈ ముల్లోకములలో నాకు సాటి బలవంతుడు లేడు " అని బిగ్గరగా పలికాడు. అది విన్న ఒక భూతము బదులుగా " ఓరాజా ! నీ విలా పలుకతగదు. లోకములకన్నా భూసురులైన బ్రాహ్మణులు అధికులని నీకు తెలియదా ! " అని పలికింది. అందుకు కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించుకుని జీవిస్తారు కదా ! అలాంటి బ్రాహ్మణులు రాజులకంటే అధికులు ఎలా ఔతారు ? నాకు అనుగ్రహం వస్తే బ్రాహ్మణులను ఆదరిస్తాను. కోపము వస్తే అందరినీ దండిస్తాను " అని చెప్పాడు. ఈ మాటలకు ఆ భూతము మారుపలుకక వెళ్ళి పోయింది. ఆ సమయంలో వాయుదేవుడు తనను తాను ఎరిగించుకుని " ఓ రాజా ! నీవు బ్రాహ్మణులను రక్షిస్తున్నానని అనుకుంటున్నావు. కాని ఆ బ్రాహ్మణుల రక్షణలోనే నీవు ప్రజలను రక్షిస్తున్నావని తెలుసుకో. ముల్లోకాలలో పూజనీయులు బ్రాహ్మణులే. అహల్యను కోరిన ఇంద్రుడు గౌతమ ముని శాపం పొంద లేదా! అగస్త్యుడు సముద్రమును ఔపోసన పట్ట లేదా! భృమహర్హి అగ్ని దేవుడిని శపించ లేదా!" అన్నాడు. ఆ మాటలకు కార్తవీర్యార్జునుడు బదులు పలుక లేదు.

ఉచధ్యుని వృత్తాంతం

[మార్చు]

వాయుదేవుడు తిరిగి కార్తవీర్యార్జునితో " ఒ మహారాజా ! నీకు ఒక కథచెప్తాను విను. పూర్వము అంగీరస వంశంలో జన్మించిన ఉచధ్యుడు చంద్రుడి కుమార్తెను కోరగా చంద్రుడు తన కుమార్తెను ఉచధ్యుడికి ఇచ్చి వివాహము చేసాడు. వారిరువురు ఆనందంగా జీవిస్తున్న తరుణంలో వరుణుడు చంద్రుని కుమార్తె మీద కోరిక పెంచుకుని ఉచధ్యుడు స్నానికై నదీతీరానికి వెళ్ళిన తరుణంలో ఉచధ్యుడి భార్యను అపహరించి తీసుకుని వెళ్ళి తన అంతఃపురంలో ఉంచాడు. ఈ విషయం నారదుడికి తెలిసి ఉచధ్యుడికి విషయం తెలిపాడు. ఊచధ్యుడు " దిక్కులకు అధిపతి అయిన వరుణుడికి పరుల భార్యల మీద మక్కువ పెంచుకొనుట తగదు. నీవు ఉచధ్యుడి వద్దకు వెళ్ళి నేను ఇలా చెప్పానని చెప్పు " అని చెప్పాడు. నారదుడు ఈ విషయం వరుణుడికి చెప్పాడు. కాని కామంతో కళ్ళు మూసుకు పోయిన వరుణుడు " నారదా ! నీవు చెప్పినా సరే నేను ఉచధ్యుని భార్యను విడువను " అని చెప్పాడు. నారదుడు ఉచధ్యుని వద్దకు వెళ్ళి " ఉచధ్యా ! వరుణుడు నా మాటను కూడా గౌరవించక నీ భార్యను వదలడానికి నిరాకరించడమే కాక నన్ను తన వారితో బయటకు గెంటించాడు " ఆ మాటలు విన్న ఉచధ్యుడు ఆగ్రహించి సముద్రజలాలను ఒక్క గుక్కలో పీల్చి వేసి లోకాలను గడగడలాడించాడు. వరుణుడు కూడా గడగడ లాడుతూ ఉచధ్యుని భార్యను తీసుకు వచ్చి అతడికి సమర్పించి తనను మన్నించమని వేడుకున్నాడు. కనుక రాజులకంటే బ్రాహ్మణులు గొప్పవారు " అని వాయుదేవుడు కార్తవవీర్యార్జునుడికి చెప్పాడు.

దేవతలను రక్షించిన బ్రాహ్మణులు

[మార్చు]

వాయుదేవుడు తిరిగి " పూర్వము దేవతలు రాక్షసుల చేతిలో ఓడి పోయి ఇక్కట్ల పాలైన తరుణంలో అగస్త్యుడు రాక్షసులను జయించి దేవతలను రక్షించాడు. మరొకసారి రాక్షసులు దేవతలను ఓడించి వారిని హింసల పాలు చేసిన తరుణంలో దేవతలు వశిష్టుడికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వశిష్ఠుడు ఆగ్రహించి ఒక్క హూంకారం చేసి రాక్షసులను భస్మము చేసాడు. కనుక దేవతల కంటే కూడా బ్రాహ్మణులు గొప్పవారు " అని వాయుదేవుడు చెప్పాడు. కార్తవీర్యార్జునుడు బదులు పలుక లేదు. వాయుదేవుడు తిరిగి " ఒకసారి రాక్షసులకు దేవతలకు జరిగిన యుద్ధంలో రాహువు సూర్య చంద్రులను తన అస్త్ర ప్రయోగంతో మూర్చిల్ల జేసాడు. లోకాలన్ని చీకట్లలో మునిగి పోయాయి. రాక్షసులు దేవతలను తరిమికొట్టారు. వారు అత్రిమహామునికి మొరపెట్టుకొనగా అత్రి మహాముని తన తపోమహిమతో సూర్య, చంద్రుల మూర్చను పోగొట్టి లోకాలను కాంతివంతం చేసి రాక్షసులను నాశనం చేసి దేవతలను రక్షించాడు. కనుక బ్రాహ్మణులు ముల్లోకాలకు గొప్పవారు " అని చెప్పాడు. వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పాడు " కార్తవీర్యార్జునా ! ఒకసారి ఇంద్రుడు అశ్వినీ దేవతలకు సోమపానముకు అర్హత లేదని శాసించంచాడు. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడిని ఆశ్రయించారు. చ్యవనుడు అశ్వినీదేవతలకు మేలు చేయడము కొరకు ఇంద్రుడితో పగ తెచ్చుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడిని చంపాలనినుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడి మీదకు ఒక కొండను, వజ్రాయుధాన్ని విసిరాడు. చ్యవనుడు వాటిని తిప్పి కొట్టి చేసి మదుడు అను రాక్షసుడిని సృష్టించి వారి మీదకు పంపాడు. మదుడు దేవతలను దేవేంద్రుడితో సహామింగి వేసాడు. అప్పుడు వారంతా చ్యవనుడిని ప్రార్ధించి తమ స్వస్వరూపాలను తిరిగి పొందారు. ఇంద్రుడు దేవతలతో సహా చ్యవనుడికి ప్రణామం చేసి తమను మన్నించమని కోరాడు. చ్యవనుడు ఇంద్రుడిని అశ్వినీదేవతలకు సోమపానార్హత కలిగించమని కోరాడు. ఇంద్రుడు దేవతలకు సోమపానార్హత కలిగించాడు. చ్యవనుడు బ్రాహ్మణుడైనా దేవేంద్రుడికంటే గొప్పవాడని అనిపించుకున్నాడు కదా ! " అన్నాడు. ఇంతచెప్పినా కార్తవవీర్యార్జునుడు అంగీకరించక మౌనం వహించాడు. అప్పుడు వాయు దేవుడు తిరిగి " మహారాజా ! అంతెందుకు నీ గురువు బ్రాహ్మణుడు అయిన దత్తాత్రేయుడి మహిమవలెనే కదా నీవింత గొప్పవాడివి అయి ఇంతటి మహా బలపరాక్రమాలు సంపాదించి రాజులలో మాణిక్యములా వెలుగుతున్నావు. నీవే కాదు మానవులు, దేవతలు కూడా బ్రాహ్మణుల మహిమవలెనే మనుగడ సాగిస్తున్నారు. కనుక నీవు కూడా బ్రాహ్మణుల మహిమను గుర్తించి వారిని పూజించి సౌఖ్యములను పొందు " అన్నాడు. కార్తవవీర్యార్జునుడి గర్వము అంతటితో అణిగి పోయి బ్రాహ్మణుల గొప్పతనము అంగీకరించి బ్రాహ్మణులను పూజించి సుఖములను పొందాడు. కనుక ధర్మరాజా ! నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు " అన్నాడు భీష్ముడు.

బ్రాహ్మణ పూజ

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఎంత విన్ననూ నాకు శ్రీకృష్ణతత్వము వినవలెనని కోరికగా ఉంది. నాకు ఇంకా బ్రాహ్మణమహిమలు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నాకు ఇంద్రియములు, వాక్కు, మనస్సు దుర్బలము అయ్యాయి. నేనిక అలసి పోయాను. దక్షిణాయనము అయిపోవస్తుంది. ఉత్తరాణము సమీపిస్తుంది. నేను ఇక నిష్క్రమించ వలసిన కాలము సమీపిస్తుంది. శ్రీకృష్ణుడికి బ్రాహ్మణతత్వము బాగా తెలుసు. అతడు సర్వజ్ఞుడు. అతడు నీకు బ్రాహ్మణమహిమలు వివరిస్తాడు. నాకు కృష్ణతత్వము బాగా తెలుసు. అతడు వరాహరూపము ఎత్తి భూమిని అవలీలగా తన కోరల మీద ఎత్తాడు. ఈ భూమి మీద జీవజాలము ఆవిర్భావము శ్రీకృష్ణలీల కాక మరేమి ? అతడు తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించి ఈ సృష్టికార్యము జరిపంచాడు. బ్రహ్మ కారకుడే కాని మూలము శ్రీకృశష్ణుడే. ఎప్పుడైతే దనుజులు ధర్మమును నశింపచేస్తారో అప్పుడు శ్రీకృష్ణుడు అవతరించి ధర్మమును కాపాడి ధర్మాత్ములను రక్షిస్తాడు. దేవతలు, విశ్వపతి, దిక్పాలకులు, పరమేశ్వరుడు అన్నీ శ్రీకృష్ణుడే. కాలము, జగత్తు, దిక్కులూ అన్నీ తానే అయి ఉన్నాడు. యజ్ఞ స్వరూపుడైన శ్రీకృష్ణుడిని ఋత్విక్కులు వేద మంత్రములతో స్తుతిస్తారు. ఋగ్వేదములో శ్రీకృష్ణస్తుతి వింతకాదు. యజ్ఞము, ఋత్విక్కులు, యజ్ఞ సామాగ్రి, మంత్రములు, యజమాని అన్నీ ఆయనస్వరూపమే. సూర్యచంద్రులకు వెలుగును ఇచ్చే పరంజ్యోతి స్వరూపుడు అతడే. అతడే సత్యము, నిత్యము, అజరామరమైన పరమపదము " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ మహిమ

[మార్చు]

ధర్మరాజు " శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి " దేవదేవా ! శ్రీకృష్ణా ! నాకు బ్రాహ్మణతత్వము వినవలెనన్న కోరిక తీరలేదు కనుక నన్ను కరుణించి వివరించవా ! " అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నేను ప్రద్యుమ్నుడికి చెప్పిన విషయాలు నీకు వివరిస్తాను. మానవులకు ధర్మార్ధకామమోక్ష సాధనకు, దేవతార్ఛనకు, పితృదేవతార్చనకు, ఇహలోకసౌఖ్యములు పొందుటకు కారణం అందుకు సహకరించే బ్రాహ్మణులే. దేవతలకు కూడా ఆయుస్షు, సంపద, కీర్తి కలగడానికి కారణం బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అనుగ్రహిస్తే సంపదలు పొందగలరు. బ్రాహ్మణులు ఆగ్రహించిన ఎంతటి వారైనా భస్మము కాగలరు. ఇహలోక సుఖములకే కాక పరలోక సుఖములు పొందుటకు కూడా కారణం బ్రాహ్మణులే. ఇది తెలపడానికి నీకు ఒక వృత్తాంతం చెప్తాను విను. దుర్వాసుడనే మహాముని ఉండే వాడు. అతడు వింతమనస్కుడు. అతడి చేష్టలు ఎవరికి అర్ధము కావు. ఒకసారి మంచముమీద నిద్రిస్తాడు. ఒకసారి నేలమీద నిద్రిస్తాడు. మన మిచ్చినప్పుడు ఆహారము తినడు. తను అనుకున్న వెంటనే ఆహారము అందివ్వవలసినదే. ఒక్కోసారి ఏమీతినడూ. ఒక్కోసారి వందమంది భోజనము ఒక్కడే తింటాడు. ఒక నాడు దుర్వాసుడు మా ఇంట పాయసం కావాలని అడిగాడు. మేము అతడికి పాయసం ఇచ్చిన వెంటనే దానిని కొంచం తిని తరువాత తన ఒంటికి పూయమని కోరాడు. నేను అలాగే చేసాను.

రుక్మిణి దుర్వాసుడి రధములాగుట

[మార్చు]

తరువాత అతడు దానిని రుక్మిణీ దేవి ఒంటికి రాసి ఆమెను ఒక రధానికి గుర్రములా కట్టి తాను ఆ రధమ మీద కూర్చుని రుక్మిణిని ఆరధము లాగమని చెప్పాడు. ఆమె అలాగే లాగింది. రుక్మిణి రధము లాగుతుంటే అతడు దానిని వీధులలో తిప్పాడు. నేను ఆయన మీద అలుగక ఆ రధము వెంటవెళ్ళాను. కాని యాదవులు ఆగ్రహించి నాకొరకు ఆయనను ఏమీ అనలేక నా వెంట నడిచారు. కొంతదూరము పోయిన పిదప రుక్మిణి సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు దుర్వాసుడు రధము దిగి రుక్మిణి మీద మట్టిచల్లి దక్షిణదిక్కుగా వెళ్ళిపోయాడు. నేను అతడి వెంటవెళ్ళి అతడి కాళ్ళుపట్టి రమ్మని వేడుకున్నాను. ఆయన నన్ను కరుణించి " కృష్ణా ! కరుణించి కృష్ణా నీవు కోపాన్నిజయించావు. నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇక మీదట జనులు అందరూ వారు వారిని ఎంతగా ఆరాధిస్తారో అంత కంటే ఎక్కువగా నిన్ను ఆరాధిస్తారు. నేను నిన్ను పాయసము నా ఒంటికి రాయమని చెప్పినప్పుడు నీవు నా ఒంటికి అంతా రాసావు కాని పాదాలను వదిలావు కనుక నీవు పాదానికి హాని కలగడం ద్వారా ఈ లోకం నుందడి నిష్క్రమిస్తావు. అయినా అది నిన్ను నీ స్వస్థలమైన వైకుంఠానికి చేర్చి నీకు మేలుచేస్తుంది . నీవు నన్ను పూజించినట్లే మిగిలిన బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు " అని చెప్పి రుక్మిణీ దేవి వద్దకు వెళ్ళి " అమ్మా ! నీవు నీ సౌందర్య, సౌభాగ్యములతో అప్రతిహతంగా పదహారువేల భార్యలలో అగ్రగణ్యవై వర్ధిల్లగలవు " అని వరం ఇచ్చి వెళ్ళి పోయాడు. ధర్మనందనా ! అప్పటి నుండి మాశరీరాలు వింత కాంతులతో విరజిల్లుతున్నాయి. అప్పటి నుండి మా ఇంట సిరి సంపదలు తులతూగుతున్నాయి. అప్పటి నుండి నేను బ్రాహ్మణులను పూజిస్తున్నాను. కనుక నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు " అని చెప్పాడు.

దుర్వాస జనం

[మార్చు]

ధర్మరాజు " కృష్ణా ! దుర్వాసుడు పరశివుడి అంశ అని అంటారు కదా ! అది ఎలా జరిగింది వివరించు " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! ఏ మానవుడైతే పరమశివుని ధ్యానించి శతరుద్రులను ఆరాధిస్తాడో అతడికి ఇహలోకములోను, పరలోకములోను దొరకని సుఖము లేదు. శివుడికి మించిన దైవము లేదు. అతడే మహాదేవుడు. అతడు ఆగ్రహించి మూడో కంటిని తెరిచాడా వేద విరుద్దులైన వారు భస్మము కాక తప్పదు. అతడికి ఆగ్రహానికి దక్షాయజ్ఞము ద్వంశం అయిన విషయము లోక విదితమే కదా ! అతడి ఆగ్రహము వలన సూర్యుడికి కళ్ళు పోయి అనుగ్రహము వలన ఆ కళ్లు తిరిగి వచ్చాయి కదా ! మిక్కిలి బలవంతులైన త్రిపురాసురులు లోకకంటకులై భాధిస్తున్నప్పుడు మహాశివుడు దేవతల మొర విని ఆ మూడు పురములను ఒకే అస్త్రముతో ధ్వంశం చేసి దానిని తన తొడ మీద పెట్టుకున్న తరుణంలో ఆ అస్త్రము ఒక బ్రాహ్మణ బాలుని ఆకారము దాల్చింది. అప్పుడు దేవతలు అతడు ఎవరని ప్రశ్నించగా ఈశ్వరుడు అతడికి దుర్వాసుడు అని నామకరణం చేసాడు. అతడే మా ఇంటికి వచ్చిన దుర్వాసుడు " అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

శివపూజ

[మార్చు]

ధర్మరాజు శ్రీకృష్ణుడితో " శ్రీకృష్ణా ! శివనామములు జపిస్తే సమస్తసంపదలు, జ్ఞానము కలుగుతుందని అంటారు కదా ! ఆ నామములను వాటి అర్ధములను తెలుపవా " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! వాస్తవానికి పరమశివుని పరిపూర్ణంగా పూజించడానికి నామాలను వాటి అర్ధాలను వివరించడానికి నేనే కాదు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. కాని నీవు అడిగావు కనుక పరమశివుని నామాలను వాటి అర్ధాలను నీకు నేను వివరిస్తాను . అగ్నివాయువు, దేవేంద్రుడు, మరుత్తులు, సూర్యుడు, వసువులు అందరూ పరమశివుని స్వరూపాలే. అంతటి మహిమాన్వితమైన పరమేశ్వరుని మహిమలు ప్రీతితో చెప్పడము శ్రద్ధగా వినడము సర్వార్ధసాధకము. ఈశ్వరతత్వము మహాతత్వము. సమస్తమునులు, ఋషులు అతడిని మహేశ్వరుడుని, హరుడని స్తుతిస్తుంటారు. ఉగ్రత్వము, అఖండమైన ప్రతాపం కలవాడు కనుక రుద్రుడని అంటారు. దేవతల కందరికీ దేవుడు కనుక దేవతలు అతడిని మహాదేవుడు అంటారు. సమస్తసత్కర్మలకు శుభప్రథమైన ఫలితాలను ఇస్తారు కనుక జనులు అతడిని శివుడు అంటారు. సుస్థిరమైన తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు కనుక అతడిని స్థాణువు అంటారు. చరాచర జీవులన్నింటా తానై చరిస్తుంటాడు కనుక అతడు బహురూపుడని స్తుతిస్తుంటారు. ఆయన జటాఝూటములతో, ధూమ్రవర్ణముతో ప్రకాశిస్తుంటాడు కనుక ఆయన జనులచేత ధూర్జటి అని పిలువబడుతంటాడు. విశ్వదేవతలందరూ అతడిని విశ్వరూపుడని పిలుస్తారు. అనేక నేత్రములతో చూస్తుంటాడు కనుక అతడిని సర్వ చక్షువు అని అంటారు. వృషభవాహనమును అధిష్టించి తిరుగుతుంటాడు అనుక ఆయనను వృషభవాహనుడు అంటారు. మహాశివుడు జనులను రక్షిస్తూ వారిని లయము చేస్తుంటాడు. పరమేశ్వరుడిని అన్ని నామములతో స్తుతించిన వారికి ఇహలోక సుఖములే కాక పరలోక సుఖములు కూడా కలుగుతాయి. వ్యాసమహర్షి పరమశివుని గురించి విశేషమైన స్తోత్రము రచించాడు. శివుడు సర్వజగములకు నిత్యసాక్షి, భూతములన్నింటే ముందున్నవాడు. అతడు సుభావహమూర్తి, నిరామయుడు. శివుడి ముఖము నుండిఅగ్ని నుండి పుట్టింది. అతడిని భక్తితో ఆరాధించిన వాడికి అతడు మోక్షము ప్రసాదిస్తాడు. ఈ శివస్త్రోత్రం రోజు భక్తితో పఠించిన వారికి సకల సుభములు కలుగుతాయి " శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పరమశివుని నామ మాహాత్మ్యము గురించి వివరించాడు.

అనుష్టించ తగిన ధర్మము

[మార్చు]

ధర్మరాజు భీముడిని " పితామహా ! ధర్మములు పలు విధములు కదా ! వాటిలో అనుష్టించ తగిన ధర్మములు ఏవి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధర్మముల గురించి ధర్మవేత్తలు మాత్రమే చెప్పగలరు. కాని కాలానుగుణంగా ధర్మము కూడా మారుతూ ఉంటుంది. ఒక్కో సారి ధర్మము కూడా తనరూపు మార్చుకుంటుంది. ఒక్కోసారి అధర్మము కూడా ధర్మములా గోచరిస్తుంది. ఒకోసారి ధర్మసూక్ష్మములు తెలియని వారు అధర్మమును ధర్మమని తలచి ప్రచారము చేస్తుంటారు. అందు వలన సాధారణ జనులు అవస్థల పాలౌతారు. అందువలన, ధర్మసూక్ష్మములను తెలిసిన వారి లన శాస్త్రాధ్యయనము వలన ధర్మమును తెసుకుని ప్రవర్తించాలి. ధర్మనందనా ! ధర్మసూక్ష్మములు తెలుసుకోవడానికి మూడుమార్గాలు ఉన్నాయి. వీటినే మునులు అనుసరించారు. నీవు అనవసర సందేహాలను వదిలి నా మాటలను విను. అహింస, దానగుణము, సత్యముపలకడము, కోపమును నిగ్రహించడము ఉత్తమధర్మములు. కనుక ఈ గుణములు అనుసరించు. ఎల్లప్పుడు బ్రాహ్మణులను పూజించు. సకల విచారములను వదిలి నిర్మలచిత్తముతో ఉండడమే ఉత్తమధర్మము " అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! సాధారణంగా ఎవరు ధర్మాన్ని పాటిస్తారు? ఎవరు ధర్మాన్ని ద్వేషిస్తారు? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మొదట బ్రహ్మముఖము నుండి ధర్మము పుట్టింది. సత్యవాక్కు పలికే వారు ధర్మమును ఉపాసించి పాటిస్తారు. వారు ఊర్ధ్వలోకాలకు పోతారు. రజోగుణము, తమోగుణము కలిగిన వారు ధర్మాన్ని ద్వేషిస్తారు. వారు నరకానికిపోతారు " అని చెప్పాడు భీష్ముడు.

సాధువులు

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! సాధువులు ఎవరు ? సాధువులు కాని వారు ఎవరు వివరించండి? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! సాధువులు కాని వారు ధర్మమును తమంతట తాము ఒకరు చెప్పినావినరు. తెలుసుకోలేరు. భోధించినా అర్ధము చేసుకోలేరు. అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించరు. శాస్త్రములను అధ్యయనము చెయ్యరు. వారిని అసాధువులు అంటారు. సాధుజనులు ధర్మమును తమంతట తాము తెలుసుకోవడానికి ప్రత్నిస్తారు. వేదములు, శాస్త్రములను అధ్యయనము చేసి తెలుసుకుంటారు. పెద్దలు, మునులు, ఋషులు చెప్పినది విని ఆచరిస్తారు. సాధుజనులు ఎల్లప్పుడు సత్యమునే పలుకుతారు. పరస్త్రీలను కన్నెత్తి చూడక ధర్మపత్ని అందే తృప్తి చెందుతారు. గురువులను పెద్దలను గౌరవించి పూజిస్తారు. శరణు కోరిన వారిని రక్షిస్తారు. కపటము లేక నడుచుకుంటారు. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటారు. జీవుల ఎడ ప్రేమ కలిగి ఉండి అహింసకు దూరంగా ఉంటారు. తెలియక చేసే పాపములకు ప్రాయశ్చితము చేస్తారు. దానములను గుప్తముగా చేస్తారు. నిర్మల మనస్కులై సదా సంతోషము అనుభవిస్తారు. ఇవి సాధులక్షణములు " అని చెప్పాడు.

పూర్వజన్మ సుకృతము

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కొంతమందికి అప్రయత్నముగా ధనము వచ్చి పడుతుంది. మరి కొంతకొంత మందికి గురువు లేకున్నా అన్ని విద్యలూ అబ్బుతాయి. మరి కొంత మందికి గురువులు ఎంత భోదించినా విద్య అబ్బదు. కొంతమంది ఎన్ని రోగములు ఉన్నా చావరు. మరి కొంత మంది బలవంతులు కూడా చిన్న దెబ్బకే మరణిస్తారు. ఈ విపరీతములకు కారణం ఏమిటి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వీటన్నిటికీ పూర్వజన్మ సుకృతమే కారణము. విత్తనము లేకనే చెట్లు మొలవవు కదా ! అలాగే పూర్వజన్మలో చేసిన సుకృతములు మంచి ఫలితాలను దుష్కృతములు చెడ్డ ఫలితాలను ఇస్తాయి. పూర్వజన్మలో ధర్మము చేసిన వారికి ఈ జన్మలో అయాచితంగా ధనము లభిస్తుంది. పూజలుతపస్సు చేసిన వారికి ఈ జన్మలో అపారమైన సౌఖ్యములు కలుగుతాయి. గురువులకు శుశ్రూష చేసిన వారికి అప్రయత్నముగా చదువులు అబ్బుతాయి. క్రిందటి జన్మలో అహింసను పాటించిన వారు ఈ జన్మలో దీర్గకాలము జీవిస్తారు. కనుక సాధుజనులు ధర్మమును పాటిస్తూ, దానములు చేస్తూ, తపస్సుచేస్తూ, గురువులను గౌరవిస్తూ, పెద్దలను మన్నిస్తూ, అతిథులను సత్కరిస్తూ సత్పరవర్తునులై ఉండాలి. అటువంటి వారు ఈ జన్మలో కాక మరుజన్మలో కూడా సుఖములు అనుభవిస్తారు. ధర్మమును ఆచరిస్తూ, దానధర్మములు చేస్తూ ధర్మమును భోదిస్తూ స్నానము జపము, తపస్సు, సంధ్యా వందనము చేస్తూ మితాహారము తీసుకుని మనసు నిర్మలంగా ఉంచుకున్న మానవుడు మోక్షము పొందడానికి కూడా అర్హుడు. ధర్మనందనా ! నీ కంటి వెలుగు వ్యాసుడు నీకు శ్రీకృష్ణుడి అండ కూడా ఉంది. వీరి అండతో నీవు ప్రజలను పాలిస్తూ నీ తమ్ములతో సుఖముగా జీవించు " అని చెప్పాడు. ఆ సమాధానంతో ధర్మరాజు సంతృప్తి చెందాడు.

వ్యాసుడు

[మార్చు]

భీష్ముడు చెప్పి ముగించిన తరువాత వ్యాసుడు " శాంతనవా ! నీ ఉపదేశములతో ధర్మరాజు విజ్ఞానవంతుడు అయ్యాడు. ధర్మరాజే కాదు అతడి తమ్ములు, ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు, ఇక్కడ ఉన్న సమస్తరాజన్యులు కూడా ధన్యులు అయ్యారు. ఇక ధర్మరాజుకు హస్థినాపురముకు పోవుటకు అనుజ్ఞ ఇమ్ము. తగిన సమయం చూసి తిరిగి నీ వద్దకు వస్తాడు " అని చెప్పాడు. భీష్ముడు " వింటివి కదా వ్యాసుడి మాటలు ఇక నీవు నీతమ్ములతో హస్థినాపురం పోయి జనరంజకంగా రాజ్యపాలన చెయ్యి. సదా నీ అందు ధర్మము నెలకొని ఉంటుంది. యయాతి మహారాజు వలె యజ్ఞయాగాదులు నిర్వహించు. బంధు మిత్రులను ఆదరించు. ప్రజలను కన్న బిడ్డల వలె పాలించి రక్షించు. నీ తల్లిని, తమ్ములను, ధృతరాష్ట్రుని, గాంధారిని, విదురుని చక్కగా ఆదరంతో చూసుకుంటూ సుఖంగా రాజ్యపాలన చేయి. ఇప్పుడిక హస్థినకు వెళ్ళి సూర్యుడు మకరరాశిలో ప్రవేశించగానే తిరిగి నా వద్దకు రా " అని చెప్పి ధర్మరాజును ఆశీర్వాదం చేసాడు. ధర్మరాజు భీష్ముడికి నమస్కరించి " పితామహా మీరు చెప్పినట్లే చేస్తాను " అని చెప్పి హస్థినాపురానికి శ్రీకృష్ణుడు, తన తమ్ములతో ప్రయాణం అయ్యాడు. మంగళ వాయిద్యములు మ్రోగుతుండగా పుణ్యాంగనలు అక్షితలు చల్లుతుండగా హస్థినాపుర ప్రవేశం చేసాడు. ముందుగా పెదతల్లి గాంధారిని దర్శించుకుని ఆమె ఆశీర్వాదం తీసుకుని, ధృతరాష్ట్రుడిని కలుసుకుని అతడి ఆశిర్వాదము తీసుకుని, తరువాత తన తల్లి కుంతీ దేవిని కలుసుకుని ఆమె ఆశీర్వాదం తీసుకుని, భార్య ద్రౌపదిని కలుసుకుని ఆమె యోగక్షేమములు కనుక్కున్నాడు. తరువాత నగరవాసులను కలుసుకుని ఇష్టాగోష్ఠి చేసాడు. బ్రాహ్మణులకు దానధర్మాలు చేసాడు. యుద్ధములో భర్తలను, కుమారులను పోగొట్టుకున్న స్త్రీలను ఓదార్చి వారికి ఆశ్రయము కల్పించి వారిని ధనముతో సంతోషపెట్టాడు. తరువాత కురుసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేపట్టాడు. తన తమ్ములకు వారి వారి పనులను అప్పగించి తాను విశ్రాంతి భవనంలోకి ప్రవేశించాడు.

ఉత్తరాయణము

[మార్చు]
చనిపోబోతున్న భీష్ముడిని సందర్శించడానికి వచ్చిన శ్రీకృష్ణుడు పాండవులు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

యాభైదినములు గడిచాయి సూర్యుడు మకరరాశిలో ప్రవేశించాడు. ఊత్తరాయణము మొదలైంది. ధర్మరాజు తన తమ్ములు, గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవిని, శ్రీకృష్ణుడిని, విదురుడిని, సంజయుడిని, యుయుత్సుడిని, ధౌమ్యుడిని మిగిలిన నగర పెద్దలను తీసుకుని నూతనవస్త్రాలను, చందనం, అగరు వంటి సుగంధద్రవ్యాలను తీసుకుని భీష్ముడు అంపశయ్య మీద ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అంత దూరం ఉండగానే రథములు దిగి అంతా పాదాచారులై భీష్ముని వద్దకు వెళ్ళారు. అప్పటికే వ్యాసుడు, నారదుడు, దేవలుడు వంటి మహామునులు అక్కడికి చేరుకున్నారు. ధర్మరాజాదులు వారందరికి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! నేను ధర్మతనయుడిని వచ్చాను. నీకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి. ఉత్తరాయణం వచ్చింది. అందుకని అగ్ని మొదలైన సామాగ్రి తీసుకుని వచ్చాను. శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, నా తమ్ములు కూడా వచ్చారు. కళ్ళు తెరిచి చూడండీ " అని ప్రార్థిచాడు.

భీష్ముడి చివరి బోధ

[మార్చు]

"భీష్ముడు మెల్లగా కళ్ళు తెరిచి అందరినీ ఒక సారి చూసి ధర్మరాజు చేతిని తన చేతిలోకి ప్రేమతో తీసుకుని నిమురుతూ " వచ్చావా కుమారా ! మాఘమాసము శుక్లపక్షము నా మనస్సుకు ఆహ్లాదము కలిగిస్తుంది " అని ధృతరాష్ట్రుడిని చూసి " కుమారా ! నీకు అన్ని ధర్మములు తెలుసు. జరుగుతున్నది జరగబోయేది తలచుకుని కలతపడ వద్దు. సద్భావంతో ఆలోచిస్తే పాండునందనులు నీ కుమారులు కాదా ! వారిని ఆదరంతో చూడు. దయతో ఆదరించి వారి శుశ్రూషలు అంకుని వారికి కర్తవ్య బోధచేస్తూ రాజ్యపాలనలో సహకరించు. ధృతరాష్ట్ర కుమారా ! ధర్మరాజు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అతడికి ద్వేషించడం అంటే తెలియదు. కనుక నీవు పాండునందనులను వాత్సల్యముతో చూసుకో. నీ కుమారులు దుర్మార్గులు, లోభత్వము కలవారు, కుత్సిత స్వభావులు, క్రోధబుద్ధి కలవారు, అధర్మపరులు, అవినీతిపరులు వారి కొరకు నీవు చింతించ పనిలేదు " అన్నాడు. తరువాత శ్రీకృష్ణుడిని చూసి " శ్రీకృష్ణా, వాసుదేవా, సమస్త జీవులలో నివసించే వాడా, శంఖు, చక్ర, గధా, పద్మములను నాలుగు చేతులతో ధరించువాడా, త్రివిక్రమా, పరమపురుషా, దేవతలతో పూజింపుబడువాడా, వరదా నేను నీకు నస్కరిస్తున్నాను. భార్యాబిడ్డలు లేని వాడిని, నీవే నాకుదిక్కు నన్ను ప్రేమతో ఆదరించు. నేను నీ భక్తుడను నీవే నా బలము. నేను నీ భక్తుడను నన్ను అధికమైన కరుణతో ఆదరించి రక్షించు. నాకిక అనుజ్ఞ ఇవ్వు. పాండుకుమారులకు నీవే అండ. వారికి మార్గదర్శకుడివై వారిని ఆదరంచు. దుర్మార్గులైన కౌరవులకు నేను అనేకమార్లు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయము ఉంటుంది అని చెప్పాను. అయినా కుబుద్ధి అయిన సుయోధనుడు వినలేదు. తన వారిని అందరిని బలి పెట్టి తానూ మరణించాడు. కృష్ణా ! నీ వెవరో నేను ఎరుగుదును. నరనారాయణులు లోక రక్షణార్ధమై ఈ లోకములో లీలామానుష విగ్రహాలై సంచరిస్తున్నారని వారే కృష్ణార్జునులని నారదమహర్షి వ్యాసుడు చెప్పగా తెలుసుకున్నాను " అని అన్నాడు.

భీష్ముడి స్వర్గలోకయాత్ర

[మార్చు]
భీష్నుని మరణం- రాజ్మానామా నుండి ఒక దృశ్యం

శ్రీకృష్ణుడు " దేవవ్రతా ! ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నీవు పుణ్యాత్ముడవు. నీకు నీ తండ్రి పట్ల భక్తిశ్రద్ధలు కల వాడవు కనుకనే మృత్యువు నీ పట్ల సేవకుని వలె ప్రవర్తిస్తూ వేచి ఉంది. నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను నీవిక ఈ దేహయాత్ర చాలించి వసువులలో చేరుకొనుము " అని పలికాడు. ఆ మాటలకు భీష్ముడు ఆనందభరితుడై " ధృతరాష్ట్రుడిని, ధర్మరాజును, మిగిలిన పాండుసుతులను ఇంకా అక్కడ ఉన్న అందరినీ ప్రేమతో చూస్తూ " మీ అందరి వద్ద ఇక శలవు తీసుకుంటున్నాను " అని అన్నాడు. అందరినీ కౌగలించుకున్నాడు. " మీరు అందరూ సత్యమును పలకండి. క్రూరత్వమును వదలండి " అని బోధించాడు. తాను ఇంతకు ముందు రాజులవద్ద గెలుచుకున్న ధనమును బ్రాహ్మణులకుదానంగా ఇచ్చాడు. ధర్మరాజును పిలిచి " ధర్మనందనా ! బ్రాహ్మణులు పూజింపతగిన వారు. అందులో ఋత్విక్కులు, ఆచార్యులు, వృద్ధులు మరింత పూజింపతగిన వారు " అని పలికి తరువాత మౌనం వహించాడు. భీష్ముడు యోగధారణ చేసి జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసాడు. అన్ని వాయువులను సులభంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించాడు. ఒక్కొక్క అవయవం నుండి ప్రాణములను వెనక్కి లాగుతున్నాడు. అక్కడ ఎముకలు మాయమౌతున్నయి. అది చూసి అక్కడ ఉన్న మునులు, రాజులు ఆశ్చర్యచకితులై చూస్తూ భీష్ముడిని పలు విధములుగా శ్లాగించారు. ఆ సమయంలో భీష్ముడి జీవాత్మ మూర్ధమును చీల్చుకుంటూ ఒక ఉల్కవలె ప్రకాశిస్తూ ఆకాశంలోకి లేచి కొంత దూరం పోగానే అదృశ్యం అయింది. దేవతలు దుందుభులు భీష్ముడి మీద మ్రోగిస్తూ పూలవాన కురిపించారు. సిద్ధులు, సాధ్యులు భీష్ముడిని వేనోళ్ళ పొగిడారు. ఈ విధంగా భీష్ముడు స్వర్గలోకం చేరాడు.

భీష్ముడి దహన సంస్కారం

[మార్చు]

తరువాత ధర్మరాజాదులు, విదురుడు, యుయుత్సుడు మొదలగు వారు భీష్ముడి శరీరానికి దహనసంస్కారానికి ఏర్పాటు చేసారు. చందనము, అగరు వంటి చెక్కలతో చితిపేర్చారు. అందరూ స్నానాలు చేసారు. వేదపఠనాల మధ్యహోమాగ్ని వెలిగించారు. భీష్ముడి పార్ధివ శరీరాన్ని తలవైపు నకుల సహదేవులు కాళ్ళవైపు ధృతరాష్ట్ర ధర్మరాజులు పట్టుకుని చక్కగా అలంకరించిన వాహనము మీద చేర్చారు. నకులసహదేవులు, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు మోస్తుండగా భీమార్జునులు చారములు వీస్తున్నారు. యుయుత్సుడు ఛత్రము పట్టాడు. వృద్ధ కౌరవస్త్రీలు వింజామరలు వీచారు. ధౌమ్యుడు పౌరోహిత్యము వహించాడు. అందరూ కలిసి భీష్ముడి శరీరాన్ని చితిమీద చేర్చారు. చితిమీద నేతిని పోసారు. చితికినిప్పు అంటించారు. ఆ విధంగా భీష్ముడికి వైభవంగా దహనసంస్కారాలు చేసి అందరూ స్నాదికాలు చేసి భీష్ముడికి నువ్వులు నీళ్ళు వదిలారు.

గంగాదేవి రోదించుట

[మార్చు]

ఆ సమయంలో గంగాదేవి రోదిస్తూ గంగాజలం నుండి బయటకు వచ్చి " అయ్యో దేవవ్రతా ! ముల్లోకాలలో నీ కంటే పరక్రమవంతుడు లేడని అనిపించుకున్నావు కదా ! మీకు తెలుసు కదా ! నా కుమారుడు దృఢవ్రతుడు, బుద్ధిశీలుడు, క్షత్రియధర్మము బాగా తెలిసినవాడు. అందరి అందు కృప కలిగినవాడు. తనతండ్రి అందు ప్రేమ భక్తికలవాడు. తన తమ్ముల కొరకు కాశీరాజు కుమార్తెలను తీసుకు వచ్చి వివాహము జరిపించాడు. అన్ని విద్యలయందు ఆరితేరిన వాడు. పెద్దల ఎడ గౌరవము కలిగినవాడు. తన గురువు పరశురాముడినే ఎదుర్కొని గెలిచిన వాడు. అలాంటి మహిమాన్వితుడు శిఖండి చేతి దెబ్బలు తిని శరతల్పగతుడై చివరకు మరణించాడు. ఇది చూసికూడా నా హృదయం బద్దలుకాలేదంటే నాది వజ్రసమాన హృదయమే కదా ! " అని రోదిస్తూ ఉంది.

వ్యాసుడు గంగాదేవిని ఓదార్చుట

[మార్చు]

అప్పుడు వ్యాసుడు " అమ్మా ! భాగీరధీ ! నీ శోకాన్ని విడిచి పెట్టు. నీ కుమారుడు పరమగతి పొందాడు. నీ కుమారుడు ఒక వసువు. అతడు శాపవశాత్తు మానవుడిగా జన్మించాడు. అతడు తిరుగు లేని వీరుడు. అతడిని దేవేంద్రుడు కూడా జయించడం సాధ్యము కాదు. శిఖండి నీ కుమారుడిని పడగొట్టలేదు. నీ కుమారుడు కావాలనే తన శరీరంలో బాణములు నాటించుకుని శరతల్పగతుడై తనకు తానుగా మరణాన్ని ఆహ్వానించి మరణాన్నిపొంది స్వర్గలోకము చేరాడు. అంతే కాని అతడిని ఎవరు జయించలేదు. ఇంత కాలము మృత్యువును దూరంగా ఉంచి ఉత్తరాయణం రాగానే తనకు తానుగా మరణించాడు. అతడి కొరకు నీవు శోకించ తగదు " అని వ్యాసుడు గంగాదేవిని ఓదార్చాడు. తరువాత శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజాదులు గంగాదేవి వద్ద శలవు తీసుకుని హస్థినకు వెళ్ళారు. గంగాదేవి జలములలో కలిసి పోయింది.

బయటి లింకులు

[మార్చు]