ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగు
గ్యాసు వెల్డింగు అనునది, లోహాలను కరగించి (fusion) అతుకు ప్రక్రియ, ఒక లోహపు అంచుతో మరొక లోహ అంచును కరగించి, కలసి ఏకరూపత వచ్చేటట్లుచేసి అతుకు ప్రక్రియ. ఇందులో రెండు వాయువు ల మిశ్రమాలను మండించడం ద్వారా ఏర్పడు ఉష్ణోగ్రతలో లోహలను కరగించి అతకటం జరుగుతుంది. మండించు వాయువులలో ఒకటి 'దహనవాయువు' లేదా 'ఇంధనవాయువు'. రెండవ వాయువు దహన దోహాదకారి. దహన లేదా ఇంధన వాయువులుగా ఎసిటిలిన్, హైడ్రోజన్, ప్రోపెన్ లేదా బ్యుటేన్ వాయువులను గ్యాసువెల్డింగు ప్రక్రియలోవాడెదరు. దహన దోహకారి వాయువుగా ఆక్సిజన్ లేదా గాలిని వినియోగిస్తారు. ఇంతకు ముందు పేర్కొన్న దహన వాయువులలో ఒక్క హైడ్రొజన్ వాయువును మినహాయించి మిగతా వాయువులన్ని కార్బను, హైడ్రొజను సమ్మేళనం చెంది ఏర్పడిన కార్బొహైడ్రొజనులు. ఇందులో ప్రోపెన్ (propane), బుటెన్ (butane) అనునవి ఆల్కెన్ (Alkane) గ్రూపునకు చెందిన హైడ్రోకార్బనులు కాగా అసిటిలిన్ (acetylene) మాత్రం అల్కైన్ (alkyne) గ్రూపునకు చెందిన హైడ్రోకార్బను/కార్బో హైడ్రొజను. అక్సి-అసిటిలిన్ వెల్డింగు ప్రక్రియలో లోహాలను అతుకుటకు పూరక లోహన్ని (filler metal) తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆక్సిజను, అసిటిలిన్ వాయువులను తగిన నిష్పత్తిలో కలిపి, మండించుటకు వెల్డింగు టార్చు అనే పరికరం అవసరము. వాయువులు ప్రవహించు గొట్టాల చివరలు రెండూ నాజిలు (nozzle) ద్వారా ఒకటిగా కలుస్తాయి. రెండు గొట్టాలకు ప్రత్యేకంగా కవాటాలు (valves) ఉండి వీటి ద్వారా వాయువుల ప్రమాణాన్ని కావల్సిన మేరకు నియంత్రించవచ్చును. వెల్డింగుటార్చు నాజిల నుండి వెలువడు వాయువుల మిశ్రమాన్ని మండించడం వలన నాజిలు అంచువద్ద ప్రకాశవంతమైన అత్యధిక వెలుతురు వలయంతో కూడిన, ఉష్ణోగ్రత కలిగిన మంట/జ్వాల ఏర్పడును. ఈ మంట నుండి వెలువడు ఉష్ణ త్రీవత 32000Cవరకు ఉండును. ఇంత ఉష్ణోగ్రత వద్ద ఏలోహమైన ఇట్టే కరగుతుంది.
ఆక్సి-అసిటిలిన్ వెల్డింగు పుట్టు పుర్వోత్తరాలు[మార్చు]
అక్సి-అసిటిలిన్ వెల్డింగును ఆక్సి-ఇంధన వెల్డింగు అనియు గ్యాసు వెల్డింగు అనియు వ్యవహరిస్తారు అమెరికా లో. ఫ్రెంచి యాంత్రికవిజ్ఞాన నిపుణులైన (Engineers) ఎడ్మండ్ ఫొచే (Edmond fouche), చార్లెస్ పికార్డ్ (charles picard) మొదటి సారిగా అక్సి-అసిటిలిన్ గ్యాసు వెల్డింగును 1903లో అభివృద్ధిపరచి, వాడుకలోకి తెచ్చారు.[1] అంతకుముందు గాలి (20-25%ఆక్సిజన్+75-80% నైట్రోజన్/నత్రజని) ని, ఇంధన/దహనవాయు మిశ్రమాన్ని గ్యాసువెల్డింగు చేయుటకు ఉపయోగించేవారు. కాని గాలి, అసిటిలిన్ వాయువుల మిశ్రమ మంటకన్న, అక్సిజన్, అసిటిలిన్ వాయువుల మిశ్రమం వలన వెలువడు మంట, నిలకడగా అత్యధిక ఉష్ణోగ్రతగల మంటను కలిగి ఉండటం వలన ఈ వెల్డింగు విధానం బాగా వాడుకలోకి వచ్చింది. గాలి+ప్రొపేను వాయుమిశ్రమ మంట వలన 25000C (3630oF) ఉష్ణోగ్రత ఉత్పన్నంకాగా, అక్సిజను+ప్రొపేను వాయువుల మంట నుండి 25000C (45300F) ఉష్ణోగ్రత వెలువడుతుంది. అలాగే ఆక్సిజను, అసిటిలిన్ వాయువుల దహనం వలన పుట్టు మంట యొక్క ఉష్ణోగ్రత 3500-35000C ఉంటుంది. అర్ధశతాబ్ది క్రితం వరకు ఆక్సి-అసిటిలిన్ గ్యాసు వెల్డింగు విధానమును వస్తువుల ఉత్పత్తి రంగంలో విరివిగా ఉపయోగించేవారు. ఈమధ్యకాలంలో వివిధ రకాలైన మెటల్ ఆర్కు వెల్డింగు పద్ధతులు వచ్చిన తరువాత, గ్యాసు వెల్డింగు ప్రాబల్యం కొద్దిగా తగ్గినది. అయితే లోహాలను అతుకుటకే కాకుండగా లోహలను కత్తిరించుటకు కూడా అక్సి-అసిటిలిన్ జ్వాలను ఉపయోగిస్తారు.[2] లోహలను కత్తిరించునప్పుడు, లోహలను అతుకుటకు ఉపయోగించు టార్చుకాకుండగా మరోరకమైన టార్చు ఉపయోగించెదరు. దానిని కటింగ్ టార్చు (cutting torch) అంటారు.
అక్సి-అసిటిలిన్ వెల్డింగు పరికరాలు[3][మార్చు]
- వెల్డింగు టార్చు (welding Torch)
- పూరకలోహకడ్డి (Filler)
- స్రావకము (Flux)
- అసిటిలిన్ గ్యాసు సిలిండరు (acetylene gas cylinder)
- ఆక్సిజను గ్యాసు సిలిండరు (oxygen gas cylinder)
- గ్యాసు రెగ్యులెటరు (Gas Regulator)
- ఎక్కువ వత్తిడిని తట్టుకొనే రబ్బరుగొట్టాలు (rubber Hoses)
- భద్రత రక్షణ పరికరాలు/ఉపకరణాలు (safety equipment)
వెల్డింగు , కట్టింగు టార్చులు (welding and cutting Torches)[మార్చు]
వెల్డింగు టార్చు :
గ్యాసు వెల్డింగులో వెల్డింగు టార్చు చాలా మఖ్యమైన పరికరం.[4] వెల్డింగుటార్చులో దహన, దహనదోహదకారి వాయువులను సరియైన పరిమాణంలో, నిష్పత్తిలో సమ్మేళనపరచి, నాజిల నుండి వెలువడు వాయు మిశ్రమాన్ని మండించి, మంటద్వారా ఉత్పన్నమగు ఉష్ణోగ్రత ద్వారా, లోహాలను కరగించి, అతకడం జరుగుతుంది. వాయువులు తగిన నిష్పత్తిలో మిళితము కానిచో, వాయువులు అసంపూర్తిగా దహనం చెందటం వలన, తక్కువ ఉష్ణోగ్రత ఏర్పడే అవకాశమున్నది. అలాగే వెల్డింగు చేయు లోహ ఫలకముల మందం పెరిగేకొలది ఎక్కువ పరిమాణంలో వాయువులను దహించవలెను. దానికి అనుగుణంగా, ఎక్కువ రంధ్ర వ్యాసమున్న నాజిలును టార్చి మూతికి బిగించవలెను. వెల్డింగు టార్చులో 1.నాజిలు, 2. వాయుగొట్టాలు, 3.కవాటాలు/వాల్వులు (valves), 4.టార్చినిపట్టుకొనుటకు అనువుగా మధ్యనున్న పిడి (handle) ఉండును. టార్చులోని గొట్టాలు, కవాటాలు అన్నియు రాగిలేదా ఇత్తడితో చెయ్యబడి ఉండును. రెండుగొట్టాలు ఒక చివర కలుపబడి వుండి, దాని వెలుపలి తలంలో మరలు (threads) ఉండును.ఈ మరలద్వారా టార్చువెల్డింగు నాజిలను బిగించెదరు. నాజిలు గొట్టం వలె ఉండి, దాని యొక్క చివర కొద్దిగా వంపుతిరిగి ఉండి, అంచు వద్దనున్న రంధ్రం వ్యాసం, నాజిల్ గొట్టం వ్యాసంకన్న బాగా తక్కువగా ఉండటంవలన, ఈ రంధ్రం ద్వారా వాయు మిశ్రమం ఎక్కువ త్వరణంతో బయటకు ప్రవహించును. వాయుగొట్టాల రెండో చివర కవాటాలు (valves) బిగించబడి ఉండును. ఈ కవాటాలద్వారా గొట్టాలలో ప్రవహించు వాయు పరిమాణాన్ని నియత్రించవచ్చును. కవాటాల వెలుపలి అంచులకు మరలున్న ఉబ్బులు కలిగిన గొట్టాలు బిగించబడి ఉండును. ఈ గొట్టాలకు వాయు సిలెండరుల నుండి వచ్చిన రబ్బరుగొట్టాలు బిగించెదరు. అసిటిలిన్ వాయువు వచ్చు రబ్బరుగొట్టం ఎరుపు రంగులో, ఆక్సిజను వచ్చు రబ్బరుగొట్టం నలుపుగా లేదా పచ్చగా ఉండును.
కట్టింగు టార్చు;ఆక్సి అసిటిలిన్ కట్టింగు టార్చువంటిదే కాకుంటే ఇందులో అదనంగా అక్సిజనును అధిక వత్తిడితో ఉయోగించుటకు ఒక లివరు అదనంగా టార్చుకు అమర్చబడివుండును.కట్టింగు టార్చు నాజిలు నిర్మాణంలో కూడా తేడా వుండును. వెల్డింగు టార్చు మూతిలో రెండు వాయువు కలిసేలా వుండును.కట్టింగు టార్చులో వాయు మిశ్రమ భాగంలో నాజిలువుండి దానికి మధ్యభాగంలో ఒకసన్నని రంధ్రం వుండి, లివరును నొక్కినప్పుడు మాత్రమే ఇందులో నుంచి ఆక్సిజను వాయువు అత్యంత వేగంగా/త్వరణంతో బయటకు ప్రవహిస్తుంది.కట్టింగు టార్చులో ఆక్సిజను రెండు రకాలుగా పనిచేస్తుంది.ఒకటి అసిటిలిన్ వాయుతో కలిసి మండి జ్వాలను ఏర్పరఛడం, రెండవది లోగాం వేడెక్కికి, కరగిన స్థితిలో వున్నప్పుడు, నాజిలు రంధ్రంద్వారా వేగంగా ఆధిక త్వరణంతో కరగిన లోహాన్ని ఢీకొట్టి, అక్కడి లోహాన్ని తొలగింఛడం.ఈ విధంగా లోహాన్ని కత్తరించెదరు.ఆక్సిఅసిటిలిన్ గ్యాసు వెల్డింగు విధానంలో తుప్పుపట్టని ఉక్కును కత్తరింఛడం కుదరరు.తుప్పుపట్టని ఉక్కునుమెటల్ ఆర్కుద్వారా కత్తరించవలెను.లేదా షీట్ కట్టింగ్ గ్రౌండిగ్ మెషిను ద్వారా కత్తరించ వలసి ఉంది.
పూరకలోహము(Filler metal)[మార్చు]
గ్యాసు వెల్డింగు పద్ధతిలో లోహాలను అతుకుటకు ఒక పూరక లోహం అవసరం. అతుక వలసిన లోహ అంచులను కరగించి, ఏర్పడిన ద్రవలోహ మడుగులో (metal pool) పూరకలోహాన్ని అదనంగా చేర్చడం వలన ఏర్పడు అతుకు దృఢంగా, బలిష్టంగా వుండి ఎక్కువ కాలం మన్నిక కలిగివుండును. అతుకబడు లోహాన్ని కాని, లేదా అతుకబడు లోహాలను ఫొలివుండి, వాటి భౌతిక, ఇతర లక్షణాలను ఇంచుమించు కలిగిన లోహన్ని, లేదా మిశ్రిత (alloy) లోహన్ని పూరక లోహంగా వాడెదరు. ఈ పూరకలోహం వర్తులాకార కడ్డిరూపంలో, పొడవుగా వుండును. పూరక లోహకడ్ది వ్యాసం 1.6 మి.మీ. నుండి 10 మి.మీ. వరకు వుండును.
పూరకలోహం | సైజు, మి.మీ. | ద్రవీభవ ఉష్ణోగ్రత0C | స్రావకం | అతుకబడులోహాలు/భాగాలు |
రాగిపూత వున్న మెత్తటి ఉక్కు | 1.6,3.15,5.0,6.3 | 1490 | అవసరంలేదు | మెత్తటి ఉక్కు, పోత ఇనుము |
ఎక్కువ కార్బను వున్న ఉక్కు | 1.6,3.15,5.0 | 1350 | కావాలి | కాగితం కట్టింగు యంత్రాలు, లేతుమెషిను కట్టరులు రిపేరి |
3% నికెల్ ఉక్కుIS 1278 type 4.4 | 1.6,2.5,3.15,5.0 | 1450 | కావాలి | అరిగిన కాంషాప్టులు, షాప్టులు, గేరులను అతుకుట |
మిశ్రమధాతు ఉక్కు BS:1453A5 | 5.0,6.3 | 1320 | అక్కరలేదు | రైలుపట్టలవెల్డింగు, క్రషీంగుయంత్రాల రిపేరి |
పైపు వెల్డింగు కడ్డిలు | 2.5,3.15,5.0 | 1450 | అక్కరలేదు | ఉక్కుగొట్టాలను అతుకుట |
తుప్పుపట్తని ఉక్కు | 1.6,2.5,3.15 | 1440 | కావాలి | తుప్పుపట్టని గొట్టాలు, ఫలకలు, టాంకులు |
ఉన్నత శ్రేణి సిలికాన్ కాస్ట్ ఐరన్ | 5.0,6.3,8.0.10 | 1147 | అవసరం | ఉన్నతశ్రేణి పోత ఇనుమును అతుకుటకు |
రాగి-వెండి మిశ్రమ లోహం IS:1278 Type:6.1 | 1.6,3.15,6.0 | 1068 | కావాలి | రాగివస్తువులను, రాగి విద్యుత్తు పరికరాలను అతుకుటకు |
నికెల్-కంచుIS:1278 Type:6.4 | 3.15,5.0,6.3 | 910 | అవసరం | ఉక్కు లేదా సాగు ఇనుము, రాగి, జింకు, నికెలు మిశ్రమ ధాతువులు |
అల్యూమినియం -మిశ్రమధాతువులు,5%రాగి | 1.6,3.15,5.0,6.3 (పలకలకడ్డి) | 640 | అవసరం | పోత అల్యూమియం వస్తువులు |
అల్యూమినియం మిశ్రమ ధాతువు, 5% సిలికాన్ IS:1278 | 1.6,3.15,5.0,6.3 | 635 | అవసరం | శుద్ధ అల్యూమినియం వస్తువులు, గొట్టాలు, ఫలకలు, తదితరాలు |
స్రావకం (Flux)[మార్చు]
లోహలను అతుకునప్పుడు, అతుకు లోహాలను వాటి ద్రవీభవన ఉష్ణోగ్రత చేరువరకు వేడిచెయ్యడం జరుగుతుంది, లోహాలు, ఇతరపదార్థాలు అంత ఉష్ణోగ్రతవద్ద పరిసరాలలోని గాలిలోని అక్సిజనుతో రసాయనిక చర్య జరిపి అక్సైడులు ఏర్పడు అవకాశమున్నది. దీనిని ఆక్సికరణ (Oxidation) అంటారు. అందువలన లోహల అతుకు వద్ద ఆక్సైడులు ఏర్పడటం వలన లోహఅతుకులు (weld joints) బలహీనంగా ఏర్పడి, కాలక్రమేన అతుకుల వద్దనున్న లోహభాగం క్షయీకరణ చెంది, రంధ్రాలు ఏర్పడుట, లేదా అతుకులలో పగుళ్ళు వచ్చి అతుకు విడిపోవడం జరుగుతుంది. అలా లోహఅతుకులు ఆక్సీకరణ చెందకుండ నివారించుటకై స్రావకాలను ఉపయోగించెదరు. స్రావకం లోని పదార్థాలు, లోహంకన్న ముందుగానే గాలిలోని ఆక్సిజనుతో చర్యనొంది, లోహ అతుకులు ఆక్సికరణ చెందకుండ నిరోధించును. స్రావకాన్ని వెల్డింగు సమయంలో అతుకుల వద్ద లోహం మీద పూయటం లేదా స్రావకంలో పూరకలోహకడ్ది చివరను ముంచి, ఆ తరువాత వెల్డింగు చెయ్యటంకాని చేయుదురు. స్రావకం అక్సిజనుతో సంయోగంచెంది చిట్టెము (slag) రూపంలో అక్సైడులను ఏర్పరుచును. ఈ చిట్టెము పలుచని పొరవలె అతుకువద్ద ఏర్పడును. ఈ చిట్టెమును ఇనుపబ్రస్సుతో రుద్దిలేదా కడిగి తొలగించెదరు. స్రావకాన్ని పొడి (powder), ముద్ద (paste), ద్రవ (liquid) రూపంలో వాడెదరు.
- సాధారణ ఉక్కును అతుకుటకు స్రావకం అవసరం లేదు.
- పోత ఇనుము (cast Iron), తుప్పుపట్టని ఉక్కు (stainless steel), రాగి దాని మిశ్రమధాతు లోహాలు, అల్యూమినియం, దాని మిశ్రమలోహాలను (alloys) అతుకునప్పుడు తప్పనిసరిగా స్రావకాన్ని ఉపయోగించెదరు.
- పోత ఇనుమును అతుకునప్పుడు ఉపయోగించు స్రావకంలో బోరేట్సు లేదా బోరిక్ ఆమ్లం, సోడా యాష్, తక్కువ ప్రమాణంలో ఉప్పు (సోడియం క్లోరైడ్) వుండును.
- తుప్పుపట్టని ఉక్కును అతుకునప్పుడు వాడు స్రావకంలో బోరిక్ ఆమ్లం, బోరాక్సు, ఫ్లోరొస్పరు వుండును.
- అల్యూమినియం, దాని మిశ్రమలోహలను అతుకునప్పుడు వాడు స్రావకంలో లిథియం, సోడియమ్, పొటాషియం వుండును. ఇవి పొడిరూపంలో లేదా ముద్ద (paste) లో వుండును. కొన్ని సందర్భంలలో పొటాషియం క్లోరైడ్, లిథియం క్లోరైడులను కూడా స్రావకంలో ఉపయోగిస్తారు.[6]
- శుద్ధమైన రాగిలోహన్ని అతుకుటకు స్రావకం అవసరం లేదు, అయితే రాగియొక్క మిశ్రమలోహాలను అతుకుటకు (కంచు, ఇత్తడి, గన్ మెటల్ ఇత్యాది) బొరాక్సు సంబంధిత రసాయనాలను కలిపి తయారుచేయుదురు. రాగి మిశ్రమధాతువులన అతుకుటకు ఉపయోగించు స్రావకాన్ని కరగించిన బోరాక్సు, బోరిక్ ఆమ్లం, డై సోడియం ఫాస్పేట్, మెగ్నిషియం సిలికెట్, సున్నం కలిపి తయారుచేయుదురు.
- మెగ్నీషియం లోహం, దాని మిశ్రమధాతువులను అతుకునప్పుడు వాడు స్రావకంలో సోడియం క్లోరైడ్, పొటాసియం ఫ్లోరైడ్, మెగ్నీసియం క్లోరైడ్, బోరియం క్లోరైడ్, లను వాడెదరు.[7]
- శుద్ధమైన నికెల్ను అతుకుటకు స్రావకం అక్కరలేదు. కాని దాని మిశ్రమలోహలను అతుకుటకు స్రావకాన్ని వాడవలెను.
అసిటిలిన్ గ్యాసు సిలిండరు[మార్చు]
అసిటిలిన్ గ్యాసును సిలిండరులలో నింపి, వెల్డింగుచెయ్యు ప్రదేశానికి సిలిండరును తీసికెళ్లెదరు.అసిటిలిన్ సిలిండరుకు మరూన్ (maroon) రంగు వెయ్యబడివుండును.సిలిండరు పొడవుగా గొట్టంవే (వర్తులాకారం) లో వుండును.
అసిటిలిన్ వాయు సిలెండరు గురించి పూర్తివివరాలకై
చూడండి
ఆక్సిజను గ్యాసు సిలెండరు[మార్చు]
ఆక్సిఅసిటిలిన్ వెల్డింగులో ఉపయోగించు ఆక్సిజను వాయువును కూడా స్తూపాకార ఉక్కునిర్మితమైన దృఢమైన మందమైన గొట్టంలో (cylinder) లో అధిక వత్తిడి వద్ద నింపి ఉపయోగిస్తారు[8] .ఆక్సిజను సిలెండరుకు సాధారణంగా నల్లనిరంగు (భారతదేశంలో) వెయ్యబడివుండును.కొన్ని దేశాలలో కలరుకోడ్ వేరే వుండవచ్చును. సిలెండరుకు బిగించిన కవాటం (valve) యొక్క బయటవున్న మరలు (threads) సవ్యదిశ (కుడివైపు) లో వుండును.సాధారణంగా ఆక్సిజను సిలెండరులు 3400,5200, 6800 లీటర్లు పట్టు ప్రమాణంలో తయారుచేయుదురు..సాధారణంగా గొట్టాలను, లోహ పలకల రెండు అంచులను దగ్గరగా చేర్చి, అతికి చేయుదురు.కాని అక్సిజను సిలెండరును ఘనలోహ ముద్దను సాగదీసి సిలెండరుగా తయారుచేయుదు, అందువలన అధిక వత్తిడి వద్ద సిలెండరు విడిపోదు (అంచులు లేనందున).సిలెండరు నిర్మాణానికై 140 బారు వత్తిడిని తట్టుకొనే మెత్తటి ఉక్కును ఉపయోగిస్తారు.కొన్ని సందర్భాలలో మిశ్రమధాతు లోహాలతో కూడా సిలెండరును తయారుచేయుదురు.మొత్తని ఉక్కులోహంతో చేసిన సిలెండరు 13660KN/m2 (136.3 Bar, మిశ్రమలోహా ధాతువు అయినచో17420Kn/m2 (177.4bar) తట్టుకొనేలా వాయు నిల్వ గొట్టాలను (Gas cylinder) తయారు చేయుదురు.సిలెండరులోని ఆక్సిజను వాయువు యొక్క ఘనపరిమాణం ఎప్పుడు దాన్నియొక్క వత్తిడికి అనులోమానుపాతంగా వుండును.అనగా గొట్టంలోని వత్తిడి తగ్గెకొలది, అదే నిష్పత్తిలో వాయుగొట్టంలోని అక్సిజను ఘనపరిమాణం తగ్గుతుంది.ఉదా:సిలెండరులోని వత్తిడి 5%తగినచో, సిలెండరులోని వాయువు ఘనపరిమణం 1/20 తగ్గుతుంది. ఏదైన కారణం చే ఆక్సిజను సిలెండరు ఉష్ణోగ్ర్తత అత్యధికంగా పెరిగినప్పుడు, సిలెండరులోని వాయువు వ్యాకోచించి, సిలెండరు ప్రేలిపోయే ప్రమాదంనును నివారించుటకై, సిలెండరుకు ఒక రక్షణ నట్టు/మర (safety nut) అమర్చబడి వుండును.ఆక్సిజను సిలెండరు పైభాగంలో ఇత్తడితో చేసిన ఒక కవాటం వుండును, ఈ కవాటం ద్వారా వాయువును నియమిత ప్రమాణంలో, వత్తిడిలో వెల్డింగు టార్చుకు రబ్బరుగొటంద్వారా రవాణా చెయ్యబడును.ఆక్సిజను సిలెండరు యొక్క గోడ మందం6.5 మి.మీ వుండును, సిలెండరుయొక్క లోపలి వ్యాసం 216 మి.మీ.వుండును.ఇక సిలెండరు పొడవు 1275 మి.మీ వుండును[9] .సిలెండరును రవాణాచెయ్యునప్పుడు, పని చేయునప్పుడు అక్కడికి, ఇక్కడికి దొర్లించునప్పుడు, సిలెండరు యొక్క కవాటం పాడవ్వకుండ కవాటం పైన ఒక రక్షణ తొడుగు (safety guard) వుండును.సిలిండరుని వినియోగించని సమయంలో ఈ రక్షణ తొడుగును కవాటానికి బిగించెదరు.సిలెండరును వాడనప్పుడు, ఖాళిగా అయ్యినప్పుడు, తప్పనిసరిగా దీని కవాటాన్ని (valve) మూసి వుంచాలి.
వాయు వత్తిడి నియంత్రణ పరికరాలు[10][మార్చు]
వెల్డించుచేయునప్పుడు వెల్డింగు టార్చునకు అసిటిలిన్, ఆక్సిజను వాయువులను నియమిత వత్తిడి, ఘనపరిమాణంలో అంతరాయం లేకుండా పంపి, నాజిల్ లో మిశ్రమంచేసి వెలిగించినప్పుడే టార్చునుండి మంట సరిగా వెలిగి వెల్డింగునకు అవసరమైన ఉష్ణాన్ని ఏర్పరచును.ఇలా వాయువులను కావలస్సిన మేరకు అందిచు నియంత్రణ పరికరాలను గ్యాసు రెగ్యులెటర్సు (Gas Regulators) అంటారు.ఈ వాయు నియంత్రణ పరికారలను వాయు గొట్టాల కవాటాలకు బిగించెదరు.ప్రతి రెగ్యులెటరుకు అడుగున సిలెండరుకు బిగించుటకై మరలున్నముందుకు చొచ్చుకువచ్చి, నట్టు (nut) వున్న భాగముండును.అలాగే వాయువు యొక్కవత్తిడిని తెలుసుకొనుటకు వత్తిడి కొలమాని (pressure Gauge) బిగించుటకు మరలున్న అమరిక, అలాగే వెల్డింగు టార్చుకు వాయువును సరఫరా చేయు రబ్బరు గొట్టం బిగించుటకు మరలున్న అమరిక వుండును.రెగ్యులెటరులు రెండు రకాలు. 1.ఒక ప్రెస్సరు గేజి వున్నరకం,2.రెండు ప్రెస్సరు గేజిలున్న రకం.
1.ఒక ప్రెస్సరు (వత్తిడి) గేజివున్న రెగ్యులెటరు:[11] ఈ రకం రెగ్యులెటరును ఉపయోగించునప్పుడు కేవలం సిలెండరులోని వత్తిడి లేదా రబ్బరుగొట్టంలో ప్రవహించు వాయువత్తిడి మాత్రమే గుర్తించ వీలున్నది.
2.రెండు ప్రెస్సరు గేజిలున్న రకం : ఈ రకం రెగ్యులెఋఅనుపయోగించి సిలెండరులోని వాయు వత్తిడిని, టార్చుకు సరాఫరా అయ్యే వాయు వత్తిడిని ఒకేసారి గమనించ వీలున్నది.అందు చేత రెండు గేజిలున్న రకం రెగ్యులెటనును ఉపయోగించటం అన్ని విధాల ఉత్తమం.[12]
అక్సిజను , అసిటిలిన్ వాయు నియంత్రణ పరికరాలలోని వ్యత్యాసం[మార్చు]
పొరబాటున ఒకరకం గ్యాసు రెగ్యులెటరును మరోరకం సిలెండరుకు బింగించకుండ నిరోధించేటందుకు రెండు వాయువుల రెగ్యులెటర్లలో కొంత తేడా లున్నాయి.
- అసిటిలిన్ వాయువుకు రబ్బరుగొట్టం జోడించు రెగ్యులేటరు భాగానికి అపసవ్యదిశలో మరలు (Left hand threads) వుండును.ఆక్సిజను సిల్ండరు రెగ్యులెటరుకు సవ్యదిశలో మరలుండును.
- అసిటిలిన్ రెగ్యులెటరు రబ్బరుగొట్టం ఇత్తడి జోడింపు నట్టు (nut) మీద చెక్కిన గాట్లు వుండును.అక్సిజను రెగ్యులెటరు నట్టుమీద ఎటువంటి గుర్తింపు గాట్లు వుండవు.
- అసిటిలిన్ వాయువు రెగ్యులెటరుమీద మెరున్ రంగు లేదా ఎరుపు పూత వుండును.అక్సిజను రెగ్యులెటరు మీద నీలం లేదా నల్లనిరంగు పూత పూయబడివుండును.
- అక్సిజను వాయు రెగ్యులెటరుకు సిలెండరులోని వత్తిడి చూపించటానికి 100 బారు వరకు వత్తిడిని చూపించు ప్రెస్సరు గేజిని, అసిటిలిన్ రెగ్యులెటరుకు 8 బారు వరకు వత్తిడిని చూపించే ప్రెస్సరు గేజిని బిగించెదరు.
- వెల్డింగుకై వాడు వాయువత్తిడి చూపించుటకై అసిటిలిన్ వాయు రెగ్యులెటరుకు 1బారు వరకు వత్తిడిచూపించు, అక్సిజన్ రెగ్యులెటరుకు 4.8 బారువరకు చూపించు ప్రెస్సరు గేజిలను అమర్చెదరు.
వాయువులను సరాఫరా చేయు రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలు[13][మార్చు]
సిలెండరులలోని దహన, దహనదోహాద వాయువులను వెల్డింగు టార్చికి నిరంతరం అందించునవి ఈ రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టాలు.ఈ గొట్టాలు బిరుసుగా (rigid) వుండక కావలసిన విధంగా సులభంగా అటు నిటూ వంపులు తిరుగునట్లు (flexible) వుండును.రబ్బరు గొట్టాలను హోసు (hose) అనికూడా అంటారు.కొందరు వాడుకలో ట్యూబ్ అని కూడా పిలుస్తుంటారు.ఈ రబ్బరు హోసులు దృఢమైన, మందమైన గొట్టపు గోడలనుకలిగి, వుండును.గొట్టం గోడ మందం3-3.5 మి.మీ వుండును.[14] వాయువుల యొక్క అధిక వత్తిడిని తట్టుకొనుటకై హోసు/గొట్టం గోడలలలో బలిష్టమైన నూలు దారాల, పి.వి.సి., నైలాను దారాల అల్లిక కలిగి వుండును.గొట్టం బయటి పొర వాతావరణ ఒడిదొడుకులను తట్టుకొనేలా గట్టి రబ్బరులో నిర్మింపబడి వుండును.వెల్డిండు కై వాడబడు రబ్బరు గొట్టాల రంధ్రం లోపలి వ్యాసం 4.8 మి.మీ (3/16 అంగుళం) నుండి 9.6 మి.మీ. (3/8 అంగుళం) వరకుండును.తక్కువ పనివత్తిడి టార్చులను ఉపయోగించునప్పుడు హోసు రంధ్రం వ్యాసం 4.8 లేదా 6.4మి.మీ (1/4 అంగుళం) వుండును.ఎక్కువ పని, ఎక్కువ వత్తిడి టార్చు వాడునప్పుడు 8.0మి.మీ (5/16 అంగుళం) రంధ్ర వ్యాసమున్న హోసును, ఎక్కువ కట్టింగు టార్చు, తక్కువ వత్తిడిఅవసరమైనప్పుడు 6.6 మి.మీ రంద్ఘ్రవ్యాసమున్న రబ్బరు గొట్టాలని వెల్డింగు లేదా లోహాలకత్తరింపులో వాడెదరు.
నాణ్యత పరంగా, రక్షణపరంగా, గొట్టం అవసరానికి వంపులు తిరుగుటలో రబ్బరు గొట్టాలు, ప్లాస్టిక్ హోసు పైపుల కన్న మంచివి. ఆక్సిఅసిటిలిన్ వెల్డింగులో రెండు వాయు నాళికలు/గొట్టాలు/ట్యూబులు రెండు రంగుల్లో వుండును.ఆక్సిజను సిలిండరుకు బిగించు హొసు/గొట్టం నల్లగా లేదా నీలం రంగులోవుంటుంది.నీలం రంగు గొట్టంలో ప్రసరించు వాయువు ప్రమాదకారి కాదు అని తెలుపు తుంది.అసిటిలిన్ సిలండరుకు కలిపిన హోసు/గొట్టం ఎరుపు రంగులో వుండును.ఎరుపు గొట్టంలో వాయువు ప్రమాదకారి అని సూచిస్తుంది.
రబ్బరు హోసులను సిలెండరు, వెల్డింగు టార్చుకు బిగించుటకు క్లాంపులు (clamps, ఇత్తడి జోడింపులు (couplers) అవసరం, వీటిని హోసు ఫిట్టింగులు లేదా కనెక్టరులు అంటారు[15] .అక్సిజను, అసిటిలిన్ వాయుగొట్టాల ఈ జోడింపు పరికరాలలో చిన్నపాటి తేడా వుండును.జోడింపు భాగాలు ఇత్తడితో చెయ్యబడివుండును.గొట్టం లోకి దూర్చుభాగం శంకువు లావుండి ఉపరితలం ఎగుడు దిగుడులుగా వుండును.ఇలావుండటంవలన జోడింపు నిపులు (nipple) రబ్బరుగొట్టం యొక్క రంధ్రాన్ని గట్టిగా పట్టుకొనును.ఈ జోడింపువెలుపలి వైపు మరలున్న, పలకలుగా వున్న తొడుగువంటిది వుండును, దీనిని సిలెండరు రెగ్యులెటరుకు లేదా వెల్డింగుటార్చుకు బిగించెదరు.
భద్రత సూచన=పాడైపోయిన, గొట్టం ఉపరితలంమీద నెర్రలు విచ్చిన రబ్బరు గొట్టాన్ని వాడరాదు.రెండు, మూడు సంవత్సరాలకు గొట్టాన్ని హైడ్రాలిక్ పరీక్షచేసి, అవసరమైన మార్చాలి.వేడి వస్తువులకు దగ్గరగా వెల్దీంగు రబ్బరుగొట్టలను ఉంచరాదు.
వెల్డింగు జ్వాల[మార్చు]
ఆక్సిఅసిటిలిన్ వెల్డింగులో ఉపయోగించు రెండువాయువుల నిష్పత్తి మారే కొలది టార్చునుండి వెలువడు జ్వాల యొక్క రంగు, ఉష్ణోగ్రత తీవ్రత మారుచుండును.టార్చు ముఖం నుండి వెలువడు జ్వాల స్వరూపాన్ని బట్టి వెల్డింగు చేయు విధానం మారును.టార్చునుండి వెలువడు మంటను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరించారు.[16]
- తటస్థ జ్వాల/మంట (neutral flame)
- క్షయికరణ జ్వాల/మంట (Reducing Flame)
- ఆక్సీకరణ జ్వాల/మంట (oxydising Flame)
మొదట వెల్డింగు టార్చుయొక్క అసిటిన్ వాయు కవాటాన్ని కొద్దిగా తెరచి, మండించినప్పుడు ఏర్పడు జ్వాలను అసిటిలిన్ జ్వాల అంటారు.అసిటిలిన్ గాలిలోని అక్సిజనుతో చర్య జరపటం వలన మంట ఏర్పడును.అసిటిలిన్ కు తగినంత అక్సిజను అందకపోవటం వలన వాయువు పూర్తిగా దహింపకబడకపోవటం వలన నల్లన్నిపొగను వెలువరిస్తూనలుపు, ఎరుపురంగులో మండుతుంది.
తటస్థజ్వాల :టార్చు వాయు మిశ్రమ గదిలో అసిటిలిన్, ఆక్సిజను వాయువులను సమాన నిష్పత్తిలో కలిసేలా, టార్చుయొక్కరెండు వాయువుల రెండు కవాటాలను తగు రీతిలో తెరచి, మండిచన ఏర్పడు జ్వాల/మంటను తటస్థ జ్వాల అంటారు.తటస్థజ్వాల యొక్క ఉష్ణోగ్రత 32600C వరకుండును.జ్వాల బాగా సాగిన దీర్ఘ వలయాకారంగా వుండి, ప్రకాశవంతంగా వుండును.జ్వాల వెలుపలి భాగం ముదురు నీలంగా వుండును, లోపల, నాజిల్ ముఖంవద్ద నన్నని లేతనీలిమంట కనిపించును.దానిని ఇన్నరుకోరు (inner core) అంటారు.ఈ ఇన్నరుకోరును ఆవరించుకొని బయటి జ్వాల వుండును.ఈ వెలుపలిజ్వాలలోని అత్యధిక ఉష్ణోగ్రతకు వేడేక్కిన కార్బన్ మొనాక్సైడు (CO, గాలిలోని ఆక్సిజనుతో సంయోగంచెంది, అత్యధిక ఉష్ణోగ్రతకలిగిన నీలిరంగుతో సాగిన ఈటె తలఆకారంలో మండును. తటస్థజ్వాలతో వెల్డింగు చెయ్యుటకు అనుకూలమైన లోహాలు:
- మెత్తటి ఉక్కు (mild steel)
- తుప్పుపట్టని ఉక్కు (stainlees steel)
- పోత ఇనుము (cast Iron)
- రాగి/తామ్రం (copper)
- అల్యూమినియం (Aluminium)
అక్సీకరించు జ్వాల (Oxidising Flame) :మొదట తటస్థ జ్వాలను ఏర్పరచి, పిదప నెమ్మదిగా అక్సిజను వాయు నిష్పత్తిని పెంచగా అక్సికరణ జ్వాల ఏర్పడును.ఈ జ్వాల తటస్థ జ్వాలకన్న కొంచెం చిన్నదిగా వుండి నీలంగా మండును.నాజిల్ అంచు వద్ద నున్న ఇన్నరుకోరు చిన్నదిగా, సన్నని శిఖర అంచును కల్గి వుండి ముదురు నీలంగా కన్పించును.అక్సికరణచెందిన జ్వాలనుండి చిన్న అరుపువంటి శబ్దం వెలువడు చుండును.ఈ రకం జ్వాల నుండి తటస్థజ్వాలకన్న ఎక్కువ ఉష్ణోగ్రత వెలువరించును.కారణంఎక్కువ అక్సిజనును ఇవ్వడం వలన.ఉష్ణోగ్రత 35000C వరకు పెరగును. అక్సికరణ జ్వాలను ఉపయోగించి ఈ దిగువ సూచించిన లోహలను అతుక వచ్చును.
- రాగి సంబంధిత లోహములు
- జింకు.యశదం సంబంధ లోహములు
- మాంగనీసు ఉక్కు, పోత ఇనుము వంటి ఇనుపమూలకానికి చెందిన వాటిని అతుక వచ్చును
క్షయికరించు జ్వాల (Reducing Flame) :మొదట తటస్థికరణ జ్వాలను ఏర్పరచి, తటస్థజ్వాలకన్న అక్సిజను మోతాదును తగ్గించిన క్షయుకరించిన జ్వాల ఏర్పడును.అక్సిజను నిష్పత్తి తగ్గటం వలన మంట కార్బనీకరణమై కన్పిస్తుంది.జ్వాల తటస్థ జ్వాలకన్న పొడవుగా వ్ంటుంది, ఇన్నరు కోరు వెలుపలి అసిటిన్ మంటను గమనించవచ్చును.క్షయికరణ జ్వాలనుండి 30380C వరకు మాత్రమే ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.ఇంకను అక్సిజను మోతాదును తగ్గించిన కర్బనీకరణ జ్వాల ఏర్పడును.కర్బనీకరణ జ్వాలను సీసం (lead) ను అతుకుటకు, ఇతర లోహాలను కర్బనీకరణ చేయుటకుపయోగిస్తారు. క్షయుకరణ జ్వలనుపయోగించి తక్కువ రకపు మిశ్రపు లోహములను, కొన్ని రకాల ఉక్కేతర లోహాలను అతుకుటకు ఉపయోగిస్తారు.
అక్సిజను-అసిటిలిన్ వాయు జ్వాలను ఉపయోగించి లోహాలను అతుకుట[మార్చు]
మొదట అతుకవలసిన లోహపలకల అంచులను ఎలాంటినూనె మరకులు, తుప్పువంటివి లేకుండా గరుకుకాగితం (emery paper) తో రుద్దిశూభ్హ్రం చెయ్యాలి.అతుక వలసిన లోహ భాగం మందంగా వున్నచో రెండు అంచులు చూఛుటకు VలేదాU ఆకారంలో కన్పించేలా చెక్కవలెను.స్రావకం అవసరమైనచో సిద్ధంగా వుంచుకోవాలి, అతుకుటకు అవసరమైన పూరకలోగ కడ్దిని సిద్ధపరచాలి.మొడట టార్చును యొక్క అసిటిలిన్ వాయువు యొక్కకవాటాన్నిమాత్రమే తెరచి అసిటిలిన్ జ్వాలను సృష్టించాలి, పిదప క్రమంగా అక్సిజనువాయువు ప్రమాణాన్ని పెంచుతూ అతుకుటకు కావలసిన జ్వాలను (తటస్థ, లేదా అక్సికరించిన, లేదా క్షయికరించిన జ్వాల) ఏర్పరచవలెను.ఇప్పుడు అతుకవలసిన లోహ భాగాలపై జ్వాల కేంద్రికరించి లోహ అంచులను వేడిచెయ్యాలి.స్రావకం అవసరమున్నచో, వేడిచెయ్యుటకు అతుకు అంచులకు పూతగా పుయ్యవచ్చును. లేదాఅతుకు సమయంలో పూరక కడ్ది చివరను స్రావకంలో ముంచి అతుకవచ్చును.అతుకవలసిన లోహ్స్ అంచులు వేడెక్కి కరుగుట ప్రారంభంకాగానే, పూరకకడ్డి అంచును జ్వాలలోకి ప్రవేశపెట్టటం వలన పూరకకడ్డి కరిగి అతుకుమీడ జమ అవ్వడం మొదల్వైతుంది.అతుకు మీద పూరక లోహం తగినంత మందంలో ఏర్పడగానే పూరక కడ్డిని నెమ్మదిగా ముందుకు జరుపుకొనుచూ పెళ్ళవలయును.అతుకుట పూర్తయ్యిన తరువాత, పూరక కడ్డిని జ్వాలనుండి బయటకులాగి తరువాత, జ్వాలను తగ్గించి, టార్చిని ఆర్పివెయ్యవలెను.
గ్యాసు వెల్డింగులో తీసుకోవలసిన భద్రత చర్యలు[17][18][మార్చు]
- ఆక్సిజను, అసిటిలిన్ వాయు సిలెండరులను ఎప్పడు నిలువుగా వుంచవలయును.
- వెల్డింగు లేదా కట్టింగు అయ్యినతరువాత రెండు స్లెండరుల కవాటాలను మీసివేసి, వాటిపైన రక్షనతొడుగులు బిగించవలయును.
- సిలెండరులను వెల్డింగు లేదా కట్టింగు కై ఒకప్రదేశం నుండి మరొక ప్రదేశాంకు తీకెళ్ళుటకు, సిలిండరులను నేలమీద దొర్లించిరీసుకువెళ్ళరాదు.అలాచెయ్యడం చాలా ప్రమాదకరం.
- సిలిండరులను చక్రాలున్న ట్రాలీ వంటి దాని మీద స్థిరంగా వుండేలా అమర్చి, ట్రాలి మీద ఒక చోట నుండి మరో చోటుకు తీసుకెళ్ళవలెను.తీసుకెళ్ళునప్పుడు సిలెండరులు ప్రక్కకు ఒరగిపోకుండ, పడిపోకుండ తగినట్లుగా గొలుసులతో లేదా క్లాంపులతో బిగించి వుంచాలి.
- సిలిండరుకు బిగించిన రెగ్యులెటరులు పనిచేసే స్థితిలో వుండాలి.పాడై పోయిన రెగ్యులెటరులను వాడరాదు.ఎపటికప్పుడు రెగ్యులెటరులను పరిశీలిస్తుండాలి.రెగ్యులెటరులకు అమర్చిన వత్తిడి మాపకాలు (pressure guage) చక్కని పనిచేసే స్థితిలో వుండాలి.
- సిలిండరులను త్వరగా మండే స్వభావమున్న వస్తువులకు దూరంగా వుంచాలి.విద్యుత్తు తీగెలకు దూరంగా వుంచాలి.
- సిలిండెరుల కవాటాలను వాటికై నిర్దేశించిన పనిముట్లతో (wrenches) మాత్రమే తెరవడం, మూయడం చెయ్యాలి,
- సిలిండరులమీద, నూనె, గ్రీజు మరకలు వంటివి వుండరాదు.కొన్నిసమయాల్లో అక్సిజను సిండరునుండి కారిన వాయువు నూనెతో చర్యజరుపును.
- వెల్డింగుకు ఉపయోగించు రబ్బరు గొట్టాలు మన్నిక కలిగినవై వుండాలి.మూడుసంవత్సరాలు దాటిన, పాడైపోయిన, ఉపరితలంమీద నెర్రలు కన్పించే రబ్బరు గొట్టాలను వెంటనే తొలగించి, ISI ముద్రకలిగిన గొట్టాలనే వాడాలి.
- రబ్బరు గొట్టాలను వేడి వస్తువులకు దూరంగా వుంచాలి.నిప్పురవలు వంటివి గొట్టాలమీద పడిన పాడైపోవును.
- వెల్డింగు చెయ్యు నిపుణుడు వెల్డింగు సమయంలో, అగ్ని, ఉష్ణనిరోధక దుస్తులను పాదరక్షలను ధరించాలి, చేతులకు చర్మంతో చేసిన తొడుగులు, కళ్ళకు నల్లాద్దాల కళ్ళజోడు, తలకు సిరస్త్రాణం ధరించి వుండాలి.
- పనిజరుగు ప్రదేశంలో వెల్డింగు సమయంలో వెలువడూ విషవాయులను యంత్ర సహాయంనేప్పడికప్పుడు తొలగించవలెను.
- వెల్డింగు టార్చు/కటింగుటార్చును వెలిగింఛుటకు దీనికై నిర్దేశించిన లైటరును మాత్రమే వాడవలెను.
ఇవికూడా చూడండి[మార్చు]
ఉల్లేఖనము[మార్చు]
- ↑ Carlisle, Rodney (2004). Scientific American Inventions and Discoveries, p.365. John Wright & Songs, Inc., New Jersey. ISBN 0-471-24410-4.
- ↑ The Oxy-Acetylene Handbook, Union Carbide Corp 1975
- ↑ https://www.google.co.in/search?q=gas+welding+equipment+safety&sa=X&tbm=isch&tbo=u&source=univ&ei=BJO3UZuSEYHjrAeb_YHgCA&ved=0CE8QsAQ&biw=1366&bih=677
- ↑ http://www.technologystudent.com/equip_flsh/acet1.html Archived 2013-03-29 at the Wayback Machine వెల్డింగు టార్చు
- ↑ Welding Technology,by O.P.khanna.page 31-32
- ↑ http://cdn.intechopen.com/pdfs/14404/InTech-A_multiphysics_analysis_of_aluminum_welding_flux_composition_optimization_methods.pdf
- ↑ http://www.aws.org/wj/supplement/03-2005-WATANABE-s.pdf
- ↑ http://www.practicalmachinist.com/vb/fabrication-cnc-laser-waterjet-plasma-welding-fab/oxy-acetylene-gas-welding-rigs-different-sizes-232794/
- ↑ http://www.yesterdaystractors.com/cgi-bin/viewit.cgi?bd=toolt&th=110363
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-11-26. Retrieved 2021-11-02.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-08-24. Retrieved 2013-11-02.
- ↑ http://shgaoyang.en.alibaba.com/product/320605396-210107720/oxygen_gas_regulator.html
- ↑ https://www.google.co.in/search?q=gas+welding+hose+pipe&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=ggN1Urv-MoiTrgf13YGwBQ&ved=0CF4QsAQ&biw=1366&bih=677
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-21. Retrieved 2013-11-02.
- ↑ http://www.weldingtorchparts.co.uk/categories/gas_fittings_hoses.html
- ↑ https://www.google.co.in/search?q=oxy+acetylene+flame&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=GgZ1Uu2VKYPNrQer_4HABw&sqi=2&ved=0CDMQsAQ&biw=1366&bih=677
- ↑ http://www.slideshare.net/brayanpeter/safety-tips-for-gas-welding
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-05-10. Retrieved 2013-11-03.