ఇంగ్లాండ్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20015,46,982—    
20118,06,199+47.4%

హిందూమతం ఇంగ్లాండ్‌లో[గమనిక 1] మూడవ అతిపెద్ద మతం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8,06,000 మంది హిందువులున్నారు. ఇది ఇంగ్లాండు జనాభాలో 1.5%. అంతకు ముందరి దశాబ్దంతో పోలిస్తే ఇది 1.1% పెరిగింది. హిందువులు ప్రధానంగా లండన్, లీసెస్టర్ నగరాల్లో ఉన్నారు. ఇక్కడ జనాభాలో వారి నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. (వీటిని హిందూ ఎన్‌క్లేవ్‌లని, హిందూ హాట్‌స్పాట్‌లనీ కూడా పిలుస్తారు). ఇంగ్లండ్‌లో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఐరోపా లోకెల్లా అతిపెద్ద హిందూ దేవాలయమైన నీస్డెన్‌ హిందూ దేవాలయం కూడా ఉంది. [1] ఉత్తర ఇంగ్లాండ్‌లోని అతిపెద్ద హిందూ మందిరం [2] బ్రాడ్‌ఫోర్డ్ లక్ష్మీ నారాయణ హిందూ దేవాలయాన్ని పశ్చిమ యార్క్‌షైర్‌ లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో [3] ప్రారంభించారు.

సంవత్సరం శాతం మార్పు
2001 1.1% -
2011 1.5% +0.40%

చరిత్ర[మార్చు]

హిందూమతం 19వ శతాబ్దం ప్రారంభం నుండి ఇంగ్లాండ్‌లో ఉంది. అప్పుడప్పుడు హిందూ పండితులు, తత్వవేత్తలు, సంస్కర్తలు, భారతదేశంలోని సంస్థానాల నుండి సందర్శకులూ కూడా వచ్చేవారు. రాజా రామ్ మోహన్ రాయ్ (1772లో భారతదేశంలో జన్మించాడు) భారతదేశంలో హిందూ సంస్కరణ ఉద్యమాన్ని స్థాపించాడు. అతను తన క్రైస్తవ స్నేహితులను సందర్శించడానికి 1829లో ఇంగ్లాండ్‌ వచ్చాడు. అతను కింగ్ విలియం IV ను కూడా కలిసాడు. రాయ్ నాలుగు సంవత్సరాల తర్వాత బ్రిస్టల్‌లోని స్టాపుల్టన్‌లో మరణించాడు.

గొప్ప ప్రాచ్య శాస్త్రవేత్త, సంస్కర్త సర్ RG భండార్కర్ 1874లో లండన్ సందర్శించాడు. 1879లో అరబిందో తన ఇద్దరు సోదరులతో కలిసి చదువుకోవడానికి ఇంగ్లండ్‌కు వెళ్ళాడు, మాంచెస్టర్, లండన్ ( సెయింట్ పాల్స్ స్కూల్ ), కేంబ్రిడ్జ్ ( కింగ్స్ కాలేజ్ )లలో అతను 1893 వరకు ఉన్నాడు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో ప్రసంగించిన స్వామి వివేకానంద 1895, 1896లో ఇంగ్లండ్‌ను సందర్శించాడు. [4] ఇంగ్లండ్‌లో వివేకానంద హిందూ తత్వశాస్త్రంపై, ముఖ్యంగా వేదాంతంపై, చేసిన ప్రసంగం మిస్ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్‌ను బాగా ప్రభావితం చేసింది, ఆమె తరువాత సిస్టర్ నివేదితగా మారింది. [5]

ఇంగ్లండ్‌లోని తొలి హిందువులు సాధారణంగా విద్యార్థులు. వీరిలో కొందరు అసాధారణమైన సామర్థ్యం కలిగి ఉండేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ (తరువాత నోబెల్ బహుమతి గ్రహీత ) 1878లో ఇంగ్లండ్ వెళ్లి, 1880లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. యాభై సంవత్సరాల తర్వాత ఠాగూర్ ఆక్స్‌ఫర్డ్ [6] మానవుని మతంపై హిబ్బర్ట్ ఉపన్యాసాలు (1930) ఇచ్చాడు. [7] రామానుజన్, గణిత మేధావి, సనాతన హిందువు. దాదాపు ఐదు సంవత్సరాలు (1914-19) కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గడిపాడు. ప్రొఫెసర్ సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1939 నుండి 1952 వరకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తూర్పు మతాలు, నీతిశాస్త్రాల ప్రొఫెసర్‌గా ఉన్నాడు. థియోసాఫికల్ సొసైటీ చేసిన కృషి కారణంగాను, కొత్త రంగమైన ఇండాలజీ ఆవిర్భావం కారణంగానూ విక్టోరియన్ శకం నాటికే హిందూమతం విస్తృతంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. 1878లో మాక్స్ ముల్లర్ భారతదేశ మతాలపై ఆక్స్‌ఫర్డ్‌లో ప్రారంభ హిబ్బర్ట్ ఉపన్యాసాలు ఇచ్చారు.

భారతదేశంలో అధ్యాత్మ యోగా ఆచార్య్డుడైన డాక్టర్ హరి ప్రసాద్ శాస్త్రి (1882-1956), [8] జపాన్‌లో ఇంపీరియల్, వాసెడా విశ్వవిద్యాలయాలలోను, ఆ తరువాత చైనాలోనూ చాలా సంవత్సరాలు బోధించాక 1929లో ఫిలాసఫీ ప్రొఫెసరుగా ఇంగ్లండ్ వెళ్లాడు. హరి ప్రసాద్ శాస్త్రి [9] శాంతి సదనాన్ని స్థాపించాడు. ట్రెవర్ లెగెట్ అనే ఆంగ్ల జూడో ఉపాధ్యాయుడు శాస్త్రిని 1936లో కలిశాడు. హరి ప్రసాద్ శాస్త్రి యోగా బోధనల ద్వారా అతను బాగా ప్రభావితమయ్యాడు.

1935లో పరమహంస యోగానంద USA నుండి తిరిగి వస్తూ ఇంగ్లండ్‌ను సందర్శించాడు. లండన్‌లో కాక్స్టన్ హాల్‌లో, సర్ ఫ్రాన్సిస్ యంగ్‌హస్బాండ్ పరిచయం చేయగా అతను, ఒక పెద్ద సమావేశంలో ప్రసంగించాడు. 1936లో అతను మళ్లీ ఇంగ్లాండ్‌ను సందర్శించాడు. బ్రిటీష్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ నిర్వహించిన మరిన్ని సమావేశాల్లో ప్రసంగించాడు. ప్రత్యేకించి వైట్‌ఫీల్డ్ కాంగ్రెగేషనల్ చర్చిలో పెద్ద సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. యోగానంద నిష్క్రమణ తర్వాత లండన్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సెంటర్ ఏర్పడింది. యోగానంద తన ఆత్మకథలో 'ఆధ్యాత్మిక సంబంధంలో ఆంగ్ల దృఢత్వం ప్రశంసనీయమైన వ్యక్తీకరణను కలిగి ఉంది' అని వ్యాఖ్యానించాడు. [10]

ఇంగ్లండ్‌కు హిందువుల వలసలు మూడు సార్లు జరిగాయి. మొదటి తరంగం 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, ఇంగ్లండ్‌కు హిందూ వలసలు చాలా తక్కువగాను, చాలావరకు తాత్కాలికంగానూ ఉండేవి. యుద్ధానంతర కాలంలో, ఆర్థిక పరిస్థితుల కారణంగా హిందువులతో సహా చాలా మంది భారతీయులు మెరుగైన అవకాశాల కోసం తమ దేశాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. కామన్వెల్త్ పౌరులుగా భారతీయులు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రవేశించడానికి లేదా నివసించడానికి వీసా అవసరం లేదు. 1960వ దశకం ప్రారంభంలో, NHS ని కాపాడటానికి, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆరోగ్య మంత్రి ది Rt హాన్ ఎనోచ్ పావెల్ భారత ఉపఖండం నుండి హిందువులతో సహా అనేకమంది వైద్యులను నియమించాడు.

ఉగాండా నుండి గుజరాతీలను, ఇతర ఆసియన్లను (బ్రిటీష్ ఓవర్సీస్ పౌరులు ) ఈదీ అమీన్ బహిష్కరించినపుడు 1970 లలో రెండవ తరంగపు వలసలు సంభవించాయి. మొదట్లో, వలస వెళ్ళిన హిందువుల్లో పంజాబీలు గుజరాతీలే ఉండేవారు. తరువాత భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాల నుండి, గయానా, ట్రినిడాడ్ టొబాగో, మారిషస్, ఫిజి వంటి దేశాల నుండీ హిందూ సంఘాలు ఇంగ్లాండ్‌ చేరాయి.

వలసల యొక్క చివరి తరంగం 1990లలో ఇంగ్లాండ్‌లో స్థిరపడిన రెండు రకాల వ్యక్తులతో ప్రారంభమైంది - శ్రీలంక నుండి వచ్చిన తమిళ శరణార్థులు, భారతదేశం నుండి వచ్చిన వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు, ఇతర నిపుణులు.

జనాభా వివరాలు[మార్చు]

2011 ఇంగ్లండ్ జనాభా లెక్కల ప్రకారం, అక్కడ దాదాపు 8,06,199 మంది హిందువులు నివసిస్తున్నారు. [11] హిందువులు ప్రధానంగా లండన్, లీసెస్టర్ లలో ఉన్నారు. [12] లండన్‌లో, హిందూ మతం బ్రెంట్, హారోల్లో ఉంది, ఇక్కడ హిందువులు జనాభాలో ఐదవ వంతు ఉన్నారు. కొంతవరకు సౌతాల్, హౌన్స్‌లో, ఇల్‌ఫోర్డ్, ఈస్ట్ హామ్, క్రోయ్‌డాన్, హెండన్, వెంబ్లీలలో కూడా ఉన్నారు . లండన్ వెలుపల, లీసెస్టర్‌లో హిందువులు 40,000 మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో తూర్పు ఆఫ్రికా నుండి వచ్చినవారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. [13]

హిందూ సంస్థలు[మార్చు]

యునైటెడ్ కింగ్‌డమ్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద గోపురం, విమానం

ఒక పట్టణం లేదా ప్రాంతంలోని స్థానిక హిందూ సంస్థలను కలిసి స్థానిక ప్రభుత్వంతో నిమగ్నమవ్వడానికి అనేక ప్రాంతీయ గొడుగు సంస్థలను ఏర్పాటు చేసారు. వీటిలో హిందూ కౌన్సిల్ ఆఫ్ బ్రెంట్, హిందూ కౌన్సిల్ ఆఫ్ హారో, హిందూ కౌన్సిల్ ఆఫ్ బర్మింగ్‌హామ్, హిందూ కౌన్సిల్ ఆఫ్ ది నార్త్ ఉన్నాయి.

మరింత స్థానిక స్థాయిలో, హిందువుల సంఘం లేదా భాషా గుర్తింపులపై ఆధారపడిన అనేక సంస్థలు కూడా ఉన్నయి. వారు సాధారణంగా ఒక నిర్దిష్ట హిందూ మతం లేదా ఉప-సంఘం యొక్క సాంస్కృతిక సామాజిక అవసరాలను తీరుస్తారు. ఆర్యసమాజ్, బ్రాహ్మణ సొసైటీ నార్త్ లండన్, శ్రీ కచ్ లేవా పటేల్ కమ్యూనిటీ, గ్రేట్ ప్రజాపతి అసోసియేషన్, ఇంటర్నేషనల్ పంజాబీ సొసైటీ, సౌత్ ఇండియన్ అసోసియేషన్, మహారాష్ట్ర మండల్ ఆఫ్ లండన్ వటి అనేక ఇతర సంస్థలు అలాంటివి ఉన్నాయి. వారు సాధారణంగా సొంత లేదా అద్దె ప్రాంగణాల నుండి పనిచేస్తారు. మతపరమైన ప్రసంగాలు, పెళ్ళి సంబంధాలు కుదర్చడం, పెళ్ళిళ్ళు, తదితరాలతో తమతమ సంఘాలకు సేవలను అందించడంతో పాటు, పెద్ద పండుగలు, సామూహిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.

విద్య, ఆరోగ్య సంరక్షణ, కౌన్సెలింగ్, న్యాయవాద, తదితర రంగాలలో వివిధ సేవలను అందించే అనేక హిందూ సంస్థలు ఉన్నాయి. హిందూ స్క్రిప్చర్స్‌ గురించి బోధించే చిన్మయ మిషన్, స్వామినారాయణ్ సంస్థ, ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్, ఇస్కాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సిటీ హిందూస్ నెట్‌వర్క్, నేషనల్ హిందూ స్టూడెంట్స్ ఫోరమ్ (UK), ఇంటర్నేషనల్ స్వామినారాయణ్ సత్సంగ్ ఆర్గనైజేషన్లు వీటిలో ఉన్నాయి.

దేవాలయాలు[మార్చు]

లండన్‌లోని నీస్డెన్‌లోని స్వామినారాయణ దేవాలయం ఐరోపాలో అతిపెద్ద హిందూ దేవాలయం

ఇంగ్లాండ్‌లో 150కి పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఇవి హిందూ సమాజంలోని వివిధ వర్గాలకు విస్తృత సేవలను అందిస్తాయి. నీస్డెన్‌లోని స్వామినారాయణ ఆలయం, వాట్‌ఫోర్డ్ సమీపంలోని లెచ్‌మోర్ హీత్‌లోని భక్తివేదాంత మనోర్ ( హరే కృష్ణ ) ఆలయం , బర్మింగ్‌హామ్‌లోని బాలాజీ ఆలయం, లీసెస్టర్‌లోని సనాతన్ మందిర్, సౌతాల్‌లోని విశ్వహిందూ మందిర్, మేనర్ పార్క్‌లోని మురుగన్ ఆలయం, ప్రెస్టన్‌లోని గుజరాత్ హిందూ సొసైటీ కృష్ణ దేవాలయం వంటి పెద్ద, ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. లండన్‌లోని వివిధ ప్రాంతాలలో 6 శ్రీ స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి.

దేవాలయాలు శ్రేష్ఠమైన కేంద్రాలు, ఇక్కడ సంఘం క్రమం తప్పకుండా పూజలు చేయడానికి, నేర్చుకోవడానికి, కలవడానికి వీలవుతుంది. 80,000 మంది సందర్శకులను ఆకర్షించే భక్తివేదాంత మేనర్‌లో జరిపే జన్మాష్టమి పండుగ, లేదా 50,000 మంది ప్రజలను ఆకర్షించే నీస్‌డెన్‌లోని దీపావళి పండుగ వంటి పెద్ద పండుగలతో పాటు అనేక దేవాలయాల్లో వివాహాలు, హిందూ మతకర్మలు, భాషా తరగతులు, తదుపరి విద్య, కంప్యూటర్ తరగతులు, యోగా, కౌన్సెలింగ్, వంటి సేవలూ జరుపుతారు.

2008లో, ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని 2,500 మంది హిందువుల కోసం ఆలయాన్ని స్థాపించేందుకు నిధులను సేకరించేందుకు ప్రచారం ప్రారంభించారు. [14]

2020లో, హిస్టారిక్ ఇంగ్లండ్ (HE) ఇంగ్లాండ్‌లో హిందువులు ఉపయోగించే భవనాల గురించి సమాచారాన్ని అందించే లక్ష్యంతో ఇంగ్లాండ్‌లోని హిందూ భవనాల సర్వేను ప్రచురించింది. తద్వారా ఇప్పుడు, భవిష్యత్తులోనూ ఆ భవనాలను మెరుగుపరచడానికి, సంరక్షించడానికి హిస్టారిక్ ఇంగ్లండ్ హిందూ సంఘాలతో కలిసి పని చేయవచ్చు. స్కోపింగ్ సర్వే, ఇంగ్లాండ్‌లో 187 హిందూ దేవాలయాలున్నట్లు గుర్తించింది. [15]

ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం[మార్చు]

ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం 2014 అక్టోబరులో వెస్ట్‌మిన్‌స్టర్ సమీపంలోని క్వీన్ ఎలిజబెత్ II కాన్ఫరెన్స్ సెంటర్‌లో లండన్‌లో జరిగిన దీపావళి కార్యక్రమంలో బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ ఆవిష్కరించాడు. కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్ లార్డ్ ఆండ్రూ ఫెల్డ్‌మాన్ ఈ వేడుకను నిర్వహించాడు. 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కామెరాన్, అతని భార్య సమంతా <i id="mw1g">దీపం</i> వెలిగించారు. [16]

హిందూ పాఠశాలలు[మార్చు]

హారోలోని కృష్ణ అవంతి ప్రైమరీ స్కూల్ ఇంగ్లండ్‌లోని మొట్టమొదటి ప్రభుత్వ-నిధులతో ఏర్పాటైన హిందూ పాఠశాల. దీన్ని 2005లో ప్రభుత్వం ఆమోదించింది, [17] అవంతి స్కూల్స్ ట్రస్ట్ దీన్ని నిర్వహిస్తుంది . [18] వాయువ్య లండన్‌లోని ఎడ్గ్‌వేర్‌లో £10 మిలియన్ కృష్ణ అవంతి ప్రైమరీ స్కూల్ నిర్మాణం 2008లో ప్రారంభమైంది. మొదటి బ్యాచ్చి విద్యార్థులతో ఆ సంవత్సరం తాత్కాలిక వసతితో ప్రారంభించారు. [19] ఇంగ్లాండ్‌లో మొత్తం 6 హిందూ పాఠశాలలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్‌లో నాలుగు దేశాలు భాగంగా ఉన్నాయి - ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లండ్, ఉత్తర ఐర్లండ్. ఐదు వందల ఏళ్ళ పాటు జరిగిన వివిధ విలీనాలతో ఈ సామ్రాజ్యం ఏర్పడింది. 1536 లో ఇంగ్లాండ్, వేల్స్ కలిసి ఒకే రాజ్యంగా - "కింగ్‌డం ఆఫ్ ఇంగ్లండ్"గా రూపొందాయి. ఆ తరువాత, 1707 లో స్కాట్లండ్ కూడా కలిసి మూడు దేశాలతో "కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్" ఏర్పడింది. 1901 లో ఐర్లండ్ కూడా కలిసి "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లండ్" ఏర్పడింది. అయితే, 1922 లో ఐర్లండ్ రెండు ముక్కలై ఒక భాగం స్వతంత్ర ఐర్లండ్ దేశంగా ఏర్పడగా, రెండవ భాగమైన ఉత్తర ప్రాంతం - ఉత్తర ఐర్లండు - యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగానే ఉండిపోయింది. అప్పుడు దేశం పేరు "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్" గా మారింది. ఇదే ప్రస్తుత రూపం.

మూలాలు[మార్చు]

  1. Hindu London, BBC, 6 June 2005. URL accessed on 5 June 2006.
  2. largest mandir in the North to open in Bradford
  3. details of opening ceremony
  4. Romain Rolland (1997), The life of Vivekananda and the Universal Gospel (translated from the original French by E.F. Malcolm-Smith), page 86, fifteenth impression published by Advaita Ashrama, Calcutta (first published in 1931).
  5. Pravrajika Atmaprana (1992), Sister Nivedita of Ramakrishna-Vivekananda, page 5, published by Sister Nivedita Girls' School, 5 Nivedita Lane, Calcutta 3 (first published in 1961).
  6. Sen K. M. (1961), Hinduism, The World's Oldest Faith, page 109, Penguin Books, London, England
  7. Tagore, Rabindranath (1963), The Religion of Man, Unwin Books, London England (first published in 1931)
  8. "Hari Prasad Shastri: Life and Work". www.worldwisdom.com. Retrieved 2020-08-27.
  9. "Center of Non Duality | Advaita Vedanta | London". Shanti Sadan (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-08-27.
  10. Paramahansa Yogananda (1986), Autobiography of a Yogi (sixth impression), pages 360, 465, published by Jaico Books, Bombay (first Indian edition in English was puiblished in 1963).
  11. 2011 Census: Religion, local authorities in England and Wales: Table KS209EW
  12. Minority religions mainly in London. National Statistics. Accessed 5 Jun 2006.
  13. [1] BBC News 28 September 2003
  14. Hindu worshippers in first prayer BBC News, 15 September 2008
  15. Singh, Jasjit; Tomalin, Emma (2020). "A Survey of Hindu Buildings in England. Historic England Research Report 203/2020". research.historicengland.org.uk. Archived from the original on 2020-06-16. Retrieved 2020-06-16.
  16. Joanna Sugden (reported by), Britain's PM David Cameron Unveils Encyclopedia of Hinduism, The Wall Street Journal, 28 October 2014.
  17. First UK Hindu school in London BBC News, 12 October 2005
  18. "North London Hindu school will be 'the first of many'". BBC. 25 April 2020.
  19. Hindu state school beginning work BBC News, 6 June 2008