Jump to content

రామచంద్ర భండారే

వికీపీడియా నుండి
(ఆర్.డీ.భండారే నుండి దారిమార్పు చెందింది)
రామచంద్ర ధోండీబా భండారే
రామచంద్ర భండారే


పదవీ కాలం
1976 – 1977

బీహారు గవర్నరు
పదవీ కాలం
1973 – 1976

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1967 – 1973
నియోజకవర్గం ముంబై నార్త్ సెంట్రల్

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 11, 1916
విటా, సాంగ్లీ, మహారాష్ట్ర
మరణం సెప్టెంబరు 5, 1988
ముంబై
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి శకుంతలా భండారే
సంతానం ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె.
వెబ్‌సైటు The official R D Bhandare website www.rdbhandare.com
24 ఫిబ్రవరి, 2012నాటికి

ఆర్.డీ.భండారే లేదా రామచంద్ర ధోండీబా భండారే (జ. 1916 ఏప్రిల్ 11, మ. 1988 సెప్టెంబరు 5) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. నాలుగవ, ఐదవ లోక్‌సభ సభ్యుడు. మహారాష్ట్ర లోని ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

రామచంద్ర భండారే, 1916, ఏప్రిల్ 11న, బొంబాయి రాష్ట్రంలోని సతారా జిల్లా, విటాలో (ప్రస్తుతం సాంగ్లీ జిల్లాలో ఉన్నది) జన్మించాడు. దళిత మహర్ల కుటుంబంలో జన్మించిన భండారే తండ్రి ధోండీబా హరీబా భండారే. ఈయన చిన్నతనంలోనే కుటుంబం బొంబాయి తరలివచ్చి అక్కడ స్థిరపడింది. భండారే ఉత్తర వరాలీ ప్రాథమిక పాఠశాలలో ప్రాధమిక విద్యను, కొలాబావాడీలో మాధ్యమిక విద్య పూర్తి చేసుకొని, బొంబాయిలోని మహారాష్ట్ర ఉన్నత పాఠశాలలో చదివాడు. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో బి.ఏ పట్టభద్రుడై, బొంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో, ఖాల్సా కళాశాలలో ఎల్.ఎల్.బి, ఎం.ఏ పూర్తిచేశాడు. చదువు పూర్తిచేసిన తర్వాత బొంబాయిలో న్యాయవాదవృత్తి ప్రారంభించాడు. అదే సమయంలో న్యాయశాస్త్ర ఆచార్యుడిగా కూడా పనిచేశాడు.[1]

కార్మిక, దళిత నాయకుడిగా

[మార్చు]

రామచంద్ర భండారే కార్మిక సంఘాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ, 1942 నుండి 1945 బొంబాయి నగరపాలిక కామ్‌గర్ సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. 1949 నుండి 1952 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో నెలకొల్పబడిన దిగువస్థాయి గ్రామీణ సేవకుల సంఘానికి అధ్యక్షత వహించాడు. 1952-54 వరకు బొంబాయి వస్త్రపరిశ్రమ కార్మికుల సంఘానికి ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు. 1963 నుండి 1966 వరకు నవభారత్ మజ్దూర్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నాడు.

భండారే, సంస్థ ప్రారంభం నుండే, షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ లో సభ్యుడుగా ఉన్నాడు. పార్టీ యొక్క విభాగమైన, బొంబాయి ప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడయ్యాడు. మహాత్మా గాంధీ, బొంబాయి సందర్శించడానికి వచ్చినప్పుడు, దళితులపట్ల తన సౌభ్రాతృత్వాన్ని చాటడానికి వరాలీలోని ఒక మెహతర్ల ఇంట విడిదిచేశాడు. మహాత్మాగాంధీ యొక్క ఈ "ప్రదర్శన"ను నిరసిస్తూ, భండారే, ఆయన అనుచరులు నల్లజండాలు ఎగురవేసి నిరసన వ్యక్తంచేశారు. పర్యవసానంగా, వర్ణ హిందువులకు, దళితులకు మధ్య పెద్ద తగాదా ప్రారంభమైంది. ఈ గొడవల్లో, భండారే గట్టిగా నిలబడి, బొంబాయి షెడ్యూల్డ్ కులాల ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. 1946లో వరాలీలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు. బొంబాయిలో ప్రతి ప్రాంతంలో తమిళ సంఘాన్ని నెలకొల్పాడు. భండారే చొరవతో, అంబేద్కర్ జన్మదినాన్ని పెద్ద ఎత్తున సంబరంగా జరపటం ప్రారంభమైంది. 1950 ఏప్రిల్ 14 నిర్ధర్ అనే వారపత్రికను ప్రారంభించాడు. అది రెండేళ్ళపాటు కొనసాగింది.

రాజకీయాల్లో

[మార్చు]

భండారే 1948 నుండి 1957 వరకు బొంబాయి మహానగరపాలికలో సభ్యుడిగా పనిచేశాడు. 1960 నుండి 1962 వరకు బొంబాయి శాసనసభ సభ్యుడిగా ఉంటూ, ఆ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. భండారే భారతీయ రిపబ్లికన్ పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యుడు. 1964 నుండి 1966 వరకు ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.ఆ తరువాత 1973 నుండి 1976 వరకు బీహారు గవర్నరుగానూ, 1976 నుండి 1977 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగానూ పనిచేశాడు.[2]

మరణం

[మార్చు]

భండారే 1988, సెప్టెంబరు 5న బొంబాయిలోని తన స్వగృహంలో మరణించాడు.[3] ఈయన భార్య శకుంతలాబాయి. ఈయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఈయన నివాసం ముంబైలోని వడాలా ప్రాంతంలో ఉండేది.

మూలాలు

[మార్చు]
  1. Paswan, Sanjay; Pramanshi, Jaideva. "Encyclopaedia of Dalits in India: Leaders". Google Books. Gyan Publishing House. p. 297. Retrieved 28 October 2017.
  2. "Official biographical sketch". Parliament of India website. Archived from the original on 6 జూలై 2017. Retrieved 22 February 2012.
  3. Rāmacandra Kshīrasāgara. Dalit movement in India and its leaders, 1857-1956. M D Publications New Delhi. pp. 181–183. ISBN 81-85880-43-3.

బయటి లింకులు

[మార్చు]