Jump to content

వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము

వికీపీడియా నుండి
(అంతర్జాతీయ వికీపీడియా నుండి దారిమార్పు చెందింది)
విజయ యుగాది 2013 సందర్భంగా పత్రిక ప్రచార సౌలభ్యం కొరకు పత్రికా శైలిలో వ్రాసిన వ్యాసం.

ఒకే ఒక్క క్లిక్ తో ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని కంటి ముందు సాక్షాత్కరింపజేస్తున్న ఒకే ఒక్క మీడియా వికీపీడియా. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషలలో అంతర్జాల విజ్ఞాన సర్వస్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వికీపీడియా రేపటి తరాన్ని విజ్ఞాన సుగంధాలతో సుసంపన్నం చేస్తుందన్నది అక్షర సత్యం...! సమాచార విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్న నేపథ్యానికి సూత్రధారిగా అభివర్ణించదగిన వికీపీడియా ప్రారంభమై పుష్కర కాలం గడచినా... వికీపీడియా అంటే ఏమిటి? అనే సందేహం ఇంకా చాలామందిలో ఉండనే ఉంది. అక్షరజ్ఞానం కలిగిన ప్రపంచ జనావళికి అందుబాటులో ఉంటూ, అభ్యుదయ సాధనలో తనవంతు పాత్రను సేవాభావంతో నిర్వహిస్తున్నదే వికీపీడియా...! పన్నెండేళ్ళ కిందట ఆంగ్లభాషలో ఆరంభమైన వికీపీడియా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్కొక్క భాషను కలుపుకుంటూ నిరవరోధంగా సాగుతూ ప్రపంచంలోని ప్రతి ప్రధాన భాషలో వికీపీడియా తన ప్రభావాన్ని వెదజల్లుతూ నేటికి 285 భాషలకు విస్తరించి, తన విజయయాత్ర కొనసాగిస్తుండగా.... ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ అనంతరం మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబుతోంది.

తెలుగు వికీపీడియా మొదటి పేజి

ప్రవేశిక

వికీపీడియా అంటే అంతర్జాల విజ్ఞానభాండాగారం. పలువురు కలిసి విజ్ఞాన సమాచారాన్ని సేకరించి అంతర్జాలంలో ఒకచోట భద్రపరచడం. ఈవిధంగా భద్రపరచినదానిని అందరికీ ఉచితంగా వాడుకోవడానికి అనుమతించడం. విషయసేకరణ మరియు అది అందరికీ అందుబాటులో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరంగా ప్రవహింపచేయడమే వికీపీడియా లక్ష్యం. ఈ ప్రక్రియను మొదలు పెట్టిన ఘనత జిమ్మీ వేల్స్ అనే అమెరికన్ కు చెందుతుంది. న్యూపీడియాకు అనుబంధంగా పనిచేస్తున్న వికీపీడియాకు అనూహ్య ఆదరణ లభించడంతో 2001 జనవరి 15 వ తేదీన వికీపీడియాగా అవతరించింది. విషయపరిజ్ఞానం ఉన్న సామాన్యులు సైతం పాల్గొని, తమకు తెలిసిన సమాచారాన్ని వ్యాసంగా తయారుచేసే అవకాశం కల్పించడంతోబాటు, ఆ విధంగా సంగ్రహించిన సమాచారాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వికీపీడియా అవతరించింది. వికీపీడియా లాభాపేక్షరహితంగా పనిచేస్తుంది కనుక దీనిలో ప్రకటనలకు కూడా తావులేదు. అవసరమైన నిధులను చందాల రూపంలో మాత్రమే సమకూర్చుకుంటుంది. వికీపీడియా ఊహ జిమ్మీవేల్స్ దైతే దానికి ఆచరణాత్మక రూపమిచ్చిన ఘనత లారీ సాంగరుకు దక్కుతుంది. వికీపీడియా రూపకల్పన చేయడానికి లారీసాంగర్ సాంకేతిక నిపుణుడైన "బెన్ కోవిడ్జ్ " సలహా సహకారాలను తీసుకున్నాడు. ఇందుకు అవసరమైన హార్డ్‍వేర్ ను బోమిస్ సంస్థ ఉచితంగా అందించింది. అంతే.... లభించిన ప్రాథమిక సౌకర్యాలతో శాండియాగోలో వికీపీడియా కార్యాలయం ప్రారంభమైంది. నవ్యచరిత్రకు అంకురార్పణ జరిగింది.

వికీపీడియా ఆవిష్కరణ

ఆంగ్ల వికీపీడియా మొదటి పేజీ

ఎంత పెద్ద నది అయినా చిన్న పాయలాగే తన ఉనికి ప్రారంభించి, క్రమేణా తన ఉరవడిని పెంచుకుంటూ... వేగంగా... శరవేగంగా ఉరకలెత్తుతూ ... మహోధృత జల ప్రవాహమై నేల తల్లిని పునీతం చేస్తుంది. సకల జనావళికి ఉజ్వల భవితనిస్తుంది. సమాచార సజీవ నదిగా ప్రపంచ జనావళి విజ్ఞానతృష్ణ తీరుస్తున్న వికీపీడియా ఇందుకు నిజమైన ఉదాహరణ అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు...! న్యూపీడియాకు అనుబంధంగా ఆరంభమైన 'వికీపీడియా' అతితక్కువ కాలంలోనే మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇంత పేరుప్రఖ్యాతలు పొందిన వికీపీడియాకు ఈ బీజం ఎలా పడింది? దీనిని నాటిన వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్న ఎవరికైనా ఉదయించక మానదు. ఈ బీజంనాటిన వ్యక్తి జిమ్మీవేల్స్ కాగా, బాసటగా నిలిచిన వ్యక్తి లారీ సాంగర్. 1996 లో స్థాపించబడిన 'బోమిస్ సంస్థ' అధిపతులలో ఒకరైన జిమ్మీవేల్స్... తనసంస్థలో ప్రకటనల విక్రయం ఒక వైపు చూసుకుంటూనే, న్యూపీడియా పేరుతో ఉచిత విజ్ఞానభాండాగారమైన ఎన్‌సైక్లో పీడియా ప్రణాళికలకు సహాయం చేయడం తన ప్రధాన ప్రవృత్తిగా మార్చుకున్నారు. న్యూపీడియాలో వ్యాసాలు రాసేవారంతా విద్యావేత్తలు, మేధావులే అయినప్పటికీ, ఆ వ్యాసాలు అనేక వడపోతల తరువాత మాత్రమే ఎన్‌సైక్లోపీడియాలో ప్రకటించబడతాయి. న్యూపీడియాలో వ్యాసాలు తక్కువగా ఉండటానికి కారణం ఇదే...! న్యూపీడియా వాసిలో గొప్పగానే ఉన్నప్పటికీ రాసిలో అత్యల్పంగా ఉండటంతో ప్రజలందరికీ చేరువ కాగలిగిన సమాచార వ్యవస్థ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలోనే - జిమ్మీవేల్స్ చేత న్యూపీడియా సంపాదకుడిగా నియమించబడిన లారీ సాంగర్ ఎవరైనా సరిదిద్దగలిగిన విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేసి దానిని వేగవంతం చెయ్యవచ్చు అని సలహా ఇచ్చాడు. జిమ్మీవేల్స్ దానిని అమలులోకి తీసుకు వస్తూ లారీ సాంగర్ సాయంతో న్యూపీడియాకు అనుబంధంగా ఆంగ్లభాషలో మాత్రమే వికీపీడియాను స్థాపించారు. వికీ అనేపదాన్ని హవాయి భాష నుండి స్వీకరించబడింది. హవాయి భాషలో వికీ అంటే వేగం అని అర్ధం. అంటే వికీపీడియా వేగవంతమైన విజ్ఞాన భాండాగారం అన్నమాట...!

వికీపీడియా అభివృద్ధి

న్యూపీడియాకు అనుబంధంగా వికీపీడియా 2001 జనవరిలో ప్రారంభమైంది. న్యూపీడియాలో వ్యాసాలను అందిస్తున్న వారికి ఈమెయిల్ సందేశాల ద్వారా ఆహ్వానాలు పంపారు. సాధారణ వ్యక్తులు కూడా వికీపీడియాలో వ్యాసాలను రాయగలగడంతోబాటు ఇతరులు రాసిన వ్యాసాలలో అక్షర దోషాలను సరిదిద్దడం, అదనపు సమాచారాన్ని జోడించడం వాటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వికీపీడియాలో వ్యాసాల చేరిక ప్రారంభమై, దినదినాభివృద్ధి చెందుతూ 2008 ఆగస్ట్ 8 నాటికి 8000 వ్యాసాలకు, 2001 సెప్టెంబర్ 25 నాటికి 13,000 వ్యాసాలకు, 2001 సంవత్సరాంతానికి 20,000 వ్యాసాల స్థాయికి చేరుకుంది. వికీపీడియా సమాచార సేవకి విశేష ప్రజాదరణ లభించడంతో ఇతర భాషలలో కూడా వికీపీడియాను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఫలితంగా 2001ఆఖరులో 18 భాషలలో వికీపీడియా వ్యాసాలు వెలువడ్డాయి. 2002 నాటికి 26 భాషలలో ప్రారంభమైన వికీపీడియా 2003 సంవత్సరాంతానికి 46 భాషలకు చేరుకుంది. 2004 సంవత్సరాంతానికి గరిష్టంగా 161 భాషలలో వికీపీడియాలు విస్తరించి ఆయా భాషలలో వ్యాసాలను వెలువరించాయి. వికీపీడియా ప్రజలకు చేరువ కావడంతో 2003 లో న్యూపీడియా సర్వర్లను పూర్తిగా మూసివేసి దానిలోని సమాచారాన్ని వికీపీడియాలో విలీనం చేశారు. 2007 సెప్టెంబర్ నాటికి ఆంగ్ల వికీపీడియా వ్యాసాల సంఖ్య 20,00,000కు చేరుకుంది. ప్రతి చిన్న అవకాశాన్నీ వ్యాపారవనరుగా మార్చేసుకుంటున్న పెట్టుబడిదారీ సమాజం వికీపీడియాను తమ వ్యాపార ప్రచారానికి వినియోగించుకోగలదని భావించిన జిమ్మివేల్స్... వికీపీడియా.కాం ను వికీపీడియా ఆర్గనైజేషన్ పేరుతో సేవా సంస్థగా మార్చి వికీపీడియాలో ప్రకటనలకు తావు లేకుండా చేసారు. దాంతో వికీపీడియా పరిధులు, పరిమితులు స్పష్టంగా నిర్దేశించినట్లయ్యింది. వికీపీడియా మరింత స్థిరంగా... రెట్టించిన వేగంతో... ముందుకు సాగుతూ 2009 నాటికి 30,00,000 వ్యాసాల స్థాయికి చేరుకుంది. 2007 జనవరి నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలలో ప్రజాదరణ పొందిన మొదటి 10 వెబ్‌సైట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన వికీపీడియా... ఖచ్చితమైన సమాచారం కోసం అన్వేషించే ప్రపంచ ప్రజల నమ్మకాన్నీ, మన్ననలనూ పొందుతూ 2012 నాటికి 1200 కోట్ల అంతర్జాతీయ వీక్షకుల అభిమానం తన స్వంతం చేసుకుంది. ఆనాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల వీక్షకుల సంఖ్య 270 కోట్లు మాత్రమే ఉంది. సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 6వ స్థానానికి చేరి వికీపీడియా సంచలనం సృష్టించింది.

ఆవిష్కర్త జిమ్మీ వేల్స్

బాల్యం, విద్యాభ్యాసం

వికీపీడియా వ్యవస్థాకుడు జిమ్మీ వేల్స్

వికీపీడియా ఆవిష్కర్త అయిన జిమ్మీ వేల్స్ 1966 ఆగస్ట్ 7 తేదీన అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని " హంట్స్‌విల్ల్" లో జన్మించారు. ఆయన తండ్రి కిరాణాకొట్టు మేనేజరుగా పనిచేసేవాడు. ఆయన తల్లి డోరిస్ మరియు అమ్మమ్మ ఎర్మా ఒకగది-పాఠశాల అనే చిన్న సంప్రదాయక ప్రైవేట్ శిక్షణాలయం నడుపుతూ ఉండేవారు. వేల్స్ ఆయన ముగ్గురు సహోదర సహోదరీలతో కలసి ఆ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ఆరంభించాడు. బాలుడిగా వేల్స్ మంచి పాఠకుడుగానూ మేధాపరమైన కుతూహలం కలిగి ఉండేవాడు. బాల్యం నుండే వేల్స్ విజ్ఞాన సంబంధిత పుస్తక పఠనం అంతే ఎక్కువ ఇష్టపడేవాడు. ఎనిమిదోతరగతి తరువాత వేల్స్ విద్యాభ్యాసం రాండోల్ఫ్ స్కూలులో కొనసాగింది. 16 సంవత్సరాలకు పట్టభధ్రుడు అయ్యాడు. మంచి జీవితానికి ప్రాధమికవిద్యే నిజమైన పునాది వంటిదని విశ్వసించే వేల్స్ తన కుటుంబ ఆర్ధిక స్తోమతకు తాను చదువుకున్న ఆ పాఠశాల విద్యాభ్యాసమే ఖరీదైనదిగా భావించేవాడు. ఆయనకు విద్య అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆయన " ఆబర్న్ యూనివర్సిటీ "లో బాచిలర్ డిగ్రీ సంపాదించాడు. యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో మాస్టర్ డిగ్రీ అందుకునే ముందు ఇండియానా యూనివర్శిటీలో పి.హెచ్.డి లో ప్రవేశించాడు. కానీ ఆయన డాక్టరేట్ పొందక మునుపే అనివార్య కారణాలవల్ల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిపివేశాడు.

వృత్తి

1994 లో వేల్స్ " చికాగో ఆప్షన్ అసోసియేషన్ " ఉద్యోగంలో చేరాడు. ఆయన ఆ సమయంలో ఇంటర్నెట్ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకుని తీరిక సమయంలో కొన్ని కంప్యూటర్ కోడ్ లను కూడా రాసాడు. తగినంత ధనం సేకరించిన తరువాత 1966లో ఆయన తాను చేస్తున్న ఉద్యోగం వదిలి ఇంటర్నెట్ పారిశ్రామిక వ్యక్తిగా మారాడు. బోమిస్ సంస్థ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న సమయంలో దానికి కావలసిన నిధులను సమకూర్చి ఆయన తన విజ్ఞాన తృష్ణ తీర్చుకోవడానికి మొదటి అడుగు వేశాడు. ఈ విషయంలో అంతర్జాలంలో చర్చలు జరిపే సమయంలో వేల్స్ 1990లో లారీ సాంగరుతో పరిచయం అయ్యింది. ఆ తరువాత వారిద్దరూ నేరుగా కలుసుకుని తరచుగా చర్చలు సాగించి మంచి మిత్రులయ్యారు. వేల్స్ ఎన్‌సైక్లోపీడియా ఆరంభించాలని నిర్ణయించుకున్న తరువాత మిత్రుడు ఒహియో స్టేట్ యూనివర్సిటీ పట్టబధ్రుడైన లారీ సాంగర్ కు దాని ప్రధాన సంపాదక బాధ్యతలు అప్పగించాడు.

వికీపీడియా స్థాపించడానికి విశేష సహకారం లారీ సాంగర్

వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్‌వ్యూలో జన్మించిన లారీ సాంగర్ తన ఏడేళ్ళ వయసులో అలాస్కాలోని ఆంకరేజ్‌కి కుటుంబంతో సహా తరలివెళ్ళారు. లారీ సాంగర్ ఎదిగే వయసులోనే విద్యలో రాణించాడు. చిన్న వయసు నుండి తత్వశాస్త్రం అంటే మక్కువ పెంచుకున్నాడు. చిన్నతనంలో లారీ సాంగర్ ను ఒకాయన "తత్వశాస్త్రంతో నువ్వేమి చేస్తావు ?" అని అడిగాడట. అందుకు సాంగర్ బదులిస్తూ "ప్రపంచం ఒకే విషయం గురించి ఆలోచించేలా మార్గాన్ని మారుస్తాను" అంటూ బదులిచ్చాడని ఆంకరేజ్‌ డైలీ పత్రికలో ఆలెన్ బ్రాస్ రాసాడు. ఆ చిన్నప్పటి మాట నిజజీవితంలో నిజం చేసాడు. వికీపీడియా స్థాపనకు తోడ్పడి ప్రపంచపు ఆలోచనా మార్గాన్ని మార్చివేసి సంచలనం సృష్టించాడు. 1986 లో స్కూల్ పట్టా పుచ్చుకున్న సాంగర్ ఆ తరువాత తత్వశాస్త్ర అధ్యయనం కోసం కళాశాల ప్రవేశం చేసాడు. కళాశాల విద్యార్ధిగా సాంగర్ విజ్ఞానమూలాలను శోధించడం మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలోనే అంతర్జాలం దాని ప్రచురణ సౌకర్యాల విషయంలో కుతూహలం పెంచుకున్నాడు. ఈ కుతూహలం ఆయనకు ఎన్‌సైక్లోపీడియా కొరకు వికీపీడియాను ఉపయోగించే మార్గం అన్వేషించడానికి తోడ్పడింది. ఆయన మొదటి ప్రయత్నంలో ఒక సర్వరును స్థాపించి దానిలో విద్యార్ధులను ఉపాధ్యాయులను అనుసంధానం చేసి నిపుణుల నుండి విద్యార్ధులు విద్యను నేర్చుకోవడానికి సౌకర్యం కలిగించాడు. విద్యాబోధనా విధివిధానాలు అంతర్జాలం ద్వారా అందే మార్గాలను అన్వేషిస్తూ చర్చల పరంపర కొనసాగించాడు. 1991లో సాంగర్ రీడ్ కాలేజ్ నుండి తత్వశాస్త్రంలో బాచిలర్ డిగ్రీనీ, 1995లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుంచి అందుకున్నాడు. తరువాత అదే యూనివర్శిటీ నుంచి 2000లో డాక్టరేట్ పట్టా పొందాడు. సరిగ్గా అదే కాలంలో "సాంగర్స్ రివ్యూ ఆఫ్ వై2కె రిపోర్ట్ " అనే అంతర్జాల వేదిక (వెబ్‌సైట్) ను నిర్వహించాడు. వీక్షకులకు ఇది వై2కె మూలాధారంగా ఉపకరించింది. అంతర్జాలం ద్వారా పరిచయమైన స్త్రీతో సాంగర్ వివాహం 2001లో జరిగింది. సాంగర్ దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాంగర్ జిమ్మీ వేల్స్ తో చేతులు కలిపి న్యూపీడియా సంపాదకుడుగా పనిచేయడం ఆయనను వికీపీడియా వైపు అడుగులు వేయించింది.

విస్తరణ

న్యూపీడియాకు అనుబంధంగా స్థాపించబడిన వికీపీడియా అతి తక్కువ సమయంలోనే న్యూపీడియాను అధిగమించి ప్రజాదరణ పొందడం నిజంగా సంచలనమే...!. న్యూపీడియాలో వ్యాసాలు రాసినవారంతా మేధావులే అయినప్పటికీ, ఆయా వ్యాస సారాంశం, రచనావిధానంపై వివిధ చర్చలు పలు వడపోతలు జరిగిన పిమ్మటే అవి అంగీకరించబడేవి. కానీ వీకీపీడియాలో సామాన్యులు సైతం వ్యాసాలు రాసే అవకాశం ఉంటుంది. సామాన్యులచే... సామాన్యుల కోసం... తయారవుతున్న ఈ వ్యాసాలను ఎవరయినా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తమకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో భద్రపరచవచ్చు. ఇటువంటి సరళీకృత విధానం అమలుపరచే వికీపీడియా వాణిజ్యపరమైన ప్రకటనలను ఆకర్షించే అవకాశం ఉన్నందువలన వేల్స్ వికీపీడియాను సేవాసంస్థగా మార్చి వ్యాపారానికి దూరం చేసారు. ఈ సమాచార విప్లవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాబాహుళ్యానికి చేరువ చేయ్యాలన్న దృఢసంకల్పంతో కృషిచేస్తున్న వికీ సారధులు భారతీయ భాషలలో వికీపీడియాను ఆరంభించే ఆసక్తి ఉన్న కొందరు భారతీయులతో సంప్రదింపులు జరిపారు. భాషాభిమానం, సమాజ సేవాభిలాష ఉన్న కొందరు అనుకూలంగా స్పందించి, తమ ప్రాంతీయ భాషలలో వికీపీడియాను ప్రారంభించారు. మన దేశంలో మొదటిసారిగా 2003 జూన్ లో హిందీ వికీపీడియా ఆరంభించబడింది. ఇది దినదినప్రవర్ధమై, 2011 నాటికి 1,00,000 వ్యాసాల స్థాయికి చేరుకుని భారతీయభాషలలో హిందీ వికీ మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. 2003 జూన్ లో హిందీ వికీపీడియా ప్రారంభంకాగా, అదే సంవత్సరం డిసెంబర్ మాసంలో తెలుగు వికీపీడియా రూపొందించబడింది. జనసామాన్యానికి చేరువ కావడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తన ప్రయాణాన్ని కొనసాగించి తనదైన పురోభివృద్ధి సాధించింది. అంతేకాకుండా కంప్యూటర్లో ఇతర భాషలలో వ్యాస రచనలు రాయడానికి యూనికోడ్ స్థాపన సర్వసాధారణం కావటం భారతీయ వికీపీడియాల విజయయాత్రకు మార్గం సుగమం చేసింది.

అంతర్జాతీయ వికీపీడియా గణాంకాలు

2013 గణాంకాలు :-

  • వికీపీడియా మొదటిసారిగా ఆంగ్లభాషలో ఆరంభించారు.
  • వికీపీడియాలో మొదటిసారిగా ఆరంభించిన వార్త " హలో వరల్డ్ ".
  • మొదటి వ్యాసం రూపుదుద్దుకున్న తేదీ 2001 జనవరి 16, ప్రారంభించిన సమయం 21.08 (యు.టి.సి).
  • న్యూపీడియా దిద్దుబాటుదారులకు సందేశాలు పంపడం ద్వారా ఆరంభదశలో దిద్దుబాటుదారుల చేరిక సాధ్యమైంది.
  • వీక్షకుల రాక గూగుల్ ద్వారా ఆరంభం అయింది.
  • ప్రస్తుతం వికీపీడియా 285 భాషలలో ఉన్నది.
  • 1,00,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 16.
  • 1,000 వ్యాసాలు పూర్తిచేసుకున్న భాషలు 145.
  • అధిక సంఖ్యలో వ్యాసాలు కలిగిన మొదటి ఐదు భాషలు - ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్, డచ్చి, పోలిష్.
  • 2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది.
  • అలాగే 2006 నాటికి తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

అంతర్జాతీయ వికీపీడియాలు

  • అంతర్జాతీయంగా 285 భాషలలో వికీపీడియా నిర్వహించబడుతుంది.
  • 10 లక్షల కంటే అధికంగా వ్యాసాలున్న భాషలు: ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్, డచ్ మరియు ఇటాలియన్.
  • 7,00,000 కంటే అధిక వ్యాసాలు కలిగిన భాషలు : పోలిష్, స్పానిష్, రష్యన్, జపానీ మరియు పోర్చుగీసు.
  • 1,00,000 కంటే అధికమైన వ్యాసాలు కలిగిన భాషలు: 40.
  • 10,000 కంటే అధిక వ్యాసాలున్న భాషలు : 109.
  • అన్ని భాషలలోకి పెద్దదైన ఆంగ్ల వికీపీడియా వ్యాసాల సంఖ్య 41,00,000.
  • పలుభాషా వికీపీడియాలకు సహాయకారి అయిన యూనికోడ్ " బ్రియాన్ విబ్బర్" సహాయంతో 2002లో ప్రవేశపెట్టబడింది.
  • అంతర్జాతీయ వికీపీడియా (అన్ని భాషలు కలిపి) వ్యాసాల సంఖ్య 3,63,46,838.
  • అంతర్జాతీయ వికీపీడియా నిర్వాహకుల సంఖ్య 4,511
  • అంతర్జాతీయ సభ్యుల సంఖ్య 3,91,46,351.
  • అంతర్జాతీయ వికీపీడియా క్రియాశీలక సభ్యుల సంఖ్య 3,08,536.
  • అంతర్జాతీయ వికీపీడియా సిబ్బంది 150.

2014 గణాంకాలు

  • ప్రస్తుతం వికీపీడియా 287 భాషలలో ఉన్నది.
  • 10,00,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 12.
  • 1,00,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 40.
  • 10,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 74
  • 1,000 వ్యాసాలు పూర్తిచేసుకున్న భాషలు 102.
  • 100 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 48.
  • 10 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 4.
  • 1 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 5
  • 0 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 1

అంతర్జాతీయంగా మొత్తం గణాంకాలు

  • మొత్తం వ్యాసాలు 32 532 793
  • మొత్తం పేజీలు 119 154 439
  • మొత్తం దిద్దుబాట్లు 1 865 036 506
  • మొత్తం నిర్వాహకులు 4 265
  • మొత్తం వాడకం దార్లు 47 259 484
  • మొత్తం బొమ్మలు 2 270 698

గణాంకాలు

  • అన్ని భాషలలో మొత్తం వ్యాసాల సంఖ్య 30 మిలియన్లు. (3 కోట్లు).
  • ఆంగ్లభాషా వ్యాసాలు 4,5 మిలియన్లు (45 లక్షలు).
  • 2014 నాటికి వికీపీడియా ప్రబల వెబ్‌సైట్లలో అంతర్జాతీయంగా 5 వ స్థానంలో ఉందని న్యూయార్క్ టైంస్ ప్రచురించింది.
  • మొత్తం వికీపీడియా వీక్షకులు 18 బిలియన్లు. (1800 కోట్లు) .
  • సంవత్సర వికీపీడియా వీక్షకులు 500 మిలియన్లు (5 కోట్లు).

తెలుగు గణాంకాలు

  • మొత్తం వ్యాసాలు 58,395.
  • మొత్తం పేజీలు 150.893.
  • మొత్తం దిద్దుబాట్లు 1,259,642
  • నిర్వాహకులు 20
  • మొత్తం సభ్యులు 37.541
  • క్రియాశీలక సభ్యులు 279
  • మొత్తం బొమ్మలు 9.376
  • వ్యాసాల లోతు 21

తెలుగు వికీపీడియా

తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్న వెన్న నాగార్జున రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) అంతర్జాలంలో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. తెలుగు భాషాభిమానులను ఇది విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకు వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. స్వతహాగా తెలుగుభాషాభిమాని అయిన నాగార్జున విలియంసన్ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించడంతో తెలుగు వికీపీడియా రూపకల్పనకు మార్గం సుగమం అయ్యింది. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబర్ 10 మొదటి పేజీ తొట్టతొలి రూపం ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియాలోని మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత కూడా ఆయనదే...!

తెలుగు వికీపీడియా - తొలి అడుగులు క్రమక్రమాభివృద్ధి

2003లో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. భావి తరాలకు 'విజ్ఞాననిధి'లా తమ ప్రయత్నం ఉపయోగపడాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న నాగార్జున, ఏమాత్రం నిరాశ చెందకుండా 'రచ్చబండ' వంటి తెలుగు సమాచార గుంపులలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన ప్రయత్నం క్రమక్రమంగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావ్ వేమూరి, మిచిగాన్ విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టామూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. కట్టమంచి రాసిన శ్రీనాధుని పద్యాలను శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను రంగరించి వ్రాసిన ఊరగాయ వ్యాసం (నెట్) విహారకులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఇలా తెలుగు వికీపీడియా దినదినప్రవర్థమానమవుతున్న సమయంలోనే... కాలిఫోర్నియాలో ఉండే వాకా కిరణ్, మైక్రోసాప్ట్ లో పనిచేస్తూ హైదరాబాదులో నివసిస్తున్న చావాకిరణ్‌ లాంటి వారి కృషి తెవికీని మరింత ముందుకు నడిపించింది. తెవికీపరంగా ఈ సమయం అత్యంత కీలకంగా చెప్పవచ్చు. ఎందుకంటే అంతవరకూ 2005 అంతంతమాత్రంగా ఉన్న సభ్యుల సంఖ్య 55 మందికి చేరింది. వ్యాసాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ 110 కి చేరువయ్యింది. వినియోగదారుల సంఖ్య నాలుగింతలయ్యింది.

సరిగ్గా అదేసమయంలో తెవికీ వైపు తొలి అడుగులు వేసిన మిన్నిసోటా నివాసి ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనా బాధ్యతలను నిర్వహిస్తున్న రవి వైజాసత్య, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మాకినేని ప్రదీపు, హైదరాబాదు కూకట్‌పల్లి నివాసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కంపనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహిస్తున్న చదువరి (తుమ్మల శిరీష్) మొదలైన వారి కృషి ఈ ఉద్యమానికి ఉత్సాహాన్నిచ్చింది. వీరిలో 2005లో ఏప్రిల్ మాసంలో వైజాసత్య యధాలాపంగా గూగుల్లో అన్వేషణలో యాదృచ్చికంగా తెలుగు వికీపీడియాను చేరాడు. అప్పటినుండి తెవికీ కోసం కృషి చేస్తున్న సమయంలోనే 2005లో జూలై నెలాఖరులో చదువరి రాక రేపటి విజయానికి మార్గం సుగమం చేసింది. తెవికీ కొత్త ఊపందుకుంది. వీరిద్దరి కృషిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను గురించిన సమాచారం తెలుగులో చూసుకోగలిగే అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు (ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్)లను తయారుచేసి బొమ్మలతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. కొద్దినెలల వ్యవధిలోనే - అంటే - 2005 డిసెంబర్ నాటికి వ్యాసాల సంఖ్య 2000కి చేరింది. 2005 సెప్టెంబరులో 'విశేషవ్యాసం', 'మీకు తెలుసా' , 'చరిత్రలో ఈ రోజు' శీర్షికలు ప్రారంభమైంది.

2006లో వీవెన్ (వీర వెంకట చౌదరి) రాకతో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారుకావడం ఆరంభమైంది. బిజినెస్ అనలిస్ట్ అయిన వీవెన్ వెబ్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో ఆయనను హెచ్.టి.ఎం.ఎల్. (HTML) నేర్చుకునేలా చేసింది. ఈయన ఏర్పాటు చేసిన బ్లాగర్ల సమావేశం ఇచ్చిన ప్రేరణతో వీవెన్ లేఖిని అనే అనువాద పరికరాన్ని సృష్టించారు. పద్మ సాంకేతిక పరిజ్ఞానంతో లేఖినిని సృష్టించినట్లు ఆయనే చెప్పుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. 2006 మే నాటికి 3,300 వ్యాసాలతో భారతీయ భాషలలో తెవీకీ అగ్రస్థానాన్ని చేరుకుంది. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు. చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైన వారి కృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. కాజా సుధాకరబాబు ఓమన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఈయన వ్యాసాల ప్రాజక్ట్‌లను రూపొందించి ఆయారంగాలలో ఆసక్తి ఉన్న వారు ఆయా వ్యాసాలు రూపొందించడానికి కృషి చేశారు. చిట్టెల్ల కామేశ్వరరావు బి.ఎస్.ఎన్.ఎల్.(BSNL) ఉద్యోగి. శ్రీనివాసరాజు హైదరాబాదులోనూ, సురేంద్ర నవీన్ బెంగుళూర్ లోనూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరి కృషితో 2006 చివరికి వ్యాసాల సంఖ్య 6,000కి చేరింది.

2007లో చేరిన బ్లాగేశ్వరుడు (ఈయన అసలుపేరు శ్రీనివాస శాస్త్రి) లండన్ లో శిశువైద్యుడు. పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో ఈయన కృషి అధికం. ఈయనతో చేతులు కలిపిన కళాకారుడు విశ్వనాధ్ మరింత కృషిచేసి పుణ్యక్షేత్రాల వ్యాసాలను అభివృద్ధి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగి సి.చంద్రకాంత రావు కృషి ఆర్ధికశాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. 'ఈ మాట' వెబ్ పత్రిక సృష్టికర్త కొలిచాల సురేష్, ఇంద్రగంటి పద్మ, 'కంప్యూటర్' పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్‌ మొదలైన వారు సాంకేతిక సాయం చేస్తున్నారు. వీరందరితో పోలిస్తే విక్షనరీ కోసం కృషిచేస్తున్న టి.సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ సాధారణ గృహిణి అయి ఉండి కేవలం తెలుగు భాష మీద అభిమానంతో విక్షనరీలోనే కాకుండా తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషికొనసాగిస్తున్నారు. చిట్కాలను, ప్రకటనలను అందిస్తూ సాంకేతికంగా కృషి చేస్తున్న సభ్యుడు దేవా. ఇస్లాము గురించి అనేక వివరాలనూ, ఉర్ధూ భాష గురించిన వివరాలను అందిస్తూ అహ్మద్ నిసార్ విశేష కృషి అపారం. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక అక్టోబర్ లో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమైంది.

తెలుగు వికీపీడియా అభివృద్ధికి కృషి చేసిన/చేస్తున్న ప్రముఖులు

  • వెన్న నాగార్జున : బోస్టన్ సమాచార శాఖ సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున రూపొందించిన 'పద్మా' అనే లిప్యంతరీకరణ పరికరం తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న తరుణంలో ఆంగ్లవికీపీడియా నిర్వాహకుడైన విలియంసన్ నాగార్జునను సంప్రదించడం, అందుకు ఈయన సమ్మతించడం వెంటవెంటనే జరిగిపోయింది. ఫలితంగా - తెలుగు వికీపీడియాను 2003లో ప్రారంభమై డిసెంబర్ 10 నాటికి మొదటి పేజీకి రూపం వెలుగు చూసింది. తెలుగు వికీపీడియాలోని మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత కూడా ఈయనదే. వికీ అభివృద్ధి కొరకు రచ్చబండ వంటి వాటిలో తెలియజేసి తెలుగు వికీపీడియాను వెలుగులోకి తీసుకువచ్చారు. 2003 లో ఆరంభించిన తెలుగు వికీపీడియాలో 2004 వరకూ ఒక్క వ్యాసం కూడా రాలేదు. తెలుగు విజ్ఞాననిధి భావితరాలకు ఉపకరించాలన్న సత్సంకల్పంతో కృషిచేస్తున్న నాగార్జున నిరుత్సాహపడకుండా రచ్చబండ వంటి తెలుగు సమాచార గుంపులలో ప్రచారం చేసారు. తెలుగువారికిష్టమైన 'ఊరగాయ' తెలుగు తొలివ్యాసమై తెలుగు భాషాభిమానులకు కొత్తరుచులను అందించింది. తెలుగు వికీపీడియా స్థిరమైన అడుగులు వేయడం ప్రారంభించింది. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • చావాకిరణ్: హైదరాబాద్ కు చెందిన చావాకిరణ్ 2005లో తెలుగు వికీపీడియాలో ప్రవేశించారు. వెన్న నాగార్జునతో చేతులు కలిపి తెవికీని ముందుకు నడిపించి వ్యాసాల అభివృద్ధికి తోడ్పాటు అందించారు. తెలుగు భాషా చరిత్ర, టెన్నిసన్, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కాంచనపల్లి కనకమ్మ, చావలి బంగారమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైన వ్యాసాలను రాసి తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడ్డారు. 2011లో వ్యాసేతర మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం పొందారు. యాంత్రిక అనువాదాలు చేయడం వీరి కృషిలో ఒక ప్రధాన భాగం. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • వైజాసత్య: 2005 లో తెవికీ వైపు అడుగులు వేసిన వైజాసత్య వికీపీడియా విధి విధానాలు, నియమ నిబంధనలు తెలుగులోకి అనువదించి తెలుగు వికీపీడియా లక్ష్యాలను జనసామాన్యానికి చేరువ చేశారు. వైజా సత్య మిన్నిసోటా నివాసి ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనా బాధ్యతలను నిర్వహిస్తున్నరు. కొత్తగా సభ్యులైనవారికి వికీపీడియా మూలసూత్రాలను వివరిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ వారితో చక్కని అవగాహన పెంచుకుని తెవికీని ముందుకు నడిపించారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తెలుగుభాషాభిమాని అయిన చదువరితో కలిసి ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, మండలాలు, గ్రామాల వ్యాసాలకు ప్రత్యేక పేజీలను సృష్టించి వ్యాసాలను తయారు చేయాడానికి కావలసిన వేదిక ఏర్పాటు చేశారు. తెలుగు వికీపీడియాను 10,000 వ్యాసాల స్థాయికి పెంచడానికి వీరు చేసిన కృషి శ్లాఘనీయం. చదువరి తరువాత అధికార బాధ్యతను స్వీకరించి తెలుగు వికీపీడియాకు విశేషసేవలు అందిస్తున్నారు. చదువరి, దేవా గారి నుండి విశేషసేవలకు గుర్తింపు పతకాలను అందుకున్నారు. తెలుగు వికీపీడియాకు అనుబంధ సంస్థ అయిన తెలుగు విక్షనరీకి మొదటి నిర్వాహకులు, విక్షనరీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి, నిర్వాహకులు.
  • తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి): చదువరిగా అందరికీ తెలిసిన తుమ్మల శిరీష్ కుమార్ 2005 లో తెలుగు వికీపీడియాలో ప్రవేశించించారు. హైదరాబాదు కూకట్‌పల్లి నివాసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహిస్తున్న చదువరి వైజాసత్యతో కలిసి తెలుగువికీపీడియా అభివృద్ధికి విశేష కృషి చేసారు. వీరు తెలుగు వికీపీడియా అధికార బాధ్యతలను చేపట్టి తెలుగు వికీపీడియా అభివృద్ధికి పలువిధాలుగా తోడ్పడ్డారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ గ్రామాల ప్రణాళిక చేపట్టి విజయవంతంగా పూర్తిచేసారు. తెలుగు వికీపీడియా మూలస్థంభాలు, సముదాయ పందిరి, విధానాలు, సహాయం వంటివి తెలుగులోకి అనువదించి తెలుగు వికీపీడియా వ్యాసరచనకు అవసరమైన వేదికను తయారు చేసి సభ్యులకు సహకారం అందించారు. సభ్యుల పట్ల సంయమనంతో వ్యవహరించడం వీరి ప్రత్యేకత. వీరు వైజాసత్య గారి కృషీవలుడు, వీరతాడు పతకాలను విశ్వనాధ్ బి.కె నుండి గండభేరుండం వంటి గుర్తింపు పతకాలను అందుకున్నారు. తెలుగు వికీపీడియా అధికారి, నిర్వాహకులు. వీరు ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో క్రియాశీలకంగా లేరు.
  • కాజా సుధాకర బాబు (కాసుబాబు): పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగికి చెందిన కాసుబాబు వృత్తి రీత్యా ఎలెక్ట్రికల్ ఇంజనీర్. వీరు మస్కట్ లో కొంతకాలం పనిచేసి, ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం ఓమన్ లో నివసిస్తున్నారు. తెలుగు వికీకి ఈయన అందించిన అనేక వైవిథ్యమైన వ్యాసాలలో 'రామాయణంలోని ఏడు కాండాలకు అందించిన వివరణ'ను ప్రత్యేకంగా చెప్పవచ్చు. రామాయణ విశ్లేషణతో భక్తవరేణ్యులకు సైతం తెవికీని చేరువ చేసిన కాసుబాబు తెలుగు వికీపీడియాలో ఈ వారం వ్యాసం మరియు ఈ వారం బొమ్మలను సమర్ధవంతంగా నిర్వహించారు.. వైజాసత్య నుండి విశేషకృషి గుర్తింపు పతకం అందుకునారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • త్రివిక్రం : త్రివిక్రం 2005లో తెలుగు వికీ ప్రవేశం చేశారు. వీరు చందమామ, సంఖ్యాగుణ వ్యాసాలు, బి.ఎన్ రెడ్డి మొదలైన వ్యాసాలు వ్రాసారు. వీరు విశేష కృషికి గుర్తింపుగా చదువరిచే గుర్తింపు పతకం అందుకున్నారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • వీరవెంకట చౌదరి (వీవెన్): నిజామాబాద్ వర్ని గ్రామానికి చెందిన వీవెన్ ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివసిస్తున్నారు. వీరి అసలు పేరు వీరవెంకట చౌదరి. వృత్తిరీత్యా బిజెనెస్ అనలిస్ట్ అయిన వీరు వెబ్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో హెచ్.టి.ఎం.ఎల్. నేర్చుకున్నారు. వీరు పద్మా లిప్యంతరీకరణ ఉపకరణం పరిజ్ఞానం సాయంతో లేఖిని అనే లిప్యంతరీకరణ ఉపకరణాన్ని రూపు దిద్దారు. తెలుగు వికీపీడియాలో యూనికోడ్ అభివృద్ధి అయ్యే వరకు తెలుగు వికీపీడియాలో తెలుగులో రాయడానికి అనేకమంది సభ్యులకు ఈ లేఖినే ఆధారమయ్యింది. అలాగే - బ్లాగులలో యూనికోడ్ అభివృద్ధి చెందే వరకు తెలుగు బ్లాగులు రాసేవారికి కూడా బాగా ఉపకరించింది. 2006 లో వీరి ప్రవేశంతో తెలుగు వికీపీడియా కొత్త అందాలను సంతరించుకుంది. 2011లో వ్యాసేతర మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం అందుకున్న వీవెన్ తెవికీలో "నరయం " ప్రవేశపెట్టడం, మొబైల్ పేజీ రూపం తయారుచేయటం మొదలైన వాటికి నాయకత్వం వహించారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • అహ్మద్ నిసార్ : అహమ్మద్ నిసార్, విద్యావేత్త, చిత్తూరు జిల్లా మదనపల్లె కు చెందిన వారు. ప్రస్తుతం పుణెలో వున్నారు. ఇస్లాం, హిందూ, ఉర్దూ, విద్య, ఖగోళ, భౌతిక, వ్యక్తులు, భాషలు, దేశాలు, మతాలు, భూగోళ, తత్వ, సౌరశాస్త్ర, కళలు మరియు ఇతర వ్యాసాలు అనేకంగా రాసారు. వీరు తెలుగు వికీపీడియా అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన నిసార్ తన విస్తృత సేవలకుగాను దేవా, రవిచంద్రల నుంచి ప్రశంశా పతకాలను అందుకున్నారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • మాకినేని ప్రదీప్: 2005 లో వికీ ప్రవేశం చేసిన మాకినేని ప్రదీప్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తెలుగునేలపై పుట్టి, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ తెలుగు వికీపీడియాకు బాటు అందించడం ద్వారా సాంకేతికంగా చెప్పుకోదగిన సేవ చేశారు. విక్షనరీలో వీరు బాటుద్వారా చేసిన సేవకు వైజాసత్య నుండి మంత్రదండం గుర్తింపు పతకం అందుకున్నారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి, నిర్వాహకులు.
  • ఇనగంటి రవిచంద్ర: కాళహస్తి సమీపంలోని చేమూరు గ్రామానికి చెందిన రవిచంద్ర బాల్యం, ప్రాధమిక విద్యాభ్యాసం వారి అమ్మమ్మగారి ఊరైన ముచ్చివోలు గ్రామంలో సాగింది. ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్న రవిచంద్ర 2010 మరియు 2011 అధిక మార్పులు చేసిన పది మంది సభ్యులలో ఒకరుగా గుర్తింపు పతకాలను, దేవా మరియు అహ్మద్ నిస్సార్ ల ప్రశంశా పత్రాలను అందుకున్నారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • మాటలబాబు (బ్లాగేశ్వరుడు): బ్లాగేశ్వరుడుగా అందరికీ సుపరిచితుడైన మాటలబాబు 2007 లో తెలుగు వికీపీడియాలో ప్రవేశించారు. తళ్ళికోట యుద్ధం, అక్షరధాం, వికీపీడియా: 5 నిమిషాలలో వికీ వంటి వ్యాసాలను తన మృదుమధురమైన స్వరంతో వినిపించి శ్రవణ వికీకి శ్రీకారం చుట్టి తన ప్రత్యేకత చాటుకున్నారు. వృత్తి రీత్యా శిశువైద్యులైన వీరి అసలు పేరు శ్రీనివాస శాస్త్రి. ప్రస్తుతం లండన్ లో నివశిస్తున్న ఈయన పుణ్యక్షేత్రాల వ్యాసాలను అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేశారు. వీరు వైజాసత్య నుంచి శ్రవణవికీ, విశ్వనాధ్ నుంచి గండపెండేరం గుర్తింపు పతకాలు అందుకున్నారు. మాటలబాబు సునిశిత హాస్య ప్రియులు కూడా. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • అర్జున రావు : వృత్తిరీత్యా బెంగళూరులో నివసిస్తున్న అర్జునరావు ప్రవేశంతో తెలుగు వికీపీడియా పురోభివృద్ధి మరింతగా వేగం పుంజుకుంది. అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తూ తెవికీ వార్త, మాటామంతీ వంటి పరిచయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి తెవికీకి సరికొత్త ఉరవడి కలిగించారు. కీలక సమయంలో అధికార బాధ్యతను స్వీకరించిన అర్జునరావు తెవికీ సభ్యులలో సరికొత్త ఉత్సాహం కలిగిస్తూ, అందరినీ కలుపుకుని సమష్టి కృషిగా తెవికీని తీర్చి దిద్దడంలో సఫలీకృతులయ్యారు. ఈ నేపధ్యంలోనే తెవికీకి కావలసిన అదనపు సాంకేతిక వనరులు చేరుస్తూ తద్వారా మరింత అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. అకాడమీలు నిర్వహించి తెవికీని వెలుపలి ప్రపంచానికి పరిచయం చేశారు. పుస్తకాల ప్రాజెక్ట్, విద్యా ఉపాధి ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్ట్ మొదలైన వాటికి సారధ్యం వహించి విజయవంతం చేసారు. అంతేకాక " వికీసౌర్స్" లో పుస్తకాలను డిజిటలైజ్ చేయడంలో విశేషకృషి సాగిస్తున్నారు. 12 వారాల వెబ్ చాట్ ద్వారా సభ్యులను సమైక్యపరచడం, తెవికీలో "హాట్ కేట్" ప్రవేశం అర్జునరావు కృషికి నిదర్శనం. పోలెండులో జరిగిన వికీపీడియా అంతర్జాతీయ సర్వసభ్య సమావేశానికి హాజరై, తెలుగు వికీపీడియా సాధించిన, సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ వికీ సభ్యులకు వివరించారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి, నిర్వాహకులు.
  • నవీన్ : వృత్తిరీత్యా సాప్ట్‌వేర్ ఇంజనీర్ అయిన నవీన్ తెలుగు భాషాభిమానం ఎక్కువ. పుట్టిందీ పెరిగిందీ చదువుకున్నదీ మదనపల్లె లోనే. వీరికి తెలుగు బాష మీద మంచి పట్టు ఉన్నది. నవీన్ సినిమా ప్రాజెక్ట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. వీరు సినిమా గురించిన వ్యాసాలే కాక ఇతర వైవిధ్యమైన వ్యాసరచనలలో తనవంతు సహాయం అందించారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • సి.చంద్రకాంత రావు: నిర్వాహకులలో ఒకరైన చంద్రకాంతరావు వర్తమాన ఘటనలులో రోజూవారీ వార్తలను చేర్చడం, అన్ని కొత్త వ్యాసాలను పరిశీలించి ముఖ్యమైన విషయాలను నమోదుచేసుకొని, ప్రతి ఆదివారం తప్పనిసరిగా "మీకు తెలుసా" శీర్షికను తాజాకరించడం, ఆర్థికశాస్త్ర వ్యాసాలు, ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు, క్రీడారంగ వ్యాసాలు, నియోజకవర్గ వ్యాసాలు వృద్ధిచేయడం, మూసలు తయారుచేయడం, వ్యాసాలు, వర్గాలకు వర్గీకరణ చేయడం లాంటి పనులు చేశారు. సద్విమర్శ చేయడంలో వీరు ఘటికులు. వీరు తెవికీలో క్రీడలు, క్రీడాకారుల వ్యాసాలు, ఆర్థికవేత్తల వ్యాసాలు, ఆర్థికశాస్త్రం వ్యాసాలు, ప్రముఖ వ్యక్తులు మరియు ఇతర వ్యాసాలు, మూసలు తయారు చేయడమే కాకుండా 100 కంటే అధికమైన సమగ్రమైన వ్యాసాలు రాసారు. తెలుగు వికీపీడియా నిర్వాహకులు. ఆర్థికశాస్త్ర వ్యాసాలను వ్రాసినందుకు, తెలుగు వికీ అభివృద్ధికి పాటుబడినందుకు వైజాసత్యగారి నుండి గుర్తింపు పతకాలను అందుకున్నారు. తెవికి అభివృద్ధికి దేవాగారి నుండి, నిర్వహణకు కాసుబాబుగారి నుండి తెలుగు మెడలు అందుకున్నారు. నిర్వహణకు కాసుబాబుగారి నుండి గండపెండేరం అందుకున్నారు. 2010 వ్యాసాలలో అధిక మార్పులు చేసిన 2011,2012లలో వ్యాస వ్యాసేతర అధిక మార్పులు చేసిన పదిమంది సభ్యులలో ఒకరుగా గుర్తింపు పతకం పొందారు. రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ఈ సభ్యుడు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డారు.
  • రాజశేఖర్: నిర్వాహకులలో ఒకరైన రాజశేఖర్ హైదరాబాదు వాస్తవ్యులు. వీరు వృత్తిరీత్యా డాక్టర్ అయిన రాజశేఖర్ తన వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మాతృభాష అయిన తెలుగు మీద ఉన్న మక్కువతో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకుని తరువాత నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ఆయన వైవిధ్యభరితమైన వ్యాసాలను రాస్తున్నారు. వీరు జీవశాస్త్రం, సాధారణ తెలుగుపదాలు, సుప్రసిద్ధ ఆంధ్రులు, యోగా, మానవశరీర నిర్మాణం, వ్యాధులు, వ్యాధి నిర్ణయం మరియు రహదారులు వంటి వ్యాసాలను అందించారు. వివాదాలకు దూరంగా ఉంటూ సహసభ్యుల పట్ల సౌజన్యం చూపడం వీరి ప్రత్యేకత. వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వీకీమీడియన్ గుర్తింపు (NWR2011)పొందారు. 2010,2011 సంవత్సరాలలో వ్యాస మరియు వ్యాసేతర అధికమార్పులు చేసినవారిలో 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకాలను అందుకోవడమే కాక గండ పెండేరం, జీవశాస్త్ర వ్యాసరచనలకు గుర్తింపు పతకం, 50,000 దిద్దుబాట్లు చేసినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • విశ్వనాధ్.బి.కె.: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామానికి చెందిన విశ్వనాధ్ బి.కె వైవిధ్యమైన వ్యాసాలను తెలుగు వికీపీడియాకు అందిస్తున్నారు. 2012లో వ్యాసేతర మార్పులు అధికంగా చేసిన 10 మంది సభ్యులలో ఒకనిగా గుర్తింపు పతకం అందుకున్న విశ్వనాధ్, ఫోటోగ్రాఫర్ గుర్తింపు పతకాన్ని వైజాసత్య నుంచి పొందారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ : విజయవాడకు చెందిన జె.వి.ఆర్.కె ప్రసాదు తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా నిర్వాహకులు. తెలుగు విక్షనరీలో చాలా రచనలు మరియు నిర్వాహకునిగా చేసారు. వీరు అక్షరదోష నిర్మూలనదళ సభ్యులు,అలాగే హిందూ మతప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నారు. అంతియేకాదు శుద్ధిదళ సభ్యులు కూడా. తెలుగు వికీపీడియాకు వైవిధ్యమైన వ్యాసాలను అందించారు. వీరు 2011 వ్యాస మరియు వ్యాసేతర మార్పులు చేసిన మొదటి పది స్థానాలలో గుర్తింపు పతకం అందుకున్నారు.
  • వండాన శేషగిరిరావు: శ్రీకాకుళంలో వైద్యసేవలందిస్తున్న వండాన శేషగిరిరావు తెలుగులో శ్రీకాకుళం జిల్లా మరియు పట్టణం గురించి, పురపాలకసంఘాల గురించి, చాలా గ్రామాల గురించి, జిల్లాలొని పుణ్యక్షేత్రాల గురించి మంచి వ్యాసాలను తయారుచేశారు. వైద్యానికి సంబంధించి ఎన్నో మంచి వ్యాసాల్ని తెవికీ ద్వారా సామాన్య ప్రజలకు అందిచారు.
  • కప్పగంతు శివరామ ప్రసాదు: బెంగుళూరు నివాసియైన శివరామ ప్రసాదు తెలుగు భాషపై మక్కువతో కొందరు కార్టూనిష్టుల గురించి బొమ్మలతో కూడిన వ్యాసాలు రచించారు. వీరు వైజాసత్య మరియు కాసుబాబు గారినుండి తెలుగు పతకాలు పొందారు.
  • తలపాగల వీరభద్ర రాజు: విశాఖపట్నంలో నివాసముంటున్న వీరభద్రరాజు వికీపీడియా చరిత్రలో ఈరోజు శీర్షికను చాల శ్రమతో అభివృద్ధి చేశారు. భారతీయ శిక్షాస్మృతికి చెందిన వ్యాసాల్ని, విశాఖపట్టణం జిల్లాకు చెందిన వ్యాసాల్ని విస్తరించారు.
  • టి.సుజాత:చెన్నై నివాసియైన సుజాత 2008 నుంచి తెవికీ, వికీసోర్స్ మరియు విక్షనరీల్లో ఎంతో శ్రమకోర్చి చెప్పుకోతగ్గ చాలా రచనలు చేసారు. సామాన్య గృహిణిగా ఉంటూనే తెవికీ సాంకేతికాలు నేర్చుకొన్న ఈవిడ చేసిన కృషి అత్యంత శ్లాఘనీయము. తెవికీలో వీరుచేసిన కృషికి గుర్తింపుగా అనేక పతకాలు పొందారు. 2010, 2011 మరియు 2012లో ఎక్కువ మార్పులు చేసిన పదిమంది సభ్యులలో ఒకరిగా పతకాలు పొందారు. వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వీకీమీడియన్ గుర్తింపు (NWR2011)పొందారు. వీరు అక్షరదోష నిర్మూలనదళ సభ్యులు, అలాగే హిందూమత ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నారు. అంతియేకాదు శుద్ధిదళ సభ్యులు కూడా. వీరు విదేశీనగరాల గురించి, పుణ్యక్షేత్రాల గురించి, భారతీయ నగరాల గురించి, హిందూధర్మం గురించి, పర్యాటక ప్రదేశాల గురించి, జ్యోతిష్యం, రాశులు, నక్షత్రాలు, లగ్నముల గురించి అనేక వ్యాసాలు రాసారు. ప్రస్తుతం మహాభారతం వ్యాసాలపై పనిచేస్తున్నారు. తెలుగు వికీపీడియా మరియు వికీ అనుబంధ సంస్థలకు వీరు విశేష సేవలు అందిస్తున్నారు. తెలుగు వికీపీడియాకు అనుబంధ సంస్థ అయిన తెలుగు విక్షనరీకి రెండవ నిర్వాహకులు, విక్షనరీ నేటివరకు అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
  • దేవా: 2007 అక్టోబరులో తెవికీలో ప్రవేశించిన దేవా అనతికాలంలోనే సాంకేతికంగా తెవికీ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. 3800పైగా దిద్దుబాట్లు చేసిన దేవా నిర్వాహకునిగా ఎన్నికైననూ వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగా నిర్వాహకత్వాన్ని త్యజించారు.

ఇటీవలి కాలంలో తెవీకీలో విశేష కృషిచేస్తున్న సభ్యులు

  • పాలగిరి రామకృష్ణారెడ్డి : అనపర్తి వాస్తవ్యులైన పాలగిరి రామకృష్ణారెడ్డి వృత్తి రీత్యా నూనె శుద్దీకరణ మరియు సంబంధిత శాస్త్ర (ఆయిల్ టెక్నాలజీ) నిపుణులు. గత 35 సం.లుగా నూనె లను విశ్లేశించడం, నూనె గింజలను శుద్ది చేసి వంటనూనెలను ఉత్పత్తి చెయ్యడం. సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ద్వారా బ్రాన్‌, అయిల్ కేకుల నుండి నూనెను తీయడం, నూనెలను కర్మాగారాలలో శుద్ది చేసి శుద్ది చేసిన నూనెలను (రిఫైండ్ అయిల్స్) ఉత్పత్తి చెయ్యడం. నూనె తీయు యంత్రాలను, పరికరాలను రూపొందించడం (డిజైన్), నూనె శుద్ది విశ్లేషణలో (అయిల్ ప్రాసెసింగ్) లో వచ్చు సమస్యలను సరిదిద్దటం, నూనె శుద్ది విశ్లేషణ ఖర్చులను తగ్గించడం వంటి విషయాలపై విశేషంగా కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను సేకరించి అధ్యనం చేసిన పలు ఆసక్తికర అంశాలను వ్యాసరూపంలో తెవికీకి అందించారు. 2012 వ్యాస, వ్యాసేతర మార్పులు చేసిన పదిమందిలో ఒకరుగా వీరికి గుర్తింపు పతకంతో బాటు, సహ సభ్యుల ప్రశంశలు లభించాయి. తెలుగు విక్షనరీలో చాలా రచనలు చేసారు.
  • కె.వెంకటరమణ : ఆంధ్ర విశ్వవిద్యాలయం పట్టభధ్రులు. వీరు రసాయనిక, భౌతిక శాస్త్రాధ్యాపకులు గా పనిచేస్తునారు. తెవికీలో భౌతిక, రసాయనిక శాస్త్ర, విజ్ఞాన సంబంధిత, గణిత సంబంధిత, ప్రముఖ శాస్త్రవేత్తల సంబంధిత వ్యాసాలను రచిస్తున్నారు. వీరు శ్రీకాకుళం వాస్తవ్యులు. 2012 వ్యాసాలలో దిద్దుబాట్లు అధికంగా చేసినవారిలో వీరు ఒకరుగా గుర్తింపు పతకాన్ని, తెలుగు మెడల్‌ను అందుకున్నారు.
  • వై.వి.ఎస్.రెడ్డి : పల్లెసీమల గురించిన ఆసక్తికరమైన విషయాలు, బొమ్మలు సమకూర్చడంలో సమర్ధులు. 2012 వ్యాస, వ్యాసేతర మార్పులు చేసిన పదిమందిలో ఒకరుగా వీరికి గుర్తింపు వచ్చింది.
  • భాస్కరనాయుడు : హైదరాబాద్ నివాసి. వీరు మన దేవాలయాలు, పల్లెవాసుల జీవనవిధానం, హంపి వద్ద నిర్మాణ సమూహాలు వంటి వ్యాసాలను, అనేక ఇతర దిద్దుబాట్లు తెవికీకి అందించారు. 2012 వ్యాస మరియు వ్యాసేతర దిద్దుబాట్లు అధికంగా చేసినవారిలో వీరు ఒకరుగా గుర్తింపు పతకాలను, తెలుగు మెడల్‌ను అందుకున్నారు. సంయమనం పాటించడం వీరి ప్రత్యేకత. తెలుగు విక్షనరీలో చాలా రచనలు చేసారు.
  • రమేష్ రామయ్య  : చెన్నై నివాసి రమేష్ రామయ్య గారు మూసల అభివృద్ధికి తోడ్పాటును అందించారు.
  • శశి : వీరా పేరుతో వ్రాస్తున్న వీర శశిధర్ వైవిధ్యమైన వ్యాసాలను అందిస్తూ 2010 అధిక మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం పొందారు
  • కంపశాస్త్రి : తెవికీలో వైవిధ్యమైన వ్యాసాలు వ్రాసి కృషికి గుర్తింపుగా విశ్వనాధ్ బి.కె, మాటలబాబు గార్ల నుండి గుర్తింపు పతకాలను అందుకున్నారు.
  • సోము బల్లా  : ఇటీవల ఏకవాక్య వ్యాసాల తొలగింపులో సంచలనం సృష్టించిన సోము బల్లా తెలుగు భాషా సంరక్షణే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.
  • ఎన్.రహమతుల్లా  : ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి అయిన రహమతుల్లా వైవిధ్యమైన వ్యాసాలతో పాటు, ఇస్లామిక్ మత సంబంధిత వ్యాసాలను అనేకం అందించారు. వీరు భాషాభిమాని మరియు తెలుగు భాషను పాలనా పరంగా అభివృద్ధి చేయటానికి విశేషమైన కృషి చేస్తున్నారు.
  • సుల్తాన్ ఖాదర్ : 2009లో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకున్న సుల్తాన్ ఖాదర్ తెలుగు వికీపీడియాలో వైవిధ్యమైన వ్యాసాలు రాస్తున్నారు. వీరి కృషికి గుర్తింపుగా తెలుగు మెడల్ గుర్తింపు పతకాన్ని అర్జునరావు అందించగా, 2012 లో అత్యధిక మార్పులు చేసిన 10 మంది సభ్యులలో ఒకరుగా గుర్తింపు పతకం కూడా లభించింది.
  • మల్లాది కామేశ్వర రావు : 2012 అక్టోబర్ లో వికీపీడియా ప్రవేశం చేసిన మల్లాది కొద్ది కాలంలోనే సహసభ్యుల సమన్వయం సాధించారు. తెలుగు వికీపీడియాలో వైవిధ్యమైన వ్యాసాలు రాయడంతోబాటు ఇతరవ్యాసాలలో దిద్దుబాట్లు చేస్తున్నారు. మూడు దశాబ్ధాలకు పైగా పత్రికా రంగంలో ఈయనకు మూడు నవలలు, వందలలో కవితలు, వేలలో వ్యాసాలు రచించారు. వీరిది రచయితల మరియు కళాకారుల కుటుంబం. వీరి తండ్రి సత్యనారాయణరావుగారు వయోలిన్ విద్వాంసుడు. వీరి తాతగారు సత్యనారాయణ మూర్తిగారు అశుకవిత్వం చెప్పగలిగిన సామర్ధ్యం కలిగిన కవి మరియు రచయిత. అక్షర ప్రేమికులైన మల్లాది తెలుగు వికీపీడియాలో చురుకైన కార్యకర్తగా తన సేవలందిస్తున్నారు.
  • రాజాచంద్ర  : 2012 సెప్టెంబర్ మాసంలో తెలుగు వికీపీడియా ప్రవేశం చేసిన రాజాచంద్ర స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలానికి చెందిన విరవ గ్రామం. ఈయన ప్రస్తుతం చెన్నైలో " ఎస్ ఇ ఓ ఎగ్జిక్యూటివ్ " గా పనిచేస్తునారు. తెలుగు వికీపీడియాలో రామేశ్వరం, అరుణాచలం వంటి వ్యాసాలు రాయడేమే కాక ఇతరదిద్దుబాట్లు చేసారు. ప్రస్తుతం " ఈ వారం బొమ్మ " నిర్వహణా బాధ్యతలను తీసుకున్నారు.
  • రహ్మానుద్దీన్  : 2007 లో తెలుగువికీ ప్రవేశం చేసి రహ్మానుద్దీన్ స్వస్థలం విజయవాడ. ఉద్యోగరీత్యా ప్రస్తుతం హైదరాబదులో నివసిస్తున్నారు. సంగీతంలో ప్రత్యేక అభిరుచి ఉన్నందున తెలుగు వికీలో మేళకర్తరాగాలకు విడివిడిగా వ్యాసాలు వ్రాసారు. పుస్తక సమీక్ష ప్రాజెక్టులో పాలు పంచుకుని పుస్తకాల సమీక్షలు రాసారు. ఇతర దిద్దుబాట్లు, నిర్వహణ వంటివి చేస్తూ చురుకుగా పనిచేస్తున్నారు. వికీమీడియా ఇండియా చాప్టర్ లో తెలుగు విశేష అభిరుచి సమూహానికి అధ్యక్షుడు. పలు సాంకేతిక కళాశాలల్లో వికీఅకాడెమీలు నిర్వహించారు. వికీ బాహ్య వేడూక్లను నిర్వహించి, పాల్గొన్నారు. వికీ కాన్ఫరెన్స్ ఇండియా లో తెలుగు వికీపీడియాకు ప్రతినిధిగా పాల్గొన్నారు.
  • భూపతిరాజు రమేష్ రాజు  : భూపతి రాజు రమేష్ రాజు గారు రెడలోస్ గా తెవికీలో ప్రవేశించి అనేక వైవిధ్యమైన వ్యాసాలు తెవికీ కి అందించి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగా అర్జునరావు గారి నుండి తెలుగు మెడల్ అందుకున్నారు. 2012 లో వ్యాస విభాగంలో అత్యధిక మార్పులు చేసిన సభ్యునిగా పతకం పొందారు. తదుపరి మై లాప్‌టాప్స్ సభ్యనామంతో అనెక వ్యాసాలను రచించి తెవికీకి అందించారు. తదుపరి తెలుగు భాషాభిమానుల కోరిక మేరకు భూపతిరాజు రమేష్ రాజు నామంతో విశెష రచనలు చేస్తూ ఉన్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా , భీమవరం వాస్తవ్యులు. ఈయన ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీని పొందినవారు.

భారతీయ భాషలలో వికీపీడియా

భారతీయ భాషలలో సంస్కృత భాషతో సహా దాదాపు అన్ని అధికార భాషలలోనూ వికీపేడియాలు ఉన్నాయి. అవి వరుసగా అస్సామీ, ఉర్ధూ, హిందీ, పంజాబీ, బెంగాలీ, మలయాళం, కన్నడం, తెలుగు, తమిళం, గుజరాతీ, మళయాళీ, ఒరియా, మరాఠీ, భోజ్‍పురీ, నేపాలి, సింధీ, కాశ్మీరీ మొదలైన భాషలలో ఉన్నాయి.

వికీపీడియాలో వివిధ భాషలు మొత్తం వ్యాసాల సంఖ్య ఆరంభ తేదీ
తెలుగు 51,287. డిసెంబర్ 9, 2003‎
హిందీ 1,04,928.
తమిళం 51,718
మళయాళం 29, 155
కన్నడం 12,872.
భోజ్‍పురి 22,470.
అస్సామీ 20,806.
సంస్కృతం 8,890.
గుజరాతీ 22,465.
మరాఠీ 38,338.
ఒరియా 3,429.
బెంగాలీ 25,593.
నేపాలీ 22,646.
సింధి 365.
కాశ్మీరి 227.
పంజాబీ 5,413.

వికీపీడియా సోదర ప్రాజెక్టులు

వికీపీడియాకు అనుబంధంగా వికీమీడియా, విక్షనరీ, వికీసోర్స్, వికీకోట్, వికీబుక్స్, కామన్స్ ప్రాజెక్టులు స్థాపించబడ్డాయి. వీటిలో తెలుగులో విక్షనరీ, వికీసౌర్స్ లలో గుర్తించతగినంత కృషి జరిగింది.

విక్షనరీ

విక్షనరీ ఆనగా బహుభాషా నిఘంటువు. ఇందులో తెలుగు పదాల గురించి పేజీలు ఉంటాయి. ఒక్కో పదానికి ఒక్కో పుట (పేజీ)తో పాటుగా, భాషాభాగం అనే విభాగంలో పదము వ్యాకరణ రీతిగా ఏ విభాగానికి చెందినదో ఈ పుటలో ఉంటుంది. అర్ధవివరణలో పదానికి సరి అయిన అర్ధం ఉంటుంది. నానార్ధాలు విభాగాలలో పదానికి సమాన అర్ధం కలిగిన తెలుగు పదాలు ఉంటాయి. సంబంధిత పదాలులో పదానికి సంబంధం ఉన్న పలు తెలుగు పదాలు ఉంటాయి. అలాగే వ్యతిరేక పదాలు, సమానార్ధం కలిగిన ఇతర భాషా పదాలు ఉంటాయి. అ పదాన్ని వాక్యాలలో ప్రయోగించడం వంటివి ఉంటాయి. విక్షనరీలో ఒక్కో పదాన్ని గురించిన పూర్తి వివరణ లభిస్తుంది. కొన్ని పదాలకు చిత్రాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం విక్షనరీలో 57 వేలకంటే అధికమైన పేజీలు ఉన్నాయి. విక్షనరీలో జరగవలసిన కృషి అధికంగా ఉంది.

వికీసోర్స్

వికీసోర్స్‌లో అత్యంత విలువైన సాహిత్యం భద్రపరచబడుతుంది. మన సంస్కృతికి పునాదులు అనతగిన విలువైన సమాచారం, పదిలంగా పదికాలాలపాటు నిరంతరంగా కాపాడుకోవలసినవి, భవిష్యత్తు తరాలకు అందించవలసిన విషయాలను ఇందులో పొందు పరచడం జరుగుతుంది. ఇక్కడ అన్ని మతాలకు చెందిన మూలగ్రంధాలు, శతకసాహిత్యం, మతసాహిత్యం, ఇతిహాసాలు, కావ్యాలు భద్రపరచవచ్చు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో ఇతిహాసాలు, కవిత్వం, నాటకములు,వేదాలు, సంకీర్తనలు,శతకములు విభాగాలలో వ్యాసాలు ఉన్నాయి. ఇంకా విలువైన గ్రంధాలు సేకరించబడి ఉన్నాయి. గుర్తించతగిన ప్రత్యేక విషయం ఆంధ్రుల చరిత్ర, మొల్లరామాయణం డిజిటల్ రూపంలో భద్రపరచబడ్డాయి. ఇవి సమిష్ఠి కృషిలో భాగంగా రూపొందించబడ్డాయి.

వికీపీడియా కామన్స్

వికీపీడియాలో ఉపయోగించడానికి అవసరమైన ఛాయాచిత్రాలు, రేఖాచిత్రాలు, దృశ్యకాలు(వీడియో), శ్రవ్యకాలు(ఆడియో) ఇంకా ఇతర రూపాలలోని చిత్రాలను ఇక్కడ పొందుపరిచారు. వీటిలో చిత్రాలను చేర్చే సమయంలోనే ఉచిత అనుమతితో చేర్చబడతాయి. సభ్యులు తాము కెమేరాల ద్వారా సేకరించిన చిత్రాలను, ఉచిత అనుమతి జోడిస్తూ ఇక్కడ భద్రపరచవచ్చు. అంతర్జాతీయంగా అనేక విషయాలను తెలియబరిచే చిత్రాలు ఇక్కడ లభిస్తాయి. ఈ చిత్రాలను అన్నిభాషలకు చెందిన వికీపీడియాలు ఇంకా ఇతర ప్రాజెక్టులు తమ వ్యాసాలలో ఉపయోగించుకుంటాయి.

వికీకోట్స్

ఇందులో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను, రచయితలు తమ రచనలలో రాసిన ముఖ్యమైన, ఆసక్తికరమైన మాటలను భద్రపరచవచ్చును. తెలుగు వికీ సభ్యులకు ఈ ప్రాజెక్టు అవగాహన లేదు కనుక ఇక్కడ తగినంత కృషి జరగలేదు అనుకోవచ్చు. మార్చి 2013 నాటికి 260 పేజీలు సృష్టించబడ్డాయి.

వికీ బుక్స్

ఇక్కడ సభ్యులు సమిష్ఠిగా పుస్తకాలు వ్రాయవచ్చు. ఉబుంటు వాడుకరి మార్గదర్శిని అనే పుస్తకం తయారైంది. ఇంకా కృషి జరగవలసి వుంది.

వికీ సంస్థలు

వికీమీడియా భారతదేశం

భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ సంఘం జనవరి 3, 2011న బెంగుళూరులో నమోదైంది. డిసెంబర్ 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదయ్యారు. సెప్టెంబరు 24న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జులై 30న నకలు హక్కులు మరియు స్వేచ్ఛా పంపక షరతులు అనబడే దానిపై సదస్సు, ఆ తరవాత సెప్టెంబర్ 12న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేక అనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది. ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 తేదీలలో నిర్వహించింది. కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి, విస్తరించటానికి, మరియు కార్యనిర్వాహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయం చేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార మరియు ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.

‌‌‌వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు

వికీపీడియా ట్రస్టీల బోర్డు (మనదేశపు సభ్యురాలు బిశాఖ దత్తా ఎడమవైపునుండి నాలుగవ స్థానంలో
సమావేశం
ముంబాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ దర్బారు లో అతి పెద్దదైన వికీ సమావేశం
పొల్గొన్న కొంత మంది తెలుగు వికీపీడియన్లు
వికీదశవర్షపూర్తి వేడుక
వికీ దశాబ్ది వుత్సవాలు హైద్రాబాదు
జెకెసి లో వికీ అకాడమీ ప్రయోగశాల లో పోటీలు నిర్వహిస్తున్న తెవికీ అధికారి అర్జునరావు

వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, భారతీయ వికీ ప్రాజెక్టుల అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించింది. పూణెలో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణా‌‌ళిక చేపట్టింది.2012లో ఈ జట్టుని సిఐస్ సంస్థలో విలీనం చేశారు. ఇప్పుడు ఎ2కె అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

ప్రచారం

  • వికీపీడియా అకాడమీలు నిర్వహించడం.
  • వికీపీడియా మారథాన్ నిర్వహించడం.
  • బ్లాగులలో వికీని గురించి వివరించడం.
  • పుస్తక ప్రదర్శన సమయంలో వికీపీడియా స్టాల్ నిర్వహించి సందర్శకులకు కరపత్రాలు పంచడం. ముఖాముఖిగా వివరణ అందించడం.
  • సముదాయ సభ్యులు నిర్వహించే తెవికీ అకాడమీ, బ్లాగరుల సమావేశాలు, లాంటి సంస్ధల ద్వారా తెవికీ ప్రచారం జరుగుతుంది. 2011 లో ఏర్పాటయిన "వికీమీడియా భారతదేశం వారి తెలుగు ప్రత్యేక అసక్తి జట్టు ముందు ముందు సంస్థ పరంగా మద్దతు ఇవ్వనుంది.

సమావేశాలు

అంతర్జాతీయ సమావేశాలు

  • అంతర్జాతీయంగా " వికీమేనియా " అనే పేరుతో సర్వసభ్య సమావేశం జరిపి సభ్యులు అందరూ ఒక వేదిక మీద కలుసుకుని చర్చలు, ప్రసంగాలు వంటి కార్యక్రమాలు మూడురోజులపాటు నిర్వహిస్తారు.
  • వికీమేనియా మొదటి అంతర్జాతీయ సమావేశం జర్మనీ రాజధాని నగరం ఫ్రాంక్‍ఫర్ట్‍ లో 2005 ఆగష్టు 4-8 తేదీలలో జరిగింది.
  • వికీమేనియా రెండవ అంతర్జాతీయ సమావేశం అమెరికాలోని మసాచ్యూట్ రాష్ట్ర రాజధాని బోస్టన్ నగరంలో 2006 ఆగష్టు 4-6 తేదీలలో జరిగింది.
  • వికీమేనియా మూడవ అంతర్జాతీయ సమావేశం తైవాన్ రాజధాని తైపెయ్‍ లో 2007 ఆగష్టు 3-5తేదీలలో జరిగింది.
  • వికీమేనియా నాలుగవ అంతర్జాతీయ సమావేశం ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా నగరం లో 2008 జూలై 17-19 తేదీలలో జరిగింది.
  • వికీమేనియా ఐదవ అంతర్జాతీయ సమావేశం అర్జెంటీనా లోని అయిరిస్ నగరం లో 2009 లో జరిగింది.
  • వికీమేనియా ఆరవ అంతర్జాతీయ సమావేశం గడాంస్క్ నగరం లో 2010 జూలై 9-11 తేదీలలో జరిగింది.
  • వికీమేనియా ఏడవ అంతర్జాతీయ సమావేశం ఇజ్రాయేల్‍ లోని హైఫా నగరం లో 2011 ఆగష్టు 4-7 తేదీలలో జరిగింది.
  • వికీమేనియా ఎనిమిదవ అంతర్జాతీయ సమావేశం అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరం లో 2012 జూలై 12-15 తేదీలలో జరిగింది.
  • వికీమేనియా తొమ్మిదవ అంతర్జాతీయ సమావేశం హాంకాంగ్ నగరం లో 2013 ఆగష్టు 5-7 తేదీలలో జరగాలని నిర్ణయించబడింది.

భారతీయ సమావేశాలు

2010లో ముంబాయిలో మొదటిసారిగా జరిగిన వికీపీడియా సమావేశంలో వికీపీడియా సంస్థాకుడైన " జిమ్మీ వేల్స్ " పాల్గొనడం విశేషం. మొదటి భారతీయ వికీపీడియా సర్వసభ్య సమావేశం ముంబాయిలో నిర్వహించబడింది. 2011 జనవరి 15 లో నిర్వహించబడిన ఈ సమావేశంలో గ్లోబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ "బేరీ న్యూస్టీడ్" పాల్గొనడం ఒక ప్రధానాంశం.

ఈ సమావేశాన్ని ముంబయి వికీమీడియా సముదాయం, భారత వికీమీడియా సంస్థల సహకారంతో, వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇతర సంస్థల అనుసంధానంతో ముంబై విశ్వవిద్యాలయం వారి ఫోర్ట్ ప్రాంగణంలో జరిగింది. ఇది మూడురోజుల కార్యక్రమం. దీనిలో మన దేశంలోని అన్ని ప్రాంతాలనుండి మరియు విదేశాల నుండి వికీ ప్రాజెక్టులపై పనిచేసేవారు, ఆసక్తిఉన్న వారు 600 పైగా పాల్గొన్నారు. వికీ ప్రాజెక్టులకు విశేష సేవలు అందించినవారికి, ఈ సమావేశంలో పాల్గొనటానికి ప్రోత్సాహకంగా, రానుపోను ప్రయాణఖర్చులు, ఉండటానికి వసతి కల్పించారు. ఇందుకుగాను, 7070 అప్లికేషన్లు రాగా, 100 మందికి చేయూతనందించగలిగారు.

తెలుగువారి సమావేశాలు

  • మొదట ఇ-తెలుగు నిర్వహించే నెలవారీ బ్లాగర్ల సమావేశాల్లో వికీపీడియా గురించి చర్చలు జరిగేవి.
  • బెంగుళూరులో జనవరి15, 2011న, వికీపిడియా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలుగు వికీపీడియా సమావేశం ఐఐఎస్సి దగ్గర గల నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ లో జరిగింది.
  • తెలుగు వికీపీడియా 2011 జనవరి 23 తేదీలో హైదరాబాదులో వికీపీడియా దశవర్ష జన్మదినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సమావేశంలో వికీపీడియా జన్మదినోత్సవ కేక్ కత్తిరించడం వంటివి జరిగాయి. సభ్యుల ఉపన్యాసాలు, వికీపీడియా గురించి వివరించడం వంటివి చోటు చేసుకున్నాయి.
  • మే 15,2011 న హైదరాబాదు నెలవారీ వికీ సమావేశాలు శ్రీకాంత్ లక్ష్మణ్ చొరవతో ప్రారంభమయ్యాయి.
  • డిసెంబరు 16 నుండి 26 వరకు జరిగిన 25 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఇ-తెలుగు సంస్థ తరపున వికీపీడియా ప్రచారం చేపట్టటం జరిగింది.
  • జూన్ 2012 లో నెలవారీ ప్రతిపాదికన తెలుగు సమావేశాలు ప్రారంభమయ్యాయి .రాజశేఖర్ గారి సౌజన్యంతో తెవికీ సహాయకేంద్రం డా. రాజశేఖర్ గారి కార్యాలయం ( నేషనల్ పేథాలజీ లేబరేటరీ, 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, దోమల్ గూడ, హైదరాబాద్-500 029) వేదికగా ప్రారంభమైంది.

అకాడమీలు

అకాడమీలు నిర్వహించడం ద్వారా వికీపీడియాను విద్యాసంస్థల వద్దకు తీసుకు పోవడం వికీపీడియా ప్రచారంలో ఒక భాగం. అకాడమీల ద్వారా వికీపీడియా ప్రచారం చేయడంలో అర్జునరావుగారు కృషి చేశారు.

  • అకాడమీల ఏర్పాటు కొరకు వికీపీడియా తరఫున విద్యాసంస్థలకు ఈ మెయిల్ సందేశాలు పంపబడతాయి. ఆ సందేశాలకు స్పదించిన విద్యాసంస్థలకు వికీపీడియా ప్రతినిధులు వెళ్ళి ముందుగా ఆసక్తి కలవారికి వికీపీడియా గురించిన అవగాహన కలిగిస్తారు. తరువాత వారికి నేరుగా అంతర్జాలంలో వికీపీడియాలో ఖాతా ఏర్పాటు చెయ్యడం వికీపీడియాలో వ్రాయడం వంటి శిక్షణ ఇస్తారు.
  • తెలుగు వికీపీడియా మొదటి అకాడమీ 2009 అక్టోబర్ 6 వ తారీకున అర్జునరావుగారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ అకాడమీ" చీరాల ఇంజనీరింగ్ కాలేజి " లో జరిగింది. ఈ అకాడమీలో 120 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.
  • " తెవికీ ప్రచారం, 1-2, నవంబర్, 2010,గుంటూరు " తెవికీ ప్రచారంలో ఒక భాగంగా అర్జునరావుగారి ఆధ్వర్యంలో గుంటూరులో అకాడమీ నిర్వహించబడింది.
  • 2012 సెప్టెంబరు మాసంలో చెన్నై ఐ.ఐ.టి కేంపస్‍లో అర్జునరావుగారి ఆధ్వర్యంలో అకాడమీ నిర్వహించబడింది.

'విజయ' ఉగాదికి తెలుగు వికీపీడియా విజయోత్సవం

  • తెలుగు వికీపీడియా అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్న తెలుగు వికీ సముదాయం తెవికీ విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 'విజయ' ఉగాదికి తెలుగు వికీపీడియా విజయోత్సవం నిర్వహిస్తోంది. ఆంగ్ల వికీపీడియా ప్రారంభమై 13 వసంతాలు, తెలుగు వికీపీడియా ప్రారంభమై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలుగు సంవత్సరాది నాడు 'తెలుగు వికీపీడియా మహోత్సవం' నిర్వహించడం తెలుగు భాషాభిమానులకు నిజంగా పండగే...!
  • వికీపీడియాను గురించి సామాన్యులకు సహితం అవగాహన కలిగిస్తూ, విద్యార్థుల నుండి వయోధికుల వరకూ ఉపకరించగలిగిన వికీపీడియాను ప్రజలకు సమీపంగా తీసుకుని పోవాలన్నదే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం.
  • విజ్ఞానం, వినోదం, సంప్రదాయం, భక్తి, రాజకీయాలు, క్రీడలు ఒకటేమిటి అణువు నుండి బ్రహ్మాండం వరకూ విషయాలు విశేషాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తిగా... ఉచితంగా... చదివి తెలుసుకునే సదుపాయం వికీపీడియా ద్వారా లభిస్తుందని తెలియజేయడమే ఈ సమావేశ ప్రధాన లక్ష్యం.
  • అనేక విషయాలను ఒకే చోట ఉచితంగా మన తెలుగులో తెలుసుకునే సదుపాయం ఉందని ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న తెలుగువారికి తెలియజేయడం.
  • ఇందులో సేకరించిన విషయాలను కాని చిత్రాలను కాని ఎటువంటి అనుమతి అవసరం లేకుండా (కాకుంటే "తెలుగు వికీపీడియా సౌజన్యం" అని వ్రాయడం మంచి పద్ధతి) పాఠ్యాంశాలు కాని అనేకమైన ఇతర ప్రయోజనాలకు కాని సర్వ జనులు వాడుకోవచ్చన్న అవగాహన కలిగించడం.

వికీ భవిష్యత్తు

వికీపీడియా అసాధారణ ప్రజాదరణను ముందుగా ఎవరూ ఊహించలేదు...! తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పమే ఈ అక్షర యజ్ఞ నిర్వహణకు ఊపిరిపోసింది. తెవికీ కొద్దికాలంలోనే విజ్ఞానానికి నెలవైంది. తెలుగుభాషలో 2009 వరకు వేగంగా అభివృద్ధిజరిగినా ఆ తరువాత పురోగతి మందగించింది. మాతృభాషలో అన్ని విషయాల గురించి జ్ఞానాన్ని అందచేసే వికీపీడియా ముందు ముందు మరింత అభివృద్ధి చెందటానికి వికీ గురించి అందరికి తెలియాలి. ప్రసార విప్లవం ద్వారా అందరి చేతుల్లో ఉన్న ఇప్పటి సాధారణ ఫోనులు మున్ముందు స్మార్ట్ ఫోనులుగా మారి, ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ఎప్పుడైనా కావలసిన సమాచారాన్ని అందించాలి.


సూచికలు

ఇవీ చూడండి

మూలాలు

  • [1] అంతర్జాతీయ వికీపీడియా గణాంకాల వివరాలకు ఇక్కడ చూడండి.